సర్వసభ్య సమావేశము
అద్భుతాలు, దేవదూతలు మరియు యాజకత్వ శక్తి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అద్భుతాలు, దేవదూతలు మరియు యాజకత్వ శక్తి

మీరు అద్భుతాలు మరియు దేవదూతల పరిచర్యతో సహా యాజకత్వం యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటే, దేవుడు అందుబాటులోకి తెచ్చిన నిబంధనల మార్గంలో నడవండి.

అద్భుతాలు ఇప్పుడు లేవని, దేవదూతలు కల్పితమని, పరలోకాలు మూసుకుపోయాయని నేడు చాలామంది అంటారు. అద్భుతాలు ఆగిపోలేదని నేను సాక్ష్యమిస్తున్నాను, దేవదూతలు మన మధ్య ఉన్నారు మరియు పరలోకాలు నిజంగా తెరువబడి ఉన్నాయి.

మన రక్షకుడైన యేసు క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు, ఆయన తన ప్రధాన అపొస్తలుడైన పేతురుకు యాజకత్వ తాళపుచెవులు ఇచ్చారు.1 ఈ తాళపుచెవుల ద్వారా, పేతురు మరియు ఇతర అపొస్తలులు రక్షకుని సంఘాన్ని నడిపించారు. కానీ ఆ అపొస్తలులు చనిపోయినప్పుడు, యాజకత్వ తాళపుచెవులు భూమిపై నుండి తీసివేయబడ్డాయి.

యాజకత్వం యొక్క పురాతన తాళపుచెవులు పునఃస్థాపించబడ్డాయని నేను సాక్ష్యమిస్తున్నాను. పేతురు, యాకోబు, యోహాను మరియు ఇతర ప్రాచీన ప్రవక్తలు పునరుత్థానం చెందిన జీవులుగా కనిపించి, “నా రాజ్యపు తాళపుచెవులు మరియు సువార్త యుగము”2 అని ప్రభువు వర్ణించిన వాటిని ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు అనుగ్రహించారు.

అవే తాళపుచెవులు ప్రవక్త నుండి ప్రవక్తకు ఈ రోజు వరకు బదిలీ చేయబడ్డాయి. ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా మరియు బయల్పాటుదారులుగా మనం ఆమోదిస్తున్న 15 మంది పురుషులు రక్షకుని సంఘాన్ని నడిపించడానికి వాటిని ఉపయోగిస్తారు. ప్రాచీన కాలంలో వలె, అన్ని యాజకత్వ తాళపుచెవులను కలిగియున్న మరియు ఉపయోగించడానికి అధికారం ఉన్న ఒక సీనియర్ అపొస్తలుడు ఉన్నారు. ఆయనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, ప్రవక్త మరియు మన రోజుల్లో పునఃస్థాపించబడిన క్రీస్తు సంఘమైన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడు.

రక్షకుని సంఘము ద్వారా, మనం యాజకత్వం యొక్క ఆశీర్వాదాలను పొందుతాము—మన జీవితాల్లో మనకు సహాయం చేసే దేవుని శక్తితో సహా. అధీకృత యాజకత్వ తాళపుచెవుల క్రింద, మనం దేవునితో పవిత్రమైన వాగ్దానాలు చేస్తాము మరియు ఆయన సన్నిధిలో జీవించడానికి మనల్ని సిద్ధం చేసే పవిత్ర విధులను పొందుతాము. బాప్తిస్మం మరియు నిర్ధారణతో ప్రారంభించి, ఆపై దేవాలయంలో, మనల్ని ఆయన వద్దకు తిరిగి నడిపించే నిబంధనల మార్గంలో మనం ముందుకు సాగుతాము.

