సర్వసభ్య సమావేశము
పిలువు, పడిపోకు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పిలువు, పడిపోకు

మనం దేవునికి మొరపెట్టుకుంటే, మనం పడిపోమని నేను సాక్ష్యమిస్తున్నాను.

దేవుడు మన ప్రార్థనలను వింటాడని మరియు వాటికి వ్యక్తిగతంగా సమాధానమిస్తాడని నా హృదయంలో ఉన్న పూర్తి నిశ్చయతకు సాక్ష్యమివ్వడం ద్వారా ఈ రోజు నేను ప్రారంభించాలనుకుంటున్నాను.

అనిశ్చిత, బాధ, నిరాశ మరియు హృదయ విదారక సమయాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో, మనం వ్యక్తిగత సామర్థ్యాలు మరియు ప్రాధాన్యతలతో పాటు ప్రపంచం నుండి వచ్చే జ్ఞానం మరియు భద్రతపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు భావించవచ్చు. ఈ మర్త్య జీవితంలోని సవాళ్లను ఎదుర్కోగల సహాయం మరియు మద్దతు యొక్క నిజమైన మూలంపై మనం శ్రద్ధ చూపకపోవడానికి ఇది కారణం కావచ్చు.

చిత్రం
ఆసుపత్రి గది.

నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఒక సందర్భం నాకు గుర్తుంది మరియు నాకు నిద్రపోవడం కష్టమైంది. నేను లైట్లు ఆర్పివేసి, గది చీకటిగా మారినప్పుడు, నాకు ఎదురుగా పైకప్పుపై ప్రతిబింబించే ఈ చిహ్నం కనిపించింది, “పిలువు, పడిపోకు.” నా ఆశ్చర్యానికి, మరుసటి రోజు నేను గదిలోని అనేక భాగాలలో అదే సందేశం పునరావృతం చేయబడడాన్ని గమనించాను.

చిత్రం
పిలువు, పడిపోకు చిహ్నము.

ఆ సందేశం ఎందుకు అంత ముఖ్యమైనది? నేను దాని గురించి నర్సును అడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది, “ఇది మీకు ఇప్పటికే ఉన్న నొప్పిని పెంచే దెబ్బను నిరోధించడానికి.”

ఈ జీవితం సహజంగానే బాధాకరమైన అనుభవాలను తెస్తుంది, కొన్ని మన భౌతిక శరీరాలకు స్వాభావికంగా, కొన్ని మన బలహీనతలు లేదా బాధల వల్ల, కొన్ని ఇతరులు తమ కర్తృత్వాన్ని ఉపయోగించే విధానం వల్ల, మరికొన్ని మనం కర్తృత్వాన్ని ఉపయోగించడం వల్ల వస్తాయి.

“అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి” లేదా పిలువుడి “మీకు తీయబడును” అని రక్షకుడు స్వయంగా ప్రకటించినప్పుడు చేసిన వాగ్దానం కంటే శక్తివంతమైన వాగ్దానం ఏదైనా ఉందా?1

ప్రార్థన అనేది మన పరలోక తండ్రితో సంభాషించే సాధనం, అది “పిలవడానికి మరియు పడిపోకుండా ఉండడానికి” మనల్ని అనుమతిస్తుంది. అయినప్పటికీ, మనం తక్షణ ప్రతిస్పందన పొందనందున లేదా మన అంచనాలకు అనుగుణంగా లేనందున పిలుపు వినబడలేదని మనం భావించే పరిస్థితులు ఉన్నాయి.

ఇది కొన్నిసార్లు ఆందోళన, విచారం లేదా నిరాశకు దారితీస్తుంది. కానీ “నేను ఒక ఓడను నిర్మించవలెనని ఆయన నన్ను ఎందుకు ఆదేశించలేడు?”2 అని చెప్పినప్పుడు నీఫై ప్రభువునందు విశ్వాసం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పడిపోరాదని ప్రభువు మీకు ఎందుకు బోధించలేడు?

దేవుని జవాబులపై నమ్మకం అనేది ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావని3 మరియు “అన్ని విషయములు సరైన సమయములో వచ్చును” అని అంగీకరించడాన్ని సూచిస్తుంది.4

మనం ప్రేమగల మరియు దయగల పరలోక తండ్రి పిల్లలమని తెలుసుకోవడం యొక్క నిశ్చయత, ఎల్లప్పుడు ప్రార్థన చేయవలెనని మరియు విసుగు చెందరాదని; … [మనం] చేయునది [మన] ఆత్మ[ల] యొక్క శ్రేయస్సు కొరకే”5 అనే దృక్పథంతో భక్తిగల ప్రార్థనలో “పిలువడానికి” ప్రేరణగా ఉండాలి. ప్రతీ ప్రార్థనలో మనం ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పేరిట వినయంగా ప్రార్థన చేసినప్పుడు పరలోక తండ్రి భావాలను ఊహించండి. మనం అలా చేసినప్పుడు గొప్ప శక్తి మరియు సున్నితత్వం ప్రదర్శించబడుతుందని నేను నమ్ముతున్నాను!

