సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తే ఉపశమనం
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తే ఉపశమనం

అవసరమైన వారికి భౌతిక మరియు ఆత్మీయ ఉపశమనాన్ని అందించడంలో సహాయం చేయడానికి రక్షకునితో మనము భాగస్వాములు కాగలం—మరియు ఈ ప్రక్రియలో మన స్వంత ఉపశమనాన్ని పొందగలం.

యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు ఆయన అద్భుతాల గురించి వారు వినిన దానిలో నిరీక్షణను బట్టి, పక్షవాయువు గలవాని సంరక్షకులు అతన్ని యేసు వద్దకు తీసుకువచ్చారు. అతన్ని తీసుకురావడానికి వారు వినూత్నంగా ఆలోచించారు—పైకప్పును తొలగించి, అతన్ని మంచంతో సహా యేసు బోధిస్తున్న ప్రదేశంలో క్రిందికి దించారు. యేసు “వారి విశ్వాసము చూచి, … నీ పాపములు క్షమింపబడియున్నవని [పక్షవాయువు గలవానితో] చెప్పెను.”1 తర్వాత, “నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని”2 చెప్పెను. వెంటనే పక్షవాయువు గలవాడు లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, “దేవుని మహిమపరచుచు” తన యింటికి వెళ్ళెను.3

పక్షవాయువు గలవాని కోసం శ్రద్ధ చూపిన స్నేహితుల గురించి మనకు ఇంకా ఏమి తెలుసు? రక్షకుడు వారి విశ్వాసాన్ని గుర్తించారని మనకు తెలుసు. రక్షకుడిని చూచి, విని, ఆయన అద్భుతాలకు సాక్షులుగా ఉండి, వారు “విస్మయమొందిరి” మరియు “దేవుని మహిమపరచిరి.”4

యేసు క్రీస్తు నిరీక్షించిన వారికి స్వస్థతను—బాధ నుండి మరియు దీర్ఘకాలిక వ్యాధి యొక్క వికలాంగ పరిణామాల నుండి శారీరక ఉపశమనాన్ని అందించారు. ముఖ్యంగా, రక్షకుడు పాపము నుండి ఒక వ్యక్తిని శుద్ధిచేయడంలో ఆత్మీయ ఉపశమనాన్ని కూడా అందించారు.

మరియు స్నేహితులు—అవసరంలో ఉన్న ఒకరిపట్ల శ్రద్ధవహించే తమ ప్రయత్నాలలో, వారు ఉపశమనానికి మూలాన్ని కనుగొన్నారు; వారు యేసు క్రీస్తును కనుగొన్నారు.

యేసు క్రీస్తే ఉపశమనం అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మనం పాపము యొక్క భారమునుండి, పర్యవసానాల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు మన బలహీనతలలో సహాయం పొందవచ్చు.

మనం దేవుడిని ప్రేమిస్తాము మరియు ఆయనకు సేవ చేస్తామని నిబంధన చేసాము కాబట్టి, అవసరంలో ఉన్న వారికి భౌతిక మరియు ఆత్మీయ ఉపశమనం అందించడంలో సహాయపడేందుకు మనం రక్షకునితో భాగస్వాములు కాగలం—ఆ ప్రక్రియలో యేసు క్రీస్తునందు మన స్వంత ఉపశమనాన్ని కనుగొనగలం.5

లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి అని మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు.6 “నిజమైన విశ్రాంతిని” ఆయన “ఉపశమనము మరియు శాంతిగా” నిర్వచించారు. “రక్షకుడు తన అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా, మనలో ప్రతీఒక్కరిని బలహీనత, పొరపాటులు, పాపము నుండి విమోచించినందు వలన మరియు మీరు ఎప్పుడైనా కలిగియుండగల ప్రతీ బాధను, విచారాన్ని, భారాన్ని ఆయన అనుభవించినందు వలన, మీరు నిజంగా పశ్చాత్తాపపడి, ఆయన సహాయం కోరినప్పుడు, మీరు నేటి అనిశ్చితమైన ప్రపంచపు సవాళ్ళను జయించగలరు,”7 అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు. యేసు క్రీస్తు మనకు అందించే ఉపశమనం అదే!

