సర్వసభ్య సమావేశము
మీ గోత్రజనకుని దీవెనను ఎప్పుడు పొందాలి
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మీ గోత్రజనకుని దీవెనను ఎప్పుడు పొందాలి

మీరు మీ దీవెనను పొందినప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు మరియు వారు వ్యక్తిగతంగా మీపై ఎలా దృష్టిసారిస్తున్నారో మీరు గ్రహించి, అనుభూతి చెందుతారు.

నిన్న నా ప్రియమైన స్నేహితుడు ఎల్డర్ రాండాల్ కె. బెన్నెట్ గోత్రజనకుని దీవెనల గురించి మాట్లాడారు. అది గొప్ప సందేశము మరియు మనందరిని ప్రేరేపించింది. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, అదేవిధంగా నేను గోత్రజనకుని దీవెనల గురించి మాట్లాడనా? గోత్రజనకులారా, గోత్రజనకుని దీవెనల కొరకు మనవులు ఎక్కువైనప్పుడు, మీ పిలుపును నెరవేర్చుటను మీరు కొనసాగించినప్పుడు ప్రభువు మిమ్మల్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

నేను స్టేకు సమావేశాలకు వెళ్ళినప్పుడు, నేను ఎల్లప్పుడు స్టేకు గోత్రజనకుడిని, ఆయన భార్యను సందర్శిస్తాను. గోత్రజనకులు మృదువైన వారు, విధేయులు మరియు దేవుని చేత పిలువబడిన అపురూపమైన నాయకులు. అనేక అద్భుతమైన ఆత్మీయ అనుభవాలను వారు నాకు చెప్తారు. వారు దీవెన ఇచ్చిన అతి చిన్న మరియు పెద్ద వయస్సును నేను వారిని అడిగాను. ఇప్పటి వరకు, అతి చిన్న వయస్సు 11 మరియు పెద్ద వయస్సు 93.

బాప్తిస్మము పొందిన రెండు సంవత్సరాల తరువాత, 19 సంవత్సరాల వయస్సులో, సంఘములో క్రొత్త సభ్యునిగా నేను నా గోత్రజనకుని దీవెనను పొందాను. నా గోత్రజనకుడు చాలా వృద్ధుడు. ఆయన 1916లో సంఘములో చేరారు మరియు జపాన్‌లో సంఘము యొక్క అగ్రగామిగా ఉన్నారు. ఆ అసాధారణమైన ప్రభువు యొక్క శిష్యుని నుండి నా గోత్రజనకుని దీవెనను పొందడం నాకు గొప్ప గౌరవం. ఆయన జపాను భాష నాకు అర్థం చేసుకోవడానికి కష్టమైనది, కానీ అది శక్తివంతమైనది.

అనేకమంది వ్యక్తులు సువార్త సేవ చేయడానికి ముందు వారి గోత్రజనకుని దీవెనలు పొందారని నేను కలిసిన గోత్రజనకుడు నాతో చెప్పారు. నా ప్రియమైన యువతీ యువకులారా, తల్లిదండ్రులు మరియు బిషప్పులారా, గోత్రజనకుని దీవెనలు సువార్త సేవ చేయడానికి సిద్ధపాటు కొరకు మాత్రమే కాదు. యోగ్యత కలిగి బాప్తిస్మము పొందిన సభ్యులు వారికి సరైన సమయము వచ్చినప్పుడు వారి గోత్రజనకుని దీవెనను పొందవచ్చు.1

ప్రియమైన పెద్దలారా, మీలో కొందరు ఇంకా మీ గోత్రజనకుని దీవెనలు పొందలేదు. గరిష్ట వయోపరిమితి లేదని గుర్తుంచుకోండి.

చాలా చురుకైన సంఘ సభ్యురాలైన మా అత్తగారు, తన 91 సంవత్సరాల వయస్సులో చనిపోయే వరకు ఉపశమన సమాజ బోధకురాలిగా సేవ చేసింది. ఆమె గోత్రజనకుని దీవెనలు పొందలేదని తెలిసి నేను విచారించాను. ఆమె తన జీవితంలో అనేక కష్టాలను అనుభవించింది మరియు ఆమె తన ఇంటిలో యాజకత్వము గల వారిని కలిగిలేదు, ఆమె అనేక యాజకత్వ దీవెనలు పొందలేదు. ఆమెకు చాలా అవసరమైనప్పుడు, ఒక గోత్రజనకుని దీవెన ఆమెకు ఓదార్పును ఇచ్చియుండవచ్చు.

పెద్దలారా, మీరు ఇంకా ఒక గోత్రజనకుని దీవెన పొందని యెడల, దయచేసి చింతించవద్దు! ప్రతీఒక్కరి ఆత్మీయ కాలక్రమం భిన్నంగా ఉంటుంది. మీరు 35 లేదా 85 సంవత్సరాల వారైనా, మీరు కోరిన యెడల, మీ దీవెన పొందుట గురించి మీ బిషప్పుతో మాట్లాడండి.

