సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము

యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి; ఆయన సువార్తను, ఆయన సంఘాన్ని ప్రేమించడానికి; మరియు జీవితకాలము నీతియుక్తమైన ఎంపికలు చేయడానికి సిద్ధపడేందుకు మీ పిల్లలకు సహాయపడండి.

ఒకనాడు, ఒక తండ్రి ఓ సాయంకాలం బిషప్రిక్కు సమావేశానికి వెళ్ళబోతున్నాడు. అతని నాలుగేళ్ళ కూతురు పైజామా ధరించి, మోర్మన్ గ్రంథ కథలు యొక్క ప్రతిని పట్టుకొని అతని ముందుకొచ్చింది.

“నువ్వు సమావేశానికి ఎందుకు వెళ్ళాలి?” అని అడిగిందామె.

“ఎందుకంటే నేను బిషప్రిక్కులో సలహాదారుడిని,” అని జవాబిచ్చాడతడు.

“కానీ నువ్వు మా నాన్నవి!” అని అతని కూతురు నిరసన తెలిపింది.

అతడు ఆమె ముందు మోకరించాడు. “చిట్టితల్లీ,” “నీ కోసం నేను చదవాలని, నువ్వు నిద్రపోవడానికి సహాయం చేయాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఈ రాత్రి నేను బిషప్పుకు సహాయం చేయాలి,” అన్నాడతడు.

“ఆయన నిద్రపోవడానికి సహాయం చేయడానికి బిషప్పుకు నాన్న లేరా?” అని అతని కూతురు బదులిచ్చింది.

ప్రతీరోజు యేసు క్రీస్తు యొక్క సంఘములో శ్రద్ధగా సేవచేసే అసంఖ్యాక సభ్యుల కొరకు మేము నిత్య కృతజ్ఞులము. మీ త్యాగము నిజంగా పవిత్రమైనది.

కానీ ఈ పాప అర్థం చేసుకున్నట్లుగా, దీనికి సమానంగా పవిత్రమైనది—ఒక తల్లి లేదా తండ్రి ఒక బిడ్డను పోషించడం గురించినది—భర్తీ చేయలేనిది ఏదో ఉంది. అది పరలోకపు నమూనాను ప్రతిబింబిస్తుంది.1 ఆయన పిల్లలు భూమిపై వారి తల్లిదండ్రుల చేత బోధించబడి, పోషించబడినప్పుడు మన పరలోక తండ్రి, మన దైవిక తండ్రి తప్పకుండా ఆనందిస్తారు.2

తల్లిదండ్రులారా, మీ పిల్లలను పెంచడానికి మీరు చేసే ప్రతీదాని కొరకు ధన్యవాదాలు. పిల్లలూ, మీ తల్లిదండ్రులను పెంచడానికి మీరు చేసే ప్రతీదాని కొరకు ధన్యవాదాలు, ఎందుకంటే ప్రతీ తల్లికి లేదా తండ్రికి తెలిసినట్లు, విశ్వాసం, నిరీక్షణ మరియు దాతృత్వము గురించి వారు మన నుండి నేర్చుకొనినంతగా తరచూ మనం మన పిల్లల నుండి నేర్చుకుంటాము!3

తల్లిదండ్రులు పవిత్ర విధిని కలిగియున్నారు

మన పరలోక తండ్రి ఒక బిడ్డను భూమి పైకి పంపిన ప్రతీసారి ఆయన ఎంత గొప్ప అపాయములో పడతారో మీరెప్పుడైనా ఆలోచించారా ? వీరు ఆయన ఆత్మ కుమారులు మరియు కుమార్తెలు. వారికి అపరిమితమైన సామర్థ్యం ఉంది. మంచితనం, మహిమ మరియు సత్యము యొక్క మహిమకరమైన వ్యక్తులవడానికి వారు ఉద్దేశించబడ్డారు. అయినప్పటికీ వారు పూర్తి నిస్సహాయులుగా, సహాయం కోసం ఏడవడం తప్ప ఏమీ చేయలేనివారిగా భూమిపైకి వస్తారు. నిజంగా వారు ఎవరో, వారు ఏమి కాగలరో అనే జ్ఞానముతో పాటు, దేవుని సన్నిధిలో వారు నివసించిన సమయాన్ని కూడా గుర్తుంచుకోలేరు. వారి చుట్టూ ఉన్నవారు—ప్రత్యేకించి, ఇంకా తమకైతాము విషయాలను తెలుసుకోవడానికి నిజాయితీ ప్రయత్నిస్తున్న వారి తల్లిదండ్రుల నుండి వారు ఏమి గమనిస్తారనే దానిపై ఆధారపడి జీవితం, ప్రేమ, దేవుడు మరియు ఆయన ప్రణాళిక గురించి వారి గ్రహింపును వారు ఏర్పరచుకుంటారు.