పతనం కాకుండా దేవునికి మొరపెట్టిన వారి ఉదాహరణలతో లేఖనాలు నిండి ఉన్నాయి. హీలమన్ మరియు అతని సైన్యం, వారి బాధలను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రార్థనలో తమ ఆత్మలను క్రుమ్మరిస్తూ దేవుడ్ని పిలిచారు. వారు భరోసా, శాంతి, విశ్వాసం మరియు నిరీక్షణను పొందారు, వారు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ధైర్యాన్ని, సంకల్పాన్ని పొందారు.6

ఎర్ర సముద్రం మరియు ఐగుప్తీయులు దాడి చేయడానికి సమీపించడం మధ్య తననుతాను కనుగొన్నప్పుడు మోషే లేదా తన కొడుకు ఇస్సాకును బలి ఇవ్వమనే ఆజ్ఞను పాటించినప్పుడు అబ్రాహాము దేవుడ్ని ఎలా పిలిచి, మొరపెట్టి ఉంటారో ఊహించండి.

పడిపోకుండా ఉండడానికి సమాధానం పిలవడమే అయిన అనుభవాలు మీలో ప్రతీ ఒక్కరు కలిగియున్నారని మరియు కలిగియుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ముప్పై సంవత్సరాల క్రితం, నేను, నా భార్య మా పౌర వివాహానికి మరియు మా దేవాలయ వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు, సమ్మె కారణంగా పౌర వివాహాలు రద్దు చేయబడినట్లు మాకు తెలియజేసే పిలుపు అందుకున్నాము. నిర్ణీత వేడుకకు మూడు రోజుల ముందు మాకు పిలుపు వచ్చింది. ఇతర కార్యాలయాల్లో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మరియు అందుబాటులో ఉన్న నిర్ణీత సమయా‌లను కనుగొనలేకపోయిన తర్వాత, మేము నిజంగా అనుకున్నట్లుగా వివాహం చేసుకోగలమా అనే బాధను మరియు సందేహాన్ని అనుభవించడం ప్రారంభించాము.

కాబోయే నా భార్య మరియు నేను ప్రార్థనలో మా ఆత్మలను దేవునికి క్రుమ్మరిస్తూ “పిలిచాము”. చివరగా, మాకు తెలిసిన వ్యక్తి మేయర్‌గా ఉన్న నగర శివార్లలోని ఒక చిన్న పట్టణంలోని కార్యాలయం గురించి ఎవరో మాకు చెప్పారు. సంకోచించకుండా మేము అతనిని చూడడానికి వెళ్లి, మా వివాహం జరిపించడం సాధ్యమేనా అని అడిగాము. మా ఆనందానికి, అతను అంగీకరించాడు. మేము ఆ నగరంలో ధృవపత్రాన్ని పొందాలని మరియు మరుసటి రోజు మధ్యాహ్నం లోపు అన్ని పత్రాలను అందించాలని అతని కార్యదర్శి మాకు నొక్కి చెప్పారు.

మరుసటి రోజు, మేము ఆ చిన్న పట్టణానికి వెళ్లి, అవసరమైన పత్రాన్ని అభ్యర్థించడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాము. మాకు ఆశ్చర్యం కలిగించే విధంగా, ఆ అధికారి మాకు ఇవ్వనని చెప్పారు, ఎందుకంటే చాలామంది యువ జంటలు ఆ పట్టణంలో రహస్యంగా వివాహం చేసుకోవడానికి వారి కుటుంబాల నుండి పారిపోయారు, కానీ మా పరిస్థితి అలాంటిది కాదు. మళ్ళీ, భయం మరియు విచారం మమ్మల్ని ఆవరించాయి.

పడకుండా ఉండేందుకు నేను నా పరలోక తండ్రిని నిశ్శబ్దంగా ఎలా పిలిచానో నాకు గుర్తుంది. “దేవాలయ సిఫారసు, దేవాలయ సిఫారసు” అని పదే పదే చెబుతూ నా మనసులో స్పష్టమైన ముద్ర పడింది. నేను వెంటనే నా దేవాలయ సిఫారసును తీసి అధికారికి అందజేసినప్పుడు, కాబోయే నా భార్య దిగ్భ్రాంతి చెందింది.

ఆ అధికారి ఇలా చెప్పడం విన్నప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది, “మీరు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నుండి వచ్చారని నాకు ఎందుకు చెప్పలేదు? మీ సంఘము నాకు బాగా తెలుసు.” అతను వెంటనే పత్రాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ అధికారి ఏమీ మాట్లాడకుండా స్టేషన్‌ను విడిచివెళ్లడం మాకు మరింత ఆశ్చర్యం కలిగించింది.

యాభై నిమిషాలు గడిచాయి, అతను తిరిగి రాలేదు. అప్పటికే ఉదయం 11:55 అయ్యింది, కాగితాలు అందజేయడానికి మాకు మధ్యాహ్నం వరకు మాత్రమే సమయం ఉంది. అకస్మాత్తుగా అతను అందమైన కుక్కపిల్లతో ప్రత్యక్షమై, ఇది మీ పెళ్ళి కానుక అని చెప్పి పత్రంతో సహా ఇచ్చాడు.

