సర్వసభ్య సమావేశము
ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు

పరలోక తండ్రి అక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ప్రార్థించమని, ఆయన వలె మారడానికి వృద్ధి చెందడానికి ప్రార్థించమని, ఇతరులకు ఆయన ప్రేమను చూపడానికి ప్రార్థించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదర సహోదరీలారా, పిల్లలతో మాట్లడాలనే ఒక మనోభావనకు నేను స్పందించినప్పుడు నేను ఆనందిస్తున్నాను.

బాల బాలికలారా, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, నేను మీతో ఏదైనా పంచుకోవాలని కోరుతున్నాను.

మన పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు! మీరు ఆయన బిడ్డ. ఆయనకు మీరు తెలుసు. మిమ్మల్ని దీవించాలని ఆయన కోరుతున్నారు. ఆయన ప్రేమను మీరు అనుభవించాలని నా పూర్ణ హృదయముతో నేను ప్రార్థిస్తున్నాను.

బహుమానాలు పొందడం మీకిష్టమేనా? మీకు సహాయపడటానికి పరలోక తండ్రి మీకిచ్చిన చాలా ప్రత్యేకమైన బహుమానం గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. అది ప్రార్ధన యొక్క బహుమానము. ప్రార్థన ఎటువంటి గొప్ప దీవెన! ప్రార్థన ద్వారా మనం పరలోక తండ్రితో ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడగలము.

చిత్రం
పిల్లలతో యేసు.

యేసు క్రీస్తు భూమిపైన ఉన్నప్పుడు, ప్రార్థించవలెనని ఆయన మనకు బోధించారు. “వెదకుడి, మీకు దొరకును” అని ఆయన అన్నారు.1

మీరు ఏ బహుమానాల కోసం ప్రార్థించవచ్చు? చాలా ఉన్నాయి, కానీ ఈ రోజు నేను మూడు పంచుకోవాలని కోరుతున్నాను:

  1. తెలుసుకోవడానికి ప్రార్థించండి.

  2. వృద్ధి చెందడానికి ప్రార్థించండి.

  3. చూపడానికి ప్రార్థించండి.

ప్రతీఒక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం.

మొదటిది, తెలుసుకోవడానికి ప్రార్థించండి

మీరు ఏమి తెలుసుకోవాలి?

ప్రపంచమంతటా ప్రాధమిక పిల్లలందరూ ప్రార్థన గురించి పాడే పాట ఒకటున్నది. అది ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. అది ఏ పాటో మీకు తెలుసా? నాకు నిజంగా ధైర్యము ఉంటే, నేను దానిని మీకోసం పాడతాను!

“పరలోక తండ్రీ, మీరు నిజంగా ఉన్నారా? ప్రతీ బిడ్డ యొక్క ప్రార్థనను మీరు విని సమాధానమిస్తారా?”2

మీరు ఆయనను చూడనప్పుడు కూడా, పరలోక తండ్రి నిజంగా అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మిమ్మల్ని ఇలా ఆహ్వానించారు, “మీ పరలోక తండ్రికి మీ హృదయాన్ని క్రుమ్మరించండి. … ఆ తర్వాత, వినండి!”3 మీ హృదయంలో భావించిన దానిని మరియు మీ మనస్సులోనికి వచ్చే ఆలోచనలను వినండి.4

పరలోక తండ్రి ఒక మహిమపరచబడిన శరీరము, ఎముకలను కలిగియున్నారు మరియు మీ ఆత్మ యొక్క తండ్రి. పరలోక తండ్రి సర్వ శక్తిని కలిగియుండి, సమస్త విషయాలను ఎరిగియున్నారు కనుక, ఆయన తన బిడ్డలందరిని చూడగలరు5 మరియు ప్రతీ ప్రార్థనను విని జవాబివ్వగలరు. ఆయన అక్కడ ఉన్నారని మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకై మీరు తెలుసుకోవచ్చు.

పరలోక తండ్రి నిజమని మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు ధైర్యముతో, నిరీక్షణతో జీవించగలరు! “ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు; మాట్లాడండి, ఆయన వింటున్నారు.”6

మీరు ఎప్పుడైనా ఒంటరిగా భావించారా? ఒకరోజు మా మనుమరాలు ఆష్లీ ఆరు సంవత్సరాల వయస్సున్నప్పుడు, ఆమె పాఠశాల ఆట స్థలంలో ఆడుకోవడానికి ఒక్క స్నేహితురాలు కూడా లేకుండా ఒంటరిగా ఉన్నది. ఆమె అక్కడ నిలబడి ఉండగా, అప్రధానంగా మరియు కనిపించనిదిగా భావించే, ఒక నిర్దిష్ట ఆలోచన ఆమె మనస్సులో వచ్చింది: “ఆగు! నేను ఒంటరిగా లేను! నాకు క్రీస్తు ఉన్నారు!” ఆట స్థలం మధ్యలో, ఆష్లీ మోకరించి, తన చేతులను కట్టుకొని, పరలోక తండ్రికి ప్రార్థించింది. ఆమె కళ్ళు తెరిచిన వెంటనే, ఆమె వయసున్న ఒక బాలిక తనకు ఆడటం ఇష్టమేనా అని అడుగుతూ అక్కడ నిలబడింది. “మనము ప్రభువుకు ముఖ్యమైన వారము మరియు మనం ఎన్నడూ నిజంగా ఒంటరిగా లేము” అని ఆష్లీకి తెలిసింది.

