సర్వసభ్య సమావేశము
దేవాలయ నిబంధనల కారణంగా అంతా సవ్యంగా ఉంటుంది
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


దేవాలయ నిబంధనల కారణంగా అంతా సవ్యంగా ఉంటుంది

దేవాలయంలో మీరు చేసిన లేదా చేయబోయే నిబంధనలను గౌరవించడం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు.

నా ప్రియ సహోదర సహోదరీలారా, సర్వసభ్య సమావేశం యొక్క ఈ సభ నాకు ఒక పవిత్రమైన సమయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కడవరి దిన పరిశుద్ధులు మరియు మన స్నేహితులతో మాట్లాడే నియామకము కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు.

దాదాపు 50 సంవత్సరాల క్రితం, ఐడహోలోని రెక్స్‌బర్గ్‌లో రిక్స్ కళాశాలకి అధ్యక్షునిగా సేవ చేసే విశేషాధికారం నాకు లభించింది. 1976, జూన్ 5 ఉదయం, నా భార్య కాథీ మరియు నేను ఒక సన్నిహిత స్నేహితుడి ముద్ర విధికి హజరయ్యేందుకు రెక్స్‌బర్గ్ నుండి ఐడహో ఫాల్స్ దేవాలయానికి వెళ్లాము. నిజానికి, ఆ సమయంలో మా ఇంట్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు, ధైర్యముగల ఆయా సహాయంతో మాత్రమే మా దేవాలయ యాత్ర పూర్తి అవుతుంది! మేము మా ప్రియమైన పిల్లలను ఆమె సంరక్షణలో విడిచిపెట్టి, 30 నిమిషాల పాటు కొద్ది దూరం ప్రయాణం చేసాము.

ఆ రోజు దేవాలయములో మా అనుభవం ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. అయితే, దేవాలయ ముద్రవేయు విధి ముగిసిన తర్వాత—మరియు మేము ఇంటికి తిరిగి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు—దేవాలయ ప్రవేశమార్గంలో చాలామంది దేవాలయ సేవకులు మరియు సహాయకులు భయాందోళనలతో సంభాషించుకోవడం మేము గమనించాము. క్షణాల్లోనే, తూర్పు ఐడహోలో కొత్తగా నిర్మించిన టెటన్ డ్యామ్ కూలిపోయిందని దేవాలయ సేవకుల్లో ఒకరు మాకు తెలియజేశారు! 80 బిలియన్ గ్యాలన్ల (300 మిలియన్ క్యూబిక్ మీటర్లు) కంటే ఎక్కువ నీరు ఆనకట్ట ద్వారా మరియు సమీపములోనున్న 300 చదరపు మైళ్ల (775 చదరపు కి.మీ.) లోయలలోకి ప్రవహిస్తోంది. రెక్స్‌బర్గ్ నగరంలో చాలా భాగం నీటిలో మునిగిపోయింది, ఇళ్లు మరియు వాహనాలు వరదల కారణంగా కొట్టుకుపోయాయి. 9,000 మంది నివాసితులలో మూడింట రెండు వంతుల మంది అకస్మాత్తుగా నిరాశ్రయులయ్యారు.1

మీరు ఊహించినట్లుగా, మా ఆలోచనలు మరియు ఆందోళనలు వెంటనే మా ప్రియమైన పిల్లలు, వందలాదిమంది కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు మేము ప్రేమించే సమాజం యొక్క భద్రత మరియు శ్రేయస్సు వైపు మళ్లాయి. మేము మా ఇంటి నుండి 30 మైళ్ల (50 కి.మీ.) కంటే తక్కువ దూరంలో ఉన్నాము, అయినప్పటికీ, సెల్ ఫోన్‌లు మరియు సందేశాలకు చాలా ముందున్న కాలంనాటి ఆ రోజున, మా పిల్లలతో వెంటనే సంప్రదించటానికి మాకు ఎలాంటి మార్గాలు లేవు, పైగా అన్ని రహదారులు మూసివేయబడినందువలన ఐడహో ఫాల్స్ నుండి రెక్స్‌బర్గ్‌కు వెళ్లలేకపోయాము.

