సర్వసభ్య సమావేశము
క్రీస్తు సిద్ధాంతం యొక్క శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తు సిద్ధాంతం యొక్క శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరి

క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని పదే పదే, పునరావృతంగా మరియు ఉద్దేశపూర్వకంగా జీవించమని, ఇతరులకు వారి మార్గంలో సహాయం చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

కొన్నేళ్ల క్రితం, నా భార్య రూత్, మా కూతురు యాష్లి మరియు నేను ఇతర పర్యాటకులతో కలిసి సంయుక్త రాష్ట్రాల‌లోని హవాయి రాష్ట్రంలో కయాకింగ్ విహారయాత్రకు వెళ్లాం. కయాక్ అనేది నీటి నుండి తక్కువ ఎత్తులో ఉండే దోనెవంటి పడవ, దీనిలో పడవ నడిపేవాడు ముందువైపు కూర్చుని, ఒక ప్రక్క, తరువాత మరొక ప్రక్క ముందు నుండి వెనుకకు లాగడానికి రెండు భాగాల తెడ్డును ఉపయోగిస్తాడు. ఒవాహు తీరంలో రెండు చిన్న ద్వీపాలకు వెళ్లి మళ్లీ తిరిగి రావాలనేది ప్రణాళిక. నేను నమ్మకంగా ఉన్నాను, ఎందుకంటే యువకుడిగా, నేను పర్వత సరస్సుల మీదుగా దోనెల్లో వెళ్ళాను. అతి విశ్వాసం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు, అవునా?

మా మార్గదర్శకుడు మాకు సూచనలు ఇచ్చాడు మరియు మేము ఉపయోగించే సముద్రపు దోనె‌లను మాకు చూపించాడు. అవి నేను ఇంతకు ముందు తెడ్డు వేసిన వాటికి భిన్నంగా ఉన్నాయి. నేను దోనె లోపల కూర్చోవడానికి బదులుగా దాని పైన కూర్చోవలసి ఉంది. నేను దోనెలోకి ప్రవేశించినప్పుడు, నా గురుత్వాకర్షణ కేంద్రం నాకు అలవాటుపడిన దానికంటే ఎక్కువగా ఉంది మరియు నేను నీటిలో తక్కువ స్థిరంగా ఉన్నాను.

మేము ప్రారంభించినప్పుడు, నేను రూత్ మరియు యాష్లి కంటే వేగంగా నడిపించాను. కొంతసేపటి తర్వాత నేను వారి కంటే చాలా ముందున్నాను. నా వీరోచిత వేగానికి గర్వంగా ఉన్నా, నేను తెడ్డు వేయడం ఆపి, వారు వచ్చేవరకు వేచి ఉన్నాను. ఒక పెద్ద కెరటం—దాదాపు 13 సెంటీమీటర్లు ఉంది1—నా దోనె ప్రక్కకు తగిలి నన్ను నీటిలో పడేసింది. నేను దోనెను నిటారుగా తిప్పి, తిరిగి పైకి రావడానికి కష్టపడే సమయానికి, రూత్ మరియు యాష్లి నన్ను దాటిపోయారు, కానీ నేను తెడ్డును తిరిగి వేయలేనంతగా గాలి చేత కొట్టబడ్డాను. నేను ఊపిరి పీల్చుకునేలోపు, మరొక అల, ఇది నిజంగా అపారమైనది—కనీసం 20 సెంటీమీటర్లు ఉంది2—నా దోనె‌ను తాకి మళ్లీ నన్ను పడేసింది. నేను దోనెను సరిచేసే సమయానికి, నేను పైకి ఎక్కలేనేమోననే భయంతో నాకు ఊపిరి ఆడలేదు.

