సర్వసభ్య సమావేశము
నిబంధనలు మరియు బాధ్యతలు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నిబంధనలు మరియు బాధ్యతలు

యేసు క్రీస్తు యొక్క సంఘము దేవునితో నిబంధనలు చేయడాన్ని నొక్కి చెప్పే సంఘమని పిలువబడింది.

“మీ సంఘము ఇతరుల నుండి భిన్నంగా ఎలా ఉంటుంది?” ఈ ముఖ్యమైన ప్రశ్నకు నా సమాధానం నేను పరిణతి చెందినప్పుడు మరియు సంఘము వృద్ధి చెందినప్పుడు మారుతూ ఉంటుంది. 1932లో యూటాలో నేను పుట్టినప్పుడు, మన సంఘ సభ్యత్వము దాదాపు 700,000 మంది మాత్రమే ఉండి, ఎక్కువగా యూటా మరియు సమీప రాష్ట్రాల్లో సమకూర్చబడింది. ఆ సమయంలో, మనకు 7 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు దాదాపు 170 దేశాలలో 17 మిలియన్లకు పైగా ఉన్నారు. ఈ ఏప్రిల్ 1వ తేదీ నాటికి, మనం అనేక దేశాల్లో ప్రతిష్ఠించబడిన 189 దేవాలయాలను, ప్రణాళిక మరియు నిర్మాణంలో ఉన్న మరో 146 దేవాలయాలను కలిగియున్నాము. ఈ దేవాలయాల గురించి, మన ఆరాధనలో నిబంధనల చరిత్ర మరియు పాత్ర గురించి నేను ప్రసంగించాలని భావించాను. ఇది మునుపటి ప్రసంగీకుల ప్రేరేపించబడిన బోధనలకు అనుబంధంగా ఉంటుంది.

I.

నిబంధన అనేది నిర్దిష్టమైన బాధ్యతలు నెరవేర్చడానికి ఒక నిబద్ధత. మన వ్యక్తిగత జీవితాల నియంత్రణకు మరియు సమాజం యొక్క క్రమమైన పనితీరుకు వ్యక్తిగత నిబద్ధతలు ముఖ్యమైనవి. ఈ ఆలోచన ప్రస్తుతం సవాలు చేయబడుతోంది. తమ అభిప్రాయాలను తరచుగా, బలంగా వ్యక్తపరిచే చిన్న గుంపులు సంస్థాగత అధికారాన్ని వ్యతిరేకిస్తాయి మరియు వ్యక్తులు వారి వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేసే ఎలాంటి పరిమితుల నుండైనా విడుదల పొందాలని పట్టుబడతారు. అయినప్పటికీ వ్యవస్థీకృత సమాజాలలో జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందేందుకు మనం కొన్ని వ్యక్తిగత స్వేచ్ఛలను వదులుకుంటామని సహస్రాబ్దాల అనుభవం నుండి మనకు తెలుసు. వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క అటువంటి పరిమితులు ప్రధానంగా నిబద్ధతలు లేదా నిబంధనలపై ఆధారపడి ఉంటాయి, వ్యక్తీకరించబడతాయి లేదా సూచించబడతాయి.

చిత్రం
సైనిక సిబ్బంది.
చిత్రం
వైద్య సిబ్బంది.
చిత్రం
అగ్నిమాపక సిబ్బంది.
చిత్రం
పూర్తి-కాల సువార్తికులు.

