సర్వసభ్య సమావేశము
మన జీవితాలకు కేంద్రబిందువుగా యేసు క్రీస్తు
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మన జీవితాలకు కేంద్రబిందువుగా యేసు క్రీస్తు

మన అంధకార సమయాలలో మరియు అత్యున్నత శ్రమలలో తలెత్తే ఆత్మ యొక్క లోతైన ప్రశ్నలు యేసు క్రీస్తు యొక్క అచంచలమైన ప్రేమ ద్వారా పరిష్కరించబడతాయి.

మనం మర్త్యత్వము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, కొన్నిసార్లు మనం పరీక్షలకు గురవుతాము: ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల కలిగే తీవ్రమైన బాధ, అనారోగ్యంతో కఠినమైన పోరాటం, అన్యాయానికి గురికావడం, వేధింపులు లేదా హింస యొక్క బాధాకరమైన అనుభవాలు, నిరుద్యోగపు చీకట్లు, కుటుంబ కష్టాలు, ఒంటరితనం యొక్క నిశ్శబ్ద రోదనలు లేదా సాయుధ పోరాటాల యొక్క హృదయ విదారక పరిణామాలు వంటివి.1 అటువంటి క్షణాలలో, మన ఆత్మలు ఆశ్రయం కోసం తహతహలాడతాయి.2 మనం వీటిని తెలుసుకోవాలని తీవ్రంగా వెదుకుతాము: శాంతి యొక్క గుగ్గిలం మనకు ఎక్కడ దొరుకుతుంది?3 ఈ సవాళ్లను అధిగమించడానికి ఆత్మవిశ్వాసం మరియు బలముతో సహాయం చేయడానికి మనం ఎవరిపై నమ్మకం ఉంచగలం?4 మనలను ఉద్ధరించడానికి మరియు నిలబెట్టడానికి సహనం, చుట్టుముట్టే ప్రేమ మరియు సర్వశక్తివంతమైన హస్తం ఎవరికి ఉంది?

మన అంధకార సమయాలలో మరియు అత్యున్నత శ్రమలలో తలెత్తే ఆత్మ యొక్క లోతైన ప్రశ్నలు యేసు క్రీస్తు యొక్క అచంచలమైన ప్రేమ ద్వారా పరిష్కరించబడతాయి.5 ఆయనలో మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త యొక్క వాగ్దాన దీవెనల ద్వారా,6 మనం వెదుకుతున్న సమాధానాలను కనుగొంటాము. ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం ద్వారానే మనకు కొలతకు మించిన బహుమానం—నిరీక్షణ, స్వస్థత మరియు మన జీవితాల్లో ఆయన స్థిరమైన, శాశ్వతమైన ఉనికిని పొందే భరోసా అందజేయబడింది.7 ఈ బహుమానం విశ్వాసంతో చేరుకునే వారికి, ఆయన ఉచితంగా అందించే శాంతి మరియు విమోచనను హత్తుకొనే వారందరికీ లభ్యమవుతుంది.

ప్రభువు మనలో ప్రతీ ఒక్కరి కోసం తన చేతిని చాచారు, అది దైవిక ప్రేమ మరియు దయగల ఆయన స్వభావానికి సూచన. ఆయన మనకిచ్చే ఆహ్వానం సాధారణ పిలుపు‌ను మించినది; అది దైవిక ప్రతిజ్ఞ, ఆయన మహిమ యొక్క శాశ్వత శక్తి ద్వారా అది బలపరచబడింది. లేఖనాలలో, ఆయన ప్రేమతో మనకు అభయమిస్తున్నారు:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”8

“నా యొద్దకు రండి” మరియు “నా కాడిని ఎత్తుకోండి” అనే ఆయన ఆహ్వానంలోని స్పష్టత ఆయన వాగ్దానం యొక్క లోతైన స్వభావాన్ని ధృవీకరిస్తుంది—ఆ వాగ్దానం చాలా విశాలమైనది మరియు సంపూర్ణమైనది, అది ఆయన ప్రేమను ప్రతిబింబిస్తుంది, “మీకు విశ్రాంతి దొరకును” అనే గంభీరమైన హామీని మనకు అందిస్తుంది.

మనం శ్రద్ధగా ఆత్మీయ నడిపింపు కోసం వెదుకుతున్నప్పుడు,9 మన సాక్ష్యాలను బలపరిచే వ్యక్తిగత వృద్ధి యొక్క ప్రక్రియను మనం ప్రారంభిస్తాము. మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రేమ యొక్క విస్తారతను అర్థం చేసుకోవడం వలన,10 మన హృదయాలు కృతజ్ఞత, వినయం,11 మరియు శిష్యత్వ మార్గాన్ని అనుసరించాలనే క్రొత్త కోరికతో నిండి ఉంటాయి.12

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “మన జీవితాల యొక్క దృష్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై ఉన్నప్పుడు, మన జీవితాలలో—జరుగుచున్న దానిని లేదా జరగని దానిని లక్ష్యపెట్టకుండా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. ఆనందము ఆయన నుండి మరియు ఆయన వలన కలుగుతుంది.”13

