సర్వసభ్య సమావేశము
నిబంధనల ద్వారా దేవుని శక్తి పొందుట
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


నిబంధనల ద్వారా దేవుని శక్తి పొందుట

బాప్తిస్మము నుండి దేవాలయానికి మరియు జీవితమంతటా మీరు నిబంధన బాటలో నడుస్తున్నప్పుడు, సహజమైన ప్రపంచపు ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి శక్తిని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.

గత నవంబరులో, బెలెమ్ బ్రెజిల్ దేవాలయాన్ని ప్రతిష్ఠించే విశేషాధికారాన్ని నేను పొందాను. ఉత్తర బ్రెజిల్‌లో సంఘము యొక్క ప్రతిష్ఠిత సభ్యులతో ఉండడం ఆనందకరము. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెజాన్ నదిని కలిపియున్న ప్రాంతానికి ప్రవేశద్వారం బెలెమ్ అని ఆ సమయంలో నేను తెలుసుకున్నాను.

నది ఎంత బలమైనదైనప్పటికీ, సంవత్సరానికి రెండుసార్లు అసహజమైనదిగా అనిపించేదేదో జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి సమరేఖలోకి వచ్చినప్పుడు, సహజంగా ఉండే నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా నదిపైకి శక్తివంతమైన ఆటుపోట్లు ప్రవహిస్తాయి. ప్రవాహానికి ఎదురుగా 6 మీటర్ల ఎత్తైన అలలు1 50 కిలోమీటర్ల దూరం2 ప్రయాణించినట్లు నమోదు చేయబడింది. సాధారణంగా బలమైన ఆటుపోట్లుగా పిలువబడే ఈ దృశ్యం అది చేసే పెద్ద శబ్దం కారణంగా స్థానికంగా pororoca (పొరొరొకా) లేదా “మహా గర్జన” అని సూచించబడుతుంది. బలమైన అమెజాన్ కూడా తప్పక పరలోక శక్తులకు లోబడాలని మనం సరిగ్గా నిశ్చయించగలము.

అమెజాన్ వలె, మన జీవితాల్లో మనం సహజ ప్రవాహాన్ని కలిగియున్నాము; మనం సహజంగా వచ్చేదానిని చేసుకుంటూ పోతాము. అమెజాన్ వలె, పరలోక సహాయముతో మనం అసహజమైన వాటిని చేయగలము. ఎంతైనా, వినయంగా, సాత్వికంగా ఉండడం లేదా మన చిత్తాన్ని దేవునికి లోబరిచేందుకు సమ్మతించడం వంటివి మనకు సహజమైనవి కావు. అయినప్పటికీ, ఆవిధంగా చేయడం వలన మనం మార్పు చెందగలము, దేవుని సన్నిధిలో నివసించడానికి తిరిగి వెళ్ళగలము మరియు మన నిత్య గమ్యాన్ని సాధించగలము.

అమెజాన్‌లా కాకుండా, మనం పరలోక శక్తులకు లోబడతామా లేదా “ప్రవాహంతో పాటు పోతామా”3 అని మనం ఎంచుకోగలము. ప్రవాహానికి ఎదురు వెళ్ళడం కష్టమైనది కావచ్చు. కానీ మనం “పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లోబడి” ప్రకృతి సంబంధియైన మనుష్యుని యొక్క స్వార్థపూరిత ఉద్దేశ్యాలను విసర్జించినప్పుడు,4 మన జీవితాల్లో రక్షకుని యొక్క మార్పుచెందించు శక్తిని, అనగా కష్టమైన వాటిని చేయడానికి శక్తిని మనం పొందగలము.

దీనిని ఎలా చేయాలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధించారు. “బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసే—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి … పతనమైన ఈ లోకపు ఆకర్షణలకు పైగా మనల్ని [పైకెత్తడానికి] యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు”5 అని ఆయన వాగ్దానమిచ్చారు. మరొక మాటలలో, మనం దేవుని శక్తిని పొందగలము, కానీ పవిత్ర నిబంధనల ద్వారా ఆయనతో మనం చేరినప్పుడు మాత్రమే.