కొన్నిసార్లు మీ జీవితంలో ఏదైనా కష్టమైనది ఎందుకు జరుగుతుంది లేదా మీరు ప్రార్థన చేస్తున్న దీవెనను మీరు ఎందుకు పొందడం లేదో మీరు తెలుసుకోవాలని కోరవచ్చు. తరచుగా పరలోక తండ్రిని అడగాల్సిన శ్రేష్ఠమైన ప్రశ్న, ఎందుకు కాకుండా ఏమిటి అని.

నీఫై, అతని కుటుంబం అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఆకలి వేసినప్పుడు మీకు గుర్తుందా? నీఫై, అతని సోదరులు ఆహారం కోసం వేటాడటానికి వెళ్ళినప్పుడు, నీఫై తన విల్లును విరుగగొట్టుకున్నాడు. ఎందుకని అతడు అడగలేదు.

చిత్రం
వేటాడటానికి ఎక్కడికి వెళ్ళాలని లీహైని అడుగుతున్న నీఫై.

నీఫై ఒక క్రొత్త విల్లును తయారు చేసి, ఆహారాన్ని సంపాదించడానికి తాను ఎక్కడికి వెళ్ళాలని తన తండ్రి లీహైని అడిగాడు. లీహై ప్రార్థించాడు మరియు నీఫై ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు వారికి చూపించారు.7 మీరు ఏమి చేయాలి మరియు మీరు ఏమి నేర్చుకోవాలో ఆయనను అడిగినప్పుడు పరలోక తండ్రి మిమ్మల్ని నడిపిస్తారు.

రెండవది, వృద్ధి చెందడానికి ప్రార్థించండి

మీరువృద్ధి చెందడానికి సహాయపడాలని ఆయన కోరుతున్నారు! ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, జీవించడానికి మనకు మార్గం చూపించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపించారు.8 యేసు శ్రమపడ్డారు, చనిపోయారు మరియు పునరుత్థానము చెందారు ఆవిధంగా మన పాపాలను బట్టి మనం క్షమించబడగలము మరియు ఆయన వలె ఎక్కువగా మారడానికి వృద్ధి చెందగలము.

సహనమందు లేదా నిజాయితీలో వృద్ధి చెందాలని మీరు కోరుతున్నారా? ఒక నైపుణ్యములో వృద్ధి చెందాలని మీరు కోరుతున్నారా? మీరు బిడియస్తులు కావచ్చు మరియు ధైర్యమునందు ఎదగాలని మీరు కోరవచ్చు. “ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు”!9 ఆయన ఆత్మ ద్వారా, మీ హృదయం మారగలదు మరియు మీరు బలమును పొందగలరు.

నా క్రొత్త స్నేహితురాలు జోనా ఇలా వ్రాసింది: “ఉదయం పాఠశాలకు వెళ్ళే దారిలో తరచుగా నేను భయపడుతుంటాను. ఆలస్యమవుతానని, ఏదైనా మరచిపోతానని మరియు పరీక్షలు రాయడం వంటి విషయాల గురించి నేను చింతిస్తాను. నాకు 10 సంవత్సరాలున్నప్పుడు, మా అమ్మతో పాఠశాలకు వెళ్ళే దారిలో నేను ప్రార్థనలు చేయడం ప్రారంభించాను. నాకవసరమైన సహాయం కోసం నేను ప్రార్థించాను మరియు నేను నా కుటుంబం కోసం కూడా ప్రార్థించాను. నేను కృతజ్ఞత కలిగియున్న విషయాలను గూర్చి కూడా నేను ఆలోచించాను. [పరలోక తండ్రికి ప్రార్థించుట] నాకు సహాయపడింది. కొన్నిసార్లు నేను కారులో నుండి దిగిన వెంటనే నాకు మంచిగా అనిపించదు, కానీ నేను నా తరగతి గది వద్దకు వెళ్ళే సమయానికి, నాకు శాంతి చేకూరుతుంది.”10

అతడు ప్రతిరోజూ ప్రార్థించి, ముందుకు సాగినప్పుడు, యోనా యొక్క విశ్వాసము వృద్ధి చెందుతున్నది.

