సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తును గురించిన ఈ ఆలోచనను నా మనస్సు పట్టుకొనియుంది
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తును గురించిన ఈ ఆలోచనను నా మనస్సు పట్టుకొనియుంది

యేసు క్రీస్తు గురించిన ఆలోచనను మీరు శ్రద్ధగా పట్టుకొనినప్పుడు, పరలోక నడిపింపును మాత్రమే కాకుండా పరలోక శక్తిని కూడా నేను మీకు వాగ్దానమిస్తున్నాను.

ఈ అందమైన ఈస్టర్ కాలములో, “ఓ గొప్ప యెహోవా, మమ్మల్ని నడిపించు” అనే ఈ శక్తివంతమైన వచనము యొక్క ప్రార్థనను నేను ప్రతిధ్వనిస్తున్నాను.1

మోర్మన్ గ్రంథములో ఒక విశేషమైన కథ ఒక ప్రఖ్యాత కుటుంబానికి చెందిన ఆల్మా అనే పేరు గల యువకుని గురించి చెప్తుంది, అతడు విగ్రహారాధికుడైన అవిశ్వాసి అని లేఖనాలు వర్ణిస్తాయి.2 అతడు తనను అనుసరించేలా ఇతరులను ప్రేరేపించడానికి ముఖస్తుతిని ఉపయోగిస్తూ, స్పష్టంగా మరియు ఒప్పించేలా ఉంటాడు. నిర్ఘాంతపరిచేలా, ఒక దేవదూత ఆల్మా మరియు అతని స్నేహితులకు కనిపించాడు. ఆల్మా నేలపై పడిపోయాడు మరియు ఎంత బలహీనంగా మారాడంటే, అతడు నిస్సహాయుడిగా అతని తండ్రి ఇంటికి మోసుకుపోబడ్డాడు. అతడు మూడు రోజులపాటు అకారణంగా కోమాలో ఉన్నట్లుగా ఉండిపోయాడు.3 తరువాత, అతని చుట్టూ ఉన్నవారికి అతడు అపస్మాకర స్థితిలో ఉన్నట్లు కనిపించినప్పుడు, అతని ఆత్మ దుఃఖిస్తుండగా అతని మనస్సు చాలా క్రియాశీలకంగా ఉన్నట్లు, దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా ఉన్న అతని జీవితం గురించి ఆలోచిస్తున్నట్లు అతడు వివరించాడు. అతని మనస్సు “[అతని] అనేక పాపముల యొక్క జ్ఞాపకము చేత వేదనపడినట్లు”4 మరియు “నిత్య వేదనతో బాధింపబడినట్లు”5 అతడు వివరించాడు.

అతని తీవ్ర నిరాశలో, “లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాకడను”6 గూర్చి అతని యవ్వనంలో బోధింపబడడాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. తరువాత అతడు ఆలోచన రేకెత్తించే ఈ వ్యాఖ్యానం చేసాడు: నా మనస్సునందు ఈ ఆలోచన వచ్చినప్పుడు, నేను నా హృదయమందు ఇట్లు మొరపెట్టితిని: “ఓ యేసూ, దేవుని కుమారుడవైన నీవు, నాపై కనికరము చూపుము.”7 అతడు రక్షకుని యొక్క దైవిక శక్తి కోసం అభ్యర్థించినప్పుడు, అద్భుతమేదో జరిగింది: “ఇప్పుడు నేను దీనిని తలంచినప్పుడు, నా బాధలను ఇకపై జ్ఞాపకము చేసుకొనకయుంటిని,”8 అని అతడు చెప్పాడు. అకస్మాత్తుగా అతడు శాంతిని, వెలుగును అనుభవించాడు. “నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు,”9 అని అతడు ప్రకటించాడు.