మన తలలపై చేతులు ఉంచబడి, మనం యాజకత్వ దీవెనలను కూడా పొందుతాము, అందులో దిశానిర్దేశము, ఓదార్పు, సలహా, స్వస్థత మరియు యేసు క్రీస్తును అనుసరించే శక్తి ఉన్నాయి. నా జీవితాంతం నేను ఈ గొప్ప శక్తిచేత ఆశీర్వదించబడ్డాను. లేఖనములో బయల్పరచబడినట్లుగా, మనం దానిని పరిశుద్ధ మెల్కీసెదెకు యాజకత్వం యొక్క శక్తిగా సూచిస్తాము.3

నా యవ్వనంలో నేను ఈ శక్తి పట్ల గొప్ప గౌరవాన్ని పొందాను, ప్రత్యేకించి అది యాజకత్వ దీవెనలలో ప్రత్యక్షపరచబడినప్పుడు. చిలీలో యువ సువార్తికునిగా సేవ చేస్తున్నప్పుడు, నేను మరియు నా సహచరుడు అరెస్టు చేయబడి విడిపోయాము. ఎందుకో మాకు ఎప్పుడూ చెప్పబడలేదు. రాజకీయంగా పెను దుమారం రేగిన సమయం అది. మిలిటరీ పోలీసులు వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు, వారి గురించి మళ్లీ వినలేదు.

విచారించబడిన తర్వాత, నేను నా ప్రియమైన వారిని మళ్లీ చూడగలనో లేదో తెలియక జైలు గదిలో ఒంటరిగా కూర్చున్నాను. నేను నా పరలోక తండ్రి వైపు తిరిగి, హృదయపూర్వకంగా ఇలా వేడుకున్నాను: “తండ్రీ, మీ సువార్తికులను మీరు చూసుకుంటారని నాకు ఎప్పుడూ బోధించబడింది. దయచేసి తండ్రీ, నేను ప్రత్యేకంగా ఏమీ లేను, కానీ నేను విధేయతతో ఉన్నాను మరియు ఈ రాత్రి నాకు మీ సహాయం కావాలి.”

ఈ సహాయం యొక్క విత్తనాలు చాలా సంవత్సరాల క్రితం నాటబడ్డాయి. నా బాప్తిస్మం తర్వాత, నేను సంఘములో సభ్యునిగా నిర్ధారించబడ్డాను మరియు పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడ్డాను. నేను ఒంటరిగా, కటకటాల వెనుక ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చాడు. అతడు నా గోత్రజనక దీవెన నుండి చాలా నిర్దిష్టమైన భాగాన్ని నా దృష్టికి తీసుకువచ్చాడు, అది యాజకత్వం యొక్క మరొక ఆశీర్వాదం. దానిలో, నా విశ్వాసం ద్వారా అందం, సుగుణం మరియు ప్రేమతో నిండిన స్త్రీతో కాలము మరియు నిత్యత్వము కొరకు దేవాలయంలో నేను ముద్రవేయబడగలనని, అమూల్యమైన కుమారులు, కుమార్తెలకు మేము తల్లిదండ్రులు అవుతామని మరియు నేను ఇజ్రాయేలులో తండ్రిగా ఆశీర్వదించబడి, ఘనపరచబడతానని దేవుడు నాకు వాగ్దానం చేశారు.

నా భవిష్యత్తు గురించి ఆ స్ఫూర్తిదాయకమైన మాటలు నా ఆత్మను శాంతితో నింపాయి. ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రేమగల నా పరలోక తండ్రి నుండి అవి వచ్చాయని నాకు తెలుసు.4 ఆ క్షణంలో, నేను విడుదల చేయబడతానని, ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి జీవించగలనని నాకు హామీ వచ్చింది.

దాదాపు ఒక సంవత్సరం తరువాత, పరలోక తండ్రి నాకు అందం, సుగుణం మరియు ప్రేమతో నిండిన భార్యను అనుగ్రహించారు. లినెట్ మరియు నేను దేవాలయంలో ముద్రవేయబడ్డాము. మేము ముగ్గురు అమూల్యమైన కుమారులు మరియు నలుగురు అమూల్యమైన కుమార్తెలతో ఆశీర్వదించబడ్డాము. 17 ఏళ్ల బాలుడిగా నేను పొందిన గోత్రజనకుని దీవెనలో దేవుని వాగ్దానాల ప్రకారం నేను తండ్రినయ్యాను.

