సర్వసభ్య సమావేశము
లెమ్ము! ఆయన నిన్ను పిలుచుచున్నాడు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


లెమ్ము! ఆయన నిన్ను పిలుచుచున్నాడు

సువార్త అనేది మన సవాళ్లను మరియు సమస్యలను నివారించడానికి ఒక మార్గం కాదు, కానీ మన విశ్వాసాన్ని పెంచడానికి మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఒక పరిష్కారం.

కొంత కాలం క్రితం నేను నా భార్యను ఇలా అడిగాను, “నాకు గుర్తున్నంత వరకు, మన జీవితంలో పెద్దగా సమస్యలు ఎందుకు లేవో నీవు చెప్పగలవా?”

ఆమె నా వైపు చూసి, “అలాగే! అంది. మనకు పెద్దగా సమస్యలు ఎందుకు లేవో నేను మీకు చెప్తాను; ఎందుకంటే మీకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ కాబట్టి!” అని చెప్పింది.

చురుకైన మరియు తెలివైన ఆమె సమాధానం, యేసు క్రీస్తు సువార్తను జీవించడం వలన మనం ఎదగటానికి అవసరమైన బాధలు మరియు శోధనలు తొలగింపబడవని నాకు మరోసారి అర్థమయ్యేలా చేసింది.

సువార్త అనేది మన సవాళ్లను మరియు సమస్యలను నివారించడానికి ఒక మార్గం కాదు, కానీ మన విశ్వాసాన్ని పెంచడానికి మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఒక పరిష్కారం.

కొన్ని నెలల క్రితం, ఒక రోజు నడుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా చూపు మసకగా, చీకటిగా మరియు అలలుగా మారినప్పుడు ఈ సత్యాన్ని నేను గ్రహించాను. నేను భయపడ్డాను. అప్పుడు, వైద్యులు నాకు ఇలా చెప్పారు, “మీరు వెంటనే చికిత్స ప్రారంభించకపోతే, కొన్ని వారాల వ్యవధిలోనే మీరు మీ దృష్టిని కోల్పోవచ్చు. నేను మరింత భయపడ్డాను.

ఆపై, వారు ఇలా అన్నారు, “మీకు ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు చెయ్యాలి—మీ జీవితాంతం, ప్రతి నాలుగు వారాలకు ఒకసారి—విస్తృతంగా తెరచి వున్న కంటిలోనే ఇంజెక్షన్లు ఇవ్వాలి.”

అది ఒక అసౌకర్యమైన మేల్కొలుపు.

అప్పుడు ప్రశ్న రూపంలో ఒక ఆలోచన వచ్చింది. నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను, “సరే నా భౌతిక దృష్టి బాగా లేదు, కానీ నా ఆత్మీయ దృష్టి సంగతేమిటి? నాకు అక్కడ ఏదైనా చికిత్స అవసరమా? స్పష్టమైన ఆత్మీయ దృష్టిని కలిగియుండటం అంటే ఏమిటి?”

మార్కు సువార్తలో వివరించబడిన బర్తిమయి అనే ఒక గ్రుడ్డి వాని కథ గురించి నేను లోతుగా ఆలోచించాను. లేఖనము ఇలా వివరిస్తుంది, “ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.”1

సాంకేతికంగా, చాలా మంది దృష్టిలో, యేసు కేవలం యోసేపు కుమారుడు, అయితే బర్తిమయి ఆయనను “దావీదు కుమారుడా” అని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే దావీదు వంశమందు జన్మిస్తాడని ప్రవచించబడిన యేసు నిజంగా మెస్సీయ అని అతను గుర్తించాడు.2

శారీరక దృష్టి లేని ఈ గ్రుడ్డివాడు యేసును గుర్తించడం ఆసక్తికరమైనది. శారీరకంగా చూడలేని వాటిని అతడు ఆత్మీయంగా చూశాడు, అయితే అనేకమంది యేసును శారీరకంగా చూడగలిగారు, కానీ ఆత్మీయంగా పూర్తి అంధులుగా ఉన్నారు.

ఈ కథ నుండి మనం స్పష్టమైన ఆత్మీయ దృష్టి గురించి ఎక్కువగా నేర్చుకుంటాము.

“ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను”3 అని మనము చదివాము.