ఐడహో ఫాల్స్‌లోని స్థానిక హోటల్‌లో రాత్రి బస చేయడమే మాకున్న ఏకైక అవకాశం. కాథీ మరియు నేను మా హోటల్ గదిలో కలిసి మోకరిల్లి, మా ప్రియమైన పిల్లల భద్రత కోసం మరియు విషాదకరమైన సంఘటన వల్ల ప్రభావితమైన వేలాదిమంది ఇతరుల కోసం వినయంగా పరలోక తండ్రిని వేడుకున్నాము. కాథీ వేకువజామున మేడఅంతస్తులో అటూ ఇటూ తిరుగుతూ, ఆందోళనతో బాధపడుతూ వుండటం నాకు గుర్తుంది. నా స్వంత ఆందోళనలు ఉన్నప్పటికీ, నేను నా మనస్సును తేలికగా ఉంచగలిగాను మరియు నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత ఎంతో సమయం పట్టలేదు, నా ప్రియమైన నిత్య సహవాసి నన్ను మేల్కొలిపి ఇలా అన్నది, “హాల్, ఇలాంటి సమయంలో మీరు ఎలా నిద్రపోతారు?”

ఈ మాటలు అప్పుడు నా హృదయానికి మరియు మనస్సుకు స్పష్టంగా చేరాయి. నేను నా భార్యతో ఇలా చెప్పాను: “కాథీ, ఫలితం ఏదైనప్పటికీ, దేవాలయం కారణంగా అంతా సవ్యంగా ఉంటుంది. మనం దేవునితో నిబంధనలు చేసుకున్నాము మరియు ఒక నిత్య కుటుంబంగా ముద్రించబడ్డాము.”

ఆ సమయంలో, ఇది నిజమని, మా ఇద్దరికీ ముందే తెలుసునని, ప్రభువు యొక్క ఆత్మ మా హృదయాలలో మరియు మనస్సులలో ధృవీకరించినట్లు అనిపించింది: ప్రభువు యొక్క మందిరంలో మాత్రమే కనుగొనబడిన మరియు సరైన యాజకత్వ అధికారం ద్వారా నిర్వహించబడే ముద్రవేయు విధులు భార్యాభర్తలుగా మమ్మల్ని కలిపి బంధించాయి మరియు మా పిల్లలు మాతో ముద్ర వేయబడ్డారు. నిజంగా భయపడాల్సిన అవసరం లేదు మరియు తరువాత మా అబ్బాయిలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్నందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాము.

బహుశా అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ నుండి ఈ వ్యాఖ్యానము ఆ మరపురాని రాత్రిలో కాథీ మరియు నేను భావించిన దానిని ఉత్తమంగా వివరిస్తుంది. “మనం దేవాలయానికి హాజరవుతున్నప్పుడు, ఆధ్యాత్మికత యొక్క ఒక కోణం మరియు ఒక శాంతి అనుభూతి మనకు కలుగుతుంది … రక్షకుడు ఇలా చెప్పినప్పుడు ఆయన మాటల యొక్క నిజమైన అర్థాన్ని మనం గ్రహిద్దాం: ‘శాంతిని మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను. … మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి [యోహాను 14:27].’”2

నేను పరిశుద్ధ దేవాలయంలోకి ప్రవేశించిన ప్రతిసారీ ఆ శాంతిని అనుభవించే దీవెన నాకు లభించింది. సాల్ట్ లేక్ దేవాలయములోనికి నేను అడుగుపెట్టిన మొదటి రోజు నాకు గుర్తుంది. నేనొక యువకుడిని.

గదిని వెలుగుతో నింపిన ఎత్తైన తెల్లని పైకప్పు వైపు చూసాను, అది దాదాపుగా ఆకాశం వైపు తెరచి ఉంచినట్లనిపించింది. ఆ క్షణంలో, స్పష్టమైన పదాలలో ఒక ఆలోచన నా మనస్సులోకి వచ్చింది: “ప్రకాశవంతమైన ఈ ప్రదేశానికి ఇంతకుముందు నేను వచ్చాను.” కానీ వెంటనే ఈ పదాలు నా మనస్సులోకి వచ్చాయి, అయితే నా స్వరంలో కాదు: “లేదు, ఇంతకు ముందెన్నడూ నువ్వు ఇక్కడికి రాలేదు. నువ్వు పుట్టకముందు గడియను నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. ప్రభువు రాగల ఇలాంటి పవిత్రమైన స్థలములో నువ్వు ఉన్నావు.”

సహోదర సహోదరీలారా, మనం దేవాలయానికి హాజరవుతున్నప్పుడు, మన ఆత్మల యొక్క శాశ్వతమైన స్వభావాన్ని, తండ్రి మరియు ఆయన దైవిక కుమారునితో మన సంబంధాన్ని మరియు మన పరలోకమందున్న గృహానికి తిరిగి రావాలనే మన అంతిమ కోరికను మనము గుర్తు చేసుకోవచ్చని నేను వినయంగా సాక్ష్యమిస్తున్నాను.

