సర్వసభ్య సమావేశము
నేను కనిన, వినిన విషయముల యొక్క వృత్తాంతము
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నేను కనిన, వినిన విషయముల యొక్క వృత్తాంతము

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సభ్యుడిగా ఉండటానికి ఇంతకు మించిన మంచి సమయం ఎన్నడూ లేదు.

నేను లా స్కూల్ నుండి పట్టభద్రుడినయ్యాక, నా భార్య మార్సియా, మరియు నేను విచారణ చట్టములో ప్రత్యేకించబడిన న్యాయ సంస్థలో చేరాలని ఎంచుకున్నాము. నేను నా ఉద్యోగ శిక్షణను ప్రారంభించినప్పుడు, విచారణలో సాక్ష్యం చెప్పడానికి సాక్షులను సిద్ధం చేయడానికి నా సమయాన్ని ఎక్కువగా వెచ్చించాను. సాక్షులు ప్రమాణ పూర్తిగా, వారు చూసిన మరియు విన్నవాటిలో సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంతో, కోర్టు గదిలో వాస్తవాలు నిర్ధారించబడతాయని నేను త్వరగా నేర్చుకున్నాను. సాక్షులు సాక్ష్యమిచ్చినట్లుగా, వారి మాటలు నమోదు చేయబడ్డాయి మరియు భద్రపరచబడ్డాయి. విశ్వసనీయమైన సాక్షుల ప్రాముఖ్యత నా సిద్ధపాటులో ఎల్లప్పుడూ ముందంజలో ఉండేది.

న్యాయవాదిగా నేను ప్రతిరోజూ వాడుతున్న పదాలే నా సువార్త సంభాషణలలో కూడా నేను ఉపయోగించిన పదాలు అని గ్రహించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. “సాక్షి” మరియు “సాక్ష్యం” అనేవి మనం యేసు క్రీస్తు సువార్త యొక్క యథార్థత గురించి మన జ్ఞానాన్ని మరియు భావాలను పంచుకోవడానికి ఉపయోగించే పదాలు.

నేను కొత్త ప్రాంతీయ డెబ్బదిగా ఆమోదించబడినప్పుడు, నా విధులను నేర్చుకోవడానికి నేను లేఖనాలను తెరిచినప్పుడు, నేను సిద్ధాంతము మరియు నిబంధనలు 107:25ని చదివాను, అందులో, “డెబ్బదిమంది కూడా … అన్యజనులకు సర్వలోకములో ప్రత్యేక సాక్షులుగానుండుటకు పిలువబడిరి” అని చెప్పబడింది. మీరు ఊహించినట్లుగా, నా కళ్ళు “ప్రత్యేక సాక్షులు” అనే పదం వైపుకు ఆకర్షించబడ్డాయి. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా యేసు క్రీస్తు నామమును గురించి సాక్ష్యమివ్వడానికి, నా సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని స్పష్టమైంది.

ప్రత్యక్ష సాక్షులుగా ఉండి, చూసిన వాటిని మరియు విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చిన అనేక ఉదాహరణలు లేఖనములలో ఉన్నాయి.

ప్రాచీన ప్రవక్త అయిన మోర్మన్ తన వృత్తాంతమును ప్రారంభించినప్పుడు, అతను ఇలా వ్రాశాడు, “ఇప్పుడు మోర్మన్‌ అను నేను, నేను కనిన, వినిన విషయముల యొక్క వృత్తాంతమును వ్రాయుచున్నాను మరియు దానిని మోర్మన్‌ గ్రంథము అని పిలిచెదను.”1

రక్షకుని అపొస్తలులైన పేతురు మరియు యోహాను నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట ఒక వ్యక్తిని స్వస్థపరిచారు.2 యేసు నామంలో మాట్లాడకూడదని ఆజ్ఞాపించబడినప్పుడు, వారిలా ప్రతిస్పందించారు:

“దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి.

