సర్వసభ్య సమావేశము
నాలుగవ దినము తర్వాత
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నాలుగవ దినము తర్వాత

మనము యేసు క్రీస్తునందు విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు, నాలుగవ రోజు ఎల్లప్పుడూ వస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి వస్తారు.

ఈ ఉదయం మనకు గుర్తు చేయబడినట్లుగా, ఈ రోజు మట్టల ఆదివారం, యెరూషలేములోనికి రక్షకుని విజయోత్సాహ ప్రవేశాన్ని మరియు ఆయన బాధలు, సిలువ శ్రమ, పునరుత్థానంతో కూడిన ఆయన గొప్ప ప్రాయశ్చిత్తానికి ముందు ప్రారంభమయ్యే ఆ పరిశుద్ధ వారాన్ని సూచిస్తుంది.

ప్రవచించబడినట్లుగా నగరంలోకి ఆయన ప్రవేశించడానికి కొద్దికాలం ముందు, ఆయన ప్రియ స్నేహితులైన మరియ, మార్తల నుండి వారి సోదరుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడనే సమాచారం వినినప్పుడు యేసు క్రీస్తు తన పరిచర్యలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.1

లాజరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ప్రభువు “తాను ఉన్న స్థలంలోనే రెండు రోజులు ఉండిపోయారు. అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పారు.”2 బేతనియలోని తన స్నేహితుల ఇంటికి ప్రయాణం ప్రారంభించడానికి ముందే, “యేసు [ఆయన శిష్యులతో] లాజరు చనిపోయాడని స్పష్టంగా చెప్పారు.”3

యేసు బేతనియలోకి వచ్చి, మొదట మార్తను, తరువాత మరియను కలుసుకున్నప్పుడు—బహుశా ఆయన ఆలస్యంగా వచ్చినందుకు నిరాశతో—వారిరువురూ, “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును” అని ఆయనతో అన్నారు.”4 “అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని” మార్త ఇంకా ఆశ్చర్యంగా చెప్పింది.5

ఈ నాలుగు దినములు మరియ, మార్తలకు ముఖ్యమైనవి. కొంతమంది యూదా మత పెద్దల ఆలోచనల ప్రకారం, జీవించుట ఇంకా సాధ్యమవుతుందనే నిరీక్షణనిస్తూ, మరణించిన వారి ఆత్మలు మూడు రోజుల పాటు శరీరంతో ఉంటాయని నమ్మబడింది. అయినప్పటికీ, నాలుగవ రోజు నాటికి ఆ ఆశ పోతుంది, బహుశా శరీరం కుళ్ళిపోవడం మరియు “దుర్వాసన” రావడం వల్ల కావచ్చు.6

మరియ, మార్తలు నైరాశ్యంలో ఉన్నారు. “యేసు [మరియ] ఏడ్చుటను చూసి … ఆయన ఆత్మలో మూలుగుచు కలత చెంది,

“అతనినెక్కడ నుంచితిరని అడుగగా? వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.”7

ఈ తరుణంలో మనము, రక్షకుడు మర్త్య పరిచర్యలో చేసిన గొప్ప అద్భుతాలలో ఒకదాన్ని చూస్తాము. మొదట ప్రభువు, “మీరు రాయిని తీసివేయుడి” అని చెప్పారు.8 తరువాత ఆయన తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపి, “లాజరూ, బయటికి రమ్మని” బిగ్గరగా చెప్పగా,

“చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు – మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.”9

మరియ, మార్తల వలె, మనకు అన్ని మరణాలు, దుఃఖం 10మరియు బలహీనతలను11 కూడా అనుభవించే అవకాశం ఉంది. మనలో ప్రతీఒక్కరూ మనం ప్రేమించే వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగే హృదయ వేదనను అనుభవిస్తారు. మన మర్త్య ప్రయాణంలో వ్యక్తిగత అనారోగ్యం లేదా ప్రియమైన వ్యక్తి యొక్క బలహీనపరిచే అనారోగ్యం ఉండవచ్చు; నిరాశ, ఆందోళన లేదా ఇతర మానసిక ఆరోగ్య సవాళ్ళు; ఆర్థిక కష్టాలు; ద్రోహం; పాపం ఉండవచ్చు. మరియు కొన్నిసార్లు ఇవి నిస్సహాయ భావాలతో కూడి ఉంటాయి. నేనేమీ భిన్నంగా లేను. మీలాగే, నేను ఈ జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాను. రక్షకుని గురించి మరియు ఆయనతో మన సంబంధాన్ని గురించి అది నాకు ఏమి బోధిస్తుంది అనే దాని నిమిత్తము నేను ఈ వృత్తాంతానికి ఆకర్షితుడనయ్యాను.

