సర్వసభ్య సమావేశము
అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక

యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము మరియు తరువాతి వారంలో జరిగిన సంఘటనలు నేడు మన జీవితాల్లో మనం అన్వయించగల సిద్ధాంతాన్ని ఉదహరిస్తాయి.

ఇంతకుముందు చెప్పినట్లుగా, నేడు ఈ మట్టల ఆదివారం మనం యేసు క్రీస్తును గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులతో చేరుతున్నాము. సుమారు 2000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు యొక్క మర్త్య పరిచర్య చివరి వారం ప్రారంభాన్ని మట్టల ఆదివారం గుర్తించింది. మానవ చరిత్రలో అది అత్యంత ముఖ్యమైన వారము.

వాగ్దానం చేయబడిన మెస్సీయగా యెరూషలేము లోనికి ఆయన విజయోత్సాహ ప్రవేశంలో యేసును స్వాగతించడంతో ప్రారంభమైనది ఆయన సిలువధారణ మరియు పునరుత్థానముతో ముగిసింది.1 దైవిక రూపకల్పన ద్వారా, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ఆయన మర్త్య పరిచర్యతో ముగిసింది, నిత్యత్వము కొరకు మన పరలోక తండ్రితో జీవించడాన్ని మనకు సాధ్యం చేసింది.

“గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసును”2 చూడడానికి పట్టణ ద్వారాల వద్ద నిలబడిన జనసమూహముతో ఆ వారము ప్రారంభమైనదని లేఖనాలు మనకు చెప్తాయి. వారు “ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.”3

చాలా కాలం నాటి ఆ బైబిలు వృత్తాంతం, ఘానాలోని టకొరాడిలో సంఘ నియామకంపై ఉన్న సమయాన్ని నాకు గుర్తుచేస్తుంది. విశేషంగా, నేను మట్టల ఆదివారం అక్కడున్నాను.

చిత్రం
ఘనాలోని టకోరాడిలో ప్రార్థనా సభ

మింట్సిన్ ఘానా స్టేకును ఏర్పాటు చేయడానికి టకొరాడి ఘానా స్టేకును విభజించడానికి నేనక్కడ ఉన్నాను. నేడు ఘానాలో 1,00,000 మందికి పైగా సంఘ సభ్యులున్నారు.4 (ఈ రోజు మాతో ఉన్న ఘనాలోని అక్రాకు చెందిన గా మాంట్సే, రాజు నియి టాకీ టెయికోత్సురు IIని మేము స్వాగతిస్తున్నాము.) ఈ పరిశుద్ధులను కలుసుకొని, నేను ప్రభువుపట్ల వారి గాఢమైన ప్రేమను, భక్తిని చూసాను. వారి కోసం నా గాఢమైన ప్రేమను నేను వ్యక్తపరిచాను మరియు సంఘ అధ్యక్షుడు వారిని ప్రేమించారని చెప్పాను. యోహాను చేత వ్రాయబడిన రక్షకుని మాటలను నేను సూచించాను: “నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.”5 “సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రేమ”6 అని వారు పరిగణించారు.

చిత్రం
ఘనాలోని టకోరాడిలో కరచాలనం చేస్తున్న ఎల్డర్ రాస్బాండ్

సంఘ భవనంలో ప్రియమైన ఆ సహోదర సహోదరీలు, వారి కుటుంబాలు కూర్చున్న వరుసలను పైనుండి క్రిందికి చూసినప్పుడు, వారి ముఖాలలో యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు సాక్ష్యము యొక్క కాంతిని నేను చూడగలిగాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సంఘములో వారు భాగం కావాలని కోరుతున్నట్లు నేను భావించాను. గాయకబృందం పాడినప్పుడు, వారు దేవదూతల్లా పాడారు.

చిత్రం
ఘనా టకోరాడిలోని గాయక బృందం
చిత్రం
ఘనాలోని సభ్యులతో ఎల్డర్ రాస్బాండ్

ఆనాటి మట్టల ఆదివారం, యెరూషలేము ద్వారాల వద్ద తమ చేతుల్లో ఖర్జూరపుమట్టలు పట్టుకొని … : జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక”7 అని కేకలువేసిన వారివలె ఆయనకు నివాళులర్పించడానికి సమకూడిన యేసు క్రీస్తు యొక్క శిష్యులు వీరు.

