సర్వసభ్య సమావేశము
దేవాలయము మరియు కుటుంబ చరిత్ర యొక్క కార్యము---ఒకే కార్యానికి సంబంధించిన రెండు అంశాలు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


దేవాలయము మరియు కుటుంబ చరిత్ర యొక్క కార్యము---ఒకే కార్యానికి సంబంధించిన రెండు అంశాలు

మన పరలోక తండ్రి ప్రణాళిక ప్రధానంగా దృష్టిసారించేది ఈ జీవితము మరియు నిత్యత్వము కొరకు కుటుంబమును ఏకముగా చేయుటపై.

ఈ “కాలముల సంపూర్ణ యుగపు ప్రారంభములో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18) కొనసాగుతున్న దేవాలయాల నిర్మాణము కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. పునఃస్థాపన జరిగిన ప్రారంభ దినాలనుండి, విశ్వాసులైన పరిశుద్ధులు దేవాలయ విధులు మరియు నిబంధనలు పొందడానికి అనేక త్యాగాలను చేసారు. వారి గొప్ప మాదిరిని అనుసరిస్తూ, మెక్సికో పట్టణము నుండి ప్రయాణించడానికి అనేక ఆర్ధిక త్యాగాలను చేసిన తరువాత, నా ప్రియమైన భార్య ఎవెలియా మరియు నేను మా ప్రియమైన తల్లిదండ్రులతో కలిసి, 1975లో మెసా ఆరిజోనా దేవాలయములో నిత్యమైన భార్యాభర్తలుగా ముద్రింపబడ్డాము. ఆ రోజు, మేము ప్రభువు యొక్క మందిరములో యాజకత్వ అధికారము చేత ఏకము చేయబడినప్పుడు, మేము నిజముగా పరలోకము యొక్క క్షణికదర్శనాన్ని అనుభవించాము.

దేవాలయ కార్యము మరియు ఉద్దేశ్యము

మూడు సంవత్సరాల కష్టమైన పని మరియు గొప్ప త్యాగము తరువాత ఒహైయో, కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులు చివరికి 1836 వసంతకాలములో వారి అందమైన దేవాలయమును పూర్తి చేయడాన్ని ఎక్కువగా ప్రశంసించడానికి ఆ అనుభవము నన్ను అనుమతించింది---అది ఈ యుగములో మొదటిది. అదే సంవత్సరం మార్చిలో, వేలమంది జనులు దేవాలయములో మరియు దాని ద్వారముల వద్ద సమర్పణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ సమర్పణ ప్రార్థన చేయడానికి పైకి లేచారు, దానిని ఆయన బయల్పాటు ద్వారా పొందారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 109 చూడండి). దానిలో ఆయన ప్రభువు యొక్క దేవాలయాలలోనికి యోగ్యతగా ప్రవేశించే వారిపై దయచేయబడే అసాధారణమైన దీవెనలలో అనేకమును వర్ణించారు. తరువాత గాయక బృందము “దేవుని యొక్క ఆత్మ” కీర్తనను పాడారు మరియు సమూహము నిలబడి “భవనము పైకప్పును పైకెత్తినట్లు అనిపించేలా … అంత [బలంగా]” హోసన్నా కేక వేసారు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 307).

ఒక వారము తరువాత, దేవాలయములో ప్రభువు యొక్క ప్రత్యక్షతను ప్రవక్త ఇలా వివరించారు:

“ఏలయనగా ఇదిగో, నేను ఈ మందిరమును అంగీకరించితిని, నా నామము ఇక్కడ ఉండును; కరుణతో ఈ మందిరములో నా జనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకొందును. …

“ఈ మందిరపు ప్రతిష్ఠ విదేశాలకు వ్యాపించును; నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము“ (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:7,10).

ఇది మరియు మిగిలిన దర్శనాల తరువాత, మరణమును రుచి చూడకుండా పరలోకమునకు తీసుకొనపోబడిన ఏలీయా ప్రవక్త, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీల యెదుట ప్రత్యక్షమై ఇలా చెప్పాడు:

“ఇదిగో, మలాకీ నోటి ద్వారా చెప్పబడిన దానికి సమయము ఆసన్నమాయెను— ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము వచ్చుటకు ముందు అతడు [ప్రవక్త ఏలీయా] పంపబడునని సాక్ష్యమిచ్చెను—

“తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పుటకు వచ్చును, లేనియెడల ఈ భూమియంతయు ఒక శాపముతో శపించబడును—

“కాబట్టి, ఈ యుగపు తాళపుచెవులు మీ చేతులకు అప్పగించబడియున్నవి; దీనివలన ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము దగ్గరలో, తలుపు యొద్ద సమీపములో నున్నదని మీరు తెలుసుకొందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:14--16).