“అందువలన నా ప్రియమైన సహోదరులారా [మరియు సహోదరీలారా], క్రీస్తు పరలోకానికి ఆరోహణమైనందున అద్భుతములు ఆగిపోయినవా? …

“… ఆగలేదు; నరుల సంతానమునకు దేవదూతలు పరిచర్య చేయుట కూడా మానివేయలేదు.”5

మన జీవితాలలో అద్భుతాలు మరియు పరిచర్యలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను, తరచుగా యాజకత్వ శక్తి యొక్క ప్రత్యక్ష ఫలితంగా. కొన్ని యాజకత్వ ఆశీర్వాదాలు మనం చూడగలిగే మరియు అర్థం చేసుకోగలిగే మార్గాల్లో వెంటనే నెరవేరుతాయి. మరికొన్ని క్రమంగా తెలియజేయబడతాయి మరియు ఈ జీవితంలో పూర్తిగా గ్రహించబడవు. కానీ దేవుడు తన వాగ్దానాలన్నింటినీ ఎల్లప్పుడూ నెరవేరుస్తారు, మా కుటుంబ చరిత్ర నుండి ఈ కథలో వివరించబడినట్లుగా:

మా తాత, గ్రాంట్ రీస్ బౌవెన్ గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి. అతను తన స్వంత గోత్రజనక దీవెనను ఎలా పొందాడో వివరించడం నాకు స్పష్టంగా గుర్తుంది. తన డైరీలో, అతను ఇలా వ్రాశాడు: “గోత్రజనకుడు నాకు స్వస్థపరిచే బహుమతిని వాగ్దానం చేశారు. ‘రోగులు స్వస్థత పొందుతారు. అవును, చనిపోయినవారు నీ చేతులలో లేపబడతారు,’ అని ఆయన చెప్పారు.”

చాలా సంవత్సరాల తరువాత, తాత గడ్డిని పోగు చేస్తున్నప్పుడు ఇంటికి తిరిగి రావాలని ప్రేరేపించబడినట్లు భావించాడు. అతని వైపు వస్తున్న వాళ్ళ నాన్న అతన్ని కలుసుకున్నాడు. “గ్రాంట్, మీ అమ్మ ఇప్పుడే చనిపోయింది,” అని వాళ్ళ నాన్న చెప్పాడు.

తాతగారి డైరీ నుండి నేను మళ్ళీ వ్యాఖ్యానిస్తాను: “నేను ఆగలేదు కానీ ఇంట్లోకి మరియు బయటి వరండాలోకి వెళ్ళాను, అక్కడ ఆమె మంచం మీద పడుకుంది. నేను ఆమె వైపు చూసాను మరియు ఆమెలో జీవం యొక్క జాడ ఏమాత్రం లేదు. నేను నమ్మకంగా ఉంటే, నా విశ్వాసం ద్వారా రోగులు స్వస్థత పొందుతారు మరియు చనిపోయినవారు లేపబడతారు అనే వాగ్దానాన్ని, నా గోత్రజనకుని దీవెనను నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆమె తలపై నా చేతులు ఉంచి, ప్రభువు నాకు గోత్రజనకుని ద్వారా చేసిన ఆయన వాగ్దానం నిజమైతే, ఈ సమయంలో దానిని వ్యక్తపరిచి, నా తల్లిని తిరిగి బ్రతికించమని నేను ప్రభువుతో చెప్పాను. ఆయన అలా చేస్తే, ఆయన రాజ్యాన్ని నిర్మించడం కోసం నా శక్తిమేరకు అన్నీ చేయడానికి నేను ఎప్పుడూ వెనుకాడనని నేను వాగ్దానం చేసాను. నేను ప్రార్థించినప్పుడు, ఆమె కళ్ళు తెరిచి, ‘గ్రాంట్, నన్ను లేపు. నేను ఆత్మ లోకంలో ఉన్నాను, కానీ నువ్వు నన్ను తిరిగి పిలిచావు. ఇది నీకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సాక్ష్యంగా ఉండనివ్వు,’ అంది.”

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అద్భుతాలను వెదకమని మరియు ఆశించమని మనకు బోధించారు.6 యాజకత్వం పునఃస్థాపించబడినందున, దేవుని శక్తి మరియు అధికారం భూమిపై ఉన్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను. పిలుపులు మరియు సలహాసభల ద్వారా, పురుషులు మరియు స్త్రీలు, యౌవనులు మరియు పెద్దలు యాజకత్వ కార్యములో పాల్గొనవచ్చు. ఇది దేవదూతలు హాజరైన అద్భుతాల కార్యము. ఇది పరలోకం యొక్క కార్యము మరియు ఇది దేవుని పిల్లలందరినీ ఆశీర్వదిస్తుంది.

