సర్వసభ్య సమావేశము
క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు

నిజమైన ఆనందం, క్రీస్తుకు దగ్గరగా రావడానికి మరియు మనకైమనం సాక్ష్యమివ్వడానికి మన సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది.

ఐదు సంవత్సరాల క్రితం ఈరోజు, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిగా―ఈ అద్భుతమైన ఎదుగుదల మరియు బయల్పాటు కోసం ప్రభువు యొక్క ప్రతినిధిగా ఆమోదించడానికి మనము చేతులు ఎత్తాము. ఆయన ద్వారా, మనం లెక్కలేనన్ని ఆహ్వానాలు పొందాము మరియు మన జీవితాలను మన రక్షకుడైన యేసు క్రీస్తుపై కేంద్రీకరించినట్లయితే, మహిమకరమైన ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడ్డాము.

2011లో, బ్రెజిల్‌లోని అందమైన కురిటిబాలో నేను నా భర్తతో కలిసి మిషను నాయకులుగా సేవ చేస్తున్నప్పుడు, ఒక సమావేశంలో నా ఫోను మోగింది. దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ, మా నాన్న నుండి ఆ ఫోను రావడం నేను గమనించాను. “హాయ్, నాన్న!” అని సమాధానం ఇవ్వడానికి నేను సమావేశం నుండి త్వరగా నిష్క్రమించాను.

ఊహించని విధంగా, ఆయన స్వరం భావోద్వేగంతో నిండిపోయింది: “హాయ్, బోనీ. నీకు ఒక విషయం చెప్పాలి. నాకు ALS ఉన్నట్లు నిర్ధారణ అయింది.”

నా మనసు అయోమయంతో సుడులు తిరుగుతోంది, “ఆగండి! ఎఎల్ఎస్ అంటే ఏమిటి?”

“నా శరీరం మెల్లగా క్షీణిస్తున్నప్పటికీ, నా మనస్సు అప్రమత్తంగా ఉంటుంది” అని నాన్న అప్పటికే వివరిస్తున్నారు.

ఈ దుఃఖభరితమైన వార్త యొక్క ప్రభావంతో నేను కుస్తీ పట్టడం ప్రారంభించినప్పుడు నా ప్రపంచం మొత్తం మారిపోయిందని నేను భావించాను. కానీ ఆ మరపురాని రోజున, ఆయన చివరి వాక్యం, నా హృదయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. “బోనీ, క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు” అని నా ప్రియమైన తండ్రి అత్యవసరంగా చెప్పారు.

నేను నాన్నగారి సలహా గురించి ధ్యానించి, ప్రార్థించాను. యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకూడదనే దానికి అర్థం ఏమిటో నాకు పూర్తిగా తెలుసా అని నన్ను నేను తరచుగా ప్రశ్నించుకున్నాను.

మీలాగే, నేను కూడా అప్పుడప్పుడు నెలలో మొదటి ఆదివారం నిలబడి క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాను. పాఠంలో భాగంగా సువార్త సత్యాల గురించి నేను చాలాసార్లు సాక్ష్యమిచ్చాను. ఒక సువార్తికురాలిగా నేను ధైర్యంగా సత్యాన్ని బోధించాను మరియు క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రకటించాను.

అయితే ఈ అభ్యర్ధన మరింత వ్యక్తిగతంగా అనిపించింది! ఆయన ఇలా చెప్పినట్లు అనిపించింది, “బోనీ, ప్రపంచం నిన్ను అధిగమించనివ్వద్దు! రక్షకునితో నీ నిబంధనలకు కట్టుబడి ఉండు. ప్రతీరోజు ఆయన ఆశీర్వాదాలను అనుభవించాలని, నీ జీవితంలో ఆయన శక్తి మరియు ఉనికి గురించి పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యమివ్వగలగాలని కోరుకో!”

మనము పతనమైన ప్రపంచంలో జీవిస్తున్నాము, పరధ్యానం మన కళ్ళు మరియు హృదయాలను పరలోకానికి బదులు క్రిందికి ఆకర్షిస్తుంది. 3 నీఫై 11 లోని నీఫైయుల మాదిరిగానే, మనకు యేసు క్రీస్తు అవసరం. చాలా గందరగోళం మరియు విధ్వంసం అనుభవించిన వ్యక్తుల మధ్య మిమ్మల్ని మీరు ఊహించుకోగలరా? ప్రభువు యొక్క వ్యక్తిగత ఆహ్వానాన్ని వినడం ఎలా ఉంటుంది:

“మీరు మీ చేతులతో నా ప్రక్కలను తాకునట్లు, నా చేతులు మరియు నా కాళ్ళలోని మేకుల గుర్తులను తడిమి తెలుసుకొనునట్లు, నేను ఇశ్రాయేలు దేవుడనని, సమస్త భూమి యొక్క దేవుడనని మరియు లోక పాపముల కొరకు సంహరింపబడితినని మీరు తెలుసుకొనునట్లు లేచి నా యొద్దకు రండి.