నా పరిస్థితిని చూసి, మార్గదర్శకుడు నా దోనెను నిలబెట్టాడు, నేను పైకి ఎక్కడాన్ని సులభతరం చేసాడు. నాకై నేను నడపడానికి నేను ఇంకా ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నానని చూసినప్పుడు, అతను నా దోనెకు ఒక తాడును తగిలించి, నన్ను తనతో పాటు లాగుతూ తెడ్డువేయడం ప్రారంభించాడు. వెంటనే నేను ఊపిరి పీల్చుకున్నాను మరియు నా స్వంతంగా తగినంతగా తెడ్డు వేయడం ప్రారంభించాను. అతను తాడును విడిచిపెట్టాడు మరియు తదుపరి సహాయం లేకుండా నేను మొదటి ద్వీపానికి చేరుకున్నాను. వచ్చిన తర్వాత, నేను అలసిపోయి ఇసుకలో పడిపోయాను.

సమూహం విశ్రాంతి తీసుకున్న తర్వాత, మార్గదర్శకుడు నిశ్శబ్దంగా నాతో అన్నాడు, “మిస్టర్. రెన్‌లండ్, మీరు తెడ్డు వేస్తూ, మీ వేగాన్ని కొనసాగించినట్లయితే, మీరు బాగానే ఉంటారని నేను అనుకుంటున్నాను.” మేము రెండవ ద్వీపానికి తెడ్డు వేసి, ఆపై మా ప్రారంభ స్థానానికి చేరుకున్నప్పుడు నేను అతని సలహాను అనుసరించాను. రెండుసార్లు మార్గదర్శకుడు పడవ నడుపుకుంటూ వచ్చి, నేను బాగా నడుపుతున్నానని చెప్పాడు. ఇంకా పెద్ద కెరటాలు నా దోనెను పక్క నుండి తాకాయి, కానీ నేను పల్టీలు కొట్టలేదు.

దోనెను నిలకడగా తెడ్డు వేయడం ద్వారా, నేను వేగాన్ని మరియు ముందుకు పురోగతిని కొనసాగించాను, ప్రక్క నుండి నన్ను తాకుతున్న అలల ప్రభావాన్ని తగ్గించాను. అదే సూత్రం మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం వేగాన్ని తగ్గించినప్పుడు మరియు ముఖ్యంగా ఆగిపోయినప్పుడు మనం హానికి గురవుతాము.3 రక్షకుని వైపు నిరంతరం “నడిపించడం” ద్వారా మనం ఆత్మీయ వేగాన్ని కొనసాగించినట్లయితే, మన నిత్య జీవితం ఆయనపై మనకున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం సురక్షితంగా మరియు మరింత భద్రంగా ఉంటాము.4

ఆత్మీయ వేగం అనేది “మనం క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని పదేపదే హత్తుకున్నప్పుడు జీవితకాలంలో”5 సృష్టించబడుతుంది. అలా చేయడం “శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరిని” పుట్టిస్తుందని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.6 నిజానికి, క్రీస్తు సిద్ధాంతంలోని అంశాలు—ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తిస్మం ద్వారా ప్రభువుతో నిబంధన సంబంధంలో ప్రవేశించడం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందడం మరియు అంతము వరకు సహించడం వంటివి6—ఒక్కసారి పూర్తయిన పనులుగా అనుభవించడానికి ఉద్దేశించబడలేదు. ముఖ్యంగా, “అంతము వరకు సహించడం” అనేది క్రీస్తు సిద్ధాంతములో—మనం మొదటి నాలుగు దశలను పూర్తిచేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ, పళ్ళు నూరుతూ, చావు కోసం ఎదురుచూస్తున్నట్లుగా మరొక దశ కాదు. లేదు, అంతము వరకు సహించడం అంటే క్రీస్తు సిద్ధాంతంలోని ఇతర అంశాలను పదే పదే మరియు పునరావృతంగా అన్వయించడం, అధ్యక్షులు నెల్సన్ వర్ణించిన “శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరిని” సృష్టించడం.8

పదేపదే అంటే క్రీస్తు సిద్ధాంతంలోని అంశాలను మన జీవితమంతా పదే పదే అనుభవించడం. పునరావృతంగా అంటే మనం పునరావృతం చేసిన ప్రతీసారి నిర్మించడం మరియు మెరుగుపరచడం. మనం అంశాలను పునరావృతం చేసినప్పటికీ, మనం ముందుకు సాగకుండా కేవలం వలయాలలో తిరగడం లేదు. బదులుగా, వలయం ద్వారా మనం ప్రతిసారీ యేసు క్రీస్తుకు దగ్గరవుతాము.