మనలో ప్రతీఒక్కరం ఉపమానరీతిగా ఉండే సంచిని మోస్తున్నాము. అది మీ తలపై సరితూగుతున్న బుట్ట లేదా సంచి కావచ్చు లేదా వస్తువులను బట్టలో మోపుకట్టి, మీ భుజంపై మోపియుండవచ్చు. మనం మట్టుకు దానిని సంచి అని పిలుచుకుందాం.

ఈ ఉపమానరీతిగా ఉండే సంచిలోనే మనం పతనమైన లోకంలో జీవనం యొక్క భారాలను మోస్తాము. మన భారాలు సంచిలో రాళ్ళ వలె ఉన్నాయి. సాధారణంగా, అవి మూడు రకాలు:

  • పాపము కారణంగా మన స్వంత చర్యల యొక్క రాళ్ళు.

  • ఇతరుల చెడు నిర్ణయాలు, దుష్ప్రవర్తన, నిర్దయ కారణంగా మన సంచిలోని రాళ్ళు.

  • పతనమైన స్థితిలో మనం జీవిస్తున్నందువలన మనం మోసే రాళ్ళు. వీటిలో వ్యాధి, బాధ, దీర్ఘకాలిక రోగం, దుఃఖం, నిరాశ, ఒంటరితనం మరియు ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు అనే రాళ్ళు ఉంటాయి.

మన మర్త్య భారాలు, ఉపమానరీతిగా ఉండే మన సంచిలోని రాళ్ళు బరువుగా అనిపించనవసరం లేదని నేను ఆనందంగా ప్రకటిస్తున్నాను.

యేసు క్రీస్తు మన భారాన్ని తేలిక చేయగలరు.

యేసు క్రీస్తు మన భారాలను పైకెత్తగలరు.

పాపభారము నుండి ఉపశమనం పొందడానికి యేసు క్రీస్తు మన కొరకు మార్గాన్ని అందించగలరు.

యేసు క్రీస్తే మన ఉపశమనం.

ఆయన ఇలా చెప్పారు:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును [అనగా, ఉపశమనము మరియు శాంతి].

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”8

కాడి సుళువుగాను, భారము తేలికగాను ఉన్నవి అంటే, మనం రక్షకునితోపాటు కాడి ఎత్తుకుంటాము, మన భారాలను ఆయనతో పంచుకుంటాము, మన భారాన్ని పైకెత్తడానికి ఆయనను అనుమతిస్తామని భావించడం. దానర్థం, దేవునితో ఒక నిబంధన సంబంధంలో ప్రవేశించడం మరియు ఆ నిబంధనను పాటించడం, అది అధ్యక్షులు నెల్సన్ వివరించినట్లుగా, “జీవితానికి సంబంధించిన ప్రతీదానిని సులభతరం చేస్తుంది.” “మీరు రక్షకుని యొక్క కాడిని యెత్తుకోవడమంటే అర్థము, ఆయన బలానికి, విమోచనా శక్తికి మీరు ప్రవేశం కలిగియుండడం,”9 అని ఆయన చెప్పారు.

అయితే, మన భారాలను రక్షకునితో పంచుకోవడానికి మనమెందుకు సమ్మతించడం లేదు? ఆట పూర్తి చేయడానికి రిలీవర్ సిద్ధంగా ఉన్నప్పుడు, బేస్‌బాల్ ఆటలో బంతి వేసేవాడు ఆ స్థలాన్ని ఎందుకు వదిలిపెట్టి రాడు? దానిని నా దగ్గర ఉంచడానికి యేసు క్రీస్తు సిద్ధంగా ఉన్నప్పుడు, నేను నా పదవిని ఒంటరిగా కొనసాగించాలని ఎందుకు పంతం పడుతున్నాను?

అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “యేసు క్రీస్తు … స్వస్థపరచుటకు, క్షమించుటకు, శుద్ధిచేయుటకు, బలపరచుటకు, నిర్మలము చేయుటకు మరియు పవిత్రము చేయుటకు సమ్మతితో, ఆశతో తన బాహువులు తెరచి నిలబడియున్నారు.”10

అయితే, మన రాళ్ళను ఒంటరిగా మోయాలని మనమెందుకు పంతం పడుతున్నాము?

మీలో ప్రతీఒక్కరు ఆలోచించడానికి, ఇది ఒక వ్యక్తిగత ప్రశ్నగా ఉద్దేశించబడింది.