ఇటీవలి సమావేశ ప్రసంగాలలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు:

ఆధ్యాత్మికంగా ఉండడానికి సురక్షితమైన ప్రదేశం ఏమిటంటే దేవాలయ నిబంధనల పరిధిలో జీవించడమే.”

“మనం నమ్మే సమస్తము మరియు దేవుడు తన నిబంధన ప్రజలకు చేసిన ప్రతీ వాగ్దానమూ దేవాలయంలో ఒకటిగా కలిసి వస్తాయి.”3

“దేవాలయాలలో … నిబంధనలు చేసి—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు.”4

ఆయన ఇలా కూడా బోధించారు, “ఒక్కసారి దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత, మనము తటస్థంగా ఉన్న స్థితిని శాశ్వతంగా వదిలివేస్తాము. ఆయనతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్న వారితో దేవుడు తన సంబంధాన్ని విడిచిపెట్టడు. వాస్తవానికి, దేవునితో నిబంధన చేసుకున్న వారందరికీ ప్రత్యేక విధమైన ప్రేమ మరియు కరుణ లభిస్తాయి.”5

అధ్యక్షులు నెల్సన్ యొక్క ప్రేరేపిచబడిన నాయకత్వంలో, ప్రభువు ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేసారు మరియు వేగవంతం చేస్తూనే ఉంటారు. ఇది దేవుని పిల్లలందరూ రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందడానికి, పవిత్రమైన నిబంధనలను చేయడానికి మరియు పాటించటానికి అనుమతిస్తుంది. పరిశుద్ధమైన నిబంధనలను చేయడానికి అర్హత పొందడం అనేది ఒక్కసారి ప్రయత్నం మాత్రమే కాదు కానీ ఒక జీవితకాల నమూనా. దానికి మన పూర్ణ హృదయము, పూర్ణ శక్తి, మనస్సు మరియు బలము అవసరమని ప్రభువు చెప్పారు.6

దేవాలయం యొక్క విధి విధానాలలో తరచుగా పాల్గొనడం వలన ప్రభువు పట్ల భక్తి యొక్క నమూనాను సృష్టించవచ్చు. మీరు మీ దేవాలయ నిబంధనలను పాటించి, వాటిని గుర్తుంచుకున్నప్పుడు, మిమ్మల్ని బలపరచడానికి మరియు శుద్ధి చేయడానికి మీరు పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని ఆహ్వానిస్తారు.

అప్పుడు మీరు వాగ్దానాలు నిజమని సాక్ష్యమిచ్చే వెలుగు మరియు నిరీక్షణను అనుభవించవచ్చు. దేవునితో చేసిన ప్రతీ నిబంధన ఆయనకు దగ్గరయ్యే అవకాశం అని మీరు తెలుసుకుంటారు, అప్పుడు అది దేవాలయ నిబంధనలను కొనసాగించాలనే కోరికను మీ హృదయంలో సృష్టిస్తుంది.

మనము ఇలా వాగ్దానం చేయబడ్డాము, “దేవునితో మన నిబంధన కారణంగా, మనకు సహాయం చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలలో ఆయన ఎప్పటికీ అలసిపోరు మరియు మనపై కరుణతో కూడిన ఆయన సహనాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోము.”7

దేవాలయంలోని ముద్రవేయు నిబంధన ద్వారా మరణం తర్వాత కొనసాగి, నిత్యము నిలిచియుండే ప్రియమైన కుటుంబ సంబంధాల అభయాన్ని మనం పొందగలము. దేవుని యొక్క దేవాలయంలో చేసిన వివాహము మరియు కుటుంబ నిబంధనలను గౌరవించడం, స్వార్థం మరియు అహంకారం యొక్క చెడు నుండి రక్షణను అందిస్తుంది.

సహోదర సహోదరీలారా, ఒకరిపట్ల ఒకరు నిరంతరం శ్రద్ధ వహించడం అనేది ప్రభువు యొక్క మార్గంలో మీ కుటుంబాన్ని నడిపించడానికి పట్టుదలగల ప్రయత్నాలు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునే అవకాశం పిల్లలకు ఇవ్వండి. అసమ్మతి యొక్క ప్రారంభాన్ని త్వరగా తెలుసుకొనండి, ముఖ్యంగా ఒకరిపట్ల మరొకరి నిస్వార్థ సేవ యొక్క చర్యలను సానుకూలంగా గుర్తించండి. తోబుట్టువులు ఒకరి కొరకు మరొకరు ప్రార్థించేటప్పుడు మరియు ఒకరికొకరు సేవ చేసుకునేటప్పుడు, హృదయాలు మృదువుగా చేయబడతాయి మరియు ఒకరి తట్టు ఒకరు మరియు వారి తల్లిదండ్రుల తట్టు తిరుగుతారు.

