సర్వసభ్య సమావేశము
అత్యున్నత ఆనందం
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అత్యున్నత ఆనందం

మనమందరం మన పరలోక తండ్రికి మరియు ఆయన ప్రియమైన కుమారునికి మన జీవితాలను అంకితం చేయడం ద్వారా వచ్చే అత్యున్నత ఆనందాన్ని వెదకుదాం మరియు కనుగొందాం.

మూడు దశాబ్దాలుగా సర్వసభ్య సమావేశంలో మాట్లాడే గొప్ప ఆశీర్వాదం నాకు లభించింది. ఆ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సందేశాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడిగారు. ఇటీవల, ఒక నిర్దిష్ట ప్రశ్న వస్తూనే ఉంది. అది సాధారణంగా ఇలా ఉంటుంది: “ఎల్డర్ ఉఖ్‌డార్ఫ్, నేను మీ చివరి ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నాను, కానీ … నేను విమానయానం గురించి ఏమీ వినలేదు.”

సరే, ఈ రోజు తర్వాత, నేను కొంతకాలం ఆ ప్రశ్న వినకపోవచ్చు.

“సూర్య కిరణాలచేత చీల్చబడి ఆనందంతో దొర్లుతున్న మేఘాలపై”1

విల్బర్ మరియు ఆర్విల్ రైట్ మొదటిసారిగా నార్త్ కరోలినాలోని కిట్టి హాక్ ఇసుక పైనుండి ఎగిరి కేవలం 120 సంవత్సరాలు అయిందంటే నమ్మడం కష్టం. ఆ డిసెంబరు రోజున నాలుగు చిన్న విమానాలు ప్రపంచాన్ని మార్చాయి మరియు ప్రపంచ చరిత్రలో గొప్ప ఆవిష్కరణలలో ఒకదానికి తలుపులు తెరిచాయి.

ఆ తొలి రోజుల్లో విమాన ప్రయాణం చాలా ప్రమాదకరం. ఈ విషయం ఆ సోదరులకు తెలుసు. అలాగే వాళ్ల నాన్న మిల్టన్‌కు కూడా తెలుసు. వాస్తవానికి, అతను తన కొడుకులిద్దరినీ విమాన ప్రమాదంలో కోల్పోతాడేమోనని చాలా భయపడ్డాడు, అయితే వారు ఎప్పటికీ కలిసి ప్రయాణించమని వాగ్దానం చేశారు.

మరియు వారు ఎప్పుడూ—ఒక్క మినహాయింపుతో తప్ప ప్రయాణించలేదు. కిట్టి హాక్ వద్ద ఆ చారిత్రాత్మక రోజు నుండి ఏడు సంవత్సరాల తరువాత, మిల్టన్ రైట్ చివరకు తన సమ్మతిని ఇచ్చాడు మరియు విల్బర్, ఆర్విల్‌లు మొదటిసారి కలిసి ప్రయాణించడాన్ని చూశాడు. క్రిందికి దిగిన తర్వాత, ఆర్విల్ తన మొదటి మరియు ఏకైక విమానంలో ఎక్కమని మరియు అది ఎలా ఉందో స్వయంగా చూడమని తన తండ్రిని ఒప్పించాడు.

విమానం నేలపై నుండి పైకి లేచినప్పుడు, 82 ఏళ్ల మిల్టన్ ఎంత ప్రయాణోత్సాహంతో నిండియున్నాడంటే, అతని భయాలన్నీ తొలగిపోయాయి. అతని తండ్రి ఆనందంతో “పైకి, ఆర్విల్, ఇంకా పైకి!” అని అరిచినప్పుడు ఆర్విల్ ఆనందించాడు.2

ఈ మనిషి నాలాగే ఉన్నాడు!

బహుశా నేను అప్పుడప్పుడు విమానయానం గురించి మాట్లాడటానికి కారణం రైట్స్ భావించిన దాని గురించి నాకు కొంత తెలిసి ఉండడమే. నేను కూడా “భూమి యొక్క బంధాలనుండి జారిపోయాను మరియు ఆనందాన్ని ప్రతిబింబించే వెండి రెక్కలతో ఆకాశంలో నృత్యం చేసాను.”3

రైట్ సహోదరుల మొదటి విమానయానం నా పుట్టుకకు కేవలం 37 సంవత్సరాల ముందు జరిగింది, ఇది నా జీవితంలో సాహసం, అద్భుతం మరియు స్వచ్ఛమైన ఆనందానికి తలుపులు తెరిచింది.