“అంతట … సమూహము ముందుకు వెళ్ళి, …ఒకని తరువాత ఒకడు… వారు తమ కన్నులతో చూచి, చేతులతో తడిమి తెలుసుకొనిరి … మరియు తమంతట తాము చూచిరి.”1

ఈ నీఫైయులు తమ చేతులతో ఆయన ప్రక్కలను తాకుతూ, ఆయన చేతులలో మరియు కాళ్ళలో మేకుల గుర్తులను తడిమి తెలుసుకోవడానికి ఆతృతగా ముందుకు వెళ్ళారు, తద్వారా ఆయన క్రీస్తు అని తమంతట తాము చూడగలిగారు. అదేవిధంగా, ఈ సంవత్సరం క్రొత్త నిబంధనలో మనం అధ్యయనం చేసినట్లు చాలామంది విశ్వాసులు క్రీస్తు రాకడ కోసం ఆతృతగా ఎదురుచూశారు. అప్పుడు వారు తమ పొలాలు, పని స్థలములు మరియు భోజనపు బల్లలు విడిచిపెట్టి, ఆయనను వెంబడించి, ఆయనమీద పడుతూ, ఆయన చుట్టు గుంపుగా చేరి, ఆయనతో కూర్చున్నారు. లేఖనాలలోని సమూహముల వలె మనంతట మనము చూడాలని మనము ఆతృతగా ఉన్నామా? మనము కోరుకునే ఆశీర్వాదాలు వారి ఆశీర్వాదాల కంటే తక్కువ అవసరమైనవా?

క్రీస్తు వారి దేవాలయంలో నీఫైయులను భౌతికంగా సందర్శించినప్పుడు, ఆయన ఆహ్వానం దూరంలో నిలబడి ఆయనను చూడమని కాదు, కానీ ఆయనను తాకడం, మానవాళి యొక్క రక్షకుని వాస్తవికతను స్వయంగా అనుభూతి చెందడం. యేసు క్రీస్తును గురించి వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందేందుకు తగినంతగా మనం ఎలా దగ్గరవ్వగలము? ఇది మా నాన్న నాకు నేర్పడానికి ప్రయత్నిస్తున్న దానిలో భాగం కావచ్చు. క్రీస్తు భూసంబంధమైన పరిచర్యలో ఆయనతో నడిచిన వారి భౌతిక సామీప్యాన్ని మనం ఆస్వాదించలేకపోయినా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతిరోజూ ఆయన శక్తిని అనుభవించవచ్చు! మనకు కావలసినంత!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులు, క్రీస్తును వెదకడం మరియు ఆయన గురించి రోజువారీ వ్యక్తిగత సాక్ష్యాలను పొందడం గురించి నాకు చాలా నేర్పించారు. వారిలో ఇద్దరి జ్ఞానమును నేను పంచుకుంటాను:

లివ్వీ తన జీవితమంతా సర్వసభ్య సమావేశాన్ని చూసింది. వాస్తవానికి, ఆమె ఇంట్లో వారు సాంప్రదాయకంగా మొత్తం ఐదు సభలను కుటుంబసమేతంగా చూస్తారు. గతంలో, లివ్వీ సర్వసభ్య సమావేశము అంటే చికాకుపడేది లేదా అప్పుడప్పుడు ఆమె అనుకోకుండా నిద్రలోకి జారేది. అయితే గత అక్టోబరు సర్వసభ్య సమావేశము భిన్నంగా జరిగింది. అది వ్యక్తిగతంగా మారింది.

ఈసారి, లివ్వీ క్రియాశీల గ్రహీతగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె తన ఫోను‌లో నోటిఫికేషన్‌ల శబ్దాన్ని తీసివేసింది మరియు ఆత్మ నుండి వచ్చిన తలంపులను వ్రాసుకుంది. తాను వినాలని మరియు చేయాలని దేవుడు కోరుకున్న నిర్దిష్టమైన విషయాలను భావించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఈ నిర్ణయం ఆమె జీవితంలో వెంటనే మార్పు తెచ్చింది.