యేసు క్రీస్తు యొక్క సత్యమును ఆల్మా “పట్టుకొనియున్నాడు”. “పట్టుకొనియుండడం” అనే పదాన్ని మనం భౌతిక కోణంలో ఉపయోగిస్తున్నట్లయితే, “అతడు పడిపోతున్నప్పుడు వెంటనే కాపలావారిని పట్టుకున్నాడు,” అని మనం చెప్పవచ్చు, దాని అర్థము, అతడు అకస్మాత్తుగా సమీపించి, సురక్షితమైన పునాదికి పటిష్టంగా సిమెంటు చేయబడిన వాటికి తనను తాను గట్టిగా అంటించుకున్నాడు.

ఆల్మా విషయంలో, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగము యొక్క ఈ శక్తివంతమైన సత్యాన్ని చేరుకొని, గట్టిగా భద్రపరిచినది అతని మనస్సు. ఆ సత్యముపై విశ్వాసంతో పనిచేస్తూ, దేవుని శక్తి మరియు కృప ద్వారా, అతడు నిరాశ నుండి కాపాడబడి, నిరీక్షణతో నింపబడ్డాడు.

మన అనుభవాలు ఆల్మా వలె నాటకీయంగా ఉండకపోయినా, ఏది ఏమైనప్పటికీ అవి శాశ్వతంగా ముఖ్యమైనవి. మన మనస్సులు కూడా యేసు క్రీస్తు మరియు ఆయన కనికరముగల త్యాగము గురించి “ఈ ఆలోచనను పట్టుకొనియున్నాయి” మరియు మన ఆత్మలు దాని వలన వచ్చే వెలుగును, ఆనందాన్ని అనుభవించాయి.

యేసు క్రీస్తు యొక్క ఆలోచనను సురక్షితం చేయడం

ఈ అతి ముఖ్యమైన ఆత్మీయ ఆలోచనపై దృష్టికేంద్రీకరిస్తూ, దానిని మన అంతరంగంలో స్థిరంగా స్థాపిస్తూ, మరింత స్పృహతో దానిని మనం రూపొందించి, బలోపేతం చేయాలని రక్షకుని ప్రేమ యొక్క మధురానందాన్ని తీసుకువస్తూ,10 మన మనస్సులోనికి నిరంతరం ఆతృతగా ప్రవహించేలా, మన ఆలోచనలో, క్రియలో మనల్ని నడిపించేలా దానిని అనుమతించాలనేది ఈ ఈస్టరు సమయంలో నా ప్రార్థనయైయున్నది.11

యేసు క్రీస్తు యొక్క శక్తితో మన మనస్సును నింపడం అంటే అర్థము, ఆయన గురించి మాత్రమే మనం ఆలోచించడం కాదు. కానీ, మన ఆలోచనలన్నీ ఆయన ప్రేమ, ఆయన జీవితం మరియు బోధనలు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము మరియు మహిమకరమైన పునరుత్థానములో చుట్టుముట్టబడ్డాయని దాని అర్థం. యేసు ఎన్నడూ మరచిపోబడలేదు, ఎందుకంటే మన ఆలోచనలు ఎల్లప్పుడు ఆయన గురించే ఉంటాయి మరియు [మనలో] ఉన్నవన్నీ ఆయనను ఆరాధిస్తాయి!”12 మనం ప్రార్థిస్తాము మరియు మనల్ని ఆయనకు దగ్గర చేసిన అనుభవాలను మన మనస్సులో తిరిగి జ్ఞాపకం చేసుకుంటాము. తీరికలేని మన జీవితాలలో పరిగెడుతున్న లెక్కలేనన్ని అనుదిన ఆలోచనల ఒత్తిడిని తగ్గించుకోవడానికి మన మనస్సులోనికి దైవిక చిత్రాలను, పరిశుద్ధ లేఖనాలను, ప్రేరేపిత కీర్తనలను మనం స్వాగతిస్తాము. ఆయన పట్ల మన ప్రేమ ఈ మర్త్య జీవితంలోని బాధ మరియు దుఃఖమును అనుభవించడం నుండి మనల్ని నిరోధించదు, కానీ మన శక్తికి మించిన బలంతో సవాళ్ళను జయించడానికి అది మనల్ని అనుమతిస్తుంది.

