సర్వసభ్య సమావేశము
రెండు గొప్ప ఆజ్ఞలకు సమానంగా విధేయులవడం
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


రెండు గొప్ప ఆజ్ఞలకు సమానంగా విధేయులవడం

యేసు క్రీస్తును అనుసరించే మన సామర్థ్యం మొదటి మరియు రెండవ ఆజ్ఞలను సమతుల్యతతో మరియు రెండింటి పట్ల సమానమైన భక్తితో జీవించడంలో మన బలంపై ఆధారపడి ఉంటుంది.

పరిచయము

లీసా మరియు నేను ప్రపంచవ్యాప్తంగా నియామకాల‌పై ప్రయాణిస్తున్నప్పుడు చిన్న, పెద్ద సమూహాలలో మిమ్మల్ని కలుసుకొనే విశేషాధికారాన్ని మేము ఆనందిస్తాము. ప్రభువు పని పట్ల మీకున్న అంకితభావం మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు యేసు క్రీస్తు సువార్తకు సాక్ష్యంగా నిలుస్తుంది. మీ నుండి పొందినంతగా ఇవ్వగలమా అని ఆలోచిస్తూ ప్రతి ప్రయాణం నుండి మేము ఇంటికి తిరిగి వస్తాము.

చిత్రం
రెయిన్‌బో వంతెన.
చిత్రం
సింగ్ మా వంతెన.
చిత్రం
టవర్ వంతెన.

ప్రయాణించేటప్పుడు, సందర్శన కోసం మాకు తక్కువ సమయం ఉంటుంది. అయితే, సాధ్యమైనప్పుడల్లా, నేను కొన్ని క్షణాలు ప్రత్యేక అభిరుచిలో గడుపుతాను. నాకు భవన నిర్మాణ శాస్త్రం మరియు ఆకృతులపై ఆసక్తి మరియు వంతెనలపట్ల ప్రత్యేక ఆకర్షణ ఉంది. గొలుసు వంతెనలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. టోక్యోలోని రెయిన్‌బో వంతెన అయినా, హాంగ్‌కాంగ్‌లోని సింగ్ మా వంతెన అయినా, లండన్‌లోని టవర్ వంతెన అయినా లేదా నేను చూసిన ఇతరత్రా అయినా, ఈ సంక్లిష్టమైన నిర్మాణాలలో నిర్మించిన ఇంజనీరింగ్ మేధస్సును చూసి నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను. వంతెనలు మనం మరోవిధంగా వెళ్లలేని ప్రదేశాలకు తీసుకువెళతాయి. (నేను కొనసాగించే ముందు, ఈ సందేశం సిద్ధం చేయబడినప్పటి నుండి, బాల్టిమోర్‌లో ఒక విషాదకరమైన వంతెన ప్రమాదం సంభవించిందని నేను గమనించాను. ప్రాణనష్టానికి మేము సంతాపం తెలియజేస్తున్నాము మరియు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాము.)

ఒక అద్భుతమైన గొలుసు వంతెన

ఇటీవల, ఒక సమావేశ నియామకంపై నేను కాలిఫోర్నియాకు వెళ్ళాను, అక్కడ నేను మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడే గోల్డెన్ గేట్ వంతెనను దాటాను. ఈ స్మారక నిర్మాణం అందమైన రూపం, క్రియాత్మక ప్రయోజనం మరియు నైపుణ్యంగల ఇంజనీరింగ్‌ను కలిపి ఉంటుంది. అది ఎత్తైన స్తంభా‌లతో కూడిన శ్రేష్ఠమైన గొలుసు వంతెన, దానికి భారీ స్తంభాల మద్దతు ఉంది. సముద్రం పైన ఎగురుతున్నట్లు భారీ, గంభీరమైన బరువు మోసే జంట స్తంభాలు మొదట నిర్మించబడిన అంశాలు. అవి రెండూ కలిసి స్తంభాల మధ్య వ్రేలాడే ప్రధాన తీగలు మరియు నిలువుగా వ్రేలాడే తీగల యొక్క భారాన్ని మోస్తాయి, అవి దిగువ రహదారిని ఊయలగా మారుస్తాయి. అసాధారణమైన స్థిరీకరణ సామర్థ్యం, స్తంభం యొక్క శక్తి, వంతెన యొక్క ఇంజనీరింగ్ వెనుక ఉన్న మాయాజాలం.