కొద్ది రోజుల తర్వాత ఆమె స్నేహితులు ఆమెను అనుచితమైన సినిమాకు ఆహ్వానించారు. ఆమె ప్రతిబింబిస్తూ, “సమావేశము యొక్క మాటలు మరియు ఆత్మ నా హృదయంలోకి తిరిగి వచ్చినట్లు నేను భావించాను మరియు నాకై నేను వారి ఆహ్వానాన్ని తిరస్కరించడం విన్నాను” అంది. ఆమె తన వార్డులో రక్షకుని గురించి తన సాక్ష్యాన్ని పంచుకునే ధైర్యం కూడా కలిగియుంది.

ఈ సంఘటనల తర్వాత ఆమె ఇలా చెప్పింది, “ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, యేసే క్రీస్తు అని నాకైనేను సాక్ష్యమివ్వడం విన్నప్పుడు, పరిశుద్ధాత్మ నా కోసం దాన్ని మళ్ళీ ధృవీకరించినట్లు అనిపించింది.”

సమావేశ వారాంతంలో లివ్వీ అప్పుడప్పుడు విని కొద్దిగా లాభం పొందాలనుకోలేదు; అత్యంత లాభం పొందడానికి ఆమె మనస్సు మరియు ఆత్మతో ప్రయత్నించింది, రక్షకుని గురించి తన సాక్ష్యాన్ని బలపరచుకుంది.

ఇక ఇప్పుడు మ్యాడీ. ఆమె కుటుంబం సంఘానికి వెళ్ళడం మానేసినప్పుడు, మ్యాడీ ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడింది. ముఖ్యమైనదేదో కోల్పోతున్నట్లు ఆమె గ్రహించింది. కాబట్టి, 13 సంవత్సరాల వయస్సులో మ్యాడీ ఒంటరిగా సంఘానికి వెళ్ళడం ప్రారంభించింది. ఒంటరిగా ఉండడం కొన్నిసార్లు కష్టంగా మరియు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, సంఘములో రక్షకుడిని కనుగొనగలదని ఆమెకు తెలుసు మరియు ఆయన ఉన్నచోటే ఉండాలని ఆమె కోరుకుంది. “సంఘములో ఉన్నపుడు నా ఆత్మ ఇంట్లో ఉన్నట్లు భావించింది,” అని ఆమె చెప్పింది.

తన కుటుంబం నిత్యత్వము కోసం కలిపి బంధించబడుతుందనే వాస్తవాన్ని మ్యాడీ పట్టుకుంది. ఆమె తన తమ్ముళ్ళను సంఘానికి తీసుకురావడం మరియు ఇంటి వద్ద వారితో లేఖనాలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తల్లి వారితో చేరడం ప్రారంభించింది. సువార్త సేవ చేయాలనే కోరిక గురించి మ్యాడీ తన తల్లికి చెప్పింది మరియు ఆమె తల్లిని తనతో పాటు దేవాలయానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండమని అడిగింది.

ఈరోజు మ్యాడీ MTCలో ఉంది. ఆమె సేవ చేస్తోంది. ఆమె క్రీస్తుకు సాక్షిగా ఉంది. ఆమె మాదిరి ఆమె తల్లిదండ్రులు ఇద్దరినీ దేవాలయానికి మరియు తిరిగి క్రీస్తు వద్దకు నడిపించడానికి సహాయపడింది.

లివ్వీ మరియు మ్యాడీల వలె, మనం క్రీస్తును వెదకడానికి ఎంచుకున్నప్పుడు, ఆత్మ అనేక విభిన్న పరిస్థితులలో ఆయన గురించి సాక్ష్యమిస్తుంది. మనం ఉపవాసం ఉండి, ప్రార్థిస్తూ, వేచియుండి, ముందుకు సాగినప్పుడు ఈ ఆత్మ యొక్క సాక్ష్యములు సంభవిస్తాయి. దేవాలయంలో తరచుగా ఆరాధించడం, రోజూ పశ్చాత్తాపపడడం, లేఖనాలను అధ్యయనం చేయడం, సంఘమునకు మరియు సెమినరీకి హాజరు కావడం, మన గోత్రజనక దీవెనలను ధ్యానించడం, యోగ్యులుగా విధులను పొందడం మరియు పవిత్రమైన నిబంధనలను గౌరవించడం ద్వారా క్రీస్తుతో మన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇవన్నీ మన మనస్సులను ప్రకాశవంతం చేయడానికి ఆత్మను ఆహ్వానిస్తాయి మరియు అవి అదనపు శాంతిని, రక్షణను తెస్తాయి. అయితే క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే పవిత్ర అవకాశాలుగా మనం వాటిని గౌరవిస్తామా?