ద్రవ్యవేగం, వేగం మరియు దిశ రెండింటినీ కలిగి ఉంటుంది.9 నేను దోనెను తప్పుడు దిశలో బలంగా తెడ్డు వేసినట్లయితే, నేను గణనీయమైన ఊపును సృష్టించగలను, కానీ నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేను. అదేవిధంగా, జీవితంలో మనము రక్షకుని దగ్గరకు రావడానికి ఆయన వైపు “పడవ నడిపించాలి”.10

యేసు క్రీస్తు నందు మన విశ్వాసం అనుదినం పోషించబడాలి.11 మనం ప్రతిరోజూ ప్రార్థించడం, ప్రతిరోజూ లేఖనాలను అధ్యయనం చేయడం, ప్రతిరోజూ దేవుని మంచితనంపై ప్రతిబింబించడం, ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం మరియు ప్రతిరోజూ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలను అనుసరించడం ద్వారా అది పోషించబడుతుంది. మన ఆహారాన్ని ఆదివారం వరకు వాయిదా వేసి, ఆపై వారానికొకసారి పోషకాహారాన్ని అధికంగా తీసుకోవడం ఆరోగ్యకరమైనది కానట్లే, మన సాక్ష్యాన్ని పెంపొందించే ప్రవర్తనను వారంలో ఒకరోజుకు మాత్రమే పరిమితం చేయడం ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైనది కాదు.12

మన స్వంత సాక్ష్యాలకు మనమే బాధ్యత వహించినప్పుడు,13 మనం ఆత్మీయ వేగాన్ని పొందుతాము మరియు క్రమంగా యేసు క్రీస్తుపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతం జీవిత ఉద్దేశ్యానికి కేంద్రంగా మారుతుంది.14 మనం దేవుని నియమాలను పాటించి, పశ్చాత్తాపపడేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ద్రవ్యవేగం అదే విధంగా ఊపందుకుంటుంది. పశ్చాత్తాపం ఆనందంగా ఉంటుంది మరియు మన తప్పుల నుండి నేర్చుకునేలా చేస్తుంది, ఆవిధంగానే మనం శాశ్వతంగా అభివృద్ధి చెందుతాము. నిస్సందేహంగా మనం మన దోనెలలో పల్టీలు కొట్టి లోతైన నీటిలో మనల్ని మనం కనుగొనే సందర్భాలు ఉంటాయి. పశ్చాత్తాపం ద్వారా, మనం ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి పైకి రావచ్చు మరియు కొనసాగవచ్చు.15 మనం ప్రయత్నాన్ని మానకుండా ఉండడమే ముఖ్యం.

క్రీస్తు సిద్ధాంతం యొక్క తదుపరి అంశం బాప్తిస్మం, ఇందులో నీటి బాప్తిస్మం మరియు నిర్ధారణ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటాయి.16 బాప్తిస్మం అనేది ఒక్కసారి జరిగే సంఘటన, అయితే మనం సంస్కారములో పాలుపంచుకున్నప్పుడు మన బాప్తిస్మపు నిబంధనను పదేపదే పునరుద్ధరిస్తాము. సంస్కారము బాప్తిస్మమునకు బదులుగా లేదు, కానీ అది క్రీస్తు యొక్క సిద్ధాంతంలోని ప్రారంభ అంశాలైన విశ్వాసం మరియు పశ్చాత్తాపమును పరిశుద్ధాత్మ స్వీకరణతో అనుసంధానిస్తుంది.17 మనం మనఃపూర్వకంగా సంస్కారములో పాలుపంచుకున్నప్పుడు,18 మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరియు నిర్ధారించబడినప్పుడు చేసినట్లుగానే, పరిశుద్ధాత్మను మన జీవితంలోకి ఆహ్వానిస్తాము.19 సంస్కార ప్రార్థనలలో వివరించిన నిబంధనను మనం పాటించినప్పుడు, పరిశుద్ధాత్మ మన సహవాసిగా మారతాడు.

