సర్వసభ్య సమావేశము
మాటలు ముఖ్యమైనవి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మాటలు ముఖ్యమైనవి

మాటలు ఒక భావాన్ని ఏర్పరుస్తాయి. అవి మన ఆలోచనలను, భావాలను మరియు అనుభవాలను మంచిగా లేదా చెడుగా వినిపిస్తాయి.

సహోదర సహోదరీలారా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులారా, ఈ విస్తారమైన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం నాకు గౌరవంగా ఉన్నది, వీరిలో చాలా మంది మన సంఘ సభ్యులు, వీరిలో అనేకమంది స్నేహితులు మరియు ఈ సమావేశ ప్రసారానికి క్రొత్త శ్రోతలు. సుస్వాగతం!

ఈ వేదిక నుండి పంచుకోబడిన సందేశాలు మాటల ద్వారా సంభాషించబడినవి. అవి ఆంగ్లములో ఇవ్వబడినవి మరియు దాదాపు 100 భిన్నమైన భాషలలో అనువదించబడినవి. ఎల్లప్పుడు ఆధారం ఒకేవిధంగా ఉంటుంది. మాటలు. మాటలు ముఖ్యమైనవి. నేను మరలా దానిని చెప్తాను. మాటలు ముఖ్యమైనవి!

అవి మనం ఇతరులతో ఎలా అనుసంధానించబడతామనే దానికి పునాది; అవి మన నమ్మకాలు, నైతిక విలువలు మరియు దృష్టికోణాలను సూచిస్తాయి. కొన్నిసార్లు మనం మాటలు మాట్లాడతాము; మిగిలిన సమయాలలో మనం వింటాము. మాటలు ఒక భావాన్ని ఏర్పరుస్తాయి. అవి మన ఆలోచనలను, భావాలను మరియు అనుభవాలను మంచిగా లేదా చెడుగా వినిపిస్తాయి.

దురదృష్టవశాత్తు, మాటలు అనాలోచితంగా, తొందరపాటుగా మరియు గాయపరచేవిగా ఉంటాయి. ఒకసారి చెప్పిన తరువాత, మనం వాటిని వెనక్కి తీసుకోలేం. అవి గాయపరచవచ్చు, శిక్షించవచ్చు, ఖండించవచ్చు మరియు విధ్వంసకర చర్యలకు కూడా దారితీయవచ్చు. అవి మనపై ఒత్తిడిని కలిగించవచ్చు.

మరొకవిధంగా, మాటలు విజయాన్ని వేడుక చేసుకోవచ్చు, ఆశాజనకంగా మరియు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. అవి మన గమనాన్ని పునరాలోచించమని, ప్రక్రియను తిరిగి ప్రారంభించమని మరియు దారి మళ్లించమని మనలను ప్రేరేపించగలవు. మాటలు సత్యమును అంగీకరించడానికి లేదా పరిగణించడానికి సిద్ధపరచగలవు.

అందుకే, మొదట, అన్నిటికంటే ప్రభువు మాటలు ముఖ్యమైనవి.

మోర్మన్ గ్రంథములో, ప్రాచీన అమెరికాలో ప్రవక్త ఆల్మా మరియు అతని జనులు దేవుని మాటను విస్మరించి, వారి హృదయాలను కఠినపరచుకొని, వారి సంప్రదాయాన్ని పాడుచేసిన వారితో అంతులేని యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. విశ్వాసులు పోరాడగలరు, కానీ ఆల్మా ఇలా ఉపదేశించాడు: “ఇప్పుడు వాక్యము యొక్క బోధన, న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటలో అత్యంత ప్రభావవంతమైనందున—ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియున్నందున—దేవుని వాక్యము యొక్క ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను.”1

“దేవుని వాక్యము” అన్ని ఇతర వ్యక్తీకరణలను అధిగమిస్తుంది. ప్రభువు మాట్లాడినప్పుడు, అది భూమి సృష్టించబడినప్పటి నుండి ఆవిధంగా ఉన్నది: “దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.”2

