సర్వసభ్య సమావేశము
యథార్థత: క్రీస్తు వంటి లక్షణము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యథార్థత: క్రీస్తు వంటి లక్షణము

యథార్థతగల జీవితాన్ని జీవించాలంటే మనం దేవుని పట్ల, ఒకరి పట్ల మరొకరు మరియు మన దైవిక గుర్తింపు పట్ల నిజాయితీగా ఉండాలి.

రక్షకుని పరిచర్య ముగింపు ఘడియలలో, ఆయన గెత్సేమనే అనే తోటలోకి ఒలీవ కొండకు వెళ్లి, వేచియుండమని తన శిష్యులను ఆహ్వానించారు.1 ఇప్పుడు ఒంటరిగా, ఆయన తన తండ్రిని ఇలా వేడుకున్నారు, “నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము.”2 వేదనలో ఉన్నందున, ఆయన శ్రమ ఆయనను, “అందరికంటే గొప్పవాడును దేవుడైన ఆయన బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, … ఆ చేదు పాత్రను త్రాగకుండా వెనుదిరగాలని ఆయన అనుకొనేలా చేసెను.”3 అయినప్పటికీ ఈ తీవ్ర నిరాశగల క్షణంలో, రక్షకుడు కృంగిపోలేదు, “కానీ ఆయన త్రాగి, నరుల సంతానము కొరకైన [తన] సిద్ధపాటులను ముగించెను.”4

తండ్రి యొక్క అద్వితీయునిగా, యేసు క్రీస్తు మరణం, నొప్పి మరియు బాధలపై అధికారం కలిగియున్నాడు కానీ కృంగిపోలేదు. ఆయన తన తండ్రితో చేసిన నిబంధనను నెరవేర్చారు మరియు అలా చేయడం ద్వారా, మనం జీవిస్తున్న ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రీస్తు వంటి లక్షణము—యథార్థత యొక్క లక్షణమును ప్రత్యక్షపరిచారు. ఆయన దేవునికి, మనలో ప్రతి ఒక్కరికి మరియు ఆయన దైవిక గుర్తింపుకు యథార్థంగా నిలిచారు.

యథార్థత

యేసు క్రీస్తు మనకు మార్గదర్శి. యథార్థతగల జీవితాన్ని జీవించాలంటే మనం దేవుని పట్ల, ఒకరి పట్ల మరొకరు మరియు మన దైవిక గుర్తింపు పట్ల నిజాయితీగా ఉండాలి. దేవుడిని ప్రేమించాలనే మొదటి గొప్ప ఆజ్ఞ నుండి యథార్థత ప్రవహిస్తుంది. మీరు దేవుడిని ప్రేమిస్తున్నందున, మీరు అన్ని సమయాల్లో ఆయనపట్ల యథార్థంగా ఉంటారు. తప్పు, ఒప్పు ఉన్నాయని మరియు సంపూర్ణ సత్యం—దేవుని సత్యం ఉందని మీరు అర్థం చేసుకుంటారు. యథార్థత అంటే ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారిచేత అంగీకరించబడడానికి మనం మన ప్రమాణాలను లేదా ప్రవర్తనను తగ్గించుకోము.5 మీరు “ఏది సరైనదో అదే చేయండి” మరియు “పర్యవసానమును అనుసరించనివ్వండి.”6 నా సువార్తను ప్రకటించుడి అనే సువార్తికుల చేతిపుస్తకమునకు ఇటీవలి పునర్విమర్శలలో క్రీస్తు వంటి లక్షణముగా యథార్థతను జోడించారు.7