చిత్రం
క్రొత్తగా జన్మించిన శిశువు

దేవుడు తల్లిదండ్రులకి “ప్రేమలో మరియు నిజాయితీలో, వారి శారీరక మరియు ఆత్మీయ అవసరాలను నిరూపించుకొనుటకు, … వారికి బోధించుటకు … దేవుని యొక్క ఆజ్ఞలు దృష్టించి ఉండునట్లు వారి పిల్లలను పెంచు పవిత్ర విధిని ఇచ్చారు.”4

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అధిక బాధ్యతను భావించడానికి ఇది చాలు.

తల్లిదండ్రులందరికి నా సందేశమిదే:

ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.

నిశ్చయంగా ఆయన మీతో ఉన్నారు.

ఆయన మీ ప్రక్కన నిలబడతారు.

నీతియుక్తమైన ఎంపికలు చేయడానికి మీ పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి ఆయనే మీ బలము.

ఈ విశేషాధికారాన్ని, బాధ్యతను ధైర్యంగా, ఆనందంగా అంగీకరించండి. పరలోక దీవెనల యొక్క ఈ వనరును వేరెవరికి బదలాయించకండి. సువార్త విలువలు మరియు సూత్రాల చట్రం లోపల, అనుదినం తీసుకునే నిర్ణయాలలో మీ బిడ్డకు మార్గనిర్దేశం చేయవలసిన వారు మీరే. యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి; ఆయన సువార్తను, ఆయన సంఘాన్ని ప్రేమించడానికి; మరియు జీవితకాలము నీతియుక్తమైన ఎంపికలు చేయడానికి సిద్ధపడేందుకు మీ పిల్లలకు సహాయపడండి. వాస్తవానికి, తల్లిదండ్రుల కొరకు దేవుని ప్రణాళిక అదే.

సాతాను మిమ్మల్ని వ్యతిరేకిస్తాడు, దారితప్పిస్తాడు, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తాడు.

కానీ ప్రతీ బిడ్డ తనలో క్రీస్తు యొక్క వెలుగును కలిగియున్నాడు, అది పరలోక ప్రభావాన్ని అనుభవించడానికి వారిని అనుమతిస్తుంది. మరియు రక్షకుడు మీకు సహాయపడతారు, మార్గనిర్దేశం చేస్తారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆయన సహాయాన్ని కోరండి. ప్రభువు నొద్ద విచారించండి!

చిత్రం
ప్రభువైన యేసు క్రీస్తు

యేసు క్రీస్తు యౌవనుల బలముగా ఉన్నట్లే, యేసు క్రీస్తు తల్లిదండ్రుల బలముగా కూడా ఉన్నారు.

ఆయన ప్రేమను హెచ్చిస్తారు

మన పిల్లలకు బోధించడానికి, మార్గనిర్దేశం చేయడానికి వేరెవరో చాలా అర్హత కలిగియున్నారని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ఎంతగా మీరు సరిపోరని భావించినా, ప్రత్యేకంగా మిమ్మల్ని అర్హులనుగా చేసేదానిని మీరు కలిగియున్నారు: మీ బిడ్డ పట్ల మీ ప్రేమ.

ఒక బిడ్డ కొరకు తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలోని బలమైన శక్తులలో ఒకటి. ఈ భూమి మీద నిజంగా నిత్యమైనవి కాగల కొన్ని విషయాలలో అది ఒకటి.

ఇప్పుడు, మీ బిడ్డతో మీ అనుబంధము బహుశా ఆదర్శవంతమైనదిగా లేదని మీరు భావించవచ్చు. అక్కడే రక్షకుని శక్తి వస్తుంది. ఆయన రోగులను స్వస్థపరిచారు, ఆయన అనుబంధాలను స్వస్థపరచగలరు. ఆయన రొట్టెను, చేపలను అధికం చేసారు, ఆయన మీ ఇంటిలో ప్రేమను, ఆనందాన్ని అధికం చేయగలరు.