దేవాలయము మరియు కుటుంబ చరిత్ర

ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు ముద్రించే తాళపుచెవులను పునరుద్ధరించిన తర్వాత, తెరకు ఇరువైపులా రక్షణకు సంబంధించిన కార్యము మన కాలంలో ప్రారంభమైంది (1 కొరింథీయులకు 15:22, 29; సిద్ధాంతము మరియు నిబంధనలు 128:8--18 చూడండి).

ఎల్డర్ బాయిడ్ కె. ప్యాకర్ ఇలా బోధించారు, “ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఈ ముఖ్యమైన ఘటన లోకము చేత పట్టించుకోబడలేదు, కానీ అది ఎప్పటికీ జీవించిన లేదా జీవించబోయే ప్రతీ ఆత్మ యొక్క గమ్యమును ప్రభావితం చేస్తుంది. విషయాలు జరుగుట నెమ్మదిగా ప్రారంభమైనది. సంఘము దేవాలయాలను నిర్మించుటపై దృష్టిసారించుట ప్రారంభించింది.

“ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విషయాలు కనిపించడం ప్రారంభించడంతో, ఆకస్మికంగా భావించిన విధానములో వ్యక్తులు, సంస్థలు మరియు సమాజాలు వంశావళి జాడ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపించారు. కర్ట్‌లాండ్ దేవాలయములో ఏలీయా ప్రత్యక్షమైనప్పటి నుండి ఇదంతా సంభవించింది” (The Holy Temple [1980], 141).

“1836, ఏప్రిల్ 3 నుండి, పిల్లల హృదయాలు తమ తండ్రుల తట్టు తిరగడం ప్రారంభించాయి. ఆ తర్వాత విధులు తాత్కాలికమైనవి కాదు, కానీ శాశ్వతమైనవి. ముద్రించే అధికారము మనతో ఉన్నది. ఏ అధికారము దాని విలువను అధిగమించదు. ఆ అధికారము జీవిస్తున్నవారు మరియు మృతులు ఇరువురి కొరకు సరైన అధికారముతో నెరవేర్చబడిన విధులన్నిటికి వాస్తవము యొక్క రుజువును మరియు నిత్య శాశ్వతత్వమును ఇస్తుంది” (Preparing to Enter the Holy Temple [2002], 28–28).

ప్రియమైన సహోదర సహోదరీలారా, ఏ యుగములోనైనా దేవాలయాల నిర్మాణము మరియు వాటి సరైన ఉపయోగము యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము యొక్క సూచనగా ఉన్నది. 1893లో సాల్ట్‌లేక్ దేవాలయము సమర్పించబడిన తరువాత, అధ్యక్షులు విల్‌ఫర్డ్ వుడ్రఫ్ సంఘ సభ్యులను వారి పూర్వీకుల నివేదికలను కనుగొనమని, దేవాలయములోనికి పేర్లను తెచ్చి రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను నెరవేర్చడానికి సాధ్యమైనంత వెనుకకు వెళ్ళుట ద్వారా వారి వంశావళిని వ్రాయమని ప్రోత్సహించారు (see Teachings of Presidents of the Church: Wilford Woodruff [2004], 174).

కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము--ఒకే కార్యము

ఒక సంవత్సరం తరువాత (1894) తరువాత, అదే అధ్యక్షులు వుడ్రఫ్ యూటా వంశావళి సమాజము యొక్క ఏర్పాటును పర్యవేక్షించారు. ఒక వంద సంవత్సరాల తరువాత, 1994లో ఆనాటి పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులైన ఎల్డర్ రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “ఆ చారిత్రక సంవత్సరంలోని ఘటనలు కుటుంబ చరిత్ర పరిశోధన మరియు దేవాలయ సేవను సంఘములో ఒకే కార్యముగా స్థాపించాయి” (“The Spirit of Elijah,” Ensign, Nov. 1994, 85).