అతని చుట్టూ ఉన్నవాళ్ళందరూ వానిని నిశ్శబ్దంగా ఊరకుండుమని గద్దించారు, కానీ అతనికి నిజంగా యేసు ఎవరో తెలుసు కాబట్టి అతను మరి ఎక్కువగా కేకలువేశాడు. అతడు ఆ స్వరాలను పట్టించుకోకుండా మరింత గట్టిగా కేకలు వేసాడు.

నిర్వహించబడకుండా అతడు తనను తాను నిర్వహించుకున్నాడు. అతడికి పరిమితమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అతడు తన పరిమితులను అధిగమించడానికి తన విశ్వాసాన్ని ఉపయోగించాడు.

కాబట్టి, మనం నేర్చుకునే మొదటి సూత్రం ఏమిటంటే, మనం యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు స్పష్టమైన ఆత్మీయ దృష్టిని నిలుపుకుంటాము మరియు మనకు నిజమని తెలిసిన వాటియందు యథార్థముగా ఉంటాము.

సహోదర సహోదరీలారా, మన ఆత్మీయ దృష్టి చెక్కుచెదరకుండా ఉండాలంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచపు స్వరాలను వినకూడదని మనం నిర్ణయించుకోవాలి. కలవరపరిచే మరియు గందరగోళంగా ఉన్న ఈ ప్రపంచంలో, మనం మనకు తెలిసిన దానిపట్ల విశ్వాసంగా నిలిచి ఉండాలి, మన నిబంధనలకు విశ్వాసపాత్రంగా ఉండాలి, ఆజ్ఞలను పాటించడంలో విశ్వాసపాత్రంగా ఉండాలి మరియు ఈ వ్యక్తి చేసినట్లుగా మరింత దృఢంగా ఉండాలి, మన నమ్మకాలను పునరుద్ఘాటించాలి. ప్రభువును గూర్చిన మన సాక్ష్యాన్ని ఈ ప్రపంచానికి మనం మరింత బిగ్గరగా కేకలువేసి చెప్పాలి. ఈ వ్యక్తికి యేసు తెలుసు, అతడు తాను నమ్మిన దానిపట్ల విశ్వాసంగా ఉన్నాడు మరియు అతని చుట్టూ ఉన్న స్వరాల చేత పరధ్యానంలో పడలేదు.

యేసు క్రీస్తు శిష్యులుగానున్న మన స్వరాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న అనేక స్వరాలు నేడు ఉన్నాయి. ఈ ప్రపంచంలోని స్వరాలు మనల్ని నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, అందుకే మనం రక్షకుని గురించిన మన సాక్ష్యాన్ని గట్టిగా, మరింత దృఢంగా ప్రకటించాలి. ప్రభువు మన సాక్ష్యాలను ప్రకటించాలని, మన స్వరాన్ని పెంచాలని మరియు మన స్వరం ఆయన స్వరం కావాలని, ప్రపంచంలోని అన్ని స్వరాల మధ్య, మీపై, నాపై ఆధారపడుతున్నారు. మనం దానిని చేయకపోతే, యేసు క్రీస్తును గురించి ఎవరు సాక్ష్యమిస్తారు? ఆయన నామములో ఎవరు మాట్లాడతారు, ఆయన దైవిక నియమిత కార్యమును ఎవరు ప్రకటిస్తారు?

యేసు క్రీస్తు గురించి మనకున్న జ్ఞానం నుండి వచ్చిన ఆత్మీయ బాధ్యతను మనం కలిగియున్నాము.

అయితే ఆ తర్వాత బర్తిమయి ఏం చేశాడు?

లెమ్మని చెప్పిన ప్రభువు ఆజ్ఞ ప్రకారం, అతను మళ్లీ విశ్వాసంతో ప్రవర్తించాడు.

లేఖనము ఇలా వివరిస్తుంది, “అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.”4

వినయముగల మరియు నమ్మకమైన ఈ వ్యక్తి యేసు ఆజ్ఞ ప్రకారం తాను మెరుగైన జీవితాన్ని పొందగలడని అర్థం చేసుకున్నాడు. అతడు తన పరిస్థితుల కంటే మెరుగ్గా ఉన్నాడని అతనికి తెలుసు మరియు యేసు తనను పిలవడం విన్నప్పుడు అతను చేసిన మొదటి పని, తన బిచ్చగాడి బట్టను విసిరివేయడం.

మళ్ళీ, నిర్వహించబడకుండా అతడు తనను తాను నిర్వహించుకున్నాడు.

