సర్వసభ్య సమావేశము
అన్ని విషయాలందు వ్యతిరేకత
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అన్ని విషయాలందు వ్యతిరేకత

మన కర్తృత్వమును అమలు చేయడానికి, మనము పరిగణించవలసిన వ్యతిరేక ఎంపికలను కలిగి ఉండాలి.

ఇటీవల, మాకు తెలియని నగరంలో వాహనాన్ని నడుపుతున్నప్పుడు, నేను అనుకోకుండా ఒక తప్పు మలుపు తీసుకున్నాను, అది నన్ను, నా భార్యను మళ్లీ మలుపు తిరగడానికి వీలు లేకుండా వేగవంతమైన రహదారిపై చాలా దూరం వరకు తీసుకెళ్లింది. మేము ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళడానికి దయగల ఆహ్వానం అందుకున్నాము మరియు ఇప్పుడు మేము ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా చేరుకుంటామని భయపడ్డాము.

ఈ రహదారిలో ఉన్నప్పుడు మరియు నిర్విరామంగా మళ్లీ మార్గం కోసం వెతుకుతున్నప్పుడు, నావిగేషన్ వ్యవస్థపై మెరుగైన శ్రద్ధ చూపనందుకు నన్ను నేను నిందించుకున్నాను. ఈ అనుభవం మన జీవితంలో మనం కొన్నిసార్లు ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము మరియు మనం మళ్లీ మన మార్గాన్ని మార్చుకునే వరకు దాని పరిణామాలతో వినయంగా మరియు ఓపికగా ఎలా జీవించాలి అనే దాని గురించి ఆలోచించేలా చేసింది.

జీవితం అంటేనే ఎంపికలు చేసుకోవడం గూర్చినది. పరలోకంలో ఉన్న మన తండ్రి మనకు ఖచ్చితంగా కర్తృత్వము అనే దైవిక బహుమతిని ఇచ్చారు, ఆవిధంగా మనం మన ఎంపికల నుండి—సరైన వాటి నుండి మరియు సరైనవి కాని వాటి నుండి కూడా నేర్చుకోవచ్చు. మనము పశ్చాత్తాపపడినప్పుడు మన తప్పు ఎంపికలను సరిదిద్దుకుంటాము. అప్పుడే వృద్ధి జరుగుతుంది. మనందరి కోసం పరలోక తండ్రి యొక్క ప్రణాళిక నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం మరియు నిత్యజీవము వైపు పురోగమించడం గూర్చినది.

నేను మరియు నా భార్య సువార్తికులచే బోధించబడినప్పటి నుండి మరియు చాలా సంవత్సరాల క్రితం సంఘములో చేరినప్పటి నుండి, మోర్మన్ గ్రంథములో లీహై తన కుమారుడైన జేకబ్‌కు ఇచ్చిన లోతైన బోధనలచే నేను ఎల్లప్పుడూ ఆకట్టుకోబడ్డాను. “ప్రభువైన దేవుడు నరునికి తననుతాను నిర్వహించుకొను సామర్థ్యమునిచ్చెను”1 మరియు “అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుట అవసరము”2 అని అతడు అతనికి బోధించాడు. మన కర్తృత్వమును అమలు చేయడానికి, మనము పరిగణించవలసిన వ్యతిరేక ఎంపికలను కలిగి ఉండాలి. అలా చేయడం ద్వారా, మనకు “సమృద్ధిగా బోధింపబడుతుంది”3 మరియు “చెడు నుండి మంచిని ఎరుగునట్లు”5 “క్రీస్తు యొక్క ఆత్మ”4 మనలో ప్రతీ ఒక్కరికి ఇవ్వబడింది అని కూడా మోర్మన్ గ్రంథం మనకు గుర్తుచేస్తుంది.

జీవితంలో, మనం చాలా ముఖ్యమైన ఎంపికలను నిరంతరం ఎదుర్కొంటాము. ఉదాహరణకు:

  • మనం దేవుని ఆజ్ఞలను పాటించాలా వద్దా అని ఎంపిక చేయడం.