మన అత్యంత విచారకర సమయాల్లో మరియ, మార్తల వలె మనం కూడా రక్షకుడిని వెదుకుతాము లేదా ఆయన దైవిక జోక్యం కోసం తండ్రిని అడుగుతాము. లాజరు కథ మన వ్యక్తిగత సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు మన స్వంత జీవితాలకు అన్వయించగల సూత్రాలను బోధిస్తుంది.

రక్షకుడు బేతనియకు వచ్చినప్పుడు, లాజరు రక్షింపబడగలడనే నిరీక్షణను అందరూ కోల్పోయారు—నాలుగు రోజులైంది మరియు అతను వెళ్ళిపోయాడు అనుకున్నారు. కొన్నిసార్లు మన స్వంత సవాళ్ళ సమయంలో, క్రీస్తు చాలా ఆలస్యం అయినట్లు మనకు అనిపించవచ్చు మరియు మన ఆశ, విశ్వాసం సవాలు చేయబడినట్లు అనిపించవచ్చు. నా సాక్ష్యం ఏమిటంటే, మనం యేసు క్రీస్తునందు విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు, నాలుగవ రోజు ఎల్లప్పుడూ వస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి వస్తారు లేదా మన ఆశలకు తిరిగి జీవం పోయడానికి వస్తారు. ఆయన ఇలా వాగ్దానమిచ్చారు:

“మీ హృదయమును కలవరపడనియ్యకుడి.”12

“మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.”13

కొన్నిసార్లు అన్ని ఆశలు కోల్పోబడిన తరువాత, నాలుగవ రోజు వరకు ఆయన మన వద్దకు రాలేడని అనిపించవచ్చు. అయితే ఇంత ఆలస్యం ఎందుకు? అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా బోధించారు, “ఆనందించడానికి మనకు ఎన్నో ఇచ్చే మన పరలోక తండ్రికి మనం నేర్చుకుంటామని, ఎదుగుతామని మరియు మనం తప్పక ఎదుర్కోవలసిన పరీక్షలను ఎదుర్కొని, తట్టుకుని నిలబడినప్పుడు బలంగా అవుతామని కూడా తెలుసు.”14

ప్రవక్త జోసెఫ్ స్మిత్ కూడా అపారమైన నాలుగవ రోజు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అతని విన్నపం గుర్తుందా? “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడనున్నది?”15 మనము ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు, ఇలాంటి సమాధానాన్ని ఆశించవచ్చు: “నా కుమారుడా [లేదా కుమార్తె], నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును. 16

లాజరు కథ నుండి మనం నేర్చుకోగల మరొక సందేశం ఏమిటంటే, మనం కోరుకునే దైవిక జోక్యంలో మన స్వంత పాత్ర ఏమిటి అనేది. యేసు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, మొదట అక్కడున్న వారితో, “ఆ రాయిని తీసివేయుడి” అన్నారు.17 రక్షకునికి ఉన్న శక్తితో, ఆయన శ్రమ లేకుండా రాయిని అద్భుతంగా తరలించలేరా? అది చూడడానికి ఆకట్టుకునేలా మరియు మరపురాని అనుభవంగా ఉండేది, అయినప్పటికీ ఆయన ఇతరులతో, “మీరు రాయిని తీసివేయుడి” అని చెప్పారు.

రెండవది, అప్పుడు ఆయన “లాజరూ, బయటికి రమ్మని” బిగ్గరగా చెప్పారు. 18 రాయిని తొలగించిన వెంటనే సమూహానికి కనిపించేలా ప్రభువు స్వయంగా లాజరును సమాధి ద్వారము‌లో అద్భుతంగా ఉంచి ఉంటే అది మరింత ఆకట్టుకునేది కాదా?