చిత్రం
నిర్మాణంలో ఉన్న గోల్డెన్ గేట్ వంతెన.

గోల్డెన్ గేట్ వంతెన జిల్లా

వంతెన యొక్క ప్రారంభ నిర్మాణ చిత్రాలు ఈ ఇంజనీరింగ్ సూత్రానికి సాక్ష్యంగా ఉన్నాయి. వంతెన యొక్క ప్రతీ మూలకం అనురూపమైన స్తంభాల నుండి బరువు మోసే మద్దతును పొందుతుంది, రెండూ పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి.

చిత్రం
నిర్మాణంలో ఉన్న గోల్డెన్ గేట్ వంతెన.

గెట్టి ఇమేజెస్/అండర్‌వుడ్ ఆర్కైవ్స్

వంతెన పూర్తయినప్పుడు, శక్తివంతమైన దాని రెండు స్తంభాలు దృఢంగా ఉంచబడ్డాయి మరియు స్తంభాల పునాదిలో లంగరు వేయబడిన స్తంభాలతో, అది బలం మరియు అందం కలగలిసిన చిత్రమవుతుంది.

చిత్రం
గోల్డెన్ గేట్ వంతెన.

ఈ రోజు నేను ఈ గంభీరమైన వంతెనను, బలమైన పునాదిపై నిర్మించబడిన దాని ఎత్తైన జంట స్తంభాలను సువార్త దృష్టితో చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

యేసు క్రీస్తు పరిచర్య యొక్క సంధ్యా సమయంలో, మనం ఇప్పుడు పరిశుద్ధ వారం అని పిలుస్తున్న సమయంలో, ధర్మశాస్త్రోపదేశకుడైన ఒక పరిసయ్యుడు1 రక్షకుడిని ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్పడం దాదాపు అసాధ్యం అని అతనికి తెలుసు:2 “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” ధర్మశాస్త్రోపదేశకుడు చట్టబద్ధమైన సమాధానం కోరుతూ, కపటమైన ఉద్దేశ్యంతో “ఆయనను శోధించినప్పుడు,” నిజాయితీగల, పవిత్రమైన, దైవిక ప్రతిస్పందనను అందుకున్నాడు.

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.

“ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” మన వంతెన సారూప్యతను బట్టి, మొదటి స్తంభం!

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” ఇది రెండవ స్తంభం!

“ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి.”3 ఇవి వంతెన యొక్క మిగిలిన అంశాలు!

యేసు క్రీస్తు ప్రతిస్పందనలో బయల్పరచబడిన మరియు పఠించబడిన రెండు గొప్ప ఆజ్ఞలలో ప్రతిదానిని మనం పరిశీలిద్దాం. మనం అలా చేస్తున్నప్పుడు, అద్భుతమైన గొలుసు వంతెన యొక్క చిత్రం మీ మనసులో ప్రతిధ్వనించనివ్వండి.

ప్రభువును ప్రేమింపవలెను

మొదటిది, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను ప్రభువును ప్రేమింపవలెను.

ఈ సమాధానంలో, పాత నిబంధనలోని పవిత్రమైన బోధనలలో పొందుపరచబడిన ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని యేసు క్రీస్తు సంగ్రహించారు. ప్రభువును ప్రేమించడం అనేది మొదట మీ హృదయంపై—మీ స్వభావంపై కేంద్రీకృతమై ఉంటుంది. మీ పూర్ణాత్మతో—మీ పూర్తి సమర్పణతో ప్రేమించమని4—మరియు చివరకు, మీ పూర్ణమనస్సుతో—మీ తెలివితేటలు మరియు మేధస్సుతో ప్రేమించమని ప్రభువు మిమ్మల్ని అడుగుతారు. దేవుని పట్ల ప్రేమ పరిమితమైనది లేదా హద్దులున్నది కాదు. అది అనంతమైనది మరియు శాశ్వతమైనది.

