సర్వసభ్య సమావేశము
అంతము వరకు విశ్వాసముతో ఉండుడి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అంతము వరకు విశ్వాసముతో ఉండుడి

ఆయన హస్తము ద్వారా, మీరు మీ జీవితంలో కనిపించే ప్రతి గొల్యాతును పడగొట్టగలుగుతారు.

ప్రియమైన యౌవన స్నేహితులారా, ఈరోజు సంఘ యువత అయిన మీతో నేరుగా మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను.

మా యువతుల ప్రధాన అధ్యక్షత్వము పిలువబడి ఒక సంవత్సరం అయ్యింది. గడిచిన ఏడాది కాలంలో చాలా జరిగింది!

మేము మీలో చాలామందిని కలుసుకున్నాము మరియు క్రీస్తు యొక్క బోధనలను కలిసి చదివాము. మేము పాటలు పాడాము, కొత్త స్నేహితులను సంపాదించుకున్నాము మరియు మన సమాజాలలో మీతో కలిసి సేవ చేసాము. యువజన సమావేశాలు మరియు ప్రపంచ సంఘటనలందు మీ సాక్ష్యాలను వినుట ద్వారా మేము బలపరచబడ్డాము. మేము ప్రభువు యొక్క మందిరములో కలిసి ఆరాధించాము.

ప్రతీసారి, మేము మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి ఒక సందేశము పంచుకున్నాము. ఈ రాత్రి భిన్నంగా ఉండదు; యేసు క్రీస్తు యొక్క సంఘ యువతీ యువకులైన మీ కోసం నేను ఒక సందేశాన్ని కలిగి ఉన్నాను.

ముఖ్యమైన ప్రశ్నలు

పాపపు లోకంలో జీవిస్తుండగా మీరు దేవునిపట్ల ఎలా విశ్వాసంగా ఉండగలరో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముందుకు సాగడానికి మరియు మేలు చేయడం కొనసాగించడానికి మీకు ఎక్కడ నుండి బలం వస్తుంది? మీరు నిజమైన సంతోషాన్ని ఎలా అనుభవిస్తారు?

దావీదు మరియు గొల్యాతు 1 యొక్క అనుభవం సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను.

దావీదు మరియు గొల్యాతు

పాత నిబంధనలో, ఫిలిష్తీయుల సైన్యము ఇశ్రాయేలీయులతో యుద్ధము చేస్తున్నది, ప్రతి ఉదయము, సాయంత్రము, ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఇశ్రాయేలీయులు ఎవరైనా తనతో పోరాడాలని సవాలు చేసేవాడు.

చిత్రం
దావీదు మరియు గొల్యాతు

ఇశ్రాయేలీయుల మధ్య దావీదు నివసించాడు, గొల్యాతు కంటే చాలా చిన్నవాడు, కానీ యేసు క్రీస్తుపై ఆపారమైన విశ్వాసము ఉన్న యువ గొఱ్ఱెలకాపరి. దావీదు పోరాడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. రాజు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు, కానీ దావీదు యేసు క్రీస్తునందు తన నమ్మకాన్ని ఉంచాడు.

గతంలో, దావీదు ఒక సింహంతోపాటు ఎలుగుబంటితో కూడా పోరాడాడు. తన స్వంత అనుభవము నుండి, తనను దేవుడు కాపాడాడని మరియు అతడు విజయం సాధించేలా చేసాడని అతడికి తెలుసు. దావీదుకు, దేవుని హేతువు అత్యంత ముఖ్యమైన హేతువు. అందుచేత, దేవుడు తనను విడిచిపెట్టడని ఆయనయందు విశ్వాసంతో నింపబడి, అతడు ఐదు నున్నని రాళ్ళని ఏరుకొని, తన వడిసెను తీసుకొని శూరుని ఎదిరించడానికి వెళ్ళాడు.

చిత్రం
దావీదు యొక్క ఐదు రాళ్ళు.

