సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తుపై దృష్టిసారించండి
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తుపై దృష్టిసారించండి

ప్రభువైన యేసు క్రీస్తు మన సమస్యలకు పరిష్కారము, కానీ మనము ఆయనను చూడడానికి మన కన్నులను పైకెత్తి మన దృష్టిసారించాలి.

“పరిష్కారము కనుగొనలేని నీ సమస్యలపై ఎక్కువగా దృష్టిసారించకు,” అని మా నాన్న నాతో చెప్పేవారు.

మిక్కిలి కష్టమైన మన సమస్యలకు ప్రభువైన యేసు క్రీస్తే పరిష్కారమని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రత్యేకంగా, మనలో ప్రతీఒక్కరు ఎదుర్కొనేవి మరియు మన స్వంతంగా మనలో ఏ ఒక్కరు పరిష్కరించుకోలేని నాలుగు సమస్యలను ఆయన జయించారు.

  1. మొదటి సమస్య శారీరక మరణము. మనము దానిని ఆలస్యం చేయడానికి ప్రయత్నించవచ్చు లేదా దానిని నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ దానిని మన స్వంతంగా అధిగమించలేము. అయినప్పటికీ, యేసు క్రీస్తు మన కొరకు మరణాన్ని జయించారు, దాని ఫలితంగా మనమందరం ఒకరోజు పునరుత్థానము చెందుతాము.1

  2. రెండవ సమస్య శ్రమలు, కష్టమైన అనుభవాలు, విచారము, బాధ మరియు ఈ ప్రపంచంలోని అన్యాయమును కలిపియున్నది. యేసు క్రీస్తు వీటన్నిటిని జయించారు. ఆయనను అనుసరించడానికి ప్రయాసపడే వారికి, ఒకరోజు ఆయన “కన్నీళ్ళను తుడిచి వేసి,” అన్నిటిని సరిచేస్తారు.2 ఈలోగా, విశ్వాసము, ఆనందము మరియు సమాధానముతో మన శ్రమలను జయించడానికి ఆయన మనల్ని బలపరచగలరు.3

  3. మూడవ సమస్య పాపము నుండి కలిగే ఆత్మీయ మరణము. “మన సమాధానార్థమైన శిక్షను” 4 ఆయనపై తీసుకొనుట ద్వారా ఈ సమస్యను యేసు క్రీస్తు జయించారు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, రక్షకుని యందు మనము విశ్వాసము కలిగి, మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడి, బాప్తిస్మము వంటి ఆవశ్యకమైన విధుల ద్వారా తండ్రి మనకు ఇచ్చే నిబంధనను అంగీకరించి, అంతము వరకు సహించినట్లయితే, మన పాపముల పర్యవసానముల నుండి మనము స్వేచ్ఛగా చేయబడతాము.5

  4. నాల్గవ సమస్య మన పరిమితమైన, అపరిపూర్ణమైన స్వభావాలు. ఈ సమస్యకు కూడా యేసు క్రీస్తు పరిష్కారము కలిగియున్నారు. ఆయన కేవలము మన తప్పులను చెరిపివేసి మనల్ని తిరిగి నిర్దోషులుగా చేయరు. ఆయన “మనము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు … మన హృదయములందు గొప్ప మార్పు కలుగజేయగలరు.”6 మనము క్రీస్తు యొక్క కృప చేత పరిపూర్ణముగా చేయబడగలము మరియు ఒకనాటికి ఆయన వలే మారగలము.7

దురదృష్టవశాత్తు, చాలా తరచుగా మనము మన స్వంత సమస్యలపై చాలా ఎక్కువగా కేంద్రీకరించడం వలన పరిష్కారమైన, మన రక్షకుడైన యేసు క్రీస్తుపై మన దృష్టిని కోల్పోతాము. ఆ తప్పును మనము ఎలా మానగలము? ఆయనతో మరియు పరలోకమందున్న మన తండ్రితో చేయడానికి మనము ఆహ్వానించబడిన నిబంధనలందు జవాబున్నదని నేను నమ్ముతున్నాను.