నాకు, మొదటి గొప్ప ఆజ్ఞ యొక్క అన్వయం కొన్నిసార్లు అన్వయించలేనిదిగా, భయంకరంగా కూడా అనిపించవచ్చు. కృతజ్ఞతాపూర్వకంగా, యేసు యొక్క తదుపరి మాటలను నేను పరిగణిస్తున్నప్పుడు, ఈ ఆజ్ఞ మరింత గ్రహించదగినదిగా మారుతుంది: “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.”5 నేను దీన్ని చేయగలను. నేను పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు‌ను ప్రేమించగలను, అది ప్రార్థన, లేఖన అధ్యయనం మరియు దేవాలయ ఆరాధనకు దారి తీస్తుంది. దశమభాగాలు చెల్లించడం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం, సుగుణవంతమైన మరియు పవిత్రమైన జీవితాన్ని గడపడం, విధేయతతో ఉండడం ద్వారా మనం తండ్రిని మరియు కుమారుడిని ప్రేమిస్తాము.

ప్రభువు‌ను ప్రేమించడం అనేది చాలా తరచుగా చిన్న, రోజువారీ పనులలో, నిబంధన బాటపై నడిచే అడుగుల్లో కొలవబడుతుంది: యౌవనుల కోసం, నాశనం చేయడానికి కాకుండా నిర్మించడానికి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం; ప్రమాణాలు సవాలు చేయబడిన చోట విందు, చలనచిత్రం లేదా కార్యక్రమాన్ని వదిలివేయడం; పవిత్రమైన విషయాల పట్ల గౌరవం చూపడం వంటివి.

ఈ సున్నితమైన ఉదాహరణను పరిగణించండి. అది ఉపవాస ఆదివారం, వేన్స్6 మరియు నేను ఒక చిన్న, దీనమైన ఇంటి తలుపు తట్టాము. మేము మరియు సమూహం‌లోని ఇతర పరిచారకు‌లు, తలుపు గుండా వినబడేంత బిగ్గరగా మందపాటి జర్మన్ యాసలో ఉత్సాహంగా అరుస్తూ, “దయచేసి లోపలికి రండి” అనే మాటలు వినడానికి వచ్చాము. వార్డు‌లోని అనేకమంది వలస వితంతువులలో సహోదరి ముల్లర్ ఒకరు. న్యాయంగా ఆమె అంధురాలైనందున, ఆమె సులభంగా తలుపు తీయలేకపోయింది. మసక వెలుతురుతో ఉన్న ఇంటిలోపలికి మేము అడుగుపెట్టినప్పుడు, ఆమె మమ్మల్ని దయగల ప్రశ్నలతో పలకరించింది: మీ పేర్లు ఏమిటి? మీరు ఎలా ఉన్నారు? మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? మేము జవాబిచ్చి, ఆమె ఉపవాస కానుకను స్వీకరించడానికి వచ్చాము అని చెప్పాము. చిన్న వయస్సులో ఉన్న మాకు కూడా, ఆమె దీనమైన పరిస్థితులు స్పష్టంగా కనిపించేవి మరియు విశ్వాసంతో నిండిన ఆమె ప్రతిస్పందన గాఢంగా హత్తుకునేది: “నేను ఈ ఉదయం బల్లమీద ఒక పైసా పెట్టాను. నా ఉపవాస కానుకను ఇవ్వడానికి నేను చాలా కృతజ్ఞురాలిని. దయచేసి మీరు దానిని కవరులో పెట్టి, నా ఉపవాస కానుక రసీదును పూరిస్తారా?” మేము ఆమె ఇంటిని విడిచిపెట్టిన ప్రతిసారీ ప్రభువు పట్ల ఆమెకున్న ప్రేమ మా విశ్వాసాన్ని పెంచింది.

మొదటి గొప్ప ఆజ్ఞను అనుసరించే వారికి బెంజమిన్ రాజు అద్భుతమైన శక్తిని వాగ్దానం చేశాడు. “దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. … వారు, … విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి … ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.”7

ప్రభువును ప్రేమించడం నిత్య సంతోషానికి దారితీస్తుంది!

మీ పొరుగువారిని ప్రేమింపవలెను

తరువాత యేసు ఇలా చెప్పారు, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”8 ఇది వంతెన యొక్క రెండవ స్తంభం.