ఆల్మా తన కుమారుడైన హీలమన్‌తో మాట్లాడుతూ, ఇలా ప్రకటించాడు: “ఓ నా కుమారుడా హీలమన్‌, నీవు యౌవనములో ఉన్నావు, అందువలన నీవు నా మాటలను విని, నా నుండి నేర్చుకొనవలెనని నేను నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను; ఏలయనగా దేవునియందు తమ నమ్మికయుంచు వారెవరైనను వారి శోధనలందు, కష్టములందు, శ్రమలందు సహాయము పొందుదురని, అంత్యదినమున లేపబడుదురని నేనెరుగుదును.”14

హీలమన్, తన కుమారులతో మాట్లాడుతూ, రక్షకుడిని మన జీవితాలకు కేంద్రబిందువుగా ఉంచే ఈ నిత్య సూత్రం గురించి బోధించాడు: “జ్ఞాపకముంచుకొనుడి, మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి.”15

మత్తయి 14లో, బాప్తిస్మమిచ్చు యోహాను మరణం గురించి విన్న తర్వాత, యేసు ఏకాంతాన్ని కోరుకున్నారని మనకు తెలుసు. అయితే, పెద్ద గుంపు ఆయనను అనుసరించింది. కరుణ మరియు ప్రేమతో ప్రేరేపించబడి, తన నియమితకార్యము నుండి తప్పించడానికి తన దుఃఖాన్ని అనుమతించకుండా యేసు వారిని స్వాగతించారు, వారి మధ్య ఉన్న రోగులను స్వస్థపరిచారు. సాయంత్రం సమీపిస్తుండగా, శిష్యులు ఒక నిరుత్సాహకరమైన సవాలును ఎదుర్కొన్నారు: చాలా తక్కువ మందికి ఆహారం అందుబాటులో ఉంది. ఆహారాన్ని తెచ్చుకోవడానికి యేసు జనసమూహాన్ని పంపివేయాలని వారు ప్రతిపాదించారు, కానీ బదులుగా యేసు, అధిక ప్రేమ మరియు అధిక అంచనాలతో, వారికి ఆహారం ఇవ్వమని శిష్యులను కోరారు.

శిష్యులు తక్షణ సవాలులో నిమగ్నమై ఉండగా, యేసు తన తండ్రి పట్ల తనకున్న నమ్మకాన్ని మరియు ప్రేమను, జనుల పట్ల అచంచలమైన ప్రేమను ప్రదర్శించారు. ఆయన సమూహమును గడ్డి మీద కూర్చోమని ఆదేశించారు మరియు ఐదు రొట్టెలు, రెండు చేపలను మాత్రమే తీసుకొని, ఆయన తన అధికారం మరియు శక్తిపై దేవుని ఏర్పాటును అంగీకరిస్తూ తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎంచుకున్నారు.

ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత, యేసు రొట్టె విరిచారు మరియు శిష్యులు దానిని జనులకు పంచిపెట్టారు. అద్భుతం ఏమిటంటే, ఆహారం సరిపోవడమే కాకుండా 12 బుట్టలు మిగిలిపోయి సమృద్ధిగా ఉంది. ఆహారమివ్వబడిన సమూహంలో మహిళలు మరియు పిల్లలతో పాటు ఐదు వేలమంది పురుషులు ఉన్నారు.16

ఈ అద్భుతం మనకు గంభీరమైన పాఠాన్ని నేర్పుతుంది: సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, మన కష్టాల్లో మునిగిపోవడం సులభం. అయినప్పటికీ, యేసు క్రీస్తు తన తండ్రిపై దృష్టి కేంద్రీకరిస్తూ, కృతజ్ఞతా భావాన్ని అందిస్తూ, మన శ్రమలకు పరిష్కారాలు ఎల్లప్పుడూ మనలోనే ఉండవని, దేవుని దగ్గరే ఉంటాయని అంగీకరించే శక్తిని ఉదహరించారు.17

మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, సహజంగానే మనం ఎదుర్కొనే అడ్డంకులపై మనం దృష్టిపెడతాము. మన సవాళ్లు ప్రత్యక్షమైనవి మరియు మన దృష్టిని ఆదేశిస్తాయి, అయినప్పటికీ వాటిని అధిగమించే సూత్రం మన దృష్టిలో ఉంది. మన ఆలోచనలు మరియు క్రియలకు కేంద్రంగా క్రీస్తును ఉంచడం ద్వారా, ఆయన దృక్పథం మరియు బలంతో మనల్ని మనం సమం చేసుకుంటాము.18 ఈ సర్దుబాటు మన పోరాటాలను తగ్గించదు; బదులుగా, దైవిక మార్గదర్శకత్వంలో వాటిని జయించడానికి అది మనకు సహాయపడుతుంది.19 ఫలితంగా, మనం ఉన్నతమైన జ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే పరిష్కారాలను మరియు మద్దతును కనుగొంటాము. ఈ క్రీస్తు-కేంద్రీకృత దృక్పథాన్ని అవలంబించడం మన పరీక్షలను విజయాలుగా మార్చే ధైర్యం మరియు అంతర్దృష్టితో మనల్ని శక్తిమంతులను చేస్తుంది,20 రక్షకుని మూలంగా, ప్రధాన సమస్యగా కనిపించేది గొప్ప ఆధ్యాత్మిక పురోగతికి మార్గంగా మారుతుందని మనకు గుర్తుచేస్తుంది.