అయితే, ఆ ఆనందం ఎంత అద్భుతంగా ఉందో, అంతకన్నా ఉన్నతమైన ఆనందం కూడా ఉంది. ఈ రోజు, మిల్టన్ రైట్ యొక్క సంతోషకరమైన కేకలు, “పైకి, ఆర్విల్, ఇంకా పైకి” అనే స్ఫూర్తితో నేను ఈ ఉన్నతమైన ఆనందం గురించి మాట్లాడాలనుకుంటున్నాను—అది ఎక్కడ నుండి వస్తుంది, అది మన హృదయాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది మరియు మనం దానిని ఎలా ఎక్కువగా అనుభవించవచ్చు.

మానవ ఉనికి యొక్క సంపూర్ణ లక్ష్యం

అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం సహజం.4 అయినప్పటికీ, అందరూ సంతోషంగా ఉండరనేది స్పష్టం. దురదృష్టవశాత్తూ, చాలామందికి ఆనందాన్ని కనుగొనడం కష్టమనిపిస్తోంది.5

ఎందుకలా? మానవులమైన మనం ఎక్కువగా కోరుకునేది సంతోషమే అయితే, దానిని కనుగొనడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాము? దేశీయ సంగీతంలో ఒక పాటకు అర్థం చెప్పాలంటే, మనం అన్ని తప్పుడు ప్రదేశాలలో ఆనందం కోసం వెతుకుతున్నాము.6

మనం ఆనందాన్ని ఎక్కడ కనుగొనగలం?

ఆనందాన్ని ఎలా పొందాలో మనం చర్చించే ముందు, నిరాశ మరియు ఇతర కష్టతరమైన మానసిక, భావోద్వేగ సవాళ్లు వాస్తవమైనవని గుర్తించడానికి నన్ను అనుమతించండి మరియు సమాధానం కేవలం “సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి” అని కాదు. ఈ రోజు నా ఉద్దేశ్యం మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించడం లేదా చిన్నచూపు చూడడం కాదు. మీరు అలాంటి సవాళ్లను ఎదుర్కొంటే, నేను మీతోపాటు విలపిస్తాను మరియు మీకు అండగా ఉంటాను. కొంతమందికి, ఆనందాన్ని కనుగొనడం అనేది తమ అత్యున్నత నైపుణ్యాలను ప్రదర్శించే శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం కోరడాన్ని కూడా కలిపియుండవచ్చు. అలాంటి సహాయానికి మనం కృతజ్ఞులమై ఉండాలి.

జీవితం అనేది అంతులేని భావోద్వేగాల పరంపర కాదు. “అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుట అవసరము.”7 మరియు లేఖనాలు ధృవీకరించినట్లు దేవుడు స్వయంగా కన్నీరు విడిచినట్లయితే,8 అప్పుడు మీరు, నేను కూడా విలపిస్తాము. విచారించడం వైఫల్యానికి సంకేతం కాదు. ఈ జీవితంలో, కనీసం, ఆనందం మరియు దుఃఖం విడదీయరాని సహచరులు.9 మీ అందరిలాగే నేను కూడా నా వంతు నిరాశ, దుఃఖం, విచారం మరియు పశ్చాత్తాపాన్ని అనుభవించాను.

ఏది ఏమైనప్పటికీ, ఆత్మను చాలా గాఢమైన ఆనందంతో నింపే అద్భుతమైన ప్రారంభాన్ని కూడా నేను అనుభవించాను, అది చాలా అరుదుగా దాచబడుతుంది. ఈ శాంతియుత విశ్వాసం రక్షకుని అనుసరించడం మరియు ఆయన త్రోవలో నడవడం ద్వారా వస్తుందని నేను స్వయంగా కనుగొన్నాను.

ఆయన మనకు ఇచ్చే శాంతి లోకం ఇచ్చునటువంటిది కాదు.10 అది ఉత్తమమైనది. అది ఉన్నతమైనది మరియు పరిశుద్ధమైనది. “జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని” యేసు అన్నారు.11

యేసు క్రీస్తు సువార్త నిజంగా “మహా సంతోషకరమైన శుభవార్త”!12 ఇది సాటిలేని నిరీక్షణ యొక్క సందేశం! కాడిని మోసే మరియు భారాన్ని ఎత్తే సందేశం.13 దైవిక ప్రభావాన్ని పెంచే సందేశం. పరలోక అనుగ్రహం, ఉన్నతమైన అవగాహన, పరిశుద్ధ నిబంధనలు, శాశ్వతమైన భద్రత మరియు శాశ్వతమైన కీర్తి యొక్క సందేశం!