భూమి సృష్టించబడకముందు, ఒక సంవిధానముగా దేవుడు నిబంధనలను ఏర్పాటుచేసారు, వాటి ద్వారా మనల్నిమనం ఆయనతో ఏకం చేసుకుంటాము. నిత్యమైన, మార్పుచెందని చట్టముపై ఆధారపడి, ఆయన మార్పుచేయజాలని షరతులను నిర్దేశించారు, తద్వారా మనం మార్చబడ్డాము, రక్షించబడ్డాము మరియు ఉన్నతస్థితి పొందాము. ఈ జీవితంలో, యాజకత్వ విధులలో పాల్గొనడం ద్వారా మరియు దేవుడు మనల్ని చేయమని అడిగినవి చేస్తామని వాగ్దానం చేయడం ద్వారా మనం ఈ నిబంధనలు చేస్తాము, బదులుగా దేవుడు మనకు నిర్దిష్టమైన దీవెనలు వాగ్దానం చేస్తారు.6

నిబంధన అనేది ఒక ప్రతిజ్ఞ, దానికోసం మనం సిద్ధపడాలి, దానిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరియు పూర్తిగా గౌరవించాలి.7 దేవునితో నిబంధన చేయడం మామూలుగా వాగ్దానం చేయడం కంటే భిన్నమైనది. మొదటిది, యాజకత్వ అధికారము అవసరము. రెండవది, బలహీనమైన వాగ్దానం సహజ ప్రవాహపు ఆకర్షణలకు పైగా మనల్ని పైకెత్తడానికి సంబంధిత బలం కలిగియుండదు. నిబంధనను నెరవేర్చడానికి మనకై మనం నిజంగా కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు మాత్రమే మనం దానిని చేస్తాము.8 ప్రత్యేకించి నిబంధనను మన గుర్తింపుకు కేంద్రంగా చేసుకున్నప్పుడు, మనం దేవుని యొక్క నిబంధన సంతానముగా మరియు ఆయన రాజ్యానికి వారసులుగా అవుతాము.

నిబంధన బాట అనే పదము నిబంధనల వరుసను సూచిస్తుంది, తద్వారా మనం క్రీస్తు నొద్దకు వస్తాము మరియు ఆయనతో మన బంధాన్ని బలపరచుకుంటాము. ఈ నిబంధన బంధము ద్వారా, మనం ఆయన నిత్య శక్తిని పొందుతాము. ఆ బాట యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు పశ్చాత్తాపముతో ప్రారంభమవుతుంది, తర్వాత బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందడం ఉంటాయి.9 యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ బాటలో ఎలా ప్రవేశించాలో మనకు చూపారు.10 మార్కు మరియు లూకాలోని క్రొత్త నిబంధన సువార్త వృత్తాంతాల ప్రకారము, యేసు బాప్తిస్మమప్పుడు పరలోక తండ్రి సూటిగా ఆయనతో, “నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని” చెప్పారు. బాప్తిస్మము ద్వారా నిబంధన బాటపై మనం ప్రవేశించినప్పుడు, మనలో ప్రతీఒక్కరితో పరలోక తండ్రి అలాగే అనడాన్ని నేను ఊహించగలను: “నీవు నా ప్రియమైన బిడ్డవు, నీయందు నేనానందించుచున్నాను. ముందుకు సాగుము.”11

బాప్తిస్మమప్పుడు మరియు మనం సంస్కారములో పాలుపొందుతున్నప్పుడు,12 మనపై యేసు క్రీస్తు యొక్క నామాన్ని తీసుకోవడానికి సమ్మతిస్తున్నట్లు మనం సాక్ష్యమిస్తాము.13 ఈ సందర్భంలో, “నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు”14 అనే పాత నిబంధన ఆజ్ఞపై మనం శ్రద్ధ చూపుదాం. ప్రస్తుత కాలంలో, ఇది ప్రభువు యొక్క నామాన్ని అగౌరవంగా ఉపయోగించడానికి వ్యతిరేకంగా ఒక నిషేధం వలె వినిపిస్తుంది. ఆజ్ఞలో అది కలిపియుంది, కానీ దాని ఆదేశం ఇంకా చాలా లోతైనది. “ఉచ్ఛరించడం” అని అనువదించబడిన హెబ్రీయ పదానికి అర్థము “పైకెత్తడం” లేదా ఒకరు ఒక జెండాను “మోసుకెళ్ళడం”, అది దానిని పట్టుకున్న వ్యక్తిని ఒక సమూహంతోపాటుగా లేదా వ్యక్తిగా గుర్తిస్తుంది.15 “వ్యర్థము” అని అనువదించబడిన పదానికి అర్థము “శూన్యము” లేదా “మోసము.”16 ఆ విధంగా యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అనే ఆజ్ఞకు అర్థము, “మీరు ఆయనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఉద్దేశిస్తే తప్ప, మిమ్మల్ని మీరు యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా గుర్తించరాదు.”

