సర్వసభ్య సమావేశము
యేసును గూర్చి సాక్ష్యము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసును గూర్చి సాక్ష్యము

యేసును గూర్చి సాక్ష్యంలో శూరునిగా మీ స్థానాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు పని చేయమనేది నా ఆహ్వానం.

1832లో, జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ దేవుని పిల్లల నిత్య గమ్యానికి సంబంధించి ఒక అద్భుతమైన దర్శనాన్ని పొందారు. ఈ బయల్పాటు మూడు పరలోక రాజ్యాల గురించి మాట్లాడింది. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గత అక్టోబర్‌లో ఈ “మహిమ రాజ్యాల” గురించి మాట్లాడారు,1 “గొర్రెపిల్ల యొక్క విజయం మరియు మహిమ ద్వారా,”2 సాపేక్షంగా కొద్దిమంది వ్యక్తులు మినహా మిగిలిన వారందరూ “వారి ఎంపికల ద్వారా వ్యక్తమైన వారి కోరికల ప్రకారం”3 చివరికి ఈ రాజ్యాలలో ఒకదానిలోకి విమోచించబడతారని చెప్పారు. దేవుని విమోచన ప్రణాళిక ఆయన పిల్లలందరికీ విశ్వవ్యాప్త అవకాశాన్ని ఏర్పరుస్తుంది, వారు భూమిపై ఎప్పుడు మరియు ఎక్కడ నివసించినప్పటికీ.

మూడు రాజ్యాలలో కనిష్టమైన టిలెస్టియల్ యొక్క మహిమ కూడా “సమస్త జ్ఞానమును మించినది,”4 మన తండ్రి యొక్క ఆశ ఏమిటంటే—మనం ఆయన కుమారుని మహిమ ద్వారా ఈ రాజ్యాలలో అత్యున్నతమైన మరియు అత్యంత మహిమాన్వితమైన సిలెస్టియల్ రాజ్యాన్ని ఎన్నుకుంటాము మరియు దానికి అర్హత పొందుతాము—అక్కడ మనం “క్రీస్తుతోడి వారసులుగా”5 నిత్యజీవాన్ని ఆస్వాదించవచ్చు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని “సిలెస్టియల్‌గా ఆలోచించమని”, సిలెస్టియల్ రాజ్యాన్ని మన నిత్య లక్ష్యంగా చేసుకుని, “ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు [మనం] చేసే ప్రతి నిర్ణయం [మనల్ని] తదుపరి లోకంలో ఎక్కడ ఉంచుతుందో జాగ్రత్తగా పరిశీలించమని”6 ఉద్బోధించారు.

సిలెస్టియల్ రాజ్యంలో ఉన్నవారు “యేసును గూర్చి సాక్ష్యము పొందినవారు, … క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు ద్వారా పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులు.”7 రెండవ లేదా టెర్రెస్ట్రియల్ రాజ్యం యొక్క నివాసులు ముఖ్యంగా మంచివారిగా వర్ణించబడ్డారు, వారిలో “భూమిపైనున్న గౌరవనీయులైన మనుష్యులు ఉన్నారు, వారు మనుష్యుల కపటము చేత గ్రుడ్డివారిగా చేయబడ్డారు.” వారి ప్రధాన పరిమిత లక్షణం ఏమిటంటే, వారు “యేసు సాక్ష్యమందు శూరులుగా ఉండనివారు.”8 దీనికి విరుద్ధంగా, దిగువనున్న టిలెస్టియల్ రాజ్యంలో ఉన్నవారు “సువార్తనైనను, యేసు సాక్ష్యమునైనను స్వీకరించని వారు.”9

ప్రతీ రాజ్య నివాసుల ప్రత్యేక లక్షణమైన (1) హృదయపూర్వకమైన భక్తి నుండి (2) శూరులుగా ఉండకపోవడం, (3) పూర్తిగా తిరస్కరించడం వరకు వారు “యేసు సాక్ష్యము”తో ఎలా సంబంధం కలిగి ఉన్నారనేది గమనించండి. ప్రతి వ్యక్తి యొక్క ప్రతిస్పందనపై అతని లేదా ఆమె నిత్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

I.

యేసును గూర్చి సాక్ష్యము అంటే ఏమిటి?

