సర్వసభ్య సమావేశము
నేను నిజంగా క్షమించబడ్డానా?
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నేను నిజంగా క్షమించబడ్డానా?

యేసు క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా---ప్రతీఒక్కరికి పూర్తి, పరిపూర్ణమైన క్షమాపణ యొక్క అదే వాగ్దానము చేయబడింది.

కొన్ని సంవత్సరాల క్రితం, సహోదరి నాట్రస్ మరియు నేను ఐడహోకు మారాము, అక్కడ మేము ఒక క్రొత్త వ్యాపారము ప్రారంభించాము. ఆఫీసు వద్ద మేము చాలా సమయాన్ని గడిపాము. కృతజ్ఞతాపూర్వకంగా, మేము ఆఫీసుకు చాలా దగ్గరగా నివసించాము. ప్రతీవారము, షౌనా మరియు ఆరు సంవత్సరాలలోపు ఉన్న---మా ముగ్గురు కుమార్తెలు---ఆఫీసుకు వచ్చి కలిసి భోజనం చేసే వారు.

అలాంటి ఒకరోజున మా కుటుంబ మధ్యాహ్న భోజనం తరువాత, మా ఐదు సంవత్సరాల కుమార్తె, మిషెల్, నాకు ఒక వ్యక్తిగత సందేశాన్ని వదిలి వెళ్ళింది, వ్రాయబడిన కాగితం నా ఆఫీసు టెలిఫోనుకు జతపరచబడడం నేను గమనించాను.

అందులో, “నాన్నా, నన్ను ప్రేమించడం గుర్తుంచుకో. ప్రేమతో, మిషెల్” అని ఉంది. మిక్కిలి ప్రాముఖ్యమైన వాటి గురించి ఒక యౌవన తండ్రికి అది శక్తివంతమైన జ్ఞాపకార్థము.

సహోదర సహోదరీలారా, మన పరలోక తండ్రి ఎల్లప్పుడు మనల్ని జ్ఞాపకముంచుకుంటారని మరియు ఆయన మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది నా ప్రశ్న: మనము ఆయనను జ్ఞాపకముంచుకుంటున్నామా? మనము ఆయనను ప్రేమిస్తున్నామా?

చాలా సంవత్సరాల క్రితం, నేను ఒక స్థానిక సంఘ నాయకునిగా సేవ చేసాను. మా యువకులలో ఒకరైన డానీ, అన్నివిధాలా శ్రేష్ఠమైన వాడు. అతడు విధేయుడు, దయగలవాడు, మంచివాడు మరియు గొప్ప హృదయాన్ని కలిగియున్నాడు. అయినప్పటికీ, అతడు ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రతను పొందిన తరువాత, అతడు చెడు ప్రవర్తన గల సమూహముతో సహవాసం చేయడం ప్రారంభించాడు. అతడు మత్తుమందులు తీసుకోసాగాడు, ప్రత్యేకంగా మిథాఫెటామిన్ మరియు వ్యసనము, నాశనము వైపు ప్రయాణించాడు. త్వరలో, అతడి రూపము పూర్తిగా మారిపోయింది. అతడు గుర్తించలేనంతగా మారిపోయాడు. అతి ముఖ్యమైన మార్పు అతడి కళ్ళలో ఉంది---అతడు సంతోషంగా లేడు, అది అతడి కళ్ళలో కనిపిస్తుంది. అతడిని సమీపించడానికి నేను కొన్నిసార్లు ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేదు. అతడికి ఇష్టము లేదు.

ఈ అసాధారణమైన యువకుడు బాధపడడం మరియు ఇంతకుముందు కంటే పూర్తిగా భిన్నమైన జీవితాన్ని జీవించడం చూసేందుకు కష్టంగా ఉంది. అతడు ఎంతో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగియున్నాడు.

తరువాత ఒకరోజు, అతడి అద్భుతం ప్రారంభమైంది.

అతడి తమ్ముడు సువార్తసేవకు వెళ్ళకముందు తన సాక్ష్యమును పంచుకొన్న సంస్కార సమావేశానికి అతడు హాజరయ్యాడు. సమావేశమందు, డానీ చాలా కాలంగా అనుభవించని దానిని అనుభూతిచెందాడు. అతడు ప్రభువు యొక్క ప్రేమను అనుభూతిచెందాడు. చివరికి అతడికి నిరీక్షణ కలిగింది.