1989లో, ఏడుగురు సభ్యులతో కూడిన మా కుటుంబం వార్డు విహారయాత్ర నుండి తిరిగి వస్తోంది. ఆలస్యం అయింది. లినెట్ కడుపులో మా ఆరవ బిడ్డ ఉంది. ఆమె తన సీటు బెల్టును బిగించుకోవాలని బలంగా ప్రేరేపించబడింది, కానీ చేయడం మర్చిపోయింది. కొద్దిసేపటి తర్వాత మేము రోడ్డులోని ఒక మలుపు దగ్గరికి వచ్చాము; ఒక కారు వరుస తప్పి మా వరుస‌లోకి వచ్చింది. గంటకు 70 మైళ్ళ (112 కి.మీ.) వేగంతో వెళుతూ, ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టకుండా నేను ప్రక్కకు తిప్పాను. మా వ్యాను బోల్తా పడింది, ప్రధాన రహదారి మీదుగా జారిపోయి, రోడ్డు మీద నుండి జారి చివరకు ఆగిపోయింది, ప్రయాణికుని వైపు మట్టిలో దిగబడింది.

నేను విన్న తదుపరి విషయం లినెట్ యొక్క స్వరం: “షేన్, మేము నీ తలుపు ద్వారా బయటకు రావాలి.” నేను నా సీటు బెల్టు‌తో గాలిలో వేలాడుతున్నాను. తేరుకోవడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది. మేము పిల్లలందరిని వ్యాను నుండి నా కిటికీలోంచి బయటికి తీసుకురావడం ప్రారంభించాము, ఇప్పుడది వ్యాను పైకప్పు. ఏం జరిగిందోనని ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఏడుస్తున్నారు.

మా 10 ఏళ్ల కుమార్తె ఎమిలీ తప్పిపోయిందని మేము త్వరలోనే గ్రహించాము. మేము గట్టిగా ఆమె పేరు పిలిచాము, కానీ జవాబు లేదు. ఇంటికి వెళుతున్న వార్డు సభ్యులు కూడా సంఘటనా స్థలంలో ఆమె కోసం వెతుకుతున్నారు. చాలా చీకటిగా ఉంది. నేను ఫ్లాష్‌లైట్‌తో మళ్లీ వ్యాను‌లోకి చూశాను మరియు వ్యాను కింద చిక్కుకున్న ఎమిలీ యొక్క చిన్న శరీరం చూసి భయపడ్డాను. నేను నిర్విరామంగా పిలిచాను, “మనం ఎమిలీ పైనుండి వ్యానును ఎత్తాలి.” నేను పైకప్పు పట్టుకుని వెనక్కి లాగాను. అక్కడ పైకెత్తడానికి కొంతమంది మాత్రమే ఉన్నారు, కానీ వ్యాను అద్భుతంగా దాని చక్రాలపైకి పల్టీలు కొట్టింది, ఎమిలీ యొక్క నిర్జీవమైన శరీరాన్ని బహిర్గతం చేసింది.

ఎమిలీ ఊపిరి పీల్చుకోవడంలేదు. ఆమె ముఖం ఊదా రంగులో ఉంది. “మనం ఆమెకు దీవెన ఇవ్వాలి,” అన్నాను నేను. ఒక ప్రియమైన స్నేహితుడు మరియు వార్డు సభ్యుడు నాతోపాటు మోకరిల్లాడు మరియు మెల్కీసెదెకు యాజకత్వం యొక్క అధికారం చేత, యేసు క్రీస్తు నామంలో, మేము ఆమెను జీవించమని ఆదేశించాము. ఆ క్షణంలో ఎమిలీ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది.