ఆనందమే తన పిల్లల కోసం దేవుని ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దాని కోసం మీరు సృష్టించబడ్డారు—“[మీరు] సంతోషము కలిగియుండునట్లు”!14 మీరు దాని కోసం నిర్మించబడ్డారు!

పరలోకమందున్న మన తండ్రి ఆనందానికి మార్గాన్ని దాచలేదు. అది రహస్యం కాదు. అది అందరికీ అందుబాటులో ఉంది!15

శిష్యరికం యొక్క మార్గంలో నడిచేవారికి, రక్షకుని బోధనలు మరియు మాదిరిని అనుసరించేవారికి, ఆయన ఆజ్ఞలను పాటించేవారికి మరియు ఆయనతో వారు చేసిన నిబంధనలను గౌరవించేవారికి అది వాగ్దానం చేయబడింది. ఎంత గొప్ప వాగ్దానం!

ఇవ్వడానికి దేవుడు ఇంకా ఎక్కువ కలిగియున్నాడు

సంతోషంగా ఉండటానికి దేవుడు అవసరం లేదని, మతం లేకుండా సంతోషంగా ఉన్నామని చెప్పే వ్యక్తులు మనందరికీ తెలుసు.

నేను ఈ భావాలను గుర్తించి గౌరవిస్తాను. పరలోకమందున్న మన ప్రియమైన తండ్రి తన పిల్లలందరూ వీలైనంత ఎక్కువ ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు, కాబట్టి “కంటికి ఇంపుగా ఉండుటకు, హృదయమునకు ఆనందము కలుగజేయుటకు”16 ఆయన ఈ ప్రపంచాన్ని అందమైన, ఆరోగ్యకరమైన ఆనందాలు మరియు ఆహ్లాదాలతో నింపారు. నాకైతే, ఎగరడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇతరులు దానిని సంగీతం, కళ, అభిరుచులు లేదా ప్రకృతిలో కనుగొంటారు.

ప్రతీఒక్కరిని ఆహ్వానించడం మరియు రక్షకుని యొక్క గొప్ప సంతోషకరమైన సువార్తను పంచుకోవడం ద్వారా, ఈ ఆనందం యొక్క మూలాల్లో దేనినీ మనము తగ్గించము. ఇవ్వడానికి దేవుడు ఇంకా ఏదో కలిగియున్నారని మనము చెబుతున్నాము. ఉన్నతమైన, మరింత గాఢమైన ఆనందం—ఈ ప్రపంచం అందించే దేనినైనా మించిన ఆనందం. ఇది హృదయ విదారకాలను భరించే, దుఃఖాన్ని చొచ్చుకుపోయే మరియు ఒంటరితనాన్ని తగ్గించే ఆనందం.

దీనికి విరుద్ధంగా, ప్రాపంచిక ఆనందం శాశ్వతంగా ఉండదు. అది ఉండలేదు. పాతబడటం, కుళ్ళిపోవటం, అరిగిపోవటం లేదా పాడైపోవటం భూసంబంధమైన వస్తువులన్నింటి స్వభావం. కానీ దైవిక ఆనందం శాశ్వతమైనది, ఎందుకంటే దేవుడు శాశ్వతం. యేసు క్రీస్తు మనలను తాత్కాలిక స్థితి నుండి పైకి లేపడానికి మరియు క్షయతను అక్షయతతో భర్తీ చేయడానికి వచ్చారు. ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది మరియు ఆయన ఆనందం మాత్రమే శాశ్వతమైనది.

మీ జీవితంలో ఇలాంటి సంతోషం ఇంకా ఎక్కువగా ఉండవచ్చని మీకు అనిపిస్తే, యేసు క్రీస్తును మరియు ఆయన మార్గాన్ని అనుసరించే ప్రయాణాన్ని ప్రారంభించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది జీవితకాలం మరియు అంతకు మించిన ప్రయాణం. దయచేసి స్వచ్ఛమైన ఆనందాన్ని కనుగొనే ఈ విలువైన ప్రయాణంలో కొన్ని ప్రారంభ దశలను సూచించనివ్వండి.