మార్పు చెందాలని అతడికి కోరిక ఉన్నప్పటికీ, అది డానీకి కష్టమైంది. అతడి వ్యసనాలు మరియు వాటితో వచ్చిన అపరాధభావన దాదాపు అతడు భరించే దానికంటే ఎక్కువైనవి.

ఒక ప్రత్యేక మధ్యాహ్నము, నేను మా పచ్చికను కత్తిరిస్తున్నప్పుడు, డానీ చెప్పకుండా వచ్చి కారు ఆపాడు. అతడు వ్యసనాలు మరియు ప్రవర్తనలు మార్చుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. నేను యంత్రాన్ని ఆపేసాను మరియు మేము మెట్లపైన నీడలో కలిసి కూర్చున్నాము. అప్పుడు అతడు తన హృదయంలోని భావాలను పంచుకున్నాడు. అతడు తిరిగి సువార్తను జీవించాలని నిజంగా కోరుకున్నాడు. అయినప్పటికీ, తన వ్యసనాలు మరియు జీవనశైలి నుండి మారడం చాలా కష్టమైంది. దీనితో పాటు, అతడు ఎక్కువగా అపరాధభావనను అనుభవించాడు, సువార్త బోధనలకు వ్యతిరేకంగా పతనమైనందుకు చాలా సిగ్గుపడ్డాడు. “నేను నిజంగా క్షమించబడతానా? తిరిగి రావడానికి నిజంగా ఒక మార్గమున్నదా?” అని అతడు అడిగాడు.

ఈ సందేహాలతో అతడు తన హృదయాన్ని క్రుమ్మరించిన తరువాత, మేము ఆల్మా 36వ అధ్యాయము కలిసి చదివాము.

“నా పాపములు మరియు దోషములన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకొంటిని. …

“ … నా దేవుని సన్నిధిలోనికి రావలెనన్న తలంపే నా ఆత్మను చెప్పలేని భీతితో బాధించెను” (13–14 వచనములు).

ఆ వచనాల తరువాత డానీ ఇలా అన్నాడు “నేను ఖచ్చితంగా ఆవిధంగా భావిస్తున్నాను!”

మేము కొనసాగించాము:

”నేను ఆ విధముగా వేదనతో బాధింపబడుచూ, నా అనేక పాపముల యొక్క జ్ఞాపకము చేత వేదనపడుచుండగా, లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రాకడను గూర్చి జనులకు నా తండ్రి ప్రవచించుట వినియుంటినని నేను జ్ఞాపకము చేసుకొంటిని.

“ఓహో! నేను ఎంత ఆనందమును అనుభవించితిని, ఎంత ఆశ్చర్యకరమైన వెలుగును చూచితిని” (వచనాలు, 17, 20).

ఆ వాక్యభాగాలను మేము చదివినప్పుడు, కన్నీళ్ళు ప్రవహించసాగాయి. ఆల్మా యొక్క ఆనందమే అతడు వెదకుతున్న ఆనందము!

ఆల్మా అసాధారణంగా చెడ్డవాడిగా ఉన్నాడని మేము చర్చించాము. అయిప్పటికీ, ఒకసారి అతడు పశ్చాత్తాపపడిన తరువాత, అతడు ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. అతడు యేసు క్రీస్తు యొక్క సమర్పించబడిన శిష్యుడిగా మారాడు. అతడు ఒక ప్రవక్తగా మారాడు! డానీ కళ్ళు పెద్దవయ్యాయి. “ఒక ప్రవక్త?” అని అతడు అన్నాడు.

“అవును, ఒక ప్రవక్త అని నేను జవాబిచ్చాను. నిన్ను తొందర పెట్టడంలేదు!”

అతడి పాపములు ఆల్మా యొక్క పాపముల వలే తీవ్రమైనవి కానప్పటికీ, యేసు క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా---ప్రతీఒక్కరికి పూర్తి, పరిపూర్ణమైన క్షమాపణ యొక్క అదే వాగ్దానము చేయబడింది.

డానీ ఇప్పుడు గ్రహించాడు. తాను చేయాల్సినది అతనికి తెలిసింది: ప్రభువును నమ్మి, తననుతాను క్షమించుకొనుట ద్వారా అతడు తన ప్రయాణం ప్రారంభించాలి.