అతడు ఇలా అనుకునియుండవచ్చు, “యేసు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చాడు, కాబట్టి నాకిది అవసరం లేదు. ఇది ఒక నూతన దినము. నేను ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని ముగించాను. యేసుతో నేను ఆయనలో, ఆయనతో, ఆయన ద్వారా సంతోషం మరియు ఆనందంతో కూడిన కొత్త జీవితాన్ని ప్రారంభించగలను. మరియు ప్రపంచం నా గురించి ఏమనుకుంటుందో నేను పట్టించుకోను. యేసు నన్ను పిలుస్తున్నారు మరియు ఒక నూతన జీవితాన్ని జీవించడానికి ఆయన నాకు సహాయం చేస్తారు.”

ఎంత విశేషమైన మార్పు!

అతడు తాను బిచ్చమెత్తిన బట్టను విసిరేయడంతో, అతను అన్ని సాకులను వదిలించుకున్నాడు.

మరియు ఇది రెండవ సూత్రం: మనం ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి, పశ్చాత్తాపపడి, క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు, స్పష్టమైన ఆధ్యాత్మిక దృష్టిని కలిగియుంటాము.

యేసు క్రీస్తు ద్వారా మెరుగైన జీవితంలోకి ఎదిగేలా నిబంధనలను కలిగియుండటం మరియు పాటించటం దీన్ని చేయడానికి మార్గం.

మన గురించి మనం జాలిపడటానికి, మన పరిస్థితులకు, సమస్యలకు, మరియు మన జీవితంలో జరుగుతున్న అన్ని చెడు విషయాలకు మరియు మనల్ని విచారానికి గురి చేస్తున్నారని మనం అనుకునేచెడ్డ వ్యక్తులందరి గురించి కూడా చింతించడానికి సాకులు చెప్పినంత కాలం, మనం బిచ్చమిత్తే బట్టను మన భూజాలపై ఉంచుకుంటాము. ఒక్కోసారి మనుషులు స్పృహతో ఉన్నా, లేకున్నా, మనల్ని బాధపెడతారన్నది నిజం. ఆయన మనల్ని స్వస్థపరచగలడని మరియు స్వస్థపరుస్తాడని తెలుసుకుని, మన సాకులు లేదా పాపాలను దాచిపెట్టే మన మానసిక మరియు భావోద్వేగ బట్టను తీసివేయడం ద్వారా మరియు దానిని విసిరివేయడం ద్వారా క్రీస్తునందు విశ్వాసంతో నిర్వహించుకోవడానికి నిర్ణయించుకోవాలి.

“కొన్ని దురదృష్టకరమైన మరియు అసహ్యకరమైన పరిస్థితుల కారణంగా నేను ఈవిధంగా ఉన్నాను. నేను మారలేను మరియు నేను సమర్థించుకుంటున్నాను,” అని చెప్పటం ఎప్పటికీ ఒక మంచి సాకు కాదు.

మనం ఆవిధంగా ఆలోచించినప్పుడు, మనం నిర్వహించబడడానికి నిర్ణయిస్తాము.

మనము బిచ్చగాడి బట్టను కలిగియుంటాము.

విశ్వాసంతో ప్రవర్తించడం అంటే మన రక్షకునిపై ఆధారపడడం, ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం అన్నింటికంటే పైకి లేవగలమని నమ్మడం.

మూడవ సూత్రం చివరి నాలుగు పదాలలో ఉంది: “[అతను] యేసునొద్దకు వచ్చెను.”

అతను గ్రుడ్డివాడు కదా యేసునొద్దకు ఎలా వెళ్ళగలిగాడు? యేసు స్వరం విని ఆయన వైపు నడవడమే ఏకైక మార్గం.

మరియు ఇది మూడవ సూత్రం: మనం ప్రభువు యొక్క స్వరాన్ని విన్నప్పుడు మరియు మనల్ని నడిపించేందుకు ఆయనను అనుమతించినప్పుడు మనం స్పష్టమైన ఆత్మీయ దృష్టిని కలిగియుంటాము.

ఈ వ్యక్తి తన చుట్టూ ఉన్న స్వరాలకు పైగా తన స్వరాన్ని పెంచినట్లే, అతను అన్ని ఇతర స్వరాల మధ్యలో ప్రభువు స్వరాన్ని వినగలిగాడు.