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము.” 3

రక్షకుడైన యేసు క్రీస్తు సందర్శనను చూసిన మోర్మన్ గ్రంథ పరిశుద్ధుల నుండి మరొక ప్రేరేపించే సాక్ష్యం వచ్చింది. వారి సాక్ష్యానికి సంబంధించిన ఈ వివరణను వినండి: “ఈ విధముగా వారు సాక్ష్యమిచ్చిరి: యేసు, తండ్రితో మాట్లాడగా మేము చూచిన మరియు వినిన అంత గొప్ప అద్భుతమైన విషయములు ముందెన్నడూ కన్ను చూసియుండలేదు లేదా చెవి వినియుండలేదు.”4

సహోదర సహోదరీలారా, ఈ రోజు నేను నా సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాను మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క డెబ్బదిగా నా పవిత్రమైన పరిచర్యలో నేను చూసిన మరియు వినిన వాటిని నమోదు చేస్తున్నాను. అలా చేయడం ద్వారా ప్రేమగల పరలోక తండ్రి మరియు ఆయన దయగల కుమారుడైన యేసు క్రీస్తు గురించి మీకు సాక్ష్యమిస్తున్నాను, ఆయన దేవుని పిల్లలకు శాశ్వత జీవితాన్ని అందించడానికి బాధలు అనుభవించి, మరణించి, తిరిగి లేచారు. “ఒక ఆశ్చర్యకార్యమును మరియు అద్భుతమును”5 గురించి, ఆయన సజీవ ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా భూమిపై తన సువార్తను పునరుద్ధరించడానికి మరోసారి ప్రభువు తన చేయిని చాపారని నేను సాక్ష్యమిస్తున్నాను.6 నేను చూసిన మరియు వినిన వాటి ఆధారంగా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సభ్యుడిగా ఉండటానికి ఈ రోజు కంటే మెరుగైన సమయం ఎన్నడూ ఉండలేదని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను చూసిన మరియు వినిన వాటి కారణంగా, ఇతర మూలాల నుండి స్వతంత్రంగా, నా స్వంత జ్ఞానంతో ఇది నాకు తెలుసు.

నేను ఉన్నత పాఠశాల‌లో చదివిన సీనియర్ సంవత్సరంలో, సెమినరీ నుండి పట్టభద్రత పొందడానికి, నేను సంఘము యొక్క మొత్తం 15 దేవాలయాలను గుర్తించాల్సి వచ్చింది. మా తరగతి గది ముందు ప్రతి దేవాలయం యొక్క చిత్రం ఉన్నది మరియు ప్రతి ఒక్కటి ఎక్కడ ఉందో నేను తెలుసుకోవాలి. ఇప్పుడు, సంవత్సరాల తర్వాత, నిర్వహించబడుతున్న లేదా ప్రకటించిన 335 దేవాలయాలను ఒక్కొక్కటిగా గుర్తించడం ఒక పెద్ద సవాలు. నేను ప్రభువు యొక్క అనేక గృహాలను వ్యక్తిగతంగా చూశాను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పిల్లలకు ప్రభువు తన ఆశీర్వాదాలు మరియు విధులను అందజేస్తున్నారని సాక్ష్యమిస్తున్నాను.

FamilySearchలో ఉన్న నా స్నేహితులు ప్రతిరోజు FamilySearchకి పది లక్షల కొత్త పేర్లు జోడించబడుతున్నాయని నాకు తెలిపారు. నిన్న మీరు మీ పూర్వీకులను కనుగొనలేకపోతే, మళ్లీ రేపు చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తెరకు మరొక వైపున ఇశ్రాయేలును సమకూర్చు విషయానికి వస్తే, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సభ్యుడిగా ఉండటానికి ఈ రోజు కంటే మంచి సమయం ఎన్నడూ లేదు.

మార్సియా మరియు నేను ఐడహోలోని ట్విన్ ఫాల్స్‌లో మా పిల్లలను పెంచినప్పుడు, ప్రపంచవ్యాప్త సంఘము గురించి నా దృక్కోణం పరిమితంగా ఉంది. నేను ప్రధాన అధికారిగా పిలువబడినప్పుడు, మార్సియా మరియు నేను పసిఫిక్ ప్రాంతంలో సేవ చేయడానికి నియమించబడ్డాము, అది మేము ఎన్నడూ వెళ్ళని ప్రదేశం. 1958లో ప్రతిష్ఠించబడిన ఒక దేవాలయంతో, న్యూజిలాండ్ ఎగువ నుండి దిగువ వరకు స్టేకులను కనుగొనడం మాకు సంతోషాన్ని కలిగించింది. సెమినరీలో నేను కంఠస్తము చేయాల్సిన 15లో అది ఒకటి. మేము ఆస్ట్రేలియాలోని ప్రతి ప్రధాన నగరంలో దేవాలయాలను కనుగొన్నాము, ఆ ఖండం అంతటా స్టేకులున్నాయి. 25 స్టేకులున్న సమోవాలో మరియు దాదాపు సగం జనాభా సంఘ సభ్యులైన టోంగాలో మాకు నియమితకార్యములు ఉన్నాయి. కిరిబాటి ద్వీపంలో మాకు ఒక నియామకం జరిగింది, అక్కడ మేము రెండు స్టేకులు కనుగొన్నాము. మార్షల్ దీవులలోని ఎబెయ్ మరియు పాపువా న్యూ గినియాలోని దారూలో స్టేకులను సందర్శించడానికి మాకు నియమితకార్యములు ఉన్నాయి.

