సర్వసభ్య సమావేశము
ఆయన నన్ను స్వస్థపరచగలరు!
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఆయన నన్నుస్వస్థపరచగలరు!

రక్షకుని స్వస్థత మరియు విమోచించే శక్తి ప్రమాదవశాత్తు జరిగే తప్పులు, బలహీనమైన నిర్ణయాలు, సవాళ్ళు మరియు ప్రతివిధమైన శ్రమలు----అదేవిధంగా మన పాపములకు అన్వయిస్తుంది.

మోర్మన్ గ్రంథమును మనము చదివి, నిత్య తండ్రియైన దేవునిని యథార్థ హృదయముతో, నిజమైన ఉద్దేశముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడిగిన యెడల, దాని సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు ప్రత్యక్షపరచును” 1 అని మొరోనై వాగ్దానమిచ్చాడు. లక్షలమంది జనులు ఈ వాగ్దానమును అన్వయించుకున్నారు మరియు యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపనను గూర్చి రుజువు చేసే సాక్ష్యమును పొందారు.

మనము మోర్మన్ గ్రంథమును చదువుతున్నప్పుడు, “ఆదాము యొక్క సృష్టి నుండి [ఈ] సమయము వరకు నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో జ్ఞాపకము చేసుకొనవలెనని, దానిని [మన] హృదయములలో ధ్యానించవలెనని మొరోనై మనకు ఉద్భోధించుచున్నాడు.”2 మోర్మన్ గ్రంథములోని వృత్తాంతములు మరియు బోధనలు మనకు రక్షకుని ప్రేమ, కనికరము మరియు కరుణను జ్ఞాపకం చేస్తాయి.

2013 ఏప్రిల్‌లో మా నాన్న చనిపోయారు. ఆయన అంత్యక్రియలలో మాట్లాడడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు, ఆయన ప్రియమైన లేఖనాలను తెలుసుకొని, ప్రేమించడానికి నేను ఎంతగా దీవించబడ్డానో గ్రహించాను. ఆయన వాటిని కుటుంబ సమావేశాలలో పంచుకున్నారు మరియు నాకు సలహా, నడిపింపు లేదా నా విశ్వాసమును బలపరచడం అవసరమైనప్పుడు వాటిని నాతోపాటు చదివారు. ఆయన వాటిని ప్రసంగాలు మరియు నియామకాలలో పంచుకోవడం నేను విన్నాను. నేను వాటిని తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన స్వరము యొక్క శబ్దం, ఆయన వాటిని పంచుకొన్నప్పుడు నాకు కలిగిన ఆత్మీయ భావనలు నాకింకా గుర్తున్నాయి. లేఖనాలను మరియు భావాలను పంచుకోవడం ద్వారా, మా నాన్న ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము యొక్క స్థిరమైన పునాదిని స్థాపించడానికి నాకు సహాయపడ్డారు.

మా నాన్న ప్రత్యేకంగా నీఫై యొక్క జనులకు రక్షకుని యొక్క సందర్శన వృత్తాంతాన్ని ఇష్టపడ్డారు.3 అది పునరుత్థానుడైన మరియు ఉన్నతస్థితి పొందిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర వృత్తాంతము. ఆయన చేదు పాత్రను త్రాగారు మరియు అన్ని బాధలను అనుభవించారు కనుక, మనము పశ్చాత్తాపపపడిన యెడల మనము బాధపడము.4 ఆయన ఆత్మ లోకమును సందర్శించారు మరియు అక్కడ సువార్తను ప్రకటించుటకు ఏర్పాటు చేసారు.5 ఆయన మరణము నుండి లేచారు మరియు ఆయన తండ్రితో ఉండి భవిష్యత్ తరములను దీవించునట్లు నీఫైయులతో లేఖనాలను పంచుకోవాలని ఆజ్ఞ పొందారు.6 ఆయన ఉన్నతస్థితిని పొందారు మరియు ఆయన నిత్య అధికారమును, సామర్థ్యమును కలిగియున్నారు. ఆయన బోధనల యొక్క ప్రతీ వివరణ నుండి మనము నేర్చుకోగలము.

3 నీఫై,11 లో, రక్షకుడు తానే యేసు క్రీస్తునని, లోకములోనికి వస్తారని ప్రవక్తలు ప్రకటించినది తనేనని నీఫైయులకు బోధించడానికి పరలోకము నుండి దిగి వచ్చారని మనము చదువుతాము. తాను లోకము యొక్క వెలుగని మరియు లోకము యొక్క పాపములను తీసుకొనిపోవడంలో తన తండ్రిని మహిమపరుస్తున్నానని ఆయన ప్రకటించారు. వారిని ముందుకు వచ్చి వారి చేతులతో ఆయన ప్రక్కలను తాకి, ఆయన చేతులు మరియు కాళ్ళలోని మేకుల గుర్తులను తడిమి తెలుసుకోమని జనులను ఆయన ఆహ్వానించారు. ఆయన ఇశ్రాయేలు యొక్క దేవుడని, ఆయన లోకపాపముల కొరకు సంహరించబడెనని వారు తెలుసుకోవాలని ఆయన కోరారు. జనులు సంతోషంగా చేసారు, వారందరు ముందుకు వెళ్ళువరకు ఒకని తరువాత ఒకడు వెళ్ళుచూ, వారు తమ కన్నులతో చూచి, చేతులతో తడిమి తెలుసుకొని మరియు ఎవరైతే రావలెనని ప్రవక్తల చేత వ్రాయబడినదో అది నిశ్చయముగా ఆయనేనని భావించారు.7