మూడవది, “లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడియుండి, అతని ముఖమునకు రుమాలు కట్టబడియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.”19 లాజరు, అప్పటికే శుభ్రంగావుండి ప్రేత వస్త్రములను చక్కగా మడుచుకుని ద్వారము వద్దకు చేరుకుని నిలబడియుండేలా చేయుటకు ప్రభువు సమర్థుడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఈ అంశాలను ప్రధానాంశంగా చేయడంలో అర్థం ఏమిటి? ఈ మూడు విషయాలలో ప్రతిది ఒకదానిని ఉమ్మడిగా కలిగియుంది—దేనికీ క్రీస్తు యొక్క దైవిక శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. తన శిష్యులు చేయగలిగిన దానిని చేయమని ఆయన వారికి సూచించారు. శిష్యులు ఖచ్చితంగా రాయిని కదిలించగలరు; లాజరు లేపబడిన తరువాత, గుహ ద్వారము వద్ద నిలబడి తననుతాను ప్రదర్శించుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు; మరియు లాజరు‌ను ప్రేమించు వారు ప్రేత వస్త్రములను తొలగించడంలో అతనికి సహాయం చేయగలరు.

అయితే, లాజరును మృతులలోనుండి లేపగల శక్తి మరియు అధికారం క్రీస్తుకు మాత్రమే ఉంది. మనము చేయగలిగినదంతా చేయాలని రక్షకుడు ఆశిస్తున్నారని, మరియు ఆయన మాత్రమే చేయగలిగినది ఆయన చేస్తారని నా అభిప్రాయం.20

“[ప్రభువైన యేసు క్రీస్తునందు] విశ్వాసం అనేది చర్య యొక్క సూత్రం” అని మనకు తెలుసు21 మరియు “అద్భుతాలు విశ్వాసాన్ని ఉత్పత్తి చేయవు, కానీ యేసు క్రీస్తు సువార్తకు విధేయత చూపడం ద్వారా బలమైన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. మరో మాటలో చెప్పాలంటే, విశ్వాసం నీతి ద్వారా వస్తుంది.”22 మన జీవితాల్లో పవిత్రమైన నిబంధనలను చేయడం, పాటించడం మరియు క్రీస్తు సిద్ధాంతాన్ని అన్వయించడం ద్వారా మనం ధర్మబద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన విశ్వాసం మనలను నాలుగవ రోజు వరకు తీసుకువెళ్ళడానికి మాత్రమే కాకుండా, ప్రభువు సహాయంతో మన మార్గంలో ఉన్న రాళ్ళను కదిలించడానికి, నిరాశ నుండి బయటపడడానికి మరియు మనల్ని బంధించే అన్నిటి నుండి విడుదల పొందడానికి కూడా సరిపోతుంది. మనము “మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయాలని”23 ప్రభువు ఆశించినప్పటికీ, మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఈ విషయాలన్నింటిలో అవసరమైన సహాయం అందిస్తారని గుర్తుంచుకోండి.

మనం రాళ్ళను తరలించి ఆయన బండపై ఎలా కట్టగలము?24 మనము ప్రవక్తల సలహాకు కట్టుబడి ఉండగలం.

ఉదాహరణకు, గత అక్టోబరు‌లో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి మన స్వంత సాక్ష్యాలకు బాధ్యత వహించమని, వాటి కోసం పని చేయమని, వాటిని పోషించమని, వాటికి సత్యాన్ని ఆహారంగా అందించమని మరియు అవిశ్వాసుల తప్పుడు తత్వాలతో వాటిని కలుషితం చేయకుండా ఉండమని మనల్ని వేడుకున్నారు. ఆయన మనలో ప్రతీఒక్కరికి ఇలా వాగ్దానం చేసారు, “యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యమును నిరంతరం బలపరచడాన్ని మీ అత్యున్నత ప్రాధాన్యతగా మీరు చేసినప్పుడు, మీ జీవితంలో జరిగే అద్భుతాల కొరకు గమనించండి.”25

మనము దీనిని చేయగలము!