యేసు, నిన్ను గూర్చిన ఆలోచన

నా మనస్సును మాధుర్యంతో నింపుతుంది;

కానీ అంతకంటే మధురమైనది నీ వదనపు వీక్షణ

మరియు నీ సన్నిధిలో విశ్రాంతి.13

మీరు పరలోక తండ్రి యొక్క ఆత్మీయ బిడ్డయని గుర్తుంచుకోండి. అపొస్తలుడైన పౌలు వివరించినట్లుగా, మనం “దేవుని సంతానము.”14 భూమిపైకి రావడానికి చాలాకాలం ముందు మీ స్వంత వ్యక్తిగత గుర్తింపుతో మీరు జీవించారు. భూమిపైకి రావడానికి, నేర్చుకోవడానికి, ఆయన వద్దకు తిరిగివెళ్ళడానికి మన కొరకు మన తండ్రి ఒక పరిపూర్ణ ప్రణాళికను రూపొందించారు. ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము యొక్క శక్తి ద్వారా మనం ఈ మర్త్య జీవితం తరువాత తిరిగి జీవించేలా తండ్రి తన అద్వితీయ కుమారుని పంపారు; ఆయనయందు విశ్వాసాన్ని సాధనచేసి, మన పాపాల కొరకు పశ్చాత్తాపపడడానికి మనం సమ్మతించినప్పుడు,15 మనం క్షమించబడతాము మరియు నిత్యజీవితపు నిరీక్షణను పొందుతాము.16

మన మనస్సుకు మరియు ఆత్మకు అసాధారణమైన శ్రద్ధ ఇవ్వడం

ఈ మర్త్య జీవితంలో, మన మనస్సు మరియు ఆత్మకు అసాధారణమైన శ్రద్ధ అవసరం.17 జీవించడానికి, ఎంపిక చేయడానికి మరియు మంచి చెడులను గుర్తించడానికి మన ఆత్మ మనల్ని అనుమతిస్తుంది.18 దేవుడు మన తండ్రియని, యేసు క్రీస్తు దేవుని కుమారుడని మరియు వారి బోధనలు ఇక్కడ ఆనందానికి, సమాధిని దాటి నిత్య జీవితానికి మనకు దారిచూపిస్తాయని ధృవీకరించే సాక్ష్యాన్ని మన ఆత్మ పొందుతుంది.

యేసు క్రీస్తు గురించి ఈ ఆలోచనను ఆల్మా మనస్సు పట్టుకొనియుంది. అది అతని జీవితాన్ని మార్చివేసింది. సర్వసభ్య సమావేశము మనం దేనిని చేయాలని, ఏమి కావాలని ప్రభువు కోరుతున్నారో అర్థం చేసుకొనే సమయము. అది మన పురోగతిపై ప్రతిబింబించాల్సిన సమయం కూడా. నా నియామకాలు నన్ను ప్రపంచమంతటికి తీసుకువెళ్ళినప్పుడు, సంఘము యొక్క నీతిమంతులైన, అంకితభావం గల సభ్యులలో హెచ్చైన ఆత్మీయ శక్తిని నేను గమనించాను.

ఐదేళ్ళ క్రితం, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క నిజమైన పేరును ఉపయోగించడం ద్వారా మనం చేసే వాటన్నిటిలో రక్షకుడిని మరింత ప్రముఖంగా ఉంచాలని మనం అడగబడ్డాము.19 మరింత ఆదరంగా మనం ఆయన పేరును పలుకుతున్నాము.