మీ పిల్లల పట్ల మీ ప్రేమ సత్యాన్ని బోధించడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన వాతావరణాన్ని కల్పిస్తుంది. మీ ఇంటిని ప్రార్థన, అభ్యాసము మరియు విశ్వాస మందిరముగా; ఆనందకరమైన అనుభవాల మందిరముగా, చెందియున్న స్థలముగా, దేవుని మందిరముగా చేయండి.5 “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క … శిష్యులందరికి ఆయన [అనుగ్రహించిన] [ఆయన] ప్రేమతో [మీరు] నింపబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి.”6

ఆయన చిన్న మరియు సాధారణమైన ప్రయత్నాలను అధికం చేస్తారు

తల్లిదండ్రులుగా మీరు కలిగియున్న మరొక బలము, అనుదిన, నిరంతర ప్రభావము కొరకు అవకాశము. స్నేహితులు, బోధకులు, మీడియాలో ప్రభావితం చేసేవారు వచ్చి పోతుంటారు. కానీ మీ బిడ్డ జీవితంలో మీరు క్రమమైన, స్థిరమైన ప్రభావం కాగలరు.

ప్రపంచంలో మీ పిల్లలు వినే ప్రముఖుల స్వరాలతో పోల్చితే మీ ప్రయత్నాలు చిన్నగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు పెద్దగా సాధించడం లేదని భావించవచ్చు. కానీ, “ప్రభువు చిన్న చర్య ద్వారా గొప్ప క్రియలను చేయగలడని” గుర్తుంచుకోండి.7 ఒక్క వాననీటి చుక్క మొక్కను వెంటనే పెరిగేలా చేయలేనట్లు, ఒక గృహ సాయంకాలము, ఒక సువార్త సంభాషణ లేదా ఒక మంచి ఉదాహరణ మీ బిడ్డ జీవితాన్ని క్షణంలో మార్చలేదు. కానీ, అప్పుడప్పుడు మీ పిల్లలకు అందించే అత్యధిక ఆత్మీయ ప్రభావం కంటే అనుదినం చేసే చిన్న ప్రయత్నాలు మీ పిల్లలను ఆత్మీయంగా బాగా పోషించగలవు.8

అదే ప్రభువు యొక్క విధానం. ఆయన మీతో, మీ బిడ్డతో మిక్కిలి నిమ్మళమైన స్వరంతో మాట్లాడతారు, కానీ ఉరుము వంటి స్వరముతో కాదు.9 ఆయన నయమానును “ఏదైనా ఒక గొప్ప కార్యము” చేత కాదు, కానీ పలుమార్లు స్నానము చేయడమనే సాధారణమైన చర్య ద్వారా స్వస్థపరిచారు.10 ఇశ్రాయేలీయులు అరణ్యములో పూరేడుల విందును ఆనందించారు, కానీ వారిని సజీవంగా ఉంచింది చిన్న మరియు సాధారణమైన మన్నా—వారి అనుదిన ఆహారము యొక్క అద్భుతము.11

సహోదర సహోదరీలారా, అనుదిన ఆహారము ఇంటి వద్ద బాగా తయారు చేయబడి, వడ్డించబడుతుంది. విశ్వాసము మరియు సాక్ష్యము అనేవి సామాన్యమైన, సహజ విధానాలలో, కొద్దికొద్దిగా, చిన్న మరియు సాధారణమైన క్షణాలలో, దైనందిన జీవితపు నిరంతర ప్రవాహంలో బాగా పెంపొందించబడతాయి.12

ప్రతీ క్షణం బోధనా క్షణమే. ఎంపికలు చేయడానికి ప్రతీ మాట మరియు చర్య ఒక మార్గదర్శి కాగలదు.13

మీ ప్రయత్నాలకు తక్షణ ప్రభావాలను మీరు చూడలేకపోవచ్చు. కానీ, ఆశ వదులుకోవద్దు. “అన్ని విషయములు సరైన సమయములో వచ్చును” అని ప్రభువు సెలవిచ్చారు. “కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు.”14 నిజంగా వారెవరో తెలుసుకోవడానికి దేవుని యొక్క అమూల్యమైన పిల్లలకు సహాయపడడం మరియు యేసు క్రీస్తు, ఆయన సువార్త, ఆయన సంఘము నందు వారి విశ్వాసాన్ని పెంపొందించడం కంటే గొప్ప కార్యము ఏముంటుంది? మీ స్థిరమైన ప్రయత్నాలను యేసు క్రీస్తు దీవిస్తారు మరియు అధికం చేస్తారు.