తన ఆత్మీయ దృష్టిని ప్రభువుపై నిలిపి, తన చుట్టూ ఉన్న గాలులచే పరధ్యానం చెందకుండా వున్నంతవరకు ఇదే విశ్వాసం నీళ్లపై నడవడానికి పేతురును అనుమతించింది.

అప్పుడు “వెంటనే వాడు త్రోవను యేసువెంట చూపుపొంది వెళ్లెను”5 అనే మాటలతో ఈ గ్రుడ్డివాని కథ ముగుస్తుంది.

ఈ కథలోని ముఖ్యమైన పాఠాలలో ఒకటి ఏమిటంటే, ఈ వ్యక్తి యేసు క్రీస్తునందు నిజమైన విశ్వాసం చూపాడు మరియు ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు, ఎందుకంటే అతను నిజమైన ఉద్దేశ్యంతో, ఆయనను అనుసరించాలనే నిజమైన ఉద్దేశ్యంతో అడిగాడు.

మన జీవితంలో మనం పొందే దీవెనలకు ఇదే అంతిమ కారణం, అంటే యేసు క్రీస్తును అనుసరించడం. ఇదంతా ఆయనను గుర్తించడం, ఆయన కారణంగా దేవునితో నిబంధనలు చేయడం మరియు పాటించటం, ఆయన ద్వారా మన స్వభావాన్ని మార్చుకోవడం మరియు ఆయనను అనుసరించడం ద్వారా అంతము వరకు సహించడం గూర్చినది.

నాకైతే, స్పష్టమైన ఆత్మీయ దృష్టిని కలిగియుండడం అనేది పూర్తిగా యేసు క్రీస్తుపై దృష్టిసారించడానికి సంబంధించినది.

కాబట్టి, నేను నా కంటికి ఇంజెక్షన్లు తీసుకున్నప్పుడు నా ఆత్మీయ దృష్టి స్పష్టంగా ఉందా? సరే, చెప్పడానికి నేనెవరిని? కానీ నేను చూస్తున్న దాని కొరకు నేను కృతజ్ఞుడను.

ఈ పవిత్రమైన కార్యములో మరియు నా జీవితంలో ప్రభువు హస్తాన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను.

నేను ఎక్కడికి వెళ్లినా అనేకమంది విశ్వాసాన్ని చూస్తున్నాను, వారు నా స్వంత విశ్వాసాన్ని బలపరుస్తారు.

నా చుట్టూ దేవదూతలను చూస్తున్నాను.

ప్రభువును శారీరకంగా చూడకున్నా, ఆత్మీయంగా ఆయనను గుర్తించే చాలా మంది విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, ఎందుకంటే వారు ఆయనను సన్నిహితంగా యెరిగియున్నారు.

ఈ సువార్త ప్రతిదానికీ సమాధానమని నేను సాక్ష్యమిస్తున్నాను, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రతి ఒక్కరికీ సమాధానం. నేను నా రక్షకుని అనుసరిస్తున్నప్పుడు నేను చూడగలిగినదాని కొరకు నేను కృతజ్ఞుడను.

మనము ప్రభువు స్వరాన్ని విని, రక్షకుని యొక్క నిబంధన మార్గములో మనలను నడిపించుటకు ఆయనను అనుమతించినప్పుడు, మన జీవితమంతా స్పష్టమైన దృష్టి, ఆధ్యాత్మిక అవగాహన, హృదయం మరియు మనస్సు యొక్క శాంతితో మనం ఆశీర్వదించబడతామని. నేను వాగ్దానం చేస్తున్నాను.

యేసు క్రీస్తు గురించి ఎక్కువగా వినాల్సిన అవసరం ఉన్న ప్రపంచంలో మన చుట్టూ ఉన్న స్వరాల కంటే బిగ్గరగా కేకలు వేసి ఆయన గురించి మన సాక్ష్యాన్ని చెబుదాము. మనం ఇప్పటికీ ధరించియున్న బిచ్చగాడి బట్టను పారవేసి, క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా మెరుగైన జీవితం కోసం ప్రపంచం కంటే పైకి లేద్దాము. మనం యేసు క్రీస్తును అనుసరించకూడదనే అన్ని సాకులను వదిలించుకొని ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనం ఆయనను అనుసరించడానికి అన్ని మంచి కారణాలను కనుగొందాము. ఇదే నా ప్రార్థన, యేసు క్రీస్తు నామములో ఆమేన్.