ఆయన దేవుని యొక్క దైవిక కుమారుడు, మెస్సీయ మరియు విమోచకుడు అనేది పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము. యేసు ఆదియందు దేవుని యొద్ద ఉన్నారని, ఆయనే భూమ్యాకాశముల సృష్టికర్తయని మరియు “ఆయనలో సువార్త ఉందని, సువార్తయే జీవమని మరియు జీవమే మనుష్యులకు వెలుగు”10 అనేది యోహాను సాక్ష్యం. “ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు మరియు మూడవ రోజున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు”11 అనేది అపొస్తలులు మరియు ప్రవక్తల సాక్ష్యం. అది, “రక్షణ కలుగజేయుటకు మరేయితర నామము ఇవ్వబడ లేదు”12 అనే జ్ఞానము. “సాక్ష్యములన్నిటిలో ఇది చివరిది,” ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడినది, “అదేమనగా ఆయన సజీవుడు! … ఆయన తండ్రి యొక్క అద్వితీయుడు—ఆయన చేత, ఆయన ద్వారా, ఆయన వలన ప్రపంచములు సృష్టించబడెను మరియు సృష్టించబడును, వాటి నివాసులు దేవునికి కుమారులు, కుమార్తెలునై యున్నారు.”13

II.

ఈ సాక్ష్యానికి అదనంగా ఒక ప్రశ్న: సాక్ష్యం గురించి మనం ఏమి చేయాలి?

సిలెస్టియల్ రాజ్యం యొక్క వారసులు బాప్తిస్మం పొందడం, పరిశుద్ధాత్మను పొందడం మరియు విశ్వాసం చేత జయించడం ద్వారా యేసును గూర్చి పూర్తి సాక్ష్యాన్ని“పొందుతారు”.14 యేసు క్రీస్తు సువార్త యొక్క సూత్రాలు మరియు సత్యాలు వారి ప్రాధాన్యతలను, ఎంపికలను నియంత్రిస్తాయి. వారు ఎలా ఉన్నారు మరియు వారు ఎలా మారుతున్నారు అనే దానిలో యేసును గూర్చి సాక్ష్యం ప్రత్యక్షపరచబడుతుంది. వారి ఉద్దేశ్యం దాతృత్వం, “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ.”15 వారి దృష్టి “క్రీస్తు ఏర్పరచిన ప్రమాణాలకు సంపూర్ణ కొలమానాన్ని”16 అనుసరించడంపై ఉంది.

టెర్రెస్ట్రియల్ రాజ్యంలో కనుగొనబడిన వారిలో కొందరు కూడా యేసును గూర్చి సాక్ష్యాన్ని అంగీకరిస్తారు, కానీ వారు దాని గురించి ఏమి చేయరు అనే దాని ద్వారా వారు ప్రత్యేకించబడ్డారు. రక్షకుని గూర్చి సాక్ష్యములో శూరులుగా ఉండకపోవడము అనేది ఒక రకమైన ఉదాసీనత లేదా అప్రాధాన్యతను—“నులివెచ్చగా”17 ఉండడాన్ని సూచిస్తుంది—ఉదాహరణకు, వారు మోర్మన్ గ్రంథములో “దేవుని యెడల వారి ఆసక్తి నిమిత్తము ప్రత్యేకించబడిన”18 అమ్మోన్ జనులకు వ్యతిరేకంగా ఉండడాన్ని సూచిస్తుంది.

టిలెస్టియల్ రాజ్యం యొక్క నివాసులు యేసును గూర్చి సాక్ష్యాన్ని మరియు ఆయన సువార్తను, ఆయన నిబంధనలను, ఆయన ప్రవక్తలను తిరస్కరించే జనులు. వారు అబినడైచేత ఇలా వర్ణించబడ్డారు, “వారి శరీర సంబంధమైన చిత్తములు, కోరికలను బట్టి వెళ్ళిన వారై కనికరము యొక్క బాహువులు వారి వైపు చాచబడియుండగా ఎన్నడును వారు ప్రభువు నామమున ప్రార్థన చేయలేదు; కనికరము యొక్క బాహువులు వారి వైపు చాచబడినను వారు దానిని అంగీకరించలేదు.”19

III.

యేసును గూర్చి సాక్ష్యంలో శూరులుగా ఉండడం అంటే ఏమిటి?