నాలుగేళ్ళ క్రితం, మన సంస్కార సమావేశ సమయాన్ని తగ్గించడం ద్వారా, ప్రభువు యొక్క సంస్కారములో పాలుపొందడంపై మన దృష్టిని మనం హెచ్చించాము. మనం యేసు క్రీస్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము మరియు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటామనే మన వాగ్దానంలో మరింత గంభీరంగా ఉన్నాము.20

ప్రపంచవ్యాప్త మహమ్మారి వలన విడిగా ఉండడంతో మరియు రండి, నన్ను అనుసరించండి యొక్క సహాయంతో, రక్షకుని బోధనలు వారములో మన రక్షకుని ఆరాధనకు సహాయం చేస్తూ, మన ఇళ్ళలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి.

“ఈయనను ఆలకించుము,”21 అనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సలహాను అనుసరించడం ద్వారా, మనం పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలను గుర్తించడానికి మరియు మన జీవితాల్లో ప్రభువు యొక్క హస్తాన్ని చూడడానికి మన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నాము.

డజన్ల కొద్దీ దేవాలయాల ప్రకటన మరియు సంపూర్తితో, మనం మరింత తరచుగా ప్రభువు యొక్క మందిరంలో ప్రవేశిస్తున్నాము మరియు వాగ్దానం చేయబడిన ఆయన దీవెనలను పొందుతున్నాము. మన రక్షకుడు మరియు విమోచకుని యొక్క అతీతమైన అందాన్ని మరింత శక్తివంతంగా మనం అనుభవిస్తున్నాము.

అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “శక్తివ౦తమైన [శిష్యునిగా] అగుట అ౦త సులువైన‌ది లేదా అప్రయత్నపూర్వకంగా కాదు. రక్షకుని మీదను మరియు ఆయన సువార్త మీదను మన దృష్టి స్థిరపరచబడవలెను. ప్రతీ ఆలోచనలోను ఆయనవైపు చూచుటకు ప్రయాసపడుట మానసికంగా కఠినమైనది.”22

మన దృష్టిని యేసు క్రీస్తుపై కేంద్రీకరించడం ద్వారా, మన చుట్టూ ఉన్నవన్నీ—ప్రస్తుతం ఉన్నప్పుడే—ఆయనపట్ల మన ప్రేమ గుండా చూడబడతాయి. తక్కువ ప్రాముఖ్యమైన పరధ్యానాలు మాయమవుతాయి మరియు ఆయన వెలుగుకు, స్వభావానికి అనుగుణంగా లేని విషయాలను మనం తొలగిస్తాము. యేసు క్రీస్తు గురించి ఈ ఆలోచనను మీరు శ్రద్ధగా పట్టుకొని, ఆయనను నమ్మి, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, పరలోక నడిపింపును మాత్రమే కాకుండా పరలోక శక్తిని—మీ నిబంధనలకు బలాన్ని, మీ కష్టాలకు శాంతిని, మీ దీవెనలకు ఆనందాన్నిచ్చే శక్తిని నేను మీకు వాగ్దానమిస్తున్నాను.

యేసు క్రీస్తును స్మరించుకోవడం

కొన్నివారాల క్రితం, నేను, కేథీ, మాట్ మరియు శారా జాన్సన్ ఇంటికి వెళ్ళాము. గోడ మీద వాళ్ళ అమూల్యమైన కుటుంబ చిత్రం, రక్షకుని అందమైన చిత్రం మరియు దేవాలయ వివరణ ఉన్నాయి.

వారి నలుగురు కూతుళ్ళు మడ్డీ, రూబి, క్లెయిర్ మరియు జూన్ వాళ్ళ అమ్మను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో సంతోషంగా చెప్పారు.

ఒక సంవత్సరానికి పైగా శారా క్రమం తప్పకుండా కుటుంబమంతా కలిసి శనివారం దేవాలయానికి హాజరయ్యేలా నియామకాలు చేసింది, ఆవిధంగా అమ్మాయిలు ఇంతకుముందు జీవించిన కుటుంబ సభ్యుల కోసం బాప్తిస్మములలో పాల్గొనగలరు.