  • విశ్వాసం కలిగి ఉండటం మరియు అద్భుతాలు జరిగినప్పుడు గుర్తించడం లేదా నమ్మడానికి ఎంచుకునే ముందు ఏదైనా జరగడానికి సందేహాస్పదంగా వేచి ఉండటం.

  • దేవునిపై నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఎంచుకోవడం లేదా మరుసటి రోజు మరొక సవాలు కొరకు భయంతో ఎదురుచూడడం.

నేను ఆ రహదారిపై తప్పు మలుపు తీసుకున్నప్పుడు, మన స్వంత పేలవమైన నిర్ణయాల పర్యవసానాలతో బాధపడటం తరచుగా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం మనల్ని మాత్రమే నిందించుకోవాలి. అయినప్పటికీ, మనం ఎల్లప్పుడూ పశ్చాత్తాపం అనే దైవిక ప్రక్రియ ద్వారా ఓదార్పును పొందడాన్ని ఎంచుకోవచ్చు, తప్పు విషయాలను మళ్లీ సరిదిద్దవచ్చు మరియు అలా చేయడం ద్వారా జీవితాన్ని మార్చే కొన్ని పాఠాలను నేర్చుకోవచ్చు.

కొన్నిసార్లు మనం మన నియంత్రణలో లేని విషయాల నుండి వ్యతిరేకతను మరియు పరీక్షలను కూడా అనుభవించవచ్చు:

  • ఆరోగ్యకరమైన క్షణాలు మరియు అనారోగ్య సమయాలు.

  • శాంతి మరియు యుద్ధ సమయాలు.

  • పగలు మరియు రాత్రి ఘడియలు మరియు వేసవి మరియు శీతాకాలపు రుతువులు.

  • శ్రమ సమయాల తరువాత విశ్రాంతి సమయాలు.

ఈ రకమైన పరిస్థితుల మధ్య మనం సాధారణంగా ఎంపిక చేయలేనప్పటికీ, అవి జరుగుతాయి కాబట్టి, వాటికి ఎలా ప్రతిస్పందించాలో ఎంపిక చేసే స్వేచ్ఛ మనకు ఉంది. మనం సానుకూల దృక్పథంతో లేదా నిరాశావాద దృక్పథంతో అలా చేయవచ్చు. మనము అనుభవం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు మరియు మన ప్రభువు సహాయం మరియు మద్దతు కోసం అడగవచ్చు లేదా ఈ శోధనలో మనం ఒంటరిగా ఉన్నామని మరియు మనము ఒంటరిగా బాధ అనుభవించాలని అనుకోవచ్చు. మనము కొత్త వాస్తవికతకు “మన ఆత్మీలను సర్దుబాటు” చేసుకోవచ్చు లేదా దేనిని మార్చకూడదని మనము నిర్ణయించుకోవచ్చు. రాత్రి చీకటిలో, మనము మన దీపాలను వెలిగించవచ్చు. శీతాకాలపు చలిలో, మనము వెచ్చని దుస్తులు ధరించడానికి ఎంచుకోవాలి. అనారోగ్య కాలాల్లో, మనం వైద్య మరియు ఆధ్యాత్మిక సహాయాన్ని పొందవచ్చు. ఈ పరిస్థితులకు ఎలా స్పందించాలో మనము ఎంపిక చేస్తాము.

సర్దుబాటు చేయడం,” “నేర్చుకోవడం,” “వెదకడం,” “ఎంపిక చేయడం” అన్నీ చర్య తీసుకొనే క్రియలు. మనం ప్రతినిధులమే కానీ వస్తువులము కాదని గుర్తుంచుకోండి. “ఆయన … ఆదరించునట్లు … తన జనుల బాధలను, రోగములను తనపై తీసుకొనునని” లేదా మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనకు సహాయం చేస్తానని యేసు వాగ్దానం చేశారని మనం ఎన్నటికీ మరచిపోరాదు.6 మనం యేసు క్రీస్తు అనే బండపై మన పునాదిని నిర్మించడానికి ఎంపిక చేయడం వలన సుడిగాలి వచ్చినప్పుడు “అది [మనపై] ఏ శక్తిని కలిగియుండదు.”7 “ఎవరైనా [ఆయన] యొద్దకు వచ్చిన యెడల, వచ్చు వానిని [ఆయన] చేర్చుకొంటారని; మరియు [ఆయన] యొద్దకు వచ్చు వారు ధన్యులని”8 ఆయన వాగ్దానం చేశారు.