ఈ జీవితంలో ఇతరులను ప్రేమించాలనే మన కోరికతో ప్రభువును ప్రేమించాలనే మన పరిశుద్ధమైన కోరికను యేసు ఏకం చేస్తారు. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుంది. మన పొరుగువారిని మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభువు పట్ల ప్రేమ పరిపూర్ణం కాదు. ఇతరులపట్ల ఈ ప్రేమ లింగం, సామాజిక తరగతి, జాతి, లైంగికత, ఆదాయం, వయస్సు లేదా జాతితో సంబంధం లేకుండా దేవుని పిల్లలందరినీ కలిపి ఉంటుంది. “దేవునికి అందరూ ఒకేరీతిగా ఉన్నారు,” కాబట్టి మనం గాయపడిన మరియు బాధింపబడిన వారిని, అట్టడుగున ఉన్నవారిని వెదుకుతాము.9 మనం “బలహీనులను పోషిస్తాము, వడలిన చేతులను పైకెత్తుతాము, సడలిన మోకాళ్ళను బలపరుస్తాము.”10

ఈ ఉదాహరణను పరిగణించండి: తన కారును ఆపి, తెలియని కుటుంబానికి చెందినవారి తలుపును తట్టమని ప్రేరేపించబడినప్పుడు సహోదరుడు ఎవన్స్11 ఆశ్చర్యపోయాడు. 10 మంది పిల్లలుగల వితంతువైన తల్లి తలుపు తీసినప్పుడు, వారి క్లిష్ట పరిస్థితులు మరియు గొప్ప అవసరాలు అతనికి వెంటనే స్పష్టంగా కనిపించాయి. మొదటిది సరళమైనది, వారి ఇంటికి రంగులు వేయడం, ఆపై ఈ కుటుంబానికి అనేక సంవత్సరాలు తాత్కాలిక మరియు ఆధ్యాత్మిక పరిచర్య చేయబడింది.

కృతజ్ఞతతో ఉన్న ఆ తల్లి పరలోకం నుండి పంపబడిన ఈ స్నేహితుడి గురించి తర్వాత ఇలా వ్రాసింది: “మాలోని అల్పులను చేరుకోవడంలో మీరు మీ జీవితాన్ని గడిపారు. మీకు మరియు ఆయనకు మాత్రమే తెలిసిన వ్యక్తులకు మీరు ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా చేసిన మేలు కొరకు ప్రభువు తన కృతజ్ఞతను తెలియజేస్తున్నప్పుడు, ప్రభువు మీతో చెప్పే విషయాలను వినడానికి నేను ఎంతగానో ఇష్టపడతాను. మమ్మల్ని అనేక విధాలుగా ఆశీర్వదించినందుకు, … సువార్తికులకు మీరు అందించిన సహాయానికి ధన్యవాదాలు. … ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారా లేదా కేవలం మీరు వినేవారా అని నేను తరచు ఆశ్చర్యపోతాను.”

మీ పొరుగువారిని ప్రేమించడంలో క్రీస్తువంటి దయ మరియు సేవా క్రియలు కలిపి ఉంటాయి. మీరు పగను విడిచిపెట్టి, శత్రువులను క్షమించి, మీ పొరుగువారికి స్వాగతం పలుకుతారా, పరిచర్య చేస్తారా మరియు వృద్ధులకు సహాయం చేస్తారా? మీరు పొరుగువారి పట్ల మీ ప్రేమ గోపురాన్ని నిర్మించినప్పుడు మీలో ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందుతారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ఇతరులకు సహాయము చేయుట—మన కొరకు మనం సంరక్షించుకొనుటకంటే ఎక్కువగా ఇతరులను సంరక్షించుటకు నిజాయితీతో మన ప్రయత్నాలు చేయడమే—మన సంతోషము. మరి ముఖ్యముగా, అది మనకు అనుకూలముగా లేనప్పుడు, మనం సాధారణంగా చెయ్యని పనులు చెయ్యవలసి వచ్చినప్పుడు అని నేను చెప్పవచ్చును. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా అగుటకు రెండవ గొప్ప ఆజ్ఞను గైకొనుట కీలకము.”12