ప్రవక్తయైన ఏలీయా రాకడను ముందుగా చెప్పినప్పుడు, పాక్షికంగా దానినే మలాకీ వర్ణించాడు: “పితరుల యొక్క వాగ్దానములు పిల్లల హృదయాలలో నాటబడును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. అట్లు కానియెడల, ఆయన రాకడ సమయమున భూమి యంతయు పూర్తిగా నాశనము చేయబడును.”8

మనందరికీ పరీక్షలు, సవాళ్లు మరియు హృదయ వేదనలు తప్పకుండా వస్తాయి. మనలో ఎవరూ “శరీరము [యొక్క] ముళ్ళ”9 నుండి మినహాయించబడరు. అయినప్పటికీ, మనం దేవాలయానికి హాజరై, మన నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు నుండి వ్యక్తిగత నిర్దేశాన్ని పొందేందుకు మనం సిద్ధపడవచ్చు.

కాథీ మరియు నేను వివాహం చేసుకుని, లోగన్ యూటా దేవాలయంలో ముద్ర వేయబడినప్పుడు, అప్పటి ఎల్డర్ స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ మా ముద్రను నిర్వహించారు. ఆయన మాట్లాడిన కొద్ది మాటలలో ఆయన ఈ సలహా ఇచ్చారు: “హాల్, కేథీ, పిలుపు వచ్చినప్పుడు మీరు సులువుగా విడిచి వెళ్ళగలిగేలా జీవించండి.”

మొదట్లో, ఆ సలహా అర్థాన్ని మేము గ్రహించలేదు, కానీ పిలుపు వచ్చినప్పుడు ప్రభువును సేవించడానికి సిద్ధంగా ఉండేలా మా జీవితాలను జీవించడానికి మేము మా వంతు కృషి చేసాము. మేము వివాహం చేసుకున్న దాదాపు 10 సంవత్సరాల తర్వాత, సంఘ విద్యా ఉన్నతాధికారియైన నీల్ ఎ. మాక్స్‌వెల్ నుండి ఊహించని పిలుపు వచ్చింది.

“సులువుగా విడిచివెళ్ళగలిగేలా” ఉండమని అధ్యక్షులు కింబల్ దేవాలయంలో ఇచ్చిన ప్రేమపూర్వక సలహా నిజమయ్యింది. కాథీ మరియు నేను, నాకేమాత్రం తెలియని ప్రదేశంలో ఒక నియామకంలో సేవచేయడానికి అందుకున్న పిలుపు, కాలిఫోర్నియాలోని ఆహ్లాదకరమైన వ్యక్తిగత పరిస్థితులను విడిచి వెళ్ళమనే పిలుపులా కనిపించింది. అయినప్పటికీ, విడిచి వెళ్ళడానికి మా కుటుంబము సిద్ధంగా ఉంది, ఎందుకంటే మేము ఆనాడు దేనికోసం సిద్ధపరచబడ్డామో ఆ భవిష్యత్తు సంఘటనను బయల్పాటు యొక్క ప్రదేశమైన పరిశుద్ధ దేవాలయంలో ఒక ప్రవక్త చూసారు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవాలయంలో మీరు చేసిన లేదా చేయబోయే నిబంధనలను గౌరవించడం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు నిబంధన మార్గంలో ఎక్కడ ఉన్నా, దేవాలయానికి హాజరయ్యేందుకు అర్హత పొందాలని మరియు యోగ్యులు కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పరిస్థితులు అనుమతించినంత తరచుగా సందర్శించండి. దేవునితో పవిత్రమైన నిబంధనలను చేసి, పాటించండి. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఐడహో ఫాల్స్‌లోని ఒక చిన్న హోటల్ గదిలో నేను అర్ధరాత్రి కాథీతో పంచుకున్న అదే సత్యాన్ని మీకు హామీ ఇస్తున్నాను: “ఫలితం ఎలా ఉన్నా, దేవాలయ నిబంధనల కారణంగా అంతా సవ్యంగా ఉంటుంది.”

యేసే క్రీస్తని నేను మీకు ఖచ్చితమైన సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారు మరియు తన సంఘాన్ని నడిపిస్తున్నారు. దేవాలయములు ప్రభువు యొక్క మందిరములు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ భూమిపై దేవుని యొక్క సజీవ ప్రవక్త. నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు నేను మీలో ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.