క్రొత్త సంఘ సభ్యులారా, మీరు గోత్రజనకుని దీవెనల గురించి విన్నారా? నేను సంఘములో చేరినప్పుడు దానిని పొందే అవకాశం గురించి నాకు తెలియలేదు, కానీ నా ప్రియమైన బిషప్పు గోత్రజనకుని దీవెనల గురించి నాతో చెప్పారు మరియు నేను బాప్తిస్మము పొందిన వెంటనే సిద్ధపడమని నన్ను ప్రోత్సహించారు. నా ప్రియమైన సభ్యులారా, అదేవిధంగా మీరు గోత్రజనకుని దీవెనను పొందవచ్చు. ఈ పవిత్రమైన అవకాశము కొరకు సిద్ధపడడానికి ప్రభువు మీకు సహాయపడతారు.

గోత్రజనకుని దీవెన కొరకు రెండు ఉద్దేశాలను మనము పరిగణిద్దాము:

  1. ఒక గోత్రజనకుని దీవెన ప్రభువు నుండి మీకు వ్యక్తిగత ఉపదేశాన్ని కలిగియుంటుంది.2

  2. ఒక గోత్రజనకుని దీవెన ఇశ్రాయేలు వంశములో మీ గోత్రమును ప్రకటిస్తుంది.

మీ గోత్రజనకుని దీవెనలు మీ పరలోక తండ్రి నుండి ఒక సందేశము మరియు మీ జీవితకాలమంతా మిమ్మల్ని నడిపించడానికి వాగ్దానములను, ప్రేరేపించబడిన ఉపదేశమును కలిగియుండవచ్చు. గోత్రజనకుని దీవెన మీ జీవితంలో జరిగే వాటన్నిటిని వివరించదు లేదా మీ ప్రశ్నలన్నిటికి జవాబు ఇవ్వదు. అది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనను తెలియజేయని యెడల, మీకు ఆ అవకాశముండదని అనుకోవద్దు. అదేవిధంగా, మీ దీవెనలో ఉన్న సమస్తము ఈ జీవితంలో జరుగుతుందన్న హామీ ఏదీ లేదు. గోత్రజనకుని దీవెన నిత్యమైనది మరియు మీరు యోగ్యులుగా జీవించినట్లయితే, ఈ జీవితంలో నెరవేర్చబడని వాగ్దానములు తరువాతి జీవితంలో అనుగ్రహించబడతాయి.3

వంశావళి ప్రకటనను మీరు పొందినప్పుడు, మీరు ఇశ్రాయేలు వంశము వారని మరియు అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకుంటారు.4 దాని ప్రాముఖ్యతను గ్రహించడానికి, అబ్రాహాము ద్వారా ఇశ్రాయేలు సంతానమునకు ప్రభువు చేసిన వాగ్దానములపై దృష్టిసారించండి.

ఆ వాగ్దానములు వీటిని కలిగియున్నాయి:

  • “అత్యధికముగా అతని సంతానము వృద్ధిచెందును (ఆదికాండము 17:5–6; అబ్రాహాము 2:9; 3:14 చూడండి).

  • “అతని సంతతి లేదా వంశస్థులు సువార్తను పొందుతారు మరియు యాజకత్వమును వహిస్తారు (అబ్రాహాము 2:9).

  • “అతని సంతతి యొక్క పరిచర్య ద్వారా, ‘భూమి యొక్క కుటుంబాలన్నీ సువార్త యొక్క దీవెనలతో కూడా, అనగా రక్షణ యొక్కయు, నిత్య జీవము యొక్కయు దీవెనలతో దీవించబడతాయి’ (అబ్రాహాము 2:1).”5

సంఘ సభ్యులుగా, మనము నిబంధన సంతానము.6 మనము సువార్త యొక్క చట్టములు, విధులకు లోబడినప్పుడు అబ్రాహాము నిబంధన యొక్క దీవెనలను పొందుతాము.