గత సంవత్సరం నవంబరులో, డిసెంబరు చివరి వారం కోసం శారా కుటుంబ దేవాలయ నియామకాన్ని శనివారానికి బదులు గురువారానికి చేసింది. “నీకది ఫరవాలేదనుకుంటా,” అని మాట్‌తో అందామె.

శారా క్యాన్సరుతో బాధపడుతోంది, కానీ వైద్యులు ఆమె ఇంకా రెండు మూడు సంవత్సరాలు బ్రతుకుతుందని ఊహించారు. ఒక సంస్కార సమావేశంలో శారా తన శక్తివంతమైన సాక్ష్యాన్ని పంచుకుంది, ఆమెకు ఏమి జరిగినా సరే, ఆమె తన పూర్ణ హృదయంతో రక్షకుడిని ప్రేమించిందని, “క్రీస్తు ఇదివరకే మరణాన్ని జయించారని” చెప్పింది. డిసెంబరు వచ్చేనాటికి, అనుకోకుండా శారా ఆరోగ్యం వేగంగా క్షీణించింది మరియు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. డిసెంబరు 29, గురువారం ప్రొద్దున, ఆమె చనిపోయింది. ఆ రాత్రంతా మాట్, శారా ప్రక్కనే ఉన్నాడు.

పగిలిన గుండెతో, శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయి, తన కూతుళ్ళతో పాటు దుఃఖిస్తూ అతను ఇంటికి చేరుకున్నాడు. మాట్ తన ఫోను చూసినప్పుడు, ఆరోజు కోసం శారా నియమించిన అసాధారణమైన గురువారం దేవాలయ నియామకం యొక్క జ్ఞాపికను అతడు గమనించాడు. మాట్ అన్నాడు, “మొదట నేను దానిని చూసినప్పుడు, ఇది జరిగే పని కాదని అనుకున్నాను.”

కానీ తర్వాత, మాట్ మనస్సు ఈ ఆలోచనను పట్టుకొనియుంది: “రక్షకుడు సజీవుడు. ఆయన పరిశుద్ధ మందిరంలో తప్ప మరెక్కడా మేము కుటుంబంగా ఉండలేము.”

చిత్రం
జాన్సన్ కుటుంబం

మాట్, మడ్డీ, రూబి, క్లెయిర్ మరియు జూన్ వారి కోసం శారా నియమించిన నియామకం కోసం దేవాలయానికి చేరుకున్నారు. చెంపలపై కన్నీటి ధారతో, మాట్ తన కూతుళ్ళతో కలిసి బాప్తిస్మములు నిర్వహించాడు. శారాతో తమ ప్రేమను, నిత్య బంధాన్ని వారు లోతుగా అనుభవించారు మరియు రక్షకుని అపారమైన ప్రేమను, ఓదార్చే శాంతిని వారు అనుభవించారు. “నేను తీవ్రమైన దుఃఖాన్ని, బాధను అనుభవిస్తుండగా, నా తండ్రి యొక్క అద్భుతమైన రక్షణ ప్రణాళికను తెలుసుకొని నేను ఆనందంతో అరిచాను,” అని మాట్ మృదువుగా పంచుకున్నాడు.

ఈ ఈస్టరు సమయంలో, రక్షకుని సాటిలేని ప్రాయశ్చిత్త త్యాగం మరియు అద్భుతమైన ఆయన పునరుత్థానం యొక్క సమగ్రమైన మరియు సంపూర్ణమైన సత్యానికి నేను సాక్షిగా ఉన్నాను. యేసు క్రీస్తు గురించిన ఆలోచనపై మీ మనస్సు స్థిరంగా, శాశ్వతంగా నిలిచినప్పుడు మరియు ఇంకా ఎక్కువగా రక్షకునిపై మీ జీవితాన్ని కేంద్రీకరించడాన్ని మీరు కొనసాగించినప్పుడు, ఆయన నిరీక్షణను, ఆయన శాంతిని, ఆయన ప్రేమను మీరు అనుభవిస్తారని నేను మీకు వాగ్దానమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “Guide Us, O Thou Great Jehovah,” Hymns, no. 83.