క్రొత్త నిబంధనలో రక్షకుని నుండి ఈ హామీలు వచ్చాయి: “భూమియు ఆకాశమును గతించినను, నా మాటలు ఏ మాత్రము గతింపవు.”3

మరియు ఇది: “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.”4

యేసు యొక్క తల్లి మరియ నుండి ఈ వినయముగల సాక్ష్యము వచ్చింది: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.”5

దేవుని వాక్యమును నమ్ముట మరియు లక్ష్యముంచుట మనల్ని ఆయనకు దగ్గరగా చేస్తుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వాగ్దానము చేసారు, “మీరు ఆయన మాటలను అధ్యయనం చేసినప్పుడు, ఆయనలా మారాలనే మీ సామర్థ్యము వృద్ధి చెందుతుంది.”6

“ఎక్కువ దీవించబడి, పరిశుద్ధంగా—రక్షకుడా, మీ వలే ఎక్కువగా” కావాలని కీర్తన చెప్పినట్లుగా మనమందరం ఉండాలని కోరుకొనమా?7

యువ జోసెఫ్ స్మిత్ తన మోకాళ్ళపై ఉండి పరలోకమందున్న తన తండ్రి యొక్క మాటలను వినడం నేను చిత్రీకరించుకుంటున్నాను: “[జోసెఫ్,] ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మాట వినుము!”8

మనము లేఖన వాక్యాలలో “ఆయనను వింటాము,” కానీ మన జీవితంలో లేఖన వాక్యాలను అన్వయిస్తున్నామా లేదా ఆయన మనతో మాట్లాడుతున్నాడని మనం గుర్తించామా? మనం మారతామా?

వ్యక్తిగత బయల్పాటులో మరియు పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలలో, ప్రార్థనకు జవాబులలో మనం “ఆయనను వింటాము,” ఆ క్షణాలలో యేసు క్రీస్తు మాత్రమే, ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, మన భారములను తొలగించి, మనకు క్షమాపణను, శాంతిని అనుగ్రహించి మనల్ని “ఆయన ప్రేమ యొక్క బాహువులలో”9 హత్తుకుంటారు.

రెండవది, ప్రవక్తల మాటలు ముఖ్యమైనవి.

ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క దైవత్వము గురించి సాక్ష్యమిచ్చారు. వారు ఆయన సువార్తను బోధిస్తారు మరియు ఆయన ప్రేమను మనందరికి చూపిస్తారు.10 జీవిస్తున్న మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు మాటను విని, మాట్లాడతారని నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను.

అధ్యక్షులు నెల్సన్ అనర్గళంగా పదాలను ఉపయోగించి తనను తాను వ్యక్తీకరించగలరు. ఆయన ఇలా చెప్పారు, “నిబంధన బాటపై నిలిచియుండుడి,”11 “ఇశ్రాయేలును సమకూర్చుడి,”12 “దేవునికి ప్రాధాన్యతనియ్యుడి,” 13 “అవగాహన వంతెనలను నిర్మించండి,”14 “కృతజ్ఞతలు తెలపండి,”15 “క్రీస్తునందు విశ్వాసమును హెచ్చించండి,” 16 “మీ సాక్ష్యమునకు బాధ్యతను వహించండి,”17 మరియు “సమాధానపరచువారిగా మారండి.”18

ఈమధ్య, ఆయన మనల్ని “సిలెస్టియల్‌గా ఆలోచించండి,” అని అడిగారు. “మీరు గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! అని ఆయన అన్నారు. శోధన చేత పరీక్షించబడినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! జీవితం లేదా ప్రియమైన వారు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! ఎవరైనా అకాలంగా మరణించినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి.జీవితం యొక్క ఒత్తిళ్ళు మీపైకి వచ్చినప్పుడు, సిలెస్టియల్‌గా ఆలోచించండి! … మీరు సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, మీ హృదయం క్రమంగా మారుతుంది, … శ్రమలు మరియు వ్యతిరేకతలను మీరు క్రొత్త కోణంలో చూస్తారు, … [మరియు] మీ విశ్వాసము వృద్ధి చెందుతుంది.”19

“సిలెస్టియల్‌గా ఆలోచించినప్పుడు, “విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు మరియు … వాస్తవముగా ఉండబోవునట్లు మనము చూస్తాము.”20 కలవరము మరియు వివాదముతో భారమైన ఈ లోకంలో, మనందరికి ఆ దృష్టికోణము అవసరము.