నిబంధనల ద్వారా మనం ఉద్దేశపూర్వకంగా మరియు క్రమంగా యేసు క్రీస్తు నామాన్ని మనపై తీసుకున్నప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాము మరియు ఆయనకు సరైన ప్రాతినిధ్యం ఇస్తాము. నిబంధన బాటపై నిలిచేందుకు మన నిబంధనలు మనకు శక్తినిస్తాయి, ఎందుకంటే యేసు క్రీస్తుతో మరియు మన పరలోక తండ్రితో మన బంధం మారింది. నిబంధనలపై ఆధారపడిన బంధం చేత మనం వారితో సంబంధం కలిగియున్నాము.

నిబంధన బాట దేవాలయ వరము వంటి దేవాలయ విధులకు దారితీస్తుంది.17 వరము అనేది పవిత్ర నిబంధనలకు దేవుని యొక్క బహుమానము, అది మనల్ని మరింత సంపూర్ణంగా ఆయనతో జతచేస్తుంది. వరములో మనము మొదట, దేవుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తామని; రెండవది, విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో పశ్చాత్తాపపడతామని; మూడవది, యేసు క్రీస్తు సువార్తను జీవిస్తామని నిబంధన చేస్తాము. ఆయన యందు విశ్వాసాన్ని అభ్యసించడం, మనం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందినప్పుడు దేవునితో నిబంధనలు చేయడం, మన జీవితాలంతటా ఆ నిబంధనలను పాటించడం, దేవుడిని మరియు పొరుగువారిని ప్రేమించమనే రెండు గొప్ప ఆజ్ఞలను జీవించడానికి ప్రయత్నించడం ద్వారా మనం దీనిని చేస్తాము. నాల్గవది, పవిత్రత యొక్క చట్టాన్ని పాటిస్తామని మరియు ఐదవది, ప్రభువు మనల్ని దీవించి ఇచ్చే ప్రతీదానిని ఆయన సంఘాన్ని నిర్మించడానికి సమర్పిస్తామని మనం నిబంధన చేస్తాము.18

దేవాలయ నిబంధనలు చేయడం మరియు పాటించడం ద్వారా, మనం ప్రభువు యొక్క ఉద్దేశ్యాల గురించి ఎక్కువగా తెలుసుకుంటాము మరియు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందుతాము.19 మన జీవితాల కొరకు మనం నిర్దేశాన్ని పొందుతాము. మనం మరింత భక్తిగల శిష్యులవుతాము, ఆవిధంగా మనం శాశ్వతంగా అజ్ఞానులైన పిల్లలుగా మిగిలిపోము.20 బదులుగా, మనం ఒక నిత్య దృష్టితో జీవిస్తాము మరియు దేవునికి, ఇతరులకు సేవచేయడానికి మరింత ప్రేరేపించబడతాము. మర్త్యత్వంలో మన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి అధిక సామర్థ్యాన్ని మనం పొందుతాము. చెడు నుండి మనం రక్షించబడతాము,21 శోధనను ఎదుర్కోవడానికి మరియు మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడడానికి మనం అధిక శక్తిని పొందుతాము.22 మనం తప్పు చేసినప్పుడు, దేవునితో మన నిబంధనల యొక్క జ్ఞాపకము తిరిగి ఆ బాటలో వెళ్ళడానికి మనకు సహాయపడుతుంది. దేవుని శక్తితో సంబంధం కలిగియుండడం ద్వారా, మనం మన స్వంత Pororoca (పొరొరొకా)గా మారతాము, మన జీవితాలంతటా మరియు నిత్యత్వములోనికి, ప్రపంచపు ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళగలుగుతాము. చివరకు మన గమ్యస్థానాలు మారతాయి, ఎందుకంటే నిబంధన బాట ఉన్నతస్థితికి మరియు నిత్యజీవానికి నడిపిస్తుంది.23

బాప్తిస్మపు తొట్టెలలో మరియు దేవాలయాల్లో చేయబడిన నిబంధనలను పాటించడం మర్త్యత్వపు శ్రమలను, హృదయవేదనలను తట్టుకోవడానికి మనకు బలాన్ని కూడా అందిస్తుంది.24 ఈ నిబంధనలతో కలిసిన సిద్ధాంతము మన మార్గాన్ని తేలిక చేస్తుంది మరియు నిరీక్షణను, ఓదార్పును, శాంతిని అందిస్తుంది.