ఈ ప్రశ్నకు సమాధానమివ్వడంలో పరిగణించబడగల సాధ్యతలు అనేకమున్నాయి. నేను కొన్నింటిని ప్రస్తావిస్తాను. యేసును గూర్చి సాక్ష్యంలో శూరులుగా ఉండడంలో ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని పెంపొందించడం మరియు బలపరచడం ఇమిడివుంది. నిజమైన శిష్యులు యేసును గూర్చి వారి సాక్ష్యాన్ని నిలబెట్టే మరియు బలపరిచే ప్రార్థన, లేఖనాలను అధ్యయనం చేయడం, సబ్బాతును పాటించడం, సంస్కారములో పాల్గొనడం, పశ్చాత్తాపము, పరిచర్య చేయడం మరియు ప్రభువు మందిరములో ఆరాధించడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా విస్మరించరు. అధ్యక్షులు నెల్సన్ మనకిలా గుర్తుచేస్తున్నారు, “‘దేవుని సువార్త ద్వారా’ [మొరోనై 6:4] అనుదినము పోషింపబడని సాక్ష్యము భయంకరమైన వేగముతో కూలిపోగలదు. ఆవిధంగా, … ప్రభువును ఆరాధించడం మరియు ఆయన సువార్తను అధ్యయనం చేయడం వంటి అనుదిన అనుభవాలు మనకు అవసరం.” తర్వాత ఆయనిలా జతచేసారు: “మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ సమయములో ఆయనకు న్యాయమైన వాటా ఇవ్వండి. మీరు ఆవిధంగా చేస్తున్నప్పుడు, మీ సానుకూల ఆత్మీయ వేగానికి ఏమి జరుగుతుందో గమనించండి.”20

శూరులుగా ఉండడం అనేది ఒకరి సాక్ష్యం గురించి నిష్కపటంగా మరియు బాహాటంగా ఉండడాన్ని సూచిస్తుంది. “అన్ని సమయములలో, అన్ని విషయములలో, [మనం] ఉండు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు ఇష్టపడుతున్నామని”21 బాప్తిస్మమప్పుడు మన సమ్మతిని మనం నిర్ధారిస్తాము. ఈ ఈస్టర్ సమయం‌లో ప్రత్యేకించి, పునరుత్థానుడైన, సజీవుడైన క్రీస్తు గురించి మనం ఆనందంగా, బహిరంగంగా మరియు నిస్సంకోచంగా ప్రకటిస్తాము.

యేసును గూర్చి సాక్ష్యంలో శూరులుగా ఉండడంలో ఒక అంశం ఏమిటంటే, ఆయన దూతలను ఆలకించడం. దేవుడు మనల్ని మంచి మార్గంలోకి, నిబంధన మార్గంలోకి బలవంతంగా పంపరు, కానీ మన ఎంపికల యొక్క పరిణామాల గురించి మనకు పూర్తిగా తెలియజేసేందుకు ఆయన తన ప్రవక్తలను నిర్దేశిస్తారు. మరియు ఇది ఆయన సంఘ సభ్యులకు మాత్రమే కాదు. వారిని స్వతంత్రులనుగా చేసి,22 అనవసరమైన బాధలనుండి తప్పించి, వారికి శాశ్వతమైన ఆనందాన్ని తెచ్చే సత్యమును వినమని ప్రపంచమంతటిని తన ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా ఆయన ప్రేమగా వేడుకుంటారు.

యేసును గూర్చి సాక్ష్యంలో శూరులుగా ఉండడం అంటే, ఇతరులను, ప్రత్యేకించి మన స్వంత కుటుంబాల వారిని కూడా శూరులుగా ఉండమని, మాట మరియు ఉదాహరణ ద్వారా ప్రోత్సహించడం. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఒకసారి “తమ శిష్యత్వాన్ని మరింత లోతుగా చేయడానికి బదులుగా ఉపరితలంపైకి దూసుకెళ్లేవారు మరియు ‘ఆత్రుతతో నిమగ్నమై’ కాకుండా సాధారణంగా నిమగ్నమై ఉన్న ‘గౌరవనీయులైన’ [సంఘ] సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:75; 58:27).”23 అందరికీ ఎంచుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంటూ, ఎల్డర్ మాక్స్‌వెల్ ఇలా విలపించారు: “దురదృష్టవశాత్తూ, కొందరు బద్ధకాన్ని ఎంచుకున్నప్పుడు, వారు తమ కోసమే కాకుండా తదుపరి తరం మరియు ఆ తరువాతి తరం కోసం కూడా ఎంచుకుంటున్నారు. తల్లితండ్రులకున్న చిన్న సందిగ్ధాలు వారి పిల్లలలో పెద్ద ఉల్లంఘనలను కలిగించవచ్చు! ఒక కుటుంబంలోని పూర్వ తరాలు అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ ఉండవచ్చు, అయితే ప్రస్తుత తరంలో కొందరు సందిగ్ధంగా ఉండవచ్చు. దురదృష్టవశాత్తు, తరువాతి తరంలో కొందరు అధ్వాన్నంగా మారి, తిరుగుబాటు చేయవచ్చు.”24