  2. మోషైయ 27:8 చూడండి.

  3. ఆల్మా 36:10 చూడండి.

  4. ఆల్మా 36:17.

  5. ఆల్మా 36:12.

  6. ఆల్మా 36:17.

  7. ఆల్మా 36:18. మోర్మన్ గ్రంథములో “పట్టుకొని” అనే పదాన్ని మరొకసారి “ఇనుప దండము చివరను పట్టుకొనిన వారి గురించి మాట్లాడినప్పుడు ఉపయోగించారు” (1 నీఫై 8:24, 30).

  8. ఆల్మా 36:19.

  9. ఆల్మా 36:21.

  10. “జీవితంలో అతి పెద్ద యుద్ధం మీ స్వంత ఆత్మ యొక్క నిశ్శబ్ద గదులలో జరుగుతుంది” (David O. McKay, in Conference Report, Apr. 1967, 84).

  11. “[ఆలోచనలు] చర్యలకు దారితీస్తాయి. మన ఆలోచనలు మన చర్యలను నియంత్రిస్తాయి” (Boyd K. Packer, That All May be Edified [1982], 33).

    అధ్యక్షులు డాలిన్ హెచ్ ఓక్స్ ఇలా బోధించారు: “మనం చెడ్డ కోరికలను అణచివేసి, వాటి స్థానంలో నీతివంతమైన వాటిని ఉంచగలం. దీనికి విద్య మరియు అభ్యాసం అవసరం. “విద్య … దానికి సంబంధించి మన కోరికలు చాలా ముఖ్యమైనవి’ అని అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ బోధించారు” (Pure in Heart [1988], 149).

  12. “Praise to the Lord, the Almighty,” Hymns, no. 72.

  13. “Jesus, the Very Thought of Thee,” Hymns, no. 141.

  14. అపొస్తలుల కార్యములు 17:29.

  15. సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43 చూడండి.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడండి.

  17. “దేవుడు తప్ప మరెవరును నీ హృదయ తలంపులను, ఆలోచనలను యెరుగరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:16).

  18. “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” (లూకా 6:45).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘం యొక్క సరియైన పేరు,” లియహోనా, నవ. 2018, 87–89 చూడండి.

  20. మనం “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకుంటాము” (మొరోనై 4:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77) అనేది సంస్కార ప్రార్థనలో ప్రతీవారం మనం చేసే నిబంధన. ఒకదాని తర్వాత ఒకటిగా, “జ్ఞాపకము చేసుకుంటాము, జ్ఞాపకము చేసుకుంటాము” అనే పదాన్ని రెండుసార్లు ఉపయోగించడం ద్వారా మోర్మన్ గ్రంథము మనల్ని ప్రోత్సహిస్తుంది (మోషైయ 2:41; ఆల్మా 37:13; హీలమన్ 5:9). ఆత్మీయంగా జ్ఞాపకము చేసుకోవడమనేది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా వస్తుంది: “అతడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును” (యోహాను 14:26).

  21. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఈయనను ఆలకించుము,” లియహోనా, మే 2020, 90.

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 41. “[కడవరి-దిన పరిశుద్ధులు] అనుభవించే ఆనందానికి మన జీవితాల యొక్క పరిస్థితులతో సంబంధం లేదు, కానీ మన జీవితాలు దృష్టి కేంద్రీకరించే వాటితో పూర్తి సంబంధం ఉంది,” అని కూడా అధ్యక్షులు నెల్సన్ చెప్పారు (“Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82).