పరస్పర ఆధారితం

యేసు ఇంకా ఇలా బోధించారు, “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి.”13 ఇది చాలా బోధనాత్మకమైనది. ప్రభువును ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం మధ్య ముఖ్యంగా పరస్పరం ఆధారపడడం ఉంది. గోల్డెన్ గేట్ వంతెన దాని రూపకల్పన పనితీరును నిర్వహించడానికి, రెండు స్తంభాలు సమానంగా బలంగా ఉంటాయి మరియు వ్రేలాడే తీగలు, రోడ్డు మార్గం మరియు వంతెనను దాటే రాకపోకల బరువును సమానంగా భరిస్తాయి. ఈ ఇంజనీరింగ్ సమరూపత లేకుంటే, వంతెన కూలిపోవడానికి కూడా అది దారితీయవచ్చు. ఏ గొలుసు వంతెన అయినా అది నిర్మించబడిన పనిని చేయడానికి, దాని స్తంభాలు పూర్తి సామరస్యంతో కలిసి పనిచేయాలి. అదేవిధంగా, యేసు క్రీస్తును అనుసరించే మన సామర్థ్యం మొదటి మరియు రెండవ ఆజ్ఞలను సమతుల్యతతో మరియు రెండింటి పట్ల సమానమైన భక్తితో జీవించడంలో మన బలంపై ఆధారపడి ఉంటుంది.

చిత్రం
గోల్డెన్ గేట్ వంతెన.

ప్రపంచంలో పెరుగుతున్న వివాదాలు, మనం కొన్నిసార్లు దీనిని చూడడంలో లేదా గుర్తుంచుకోవడంలో విఫలమవుతామని సూచిస్తున్నాయి. కొందరు ఆజ్ఞలను పాటించడంపై ఎంతగా దృష్టి పెడతారంటే, వారు తక్కువ నీతిమంతులుగా భావించే వారి పట్ల తక్కువ సహనం చూపుతారు. నిబంధనకు వెలుపల లేదా ఏదైనా మతపరమైన భాగస్వామ్యానికి దూరంగా జీవించాలని ఎంచుకునే వారిని ప్రేమించడం కొంతమందికి కష్టంగా ఉంటుంది.

ప్రత్యామ్నాయంగా, మనమందరం దేవునికి జవాబుదారీగా ఉన్నామని అంగీకరించకుండా ఇతరులను ప్రేమించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే వారు కూడా ఉన్నారు. సంపూర్ణ సత్యం లేదా ఒప్పు మరియు తప్పు అనే విషయం ఉందని మరియు ఇతరుల ఎంపికల పట్ల పూర్తి సహనం, అంగీకారం మాత్రమే మనకు అవసరం అనే భావనను కొందరు పూర్తిగా నిరాకరిస్తారు. ఈ అసమతుల్యతలలో ఏదైనా మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక వంతెన ఒరిగిపోయేలా లేదా పడిపోయేలా చేయవచ్చు.

ఇలా చెప్పినప్పుడు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ దీనిని వివరించారు: “ప్రతీఒక్కరిని ప్రేమించాలని మనం ఆజ్ఞాపించబడ్డాము, ఎందుకంటే ప్రతీఒక్కరు మన పొరుగువారని యేసు చెప్పిన మంచి సమరయుని ఉపమానం బోధిస్తుంది. కానీ ఈ రెండవ ఆజ్ఞను పాటించాలనే ఉత్సాహంలో మొదటిదైన, మన పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను, దేవుని ప్రేమించాలనే మొదటి ఆజ్ఞను మరచిపోకూడదు.”14

ముగింపు

కాబట్టి మనలో ప్రతీ ఒక్కరికి ప్రశ్న ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం అనే రెండు ఎత్తైన వంతెన స్తంభాలను నిర్మిస్తూ—మన విశ్వాసం మరియు భక్తి యొక్క వంతెనను మనం ఎలా నిర్మించుకోవాలి? మనం కేవలం ప్రయత్నించడం ప్రారంభిస్తాము. మన ప్రారంభ ప్రయత్నాలు చిత్తు కాగితంపై గీతల్లా లేదా మనం నిర్మించాలని భావిస్తున్న వంతెన ప్రారంభ దశ నమూనాలా ఉండవచ్చు. ఇది ప్రభువు యొక్క సువార్తను ఎక్కువగా అర్థం చేసుకోవడానికి లేదా ఇతరులను తక్కువగా తీర్పు తీర్చుతామని ప్రతిజ్ఞ చేయడానికి కొన్ని వాస్తవిక లక్ష్యాలను కలిగి ఉండవచ్చు. ప్రారంభించడానికి ఎవరూ చాలా చిన్నవారు లేదా చాలా పెద్దవారు కాదు.