మీ గోత్రజనకుని దీవెన కొరకు సిద్ధపడుట పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు మీ విశ్వాసాన్ని వృద్ధిచేయడానికి సహాయపడుతుంది. మీ గోత్రజనకుని దీవెనను మీరు పొంది, చదివి, దానిని ధ్యానించినప్పుడు, మీరు వాటిపై ఎక్కువ తరచుగా దృష్టిసారించగలరు.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా వివరించారు, “లీహై కోసం లియహోనాను అందించిన ప్రభువు మన జీవితాలకు నడిపింపును ఇవ్వడానికి, మన భద్రతకు ప్రమాదాలను గుర్తించడానికి, వాగ్దాన దేశమునకు కాదు గాని, మన పరలోక గృహానికి మార్గమును, సురక్షితమైన మార్గమును కూడా చూపడానికి ఈరోజు మీకు, నాకు అరుదైన మరియు విలువైన బహుమానాన్ని అందిస్తారు.”7

నా ప్రియమైన బిషప్పులు, తల్లిదండ్రులు, పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షులారా, వార్డు మిషను నాయకులు, పరిచర్య చేయు సహోదర సహోదరీలారా, వారి గోత్రజనకుని దీవెనను ఇంకను పొందని యువకులు, యువతులు, పెద్దలు మరియు క్రొత్త సభ్యులను ఆవిధంగా చేయడానికి తమనుతాము సిద్ధపరచుకోవడంలో ప్రభువు నడిపింపును, సహాయాన్ని వెదకమని దయచేసి ప్రోత్సహించండి.

నేను తరచుగా, ప్రార్థనాపూర్వకంగా నా గోత్రజనకుని దీవెనను చదువుతాను; అది నాకు ఎల్లప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రభువు నా నుండి ఆశిస్తున్న దానిని నేను గుర్తించాను, నేను పశ్చాత్తాపపడడానికి మరియు వినయంగా ఉండడానికి అది నాకు సహాయపడింది. నేను దానిని చదివి, ధ్యానించినప్పుడు, దానిలో వాగ్దానము చేయబడిన దీవెనలు పొందడానికి నేను యోగ్యతగా జీవించాలని కోరుతున్నాను.

మనము అనేకసార్లు చదివిన లేఖనాలు తరువాత మనకు క్రొత్త అర్థాన్ని కలిగియున్నట్లుగా, మన గోత్రజనకుని దీవెన వేర్వేరు సమయాలలో మనకు వేర్వేరు అర్థాన్ని కలిగియుంటుంది. నాకు 30 సంవత్సరాలున్నప్పుడు మరియు నాకు 50 సంవత్సరాలు ఉన్నప్పటి కంటే, ఇప్పుడు నా దీవెన భిన్నమైన అర్థాన్ని కలిగియుంది. పదములు మారవు, కానీ మనము వాటిని భిన్నంగా చూస్తాము.

ఒక గోత్రజనకుని దీవెన “పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ క్రింద ఇవ్వబడింది మరియు అదే ఆత్మ యొక్క ప్రభావం క్రింద చదవబడాలి మరియు అనువదించబడాలి. ఒక గోత్రజనకుని దీవెన యొక్క అర్థము మరియు ప్రాముఖ్యత [దానిని] ప్రేరేపించిన అదే ఆత్మ యొక్క శక్తి చేత కాలక్రమంలో వరుస వెంబడి వరుసగా బోధించబడుతుంది” అని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించారు.8

సహోదర సహోదరీలారా, పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన అద్వితీయ కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. వారు మనల్ని ప్రేమిస్తున్నారు. గోత్రజనకుని దీవెనలు వారి నుండి వచ్చే పవిత్రమైన బహుమానాలు. మీరు మీ దీవెనను పొందినప్పుడు, వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు మరియు వారు మీపై వ్యక్తిగతంగా ఎలా దృష్టిసారిస్తున్నారో మీరు గ్రహించి, అనుభూతి చెందుతారు.

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. జీవించియున్న ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నడిపించబడడానికి నేను కృతజ్ఞత కలిగియున్నాను.

మన రక్షకుడైన, యేసు క్రీస్తు కొరకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. ఈ ఈస్టరు ఆదివారమున నేను ఆయనపై, ఆయన పునరుత్థానముపై దృష్టిసారించాలని కోరుతున్నాను మరియు ఆయనను ఆరాధించి, ఆయన త్యాగము కొరకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన మనల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు కనుక, ఆయన చాలా తీవ్రమైన బాధను అనుభవించారని నాకు తెలుసు. మన పట్ల ఆయనకు గల ప్రేమ వలన ఆయన పునరుత్థానము చెందారని నాకు తెలుసు. ఆయన నిజస్వరూపుడు. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. See General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 18.17, ChurchofJesusChrist.org.

  2. See “Patriarchal Blessings,” in True to the Faith (2004), 112.

  3. See “Patriarchal Blessings,” in True to the Faith, 113.

  4. అబ్రాహాము 2:10 చూడండి.

  5. Abrahamic Covenant,” in True to the Faith, 5.

  6. 3 నీఫై 20:25--26 చూడండి.

  7. Thomas S. Monson, “Your Patriarchal Blessing: A Liahona of Light,” Ensign, Nov. 1986, 65–66.

  8. Dallin H. Oaks, “Patriarchal Blessings,” Worldwide Leadership Training Meeting: The Patriarch, Jan. 8, 2005, 10.