చిత్రం
ఘనాలో ఖర్జూరపు మట్టలు ఊపడం

దగ్గరలోని స్థానిక సంఘ సభ్యులు కూడా మట్టల ఆదివారాన్ని గౌరవిస్తున్నారు. నేను వేదిక పైనుండి మాట్లాడుతున్నప్పుడు, కిటికీ బయట వారు ఈ ఫోటోలో ఉన్నవారిలా తమ చేతుల్లో ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఊపుతూ వీధిలో ఆనందంగా నడవడాన్ని నేను గమనించాను. ఆ దృశ్యాన్ని నేనెప్పటికీ మరచిపోలేను, మేమందరం ఆరోజు రాజులకు రాజును ఆరాధిస్తున్నాము.

“యెరూషలేములోనికి యేసు ప్రవేశించినప్పుడు స్వాగతించడానికి ఊపిన ఖజ్జూరపు మట్టలను మాత్రమే జ్ఞాపకముంచుకోవడం కాకుండా, ఆయన చేతుల్లోని గురుతులను కూడా గుర్తుంచుకోవడం ద్వారా మట్టల ఆదివారాన్ని నిజంగా పరిశుద్ధంగా చేయమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని హెచ్చరించారు. తర్వాత, “‘నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను,’ అంటూ ‘నేను నిన్ను మరువను’ అనే రక్షకుని వాగ్దానం గురించి మాట్లాడిన” యెషయాను అధ్యక్షులు నెల్సన్ సూచించారు.8

మర్త్యత్వము కష్టమైనదని ప్రభువుకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయన “వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించారని”9 ఆయన గాయాలు మనకు గుర్తుచేస్తాయి, తద్వారా మనం బాధపడినప్పుడు ఆయన మనకు సహాయపడవచ్చు మరియు “నీ మార్గమున నిలువుము,”10 “దేవుడు నిరంతరము [మనకు] తోడైయుండును”11 అనే ఆయన మార్గములో నిలిచేందుకు మనకు మాదిరిగా ఉండవచ్చు.

మట్టల ఆదివారము కేవలం ఒక సంఘటన కాదు, చరిత్రలో తేదీ, సమయం మరియు స్థలంతో ఉన్న మరొక పేజీ కాదు. యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము మరియు తరువాతి వారంలో జరిగిన సంఘటనలు నేడు మన జీవితాల్లో మనం అన్వయించగల సిద్ధాంతాన్ని ఉదహరిస్తాయి.

యెరూషలేములో ముగిసే ఆయన పరిచర్యతో అల్లుకున్న కొన్ని నిత్య సిద్ధాంతాలను చూద్దాం.

మొదటిది, ప్రవచనము. ఉదాహరణకు, యెరూషలేము లోనికి యేసు క్రీస్తు యొక్క విజయోత్సాహ ప్రవేశము గురించి, ఆయన ఒక గాడిదపై ఎక్కి వస్తారని కూడా పాత నిబంధన ప్రవక్త జెకర్యా ప్రవచించాడు.12 పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆయన సిద్ధపడుతుండగా, యేసు ఇలా అంటూ ఆయన పునరుత్థానము గురించి ముందుగా చెప్పారు:

“ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి,

“ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.”13

రెండవది, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. “పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని తెలుసుకోలేడు,”14 అని జోసెఫ్ స్మిత్ బోధించారు. “మిమ్మును అనాథలనుగా విడువను,”18 అని తన శిష్యులకు15 ప్రభురాత్రి భోజనము వద్ద16 మేడ గదిలో17 రక్షకుడు వాగ్దానమిచ్చారు. సువార్త సత్యాలను ముందుకు తీసుకువెళ్ళడానికి వారు ఒంటరివారు కాదు, వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ బహుమానాన్ని వారు కలిగియుంటారు. “శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు.”19 పరిశుద్ధాత్మ వరముతో మనము అదే అభయాన్ని కలిగియున్నాము; మనం “ఎల్లప్పుడు ఆయన ఆత్మను [మనతో] కలిగియుండెదము”20 మరియు “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా [మనము] అన్నిసంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలము.”21

మూడవది, శిష్యత్వము. నిజమైన శిష్యత్వము అనగా విఫలము కాని నిబద్ధత, నిత్య చట్టాలకు విధేయత, అన్నిటికంటే ముందు దేవుని ప్రేమ. ఏ మాత్రం సందేహింపనిది. ఖజ్జూరపు మట్టలతో నివాళులర్పించిన సమూహము ఆయనను మెస్సీయగా కొనియాడారు. సరిగ్గా ఆయన అదే. వారు ఆయన వైపు, ఆయన అద్భుతాలు మరియు ఆయన బోధనల వైపు ఆకర్షించబడ్డారు. కానీ చాలా మందికి ప్రశంసలు నిలువలేదు. “హోసన్నా”22 అని మొదట అరిచిన వారు, వెంటనే “వానిని సిలువవేయుము”23 అని కేకలువేసారు.