దావీదు విసిరిన మొదటి రాయి గొల్యాతు నుదిటికి తగిలిందని, అతడి ప్రాణాన్ని తీసిందని లేఖనాలు మనకు చెప్తున్నాయి.2

సమాధానం కోసం వెదకుట

దావీదు గొల్యాతును చంపడానికి ఒకే ఒక రాయిని ఉపయోగించినప్పటికీ, అతడు ఐదుతో సిద్ధపడ్డాడు. ఐదుతో! ఇది లోకాన్ని ఎదుర్కోనేందుకు నన్ను నేను ఎలా సిద్ధం చేసుకోవాలో ఆలోచించేలా చేస్తుంది.

దావీదు యొక్క రాళ్ళలో ప్రతీఒక్కటి మన జీవితాలలో విజయాన్ని సాధించడానికి మనకు అవసరమైన బలాన్ని సూచిస్తే ఏమవుతుంది? ఆ ఐదు రాళ్ళు ఏమవుతాయి? ఈ సాధ్యతల గురించి నేను ఆలోచించాను:

  1. దేవుని పట్ల నా ప్రేమ యొక్క రాయి.

  2. మన రక్షకుడైన యేసు క్రీస్తునందు నా విశ్వాసము యొక్క రాయి.

  3. నా నిజమైన గుర్తింపు గురించిన జ్ఞానము యొక్క రాయి.

  4. నా అనుదిన పశ్చాత్తాపము యొక్క రాయి.

  5. దేవుని శక్తికి నా ప్రవేశము యొక్క రాయి.

ఈ బలముల చేత మనము ఎలా దీవించబడ్డామో మనం మాట్లాడుకుందాం.

మొదటిది, దేవుని పట్ల నా ప్రేమ యొక్క రాయి. దేవుడిని ప్రేమించుట మొదటి గొప్ప ఆజ్ఞ.3 యౌవనుల బలము కొరకు మార్గదర్శి మనకిలా బోధిస్తుంది: “దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే మీ తండ్రి. ఆయన పరిపూర్ణమైన ప్రేమ మీరు ఆయనను ప్రేమించడానికి మిమ్మల్ని ప్రేరేపించగలదు. పరలోక తండ్రి పట్ల మీకున్న ప్రేమ మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రభావం అయినప్పుడు, అనేక నిర్ణయాలు సులభంగా మారతాయి.”4

దేవుని కోసం మన ప్రేమ మరియు ఆయనతో మన సన్నిహిత సంబంధం మన హృదయాలు మార్చుకోవడానికి మరియు మన సవాళ్ళు మరింత సులువుగా జయించడానికి మనకు అవసరమైన బలమును ఇస్తాయి.

రెండవది, మన రక్షకుడైన యేసు క్రీస్తునందు నా విశ్వాసము యొక్క రాయి. యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన మన పాపముల కొరకు బాధను అనుభవించారు5 మరియు మన విచారములు, మన బాధలు, మన బలహీనతలు, మన శారీరక మరియు మానసిక రుగ్మతలను తనపై తీసుకున్నారు. అందువలనే మనకు ఎలా సహాయపడాలో ఆయనకు తెలుసు. యేసు క్రీస్తునందు విశ్వాసమును కలిగియుండుట అనగా ఆయన జ్ఞానము, ఆయన సమయము, ఆయన ప్రేమ మరియు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తఃము చేసిన ఆయన శక్తిని సంపూర్ణంగా నమ్మడమని అర్థము. యేసు క్రీస్తునందు విశ్వాసము యొక్క రాయి మన జీవితాలలో ఏ “శూరునినైనా” 6 ఓడించగలదు. ఈ పడిపోయిన లోకమును ఆయన మొదట జయించారు గనుక మనము దానిని జయించగలము.7

మూడవది, నా నిజమైన గుర్తింపు గురించిన జ్ఞానము యొక్క రాయి. మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, మన అత్యంత ముఖ్యమైన గుర్తింపులు దేవుని యొక్క పిల్లలు, నిబంధన యొక్క పిల్లలు మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యులు అని మనకు బోధించారు.8

నేను నిజంగా ఎవరినో తెలుసుకొన్నప్పుడు అంతా మారిపోతుంది.9 నా సామర్థ్యాలను నేను అనుమానించినప్పుడు, నేను ముందుకు వెళ్ళాలనే నమ్మకం కలిగేంత వరకు, నాకవసరమైనన్ని సార్లు “నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమార్తెను” అని నా మనస్సులో లేదా బిగ్గరగా పునరావృతం చేసుకుంటాను.