మా పత్రం మరియు మా కొత్త కుక్కప్లిలతో మేము మేయర్ కార్యాలయం వైపు పరిగెత్తాము. అప్పుడు మా వైపుకు అధికారిక వాహనం రావడం చూసాము. నేను దాని ముందు ఆగిపోయాను. వాహనం ఆగినప్పుడు, లోపల మేము కార్యదర్శిని చూశాము. మమ్మల్ని చూసి, ఆమె ఇలా అన్నది, “నన్ను క్షమించండి, నేను మీకు మధ్యాహ్నం అని చెప్పాను. నేను వేరే పని మీద వెళ్ళాలి.”

మౌనంగా నన్ను నేను తగ్గించుకొని, నా పరలోక తండ్రిని హృదయపూర్వకంగా పిలుస్తూ, “పడిపోకుండా” మరోసారి సహాయం కోరాను. అకస్మాత్తుగా, అద్భుతం జరిగింది. కార్యదర్శి మాతో అంది, “మీ దగ్గర చాలా అందమైన కుక్కపిల్ల ఉంది. నా కొడుకు కోసం అలాంటిది ఎక్కడ దొరుకుతుంది?”

మేము వెంటనే, “ఇది మీ కోసమే” అన్నాము.

కార్యదర్శి ఆశ్చర్యంగా మా వైపు చూసి, “సరే, కార్యాలయానికి వెళ్లి ఏర్పాట్లు చేద్దాం” అంది.

రెండు రోజుల తర్వాత, కారోల్ మరియు నేను అనుకున్న ప్రకారం పౌర వివాహం చేసుకున్నాము, ఆపై మేము లిమా పెరూ దేవాలయంలో ముద్రవేయబడ్డాము.

వాస్తవానికి, పిలుపు అనేది విశ్వాసం మరియు చర్యకు సంబంధించిన విషయం అని—ఆయన అనంతమైన జ్ఞానం ప్రకారం మన ప్రార్థనలకు సమాధానమిచ్చే పరలోక తండ్రి మనకు ఉన్నారని గుర్తించడానికి విశ్వాసం, ఆపై మనం కోరిన దానికి అనుగుణంగా చర్య తీసుకోవడం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థించడం—పిలవడం—మన నిరీక్షణకు చిహ్నం కాగలదు. కానీ ప్రార్థన తర్వాత చర్య తీసుకోవడం అనేది మన విశ్వాసం నిజమైనది అనడానికి సంకేతం—అది బాధ, భయం లేదా నిరాశగల క్షణాల్లో పరీక్షించబడే విశ్వాసం.

మీరు ఈ క్రింది వాటిని పరిగణించాలని నేను సూచిస్తున్నాను:

  1. సహాయం కోసం ఎల్లప్పుడూ ప్రభువును మీ మొదటి ఎంపికగా భావించండి.

  2. పిలవండి, పడిపోకండి. హృదయపూర్వక ప్రార్థనలో దేవుని వైపు తిరగండి.

  3. ప్రార్థన చేసిన తర్వాత, మీరు ప్రార్థించిన ఆశీర్వాదాలను పొందేందుకు మీరు చేయగలిగినదంతా చేయండి.

  4. ఆయన సమయంలో మరియు ఆయన మార్గంలో సమాధానాన్ని అంగీకరించడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి.

  5. ఆగవద్దు! మీరు సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నిబంధన బాటపై ముందుకు సాగండి.

బహుశా ప్రస్తుతం, పరిస్థితుల కారణంగా, తాము పడిపోబోతున్నట్లు భావించి, జోసెఫ్ స్మిత్‌లా ఇలా పిలవాలి అనుకుంటున్నవారు ఉండవచ్చు: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? … ఎంతకాలము నీ హస్తము నిలిచియుండును?”7

ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, “ఆత్మీయ వేగం”తో ప్రార్థించండి,8 ఎందుకంటే మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ వినిపించుకోబడతాయి!

ఈ కీర్తన గుర్తుంచుకోండి:

ఈ ఉదయం మీరు మీ గది నుండి బయలుదేరే ముందు,

మీరు ప్రార్థన చేయాలని అనుకున్నారా?

మన రక్షకుడైన క్రీస్తు నామంలో.

ప్రేమపూర్వకమైన దయ కోసం వేడుకున్నారా

నేడు కవచంగా?

ఓహ్, అలసిన వారికి ప్రార్థన విశ్రాంతినిస్తుంది!

ప్రార్థన రాత్రిని పగలుగా మారుస్తుంది.

కాబట్టి, జీవితం చీకటిగా, దుర్భరంగా మారినప్పుడు,

ప్రార్థన చేయడం మర్చిపోవద్దు.9

మనం ప్రార్థిస్తున్నప్పుడు, మన భారాల నుండి ఉపశమనం కలిగించడానికి తన అద్వితీయ కుమారుడిని పంపిన మన పరలోక తండ్రి ఆలింగనాన్ని మనం అనుభూతి చెందగలము, ఎందుకంటే మనం దేవునికి మొరపెట్టుకుంటే, మనం పడిపోమని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.