నాల్గవది, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము.24 మట్టల ఆదివారం తర్వాత, ఆయన చివరి రోజులలో, గెత్సేమనేలో వేదన నుండి ఆయన విచారణను ఎగతాళి చేయడం, సిలువపై ఆయన చిత్రహింస మరియు అరువు తెచ్చుకున్న సమాధిలో ఆయన ఖననం వరకు ఆయన విశేషమైన తన ప్రాయశ్చిత్తాన్ని చేపట్టారు. అక్కడితో అది ఆగిపోలేదు. పరలోక తండ్రి యొక్క పిల్లలందరి విమోచకునిగా ఆయన పిలుపు యొక్క ఘనతతో, మూడు రోజుల తర్వాత, ఆయన ప్రవచించినట్లుగా ఆ సమాధి నుండి ఆయన పునరుత్థానుడై25 బయటకు వచ్చారు.

యేసు క్రీస్తు యొక్క సాటిలేని ప్రాయశ్చిత్తం కొరకు మనం నిరంతరం కృతజ్ఞత కలిగియున్నామా? ఇప్పుడు మనం దాని శుద్ధీకరణ శక్తిని అనుభవిస్తున్నామా? అందుకే, మన రక్షణ యొక్క ఆదియు అంతమునైయున్న యేసు క్రీస్తు మనందరినీ రక్షించడానికి యెరూషలేము వెళ్ళారు. ఆల్మాలోని ఈ మాటలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి: “మీరు హృదయము యొక్క మార్పును అనుభవించిన యెడల మరియు విమోచించు ప్రేమ గీతమును పాడవలెనని మీకనిపించిన యెడల, ఇప్పుడు మీరు ఆలాగున భావించగలరా? అని నేను అడుగుచున్నాను.”26 టకొరాడిలో ఆ మట్టల ఆదివారంనాడు గాయకబృందం “విమోచన ప్రేమ గీతాన్ని” ఆలపించిందని నేను నిజంగా చెప్పగలను.

ఆయన మర్త్య పరిచర్య యొక్క విధిలేని ఆ చివరి వారం, యేసు క్రీస్తు పదిమంది కన్యకల ఉపమానమును ఇచ్చారు.27 తమ చేతుల్లో ఖజ్జూరపు మట్టలతో కాదు, కానీ వారిలోనున్న సువార్త వెలుగుతో ఆయనను స్వీకరించడానికి సిద్ధపడిన వారి కోసం ఆయన తిరిగి రావడం గురించి ఆయన బోధిస్తున్నారు. ఆయన మార్గాలను, ఆయన సత్యాలను జీవించడానికి మరియు ఆయన వెలుగును పంచుకోవడానికి సుముఖతను వర్ణించడానికి వెలుగుతున్న దివిటీలు, వాటిని మండించడానికి అదనపు నూనె చిత్రాన్ని ఆయన ఉపయోగించారు.

ఆ కథ మీకు తెలుసు. పదిమంది కన్యకలు సంఘాన్ని సూచిస్తున్నారు, పెండ్లికొడుకు యేసు క్రీస్తును సూచిస్తున్నాడు.

పదిమంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని “పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిరి.”28 ఐదుగురు బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి మరియు ఐదుగురు బుద్ధి లేనివారు తమతోకూడ నూనె తీసికొనిపోలేదు గనుక వారి దివిటీలు ఆరిపోవుచున్నవి. “ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి”29 అను కేక వినబడినప్పుడు, “జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందిన”30 ఐదుగురు “ఆయన మహిమ వారిమీద నుండునట్లు,”32 “వారి రాజు మరియు శాసనకర్త”31 కొరకు సిద్ధంగా ఉండిరి. మిగతా ఐదుగురు నూనె కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వారు లేకుండానే ఊరేగింపు ముందుకు సాగిపోయింది. వారు తలుపుతట్టి, లోనికి రానివ్వమని బ్రతిమిలాడినప్పుడు, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను”33 అని ప్రభువు జవాబిచ్చారు.