సంఘము యొక్క అధ్యక్షులు కాకముందు ఎల్డర్ జార్జ్ ఆల్బర్ట్ స్మిత్, ప్రవక్తను ఆమోదించి, ఆయన మాటలను లక్ష్యముంచుట గురించి మాట్లాడారు. ఆయన అన్నారు: “మన చేతులను మనం పైకెత్తినప్పుడు మన కర్తవ్యం … అత్యంత పరిశుద్ధమైనది. … దాని అర్థము … మనము ఆయనను బలపరుస్తాము; ఆయన కోసం ప్రార్థిస్తాము; … మరియు ప్రభువు నిర్దేశించినట్లుగా ఆయన సూచనలను అమలు చేయడానికి మనం ప్రయత్నిస్తాము.”21 మరొక మాటలో, మనం మన ప్రవక్తల మాటలను శ్రద్ధగా అమలు చేస్తాము.

నిన్న మన విశ్వవ్యాప్త సంఘము చేత ఆమోదించబడిన 15 మంది ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులలో ఒకరిగా, ప్రవక్తను ఆమోదించుట మరియు ఆయన మాటలను అంగీకరించుట గురించి నా అనుభవాలలో ఒకదానిని మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. అది నాకు ప్రవక్త జేకబ్ వలే ఎక్కువగా ఉన్నది, అతడు చెప్పా డు, “ప్రభువు యొక్క స్వరము నిజముగా నాతో మాట్లాడుట కూడా నేను వినియున్నాను.”22

చిత్రం
థాయిలాండ్‌లో ఎల్డర్ మరియు సహోదరి రాస్బాండ్

గత అక్టోబరులో నా భార్య మెలనీ, నేను థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు సంఘము యొక్క 185వ దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి నేను సిద్ధపడుతున్నాను.24 నాకైతే, ఆ నియామకము వాస్తవికమైనది మరియు వినయపూర్వకమైనది. ఆగ్నేయాసియా ద్వీపకల్పంలో ఇది మొదటి దేవాలయం.24 అది అద్భుతంగా రూపొందించబడింది—ఆరు అంతస్తులు, తొమ్మిది-కొనల శిఖర నిర్మాణముతో ప్రభువు యొక్క మందిరముగా ఉండటానికి “చక్కగా అమర్చబడింది.”25 నెలల తరబడి ఆ ప్రతిష్ఠాపన గురించి నేను ధ్యానించాను. ఆ దేశము మరియు దేవాలయము అపొస్తులులు మరియు ప్రవక్తల చేత సహకారమివ్వబడి, పోషించబడిందని నేను గ్రహించాను. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ దేవాలయమును ప్రకటించారు26 మరియు అధ్యక్షులు నెల్సన్ ప్రతిష్ఠాపనను ప్రకటించారు.27

చిత్రం
బ్యాంకాక్ థాయిలాండ్ దేవాలయ ప్రతిష్ఠాపన

చాలా నెలల క్రితం ప్రతిష్ఠాపన ప్రార్థనను నేను సిద్ధపరిచాను. ఆ పవిత్రమైన మాటలు 12 భాషల్లోకి అనువదించబడినవి. మేము సిద్ధపడి ఉన్నాము. లేదా అలా అని నేను అనుకున్నాను.