పసిఫిక్ దీవులలో మా సేవ తర్వాత, మేము ఫిలిప్పీన్స్‌లో సేవ చేయడానికి నియమించబడ్డాము. నా ఆశ్చర్యానికి, ఫిలిప్పీన్స్‌లోని యేసు క్రీస్తు యొక్క సంఘము నేను గ్రహించిన దానిని మించి పెరుగుతోంది. ఇప్పుడు 125 స్టేకులు, 23 మిషన్లు మరియు 13 నిర్వహించబడుతున్న లేదా ప్రకటించబడిన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేశంలో నేను 850,000 మందికి పైగా సభ్యులతో కూడిన సంఘమును చూశాను. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రీస్తు యొక్క సంఘ స్థాపనను నేను ఎలా కోల్పోయాను?

ఫిలిప్పీన్స్‌లో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత, మిషనరీ కార్యాలయంలో సేవ చేయమని నన్ను అడిగారు. నా నియమితకార్యము మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషనుల వద్దకు తీసుకెళ్లింది. రక్షకుని ప్రపంచవ్యాప్త సంఘము గురించి నా దృక్పథం విశేషంగా విస్తరించింది. మార్సియా మరియు నేను ఆసియాలోని మిషన్లను సందర్శించడానికి నియమించబడ్డాము. మేము సింగపూర్‌లో అద్భుతమైన, నమ్మకమైన సభ్యులతో కూడిన అందమైన స్టేకు కేంద్రాన్ని కనుగొన్నాము. మేము మలేషియాలోని కోట కినాబాలులోని ఒక సంఘ భవనంలో సభ్యులను మరియు సువార్తికులను సందర్శించాము. మేము హాంకాంగ్‌లో సువార్తికులను కలిశాము మరియు నమ్మకమైన, అంకితభావం గల పరిశుద్ధులతో అద్భుతమైన స్టేకు సమావేశములో పాల్గొన్నాము.

మేము యూరప్ అంతటా, లాటిన్ అమెరికాలో, కరేబియన్‌లో మరియు ఆఫ్రికాలో సువార్తికులు మరియు సభ్యులను కలుసుకున్నప్పుడు ఈ అనుభవం పునరావృతమైంది. యేసు క్రీస్తు యొక్క సంఘము ఆఫ్రికాలో అద్భుతమైన అభివృద్ధిని చవిచూస్తోంది.

ముందుకు సాగిపోతున్న యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపనకు మరియు జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచన నెరవేర్పుకు నేను ప్రత్యక్ష సాక్షిని, అది “దేవుని సత్యము ప్రతి ఖండములోనికి చొచ్చుకుపోయే వరకు, ప్రతి వాతావరణాన్ని సందర్శించే వరకు, ప్రతి దేశాన్ని తుడిచిపెట్టి, ప్రతి చెవిలో వినిపించే వరకు, దేవుని ఉద్దేశ్యాలు నెరవేరే వరకు మరియు గొప్ప యెహోవా ఆ కార్యము పూర్తయిందని చెప్పేవరకు ధైర్యంగా, ఘనంగా, స్వతంత్రంగా ముందుకు సాగుతుంది.”7

భూగోళాన్ని చుట్టేస్తున్న మన అద్భుతమైన సువార్తికులు ఇప్పుడు 74,000 మంది ఉన్నారు. సభ్యులతో కలిసి పని చేస్తూ, వారు ప్రతి నెలా 20,000 కు పైగా జనులకు బాప్తిస్మమిస్తారు. ఇటీవల 18, 19 మరియు 20 ఏళ్ల యువతీ యువకులు ప్రభువు సహాయంతో, ఈ బలమైన అద్భుతమైన సమకూర్పును సృష్టించారు. మనము ఈ యువతీ యువకులను వనౌటులోని చిన్న గ్రామాలలో మరియు న్యూయార్క్, ప్యారిస్ మరియు లండన్ వంటి పెద్ద నగరాల్లో కనుగొంటాము. ఫిజీలోని మారుమూల సమూహాలలో మరియు సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా వంటి ప్రదేశాలలోని పెద్ద సమూహాలలో వారు రక్షకుని గురించి బోధించడం నేను చూశాను.