ఆయన మనతో, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను!” అని చెప్పినయడల మీరెలా భావిస్తారు?

పదిమంది కన్యకల వలె మనము దివిటీలను కలిగియున్నాము; కానీ మన దగ్గర నూనె ఉందా? లోకపు ఒత్తిళ్ళచేత కొంతమంది సరిగ్గా సిద్ధపడేందుకు తీరికలేకుండా ఉండి, అతితక్కువ ఆధ్యాత్మిక స్థాయిని మాత్రమే కలిగియున్నారని నేను భయపడుతున్నాను. సజీవులైన ప్రవక్తలు, ముఖ్యంగా అధ్యక్షులు నెల్సన్, ఆయన సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల మాటలు మరియు ప్రవచనాలను నమ్మడం, వాటిపై పనిచేయడం నుండి నూనె వస్తుంది. పరిశుద్ధాత్మను మనం విని, అనుభవించి, ఆ దైవిక నడిపింపు మీద పనిచేసినప్పుడు, నూనె మన ఆత్మలను నింపుతుంది. మన ఎంపికలు మనం ప్రభువును ప్రేమిస్తున్నామని మరియు ఆయన ప్రేమించేదానిని మనం ప్రేమిస్తున్నామని చూపినప్పుడు, మన హృదయాలలోనికి నూనె పోయబడుతుంది. పశ్చాత్తాపపడడం, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క స్వస్థతను వెదకడం నుండి నూనె వస్తుంది.

“మరణించే లోపు చేయాలనుకున్న పనుల జాబితా” అని కొందరు పిలిచేదానిని మీరు నింపాలనుకుంటే, అది ఇదే: యేసు క్రీస్తు యొక్క జీవజలము రూపంలో మీ జాబితాను నూనెతో నింపండి,34 అది ఆయన జీవితం మరియు బోధనలకు ప్రతిరూపం. దానికి విరుద్ధంగా, మీ జాబితాలో ఆత్మీయంగా అంత ముఖ్యం కాని ఒకదానిని పూర్తిచేయడం మీ ఆత్మను ఎప్పటికీ సంపూర్ణంగా భావించనివ్వదు లేదా తృప్తిపరచదు; యేసు క్రీస్తు చేత బోధించబడిన సిద్ధాంతాన్ని జీవించడం తృప్తినిస్తుంది. ఇంతకుముందు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను: ప్రవచనాన్ని, ప్రవక్తల బోధనలను హత్తుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణలపై పనిచేయండి, నిజమైన శిష్యులుగా మారండి మరియు మన ప్రభువు ప్రాయశ్చిత్తము యొక్క స్వస్థపరచు శక్తిని వెదకండి. మరణించే లోపు చేయాలనుకున్న ఆ పనుల జాబితా మీరు వెళ్ళాలనుకున్న చోటుకు—మీ పరలోక తండ్రి వద్దకు తీసుకువెళ్తుంది.

టకొరాడిలో ఆ మట్టల ఆదివారం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే నేను దానిని విశ్వాసులైన సహోదర సహోదరీల సమూహంతో పంచుకున్నాను. కాబట్టి ప్రపంచమంతటా ఖండాలలో, ద్వీపాలలో ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మీలాగే నా హృదయం, ఆత్మ కూడా “అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక”35 అని కేకవేయాలని కోరుతోంది.

యెరూషలేము ద్వారాల వద్ద ఈనాడు మనం మన చేతుల్లో ఖజ్జూరపు మట్టలు పట్టుకొని నిలబడకపోయినా, ప్రకటన గ్రంథములో ప్రవచించబడినట్లు, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను [నిలువబడు]”36 సమయము వస్తుంది.

మీరు నీతిగా జీవించడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తారని మరియు దేవుని కుమారుడు, మనందరి గొప్ప విమోచకుడిని స్వాగతించడానికి తమ చేతుల్లో ఖజ్జూరపు మట్టలు పట్టుకొనిన వారి మధ్య ఉంటారని యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను మీకు నా దీవెననిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. మత్తయి 21–28, మార్కు 11–16, లూకా 19-24, మరియు యోహాను 12–21 అనే నాలుగు సువార్తలు—మర్త్యత్వంలో యేసు క్రీస్తు పరిచర్య యొక్క చివరి దినాల గురించి వివరిస్తాయి, అది దేవుని పిల్లలందరికి రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దీవెనలు లభ్యమయ్యేలా చేయడానికి దైవికంగా రూపొందించబడింది. కొన్ని సార్లు వారు చేర్చేదానిని బట్టి రచయితలు మారవచ్చు, కానీ రక్షకుని బోధనలు మరియు చర్యలు కాదు.