సమర్పణకు ముందురోజు రాత్రి నేను ప్రతిష్ఠాపన ప్రార్థన గురించి అస్థిరమైన, అత్యవసర భావనతో నిద్ర నుండి మేల్కొన్నాను. ప్రార్థన సిద్ధంగా ఉందని ఆలోచిస్తూ, ప్రేరేపణను నిర్లక్ష్యం చేయడానికి నేను ప్రయత్నించాను. అయితే ఆత్మ నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిర్దిష్టమైన మాటలు లేవని నేను గ్రహించాను మరియు దైవిక ప్రణాళిక ద్వారా అవి బయల్పాటులో నాకు వచ్చాయి మరియు ప్రార్థన ముగింపులో నేను ఈ మాటలను చేర్చాను: “మా జీవితాలలో మీ ఆత్మను ప్రబలనిచ్చి, ఎల్లప్పుడు సమాధానకర్తలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ, సిలెస్టియల్‌గా ఆలోచించెదము గాక.”28 ప్రభువు జీవిస్తున్న మన ప్రవక్త యొక్క మాటలను ఆలకించమని మనకు జ్ఞాపకం చేస్తున్నారు: “సిలెస్టియల్‌గా ఆలోచించండి,” “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” “సమాధానకర్తలుగా ఉండటానికి ప్రయత్నించండి.” ప్రవక్త మాటలు ప్రభువుకు, మనకు ముఖ్యమైనవి.

మూడవది, చాలా ముఖ్యమైనది, మన స్వంత మాటలు. నన్ను నమ్మండి, మన ఎమోజీలతో నింపబడిన29 లోకంలో, మన మాటలు ముఖ్యమైనవి.

మన మాటలు సహకారమివ్వగలవు లేదా కోపాన్ని కలిగించగలవు, సంతోషాన్నివ్వగలవు లేదా హీనంగా ఉండగలవు, కనికరము చూపగలవు లేదా నిర్లక్ష్యం చేయబడగలవు. ఒకరు ఆవేశంలో ఉన్న సమయంలో, మాటలు బాధాకరమైన భావావేశ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇంటర్నెట్‌, సందేశాలు, సామాజిక మీడియా లేదా ట్విట్టర్‌పై మన మాటలు శక్తిని కలిగి ఉంటాయి మరియు మనం ఉద్దేశించిన దానిని మించిన విధానాలలో అర్థం చేసుకోబడవచ్చు. కనుక మీరు ఏమి చెప్తారు మరియు ఏవిధంగా చెప్తారనే దాని గురించి జాగ్రత్త వహించండి. మన కుటుంబాలలో, ప్రత్యేకంగా భర్తలు, భార్యలు మరియు పిల్లలతో, మన మాటలు మనల్ని దగ్గరగా చేయవచ్చు లేదా మన మధ్య విభేదాన్ని కలిగించవచ్చు.

ఇబ్బందులు మరియు వ్యత్యాసాల నుండి భావావేశ నొప్పిని తీసివేయడానికి, సానుకూల ప్రభావాన్ని కలిగించి, ఒకరికొకరు తిరిగి భరోసా ఇవ్వడానికి మనం ఉపయోగించే మూడు సాధారణ వాక్యభాగాలను నేను సూచిస్తాను.

“మీకు ధన్యవాదాలు.”

“నన్ను క్షమించు.”

మరియు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”

ప్రత్యేక సంఘటన లేదా విపత్తుల కోసం ఈ వినయంగల మాటలను దాచుకొనవద్దు. వాటిని తరచుగా, నిజాయితీగా ఉపయోగించండి, ఏలయనగా అవి ఇతరుల పట్ల గౌరవాన్ని చూపిస్తాయి. అనేకమంది మాటలు స్వల్పమైన అర్ధాన్ని లేదా విలువను కలిగియున్నవి; ఆ నమూనాను అనుసరించవద్దు.