నాకైతే, ఇది చరిత్ర అంతటా జనులను ప్రభావితం చేసిన గర్వం. “నేను దీనిని చేయగలను,” అంటాను నేను. “ఫరవాలేదు; నేను దీనిని చేస్తాను.” అతడు గొప్ప మోసగాడు, నేను దేవుని యెదుట దాగుకోవాలని, ఆయనను నిరాకరించాలని, ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా నేనే చేయాలని కోరుకుంటాడు.

సహోదర సహోదరీలారా, నేను ఒంటరిగా చేయలేను, చేయనవసరం లేదు మరియు నేను చేయను. దేవునితో నేను చేసిన నిబంధనల ద్వారా, నా రక్షకుడైన యేసు క్రీస్తుకు కట్టుబడి ఉండాలని ఎంచుకొని, “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”11

నిబంధనలను పాటించేవారు రక్షకుని ఉపశమనంతో దీవించబడ్డారు.

మోర్మన్‌ గ్రంథములోని ఈ ఉదాహరణను పరిగణించండి: ఆల్మా జనులు వారిపై “పనులు మోపబడి హింసించబడ్డారు, మరియు … వారిపై అధికారులు నియమించబడ్డారు.”12 బిగ్గరగా ప్రార్థన చేయుటకు నిషేధింపబడి, వారు “[దేవుని] యెదుట తమ హృదయములను క్రుమ్మరించిరి మరియు వారి హృదయ తలంపులను ఆయన యెరిగియుండెను.”13

మరియు “ప్రభువు యొక్క స్వరము వారి శ్రమలయందు వారికి ఇట్లు చెప్పెను: మీ తలలు పైకెత్తి ధైర్యము తెచ్చుకొనుము, ఏలయనగా మీరు నాతో చేసిన నిబంధనను నేనెరుగుదును; నేను నా జనులతో నిబంధన చేయుదును మరియు వారిని దాస్యము నుండి విడిపించెదను.

“మీ భుజములపై మోపబడిన భారములను నేను సడలించెదను, అందువలన మీరు మీ వీపులపై వాటి భారమును ఎరుగరు.”14

వారి భారములు “తేలిక చేయబడెను” మరియు “వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరిచెను మరియు వారు సంతోషముతోను సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి.”15

నిబంధనను పాటించేవారు ఓదార్పు, హెచ్చైన సహనము, ఉల్లాసము రూపంలో ఉపశమనాన్ని, వారు తేలికగా భావించేలా వారి భారాలు తేలిక చేయబడడాన్ని, చివరకు విడుదలను పొందారు.16

ఇప్పుడు, ఉపమానరీతిగా ఉన్న మన స్వంత సంచి గురించి మాట్లాడదాం.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పశ్చాత్తాపము, పాపము యొక్క రాళ్ళ భారము నుండి మనకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన బహుమానం ద్వారా దేవుని దయ, న్యాయము యొక్క భారమైన మరియు అధిగమించలేని అక్కరల నుండి మనకు ఉపశమనం కలిగిస్తుంది.17

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము క్షమించడానికి బలాన్ని పొందడాన్ని కూడా మనకు సాధ్యం చేస్తుంది, అది ఇతరుల నిరాదరణ కారణంగా మనం మోసే భారాన్ని వదిలించుకోవడానికి మనల్ని అనుమతిస్తుంది.18

కాబట్టి బాధకు, నొప్పికి లోబడిన మర్త్య శరీరాలతో పతనమైన లోకంలో జీవనం యొక్క భారాల నుండి రక్షకుడు ఏవిధంగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తారు?

తరచు, ఆ విధమైన ఉపశమనాన్ని ఆయన మన ద్వారా నిర్వహిస్తారు! ఆయన సంఘము యొక్క నిబంధన సభ్యులుగా, మనం “దుఃఖించు వారితో దుఃఖపడుటకు, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు”19 వాగ్దానం చేసాము. మనం “దేవుని సముదాయములోనికి వచ్చి, ఆయన జనులని పిలువబడి” నందువలన, “అవి తేలికగునట్లు ఒకరి భారములు ఒకరు భరించుటకు మనము ఇష్టపడుచున్నాము.”20