నాల్గవది, నా అనుదిన పశ్చాత్తాపము యొక్క రాయి. యౌవనుల బలము కొరకు మార్గదర్శిలో, మనము ఇలా చదువుతాము: “పశ్చాత్తాపము పాపము కొరకు శిక్ష కాదు; అది రక్షకుడు మనల్ని పాపమునుండి స్వతంత్రులుగా చేసే విధానము. పశ్చాత్తాపపడడమనగా మారడం―పాపము నుండి మరలి, దేవుని వైపు తిరుగుట. దాని అర్థము మెరుగుపరచుకొనుట మరియు క్షమాపణను పొందుట. ఈ రకమైన మార్పు ఒకేసారి జరిగే సంఘటన కాదు; అది కొనసాగుతున్న ప్రక్రియ.”10

దేవుని యొక్క క్షమాపణను అనుభూతి చెందడం, మనం పరిశుద్ధంగా ఉన్నామని మరియు ఆయనతో సమాధానపడి ఉన్నామని తెలుసుకోవడం కంటే విముక్తి కలిగించేది మరొకటి లేదు. క్షమాపణ ప్రతిఒక్కరికీ సాధ్యమైనది.

ఐదవ రాయి దేవుని శక్తికి నా ప్రవేశము యొక్క రాయి. దేవునితో మనము చేసే నిబంధనలు, బాప్తిస్మపు విధిలో మనము చేసే నిబంధనలు వంటివి దైవత్వము యొక్క శక్తికి మనకు ప్రవేశమును ఇస్తాయి.11 దేవుని యొక్క శక్తి నిజమైన శక్తి, అది మనము సవాళ్ళను ఎదుర్కోవడానికి, మంచి నిర్ణయాలను చేయడానికి మరియు కష్టమైన పరిస్థితులను సహించడానికి మన సామర్థ్యమును హెచ్చించడానికి మనకు సహాయపడుతుంది. ఆ శక్తితో మనకు అవసరమైన నిర్దిష్ట సామర్థ్యాలలో మనం ఎదగగలము.12

యౌవనుల బలము కొరకు మార్గదర్శి ఇలా వివరిస్తుంది: “నిబంధనలు పరలోక తండ్రి మరియు రక్షకునితో మిమ్మల్ని అనుసంధానం చేస్తాయి. అవి మీ జీవితంలో దేవుని యొక్క శక్తిని హెచ్చిస్తాయి.”13

ఆ అనుసంధానం గురించి మనం మాట్లాడుకుందాం. బండపైన కట్టబడిన ఇల్లు మరియు ఇసుకపైన కట్టబడిన దానికి మధ్య వ్యత్యాసాన్ని క్రీస్తు బోధించడం మీకు గుర్తుందా?14 ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ వివరించారు: “ఒక ఇల్లు బలంగా ఉన్నందున ఒక తుఫానులో ఆ ఇల్లు తట్టుకొని నిలబడదు. రాయి బలంగా ఉన్నందున కూడా అది తట్టుకొని నిలబడదు. ఆ బలమైన బండకు స్థిరంగా బలమైన పునాది వేయబడినది గనుక ఇల్లు తుఫానును తట్టుకొని నిలబడింది. ఆ రాయితో అనుసంధానము యొక్క బలము ముఖ్యమైనది.”15

చిత్రం
ఒక బండమీద కట్టబడిన ఇల్లు.

యేసు క్రీస్తుతో మన వ్యక్తిగత అనుబంధము మన నమ్మకాలను గౌరవించని లేదా మనల్ని ఇబ్బంది పెట్టే జనుల మధ్య ముందుకు సాగడానికి ధైర్యమును, విశ్వాసమును మనకిస్తుంది. మన ఆలోచనలందు నిరంతరం ఆయనను ఉంచుకోమని క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నారు; ఆయన మనతో చెప్పారు, “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి.”16 రక్షకుని గురించి ఆలోచించుట నిర్ణయాలను చేయడానికి, నిర్భయంగా ప్రవర్తించడానికి, దేవుని బోధనలకు వ్యతిరేకమైన దానిని వద్దని చెప్పడానికి, మనకు స్పష్టమైన మనస్సును ఇస్తుంది.17 నా దినము కష్టమైనదై, నేను ఇక దీనిని భరించలేనని భావించినప్పుడు, క్రీస్తు గురించి ఆలోచించుట నాకు శాంతిని ఇస్తుంది మరియు నాకు నిరీక్షణను ఇస్తుంది.