లిఫ్టు వద్ద, పార్కింగ్ స్థలంలో, మార్కెట్ వద్ద, కార్యాలయంలో, వరుసలో నిలబడినప్పుడు లేదా మన పొరుగువారు లేదా స్నేహితులతో మనం “మీకు ధన్యవాదాలు” అని చెప్పవచ్చు. మనం తప్పు చేసినప్పుడు, ఒక సమావేశాన్ని చేజార్చుకున్నప్పుడు, ఒక పుట్టినరోజును మరచిపోయినప్పుడు, లేదా ఎవరైనా బాధలో ఉండటం చూసినప్పుడు “నన్ను క్షమించు” అని మనము చెప్పగలము. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని మనం చెప్పగలము, ఆ మాటలు “నీ గురించి నేను ఆలోచిస్తున్నాను,” “నేను ఇక్కడ నీ కోసం ఉన్నాను,” లేదా “నువ్వే నా సర్వస్వము” అనే సందేశాన్ని అందిస్తాయి.

ఒక వ్యక్తిగత మాదిరిని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భర్తలారా, ఆలకించండి. సహోదరీలారా, ఇది మీకు కూడా సహాయపడుతుంది. సంఘంలో నా పూర్తి-కాల నియమాకానికి ముందు, నా సంస్థ కోసం నేను విస్తారంగా ప్రయాణించాను. నేను ప్రపంచంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించడంలో చాలా సమయం గడిపాను. నా రోజు ముగింపులో, నేను ఎక్కడ ఉన్నప్పటికీ, నేను ఎల్లప్పుడు ఇంటికి ఫోను చేస్తాను. నా భార్య మెలనీ ఫోను ఎత్తినప్పుడు, నేను నివేదిస్తాను, మా సంభాషణ ఎల్లపుడూ, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని వ్యక్తపరచడానికి దారితీస్తుంది. ప్రతిరోజూ, ఆ మాటలు నా ఆత్మకు, నా ప్రవర్తనకు లంగరుగా సహాయపడ్డాయి; అవి దుష్ట సంకల్పముల నుండి నాకు భద్రతగా ఉన్నాయి. “మెలనీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అనే మాటలు మా మధ్య అమూల్యమైన నమ్మకాన్ని తెలిపాయి.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా చెప్తూ ఉండేవారు, “స్థిరంగా చేయాల్సిన పాదాలున్నాయి, పట్టుకోవాల్సిన చేతులున్నాయి, ప్రోత్సహించాల్సిన మనస్సులున్నాయి, ప్రేరేపించాల్సిన హృదయాలున్నాయి మరియు రక్షించాల్సిన ఆత్మలున్నాయి.”30 “మీకు ధన్యవాదాలు,” “నన్ను క్షమించు,” “నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని చెప్పడం దానినే చేస్తుంది.

సహోదర సహోదరీలారా, మాటలు ముఖ్యమైనవి.

రక్షణకు నడిపించునట్లు, మనం “క్రీస్తు యొక్క మాటలను”31, మనల్ని నడిపించి, ప్రోత్సహించే మన ప్రవక్తల మాటలను మరియు మనం ఎవరము, మనం దేనిని ప్రియంగా ఎంచుతామో తెలిపే మన స్వంత మాటలను విందారగించిన యెడల, పరలోక శక్తులు మనపై క్రుమ్మరించబడతాయని నేను వాగ్దానమిస్తున్నాను. “క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.”32 మనము ఆయన పిల్లలము మరియు ఆయనే మన దేవుడు, పరిశుద్ధాత్మ వరము ద్వారా “దేవదూతల భాషతో” 33 మాట్లాడవలెనని ఆయన మన నుండి ఆశిస్తున్నారు.34

ప్రభువైన యేసు క్రీస్తును నేను ప్రేమిస్తున్నాను. పాత నిబంధన ప్రవక్త యెషయా మాటలలో ఆయన, “ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి.”35 మరియు అపొస్తులుడైన యోహాను స్పష్టము చేసినట్లుగా, క్రీస్తు తానే “వాక్యము.”36

ప్రభువు యొక్క దైవిక సేవకు---ఆయన వాక్యమును ప్రకటించడానికి----మరియు ఆయనను గూర్చి ఒక ప్రత్యేక సాక్షిగా నిలబడుటకు పిలువబడిన ఒక అపొస్తులునిగా దీనిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.