మనం ఉపమానముగా ఎలా ఉద్భవించి ముందుకు రాగలం? మనం ఆనందంగా పశ్చాత్తాపపడి, ఆజ్ఞలకు లోబడేలా ఎంచుకోవచ్చు. “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును,” అని ప్రభువు చెప్పారు.26 మనం ప్రతిరోజూ పశ్చాత్తాపపడేందుకు కృషి చేయగలము మరియు ప్రభువు పట్ల ప్రేమతో నిండిన హృదయంతో ఆనందంగా ముందుకు సాగగలము.

మనము దీనిని చేయగలము!

ప్రభువు సహాయంతో, మనల్ని బంధించే వాటన్నిటి నుండి మనల్ని మనం ఎలా విడిపించుకోగలం? నిబంధనల ద్వారా మనం ఉద్దేశపూర్వకంగా అన్నిటికంటే ముందుగా మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు కట్టుబడి ఉండగలము. ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా బోధించారు: “[మన] నైతిక మరియు ఆధ్యాత్మిక శక్తికి మూలం ఏమిటి మరియు మనం దానిని ఎలా పొందగలం? సమస్తానికి మూలం దేవుడు. ఆయనతో మనం నిబంధలు చేయడం ద్వారా ఆ శక్తిని మనం పొందగలము. … ఈ దైవిక ఒప్పందాలలో, ఆయనను సేవించడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి మన నిబద్ధతకు ప్రతిఫలంగా దేవుడు మనలను నిలబెట్టడానికి, పవిత్రం చేయడానికి మరియు ఉన్నతీకరించడానికి తననుతాను బంధించుకుంటాడు.”27 మనం పవిత్రమైన నిబంధనలను చేసి పాటించవచ్చు.

మనము దీనిని చేయగలము!

“మీరు రాయిని తీసివేయుడి.” “బయటకు రమ్ము.” “అతని కట్లు విప్పిపోనియ్యుడి.”

సలహాలు, ఆజ్ఞలు మరియు నిబంధనలు. మనము దీనిని చేయగలము!

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా వాగ్దానమిచ్చారు, “కొన్ని దీవెనలు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి, కొన్ని పరలోకములోకి వెళ్ళే వరకు రావు; కానీ యేసు క్రీస్తు సువార్తను హత్తుకొనువారికి, అవి వస్తాయి.”28

చివరగా, “కాబట్టి, భయపడక ధైర్యముగానుండుడి, ఏలయనగా ప్రభువైన నేను మీతోనున్నాను మరియు మీ ప్రక్కన నిలిచెదను.”29

ఇది నా సాక్ష్యం, ఎల్లప్పుడూ మన కోసం వచ్చే యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 11:3 చూడండి.

  2. యోహాను 11:6-7.

  3. యోహాను 11:14.

  4. యోహాను 11:21, 32.

  5. యోహాను 11:39.

  6. “యూదుల విశ్వాసం ప్రకారం, మరణించిన మూడు రోజుల తర్వాత మృతదేహం పరిసరాల్లోనే ఆత్మ ఉంటుంది. యూదుల విశ్వాసం ప్రకారం, నాలుగవ రోజున మరణించిన వ్యక్తి యొక్క పునరుజ్జీవనం అసాధ్యం, ఎందుకంటే తన స్థానాన్ని మార్చుకున్న శరీరంలోకి ఆత్మ మళ్ళీ ప్రవేశించదు. యేసు నాలుగవ రోజున లాజరును లేపిన అద్భుతం, దాని సాక్షులను మరింత ఆకట్టుకుంది. ఆవిధంగా నాలుగవ రోజు ఇక్కడ ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగియుంది మరియు సాధ్యమైన అన్ని పునరుత్థాన అద్భుతాలకు సంబంధించి కథకుని చేత ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడింది” (Ernst Haenchen, John 2: A Commentary on the Gospel of John, Chapters 7–21, ed. Robert W. Funk and Ulrich Busse, trans. Robert W. Funk [1984], 60–61).

  7. యోహాను 11:33-34.

  8. యోహాను 11:39.