ఆయన బయల్పాటునిస్తారు

ప్రభువు తల్లిదండ్రులకు సహకరించే మరొక శక్తివంతమైన విధానము, వ్యక్తిగత బయల్పాటు అనే బహుమానం ద్వారా. తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయడానికి తన ఆత్మను క్రుమ్మరించడానికి ఆయన ఆతృతగా ఉన్నారు.

మీరు ఆత్మ పట్ల ప్రార్థనాపూర్వకంగా, సున్నితంగా ఉన్నప్పుడు, పొంచియున్న ప్రమాదాల గురించి ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తారు.15 మీ పిల్లల యొక్క బహుమానాలను, వారి బలాలను మరియు చెప్పలేని ఆందోళనలను ఆయన బయల్పరుస్తారు.16 మీ పిల్లలను ఆయన చూసేవిధంగా—వారి బాహ్య రూపాన్ని మించి, వారి హృదయాలలోకి చూడడానికి దేవుడు మీకు సహాయపడతారు.17

దేవుని సహాయంతో, దేవుడు మీ పిల్లలను అర్థం చేసుకున్నట్లుగా మీరు మీ పిల్లలను అర్థం చేసుకోవడాన్ని నేర్చుకోగలరు. వ్యక్తిగత బయల్పాటు ద్వారా మీ కుటుంబానికి మార్గనిర్దేశం చేస్తాననే దేవుని ప్రతిపాదనను అంగీకరించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రార్థనలలో ఆయన నడిపింపును కోరండి.18

ఒక గొప్ప మార్పు

బహుశా తల్లిదండ్రులకు యేసు క్రీస్తు అందించే అతి ముఖ్యమైన సహాయం, హృదయమందు “బలమైన మార్పు”.19 మనలో ప్రతీ ఒక్కరికి అవసరమైన అద్భుతం అది.

కాసేపు ఈ సందర్భాన్ని ఊహించుకోండి: మీరు సంఘంలో ఉన్నారు, కుటుంబాల గురించి ప్రసంగాన్ని వింటున్నారు. ప్రసంగీకుడు ఒక పరిపూర్ణ గృహము గురించి, అంతకంటే ఎక్కువగా పరిపూర్ణ కుటుంబం గురించి వివరిస్తున్నాడు. భార్యాభర్తలు ఎన్నడూ గొడవపడరు. ఇంటి వద్ద చదువుకోవలసిన సమయమైనప్పుడు మాత్రమే పిల్లలు లేఖనాలను చదవడం ఆపుతారు. నేపథ్యంలో “Love One Another (ఒకరినొకరు ప్రేమించండి)”20 అనే పాట సంగీతం మ్రోగుతోంది. స్నానాలగదిని శుభ్రం చేయడానికి అందరూ సంతోషంగా చేరడం గురించి ప్రసంగీకుడు చెప్పడానికి ముందు, మీరు అప్పటికే, “నా కుటుంబం నిరాశాజనకంగా ఉంది” అని ఆలోచిస్తుంటారు.

ప్రియమైన సహోదర సహోదరీలారా, సేదతీరండి! సమూహంలో ప్రతీఒక్కరు ఇలాగే ఆలోచిస్తున్నారు! వాస్తవం ఏమిటంటే, తల్లిదండ్రులందరూ తగినంత మంచిగా లేమని విచారిస్తున్నారు.

అదృష్టవశాత్తూ, తల్లిదండ్రులకు సహాయం చేయడానికి దైవిక వనరు ఉంది: అదే యేసు క్రీస్తు. మన హృదయమందు బలమైన మార్పుకు ఆయనే మూలము.

మీరు రక్షకునికి, ఆయన బోధనలకు దగ్గరగా వచ్చినప్పుడు, ఆయన మీ బలహీనతలను మీకు చూపిస్తారు. వినయముగల హృదయంతో యేసు క్రీస్తునందు మీరు నమ్మకముంచినట్లయితే, బలహీనమైన సంగతులను ఆయన బలమైనవిగా మారుస్తారు.21 ఆయన అద్భుతాల దేవుడు.