  2. మత్తయి 21:10-11 చూడండి.

  3. యోహాను 12:13.

  4. ప్రతి సభ్యత్వము మరియు గణాంక రికార్డుల ప్రకారం, ఘానాలో 1,02,592 మంది సభ్యులున్నారు.

  5. యోహాను 15:12.

  6. నేను సభ్యులతో మాట్లాడిన ప్రతీసారి, వారు నాతో, “మా ప్రియమైన అపొస్తలుడైన ఎల్డర్ రాస్బాండ్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అంటారు. ఈ జనులు ఎంతగా దేవుని ఆత్మ మరియు ప్రేమతో నింపబడ్డారంటే, వారు ఆ ప్రేమను సులువుగా పంచుకుంటారు.

  7. మత్తయి 21:9.

  8. See Russell M. Nelson, “The Peace and Hope of Easter” (video), Apr. 2021, ChurchofJesusChrist.org/media; Isaiah 49:16.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8. 1838 డిసెంబరులో, ప్రవక్తయైన జోసెఫ్ మరియు కొంతమంది సంఘ నాయకులు లిబర్టీ చెరసాలలో అన్యాయంగా ఖైదు చేయబడ్డారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. దయనీయమైన పరిస్థితులలో కొన్ని నెలల తర్వాత, 1839 మార్చిలో ఆయన సభ్యులకు వ్రాసారు, అందులో తన పరిస్థితి పట్ల మరియు “బాధపడుచున్న పరిశుద్ధులపట్ల” కనికరము చూపమని ఆయన ప్రభువుకు చేసిన విన్నపాలతో కూడిన ప్రార్థనలున్నాయి. సిద్ధాంతము మరియు నిబంధనలు 121–23లో నమోదు చేయబడినట్లు, ఆ ప్రార్థనలకు ప్రభువు యొక్క స్పందనను కూడా ఆయన పంచుకున్నారు.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 122:9. లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు యొక్క ప్రోత్సాహము అతనికి ఓదార్పునిచ్చింది మరియు దుర్దశ, శ్రమలు మనల్ని బలపరచగలవు, సహనాన్ని బోధించగలవు మరియు స్వీయ పాండిత్యాన్నివ్వగలవు అనే ఆత్మీయ గ్రహింపునిచ్చింది. “[దేవుని] కుమారుడు వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించినట్లు, అన్యాయాన్ని భరిస్తూ, ప్రభువు మార్గమైన, “నీ మార్గమున నిలువుము,” అని ప్రభువు అతనికి పిలుపునిచ్చారు. అతని కంటే నీవు గొప్పవాడివా?” (సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8).

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 122:9. దేవుడు “నీకు తోడైయుండును” అనే ప్రతిజ్ఞ, తమ విశ్వాసాన్ని మరియు ప్రభువు యందు నమ్మకాన్ని గట్టిగా పట్టుకొనియుండే వారికి ఒక నిశ్చయమైన వాగ్దానము.

  12. జెకర్యా 9:9 చూడండి.

  13. మత్తయి 20:18-19. Jesus the Christ లో జేమ్స్ ఈ. థాల్మేజ్ వ్రాసారు: “పన్నెండుగురు ఆయనను అర్థం చేసుకోవడంలో విఫలమవడం ఆశ్చర్యపరిచే వాస్తవం. … వారికి వారి ప్రియమైన బోధకుని మాటలలో ఏదో భయంకరమైన అసంబద్ధత, భయంకరమైన అస్థిరత లేదా వివరించలేని వైరుధ్యం ఉందనిపించింది. ఆయన క్రీస్తు అని, సజీవుడైన దేవుని కుమారుడని వారికి తెలుసు; అటువంటి వ్యక్తి ఎలా లొంగిపోయి, చంపబడగలరు”([1916], 502–3).