కుటుంబ చరిత్ర కార్యము

ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆయన సంఘ సభ్యులుగా మనల్ని మన స్వంత కుటుంబ చరిత్రను కాపాడుకోమని, మన పూర్వీకులనుండి నేర్చుకోమని మరియు నిత్య కుటుంబంతో వారిని దీవించి, నిబంధన బాట వెంబడి అభివృద్ధి చెందడానికి వారికి సహాయపడుటకు దేవాలయాలలో సువార్త యొక్క విధులు పొందడానికి వారి కొరకు అవసరమైన ఏర్పాట్లు చేయమని ప్రభువు ప్రోత్సహిస్తున్నారు. అదే మన పరలోక తండ్రి ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశ్యము: ఈ జీవితము మరియు నిత్యత్వము కొరకు కుటుంబమును ఏకము చేయుట.

ఈ కార్యము చేయడానికి సమర్థులు కారని భావించే వారు, మీరు ఒంటరిగా లేరని మీరు తెలుసుకోవాలి. మనమందరం సంఘము సిద్ధపరచిన మరియు కుటుంబ చరిత్ర కేంద్రాలుగా మనకు తెలిసిన కుటుంబ పరిశోధనా కేంద్రాలలో కనుగొనబడిన సాధనాలపై ఆధారపడి, ఉపయోగించగలము. దాదాపుగా ఎవరైనా, తక్కువ సహాయంతో వారి పూర్వీకుల సమాచారాన్ని కనుగొని దానిని సరిగ్గా నిర్వహించగలిగి, దానిని ప్రభువు యొక్క మందిరానికి తీసుకొని వెళ్ళగలుగునట్లు ఈ కుటుంబ పరిశోధనా కేంద్రాలు రూపొందించబడ్డాయి. మీ వార్డులో కుటుంబ చరిత్ర నిపుణులను దయచేసి సంప్రదించండి, వారు మార్గములో ప్రతీ దశలో మీకు నడిపింపునిస్తారు.

మనము ప్రవక్తల నడిపింపును అనుసరించి, కుటుంబ చరిత్రను ఎలా చేయాలో నేర్చుకొని మన పూర్వీకుల కొరకు దేవాలయ విధులను నెరవేర్చినప్పుడు, మనము గొప్ప సంతోషాన్ని అనుభవించి, దానిని చేయడం ఆపాలని కోరుకొనని స్థితికి చేరుకుంటాము. మనము హఠాత్తుగా, బలంగా అనుభవించే పరిశుద్ధాత్మ మన నైపుణ్యాలు, ప్రతిభలు చురుకుగా మారేలా చేస్తాడు మరియు మన పూర్వీకుల పేర్ల కొరకు మనం పరిశోధించినప్పుడు మనల్ని నడిపిస్తాడు. కానీ కుటుంబ చరిత్ర కేవలం పేర్లు, తేదీలు మరియు స్థలాలను పరిశోధించడం కంటే ఎక్కువైనదని మనము జ్ఞాపకముంచుకుందాం. అది కుటుంబాలను ఏకము చేయుట మరియు సువార్త విధులను వారికి ఇచ్చుట వలన కలిగే ఆనందమును అనుభూతిచెందుట అయ్యున్నది.

ఇలా చెప్పిన మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ప్రేరేపించబడిన బోధనను నేను ప్రేమిస్తున్నాను: “దేవాలయం మన విశ్వాసాన్ని, ఆత్మీయ స్థైర్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన భాగంగా ఉన్నది, ఎందుకంటే రక్షకుడు మరియు ఆయన సిద్ధాంతము దేవాలయంలో అత్యంత కీలకమైన భాగాలుగా ఉన్నాయి. బోధన ద్వారా మరియు ఆత్మ ద్వారా దేవాలయంలో బోధింబడే ప్రతీ విషయము యేసు క్రీస్తుపై మన అవగాహనను పెంచుతుంది. పరిశుద్ధమైన యాజకత్వపు నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని ఆయనతో బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు” (“The Temple and Your Spiritual Foundation,” Liahona, Nov. 2021, 93–94).

నిశ్చయముగా, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర యొక్క కార్యము---సంఘములో ఒకే కార్యానికి సంబంధించిన రెండు అంశాలు.

ఈ సత్యముల గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది మన రక్షకుడు, విమోచకుడు, ప్రభువైన యేసు క్రీస్తు సంఘమని నాకు తెలుసు, ఈ ఈస్టరు సమయంలో ఆయనను మనము జ్ఞాపకం ఉంచుకొని, ఆరాధిస్తున్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మనం మన నిబంధనలను పాటించి ఆయనయందు విశ్వాసము ఉంచినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.