డానీ హృదయము యొక్క బలమైన మార్పు దేవుడు మాత్రమే చేయగల అద్భుతము. కాలక్రమేణా, అతడి ముఖము మారింది మరియు అతడి కళ్ళలో కాంతి తిరిగి వచ్చింది. అతడు దేవాలయానికి యోగ్యతను పొందాడు! అతడు తిరిగి వచ్చాడు!

కొన్ని నెలల తరువాత, పూర్తి-కాల సువార్త సేవ చేయడానికి ఒక దరఖాస్తునివ్వడానికి అతడికి ఇష్టమా అని నేను డానీని అడిగాను. అతడి స్పందన విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది.

“సువార్త సేవ చేయడం నాకిష్టము, కానీ నేను ఎక్కడికి వెళ్ళానో, ఏ పనులు చేసానో మీకు తెలుసు! నేను అనర్హుడనని అనుకుంటున్నాను.”

“నువ్వు చెప్పేది సరి కావచ్చు. అయినా, ఒక అభ్యర్థన చేయడం నుండి ఏదీ మనల్ని నిరోధించదు. నువ్వు మినహాయించబడినట్లయితే, కనీసం నువ్వు ప్రభువును సేవించడానికి మనఃపూర్వకమైన కోరికను వ్యక్తపరిచావని నీకు తెలుస్తుంది,” అని నేను జవాబిచ్చాను. అతని కళ్ళు మెరిశాయి. అతడు ఈ ఆలోచనతో పులకరించాడు. అతడికి ఇది జరుగకపోవచ్చు కానీ ప్రయత్నించడం విలువైనది, అతడు తీసుకోవడానికి ఇష్టపడిన అవకాశం ఇది.

కొన్ని వారాల తర్వాత, అతడి ఆశ్చర్యానికి, మరొక అద్భుతం సంభవించింది. డానీ పూర్తి-కాల సువార్త సేవ చేయడానికి పిలుపును పొందాడు.

డానీ మిషను ప్రాంతంలో చేరిన కొన్ని నెలల తరువాత, నాకు ఒక ఫోను వచ్చింది. అతడి మిషను అధ్యక్షుడు కేవలం ఇలా అన్నాడు, “ఈ యువకుడికి ఏమైంది?” అతడు నేను ఎప్పుడూ చూడని మిక్కిలి అపురూపమైన సువార్తికుడు!” చూసారా, ఈ అధ్యక్షుడు ఆధునిక-దిన చిన్నవాడగు ఆల్మాను పొందాడు.

రెండు సంవత్సరాల తరువాత డానీ తన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రభువుకు సేవ చేసి గౌరవంతో ఇంటికి తిరిగి వచ్చాడు.

సంస్కార సమావేశంలో తన పరిచర్య నివేదిక ఇచ్చిన తరువాత, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మా ఇంటి ముందు తలుపు శబ్దం నేను విన్నాను. అక్కడ డానీ తన కళ్ళలో కన్నీళ్ళు నిండి నిలబడ్డాడు. “మనము ఒక నిముషం మాట్లాడుకుందామా?” అని అడిగాడు. మేము బయట అదే మెట్టు వద్దకు వెళ్ళి కూర్చున్నాము.

అతడు అడిగాడు, “అధ్యక్షా, నేను నిజంగా క్షమించబడ్డానని మీరనుకుంటున్నారా?”

ఇప్పుడు అతడితోపాటు నా కళ్ళు చెమర్చాయి. నా యెదుట రక్షకుని గురించి బోధించి, సాక్ష్యమివ్వడానికి తన సమస్తమును ఇచ్చిన యేసు క్రీస్తు యొక్క సమర్పించబడిన శిష్యుడు నిలబడియున్నాడు. అతడు రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క స్వస్థపరచి, బలపరిచే శక్తి యొక్క స్వరూపము.

నేను ఇలా అడిగాను, “డానీ! నువ్వు అద్దములో చూసుకున్నావా? నీ కళ్ళను నువ్వు చూసావా? అవి వెలుగుతో నింపబడ్డాయి, నువ్వు ప్రభువు యొక్క ఆత్మతో ప్రకాశిస్తున్నావు. అవును, నువ్వు నిజంగా క్షమించబడ్డావు! నువ్వు అద్భుతమైన వాడవు! ఇప్పుడు నీ జీవితంతో నువ్వు ముందుకు సాగాల్సిన అవసరముంది. వెనుకకు చూడకు! తరువాతి విధి కోసం విశ్వాసముతో ముందుకు చూడు!