దేవుని యొద్దకు రండి17

క్రొత్త నిబంధనలో 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీకు గుర్తుందా?18 ఆమె తన వద్ద ఉన్నదంతా వైద్యులపై ఖర్చు చేసింది, కానీ పరిస్థితి మరింత దిగజారింది. ఆమె యేసు గురించి విన్నది; స్వస్థపరిచే ఆయన శక్తి బాగా ప్రసిద్ధమైనది. కానీ ఆయన ఆమెను స్వస్థపరచగలరా? ఆమె ఆయనను ఎలా చేరుకోగలదు? మోషే చట్ట ప్రకారం ఆమె అనారోగ్యం ఆమెను “అపవిత్రం” చేసింది, కాబట్టి ఆమె ఇతరులకు దూరంగా ఉండవలసి వచ్చింది.19

బహిరంగంగా ఆయనను సంప్రదించడం మరియు స్వస్థపరచమని అడగడం ప్రశ్నార్థకంగా అనిపించింది.

అయినప్పటికీ, “నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును”20 అని ఆమె అనుకుంది.

చివరికి, ఆమె విశ్వాసం ఆమె భయాన్ని అధిగమించింది. ఆమె ఇతరుల దూషణలను ధైర్యంగా ఎదుర్కొని, రక్షకుని వైపు ముందుకుసాగింది.

చివరకు, ఆమె అందుబాటులోకి వచ్చింది. ఆమె చెయ్యి చాచింది.

ఆమె స్వస్థపరచబడింది.

మనమందరం కొంతవరకు ఈ స్త్రీ వలె లేమా?

రక్షకుని దగ్గరకు రావడానికి మనం వెనుకాడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మనం ఇతరుల నుండి అపహాస్యం లేదా ఖండనను ఎదుర్కోవచ్చు. మన అహంకారంతో, చాలా విలువైనది చాలా సాధారణమైనదిగా ఉండే అవకాశాన్ని మనం తోసిపుచ్చవచ్చు. మన పరిస్థితి ఆయన స్వస్థత నుండి మనల్ని అనర్హులను చేస్తుందని—దూరం చాలా ఎక్కువ లేదా మన పాపాలు చాలా ఎక్కువని మనం అనుకోవచ్చు.

ఈ స్త్రీలాగే, మనం దేవునికి దగ్గరై, ఆయనను తాకడానికి ముందుకు వస్తే, మనం నిజంగా స్వస్థత, శాంతి మరియు ఆనందాన్ని పొందగలమని నేను నేర్చుకున్నాను.

దాని కోసం వెదకండి

“వెదకుడి, మీకు దొరకును” అని యేసు బోధించారు.21

ఈ సాధారణ వాక్యభాగం ఆధ్యాత్మిక వాగ్దానం మాత్రమే కాదని నేను నమ్ముతున్నాను; అది వాస్తవం యొక్క ప్రకటన.

మనం కోపంగా ఉండడానికి, సందేహించడానికి, కఠినంగా ఉండడానికి లేదా ఒంటరిగా ఉండడానికి కారణాలు వెతికితే, మనం వాటిని కూడా కనుగొంటాము.

అయితే, మనం ఆనందాన్ని వెదికితే—సంతోషించడానికి మరియు సంతోషంగా రక్షకుని అనుసరించడానికి కారణాల కోసం వెతికితే, మనం వాటిని కనుగొంటాము.

మనం వెదకని వస్తువును చాలా అరుదుగా మనం కనుగొంటాము.

మీరు ఆనందం కోసం చూస్తున్నారా?

వెదకండి, మీరు కనుగొంటారు.

ఒకని భారములు మరొకరు భరించండి22

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు బోధించారు.23

ఆనందం కోసం మన అన్వేషణలో, ఇతరులకు ఆనందాన్ని కలిగించడం దానిని కనుగొనడానికి ఉత్తమమైన మార్గం కాదా?

సహోదర సహోదరీలారా, ఇది నిజం అని మీకు తెలుసు, నాకు తెలుసు! ఆనందం అనేది ఒక పీపా పిండి లేదా ఎప్పటికీ అయిపోని నూనెబుడ్డి వంటిది.24 నిజమైన ఆనందం పంచుకున్నప్పుడు రెట్టింపు అవుతుంది.