ఇప్పుడు, ఒక అదనపు సూత్రం ఉంది, అది అత్యంత ముఖ్యమైనది. “అన్ని విషయములలో … వ్యతిరేకత ఉండుట అవసరము,”9 అని లీహై చెప్పాడు. వ్యతిరేకతలు ఒకదానికొకటి వేరుగా ఉండవని దీని అర్థం. అవి ఒకదానినొకటి పూర్తి కూడా చేయగలవు. మనం కూడా ఏదో ఒక సమయంలో దుఃఖాన్ని అనుభవిస్తే తప్ప ఆనందాన్ని గుర్తించలేము. కొన్ని సమయాల్లో ఆకలిగా ఉండడం మనం మళ్లీ తినడానికి తగినంతగా వున్నప్పుడు మనం ప్రత్యేకంగా కృతజ్ఞతతో ఉండడానికి సహాయపడుతుంది. మనం అప్పుడప్పుడు అబద్ధాలు చూసి ఉంటే తప్ప మనం సత్యాన్ని గుర్తించలేము.

ఈ వ్యతిరేకతలన్నీ ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఉంటాయి. రెండు వైపులు ఎప్పుడూ ఉంటాయి. చార్లెస్ డికెన్స్ ఈ ఆలోచనకు ఒక ఉదాహరణను అందించాడు, “కొన్ని మంచి సమయాలు వుండవచ్చు, కొన్ని మంచివి కాని సమయాలు వుండవచ్చు” అని అతను వ్రాసాడు10

మన స్వంత జీవితం నుండి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. పెళ్లి చేసుకోవడం, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం మరియు పిల్లలను కనడం మన జీవితంలో మనం ఎన్నడూ అనుభవించని గొప్ప ఆనందకరమైన క్షణాలను తెస్తాయి, కానీ మనలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు మిక్కిలి లోతైన బాధ, వేదన మరియు దుఃఖకరమైన క్షణాలు కూడా ఉంటాయి. మన పిల్లలతో అంతులేని ఆనందం మరియు పరమానందం తరువాత కొన్నిసార్లు పునరావృతమయ్యే అనారోగ్యాలు, ఆసుపత్రిలో చేరడం మరియు బాధలతో నిండిన నిద్రలేని రాత్రులు, అలాగే ప్రార్థనలు మరియు యాజకత్వ ఆశీర్వాదాలలో ఉపశమనం పొందడం వంటివి కూడా ఉంటాయి. ఈ విరుద్ధమైన అనుభవాలు బాధాకరమైన క్షణాలలో మనం ఎప్పుడూ ఒంటరిగా లేమని మనకు బోధించాయి, ప్రభువు యొక్క ఆదరణ మరియు సహాయంతో మనం ఎంతవరకు మోయగలమో కూడా అవి మనకు చూపించాయి. ఈ అనుభవాలు మనల్ని అద్భుతమైన విధానాలలో తీర్చిదిద్దడంలో సహాయపడ్డాయి మరియు ఇవన్నీ పూర్తిగా విలువైనవి. మనం ఇక్కడికి వచ్చినది దీని కోసము కాదా?

లేఖనాలలో మనము కొన్ని ఆసక్తికరమైన మాదిరులను కూడా కనుగొంటాము.

  • అరణ్యంలో అతను అనుభవించిన బాధలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవడంలో అతనికి సహాయపడ్డాయని మరియు “[దేవుడు] [అతని] బాధలను [అతని] ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును” అని లీహై తన కుమారుడైన జేకబ్‌కు బోధించాడు.11

  • లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్ యొక్క క్రూరమైన ఖైదు సమయంలో, “ఇవన్నియు [అతనికి] అనుభవమునిచ్చుటకు మరియు [అతని] మేలుకొరకే”12 అని ప్రభువు అతనికి చెప్పారు.

  • చివరిగా, యేసు క్రీస్తు యొక్క అనంతమైన త్యాగం ఖచ్చితంగా నొప్పి మరియు బాధలకు గొప్ప మాదిరి, కానీ అది దేవుని పిల్లలందరికీ ఆయన ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను కూడా తీసుకువచ్చింది.