  14. 1855, సెప్టె. 19, Deseret News “History of Joseph Smith,” లో వ్యాఖ్యానించబడినట్లు, 1842, ఏప్రిల్ 28న నావూలోని స్త్రీల ఉపశమన సమాజానికి జోసెఫ్ స్మిత్ ఈ ప్రకటన చేసారు. 1 కొరింథీయులకు పన్నెండవ అధ్యాయాన్ని సూచిస్తూ, మూడవ వచనాన్ని ఆయన స్పష్టం చేసారు, “పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు,” అనే దానిని “పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని తెలుసుకోలేడు,” అని సవరించారు. (The First Fifty Years of Relief Society: Key Documents in Latter-day Saint Women’s History [2016], 2.2, churchhistorianspress.org.) చూడండి

  15. యేసు ప్రభురాత్రి భోజనాన్ని తన శిష్యులతో పంచుకున్నారు (మార్కు14:12–18 చూడండి). పన్నెండుమందిలో పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, మత్తయి, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, యాకోబు, యూదా, యూదా మరియు సీమోను ఉన్నారు.(లూకా 6:13–16.చూడండి)

  16. ప్రభురాత్రి భోజనము వద్ద యేసు తన శిష్యులతో సంస్కారమును నిర్వహించారు. (మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:19-20.చూడండి).

  17. మత్తయి, మార్కు, లూకా మరియు యోహానుల మధ్య కనిపించే వ్యత్యాసాల మూలంగా, “మేడ గది”లో యేసు ప్రభురాత్రి భోజనాన్ని నిర్వహించిన ప్రత్యేక దినము/రాత్రి నిజానికి వివాదాస్పదమైంది. ప్రభురాత్రి భోజనము లేదా పస్కా భోజనము “పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి దినమున” జరగాలని మత్తయి, మార్కు, లూకా సూచించారు (మత్తయి 26:17; మార్కు 14:12; లూకా 22:1, 7 చూడండి). అయినప్పటికీ, యేసు పస్కా భోజనానికి ముందు ఖైదు చేయబడ్డాడని యోహాను సూచిస్తాడు (యోహాను 18:28 చూడండి), దాని అర్థం, ప్రభురాత్రి భోజనము పస్కా భోజనాని కంటే ఒకరోజు ముందే జరిగి ఉంటుంది. యేసు సిలువ వేయబడడానికి ముందురోజు సాయంత్రం మేడ గదిలో తన శిష్యులతో కలిసి ఆయన ప్రభురాత్రి భోజనం చేసారని సంఘ పాఠ్యాంశ వస్తువులు మరియు కడవరి-దిన పరిశుద్ధుల స్కాలర్షిప్ సమ్మతిస్తున్నట్లు కనిపిస్తోంది. పరిశుద్ధ వారాన్ని జరుపుకున్న క్రైస్తవులు గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారం—గురువారాన్ని ప్రభురాత్రి భోజనం యొక్క దినముగా, శుక్రవారాన్ని సిలువ వేయబడిన దినముగా, ఆదివారాన్ని పునరుత్థాన దినముగా గుర్తిస్తారు.

  18. యోహాను 14:18.

  19. యోహాను 14:27.

  20. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77

  21. మొరోనై 10:5.

  22. హోసన్నా అంటే అర్థం “రక్షించు” అని బైబిలు నిఘంటువు వివరిస్తుంది. ఆ పదము కీర్తనలు 118:25 నుండి తీసుకోబడింది. “ఈ కీర్తనను జపించడం గుడారాల విందులో ఖజ్జూరపు మట్టలను ఊపడానికి సంబంధించింది; అందువలన ఆ పదము యెరూషలేము లోనికి మన ప్రభువు విజయోత్సాహముతో ప్రవేశించినప్పుడు సమూహము చేత ఉపయోగించబడింది” (Bible Dictionary, “Hosanna”). మత్తయి 21:9, 15; మార్కు 11:9–10, యోహాను 12:13 చూడండి.

  23. మార్కు 15:14; లూకా 23:21.