మన నిబంధన దీవెన ఏదనగా, దేవుని పిల్లలందరికి భౌతిక మరియు ఆత్మీయ ఉపశమనాన్ని అందించడంలో యేసు క్రీస్తుతో భాగస్వాములవడం. మనం ఒక మాధ్యమము వంటివారము, మన ద్వారా ఆయన ఉపశమనాన్ని అందిస్తారు.21

కాబట్టి, పక్షవాయువు గలవాని స్నేహితుల వలె, మనం “బలహీనులకు చేయూతనిస్తాము, కృంగిన హస్తములు పైకెత్తుతాము మరియు దుర్భలమైన మోకాళ్ళను బలపరుస్తాము.”22 మనం “ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుతాము.”23 మనం ఆవిధంగా చేసినప్పుడు, మనం ఆయనను తెలుసుకుంటాము, ఆయన వలె మారతాము మరియు ఆయన ఉపశమనాన్ని కనుగొంటాము.24

ఉపశమనం అంటే ఏమిటి?

బాధాకరమైన, కష్టమైన లేదా భారమైన ఒకదానిని తొలగించడం లేదా తేలిక చేయడం లేదా దానిని సహించడానికి కావలసిన బలము. మరొకరి స్థానాన్ని తీసుకొనే వ్యక్తిని అది సూచిస్తుంది. అది ఒక తప్పుకు న్యాయబద్ధమైన దిద్దుబాటు.25 ఆంగ్లో-ఫ్రెంచ్ పదం, పాత ఫ్రెంచ్ నుండి relever లేదా “పైకి లేవడం” అనే పదము మరియు లాటిన్ నుండి relevare లేదా “తిరిగి లేవడం”26 అనే పదము వస్తుంది.

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తే ఉపశమనం. మూడవ దినమున ఆయన తిరిగి లేచియున్నారని, ప్రియమైన మరియు అనంతమైన ప్రాయశ్చిత్తాన్ని నెరవేర్చారని, తన బాహువులు తెరచి నిలబడియున్నారని, మరలా లేచి, రక్షింపబడి మరియు ఉన్నతస్థితికి చేరి, మరింతగా ఆయన వలె మారే అవకాశాన్ని మనకు అందిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మనకు అందించే ఉపశమనం శాశ్వతమైనది.

ఆ మొదటి ఈస్టరు ఉదయాన దేవదూత చేత దర్శించబడిన స్త్రీల వలె, నేను “త్వరగా వెళ్ళి,” ఆయన లేచియున్నాడు అనే సందేశాన్ని “మహా ఆనందముతో” పంచుకోవాలని కోరుకుంటున్నాను.27 మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. లూకా 5:20.

  2. మార్కు 2:11.

  3. లూకా 5:25.

  4. లూకా 5:26.

  5. See D. Todd Christofferson, “The First Commandment First” (Brigham Young University devotional, Mar. 22, 2022), 2, speeches.byu.edu: “Our love of God elevates our ability to love others more fully and perfectly because we in essence partner with God in the care of His children” (emphasis added).

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవ. 2022, 95-98 చూడండి.

  7. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 96.

  8. మత్తయి 11:28–30.

  9. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 97.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము,” లియహోనా, మే 2019, 67.

  11. ఫిలిప్పీయులకు 4:13.

  12. మోషైయ 24:9.

  13. మోషైయ 24:12.

  14. మోషైయ 24:13-14; వివరణ చేర్చబడినది.

  15. మోషైయ 24:15.

  16. మోషైయ 24:13-14 చూడండి.

  17. ఆల్మా 34:14-16 చూడండి; మోషైయ 15:8-9 కూడా చూడండి.

  18. See Russell M. Nelson, “Four Gifts That Jesus Christ Offers to You” (First Presidency Christmas devotional, Dec. 2, 2018), broadcasts.ChurchofJesusChrist.org.“A second gift the Savior offers you is the ability to forgive. ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా, మిమ్మల్ని గాయపరచిన వారిని మరియు మీపట్ల వారి క్రూరత్వము కోసం ఎన్నడూ బాధ్యత వహించని వారిని మీరు క్షమించగలరు.

    “సాధారణంగా నిజాయితీతో, వినయముతో మీ క్షమాపణ కోరే వారిని క్షమించడం సులభము. కానీ ఏ విధంగానైనా మీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వారెవరినైనా క్షమించే సామర్థ్యాన్ని రక్షకుడు మీకు దయచేస్తారు. అప్పుడు వారి హానికరమైన చర్యలు మీ ఆత్మను ఇకపై నష్టపరచలేవు.”