గంటలు గడిచినట్లు అనిపించిన తర్వాత, చివరకు అంబులెన్స్ వచ్చింది. ఎమిలీని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఊపిరితిత్తి అంటుకుపోయింది మరియు ఆమె మోకాలిలో స్నాయువు తెగిపోయింది. చాలాసేపు ఆక్సిజన్ లేని కారణంగా ఆమె మెదడు దెబ్బతినడం ఆందోళన కలిగించింది. ఎమిలీ ఒకటిన్నర రోజులు కోమాలో ఉంది. మేము ఆమె కోసం ప్రార్థనలు మరియు ఉపవాసాన్ని కొనసాగించాము. ఆమె పూర్తిగా కోలుకుంది. నేడు, ఎమిలీ మరియు ఆమె భర్త కెవిన్ ఆరుగురు కుమార్తెలకు తల్లిదండ్రులు.

అద్భుతం ఏమిటంటే, మిగతా వారందరూ దూరంగా వెళ్ళగలిగారు. లినెట్ కడుపులో మోస్తున్న బిడ్డ టైసన్. అతనికి కూడా ఎటువంటి హాని కలుగలేదు మరియు తరువాతి ఫిబ్రవరిలో అతను జన్మించాడు. అతని భౌతిక శరీరాన్ని స్వీకరించిన ఎనిమిది నెలల తర్వాత, టైసన్ పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. అతను మా సంరక్షక దేవదూతయైన కుమారుడు. మేము మా కుటుంబంలో అతని ప్రభావాన్ని అనుభవిస్తాము మరియు అతనితో మళ్లీ కలిసి ఉండటానికి ఎదురుచూస్తున్నాము.7

ఎమిలీ పైనుండి వ్యాను‌ను పైకి లేపిన వారు వ్యాను బరువుగా లేకపోవడం గమనించారు. ఎమిలీ శరీరం పైనుండి వాహనాన్ని ఎత్తడానికి పరలోక దేవదూతలు భూమి మీద ఉన్న దేవదూతలతో కలిసిపోయారని నాకు తెలుసు. పరిశుద్ధ యాజకత్వం యొక్క శక్తి ద్వారా ఎమిలీ తిరిగి బ్రతికించబడిందని కూడా నాకు తెలుసు.

ప్రభువు తన సేవకులకు ఈ సత్యాన్ని బయల్పరిచారు: “నేను మీ యెదుట వెళ్ళెదను. నేను మీ కుడివైపున, మీ ఎడమవైపున ఉందును, నా ఆత్మ మీ హృదయములందుండును, మిమ్ములను ఎత్తుకొనుటకు మీ చుట్టూ నా దేవదూతలు కావలియుందురు.”8

“దేవుని కుమారుని క్రమముననుసరించిన పరిశుద్ధ యాజకత్వము”9—మెల్కీసెదెకు యాజకత్వము—దాని తాళపుచెవులు, అధికారం మరియు శక్తితో ఈ చివరి రోజులలో భూమిపై పునఃస్థాపించబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. అన్ని పరిస్థితులు మనం ఆశించినట్లుగా మరియు ప్రార్థిస్తున్నట్లుగా మారనప్పటికీ, దేవుని అద్భుతాలు ఎల్లప్పుడూ ఆయన చిత్తం, ఆయన సమయం మరియు మన కోసం ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుతాయని నాకు తెలుసు.

మీరు అద్భుతాలు మరియు దేవదూతల పరిచర్యతో సహా యాజకత్వం యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటే, దేవుడు మనలో ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తెచ్చిన నిబంధనల మార్గంలో నడవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని ఇష్టపడే సంఘ సభ్యులు మరియు నాయకులు తదుపరి చర్య తీసుకోవడానికి మీకు సహాయం చేస్తారు.

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు జీవిస్తున్నారని మరియు యాజకత్వ తాళపుచెవులను కలిగియుండి, వాటిని ఉపయోగించే సజీవ ప్రవక్తల ద్వారా తన సంఘాన్ని నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. పరిశుద్ధాత్మ నిజము. రక్షకుడు మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని తిరిగి పొందడానికి మరియు మనల్ని ఇంటికి తీసుకురావడానికి తన జీవితాన్ని ఇచ్చారు.

అద్భుతాలు ఆగిపోలేదని నేను సాక్ష్యమిస్తున్నాను, దేవదూతలు మన మధ్య ఉన్నారు మరియు పరలోకాలు నిజంగా తెరువబడి ఉన్నాయి. ఓహ్, అవి ఎంతగా తెరువబడి ఉన్నాయి! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.