మన సమాజంలో నిబంధన బాధ్యతల నిర్వహణకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి: (1) న్యాయమూర్తులు, (2) సైనికులు, (3) వైద్య సిబ్బంది మరియు అగ్నిమాపక సిబ్బంది. ఈ పరిచయమైన వృత్తులలో పాలుపంచుకున్న వారందరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించేందుకు—తరచూ ప్రమాణం లేదా నిబంధన—ద్వారా క్రమబద్ధీకరించబడతారు. మన పూర్తి-కాల సువార్తికులకు ఇదే వర్తిస్తుంది. ప్రత్యేకమైన దుస్తులు లేదా పేరుగల చీటీలు వాటిని ధరించే వారు నిబంధన క్రింద ఉన్నారని, అందువలన వారు బోధించడానికి, సేవ చేయడానికి ఒక బాధ్యత కలిగియున్నారని మరియు ఆ సేవలో మద్దతు ఇవ్వబడాలని సూచించడానికి ఉద్దేశించబడ్డాయి. వారి నిబంధన బాధ్యతలను అవి ధరించిన వారికి గుర్తు చేయడమే సంబంధిత ఉద్దేశ్యం. వారి ప్రత్యేకమైన దుస్తులు లేదా చిహ్నాలలో ఏ ఇంద్రజాలం లేదు, ధరించిన వారు స్వీకరించిన ప్రత్యేక బాధ్యతల గురించి అవసరమైన జ్ఞాపకార్థము మాత్రమే ఉంది. నిశ్చితార్థం లేదా వివాహ ఉంగరాల చిహ్నాలు మరియు పరిశీలకులకు సూచనను ఇవ్వడంలో లేదా వారి నిబంధన బాధ్యతలను ధరించిన వారికి గుర్తు చేయడంలో వాటి పాత్ర విషయంలో కూడా ఇది నిజం.

చిత్రం
వివాహ ఉంగరాలు.

II.

వ్యక్తుల జీవితాల క్రమబద్ధీకరణకు మరియు సమాజం యొక్క పనితీరుకు నిబంధనలు పునాది అని నేను చెప్పినది ముఖ్యంగా మతపరమైన నిబంధనలకు వర్తిస్తుంది. అనేక మతపరమైన అనుబంధాలు మరియు అవసరాల యొక్క పునాది మరియు చరిత్ర నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, అనేక గొప్ప మతపరమైన ఆచారాలకు అబ్రాహాము నిబంధన ప్రధానమైనది. ఆయన పిల్లలతో దేవుని యొక్క నిబంధన వాగ్దానాలను గూర్చి గొప్ప ఆలోచనను అది పరిచయం చేస్తుంది. పాత నిబంధన అబ్రాహాము మరియు అతని సంతానముతో దేవుని యొక్క నిబంధనను తరచుగా సూచిస్తుంది.1

మోర్మన్ గ్రంథములో మొదటి భాగము, పాత నిబంధన కాలములో వ్రాయబడింది, ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు ఆరాధనలో నిబంధనల పాత్రను స్పష్టంగా రుజువు చేస్తుంది. ఆ కాలము యొక్క ఇశ్రాయేలీయుల రచనలు “యూదుల యొక్క వృత్తాంతమని, అది ప్రభువు యొక్క నిబంధనలను కలిగియున్నదని, ఇశ్రాయేలీయుల వంశస్థులతో చేసిన ఆయన నిబంధనలను కలిగియున్నది”2 అని నీఫై చెప్పబడ్డాడు. నీఫై గ్రంథములు కూడా అబ్రాహాము నిబంధనను 3 మరియు ఇశ్రాయేలీయులను “ప్రభువు యొక్క నిబంధన జనులుగా”4 తరచుగా ప్రస్తావించాయి. దేవునితో లేదా మత నాయకులతో నిబంధన చేసే ఆచారము నీఫై, ఐగుప్తులోని యోసేపు, రాజైన బెంజమిన్, ఆల్మా మరియు సైన్యాధికారి అయిన మొరోనై గురించి వ్రాయబడిన మోర్మన్ గ్రంథ రచనలలో కూడా నమోదు చేయబడింది.5

III.

యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన కొరకు సమయము వచ్చినప్పుడు, దేవుడు జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా పిలిచారు. పరిణితి చెందుతున్న ఈ యౌవన ప్రవక్తకు మొరోనై ఇచ్చిన ప్రారంభ సూచనల యొక్క పూర్తి సారాంశము మనకు తెలియదు. “[అతడు] చేయవలసిన ఒక కార్యమును దేవుడు కలిగియున్నాడని” మరియు “తండ్రులకు చేయబడిన వాగ్దానములతో” కలిపి “నిత్య సువార్త సంపూర్ణముగా” తేబడవలెనని, అతడు జోసెఫ్‌కు చెప్పాడని మనకు తెలుసు.6 అతడు ఒక సంఘాన్ని నిర్వహించడానికి నడిపించబడకముందే—బాలుడైన జోసెఫ్ మిక్కిలి లోతుగా చదివిన లేఖనాలు—అతడు మోర్మన్ గ్రంథములో అనువదిస్తున్న నిబంధనలకు సంబంధించిన అనేక బోధనలని కూడా మనకు తెలుసు. ఆయన పిల్లల కొరకు దేవుని ప్రణాళికతో సహా, సువార్త యొక్క సంపూర్ణత కొరకు ఆ గ్రంథము పునఃస్థాపన యొక్క ప్రధాన మూలం మరియు మోర్మన్ గ్రంథము నిబంధనలకు సంబంధించిన సూచనలతో నింపబడి ఉన్నది.

బైబిలును బాగా చదివియున్నందు వలన, “ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను క్రొత్తనిబంధన చేయుటకు”7 రక్షకుని యొక్క ఉద్దేశ్యానికి సంబంధించి హెబ్రీయుల గ్రంథము గురించి జోసెఫ్‌కు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. హెబ్రీయులు యేసును “క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా”8 సూచిస్తుంది. విశేషమేమిటంటే, రక్షకుని యొక్క మర్త్య పరిచర్యకు సంబంధించిన బైబిలు వృత్తాంతము “క్రొత్త నిబంధనగా” పేరు పెట్టబడింది, అది “నూతన నిబంధనకు” వాస్తవిక పర్యాయపదం.

సువార్త యొక్క పునఃస్థాపనలో నిబంధనలు పునాదిగా ఉన్నాయి. ఆయన సంఘాన్ని నిర్వహించేందుకు ప్రభువు ప్రవక్తను నిర్దేశించిన తొలి దశలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మోర్మన్ గ్రంథము ప్రచురింపబడిన వెంటనే, ప్రభువు పునఃస్థాపించబడిన తన సంఘము యొక్క నిర్మాణమును నిర్దేశించారు, త్వరలో అది యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘముగా పేరు పెట్టబడింది.9 1830, ఏప్రిల్‌లో ఇవ్వబడిన బయల్పాటు ఇలా సూచిస్తుంది, వ్యకులు “వారి పాపములన్నింటి నిమిత్తము వారు నిజముగా పశ్చాత్తాపపడ్డారని, యేసు క్రీస్తు నామమును తమపై తీసుకొనుటకు సిద్ధముగాయున్నారని, అంతము వరకు ఆయనకు సేవ చేయడానికి దృఢ సంకల్పము కలిగియున్నారని సాక్ష్యమిచ్చిన” (దాని అర్థము గంభీరముగా సాక్ష్యమిచ్చుట) తరువాత, “వారు బాప్తిస్మము ద్వారా ఆయన సంఘములోనికి స్వీకరించబడుదురు.”10

సంఘము “ప్రభువైన యేసు జ్ఞాపకార్థము రొట్టె, ద్రాక్షారసములో [నీరు] పాలుపొందుటకు తరచు కూడుకొనవలెనని” తరువాత అదే బయల్పాటు సూచించింది. ఈ విధి యొక్క ప్రాముఖ్యత దానిని నిర్వహించే ఎల్డరు లేదా యాజకుని కోసం ప్రత్యేకించబడిన నిబంధనల మాటలలో స్పష్టంగా కనబడుతుంది. అతడు రొట్టె యొక్క చిహ్నములను “దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి … , తద్వారా వారు … ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని సాక్ష్యమిచ్చెదరు”11 అని దీవిస్తాడు.

