సర్వసభ్య సమావేశము
మనము మోర్మన్ గ్రంథమును కలిగియుండుట ప్రభువునందు వివేకమైయున్నది
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మనము మోర్మన్ గ్రంథమును కలిగియుండుట ప్రభువునందు వివేకమైయున్నది

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథాన్ని చదవడం మనలో ప్రతి ఒక్కరికీ ఆనందం మరియు దీవెనకరం కావాలని నా ప్రార్థన.

ప్రియమైన సహోదర సహోదరీలారా, రండి, నన్ను అనుసరించండి ద్వారా లేఖనాలను చదవడంలో మీ ప్రయత్నాలకు మేము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. మీరు చేస్తున్న వాటన్నింటికీ ధన్యవాదాలు. దేవునితో మరియు ఆయన వాక్యముతో మీ రోజువారీ అనుబంధం గొప్ప ఫలితాలను కలిగి ఉంటుంది. “మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. మరియు చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును.”1

లేఖనాలలోని రక్షకుని బోధనలను చదవడం మన గృహాలను విశ్వాసము యొక్క పవిత్ర స్థలాలుగా మరియు సువార్త శిక్షణా కేంద్రాలుగా మార్చడంలో సహాయపడుతుంది.2 ఇది మన గృహాలలోకి ఆత్మను ఆహ్వానిస్తుంది. పరిశుద్ధాత్మ మన ఆత్మలను సంతోషముతో నింపుతుంది3 మరియు మనలను యేసు క్రీస్తు యొక్క జీవితకాలపు శిష్యులుగా మారుస్తుంది.

ఈ గత కొన్ని సంవత్సరాలుగా, పరిశుద్ధ లేఖన గ్రంథాలను చదువుతున్నప్పుడు, అన్ని ప్రధాన సువార్త యుగములలో ఆయన పిల్లలకు దేవుడు చేసిన బోధనల సమగృ దృశ్యాలను గమనించాము.4

ప్రతీ యుగములో, మనకు పరిచయమైన మాదిరిని చూస్తున్నాము. దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసు క్రీస్తు సువార్తను పునఃస్థాపిస్తారు లేదా బయలుపరుస్తారు. ప్రజలు ప్రవక్తలను అనుసరిస్తారు మరియు గొప్పగా దీవించబడతారు. అయితే, కాలక్రమేణా కొంతమంది ప్రవక్తల మాటలను లక్ష్యపెట్టడం మానేసి, ప్రభువు మరియు ఆయన సువార్త నుండి తమను తాము దూరం చేసుకుంటున్నారు. దీనినే మనం విశ్వాసభ్రష్టత్వము అంటాము. సువార్త మొదట ఆదాముకు బయలుపరచబడింది, అయితే ఆదాము మరియు హవ్వల పిల్లలలో కొందరు విశ్వాసభ్రష్టత్వముతో ప్రభువుకు దూరమయ్యారు.5 హనోకు, నోవహు, అబ్రాహాము, మోషే మరియు ఇతరుల యుగంలో పునఃస్థాపన మరియు విశ్వాసభ్రష్టత్వము యొక్క నమూనా పునరావృతం కావడం మనం చూస్తాము.

ఈ రోజు మనం కాలముల సంపూర్ణ యుగములో జీవిస్తున్నాము.6 విశ్వాసభ్రష్టత్వముతో ముగింపబడని ఏకైక యుగము ఇదే.7 ఈ యుగమే రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడ మరియు ఆయన వెయ్యేళ్ల పాలనను ప్రవేశపెడుతుంది.

ఈ యుగములో భిన్నమైనది ఏమిటి? రక్షకుని దగ్గరకు రావడానికి మరియు ఆయనను ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండటానికి మనకు సహాయపడేలా ప్రత్యేకించి మన కాలానికి ఈరోజు ప్రభువు ఏమి అందించారు?

నాకు గుర్తుకు వచ్చే ఒక సమాధానం లేఖనాలు—ముఖ్యంగా మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన.