కొన్ని సంవత్సరాల క్రితం, మా స్టేకును పునర్వ్యవస్థీకరించడానికి ఎల్డర్ ఉఖ్‌డార్ఫ్ నియమించబడ్డారు. మా ఇంటర్వ్యూలో, ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేనది మరచిపోలేదు: “మీ జీవితంలో ఏదైనా విషయం ప్రజల దృష్టికి తీసుకొనిరాబడితే, మీకు లేదా సంఘమునకు ఇబ్బంది కలిగించేలా ఏదైనా ఉందా?” ఆశ్చర్యంతో, నేను త్వరగా నా క్రియలను సమీక్షించాను, నేను పరిపూర్ణంగా లేనప్పటి క్షణాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, “ఒకవేళ నేను చేసినదంతా ఇతరులకు తెలిస్తే, వారు నా గురించి లేదా సంఘము గురించి ఏమనుకుంటారు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

ఈ సమయంలో, ఎల్డర్ ఉఖ్‌డార్ఫ్ యోగ్యత గురించి మాత్రమే అడుగుతున్నారని నేను అనుకున్నాను, అయితే ఇది నిజంగా యథార్థతకు సంబంధించిన ప్రశ్న అని నేను గ్రహించాను. నేను విశ్వసిస్తున్నట్లు చెప్పిన దానికి అనుగుణంగా నా క్రియలు ఉన్నాయా? ప్రపంచం నా మాటలు మరియు నా పనుల మధ్య స్థిరత్వాన్ని చూస్తుందా? నా ప్రవర్తన ద్వారా ఇతరులు దేవుడిని చూస్తారా?

అధ్యక్షుడు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇలా బోధించారు, “యథార్థత” అనేది మన “విశ్వాసాలు మరియు కట్టుబాట్లకు అనుగుణంగా జీవించే సంకల్పం మరియు సామర్థ్యం.”8

దేవుని పట్ల యథార్థత

యథార్థతతో కూడిన జీవితం కొరకు అన్నింటికంటే ముదుగా మనం దేవునిపట్ల విశ్వాసంగా ఉండడం అవసరం.

మన బాల్యం నుండి, మనము సింహాల గుహలో దానియేలు కథను నేర్చుకున్నాము. దానియేలు ఎల్లప్పుడూ దేవునికి యథార్థంగా వున్నాడు. అసూయతో ఉన్న అతని సహచరులు “[అతనికి] వ్యతిరేకంగా సందర్భాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు”9 మరియు వారి దేవుళ్లకు మాత్రమే ప్రార్థనలను తప్పనిసరి చేస్తూ ఒక శాసనమును రూపొందించారు. దానియేలు శాసనమును ఎరుగును కాని ఇంటికి వెళ్లి—“తన కిటికీలు తెరిచి ఉంచి”10—మోకాళ్లపై నిలబడి రోజుకు మూడుసార్లు ఇశ్రాయేలు దేవుడిని ప్రార్థించాడు. ఫలితంగా, దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. ఉదయం, దానియేలు యొక్క దేవుడు అతనిని విడుదల చేసాడని రాజు కనుగొన్నాడు మరియు అందరూ “దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను: ఆయనే జీవముగల దేవుడు”11 అని ఒక కొత్త శాసనాన్ని జారీ చేశాడు.

దానియేలు యొక్క యథార్థత ద్వారా రాజు దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇతరులు మన మాటలు మరియు క్రియల ద్వారా దేవుడిని చూస్తారు. దానియేలువలె, దేవునిపట్ల యథార్థంగా ఉండడం మనల్ని ప్రపంచం నుండి ఎక్కువగా వేరు చేస్తుంది.

రక్షకుడు మనకు ఇలా గుర్తు చేస్తున్నారు, “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.”12 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా సలహా ఇచ్చారు: “[లోకమును జయించుట] అంటే, దేవుని విషయాల కంటే లోకము యొక్క విషయాలకు విలువ ఇచ్చే శోధనను జయించడం. దానర్థం, మనుష్యుల తత్వాల కంటే ఎక్కువగా క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని నమ్మడం.”13 అదేవిధంగా, “[మన] ఇష్టము చొప్పున మరియు ఈ లోకమును పోలియున్న [మన] స్వంత దేవుని ప్రతిరూపము ప్రకారం,” నడవాలనే శోధనను మనం తప్పక ఎదిరించాలి.”14