దానర్థం, మీరు, మీ కుటుంబం ఏ లోపం లేకుండా ఉంటారనా? కాదు. కానీ, మీరు మెరుగుపడతారు. రక్షకుని కృప ద్వారా, కొద్దికొద్దిగా, మీరు తల్లిదండ్రులకు అవసరమైన లక్షణాలలో ఎక్కువ శాతం వృద్ధిచేసుకుంటారు, అవి: దేవుని కొరకు, ఆయన పిల్లల కొరకు ప్రేమ, సహనము, నిస్వార్థము, క్రీస్తునందు విశ్వాసము మరియు నీతియుక్తమైన ఎంపికలు చేయడానికి ధైర్యము.

యేసు క్రీస్తు తన సంఘము ద్వారా సహకారాన్ని అందిస్తారు

యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని పెంపొందించే మన ప్రయత్నం గృహ కేంద్రీకృతమైనది, వ్యక్తిపై కేంద్రీకరించబడింది. మరియు అది సంఘముచేత సహకారమివ్వబడుతుంది. పవిత్ర లేఖనాలు మరియు ప్రవక్తల మాటలే కాకుండా, తల్లిదండ్రులు మరియు పిల్లలు నీతియుక్తమైన ఎంపికలు చేయడానికి సహాయపడేందుకు రక్షకుని సంఘము అనేక వనరులను అందిస్తుంది.

చిత్రం
యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శిని
  • యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శిని మీరు చేయవలసిన లేదా చేయకూడని వాటి జాబితా ఇవ్వదు. యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలపై కేంద్రీకరించబడిన ఎంపికలు చేయడానికి సహాయపడే నిత్య సత్యాలను అది బోధిస్తుంది. మీ పిల్లలతో కలిసి దానిని చదవండి. దాని గురించి వారిని మాట్లాడనివ్వండి. ఈ నిత్య మరియు దైవిక సత్యాలు వారి ఎంపికలను నడిపించేలా వారికి సహాయపడండి.22

  • FSY సమావేశాలు మరొక అద్భుతమైన వనరు. యౌవనులందరు హాజరవుతారని నేను ఆశిస్తున్నాను. మార్గదర్శకులుగా, సలహాదారులుగా ఈ సమావేశాలలో చేరాలని ఒంటరి వయోజనులను నేను ఆహ్వానిస్తున్నాను. FSY సమావేశాల నుండి మీ పిల్లలు ఇంటికి తెచ్చే ఆత్మీయ వేగాన్ని వృద్ధిచేయమని తల్లిదండ్రులను నేను ఆహ్వానిస్తున్నాను.

  • యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములోని పిల్లలు మరియు యువతకు బోధకులు, నాయకులు, మార్గదర్శకులు ఉన్నారు. విశ్వాసము మరియు సాక్ష్యమును వృద్ధిచేసి, సహకరించడానికి తరచు మీరు ఒక యౌవనుని జీవితంలో కీలకమైన క్షణంలో ప్రవేశిస్తారు. మీలో కొందరు ఒంటరి పెద్దలు. కొందరికి స్వంత పిల్లలు లేరు. దేవుని పిల్లలకు ఆనందకరమైన మీ సేవ దేవుని దృష్టిలో పవిత్రమైనది.23

అద్భుతంపై ఎన్నడూ ఆశ వదులుకోవద్దు

నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఒక బిడ్డలో విశ్వాసాన్ని పెంపొందించడం అనేది ఒక పువ్వు ఎదగడంలో సహాయపడడం వంటిది. పువ్వును పొడవుగా చేయడానికి మీరు కాడను పట్టుకొని లాగలేరు. త్వరగా పూచేలా చేయడానికి మీరు మొగ్గను బలవంతంగా విప్పలేరు. పువ్వును మీరు నిర్లక్ష్యం చేసి, అది ఆకస్మికంగా పెరగాలని లేదా వర్థిల్లాలని ఆశించలేరు.

యువతరం కోసం మీరు చేయగలిగింది మరియు తప్పక చేయవలసింది ఏమిటంటే, ప్రవహించే పరలోక నీటికి దారినిస్తూ, సమృద్ధిగా, పోషకమైన మట్టిని అందించడం. కలుపు మొక్కలను మరియు స్వర్గపు సూర్యకాంతికి అడ్డుగా ఉన్నవాటిని తొలగించడం. ఎదగడానికి సాధ్యమైనంత ఉత్తమ పరిస్థితులను కల్పించడం. ప్రేరేపించబడిన ఎంపికలు చేయడానికి యువతరాన్ని ఓర్పుతో అనుమతించండి మరియు దేవుడిని తన అద్భుతాన్ని చేయనివ్వండి. ఫలితం కేవలం మీకై మీరు సాధించగలిగిన దానికంటే ఎక్కువ అందంగా, ఎక్కువ అద్భుతంగా, ఎక్కువ ఆనందకరంగా ఉంటుంది.