నేను చాలాసార్లు దేవాలయానికి హాజరయ్యాను, కానీ నేను ప్రభువు యొక్క మందిరములో ఆరాధించినప్పుడు, అది నన్ను మారుస్తుంది. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఆకలితో ఉంటాను, మరికొన్ని సమయాల్లో, నేను ఉద్దేశపూర్వకంగా ఆత్మను విందారగిస్తాను. నేను గొణుగుతూ కొన్నిసార్లు పునరావృతమయ్యేవి మరియు సాధారణమైన ప్రార్థనలను చేసాను, కానీ నేను కూడా ప్రార్థన ద్వారా ప్రభువు నుండి సలహాను అందుకోవాలని ఆత్రుతగా వచ్చాను.

ఈ పరిశుద్ధ అలవాట్లను ఒక సాధారణ పనిలాగా లేదా తనిఖీ జాబితాగా పరిగణించకుండా ఒక సాక్ష్యంగా మార్చడంలో గొప్ప శక్తి ఉంది. ఈ ప్రక్రియ క్రమంగా ఉంటుంది, కానీ రోజువారీ, చురుకైన భాగస్వామ్యంతో మరియు క్రీస్తుతో ఉద్దేశపూర్వక అనుభవాలతో పెరుగుతుంది. మనం స్థిరంగా ఆయన బోధనల ప్రకారం పని చేయడం వలన, ఆయన గురించి సాక్ష్యాన్ని పొందుతాము; మనము ఆయనతో మరియు మన పరలోక తండ్రితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. మనము వారిలా మారడం ప్రారంభిస్తాము.

అపవాది చాలా కలవరము సృష్టిస్తాడు, అందువలన ప్రభువు స్వరాన్ని వినడం కష్టతరమవుతుంది. మన ప్రపంచం, మన సవాళ్ళు, మన పరిస్థితులు శాంతంగా ఉండవు, కానీ మనం స్పష్టంగా “ఆయనను వినడానికి” క్రీస్తు యొక్క విషయాలను బట్టి ఆకలి దప్పులతో ఉండగలుగుతాము మరియు ఉండాలి.2 ప్రతీరోజు మన రక్షకునిపై మనము ఆధారపడడాన్ని దృష్టిలో ఉంచుకునే శిష్యత్వం మరియు సాక్ష్యాల యొక్క బలమైన జ్ఞాపకశక్తిని సృష్టించుకోవాలని మనం కోరుకుంటున్నాము.

మా నాన్న మరణించి ఇప్పటికి 11 సంవత్సరాలు గడిచింది, కానీ ఆయన మాటలు నాలో సజీవంగా ఉన్నాయి. “బోనీ, క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు”. ఆయన ఆహ్వానాన్ని అంగీకరించడంలో నాతో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతిచోటా క్రీస్తు కోసం వెదకండి―ఆయన అక్కడ ఉన్నారని నేను వాగ్దానం చేస్తున్నాను!3 నిజమైన ఆనందం, క్రీస్తుకు దగ్గరగా రావడానికి మరియు మనకైమనం సాక్ష్యమివ్వడానికి మన సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది.

అంత్య దినములలో యేసే క్రీస్తు అని “ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన ముందు ఒప్పుకొనును”4 అని మనకు తెలుసు. యేసు క్రీస్తు సజీవుడు! అని ఆనందంగా సాక్ష్యమివ్వడానికి ప్రతీ అవకాశాన్ని మనం తీసుకోవాలని—ఈ సాక్ష్యము ఇప్పుడు మనకు సాధారణ మరియు సహజమైన అనుభవంగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను.

నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తానికి మనము ఎంతో కృతజ్ఞులము, అది “నిత్య జీవితాన్ని ఒక అవకాశంగా మరియు అమర్త్యత్వాన్ని [మన] అందరికీ వాస్తవంగా చేసింది.”5 యేసు క్రీస్తు అనే ఆయన పవిత్ర నామంలో ఆయన యొక్క మంచితనం మరియు గొప్ప మహిమ గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.