చాలా సంవత్సరాల క్రితం, ఎల్డర్ జాన్ హెచ్. గ్రోబెర్గ్ 1900ల ప్రారంభంలో హవాయిలోని ఒక చిన్న శాఖ‌లో నివసిస్తున్న ఒక యువ కుటుంబం యొక్క కథను వివరించారు. వారి కుమార్తెలలో ఒకరు గుర్తించబడని వ్యాధితో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినప్పుడు వారు సుమారు రెండు సంవత్సరాలుగా సంఘ సభ్యులుగా ఉన్నారు. మరుసటి ఆదివారం సంఘములో, తండ్రి మరియు అతని కొడుకు చాలా వారాలు చేసినట్లుగానే సంస్కారమును సిద్ధం చేశారు, కానీ యువ తండ్రి రొట్టెను ఆశీర్వదించడానికి మోకరిల్లినప్పుడు, శాఖాధ్యక్షుడు, సంస్కార బల్ల వద్ద ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా గ్రహించి, పైకెగిరి ఇలా అరిచాడు, “ఆపండి. మీరు సంస్కారమును తాకలేరు. మీ కూతురికి తెలియని వ్యాధి ఉంది. వేరొకరు కొత్త సంస్కారపు రొట్టెను సిద్ధంచేసే లోపు వెంటనే బయలుదేరండి. మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వలేము. వెళ్ళండి.” ఆశ్చర్యపోయిన తండ్రి శాఖాధ్యక్షుని వైపు, ఆపై సమూహం వైపు చూస్తూ, అందరిలో ఆందోళనను, ఇబ్బందిని గ్రహించి అతని కుటుంబానికి సైగ చేశాడు మరియు వారు నిశ్శబ్దంగా ప్రార్థనా మందిరం నుండి బయటకు వచ్చారు.

నిరుత్సాహంగా, ఆ కుటుంబం తమ చిన్న ఇంటికి కాలిబాట వెంట నడిచినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ వారు ఒక వృత్తాకారంలో కూర్చున్నారు మరియు “దయచేసి నేను మాట్లాడడానికి సిద్ధమయ్యే వరకు మౌనంగా ఉండండి,” అన్నాడా తండ్రి. వారు అనుభవించిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ఏమి చేస్తారోనని చిన్న కొడుకు ఆశ్చర్యపోయాడు: వారు శాఖాధ్యక్షుని పందులను చంపేస్తారా, అతని ఇంటిని తగులబెడతారా లేదా మరొక సంఘంలో చేరతారా? ఐదు, పది, పదిహేను, ఇరవై ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి.

బిగిసిన తండ్రి పిడికిలి సడలడం ప్రారంభమైంది మరియు కన్నీళ్లు వచ్చాయి. తల్లి ఏడ్వడం ప్రారంభించింది, వెంటనే పిల్లల్లో ప్రతీఒక్కరు నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. తండ్రి తన భార్య వైపు తిరిగి, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పాడు, ఆపై వారి పిల్లలలో ప్రతి ఒక్కరితో ఆ మాటలను తిరిగి చెప్పాడు. “నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మరియు మనం ఒక కుటుంబంగా ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మనమందరం యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము‌లో మంచి సభ్యులుగా ఉండడం మరియు పరిశుద్ధ యాజకత్వం ద్వారా దేవాలయంలో ముద్రవేయబడడమే ఏకైక మార్గం. ఇది శాఖాధ్యక్షుని సంఘం కాదు. ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము. ఎప్పటికీ కలిసి ఉండడం నుండి మనల్ని దూరముంచే ఏ మనిషి, ఏ గాయం, ఇబ్బంది లేదా గర్వాన్ని మనం అనుమతించము. వచ్చే ఆదివారం మనం తిరిగి సంఘానికి వెళ్తాము. మన కూతురి జబ్బు ఏమిటో తెలిసే వరకు మనం ఒంటరిగా ఉంటాం, కానీ మనం వెళ్తాం.”