పరలోక తండ్రి ప్రణాళికలో, కుటుంబాల అనుబంధాలు నిత్యత్వము కొరకు ఉద్దేశించబడ్డాయి. అందుకే తల్లిదండ్రులుగా మీరు ఎన్నడూ ఆశ వదులుకోవద్దు, గతంలో జరిగిన విషయాల గురించి మీరు గర్వించకపోయినా సరే.

గొప్ప వైద్యుడు మరియు రక్షకుడైన యేసు క్రీస్తుతో, ఎల్లప్పుడూ ఒక నూతన ప్రారంభం ఉండగలదు; ఆయన ఎల్లప్పుడూ నిరీక్షణనిస్తారు.

యేసు క్రీస్తే కుటుంబాల బలము.

యేసు క్రీస్తే యౌవనుల బలము.

యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము.

దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. “అతడు లేక ఆమె పిల్లలకు నీతి వాక్యాలను బోధి౦చాలనే తపన ప్రతీ తల్లిద౦డ్రులలోను ఉ౦టు౦ది. ఇది పరలోకపు త౦డ్రి యొక్క ప్రణాళికలోని అద్భుతములో భాగము. ఆయన తన పిల్లలు ఈ భూమిమీదకు వచ్చి, పరలోకములో ఉన్న కుటు౦బాల మాదిరిని పాటి౦చాలని కోరుకు౦టున్నారు. నిత్య రాజ్యములో, కుటు౦బాలు ముఖ్యమైన వ్యవస్థాగత విభాగము, మరియు భూమిపై కూడా అవి ప్రధాన విభాగముగా ఉ౦డాలని ఆయన ఉద్దేశము. ఈ భూలోకపు కుటు౦బాలు పరిపూర్ణమైనవి కానప్పటికీ, అవి పరలోకములో మనము అనుభవించిన ప్రేమకు దగ్గరగా ఉండే ఏకైక ప్రేమ---తల్లిదండ్రుల ప్రేమతో స్వాగతించుటకు దేవుని యొక్క పిల్లలకు మంచి అవకాశమిచ్చును. దేవుని సన్నిధికి మనల్ని తిరిగి నడిపించగల నైతిక విలువలు మరియు నిజమైన సూత్రములను కాపాడి, అందించుటకు కూడా కుటు౦బాలు శ్రేష్టమైన మార్గము” (హెన్రీ బి. ఐరింగ్, “దేవుని యొక్క కుటుంబాన్ని సమకూర్చుట,” లియహోనా, మే 2017, 20).

  2. అవును, దేవుని చిత్తము ఎల్లప్పుడూ “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” (మత్తయి 6:10) నెరవేరదు అని మనకు తెలుసు. దేవుని దానితో పోల్చితే, మర్త్య మాతాపితృత్వం ఖచ్చితంగా వెలవెలబోతుంది. నిశ్చయంగా ఆయన దానిని చూస్తారు. కుటుంబ సంబంధాలలో ఉండే దుఃఖాలు, వేదనలన్నిటిని విషయమై ఆయన తప్పక దుఃఖిస్తారు. అయినప్పటికీ, కుటుంబంపై ఆయన ఆశ వదులుకోలేదు. వదులుకోరు, ఎందుకంటే దేవుడు తన పిల్లల నిత్య గమ్యస్థానం కోసం అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మరియు ఆ ప్రణాళికలో కుటుంబము కేంద్రమైయున్నది.

  3. మత్తయి 18:1–5; మోషైయ 3:19 చూడండి.

  4. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”;” ChurchofJesusChrist.org; సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28 కూడా చూడండి.

  5. See “Learning at Home Is Founded on Relationships,” Teaching in the Savior’s Way: For All Who Teach in the Home and in the Church (2022), 30–31; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:8 కూడా చూడండి.

  6. మొరోనై 7:48.

  7. 1 నీఫై 16:29; ఆల్మా 37:6–7 కూడా చూడండి.