మరొక సాధారణ విశ్వాసభ్రష్టత్వము ఎన్నటికీ ఉండదని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ, వ్యక్తిగత విశ్వాసభ్రష్టత్వమును నివారించడానికి మనం లక్ష్యముంచాలి మరియు జాగ్రత్త వహించాలి—అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, “మనలో ప్రతీఒక్కరు మన వ్యక్తిగత ఆత్మీయ వృద్ధి కొరకు బాధ్యత కలిగియున్నారు.”8 మనం ఈ సంవత్సరం చేస్తున్నట్లుగా, మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం, ఎల్లప్పుడూ మనల్ని రక్షకునికి దగ్గరగా తీసుకువస్తుంది—మరియు ఆయనకు దగ్గరగా ఉండేందుకు మనకు సహాయపడుతుంది.

మనము దానిని “అధ్యయనం” అని పిలుస్తాము మరియు అది కృషిని సూచిస్తుంది కాబట్టి అది మంచిది. కానీ మనం ఎల్లప్పుడూ కొంత కొత్త వాస్తవాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ఈ రోజు దేవునితో అనుసంధానించబడడం—ఆత్మను పోషించడం, ప్రపంచాన్ని ఎదుర్కోనే ముందు ఆధ్యాత్మికంగా బలోపేతం చేయబడడం లేదా ప్రపంచంలో ఒక దుర్భరమైన రోజు తర్వాత స్వస్థత పొందడం అనే అనుభూతిని కలిగిస్తుంది.

మనము లేఖనాలను అధ్యయనం చేస్తాము, కాబట్టి గొప్ప బోధకుడైన పరిశుద్ధాత్మ మన పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకి మనం పరివర్తన చెందడాన్ని మరింత హెచ్చించగలడు మరియు వారి వలే మారడానికి మనకు సహాయం చేయగలడు.9

ఈ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని, “ఈ వారం మనం మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు ఏమి బోధించాడు?” మరియు “ఇది మనల్ని రక్షకునికి ఎలా దగ్గర చేస్తుంది?” అని మనం ఆలోచించవచ్చు.

గృహమందు మన లేఖన అధ్యయనానికి ఇవి మంచి ప్రశ్నలు. సంఘములో ఆదివారం తరగతిని ప్రారంభించడానికి అవి అద్భుతమైన ప్రశ్నలు. మనము వారంలో గృహమందు మన అభ్యాసాన్ని మెరుగుపరచడం ద్వారా ఆదివారం సంఘములో మన బోధనను మెరుగుపరుస్తాము. కాబట్టి, మన ఆదివారం తరగతులలో, “ప్రకటించువాడును, పొందువాడును ఒకరినొకరు అర్థము చేసుకొందురు మరియు ఇరువురు ఆత్మీయాభివృద్ధిని పొంది, కలిసి ఆనందించెదరు.”10

ఈ వారం మోర్మన్ గ్రంథ అధ్యయనం నుండి ఆత్మ నా మనస్సుపై ముద్రవేసిన కొన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయి:

  • నీఫై జేకబ్‌కు ఇలా ఉపదేశించాడు, “ఈ పలకలను భద్రపరచి … తరతరములకు వాటిని అందజేయవలెను. మరియు ఒకవేళ పవిత్రమైన బోధన లేదా ప్రకటన లేదా ప్రవచనము ఏదైనా ఉన్న యెడల,” జేకబ్ “ [వారి] జనుల నిమిత్తము వాటిని … ఈ పలకలపై చెక్కవలెను.”11

  • తరువాత జేకబ్ ఇలా సాక్ష్యమిచ్చాడు, “మేము [లేఖనాలను] పరిశోధించుచున్నాము, … మరియు ఈ సాక్ష్యములన్నిటినీ కలిగియుండి మేము ఒక నిరీక్షణను పొందితిమి మరియు మా విశ్వాసము నిశ్చలమాయెను.”12

ఇప్పుడు ఈ వచనాలు ఇత్తడి పలకల గురించి నీఫై ఇంతకు ముందు చెప్పినదానిని నేను గుర్తు చేసుకొనేలా చేసాయి:

“వృత్తాంతములను మేము సంపాదించి … వాటిని పరిశోధించి, అవి కోరదగినవని కనుగొంటిమి … అంతేకాక అవి మాకు అత్యంత విలువైనవి, ఏలయనగా మేము వాటి ద్వారా మా పిల్లల కొరకు ప్రభువు ఆజ్ఞలను భద్రపరచగలము.