  9. యోహాను 11:43-44.

  10. మోషే 4:22-25 చూడండి.

  11. ఈథర్ 12:27 చూడండి.

  12. యోహాను 14:1.

  13. యోహాను 14:18.

  14. Thomas S. Monson, “I Will Not Fail Thee, nor Forsake Thee,” Liahona Nov. 2013, 87. అధ్యక్షులు మాన్సన్ ఇంకా ఇలా వివరించారు: “మనం హృదయ విదారకమైన దుఃఖాన్ని అనుభవించే సమయాలు, మనం దుఃఖించే సమయాలు మరియు మన పరిమితుల వరకు మనం పరీక్షించబడే సమయాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే, అలాంటి ఇబ్బందులు మనల్ని మంచిగా మార్చుకోవడానికి, మన పరలోక తండ్రి మనకు బోధించే విధంగా మన జీవితాలను పునర్నిర్మించుకోవడానికి మరియు మనం ఉన్నదానికి భిన్నంగా—ఇంతకు ముందు మనం కలిగియున్న వాటికంటే బలమైన సాక్ష్యాలతో మనం ఉన్నదాని కంటే మెరుగ్గా, మునుపటి కంటే మనం ఎక్కువ అర్థం చేసుకోగలిగేలా, మనం ఉన్నదానికంటే ఎక్కువ సానుభూతి గలవారిగా మారడానికి మనల్ని అనుమతిస్తాయి” (“I Will Not Fail Thee, Nor Forsake Thee,” 87). సిద్ధాంతము మరియు నిబంధనలు 84:119 కూడా చూడండి: “ఏలయనగా ప్రభువైన నేను, పరలోక శక్తులను వినియోగించుటకు నా చేతిని చాచితిని; దానిని మీరిప్పుడు చూడలేరు గాని కొద్దికాలము తరువాత దానిని మీరు చూచెదరు, నేను ఉన్నవాడనని మరియు నేను వచ్చెదనని తెలుసుకొందురు.”

    మోషైయ 23:21-24 కూడా చూడండి.

    “అయినప్పటికీ ప్రభువు తన జనులను గద్దించుట సరియని చూచును; ఆయన వారి సహనమును, వారి విశ్వాసమును పరీక్షించును.

    “అయినను—ఆయన యందు నమ్మికయుంచు వారు అంత్యదినమున పైకెత్తబడుదురు. ఈ జనుల యెడల కూడా అలాగే జరిగెను.

    “ఏలయనగా వారు దాస్యములోనికి తేబడిరని, వారి దేవుడైన ప్రభువు అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తప్ప మరెవరు వారిని విడిపించలేకపోయెనని నేను మీకు చూపెదను.

    “ఆయన వారిని విడిపించి, తన గొప్ప శక్తిని వారికి చూపెను మరియు వారి సంతోషము గొప్పదైయుండెను.”

  15. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7.

  17. యోహాను 11:39.

  18. యోహాను 11:43.

  19. యోహాను 11:44.

  20. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వ్యాఖ్యానించారు: “మిక్కిలి సవాలుతో కూడుకున్న పరిస్థితులలో మేము చేయగలిగినదంతా చేసి, ఇక ఏమీ చేయలేము అనుకొన్నప్పుడు ఆయన సహాయము చేయుటను తరచుగా, నా సలహాదారులు మరియు నేను కన్నీటితో నిండిన కళ్ళతో చూశాము. మేము నిజంగా ఆశ్చర్యపోయాము” ( “స్వాగత సందేశం,” లియాహోనా, మే 2021, 6).

  21. Bible Dictionary, “Faith.”

  22. Guide to the Scriptures, “Faith,” scriptures.ChurchofJesusChrist.org.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 123:17.

  24. 3 నీఫై 11:32-39 చూడండి.

  25. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,లియహోనా, నవ. 2022, 97.

  26. యోహాను 14:21.

  27. D. Todd Christofferson, “The Power of Covenants,” Liahona, May 2009, 20.

  28. Jeffrey R. Holland, “An High Priest of Good Things to Come,” Liahona, Jan. 2000, 45.

  29. సిద్ధాంతము మరియు నిబంధనలు 68:6.