  8. Learning at Home Consists of Small, Simple, Consistent Efforts,” Teaching in the Savior’s Way, 31. చూడండి. అధ్యక్షులు డేవిడ్ ఒ. మెఖే ఇలా బోధించారు: “దాని గురించి మనం ఆలోచించవద్దు, ఎందుకంటే కొన్ని [విషయాలు] … చిన్నగా, అల్పంగా, ముఖ్యమైనవి కానట్లుగా కనిపిస్తాయి. దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలు అనేకం జరుగుతాయి. చిన్న చిన్న హృదయ స్పందనలతో మన శరీరాలు పనిచేస్తాయి మరియు మన జీవితాలు కొనసాగుతాయి. ఆ చిన్ని గుండె కొట్టుకోవడం ఆగిపోతే, ఈ ప్రపంచంలో జీవితం ఆగిపోతుంది. సూర్యుడు విశ్వంలో బలమైన శక్తి, కానీ [దాని] కిరణాలు చిన్నవిగా మన దగ్గరకు వస్తాయి కాబట్టి దాని దీవెనలు మనం పొందుతాము, వాటన్నిటిని కలిపితే అది మొత్తం ప్రపంచాన్ని సూర్యకాంతితో నింపుతుంది. నక్షత్రాలు చిన్నవైనప్పటికీ, వాటి మెరుపుచేత చీకటి రాత్రి ఆహ్లాదకరంగా చేయబడుతుంది; అలాగే ఈ గంట, ఈ నిమిషం ఇంట్లో చేసే చిన్న చిన్న క్రీస్తు-వంటి చర్యలతో నిజమైన క్రైస్తవ జీవితం నిండియుంటుంది” (Teachings of Presidents of the Church: David O. McKay [2003], 219).

  9. హీలమన్ 5:30 చూడండి.

  10. 2 రాజులు 5:9-14 చూడండి.

  11. నిర్గమకాండము 16 చూడండి.

  12. దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023, అనుబంధము (డిజిటల్ మాత్రమే) చూడండి.

  13. Learning at Home Can Be Planned but Also Spontaneous,” Teaching in the Savior’s Way, 31; 1 పేతురు 3:15 చూడండి.

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:32–33.

  15. మత్తయి 2:13 చూడండి.

  16. ఆల్మా 40:1; 41:1; 42:1 చూడండి.

  17. 1 సమూయేలు 16:7 చూడండి.

  18. 1 నీఫై 15:8 చూడండి.

  19. ఆల్మా 5:13.

  20. See “Love at Home,” Hymns, no. 308.

  21. ఈథర్ 12:27 చూడండి.

  22. “పిల్లల విషయంలో, వారికి ప్రవర్తనాపరమైన నిర్దేశాన్ని ఇచ్చే బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతీ బిడ్డ యొక్క స్వభావము, గ్రహింపు, తెలివితేటలు వారికి తెలుసు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతీఒక్కరితో మంచి భావ వ్యక్తీకరణను ఏర్పరచాలని, నిర్వహించాలని కోరుతూ జీవితకాలం గడుపుతారు. వారి పిల్లల మంచి కోసం, సంక్షేమం కోసం అంతిమ నైతిక నిర్ణయాలు చేసే మంచి స్థానంలో వారున్నారు” (James E. Faust, “The Weightier Matters of the Law: Judgment, Mercy, and Faith,” Ensign, Nov. 1997, 54).

  23. రెండు ఇతర వనరులు ప్రస్తావించడానికి యోగ్యమైనవి: ఈ సంవత్సరపు రండి, నన్ను అనుసరించండి వనరు యొక్క డిజిటల్ వెర్షన్‌లో “దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట” అనే శీర్షికతో ఒక క్రొత్త విభాగము ఉంది. బాప్తిస్మము, ఇతర నిబంధనలు మరియు విధుల కొరకు సిద్ధపడుటలో పిల్లలకు సహాయపడడానికి ఇది సరళమైన, గృహ-కేంద్రీకృత ఉపాయాలను సూచిస్తుంది. మరియు క్రొత్తగా సవరించబడిన Teaching in the Savior’s Way (రక్షకుని విధానములో బోధించుట)Home and Family (గృహము మరియు కుటుంబము)” అనే శీర్షికతో ఒక విభాగాన్ని కలిగియుంది, అది క్రీస్తు వంటి బోధనా సూత్రాలు గృహానికి ఎలా అన్వయించబడతాయో వివరిస్తుంది (30–31 పేజీలు చూడండి).