చిత్రం
వంతెన రూపురేఖల నమూనా చిత్రం.

కాలక్రమేణా, ప్రార్థన మరియు ఆలోచనాత్మక ప్రణాళికతో, వృద్ధికాని ఆలోచనలు శుద్ధి చేయబడతాయి. కొత్త చర్యలు అలవాట్లుగా మారతాయి. ప్రారంభ చిత్తుప్రతులు అందమైన నమూనా‌లుగా మారతాయి. పరలోక తండ్రికి మరియు ఆయన అద్వితీయ కుమారునికి అలాగే మనం కలిసి పని చేసే, ఆడుకునే మరియు జీవించే మన సహోదర సహోదరీలకు అంకితమైన హృదయాలు మరియు మనస్సులతో మన వ్యక్తిగత ఆధ్యాత్మిక వంతెనను మనం నిర్మిస్తాము.

రాబోయే రోజుల్లో, మీరు ఒక గంభీరమైన గొలుసు వంతెన మీదుగా వెళ్ళినప్పుడు లేదా ఎత్తైన స్తంభాలతో ఉన్న దాని చిత్రాన్ని మీరు చూసినప్పుడు, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు వివరించిన రెండు గొప్ప ఆజ్ఞలను గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువు సూచనలు మనల్ని ప్రేరేపించాలి. మన హృదయాలు, మనస్సులు ప్రభువును ప్రేమించాలి మరియు మన పొరుగువారిని ప్రేమించాలనే కోరికతో నింపబడాలి.

ఇది యేసు క్రీస్తుపై మరియు నేను సాక్ష్యమిచ్చే ఆయన ప్రాయశ్చిత్తంపై మన విశ్వాసాన్ని బలపరచాలి, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “క్రొత్త నిబంధనలో, [ధర్మశాస్త్రోపదేశకుడు అనే పదం] శాస్త్రునితో సమానం, అతను వృత్తిరీత్యా న్యాయశాస్త్ర విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు, ఇందులో మొదటి ఐదు గ్రంథాల యొక్క వ్రాతపూర్వక చట్టం మరియు ‘శాస్త్రుల సంప్రదాయాలు’ కూడా ఉన్నాయి (మత్తయి 22:35; మార్కు 12:28; లూకా 10:25)” (Bible Dictionary, “Lawyer”).

  2. పురాతన కాలంలో, యూదుల పండితులు తోరాలో 613 ఆజ్ఞలను లెక్కించారు మరియు ఒకదానితో మరొకదాని యొక్క సాపేక్ష ప్రాముఖ్యతను చురుకుగా చర్చించారు. బహుశా ధర్మశాస్త్రోపదేశకుడు యేసు సమాధానాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించాలని ఉద్దేశించి ఉండవచ్చు. ఒక ఆజ్ఞ చాలా ముఖ్యమైనదని ఆయన చెబితే, అది ధర్మశాస్త్రంలోని మరొక అంశాన్ని యేసు విస్మరించినట్లు ఆరోపణ చేయడానికి అనుమతించవచ్చు. కానీ రక్షకుని ప్రతిస్పందన, నేడు అనేది మనం సంఘములో చేసే ప్రతి పనికి పునాది అనే ముఖ్య ప్రకటనతో ఆయనను వలలో వేసుకోవడానికి వచ్చిన వారి నోళ్ళు మూయించింది.

  3. మత్తయి 22:36-40.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:15 చూడండి.

  5. యోహాను 14:15.

  6. గోప్యతను కాపాడేందుకు ఈ కథనంలో ఇద్దరి పేర్లూ మార్చబడ్డాయి.

  7. మోషైయ 2:41.

  8. మత్తయి 22:39.

  9. 2 నీఫై 26:33.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5.

  11. గోప్యతను కాపాడడానికి పేరు మార్చబడింది.

  12. రస్సెల్ ఎమ్. నెల్సన్, “రెండవ గొప్ప ఆజ్ఞ,” లియహోనా, నవ. 2019, 100.

  13. మత్తయి 22:40.

  14. డాలిన్ హెచ్. ఓక్స్, “రెండు గొప్ప ఆజ్ఞలు,” లియహోనా, నవ. 2019, 73–74.