దానికి గొప్ప లేదా సంక్లిష్టమైనదేదీ అవసరం లేదు.

మనం సాధారణ పనులు చేయవచ్చు.

ఒకరి కోసం మన పూర్ణ హృదయంతో ప్రార్థించడం.

మనఃపూర్వకంగా అభినందించడం.

ఎవరైనా స్వాగతించబడినట్లు, గౌరవించబడినట్లు చేయడం, విలువైన వారిగా మరియు ప్రియమైన వారిగా భావించేలా సహాయం చేయడం.

ఇష్టమైన లేఖనాన్ని, అది మనకిచ్చే అర్థాన్ని పంచుకోవడం వంటివి.

లేదా కేవలం వినడం ద్వారా కూడా.

“మీ తోటి ప్రాణుల సేవలో మీరున్న యెడల, మీరు మీ దేవుని సేవలోనే ఉన్నారు,”25 మరియు దేవుడు మీ దయకు ఉదారంగా ప్రతిఫలం ఇస్తారు.26 మీరు ఇతరులకు ఇచ్చే ఆనందం “అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతతో” మీకు తిరిగి వస్తుంది.27

“అయితే మనము ఏమి చేయాలి?”28

రాబోయే రోజులు, వారాలు మరియు నెలల్లో ఇలా చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను:

  • దేవునికి దగ్గరవ్వడానికి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా సమయాన్ని వెచ్చించండి.

  • నిరీక్షణ, శాంతి మరియు ఆనందం యొక్క అనుదిన క్షణాల కోసం శ్రద్ధగా వెదకండి.

  • మీ చుట్టూ ఉన్న ఇతరులకు ఆనందాన్ని అందించండి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియ మిత్రులారా, దేవుని నిత్య ప్రణాళిక గురించి లోతైన అవగాహన కోసం మీరు దేవుని వాక్యాన్ని శోధిస్తున్నప్పుడు, ఈ ఆహ్వానాలను అంగీకరించి, ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నించినప్పుడు, మీరు బాధల మధ్య కూడా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును”29 అనుభవిస్తారు. మీ హృదయంలో దేవుని అపురూపమైన ప్రేమ ఉప్పొంగుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. దైవిక ప్రభావం యొక్క ఆరంభం మీ శ్రమల యొక్క అంధకారం నుండి చొచ్చుకుపోతుంది మరియు కనబడని, పరిపూర్ణమైన, పరలోక రాజ్యం యొక్క చెప్పలేని మహిమలు మరియు అద్భుతాలను మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. మీ ఆత్మ ఈ ప్రపంచం యొక్క గురుత్వాకర్షణ నుండి దూరంగా ఉన్నట్టు మీరు భావిస్తారు.

మరియు మంచి మిల్టన్ రైట్ లాగా, బహుశా మీరు సంతోషిస్తూ మీ స్వరాన్ని పైకెత్తి, “పైకి, తండ్రీ, ఇంకా పైకి!” అని అరుస్తారు.

మనమందరం మన పరలోక తండ్రికి మరియు ఆయన ప్రియమైన కుమారునికి మన జీవితాలను అంకితం చేయడం ద్వారా వచ్చే అత్యున్నత ఆనందాన్ని వెదకుదాం మరియు కనుగొందాం. ఇది నా మనఃపూర్వకమైన ప్రార్థన మరియు దీవెన, యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. John Gillespie Magee Jr., “High Flight,” poetryfoundation.org.

  2. See Christopher Klein, “10 Things You May Not Know about the Wright Brothers,” History, Mar. 28, 2023, history.com.

  3. Magee, “High Flight.”

  4. ఇరవై నాలుగు వందల సంవత్సరాల క్రితం, అరిస్టాటిల్ మానవులందరూ ఎక్కువగా కోరుకునేది ఆనందం అని గమనించాడు. అతని గ్రంథం నికోమాచియన్ ఎథిక్స్‌లో, జీవితంలో గొప్ప మేలు అనేది మనం అంతిమంగా కొనసాగించే విషయం అని అతడు బోధించాడు (మనం అనుసరించే విషయాలకు విరుద్ధంగా, అది మరొక అంతానికి సాధనంగా ఉంటుంది). ఆనందం, అన్నిటికీ మించి, అలాంటిది. “మనము ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటాము,” “దాని స్వంత ప్రయోజనాల కోసం మరియు ఎప్పుడూ వేరొక దాని కోసం కాదు” అని అతను చెప్పాడు (The Nicomachean Ethics of Aristotle, trans. J. E. C. Weldon [1902], 13–14).