ఈ ప్రపంచం యొక్క వ్యతిరేకత అనేది దేవుని రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన భాగం. ఈ వ్యతిరేకతకు‌ మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనేది మనం ఎవరనే దాని యొక్క సారాంశం—మన యథార్థతకు ఒక కొలమానం. ఈ లోకపు వ్యతిరేకత అనేది వివాహంలో విశ్వసనీయతను నాశనం చేసేంత ప్రత్యక్షంగా ఉంటుంది లేదా సంఘ సిద్ధాంతమును లేదా సంస్కృతిని విమర్శించే అజ్ఞాత వ్యాఖ్యలను పోస్ట్ చేసేంత సూక్ష్మంగా ఉంటుంది. మన ఎంపికలలో యథార్థతను సాధన చేయడం అనేది రక్షకుడైన యేసు క్రీస్తును అనుసరించుటకు మనకు గల అంతర్గత నిబద్ధతకు బాహ్య వ్యక్తీకరణయై యున్నది.

ఇతరుల పట్ల యధార్ధత

దేవుడిని ప్రేమించాలనే మొదటి గొప్ప ఆజ్ఞ నుండి యథార్థత ప్రవహించినట్లే, ఒకరికొకరు నిజాయితీగా ఉండటం, మనలాగే మన పొరుగువారిని ప్రేమించాలనే రెండవ ఆజ్ఞ నుండి ప్రవహిస్తుంది. యథార్థతతో కూడిన జీవితం పరిపూర్ణతతో కూడిన జీవితం కాదు; ఇది మనం ప్రతిరోజూ దేవుని పట్ల అత్యంత నిజాయితీగా ఉండటానికి మరియు ఆ సందర్భంలో ఇతరులపట్ల నిజాయితీగా ఉండటానికి ప్రయాసపడే ఒక జీవితం. అధ్యక్షులు ఓక్స్ మనకు ఇలా గుర్తు చేస్తున్నారు, “ఈ రెండవ ఆజ్ఞను పాటించాలనే ఉత్సాహంలో మొదటి ఆజ్ఞను మరచిపోకూడదు.”15

ప్రజలు మరియు సంస్థల మధ్య సంబంధాలను నియంత్రించే ప్రవర్తనా నియమావళి లేదా నైతిక నియమాలను విధించడం ద్వారా ప్రపంచం మరింత యథార్థతతో పెనుగులాడుతున్నది. మంచివే అయినప్పటికీ, ఈ నియమాలు సాధారణంగా సంపూర్ణ సత్యంలో లంగరు వేయబడవు మరియు సాంస్కృతిక అంగీకారం ఆధారంగా అభివృద్ధి చెందుతాయి. ఎల్డర్ ఉఖ్‌డార్ఫ్ అడిగిన ప్రశ్న మాదిరిగానే, కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో లేదా ప్రధాన వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించినట్లయితే వారి నిర్ణయాలు లేదా నిర్ణయాత్మక ప్రక్రియ ఎలా ఉంటుందో పరిశీలించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇస్తాయి. సంఘము చీకటి అంధకారముల నుండి బయటకు వచ్చినప్పుడు,16 మనం దానియేలు లాగా, ప్రాపంచిక అంచనాలకు పైగా ఎదగాలి, అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాలలో నిజమైన మరియు సజీవమైన దేవుని యొక్క ప్రతినిధిగా మారాలి.17

మన క్రియలు మన మాటలకు విరుద్ధంగా ఉంటే మనకు యథార్థత ఉందని చెప్పుకోవడం సరికాదు. అదేవిధంగా, క్రైస్తవ దయ యథార్థతకు ప్రత్యామ్నాయం కాదు. నిబంధన జనులుగా మరియు ఆయన సంఘములో నాయకులుగా, మనం నిందలకు అతీతంగా ఉండాలి మరియు ప్రభువు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