“అందువలన, అరణ్యములో వాగ్దానదేశము వైపు ప్రయాణము చేయుచుండగా, వాటిని మాతో తీసుకొనిపోవుట ప్రభువు నందు వివేకమైయుండెను.”13

ఇప్పుడు, లీహైకి మరియు అతని కుటుంబానికి లేఖనాలు కలిగి ఉండడం వివేకమైతే, అది మనకు కూడా ఈరోజు అంతే వివేకవంతమైనది. లేఖనాలలోని గొప్ప విలువ మరియు ఆత్మీయ శక్తి నేటికీ మన జీవితాల్లో విలువైనదిగా ఉండుట కొనసాగుతోంది.

ఈరోజు మనం ఆనందిస్తున్న మోర్మన్ గ్రంథము మరియు ఇతర గ్రంథాలకు ప్రవేశము ఉన్న వ్యక్తులు చరిత్రలో ఎన్నడూ లేరు.14 అవును, లీహై మరియు అతని కుటుంబం ఇత్తడి పలకలను తమతో తీసుకువెళ్లే ఆశీర్వాదం పొందారు, కానీ ప్రతి గుడారానికి ఇవ్వటానికి వారి వద్ద ఒక ప్రతి లేదు! మోర్మన్ గ్రంథము యొక్క అతి ముఖ్యమైన ప్రతి మన స్వంత ప్రతి. అది మనం చదివే ప్రతి.

లీహై యొక్క జీవవృక్ష దర్శనమందు, దేవుని ప్రేమతో వ్యక్తిగత అనుభవం యొక్క ప్రాముఖ్యతను లీహై మనకు బోధించాడు. అతను ఫలము తీసుకున్న తర్వాత, లీహై తన భార్య శరయ మరియు అతని కుమారులు నీఫై మరియు శామ్‌లను కొంచెం దూరంలో చూశాడు.

“వారు ఎటు పోవలెనో తెలియనట్లు నిలబడిరి”.

లీహై ఇలా చెప్పాడు, “… నేను వారికి సైగ చేసితిని మరియు వారు నా యొద్దకు రావలెనని, సమస్త ఫలముల కంటే కోరదగిన ఆ ఫలమును తినవలెనని బిగ్గరగా వారితో చెప్పితిని”.

“మరియు … వారు నా యొద్దకు వచ్చి, ఆ ఫలమును తినిరి.”15

ఉద్దేశపూర్వకమైన తల్లిదండ్రుల పెంపకానికి లీహై ఉదాహరణను నేను ఇష్టపడుతున్నాను. శరయ, నీఫై మరియు శామ్ మంచి, నీతివంతమైన జీవితాలను గడుపుతున్నారు. కానీ ప్రభువు వారి కొరకు ఇంకా మంచిది, మధురమైనది ఏదో కలిగి ఉన్నారు. దానిని ఎక్కడ కనుగొనాలో వారికి తెలియదు, కానీ లీహైకి తెలుసు. కాబట్టి, జీవవృక్షం వద్దకు వచ్చి వారికై వారు ఆ ఫలమును తినవలెనని అతడు “బిగ్గరగా” వారిని పిలిచాడు. అతని మార్గనిర్దేశం స్పష్టంగా ఉంది. అక్కడ ఎలాంటి అపార్థం ఉండకపోవచ్చు.

నేనూ ఇదే విధమైన ఉద్దేశ్యపూర్వకమైన తల్లిదండ్రుల పెంపకం యొక్క ఫలితాన్ని.16 నేను చిన్న పిల్లవాడిగా, బహుశా 11 లేదా 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, మా అమ్మ నన్ను ఇలా అడిగింది, “మార్కు సువార్త నిజమని పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలుసా?”

ఆమె ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఎప్పుడూ “మంచి అబ్బాయిగా“ ఉండటానికి ప్రయత్నించాను, మరియు అది సరిపోతుందని నేను అనుకున్నాను. కానీ లీహై లాగా, ఇంకేదో అవసరమని మా అమ్మకు తెలుసు. నేను చర్య తీసుకోవాలి మరియు నాకై నేను తెలుసుకోవాలి.