యేసు నీఫైయులకు పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యత గురించి, ఒక చిన్న బిడ్డ వలె మారి, ఆయన అధికారమును కలిగియున్న ఒకరి చేత బాప్తిస్మము పొందాల్సిన అవసరము గురించి బోధించారు. తరువాత ఆయన క్రొత్త నిబంధనలో ఈ సంవత్సరం మనం అధ్యయనం చేస్తున్న సిద్ధాంతములో అధికమును బోధించారు.

3 నీఫై 17లో, అది తండ్రి యొద్దకు మరియు ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రములకు తనను కనబరచుకొనుటకు వెళ్ళాల్సిన సమయమని యేసు జనులతో చెప్పుటను మనము చదువుతాము.8 ఆయన సమూహము వైపు చూచినప్పుడు, వారు కన్నీళ్ళతో ఉండి, మరికొంతసేపు వారితో నిలిచియుండమని ఆయనను అడుగుచున్నట్లు ఆయనవైపు తదేకముగా చూచుటను గమనించారు.9

నీఫైయులకు రక్షకుని యొక్క స్పందన హత్తుకునేది మరియు బోధనాత్మకమైనది. ఆయన వారితో ఇట్లు చెప్పెను: “ఇదిగో, నా ఆంత్రములు మీ యెడల కనికరముతో నిండియున్నవి.”10

ఆయన కనికరము జనుల యొక్క కన్నీళ్ళకు ప్రతిస్పందించడాన్ని మించినదని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క దృష్టితో వారిని ఆయన చూడగలిగినట్లుగా కనబడుచున్నది. ఆయన వారి ప్రతీ బాధను, శ్రమను మరియు శోధనను చూసారు. ఆయన వారి రోగములను చూసారు. ఆయన వారి బలహీనతలను చూసారు మరియు వారి బలహీనతలను బట్టి వారిని ఎట్లు ఆదరించవలెనో గెత్సేమనే మరియు గొల్గొతాలో ఆయన పడిన తీవ్రమైన వేదన నుండి ఆయన ఎరుగును.11

అదేవిధంగా, మన రక్షకుడైన యేసు క్రీస్తు మనల్ని పరిగణించినప్పుడు, ఆయన మన నొప్పిని మరియు మన పాపముల భారమును గ్రహిస్తారు. ఆయన మన వ్యసనములు మరియు సవాళ్ళను చూస్తారు. ఆయన మన ప్రయాసలు, అన్ని రకాల బాధలను చూస్తారు----మరియు ఆయన మనపట్ల కనికరముతో నిండియున్నారు.

నీఫైయులకు ఆయన కనికరముగల ఆహ్వానము ఇవ్వబడింది: “మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి. కుంటివారు, గ్రుడ్డివారు లేదా కదలలేని వారు, వికలాంగులు, కుష్ఠువారు, ఊచకాలు చేతులు గలవారు, చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను; నా ఆంత్రములు కనికరముతో నిండియున్నవి.”12

“సమూహమంతా కలిసి వారి రోగులను మరియు … ఏ విధముగానైనను బాధింపబడిన వారందరిని తీసుకొని ముందుకు వెళ్ళిరి; ఆయన యొద్దకు వారిని తీసుకురాగా, ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను.”13

1990 లో, మేము ఆస్ట్రేలియా, విక్టోరియాలో సేల్ యొక్క చిన్న నగరంలో నివసించాము. మేము కుటుంబము, సంఘము మరియు పని ఒడంబడికలతో సంతోషంగా తీరిక లేకుండా ఉన్నాము. క్రిస్మస్‌కు ముందు ఒక అందమైన వేసవికాలపు శనివారమున, మేము కొన్ని పార్కులు మరియు ప్రియమైన సముద్ర తీరమును సందర్శించాలని నిర్ణయించాము. ఒక కుటుంబముగా ఒక అద్భుతమైన రోజు ఆటలాడుతూ ఆనందించిన తరువాత, మేము ప్రతీఒక్కరిని కారులోనికి ఎక్కించి, ఇంటికి బయలుదేరాము. కారు నడుపుతుండగా, నేను క్షణకాలం నిద్రలోకి జారుకున్నాను మరియు కారు ప్రమాదానికి కారణమయ్యాను. కోలుకున్న కొన్ని క్షణాల తరువాత, నేను వాహనము చుట్టూ చూసాను. నా భార్య మాక్సిన్, కాలు బాగా విరిగిపోయి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతున్నది. ఆమె ఛాతి ఎముక విరిగిపోయింది. మా ముగ్గురు కూమార్తెలు దిగ్భ్రాంతి చెందారు, కానీ కృతజ్ఞతపూర్వకంగా బాగానే ఉన్నారు. నాకు కొన్ని చిన్న దెబ్బలు తగిలాయి. కానీ మా ఐదు- నెలల కుమారుడు స్పందించడం లేదు.