ఆయన బయల్పాటుల యొక్క మొదటి ప్రచురణ కొరకు ప్రభువు ఇచ్చిన ముందుమాటలో క్రొత్తగా పునఃస్థాపించబడిన సంఘములో నిబంధనల యొక్క ప్రధాన పాత్ర పునరుద్ఘాటించబడింది. భూ నివాసులు “నా విధులనుండి తొలగిపోయి, నా నిత్య నిబంధనను అతిక్రమించిరి”12 కనుక, జోసెఫ్ స్మిత్‌ను పిలిచానని అక్కడ ప్రభువు ప్రకటించారు. “నా నిత్య నిబంధన స్థిరపరచబడాలని”13 ఆయన ఆజ్ఞలు ఇవ్వబడినవని ఈ బయల్పాటు మరింతగా వివరిస్తుంది.

ఈరోజు పునఃస్థాపించబడిన సంఘములో మరియు దాని సభ్యుల ఆరాధనలో నిబంధనల యొక్క పాత్రను మనము గ్రహించాము. మన బాప్తిస్మము మరియు వారం వారం సంస్కారములో పాల్గొనుట యొక్క ప్రభావము గురించి అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ ఈ సారాంశమునిచ్చారు: “బాప్తిస్మపు నీళ్ళలో ప్రవేశించిన ఈ సంఘము యొక్క ప్రతీ సభ్యుడు ఒక పరిశుద్ధ నిబంధనలో ఒక పక్షముగా అవుతారు. ప్రభురాత్రి భోజన సంస్కారములో మనము పాల్గొన్న ప్రతిసారీ, మనము ఆ నిబంధనను క్రొత్తదిగా చేస్తాము.”14

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, తరచుగా రక్షణ ప్రణాళికను “నిబంధన బాటగా” సూచించారని, అది “[దేవుని] వద్దకు తిరిగి మనల్ని నడిపిస్తుంది” మరియు “దేవునితో మన అనుబంధానికి సంబంధించినది”15 అని ఈ సమావేశంలో అనేకమంది ప్రసంగీకుల చేత మనము జ్ఞాపకం చేయబడ్డాము. మన దేవాలయ ఆచారక్రియలలో నిబంధనల యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన బోధించారు, ఆరంభము నుండి అంతమును చూడమని మరియు “మహోన్నతంగా ఆలోచించమని”16 మనల్ని ప్రేరేపిస్తున్నారు.

IV.

ఇప్పుడు నేను దేవాలయ నిబంధనల గురించి ఎక్కువగా మాట్లాడతాను. యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను పునఃస్థాపించుటకు తన బాధ్యతను నెరవేర్చుటలో, ఇల్లినాయ్‌లోని నావూలో దేవాలయ నిర్మాణమును నడిపించడానికి ప్రవక్త జోసెఫ్ స్మిత్ తన చివరి సంవత్సరాలలో ఎక్కువ సమయాన్ని గడిపాడు. దేవాలయాలలో అతని తర్వాత వచ్చేవారు నిర్వహించడానికి అతని ద్వారా ప్రభువు పవిత్రమైన బోధనలు, సిద్ధాంతము మరియు నిబంధనలు బయల్పరిచారు. వరమివ్వబడిన వ్యక్తులు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక బోధింపబడతారు మరియు పవిత్ర నిబంధనలు చేయడానికి ఆహ్వానించబడతారు. ఆ నిబంధనలపట్ల విశ్వాసంగా జీవించిన వారు నిత్యజీవము వాగ్దానమివ్వబడ్డారు, అక్కడ “అన్ని సంగతులు వారివే” మరియు వారు “దేవుని సన్నిధిలో, ఆయన యొక్క క్రీస్తు సన్నిధిలో నిరంతరము నివసించెదరు.”17