మోర్మన్‌ గ్రంథములో చిన్నవాడగు ఆల్మా కథ విమోచన మరియు క్రీస్తు చుట్టూ ఒకరి జీవితాన్ని కేంద్రీకరించడం యొక్క లోతైన ప్రభావం గురించి ఆకట్టుకునే కథనాన్ని అందజేస్తుంది. మొదట, ఆల్మా ప్రభువు సంఘానికి ప్రత్యర్థిగా నిలిచాడు, చాలామందిని నీతి మార్గం నుండి తప్పుదారి పట్టించాడు. అయితే, ఒక దేవదూత సందర్శన ద్వారా స్పష్టమైన దైవిక జోక్యం, అతని తప్పుల నుండి అతన్ని మేల్కొల్పింది.

తన అంధకార గడియలో, అపరాధభావంతో బాధపడుతూ, అతని ఆత్మీయ వేదన నుండి బయటపడడానికి నిరాశతో, ఆల్మా తన తండ్రి యేసు క్రీస్తు గురించి మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క శక్తి గురించి బోధించిన దానిని గుర్తుచేసుకున్నాడు. విమోచన కోసం తపిస్తున్న హృదయంతో, అతను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడ్డాడు మరియు ప్రభువు దయ కోసం తీవ్రంగా వేడుకున్నాడు. క్రీస్తును అతని ఆలోచనల ముందంజలోకి తీసుకువస్తూ, ఆయన దయను ఆల్మా హృదయపూర్వకంగా కోరుకుంటూ, పూర్తిగా సమర్పించుకున్న ఈ కీలకమైన క్షణం ఒక అద్భుతమైన పరివర్తనను ప్రేరేపించింది. అపరాధం మరియు నిరాశ యొక్క బరువైన సంకెళ్ళు అదృశ్యమయ్యాయి, వాటి స్థానంలో ఆనందం మరియు శాంతి యొక్క మహత్తైన భావం ఏర్పడింది.21

యేసు క్రీస్తు మన నిరీక్షణ మరియు జీవితంలోని గొప్ప బాధలకు సమాధానం. ఆయన త్యాగం ద్వారా ఆయన మన పాపాల కొరకు చెల్లించారు, మన బాధ—నొప్పి, అన్యాయం, దుఃఖం మరియు భయం—అన్నింటిని తనపైకి తీసుకున్నారు మరియు మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు, మన జీవితాలను మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మనల్ని క్షమించి, స్వస్థపరుస్తారు. ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు,22 ఆయన భూమిపై ఉన్న సమయంలో చాలామందిని స్వస్థపరచినట్లే23 తన ప్రేమ మరియు శక్తి ద్వారా మన హృదయాలను ఓదారుస్తూ, బాగుచేస్తారు. ఆయన జీవజలము, తన నిరంతర ప్రేమ మరియు దయతో మన ఆత్మల లోతైన అవసరాలను తీరుస్తారు. “నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని”24 చెప్తూ, ఇది బావి దగ్గర ఆయన సమరయ స్త్రీకి చేసిన వాగ్దానం లాంటిది.

యేసు క్రీస్తు సజీవుడని, ఆయన తన పవిత్ర సంఘమైన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘానికి అధ్యక్షత్వం వహిస్తారని నేను గంభీరమైన సాక్ష్యమిస్తున్నాను.25 ఆయన లోక రక్షకుడని, సమాధానకర్తయగు అధిపతి,26 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు,27 లోక విమోచకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మనస్సులో మరియు హృదయంలో మనం ఎప్పుడూ ఉన్నామని నేను నిశ్చయంగా ధృవీకరిస్తున్నాను. దానికి నిదర్శనంగా, ఆయన ఈ కడవరి దినాలలో తన సంఘాన్ని పునఃస్థాపించారు మరియు ఈ సమయంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను తన ప్రవక్తగా మరియు సంఘ అధ్యక్షుడిగా పిలిచారు.28 మనం నిత్యజీవం పొందేలా యేసు క్రీస్తు తన జీవితాన్ని ఇచ్చారని నాకు తెలుసు.

ఆయనను మన జీవితాలకు కేంద్రబిందువుగా ఉంచడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, మనకు బయల్పాటులు వెల్లడి అవుతాయి, ఆయన ప్రగాఢ శాంతి మనలను ఆవరిస్తుంది మరియు ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం మనకు క్షమాపణను, స్వస్థతను తెస్తుంది.29 జయించగల శక్తిని, పట్టువిడువకుండడానికి ధైర్యాన్ని మరియు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని మనం కనుగొనేది ఆయనలోనే. మన పరలోక తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళే మన ప్రయాణంలో సమస్త మంచికీ మూలం,30 దారిచూపే వెలుగు అయిన ఆయనకు దగ్గర కావడానికి మనం ప్రతిరోజూ కృషి చేద్దాం. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.