నిబంధనల ద్వారా యేసు క్రీస్తుపై దృష్టిసారించుట

మన ఆసక్తిని, మన ఆలోచనలను మరియు మన క్రియలను క్రీస్తుపై కేంద్రీకరించడానికి మన నిబంధనలు మనకు సహాయపడతాయి. మనము “చేసిన నిబంధనలను [మనము] హత్తుకొన్నప్పుడు,” మనము “ప్రక్కన పెట్టాల్సిన ఈ లోకసంబంధమైన విషయములను” మరియు మనము శ్రద్ధగా వెదకాల్సిన “శ్రేష్ఠమైన [లోక] విషయాలను” మనము ఎక్కువ సులభంగా గుర్తించగలము.8

మోర్మన్ గ్రంథములో అమ్మోన్ యొక్క జనులు అదే చేసారు. వారు యేసు క్రీస్తు గురించి తెలుసుకొని, ఆయనపై వారి జీవితాలను కేంద్రీకరించడం ప్రారంభించినప్పుడు, వారు తమ యుద్ధ ఆయుధాలను పాతిపెట్టారు మరియు పరిపూర్ణముగా నిజాయితీగా ఉన్నారు మరియు “దేవుని యెడల వారి ఆసక్తి నిమిత్తము వారు ప్రత్యేకపరచబడ్డారు.”9

నిబంధనను పాటించుట ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతీదానిని మనం కోరడానికి మరియు ఆ ప్రభావాన్ని పారద్రోలే ప్రతీదానిని తిరస్కరించడానికి మనల్ని నడిపించాలి—“ఎందుకనగా, పరిశుద్ధాత్మ సమక్షంలో మనము యోగ్యులుగా ఉండగలిగినట్లయితే, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సమక్షంలో జీవించడానికి కూడా మనము యోగ్యులము కాగలము.”10 దయగల పదాలను ఉపయోగిస్తూ మన పదజాలాన్ని మార్చుకోవాలని దాని అర్థము కావచ్చు. ఆత్మీయంగా అనారోగ్యకరమైన అలవాట్లకు బదులుగా, వ్యక్తిగతంగా మరియు మన కుటుంబంతో అనుదిన ప్రార్థన మరియు లేఖన అధ్యయనము వంటివి, ప్రభువుతో మన అనుబంధాన్ని బలపరిచే క్రొత్త అలవాట్లను చేసుకోవాలని దాని అర్థము.

“బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసి— వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు. …

“దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి—మన శ్రమలు, శోధనలు మరియు బాధలను ఎదిరించడానికి మనల్ని బలపరిచే శక్తి”11 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.

ప్రతీ ఆదివారము సంస్కారమందు మన నిబంధనలను క్రొత్తవిగా చేసుకొనుట మనల్ని మనం పరీక్షించుకోవడానికి మరియు యేసు క్రీస్తుపై మన జీవితాలను తిరిగి కేంద్రీకరించడానికి గొప్ప అవకాశము.12 సంస్కారములో పాల్గొనుట ద్వారా, మనము “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకుంటామని”13 ప్రకటిస్తాము. ఎల్లప్పుడు అనే మాట ముఖ్యమైనది. అది మన జీవితంలో ప్రతీ భాగానికి రక్షకుని యొక్క ప్రభావాన్ని విస్తరింపజేస్తుంది. మనము ఆయనను కేవలము సంఘము వద్ద లేదా మన ఉదయకాల ప్రార్థనలందు మాత్రమే లేదా మనం కష్టాలలో ఉండి, మనకు ఏదైనా అవసరము వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకోము.

అవును, కొన్నిసార్లు మనము పరధ్యానంగా ఉంటాము. మనము మరచిపోతాము. మనము మన దృష్టిని కోల్పోతాము. కానీ మన నిబంధనలను క్రొత్తవిగా చేసుకొనుట అనగా, మనము ఎల్లప్పుడు మన రక్షకుడిని జ్ఞాపకముంచుకోవాలని, మనము వారమంతా ఆవిధంగా చేయాలని కోరతాము మరియు తరువాతి వారము సంస్కారములో పాల్గొని మరలా మనము ఒడంబడిక చేసుకొని, ఆయనపై తిరిగి దృష్టిసారిస్తాము.