  24. మన పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికలో అతిముఖ్యమైన భాగము అనంతమైన ప్రాయశ్చిత్తము, అది ఆయన పిల్లలందరికి అమర్త్యత్వాన్ని మరియు ఆ దీవెనను పొందడానికి అర్హులైన వారికి ఉన్నతస్థితిని నిశ్చయపరుస్తుంది. “నేను ఎవరిని పంపుదును?“ అని ఆయన తండ్రి అడిగినపుడు “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” (అబ్రాహాము 3:27) అని యేసు క్రీస్తు ముందుకు వచ్చారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ప్రాయశ్చిత్తము [యేసు క్రీస్తు యొక్క] నియమితకార్యము. ఆ నియమితకార్యము ప్రత్యేకంగా ఆయన కొరకైనది. మర్త్య తల్లికి, అమర్త్య తండ్రికి జన్మించిన ఆయన మాత్రమే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని బలియిచ్చి, మరలా దానిని తీసుకోగలరు (యోహాను 10:14–18 చూడండి). ఆయన ప్రాయశ్చిత్తము యొక్క మహిమకరమైన పర్యవసానాలు అనంతమైనవి మరియు నిత్యమైనవి. ఆయన మరణము నుండి ముల్లును తీసివేసి, సమాధి యొక్క దుఃఖాన్ని తాత్కాలికం చేసారు (1 కొరింథీయులకు 15:54–55 చూడండి). ప్రాయశ్చిత్తము కొరకు ఆయన బాధ్యత సృష్టి మరియు పతనమునకు ముందే తెలుపబడింది. అది పునరుత్థానమును మరియు మానవాళియంతటికి అమర్త్యత్వమును అందించడానికి మాత్రమే కాకుండా, ఆయనచేత ఏర్పాటు చేయబడిన షరతులపై—మన పాపాలకు మనం క్షమించబడేందుకు అనుమతిస్తుంది. మనం ఆయనతో మరియు మన కుటుంబాలతో శాశ్వతంగా ఏకమవ్వగలిగేలా ఆయన ప్రాయశ్చిత్తము మార్గాన్ని తెరిచింది” (“The Mission and Ministry of Jesus Christ,” Liahona, Apr. 2013, 20).

  25. పునరుత్థానములో శరీరము మరియు ఆత్మ ఒక అమర్త్యమైన స్థితిలో తిరిగి ఏకమవుతాయి, శరీరము మరియు ఆత్మ ఇకపై వేరుచేయబడకుండా ఉంటాయి మరియు ఇకపై మరణం లేదా మర్త్యత్వపు అనారోగ్యాలకు కట్టుబడి ఉండవు. (ఆల్మా 11:45; 40:23 చూడండి).

  26. ఆల్మా 5:26; ఆల్మా 5:14 కూడా చూడండి.

  27. పదిమంది కన్యకల ఉపమానము మత్తయి 25:1–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:56–59 లో కనుగొనబడుతుంది. మత్తయి 21 లో యెరూషలేములో ప్రవేశించిన తర్వాత మరియు మత్తయి 26 లో ప్రభురాత్రి భోజనానికి మరియు ఆయన ఖైదు చేయబడడానికి కొంచెం ముందు, ఆయన చివరి వారంలో యేసు ఈ ఉపమానాన్ని బోధించారని మత్తయి 25 చుట్టూ ఉన్న అధ్యాయాలు సూచిస్తాయి. చివరి వారంలో ఇవ్వబడిన పదిమంది కన్యకల ఉపమానానికి అదనంగా, యేసు అంజూరపు చెట్టు యొక్క ఉపమానము (మత్తయి 21:17–21; 24:32–33 చూడండి), ఇద్దరు కుమారుల ఉపమానం (మత్తయి 21:28–32 చూడండి), దుర్మార్గుడైన యజమాని ఉపమానములనిచ్చారు (మత్తయి 21:33–46 చూడండి).

  28. మత్తయి 25:1.

  29. మత్తయి 25:6.

  30. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:57.

  31. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:59.

  32. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:59.

  33. మత్తయి 25:12. “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” (మత్తయి 7:22–23 చూడండి) అని పదిమంది బుద్ధిలేని కన్యకల వృత్తాంతములో సూచించబడినట్లు, “అనేకమైన అద్భుతములు” చేసామని ఊహించుకొనే వారిని కొండమీది ప్రసంగంలో ప్రభువు సూచిస్తున్నారు.

  34. మర్త్యజీవితానికి నీరు కీలకమైనట్లు, నిత్యజీవితానికి యేసు క్రీస్తు మరియు ఆయన బోధనలు (జీవ జలము) కీలకమైనవి (Guide to the Scriptures, “Living Water,” ChurchofJesusChrist.org చూడండి యెషయా 12:3; యిర్మియా 2:13; యోహాను 4:6–15; 7:37; 1 నీఫై 11:25; సిద్ధాంతము మరియు నిబంధనలు 10:66; 63:23 కూడా చూడండి).

  35. 3 నీఫై 4:32.

  36. ప్రకటన 7:9.