వారు తిరిగి సంఘానికి వెళ్లారు, వారి కుమార్తె కోలుకుంది మరియు లేయి హవాయి దేవాలయం పూర్తయినప్పుడు ఆ కుటుంబం అందులో ముద్రవేయబడింది. ఈ రోజు, 100 కు పైగా ఆత్మలు తమ తండ్రి, తాత మరియు ముత్తాతను ధన్యుడని పిలుస్తున్నారు, ఎందుకంటే అతను నిత్యత్వంపై తన దృష్టి నిలిపాడు.25

యేసును గూర్చి సాక్ష్యంలో శూరులుగా ఉండడానికి నేను ప్రస్తావిస్తున్న చివరి అంశం, వ్యక్తిగత పరిశుద్ధత కోసం మన వ్యక్తిగత అన్వేషణ. యేసు మన ముఖ్యమైన విమోచకుడు,26 మరియు “అంత్యదినమున మీరు నా యెదుట మచ్చలేక యుండునట్లు, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడునట్లు, భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి మరియు నా నామమున బాప్తిస్మము పొందుడి”27 అని ఆయన అభ్యర్థిస్తున్నారు.

“అధికశ్రమ గుండా ప్రయాసముతో సాగిపోయినప్పటికీ”28 ఈ పద్ధతిలో పట్టుదలతో ఉన్న పరిశుద్ధుల యొక్క ఒక సమూహాన్ని ప్రవక్త మోర్మన్ వర్ణించాడు:

“అయినప్పటికీ సంతోషము మరియు ఓదార్పుతో వారి ఆత్మలు నింపబడు వరకు, అలాగే దేవునికి వారి హృదయములను వారు లోబరచుటను బట్టి వచ్చిన శుద్ధి వారి హృదయములను పవిత్రపరచి, శుద్ధి చేయువరకు కూడా వారు తరచుగా ఉపవాసముండి ప్రార్థించిరి; వారి తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అయ్యిరి.”29 మన హృదయాలను దేవునికి లోబరచడం మరియు రక్షకుని కృప ద్వారా ఆత్మీయంగా పునర్జన్మను పొందడం, హృదయం యొక్క ఈ బలమైన మార్పే మనం కోరుకునేది.30

యేసును గూర్చి సాక్ష్యంలో శూరునిగా మీ స్థానాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు పని చేయమనేది నా ఆహ్వానం. పశ్చాత్తాపం అవసరం కావచ్చు కాబట్టి, “మీ పశ్చాత్తాప దినమును వాయిదా వేయవద్దు,”31 లేదంటే “మీరు ఊహించని ఒక గడియలోనే వేసవి గతించును, కోత ముగియును మరియు మీ ఆత్మలు రక్షించబడవు.”32 దేవునితో మీ నిబంధనలను పాటించడంలో ఉత్సాహంగా ఉండండి. “వాక్యము యొక్క ఖచ్చితత్వమును బట్టి”33 నొచ్చుకోవద్దు. “మీ హృదయములలో వ్రాయబడిన [క్రీస్తు] నామమును ఎల్లప్పుడు నిలుపుకొనుటకు మీరు జ్ఞాపకముంచుకొనవలెను, … మీరు పిలువబడు స్వరమును, ఆయన మిమ్ములను పిలుచు ఆ పేరును కూడా మీరు విని ఎరుగవలెను.”34 చివరిగా, “[యేసు] బోధించి, ఆజ్ఞాపించు వాటిని చేయుదుమని మీ హృదయాలలో ఒక తీర్మానము తీసుకోండి.”35

మన తండ్రి తన పిల్లలందరూ ఆయన సిలెస్టియల్ రాజ్యంలో ఆయనతో నిత్యజీవాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు. దానిని సాధ్యం చేయడానికి యేసు బాధపడ్డారు, మరణించారు మరియు పునరుత్థానం చేయబడ్డారు. ఆయన “నరుల సంతానముపై కలిగియున్న కనికరపు హక్కులను తండ్రి నుండి పొందుటకు పరలోకములోనికి ఆరోహణుడై దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చున్నారు.”36 మనమందరం ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి బలమైన సాక్ష్యంతో ఆశీర్వదించబడాలని, ఆ సాక్ష్యంలో సంతోషించి, శూరులమై, మన జీవితాల్లో నిరంతరం ఆయన కృపా ఫలాలను అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.