పరిశుద్ధాత్మ మన జీవితాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నందున, మనం క్రమంగా మరియు పునరావృతంగా క్రీస్తువంటి లక్షణాలను అభివృద్ధి చేస్తాము. మన హృదయాలు మారతాయి. చెడు చేయాలనే మన ధోరణి తగ్గుతుంది. మనం “నిరంతరము మంచి చేయాలని” కోరుకొనే వరకు మంచి చేయాలనే మన కోరిక పెరుగుతుంది.20 తద్వారా మనం అంతము వరకు సహించడానికి అవసరమైన పరలోక శక్తిని పొందుతాము.21 మన విశ్వాసం పెరిగింది మరియు శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరిని మళ్లీ పునరావృతం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము.

పురోగమించే ఆత్మీయ వేగం ప్రభువు యొక్క మందిరంలో దేవునితో అదనపు నిబంధనలను చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. అనేక నిబంధనలు మనలను క్రీస్తుకు దగ్గర చేస్తాయి మరియు ఆయనతో మరింత బలంగా కలుపుతాయి. ఈ నిబంధనల ద్వారా, మనం ఆయన శక్తికి ఎక్కువ ప్రవేశాన్ని కలిగియుంటాము. స్పష్టంగా చెప్పాలంటే, బాప్తిస్మం మరియు దేవాలయ నిబంధనలు వాటికవే శక్తికి మూలం కావు. శక్తికి మూలం ప్రభువైన యేసు క్రీస్తు మరియు మన పరలోక తండ్రి. నిబంధనలను చేయడం మరియు పాటించడం మన జీవితాల్లో వారి శక్తికి ఒక మార్గాన్ని సృష్టిస్తుంది. మనం ఈ నిబంధనల ప్రకారం జీవిస్తున్నప్పుడు, చివరికి పరలోక తండ్రి కలిగియున్న దానంతటికీ మనం వారసులమవుతాము.22 క్రీస్తు సిద్ధాంతాన్ని జీవించడం ద్వారా ఉత్పన్నమయ్యే వేగం మన దైవిక స్వభావాన్ని మన నిత్య గమ్యంగా మార్చడానికి శక్తినివ్వడమే కాకుండా, తగిన మార్గాల్లో ఇతరులకు సహాయం చేయడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది.

నేను దోనె‌లో పల్టీలు కొట్టిన తర్వాత యాత్ర మార్గదర్శకుడు నాకు ఎలా సహాయం చేసాడో పరిశీలించండి. అతను చాలా దూరం నుండి, “మిస్టర్. రెన్‌లండ్, మీరు నీటిలో ఏమి చేస్తున్నారు?” అని వ్యర్థంగా ప్రశ్నించలేదు. అతను తెడ్డు పైకి లేపి నన్ను దూషించలేదు, “మిస్టర్. రెన్‌లండ్, మీరు శారీరకంగా మరింత దృఢంగా ఉంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు” అని అనలేదు. నేను నా దోనె పైకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను దానిని లాగడం ప్రారంభించలేదు. అందరి ముందు నన్ను సరిదిద్దలేదు. బదులుగా, అతను నాకు అవసరమైన సమయంలో నాకు అవసరమైన సహాయం చేశాడు. నేను అంగీకరించినప్పుడు అతను నాకు సలహా ఇచ్చాడు. మరియు అతను నన్ను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాడు.

మనం ఇతరులకు పరిచర్య చేస్తున్నప్పుడు, పనికిరాని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు లేదా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టపడుతున్న చాలామందికి తాము కష్టపడుతున్నామని తెలుసు. మనం తీర్పు తీర్చకూడదు; మన తీర్పు సహాయకరమైనది లేదా స్వాగతించదగినది కాదు మరియు చాలా తరచుగా సమాచారం లేనిది.

మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం చాలా ఘోరమైన పొరపాట్లకు దారి తీస్తుంది, ప్రత్యేకించి కష్టపడుతున్న వారి కంటే మనం ఎక్కువ నీతిమంతులమని మనం నిర్ధారించినట్లయితే. అలాంటి పోలిక 3 మీటర్ల23 నీటిలో నిస్సహాయంగా మునిగిపోవడం, మరొకరు 4 మీటర్ల24 నీటిలో మునిగిపోవడం చూసి అతన్ని పెద్ద పాపిగా తీర్పు చెప్పడం మరియు మీ గురించి మంచిగా అనుభూతి చెందడం వంటిది. ఏదేమైనా, మనమందరం మన స్వంత మార్గంలో కష్టపడుతున్నాము. మనలో ఎవరూ రక్షణను సంపాదించరు.25 మనం ఎప్పటికీ చేయలేము. మోర్మన్‌ గ్రంథములో జేకబ్ ఇలా బోధించాడు, “[మనం] దేవునితో సమాధానపడిన తరువాత, కేవలము దేవుని కృప యందు మరియు ద్వారానే [మనం] రక్షింపబడ్డామని జ్ఞాపకముంచుకోండి.”26 మనందరికీ రక్షకుని యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తం అవసరం, కేవలం దానిలో భాగం కాదు.

మన చుట్టూ ఉన్న వారితో మనం పరస్పరం సంభాషించేటప్పుడు మన కరుణ, సానుభూతి మరియు ప్రేమనంతా అందజేద్దాం.27 కష్టపడుతున్న వారు “[మన] మాటలు మరియు చర్యలలో ప్రతిబింబించే యేసు క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమను అనుభవించాలి.”28 మనం పరిచర్య చేస్తున్నప్పుడు, మనం ఇతరులను తరచుగా ప్రోత్సహిస్తాము మరియు సహాయం అందిస్తాము. ఎవరైనా అంగీకరించకపోయినప్పటికీ, వారు అనుమతించిన విధంగా మనం పరిచర్యను కొనసాగిస్తాము. “అట్టి వారికి పరిచర్య చేయుటను మీరు కొనసాగించవలెను; ఏలయనగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు వచ్చెదరేమో, నేను వారిని స్వస్థపరచుదునేమో మరియు వారికి రక్షణ తెచ్చుటకు మీరు సాధనముగా ఉందురేమో మీరెరుగరు” అని రక్షకుడు బోధించారు.29 రక్షకుని పని స్వస్థపరచడం. మన పని ప్రేమించడం—ఇతరులు యేసు క్రీస్తు వైపుకు ఆకర్షించబడే విధంగా ప్రేమించడం మరియు పరిచర్య చేయడం. క్రీస్తు సిద్ధాంతం యొక్క శక్తివంతమైన, సద్గుణవంతమైన వలయం యొక్క ఫలాలలో ఇది ఒకటి.

క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని పదే పదే, పునరావృతంగా మరియు ఉద్దేశపూర్వకంగా జీవించమని, ఇతరులకు వారి మార్గంలో సహాయం చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు యొక్క సిద్ధాంతం పరలోక తండ్రి యొక్క ప్రణాళికకు ప్రధానమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను; ఏదేమైనా, ఇది ఆయన సిద్ధాంతం. మనం యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు, మనం నిబంధన బాటలో ముందుకు నడిపించబడ్డాము మరియు ఇతరులు యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యులుగా మారడానికి సహాయం చేయడానికి ప్రేరేపించబడ్డాము. మనము పరలోక తండ్రి రాజ్యంలో వారసులు కాగలము, ఇది క్రీస్తు సిద్ధాంతాన్ని నమ్మకంగా జీవించడానికి పరాకాష్ట. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.