  5. See Harry Enten, “American Happiness Hits Record Lows,” CNN, Feb. 2, 2022, cnn.com; Tamara Lush, “Poll: Americans Are the Unhappiest They’ve Been in 50 Years,” Associated Press, June 16, 2020, apnews.com; “The Great Gloom: In 2023, Employees Are Unhappier Than Ever. Why?” BambooHR, bamboohr.com.

  6. See Wanda Mallette, Patti Ryan, and Bob Morrison, “Lookin’ for Love (in All the Wrong Places)” (1980).

  7. 2 నీఫై 2:11.

  8. యోహాను 11:35; మోషే 7:28–37 చూడండి.

  9. 2 నీఫై 2:11 చూడండి.

  10. యోహాను 14:27 చూడండి.

  11. యోహాను 10:10.

  12. లూకా 2:10, క్రొత్తగా సవరించబడిన ప్రామాణిక అనువాదం.

  13. మత్తయి 11:28–30 చూడండి.

  14. 2 నీఫై 2:25.

  15. పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని అంగీకరించి, ఆయన ఆనందాన్ని పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తారా లేదా అనే దాని గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, తప్పిపోయిన కుమారుని గురించి క్రీస్తు ఉపమానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను (లూకా 15:11–32 చూడండి). ఆ ఉపమానంలో, మన పరలోక తండ్రి తన పిల్లల గురించి ఎలా భావిస్తున్నారో మరియు మనం ఆయన నుండి తప్పిపోయిన తర్వాత మన పునరాగమనానికి ఆయన ఎలా ఎదురుచూస్తున్నారో మరియు వేడుక చేసుకుంటారో తెలుసుకుంటాము! మనకు “బుద్ధి వచ్చినప్పుడు” (17వ వచనం చూడండి) మరియు ఇంటికి ప్రయాణం ప్రారంభించిన క్షణం నుండి, ఆయన మనల్ని చూస్తారు, ఎందుకంటే ఆయన చూస్తూ, వేచి ఉన్నారు. ఆయన దేని కోసం ఎదురు చూస్తున్నారు? మన కోసం! మనం ఆయనకు దగ్గరవుతున్నప్పుడు, ఆయన మన పునరాగమనాన్ని వేడుక చేసుకుంటారు మరియు మనలను తన బిడ్డ అని పిలుస్తారు.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 59:18. “ఇవన్నీ మనుష్యునికిచ్చుట దేవునికి ఆనందము కలిగించును; ఈ హేతువు చేతనే ఇవన్నీ చేయబడెను” (20వ వచనము) అని కూడా ఈ బయల్పాటు వివరిస్తుంది.

  17. దేవునికి దగ్గరయ్యే వారికి ఆయన ఈ గొప్ప వాగ్దానాన్ని ఇస్తారు: “నేను మీ యొద్దకు వచ్చెదను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63; యాకోబు 4:8 కూడా చూడండి).

  18. మార్కు 5:24–34 చూడండి.

  19. See Bible Dictionary, “Clean and Unclean.”

  20. మార్కు 5:28.

  21. మత్తయి 7:7.

  22. ఒకని భారముల నొకడు భరించుట ద్వారా మనం “క్రీస్తు నియమమును నెరవేర్చుతాము” (గలతీయులకు 6:2; మోషైయ 18:8 కూడా చూడండి).

  23. అపొస్తలుల కార్యములు 20:35.

  24. 1 రాజులు 17:8–16 చూడండి.

  25. మోషైయ 2:17.

  26. దేవుడు “ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును: సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును: … సత్‌క్రియచేయు ప్రతివానికి, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును” (రోమా 2:6–7, 10) అని రోమీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు వ్యాఖ్యానించాడు.

  27. లూకా 6:38. మన రక్షణ మరియు నిత్య సంతోషం ఇతరుల పట్ల మన కరుణ మరియు దయపై ఆధారపడి ఉండవచ్చు (మత్తయి 25:31–46 చూడండి).

  28. లూకా 3:10.

  29. ఫిలిప్పీయులకు 4:7.