మన గృహాలలో యేసు క్రీస్తుపై దృష్టిసారించుట

స్పష్టంగా, యేసు క్రీస్తుపై దృష్టిసారించుట, ఒక ఆదివారము సంఘము వద్ద జరిగే ప్రోత్సాహకార్యక్రమం కంటే ఎక్కువగా ఉండాలి. 2018లో అధ్యక్షులు నెల్సన్ రండి, నన్ను అనుసరించండి పరిచయం చేసినప్పుడు, “ఒక గృహ కేంద్రీకృత సంఘము కొరకు ఇది సమయము” అని ఆయన అన్నారు.14 మనము “[మన] గృహమును విశ్వాస మందిరముగా” మరియు “సువార్తను నేర్చుకొనుటకు కేంద్రముగా మార్చాలని” ఆయన చెప్పారు. మనము అలా చేసిన యెడల, ఆయన మనకు నాలుగు అద్భుతమైన వాగ్దానాలను చేసారు.15

మొదటి వాగ్దానము:మీ సబ్బాతు దినములు ఆనందకరంగా ఉంటాయి.” అది మనం మన రక్షకునికి దగ్గరయ్యే రోజు అవుతుంది. పెరూ నుండి ఒక యువతి చెప్పినట్లుగా, “ప్రభువు యొక్క దినము నేను ప్రభువు నుండి ఎక్కువగా జవాబులు పొందే దినము.”

రెండవ వాగ్దానము:మీ పిల్లలు రక్షకుని బోధనలు నేర్చుకోవడానికి మరియు జీవించడానికి ఉత్సాహపడతారు.” ఈ కారణం వలన “మనము క్రీస్తు గురించి మాట్లాడతాము, మనము క్రీస్తునందు ఆనందిస్తాము, [మరియు] మనము క్రీస్తు గురించి బోధిస్తాము … కావున మన సంతానం వారి పాపనివృత్తి కొరకు వారు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకుంటారు.”16

ఒకరోజు మన కుమారుడు పని కొరకు బయటకు వెళ్ళినప్పుడు లేదా కొండలపైకి ఎక్కడానికి లేదా ఈనస్ చేసినట్లుగా అడవులలోని మృగాలను వేటాడడానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు గురించి మనము బోధించిన దానిని మరియు సువార్తను జీవించుట వలన కలిగే ఆనందమును అతడు జ్ఞాపకముంచుకొనునట్లు దీనిని మనము చేస్తాము. ఏమి జరుతుందో ఎవరికి తెలుసు? “నీ పాపములు క్షమింపబడినవి మరియు నీవు ఆశీర్వదింపబడుదువు” 17 అని చెప్పే ప్రభువు యొక్క స్వరమును అతడు వినగలిగేలా యేసు క్రీస్తు వైపు తిరిగే ఆత్మీయ ఆకలిని అతడు చివరకు అనుభవించే రోజు అది కావచ్చు.

మూడవ వాగ్దానము:మీ జీవితంలో మరియు మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తగ్గిపోతుంది.” ఎందుకు? ఎందుకనగా మనము యేసు క్రీస్తుపై ఎంత ఎక్కువ దృష్టిసారిస్తామో, అంత ఎక్కువగా పాపం దాని ఆకర్షణను కోల్పోతుంది.18 మన గృహాలు రక్షకుని యొక్క వెలుగుతో నింపబడినప్పుడు, అపవాది యొక్క చీకటికి చాలా తక్కువ స్థలముంటుంది.

నాల్గవ వాగ్దానము: “మీ కుటుంబములో మార్పులు నాటకీయంగా, బలపరచేవిగా ఉంటాయి.” ఎందుకు? ఎందుకనగా యేసు క్రీస్తు తెచ్చే మార్పు “ఒక బలమైన మార్పు.”19. ఆయన మన స్వభావాలను మార్చగలరు; మనము “నూతన సృష్టి కాగలము.”20 దేవుని యొక్క పిల్లలందరి కొరకు ఆయన శుద్ధమైన ప్రేమతో నింపబడి, క్రమంగా మనము రక్షకుని వలె ఎక్కువగా మారతాము.

ఈ వాగ్దానములు వారి జీవితాలలో మరియు వారి కుటుంబాలలో నెరవేర్చబడాలని ఎవరు కోరుకోరు? వాటిని పొందడానికి మనము చేయాల్సినదేమిటి? జవాబు ఏమనగా, మన గృహములు విశ్వాస మందిరముగా మరియు సువార్తను నేర్చుకొనుటకు కేంద్రముగా మార్చబడాలి. కాబట్టి దీనిని మనం ఎలా చేస్తాము? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై దృష్టిసారిస్తూ, వారిని మన గృహములో అత్యంత ముఖ్యమైన ప్రభావమైన మన కుటుంబ జీవితం యొక్క కేంద్రముగా చేయుట ద్వారా.