నాకు ఇంకా ఆ అనుభవం కలగలేదని బదులిచ్చాను. మరియు నా సమాధానానికి ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోలేదు.

ఆ తర్వాత ఆమె నేనెన్నడూ మరిచిపోలేని విషయం చెప్పింది. ఈరోజు వరకు ఆమె మాటలు నాకు గుర్తున్నాయి: “పరలోక తండ్రి నీకై నీవు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే నీవు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. నీవు మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి మరియు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలని ప్రార్థించాలి. పరలోక తండ్రి నీ ప్రార్థనలకు జవాబిస్తారు.”

సరే, నేను ఇంతకు ముందు ఎప్పుడూ మోర్మన్ గ్రంథాన్ని చదవలేదు. అలా చేసేంత వయసు నాకు వచ్చిందని నేను అనుకోలేదు. కానీ మా అమ్మకి బాగా తెలుసు.

ఆమె ప్రశ్న నేనే తెలుసుకోవాలనే కోరికను నాలో రేకెత్తించింది.

అయితే, ప్రతీ రాత్రి, నేను నా ఇద్దరు సోదరులతో కలిసి పంచుకున్న పడక గదిలో, నా మంచం పైన ఉన్న లైటు వేసి, మోర్మన్ గ్రంథములోని ఒక్కో అధ్యాయాన్ని చదివేవాడిని. ఆ తర్వాత, లైటు ఆపివేసి, నేను నా మంచం దిగి మోకాళ్లపై ప్రార్థించేవాడిని. నేను మునుపెన్నడూ లేని విధముగా మరింత హృదయపూర్వకంగా మరియు గొప్ప కోరికతో ప్రార్థించాను. మోర్మన్ గ్రంథము యొక్క సత్యాన్ని దయచేసి నాకు తెలియజేయమని నేను పరలోక తండ్రిని అడిగాను.

నేను మోర్మన్ గ్రంథము చదవడం ప్రారంభించినప్పటి నుండి, నా ప్రయత్నాల గురించి పరలోక తండ్రికి తెలుసునని నేను భావించాను. మరియు నేను ఆయనకు ముఖ్యమని నేను భావించాను. నేను చదివి ప్రార్థిస్తున్నప్పుడు, ఆదరణీయమైన, శాంతియుత భావాలు నాపైకి వచ్చాయి. అధ్యాయాల వారీగా, విశ్వాసం యొక్క కాంతి నా ఆత్మలోపల ప్రకాశవంతంగా పెరుగుతూ వచ్చింది. కాలక్రమేణా, ఈ భావాలు పరిశుద్ధాత్మ నుండి వచ్చిన సత్యము యొక్క నిర్ధారణలని నేను గ్రహించాను.17 మోర్మన్ గ్రంథము సత్యమని మరియు యేసు క్రీస్తు లోక రక్షకుడని నేను స్వయంగా తెలుసుకున్నాను. నా తల్లి ప్రేరేపిత ఆహ్వానానికి నేనెంతో కృతజ్ఞుడిని.

బాలుడిగా మోర్మన్ గ్రంథాన్ని చదివిన ఈ అనుభవం, ఒక పద్ధతి ప్రకారం లేఖన అధ్యయనం ప్రారంభించేలా చేసింది, అది ఈనాటికీ నన్ను ఆశీర్వదిస్తూనే ఉంది. నేను ఇప్పటికీ మోర్మన్ గ్రంథాన్ని చదువుతాను మరియు ప్రార్థనలో మోకరిస్తాను. మరియు పరిశుద్ధాత్మ దాని సత్యాలను పదే పదే నిర్ధారిస్తాడు.