ఆ ప్రమాద దృశ్యము యొక్క ఒత్తిడి మరియు కలవరము మధ్య, మా పెద్ద కూతురు 11-సంవత్సరాల కేట్ ఆతృతగా చెప్పింది, “నాన్న, జేరమ్‌కి మీరు ఒక దీవెన ఇవ్వండి.” కొంత ప్రయాస తరువాత, నా కుమార్తెలు, నేను కారు బయటకు రాగలిగాము. మాక్సిన్ కదలలేకపోయింది. నేను జాగ్రత్తగా జేరమ్‌ని ఎత్తుకున్నాను; నేను నేలపై వెల్లకిలా పడుకొని, అతడిని మృదువుగా నా ఛాతిపై ఉంచాను మరియు అతడికి నేను ఒక యాజకత్వ దీవెన ఇచ్చాను. దాదాపు 40 నిముషాలకు అంబులెన్సు వచ్చిన తరువాత, జేరమ్‌కు స్పృహ వచ్చింది.

ఆ రాత్రి, నేను ముగ్గురు కుటుంబ సభ్యులను ఆసుపత్రి‌లో వదిలి, ఇద్దరు కుమార్తెలతో నిశ్శబ్దమైన కారులో ఇంటికి వెళ్ళాను. సుదీర్ఘమైన రాత్రి గుండా, నేను నా కుటుంబము మరియు మరో వాహనములో గాయపడిన వారు కోలుకోవాలని పరలోక తండ్రిని వేడుకున్నాను. కనికరంగా, నా ప్రార్థనలు మరియు అనేకమంది హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు జవాబివ్వబడ్డాయి. కాలక్రమేణా అందరూ స్వస్థపరచబడ్డారు, అది ఒక గొప్ప దీవెన మరియు మృదువైన కనికరము.

అయినప్పటికీ, నేను అటువంటి భయంకరమైన ప్రమాదము జరగడానికి కారణమైనందుకు బలమైన అపరాధ భావనలు కలిగియుండి, పశ్చాత్తాపపడుటను కొనసాగించాను. నేను రాత్రిళ్ళు లేచి, ఆ భయంకరమైన సంఘటనలు జ్ఞాపకం చేసుకునేవాడిని. సమాధానము కనుగొనడానికి మరియు నన్ను క్షమించుకోవడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. తరువాత, ఒక యాజకత్వ నాయకుడిగా, పశ్చాత్తాపపడడానికి ఇతరులకు సహాయపడుతూ, రక్షకుని కనికరము, కరుణ మరియు ప్రేమను అనుభూతి చెందడానికి సహాయపడుతూ, ఆయన నన్ను స్వస్థపరచగలరని నేను గ్రహించాను.

రక్షకుని స్వస్థత మరియు విమోచించే శక్తి ప్రమాదవశాత్తు జరిగే తప్పులు, బలహీనమైన నిర్ణయాలు, సవాళ్ళు మరియు ప్రతివిధమైన శ్రమలు----అదేవిధంగా మన పాపములకు అన్వయిస్తుంది. నేను ఆయన వైపు తిరిగినప్పుడు, నా అపరాధం మరియు పశ్చాత్తాపము యొక్క భావనలు క్రమంగా సమాధానము మరియు విశ్రాంతితో భర్తీ చేయబడ్డాయి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “రక్షకుడు సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తము చేసినప్పుడు, ఆయనను అనుసరించే వారు ఆయన యొక్క స్వస్థపరిచే, బలపరిచే మరియు విమోచించే శక్తిని పొందగలిగేలా ఆయన ఒక మార్గాన్ని తెరిచారు. ఆయనను వినాలని మరియు ఆయనను అనుసరించాలని కోరుకునే వారందరికీ ఈ ఆత్మీయ విశేషాధికారాలు అందుబాటులో ఉన్నాయి.”14

సహోదర సహోదరీలారా, మీరు పరిష్కరించబడని పాప భారమును మోస్తున్నప్పటికీ, చాలాకాలం క్రితం మీకు వ్యతిరేకంగా చేయబడిన నేరాన్ని పట్టుకొని బాధపడుతున్నప్పటికీ లేదా అనుకోకుండా జరిగిన ఒక తప్పు కోసం మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి ప్రయాసపడుతున్నప్పటికీ, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచి, విమోచించే శక్తికి మీకు ప్రవేశమున్నది.

ఆయన సజీవుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు మన విమోచకుడైయున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మన కొరకు కనికరము కలిగియున్నారు, ఆయన దయతో నిండియున్నారు మరియు ఆయన మనలను స్వస్థపరచగలరు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.