డానీ యొక్క అద్భుతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అతడు దేవాలయంలో వివాహం చేసుకున్నాడు మరియు పాఠశాలకు తిరిగి వెళ్ళాడు, అక్కడ అతడు ఉన్నతస్థాయి పట్టభద్రతను పొందాడు. అతడు తన పిలుపులలో గౌరవము మరియు మర్యాదతో ప్రభువుకు సేవ చేయడాన్ని కొనసాగిస్తున్నాడు. మరీ ముఖ్యంగా, అతడు అపురూపమైన భర్తగా, విశ్వసనీయుడైన తండ్రిగా మారాడు. అతడు యేసు క్రీస్తు యొక్క సమర్పించబడిన శిష్యుడు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “[రక్షకుని యొక్క] అనంతమైన ప్రాయశ్చిత్తము లేకుంటే, సమస్త మానవాళి కోలుకోలేని విధంగా నష్టపోయి ఉండేవారు.”1 డానీ తప్పిపోలేదు మరియు మనము కూడా ప్రభువు దృష్టిలో తప్పిపోలేదు. ఆయన మనల్ని పైకెత్తడానికి, మనల్ని బలపరచడానికి మరియు మనల్ని క్షమించడానికి తలుపు వద్ద నిలబడియున్నారు. ఆయన మనల్ని ప్రేమించడాన్ని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటారు!

దేవుని పిల్లల పట్ల రక్షకుని ప్రేమ యొక్క అపురూపమైన నిదర్శన మోర్మన్ గ్రంథములో వ్రాయబడింది: “యేసు ఆవిధంగా పలికినప్పుడు, ఆయన సమూహమువైపు చూచెను మరియు వారు కన్నీళ్ళతో ఉండి మరికొంతసేపు వారితో నిలిచియుండమని ఆయనను అడుగుచున్నట్లు ఆయనవైపు తదేకముగా చూచుటను కనుగొనెను” (3 నీఫై 17:5).

రక్షకుడు ఇంతకుముందే జనులకు పరిచర్య చేస్తూ పూర్తిగా ఒకరోజు గడిపారు. ఆయన ఇంకా ఎక్కువగా చేయాల్సినది ఉన్నది---ఆయన వేరొక గొఱ్ఱెలను సందర్శించాలి; ఆయన తన తండ్రి వద్దకు వెళ్ళాలి.

ఈ బాధ్యతలను లక్ష్యపెట్టకుండా, జనులు తనను మరికొంతసేపు వారితో నిలిచియుండమని కోరుతున్నారని ఆయన గ్రహించారు. అప్పుడు, రక్షకుని యొక్క కనికరము నిండిన హృదయముతో, లోక చరిత్రలోని మిక్కిలి గొప్ప అద్భుతాలలో ఒకటి జరిగింది:

ఆయన నిలిచియున్నారు.

ఆయన వారిని ఆశీర్వాదించారు.

ఆయన వారి చిన్న పిల్లలను ఒకరి తరువాత ఒకరిని తీసుకొని పరిచర్య చేసారు.

ఆయన వారి కొరకు ప్రార్థించారు; ఆయన వారితో దుఃఖించారు.

మరియు ఆయన వారిని స్వస్థపరిచారు. (3 నీఫై 17 చూడండి.)

ఆయన వాగ్దానము నిత్యమైనది: ఆయన మనల్ని స్వస్థపరుస్తారు.

నిబంధన బాట నుండి తొలగిపోయిన వారికి, ఎల్లప్పుడు నిరీక్షణ ఉన్నదని, స్వస్థత ఎల్లప్పుడు ఉన్నదని మరియు తిరిగి రావడానికి దారి ఎల్లప్పుడు ఉన్నదని దయచేసి తెలుసుకోండి.

నిరీక్షణ యొక్క ఆయన నిత్య సందేశము సమస్యాత్మక ప్రపంచములో జీవిస్తున్న వారందరికి కొరకు స్వస్థపరిచే ఔషధము. “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని యేసు చెప్పారు (యోహాను 14:6).

సహోదర సహోదరీలారా, ఆయనను వెదకడాన్ని, ఆయనను ప్రేమించడాన్ని మరియు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవడాన్ని మనము గుర్తుంచుకుందాం.

దేవుడు సజీవుడని మరియు మనల్ని ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకను యేసు క్రీస్తు లోక రక్షకుడని, విమోచకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన గొప్ప వైద్యుడు. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Prepare for Blessings of the Temple,” Ensign, Mar. 2002, 21.