పశ్చిమాన ఉన్న మారుమూల పర్వతాలకు వారి చారిత్రాత్మక ప్రయాణం ప్రారంభించడానికి బహిష్కరింపబడక ముందు మన పూర్వ అగ్రగాములకు నావూ దేవాలయంలో వరము పొందే వేడుకలు నిర్వహించబడ్డాయి. నావూ దేవాలయంలో వారి వరములలో క్రీస్తుతో బంధింపబడినప్పుడు వారు పొందిన శక్తి వారి మహనీయమైన ప్రయాణం చేయడానికి మరియు పశ్చిమాన తమను తాము స్థాపించుకోవడానికి వారికి బలమిచ్చిందని ఆ అగ్రగాములలో అనేకమంది సాక్ష్యాలు మనకు ఉన్నాయి.18

పరిశుద్ధ దేవాలయంలో వరము ఇవ్వబడిన వ్యక్తులు ఒక దేవాలయ వస్త్రమును ధరించడానికి బాధ్యత కలిగియున్నారు, అది కనిపించని వస్త్రము, ఎందుకనగా అది బయటి దుస్తుల క్రింద ధరింపబడుతుంది. ఇది వరము పొందిన సభ్యులకు వారు చేసిన పరిశుద్ధ నిబంధలను గూర్చి మరియు పరిశుద్ధ దేవాలయంలో వారికి వాగ్దానము చేయబడిన దీవెనలను గూర్చి జ్ఞాపకం చేస్తుంది. ఆ పరిశుద్ధమైన ఉద్దేశ్యాలను సాధించడానికి, కేవలం స్పష్టంగా అవసరమైన మినహాయింపులతో, నిరంతరం దేవాలయ వస్త్రాలను ధరించడానికి మనము ఉపదేశించబడ్డాము. నిబంధనలు “సెలవు తీసుకోవు,” కనుక ఒకరి వస్త్రాలను తొలగించడం అనేది వారికి సంబంధించిన బాధ్యతలు మరియు ఆశీర్వాదాల యొక్క నిరాకరణగా అర్థం చేసుకోవచ్చు. దానికి విరుద్ధంగా, వారి వస్త్రములను విశ్వాసంగా ధరించి, వారి దేవాలయ నిబంధనలను పాటించే వారు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా వారి పాత్రను నిరంతరం నిర్ధారిస్తున్నారు.

చిత్రం
దేవాలయాల పటము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ప్రపంచమంతటా దేవాలయాలను నిర్మిస్తున్నది. వాటి ఉద్దేశమేదనగా, దేవుని యొక్క నిబంధన పిల్లలను దేవాలయ ఆరాధనతో, పవిత్రమైన బాధ్యతలు, అధికారాలతో మరియు క్రీస్తుకు కట్టుబడియుండడం వలన నిబంధన ద్వారా వారు పొందిన ప్రత్యేకమైన దీవెనలతో దీవించడం.

చిత్రం
సావో పాలో బ్రెజిల్ దేవాలయము

యేసు క్రీస్తు యొక్క సంఘము దేవునితో నిబంధనలు చేయడాన్ని నొక్కి చెప్పే సంఘమని పిలువబడింది. పునఃస్థాపించబడిన ఈ సంఘము నిర్వహించే రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క రక్షణ విధులు ప్రతీదానిలో నిబంధనలు అంతర్లీనంగా ఉంటాయి. బాప్తిస్మపు విధి మరియు దాని సంబంధిత నిబంధనలు సిలెస్టియల్ రాజ్యములో ప్రవేశించడానికి ఆవశ్యకమైన అర్హతలు. దేవాలయ విధులు మరియు సంబంధిత నిబంధనలు సిలెస్టియల్ రాజ్యములో ఉన్నత స్థితి కొరకు ఆవశ్యకమైన అర్హతలు, అది నిత్యజీవము, “దేవుని యొక్క బహుమానాలన్నిటిలో మిక్కిలి గొప్పది.”19 అది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క దృష్టియైయున్నది.

ఆ సంఘము యొక్క అధిపతి అయిన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను మరియు తమ పవిత్ర నిబంధనలను పాటించడానికి కోరు వారందరిపై ఆయన దీవెనలు కోరుతున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.