యేసు క్రీస్తు యొక్క ఈ శక్తిని మనము ఎలా పొందగలము? మన నిబంధనలకు విధేయులవడం మరియు యేసు క్రీస్తు నందు మన విశ్వాసాన్ని బలపరచుకోవడం ముఖ్యమైనది.

వాస్తవానికి దావీదు మరొక రాయిని కలిగి ఉండాలని నేను కోరుతున్నాను; అది నా సాక్ష్యము యొక్క రాయి అవుతుంది. మన సాక్ష్యము వ్యక్తిగత ఆత్మీయ అనుభవాల చేత నిర్మించబడుతుంది, దానిలో మన జీవితాలలోని దైవిక ప్రభావాన్ని మనము గుర్తిస్తాము.18 ఆ జ్ఞానమును మన నుండి ఎవరూ తీసుకొనలేరు. మన ఆత్మీయ అనుభవాలను జీవించడం ద్వారా మనకు తెలిసిన వాటిని తెలుసుకోవడం ఆమూల్యమైనది. ఆ జ్ఞానమునకు యథార్థంగా ఉండడం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అది మనకు సంతోషాన్ని ఇస్తుంది! మనము సత్యాన్ని ప్రేమించిన యెడల, మనం దానిని వెదకుతాము, మరియు మనం ఒకసారి దానిని కనుగొన్నాక, మనం దానిని కాపాడతాము.19

ఒక ఆహ్వానము

నేను ఆరవ రాయిని ఎంచుకున్నట్లుగా, మీ తరగతి, సమూహము లేదా కుటుంబముతో కలుసుకోమని, దేవునిపట్ల నమ్మకంగా ఉండమని, ప్రపంచాన్ని అధిగమించడానికి మీరు ఏ ఇతర బలాలు పొందాలో ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ఒక వాగ్దానము

ప్రియమైన స్నేహితులారా, మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండేందుకు క్రీస్తు ఆసక్తిగా ఉన్నారు. మీరు ఇనుప దండమును పట్టుకొన్నప్పుడు, మీరు యేసు క్రీస్తుతో చేయి చేయి కలుపుతారని నేను మీకు వాగ్దానము చేస్తున్నాను.20 ఆయన మిమ్మల్ని నడిపిస్తారు మరియు ఆయన మీకు బోధిస్తారు.21 ఆయన హస్తము ద్వారా, మీరు మీ జీవితంలో కనిపించే ప్రతి గొల్యాతును పడగొట్టగలుగుతారు.

సాక్ష్యము

ప్రతిరోజూ ప్రార్థించడంలో, ప్రతిరోజూ మోర్మన్ గ్రంథమును చదవడంలో, ప్రతీ ఆదివారం సంస్కారములో పాల్గొనుటలో, ప్రాతఃకాలమే—సెమినరీకు వెళ్లడంలో ఆనందము ఉన్నదని నేను సాక్ష్యమిస్తున్నాను. మంచిని చేయడంలో సంతోషమున్నది.

రాజులకు రాజు, లోక రక్షకుడు, విశ్వము యొక్క దేవునికి విశ్వాసులుగా ఉండుటలో సంతోషమున్నది. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండుటలో ఆనందము ఉన్నది.

దేవుడు మన పరలోక తండ్రి. ఆయన మీ హృదయపు కోరికలను, మీ సాధ్యతలను ఎరుగును మరియు ఆయన మిమ్మల్ని నమ్ముతున్నారు.

ప్రియమైన యువజనులారా, యేసు క్రీస్తు అంతము వరకు విశ్వాసముతో ఉండటానికి మీకు సహాయపడతారు. ఈ సత్యములను గూర్చి యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.