సూర్యరశ్మి ఉన్నచోట, నీడలు కూడా ఉండాలి. వరదలు నాశనాన్ని తీసుకురాగలవు, కానీ అవి సాధారణంగా జీవాన్ని కూడా తెస్తాయి. వేదన యొక్క కన్నీళ్లు తరచుగా ఉపశమనం మరియు ఆనందం యొక్క కన్నీళ్లుగా మారుతాయి. ప్రియమైనవారు విడిచి వెళ్ళినప్పుడు విచారం యొక్క భావాలు తర్వాత మళ్లీ కలుసుకున్న ఆనందంతో భర్తీ చేయబడతాయి. యుద్ధం మరియు విధ్వంసకర సమయాలలో, “చూచు కన్నులును విను చెవులును”13 ఉన్నవారికి చాలా చిన్న దయగల మరియు ప్రేమగల చర్యలు కూడా జరుగుతున్నాయి.

నేటి మన ప్రపంచం తరచుగా భయం మరియు ఆందోళన చేత చిత్రీకరించబడింది—భవిష్యత్తు మనకు ఏమి తెస్తుందో అనే భయం. కానీ విశ్వసించమని మరియు “ప్రతి ఆలోచన యందు [ఆయన] వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు,”14 అని యేసు మనకు బోధించారు.

మన జీవితాలలో మనకు కేటాయించబడిన ప్రతీ నాణేనికి రెండు వైపులా చూసేందుకు మనం నిరంతరం చాలా జాగ్రత్తగా కృషి చేద్దాం. రెండు వైపులా కొన్నిసార్లు మనకు వెంటనే కనిపించకపోయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు మరియు విశ్వసించవచ్చు.

మన కష్టాలు, చింతలు, వేదనలు మరియు బాధలు మనల్ని నిర్వచించవని మనం నిశ్చింతగా ఉండవచ్చు; బదులుగా మనం వాటిని ఎలా ఎదుర్కొంటాము అనేది మనకు ఎదగడానికి మరియు దేవునికి దగ్గరవ్వడానికి సహాయపడుతుంది. మన సవాళ్ల కంటే మన వైఖరులు మరియు ఎంపికలే మనల్ని బాగా నిర్వచిస్తాయి.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దానిని మనస్సులో పెట్టుకొని, ప్రతీ క్షణం కృతజ్ఞతతో ఉండండి. అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఓపికగా దాని నుండి నేర్చుకోండి మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా అది మళ్లీ మారగలదని తెలుసుకోండి. దుఃఖంలో ఉన్నప్పుడు, ఆనందం దగ్గరలో ఉందని విశ్వసించండి; తరచుగా మనము దానిని చూడలేము. జాగ్రత్తగా మీ దృష్టిని మార్చండి మరియు మీ ఆలోచనలను సవాళ్ల యొక్క సానుకూల అంశాలవైపు ప్రోత్సహించండి, ఎందుకంటే అవి నిస్సందేహంగా ఎల్లప్పుడూ ఉంటాయి! కృతజ్ఞతతో ఉండటాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. నమ్మడానికి ఎంచుకోండి. యేసు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండడాన్ని ఎంచుకోండి. ఎల్లప్పుడూ దేవుడిని విశ్వసించడాన్ని ఎంపిక చేయండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల మనకు బోధించినట్లుగా, “సిలెస్టియల్‌గా ఆలోచించడానికి”15 ఎంచుకోండి!

మన కొరకు మన పరలోక తండ్రి యొక్క అద్భుతమైన ప్రణాళికను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మన శోధనలలో సహాయం చేయడానికి, మనం ఆయన వద్దకు తిరిగివచ్చే మార్గపు ద్వారాన్ని తెరవడానికి తన ప్రియమైన కుమారుడిని పంపారు. యేసు క్రీస్తు జీవించియున్నారు మరియు ప్రతీ క్షణం అక్కడ నిలబడి మనకు సహాయం, బలం మరియు రక్షణను అందించడానికి మనం ఆయనను పిలవడాన్ని ఎంపిక చేసే వరకు ఎదురు చూస్తున్నారు. ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.