  19. మోషైయ 18:9.

  20. మోషైయ 18:8.

  21. ఉపశమన సమాజము, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క స్త్రీల నిర్మాణము, “యాజకత్వానికి దైవికంగా ఏర్పాటు చేయబడిన అనుబంధముగా” ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా 1842, మార్చి 17న ఏర్పాటు చేయబడింది (Dallin H. Oaks, “The Keys and Authority of the Priesthood,” లియహోనా, May 2014, 51). క్రొత్త నిర్మాణానికి పేరును ఎంచుకోవడంలో, దయగలది అనే పదం పరిగణించబడింది, కానీ ఉపశమనం స్త్రీలకు నచ్చింది. నిర్మాణము యొక్క మొదటి అధ్యక్షురాలు ఎమ్మా స్మిత్ మరియు తరువాతి కాలంలో ఉపశమన సమాజము యొక్క రెండవ అధ్యక్షురాలిగా సేవ చేసిన దాని కార్యదర్శి ఎలైజా ఆర్. స్నో ఇలా వివరించారు, దయగలది అనేది ప్రఖ్యాత పదము—ఈనాటి సంస్థలతో ఖ్యాతిచెందింది—కానీ జనాదరణ పొందడం “మా నడిపింపు కాకూడదు.” ఉపశమనం అనే పదం వారి నియమిత కార్యాన్ని బాగా వర్ణిస్తుందని ఎమ్మా వివరించారు. “అసాధారణమైన దానిని మనం చేయబోతున్నాము … అసాధారణ సందర్భాలను, అత్యవసర పిలుపులను మనం ఆశిస్తున్నాము” (Emma Smith, in Nauvoo Relief Society Minute Book, Mar. 17, 1842, 12josephsmithpapers.org). వాస్తవానికి, ఉపశమన సమాజము యొక్క విధి ఎల్లప్పుడూ భౌతిక మరియు ఆత్మీయ ఉపశమనాన్ని అందించడమైయుంది. జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “సమాజము బీదలను ఉపశమింపజేయడానికి మాత్రమే కాదు, ఆత్మలను రక్షించడానికి కూడా ఉంది” (Nauvoo Relief Society Minute Book, June 9, 1842, 63 josephsmithpapers.org). కాబట్టి ఉపశమన సమాజము ఉపశమనాన్ని అందించడాన్ని కొనసాగిస్తుంది: “పేదరికము నుండి ఉపశమనం, అస్వస్థత నుండి ఉపశమనం; సందేహం నుండి ఉపశమనం, అజ్ఞానం నుండి ఉపశమనం—స్త్రీల ఆనందం మరియు పురోగతికి గల అడ్డంకులన్నిటి నుండి ఉపశమనం” (John A. Widtsoe, Evidences and Reconciliations, arr. G. Homer Durham, 3 vols. in 1 [1960], 308).

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5; హెబ్రీయులకు 12:12 కూడా చూడండి.

  23. గలతీయులకు 6:2.

  24. క్రొత్తగా ఏర్పాటు చేయబడిన ఉపశమన సమాజము యొక్క తొలి సమావేశాలలో ఒకదానిలో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ తల్లి లూసీ మాక్ స్మిత్ ఇలా అన్నారు, “మనమందరం పరలోకంలో కలిసి కూర్చోగలిగేలా మనం ఒకరినొకరం తప్పక ఆదరించాలి, ఒకరిపట్ల ఒకరం శ్రద్ధ చూపాలి, ఒకరినొకరం ఓదార్చుకోవాలి మరియు ఉపదేశం పొందాలి.” దీని గురించి చరిత్రకారులు జెన్నిఫర్ రీడర్ ఇలా వ్రాసారు, “ఉపశమనాన్ని అందించడానికి ఐక్య హేతువులో స్త్రీలు క్రీస్తుతో భాగస్వాములయ్యారు మరియు ఆవిధంగా చేయడంలో వారు ఆయన ఉపశమనాన్ని కనుగొన్నారు” (First: The Life and Faith of Emma Smith [2021], 130).

  25. See Merriam-Webster.com Dictionary, “relief.”

  26. See Dictionary.com, “relief.”

  27. మత్తయి 28:1–8 చూడండి.