నీఫై సరిగ్గా చెప్పాడు. మన జీవితాలంతటా లేఖనాలను మనతో పాటు తీసుకెళ్లడం ప్రభువునందు వివేకమైయున్నది. మోర్మన్ గ్రంథము అనేది “ప్రధానరాయి,” అది ఈ యుగమును మునుపటి యుగములన్నిటి నుండి ప్రత్యేకమైనదిగా చేస్తుంది. మనం మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసి, జీవించియున్న ప్రవక్తను అనుసరిస్తున్నప్పుడు, మన జీవితాల్లో వ్యక్తిగత విశ్వాసభ్రష్టత్వము ఉండదు.18

దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవవృక్షం వద్దకు రావాలనే ఆహ్వానం కేవలం లీహై నుండి అతని కుటుంబానికి మాత్రమే వచ్చిన ఆహ్వానం కాదు మరియు మోర్మన్ గ్రంథాన్ని చదివి ప్రార్థించమని మా అమ్మ నుండి నాకు మాత్రమే వచ్చిన ఆహ్వానం కాదు. అది మన ప్రవక్త, అద్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి మనలో ప్రతి ఒక్కరికీ వచ్చిన ఆహ్వానం.

“మీరు ప్రతిరోజూ ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మీరు ప్రతిరోజూ— మంచి నిర్ణయాలను తీసుకుంటారు. మీరు అధ్యయనం చేసిన దానిని ధ్యానించినప్పుడు పరలోకపు వాకిండ్లు విప్పబడతాయని, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు పొందుతారని నేను వాగ్దానం చేస్తున్నాను.”19

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథాన్ని చదవడం మనలో ప్రతి ఒక్కరికీ ఆనందం మరియు దీవెనకరం కావాలని మరియు మనల్ని రక్షకుని దగ్గరకు చేర్చాలని నా ప్రార్థన.

పరలోక తండ్రి జీవిస్తున్నారు. యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడు. మోర్మన్ గ్రంథము ఆయన మాటలను కలిగియుంది మరియు ఆయన ప్రేమను తెలియజేస్తుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ రోజు భూమిపైన ప్రభువు యొక్క సజీవ ప్రవక్త. పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారించే సాక్ష్యము కారణంగా ఈ విషయాలు నిజమని నాకు తెలుసు, బాలుడిగా మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను మొదట అందుకున్న సాక్ష్యమిది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33.

  2. “కొత్త గృహ-కేంద్రీకృత, సంఘ-సహకార సమగ్ర పాఠ్యాంశాలు ప్రతీ కుటుంబము వారి గృహాన్ని విశ్వాసము యొక్క పవిత్ర స్థలముగా మార్చుకోవడానికి న్యాయముగా మరియు జాగ్రత్తగా అనుసరించినప్పుడు, “కుటుంబాల యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించే సాధ్యతను కలిగియున్నాయి సువార్త అభ్యాసానికి కేంద్రంగా మీరు మీ ఇంటిని మార్చడానికి శ్రద్ధగా పని చేసినప్పుడు, కొంతకాలానికి మీ విశ్రాంతి దినములు నిజంగా సంతోషభరితమవుతాయని నేను వాగ్దానమిస్తున్నాను. మీ పిల్లలు రక్షకుని బోధనలను నేర్చుకోవడానికి, జీవించడానికి ఆరాటపడతారు మరియు మీ జీవితంలో, మీ ఇంటిలో అపవాది ప్రభావము తగ్గుతుంది. మీ కుటుంబములో మార్పులు నాటకీయంగా మరియు ఆమోదయోగ్యంగా ఉంటాయి” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆదర్శవంతమైన కడవరి దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113).

  3. “నా ఆత్మను నీకిచ్చెదను, అది నీ మనస్సును వెలిగించి, నీ ఆత్మను సంతోషముతో నింపునని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13).

  4. యుగాలు అనగా ప్రభువు భూమిపై “పరిశుద్ధ యాజకత్వము మరియు తాళపుచెవులను కలిగి ఉన్న మరియు భూనివాసులకు సువార్తను అందించడానికి ఒక దైవిక నియామకాన్ని కలిగి ఉన్నకనీసం ఒక అధీకృత సేవకుడిని కలిగి ఉన్న కాలవ్యవధులు” (Topics and Questions, “Dispensations,” Gospel Library).

  5. మోషే 5:12–16 చూడండి.