లేఖనములలో కనుగొనబడినట్లుగా, క్రీస్తు యొక్క మాటలను మీ జీవితంలో అనుదిన భాగముగా చేయుట ద్వారా మీరు ప్రారంభించాలని నేను సూచించనా? లేఖన అధ్యయనమునకు పరిపూర్ణమైన విధానమేది లేదు. అది 5 లేదా 10 నిముషాలు కావచ్చు---లేదా మీకు సాధ్యమైతే ఎక్కువసేపు కావచ్చు. అది ఒక అధ్యాయము లేదా రోజుకు కొన్ని వచనాలు కావచ్చు. కొన్ని కుటుంబాలు పాఠశాలకు లేదా పనికి వెళ్ళకముందు ఉదయకాలము అధ్యయనం చేయడానికి ఇష్టపడతాయి. మిగిలినవారు రాత్రివేళ వారు నిద్రపోయే ముందు చదవడానికి ఇష్టపడతారు. కొందరు యౌవన దంపతులు, పని నుండి ఇంటికి వెళ్ళే ముందు వ్యక్తిగతంగా చదువుతామని, తరువాత వారి అంతర్‌జ్ఞానాన్ని సందేశం ద్వారా పంచుకుంటామని, ఆవిధంగా వారి వ్యాఖ్యానాలు మరియు చర్చలు వ్రాయబడి ఉంటాయని నాతో చెప్పారు.

రండి, నన్ను అనుసరించండి లేఖనాల నుండి వ్యక్తులు మరియు కుటుంబాలు సువార్త సూత్రములు నేర్చుకోవడానికి అనేక ప్రోత్సహ కార్యక్రమ సూచనలు మరియు వనరులను అందిస్తుంది. బైబిలు వీడియోలు మరియు మోర్మన్ గ్రంథ వీడియోలు కూడా మీ కుటుంబానికి లేఖనాలను ఎక్కువ చేరువగా చేయగల విలువైన సాధనాలు. యువత మరియు పిల్లలు లేఖనాలలో చిరస్మరణీయమైన కథల చేత తరచుగా ప్రేరేపించబడతారు. వారికి సేవ, సుగుణము, విధేయత, సహనము, పట్టుదల, వ్యక్తిగత బయల్పాటు, దాతృత్వము, వినయము మరియు యేసు క్రీస్తునందు విశ్వాసము యొక్క మాదిరులు అవసరమైనప్పుడు, ఈ కథలు మరియు అవి బోధించే సువార్త సూత్రములు నమ్మకస్థులైన స్నేహితుల వలె మీ పిల్లలతో నిలిచి ఉంటాయి. కాలక్రమేణా, దేవుని యొక్క వాక్యమును విందారగించే మీ స్థిరత్వము మీ పిల్లలు రక్షకునికి మరింత దగ్గరగా ఎదగడానికి సహాయపడుతుంది. మునుపెన్నడూ లేనివిధంగా వారు ఆయనను తెలుసుకుంటారు.

ప్రభువైన యేసు క్రీస్తు ఈ రోజు జీవిస్తున్నారు. మన జీవితాలలో ఆయన చురుకుగా, రోజువారీ ఉనికిని కలిగియుంటారు. ఆయనే మన సమస్యలకు పరిష్కారము, కానీ మనము ఆయనను చూడడానికి మన కన్నులను పైకెత్తి మన దృష్టిసారించాలి. “భయపడకుడి, సందేహించకుడి; ప్రతి ఆలోచన యందును నా వైపు చూడుడి”21 అని ఆయన అన్నారు. మనము ఆయనపై మరియు పరలోకమందున్న మన తండ్రిపై మన దృష్టికేంద్రీకరించి, వారితో నిబంధనలు చేసి, పాటించి, మన గృహములో మరియు కుటుంబంలో వారిని అతి ముఖ్యమైన ప్రభావంగా చేసినప్పుడు, అధ్యక్షులు నెల్సన్ ఊహించిన జనుల వలె మనము మారతాము: “ప్రభువు మళ్ళీ వచ్చినప్పుడు, ఆయనను స్వీకరించడానికి సమర్థులుగా, సిద్ధంగా ఉండి, అర్హులైన జనులు, ఈ పడిపోయిన ప్రపంచానికి పైగా ఇప్పటికే యేసు క్రీస్తును ఎన్నుకున్న జనులు, యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన, పవిత్రమైన చట్టాలను జీవించడానికి వారి కర్తృత్వము బట్టి సంతోషించే జనులుగా మారతాము.”22 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.