యథార్థతతో ప్రవర్తించడం విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందిస్తుంది మరియు మనం ప్రభువు చిత్తాన్ని మాత్రమే చేయాలనుకుంటున్నామని ఇతరులకు భరోసా ఇస్తుంది. మన సలహాసభలలో, మనము బయటి ప్రభావాలను ఎదిరిస్తాము, ప్రతి స్త్రీ మరియు పురుషుని నుండి అంతర్దృష్టులను కోరుతూ ప్రభువు బయల్పరచిన ప్రక్రియను అనుసరిస్తాము మరియు పొందిన ప్రేరేపిత సలహాకు అనుగుణంగా వ్యవహరిస్తాము.18

మన దృష్టి రక్షకునిపైనే ఉంటుంది మరియు మన స్వంత ఆసక్తులకు సహాయపడడం, మన కుటుంబానికి ప్రయోజనం చేకూర్చడం లేదా మరొకరిని పణంగా పెట్టి వేరొకరిని పక్షపాతంగా చూడటం వంటి చర్యలను నివారించడానికి మనము జాగ్రత్తగా ఉంటాము. వ్యక్తిగత గుర్తింపును పొందడం, మరిన్ని లైక్‌లను సృష్టించడం, వ్యాఖ్యానించబడడం లేదా ప్రచురించబడడం ద్వారా మన చర్యలు మనుష్యుల గౌరవాలచే ప్రభావితం చేయబడతాయనే19 అభిప్రాయాన్ని నివారించడానికి మనము మన శక్తికి మించి చేస్తాము.

మన దైవిక గుర్తింపు పట్ల యథార్థత

చివరిగా, యథార్థతతో కూడిన జీవితం కొరకు మనం మన దైవిక గుర్తింపుకు యథార్థంగా ఉండడం అవసరం.

అలా లేని కొందరు మనకు తెలుసు. అనేకుల హృదయములను నడిపించివేసి, వారి “శరీర సంబంధమైన మనస్సును” ఆకర్షించిన క్రీస్తు విరోధి కొరిహోర్‌ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు.20 అయినప్పటికీ, తన జీవితంలోని చివరి క్షణాల్లో, “ఒక దేవుడుండెనని నేను ఎల్లప్పుడు ఎరిగితిని”21 అని అతడు ఒప్పుకున్నాడు. అబద్ధం అనేది “మన ఆత్మల స్వభావానికి విరుద్ధం,”22 అని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించారు. కొరిహోర్‌ తనను తాను మోసం చేసుకున్నాడు మరియు అతనిలో సత్యము లేదు.23

దీనికి విరుద్ధంగా, ప్రవక్త జోసెఫ్ స్మిత్ నమ్మకంగా ఇలా ప్రకటించారు, “దానిని నేనెరుగుదును, దేవుడు దానిని యెరిగియున్నాడని నేనెరుగుదును, దానిని నేను తృణీకరించలేను.”24

జోసెఫ్ సోదరుడు హైరం “అతని హృదయం యొక్క యథార్థత కారణంగా” ప్రభువుచే ప్రేమించబడ్డాడు.”25 అతడు మరియు జోసెఫ్ చివరి వరకు యథార్థంగా ఉన్నారు—వారి దైవిక గుర్తింపునకు, వారు పొందిన వెలుగుకు, జ్ఞానానికి యథార్థంగా ఉన్నారు మరియు వారు మారగలరని వారికి తెలిసిన వ్యక్తిపట్ల వారు యథార్థంగా ఉన్నారు.

ముగింపు

మనల్ని మనం “దేవుని చిత్తమునకు”26 సమ్మతింప చేసుకుందాం మరియు క్రీస్తువంటి యథార్థత అనే లక్షణాన్ని పెంపొందించుకుందాం. మనము మన మార్గదర్శియైన లోక రక్షకుని అనుసరిద్దాం, కృంగిపోకుండా దేవునికి, ఒకరికొకరికి మరియు మన దైవిక గుర్తింపుకు యథార్థమైన జీవితాన్ని గడుపుదాం.

యోబు చెప్పినట్లుగా, “నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక.”27 యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.