మూడవది, చూపడానికి ప్రార్థించండి

ఇతరులకు పరలోక తండ్రి యొక్క ప్రేమను చూపడానికి సహాయం కోసం మీరు ప్రార్థించవచ్చు.11 ఆయన ఆత్మ ద్వారా, విచారంగా ఉన్న వారెవరినైనా మీరు గుర్తించడానికి పరలోక తండ్రి మీకు సహాయపడతారు, ఆవిధంగా మీరు వారిని ఓదార్చగలరు. ఎవరినైనా క్షమించుట ద్వారా ఆయన ప్రేమను చూపడానికి ఆయన మీకు సహాయపడగలరు. ఎవరికైనా సేవ చేయడానికి మరియు వారు దేవుని యొక్క బిడ్డ అని పంచుకోవడానికి ఆయన మీకు ధైర్యాన్నిస్తారు. మీరలా చేసినప్పుడు మీరు తెలుసుకున్నట్లుగా యేసును, పరలోక తండ్రిని తెలుసుకొని, ప్రేమించడానికి ఇతరులకు సహాయపడగలరు.12

మా నాన్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా కావాలని నా జీవితకాలమంతా నేను ప్రార్థన చేసాను. ఒక చిన్న బాలికగా కూడా, అతడు ఎన్ని దీవెనలు పొందగలడో నేను ఎరుగుదును. మా కుటుంబము నిత్యత్వము కొరకు ముద్రింపబడే దీవెనలను పొందవచ్చు. మా కుటుంబము, స్నేహితులు మరియు నేను తరచుగా ఆయన కోసం ప్రార్థించాము, కానీ ఆయన సంఘములో చేరలేదు. ఒక ఎంపిక చేయమని పరలోక తండ్రి ఎవరిని బలవంతం చేయరు.13 మిగిలిన విధాలుగా మన ప్రార్థనలకు జవాబులను ఆయన మనకు పంపగలరు.

చిత్రం
తన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో అధ్యక్షురాలు పోర్టర్.

నాకు తగినంత వయస్సు వచ్చినప్పుడు, నేను నా గోత్ర జనకుని దీవెనను పొందాను. నా కుటుంబం పరలోకంలో కలిసి ఉండటానికి సహాయపడేందుకు నేను చేయగల శ్రేష్ఠమైన పని యేసు క్రీస్తు యొక్క సువార్తకు మాదిరికరంగా ఉండడమేనని దీవెనలో గోత్ర జనకులు నాతో చెప్పారు. నేను చేయగలిగింది అదే!

మా నాన్న 86 సంవత్సరాల వరకు జీవించారు. ఆయన చనిపోయిన ఐదు రోజుల తరువాత, నేను ఆనందమైన పరిశుద్ధ భావనను పొందాను. మా నాన్న యేసు క్రీస్తు సువార్త యొక్క దీవెనలు పొందడానికి కోరుతున్నారని ఆయన ఆత్మ ద్వారా పరలోక తండ్రి నాకు తెలియజేసారు! మా సహోదరి, సహోదరులతో దేవాలయంలో బలిపీఠం చుట్టూ మోకరించిన రోజును నేను ఎన్నడూ మరచిపోను. నేను ప్రాథమికలో ఉన్నప్పుడు ఈ దీవెన కొరకు ప్రార్థించడం మొదలు పెట్టాను మరియు నేను అమ్మమ్మగా మారినప్పుడు దానిని పొందాను.

బహుశా మీరు ప్రేమించే మీ కుటుంబానికి దీవెనల కొరకు మరియు ఇతరుల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు. ఆశ వదులుకోవద్దు! పరలోక తండ్రి మీరు చేయగల దానిని మీకు చూపిస్తారు.

మీ హృదయములో ఉన్న దానిని పరలోక తండ్రితో పంచుకోండి.14 ఆయన సహాయం కోసం మీరు నిజాయితీగా అడిగినప్పుడు, మిమ్మల్ని నడిపించడానికి ఆయన ఆత్మను మీరు పొందుతారు.15 ప్రతిరోజూ ప్రార్థన చేయడం వల్ల పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల మీలో ప్రేమ నింపబడుతుంది. మీ జీవితాంతం వారిని అనుసరించేలా ఇది మీకు సహాయం చేస్తుంది!

ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియాలోని పిల్లలందరూ ప్రతీరోజు ప్రార్థన చేస్తే ఏమవుతుందో ఊహించండి. ప్రపంచం మొత్తం దేవుని ప్రేమతో మరింత ఆశీర్వదించబడుతుంది!

చిత్రం
ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేస్తున్న పిల్లలు.

పరలోక తండ్రి అక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ప్రార్థించండి, ఆయన వలె మారడానికి వృద్ధి చెందడానికి ప్రార్థించండి, ఇతరులకు ఆయన ప్రేమను చూపడానికి ప్రార్థించండి అని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారని మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. “ప్రార్థించండి, ఆయన అక్కడ ఉన్నారు.” యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.