  6. ప్రవక్త అయిన దానియేలు నెబుకద్నెజరు యొక్క కలను వివరించినప్పుడు మన కాలాన్ని, మన యుగాన్ని అతడు చూశాడు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఆ కలలోని రాయి, పర్వతం నుండి చేతులు లేకుండా కత్తిరించబడింది, మొత్తం భూమిని నింపడానికి ముందుకు దూసుకుపోతోంది. (దానియేలు 2:34–35, 44–45; సిద్ధాంతము మరియు నిబంధనలు 65:2 చూడండి).

  7. “తండ్రి అయిన దేవుడు మరియు యేసు క్రీస్తు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను ఈ యుగానికి ప్రవక్తగా ఉండమని పిలుపునిచ్చారు అతని ద్వారా మునుపటి యుగాలలోని అన్ని దైవిక శక్తులు పునఃస్థాపించబడ్డాయి. ఈ కాలముల సంపూర్ణ యుగము కాలానికి లేదా ప్రదేశానికి పరిమితం కాదు. ఇది విశ్వాసభ్రష్టత్వముతో ముగియదు మరియు ఇది ప్రపంచాన్ని నింపుతుంది” (Russell M. Nelson, “The Gathering of Scattered Israel,” Liahona, Nov. 2006, 79–80).

  8. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రారంభ వ్యాఖ్యలు,” లియహోనా, నవ. 2018, 8.

  9. పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024, v చూడండి.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 50:22; 17–21 వచనములు కూడా చూడండి.

  11. జేకబ్ 1:3–4.

  12. జేకబ్ 4:6.

  13. 1 నీఫై 5:21–22.

  14. ఈ పంపిణీలో మోర్మన్ గ్రంథము యొక్క 200 మిలియన్ కాపీలు పంపిణీ చేయబడినట్లు ఇటీవల ప్రకటించబడింది. అది నిజంగా విశేషమైనది. మోర్మన్ గ్రంథము ఇప్పుడు 113 భాషల్లోకి అనువదించబడింది, 17 కొత్త అనువాదాలు ప్రక్రియలో ఉన్నాయి. ప్రింట్, డిజిటల్, ఆడియో, వీడియో మరియు ఇతర ఫార్మాట్‌లలో మోర్మన్ గ్రంథమును కలిగి ఉండటం ఎంతటి ఆశీర్వాదం. (See Ryan Jensen, “Church Distributes 200 Millionth Copy of the Book of Mormon,” Church News, Dec. 29, 2023, thechurchnews.com.)

  15. 1 నీఫై 8:14–16; వివరణ చేర్చబడింది.

  16. “ఒక బిడ్డ యొక్క జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆత్మీయ ప్రభావము ఏదనగా, వారి స్వంత పరిశుద్ధ నిబంధనలను విశ్వాసంగా పాటించే ప్రేమగల తల్లిదండ్రులు మరియు తాత, మామ్మల నీతిగల మాదిరి. ఉద్దేశపూర్వకమైన తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమును బోధిస్తారు, ఆవిధంగా వారు కూడా “వారి పాప పరిహారము కొరకు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకుంటారు.” [2 నీఫై 25:26]. క్రమబద్ధం కాని మరియు ఏకరీతిగా లేని విధంగా నిబంధనలను పాటించడం ఆత్మీయ ప్రమాదానికి దారితీస్తుంది. ఆత్మీయ నష్టము తరచుగా మన పిల్లలు మరియు మనుమలపై అత్యధికంగా ఉంటుంది” (కెవిన్ డబ్ల్యు. పియర్సన్, “మీరు ఇంకా సమ్మతిస్తున్నారా?,” లియహోనా, నవ. 2022, 69).

  17. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22-24 చూడండి.

  18. ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇట్లనెను: “నేను సహోదరులకు మోర్మన్‌ గ్రంథము భూమిపైయున్న మరేయితర గ్రంథము కన్నను మిక్కిలి ఖచ్చితమైనదని, మన మతము యొక్క ప్రధాన రాయి అని మరియు ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని చెప్పియున్నాను” (మోర్మన్ గ్రంథ పీఠికలో).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?”, లియహోనా, నవ. 2017, 62–63.