60 వేర్వేరు భాషలు మాట్లాడే మరియు మత్తయి 28 లోనున్న రక్షకుని యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చే సువార్తికులను మీరు భూమి యొక్క ప్రతి మూలలో కనుగొంటారు: “కాబట్టి మీరు వెళ్ళి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు సమస్త జనులకు బోధించుడి.”8 నేను సంఘము యొక్క గత మరియు ప్రస్తుత సువార్తికులను గౌరవిస్తాను మరియు ఇశ్రాయేలును సమకూర్చమనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ఆహ్వానాన్ని మన యువతరానికి గుర్తు చేస్తున్నాను .9

రక్షకుని సువార్త యొక్క లోతైన పునఃస్థాపనను నేను నా స్వంత కళ్లతో గమనించానని మరియు నా స్వంత చెవులతో విన్నానని ఈ రోజు నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రపంచమంతటా దేవుని యొక్క కార్యమునకు నేను ఒక సాక్షిని. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సభ్యుడిగా ఉండటానికి ఇంతకు మించిన మంచి సమయం ఎన్నడూ లేదు.

బహుశా నేను చూసిన పునఃస్థాపన యొక్క అత్యంత ప్రేరేపించే అద్భుతం, ప్రతి దేశంలోని సంఘము యొక్క విశ్వాసులైన సభ్యులైన మీరు. కడవరి దిన పరిశుద్ధులైన మీరు, మోర్మన్ గ్రంథములో నీఫై ద్వారా వర్ణించబడ్డారు, అతడు మన రోజును చూసి ఇలా సాక్ష్యమిచ్చాడు, “భూముఖమంతటిపై చెదిరియున్న గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.”10

నీతి మరియు దేవుని శక్తితో ఆయుధాలు ధరించి, ప్రతి దేశంలోని నిబంధన పరిశుద్ధులైన మిమ్మల్ని—నీఫై చూసిన దానిని నేను నా కళ్లతో చూశానని సాక్ష్యమిస్తున్నాను. ప్రపంచంలోని ఈ గొప్ప దేశాలలో ఒకదానిలో నేను ప్రసంగ పీఠం వద్ద ఉన్నప్పుడు, మోర్మన్ గ్రంథములోని మోషైయ 2లో రాజైన బెంజమిన్ బోధించిన విషయాన్ని ప్రభువు నా మనస్సుపై ముద్రించారు. బ్రెంట్, “దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు.”11

భూమి అంతటా ఆజ్ఞలను పాటించే దేవుని నమ్మకమైన పరిశుద్ధులారా, నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నేను దీనిని నా స్వంత కళ్లతో చూశాను మరియు నా స్వంత చెవులతో విన్నాను అని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మీరు పరలోక తండ్రి యొక్క నిబంధన సంతానము. మీరు యేసు క్రీస్తు యొక్క శిష్యులు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క యథార్థతను గురించి మీరు మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందారు కాబట్టి నాకు తెలిసినది మీకు కూడా తెలుసు. రక్షకుడు ఇలా బోధించారు, “అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.”12

ప్రభువు మార్గదర్శకత్వంలో మరియు ఆయన ప్రవక్తలు, అపొస్తలుల నాయకత్వంలో మనం సువార్తికులను సిద్ధం చేయడం కొనసాగిస్తాము, పరిశుద్ధమైన నిబంధనలను చేస్తాము మరియు పాటిస్తాము, ప్రపంచమంతటా క్రీస్తు సంఘమును స్థాపించడం కొనసాగిస్తాము, మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను పొందుతాము. మనం ఐక్యంగా ఉన్నాము. మనం దేవుని యొక్క బిడ్డలము. మనకు ఆయన గురించి తెలుసు మరియు మనము ఆయనను ప్రేమిస్తాము.

నా స్నేహితులారా, ఈ విషయాలు నిజమని మనము ఐక్యంగా సాక్ష్యమిస్తున్నాము కాబట్టి, మీ అందరితో నేను చేరుతున్నాను. మనము చూసిన మరియు వినిన వాటిని నమోదు చేస్తాము. మీరు మరియు నేను సాక్ష్యమిచ్చే సాక్షులం. ఈ ఐక్యమైన సాక్ష్యము యొక్క శక్తితో మనం ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై విశ్వాసంతో ముందుకు సాగడం కొనసాగిస్తున్నాము. యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు మన విమోచకుడైయున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.