మా నానమ్మ, తాతయ్యలు లీనా సోఫియా మరియు మాట్స్ లీండర్ రెన్‌లండ్ 1912లో ఫిన్‌లాండ్‌లో సంఘమందు చేరినప్పుడు, వారి బాప్తిస్మపు నిబంధన ద్వారా దేవుని శక్తిని పొందారు. ఫిన్‌లాండ్‌లో సంఘము యొక్క మొదటి శాఖలో భాగమైనందుకు వారు సంతోషించారు.

ఐదేళ్ళ తర్వాత, వారి పదియవ బిడ్డతో లీనా గర్భిణీగా ఉన్నప్పుడు లీండర్ క్షయ రోగముతో మరణించాడు. ఆ బిడ్డయైన మా నాన్న, లీండర్ మరణించిన రెండు నెలల తర్వాత జన్మించారు. క్రమంగా లీనా తన భర్తనే కాకుండా ఆమె పదిమంది పిల్లల్లో ఏడుగురిని సమాధి చేసింది. బలహీనమైన విధవరాలిగా ఆమె శ్రమించింది. 20 సంవత్సరాలు ఆమె ఒక్క రాత్రి కూడా సరిగ్గా విశ్రమించలేదు. పగటిపూట, తన కుటుంబానికి ఆహారాన్ని సంపాదించడానికి ఆమె పెనుగులాడేది. రాత్రిపూట, మరణిస్తున్న కుటుంబ సభ్యులను ఆమె చూసుకొనేది. ఆమె ఎలా ఎదుర్కొన్నదో ఊహించడం కష్టం.

లీనా పట్టుదలతో పనిచేసింది, ఎందుకంటే చనిపోయిన తన భర్త మరియు పిల్లలు నిత్యత్వములో తనవారు కాగలరని ఆమెకు తెలుసు. నిత్య కుటుంబాలతో కలిపి, దేవాలయ దీవెనల సిద్ధాంతము ఆమెకు శాంతినిచ్చింది, ఎందుకంటే ఆమె ముద్రణాశక్తిని నమ్మింది. మర్త్యత్వములో ఉన్నప్పుడు, ఆమె తన వరమును పొందలేదు లేదా లీండర్‌తో ముద్రించబడలేదు, కానీ ఆమె జీవితంలో లీండర్ ముఖ్యమైన ప్రభావంగా మరియు భవిష్యత్తు కోసం ఆమె గొప్ప నిరీక్షణలో భాగంగా నిలిచాడు.

1938 లో, లీనా మరణించిన తన కుటుంబ సభ్యులు, ఫిన్‌లాండ్ నుండి అంతకుముందు సమర్పించిన పేర్లలో కొంతమంది కోసం దేవాలయ విధులు నిర్వహించబడేలా సమాచారాన్ని సమర్పించింది. ఆమె చనిపోయిన తర్వాత, ఆమె కోసం, లీండర్ మరియు మరణించిన ఆమె పిల్లల కోసం ఇతరుల చేత దేవాలయ విధులు నిర్వహించబడ్డాయి. ప్రాతినిధ్యం వహించువారి చేత ఆమె వరము పొందింది, లీనా మరియు లీండర్ ఒకరితో ఒకరు ముద్రింపబడ్డారు, మరణించిన వారి పిల్లలు మరియు మా నాన్న వారితో ముద్రింపబడ్డారు. ఇతరుల వలె, లీనా “ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి … వందనముచేసి, [మరియు]ఒప్పుకొని… విశ్వాసముగలదై మృతినొందింది.”25

అంతకుముందే తన జీవితంలో ఆమె ఈ నిబంధనలను చేసినట్లుగా లీనా జీవించింది. ఆమె బాప్తిస్మము మరియు సంస్కారపు నిబంధనలు ఆమెను రక్షకునితో జతచేసాయని ఆమెకు తెలుసు. “[విమోచకుని] పరిశుద్ధ స్థలంలో ఉండాలనే సున్నితమైన ఆమె కోరిక [ఆమె] దుఃఖిత హృదయానికి నిరీక్షణనిచ్చింది.”26 తన జీవితంలో విషాదాలను అనుభవించడానికి ముందే నిత్య కుటుంబాల గురించి ఆమె తెలుసుకోవడాన్ని దేవుని యొక్క గొప్ప కనికరములలో ఒకటిగా లీనా పరిగణించింది. నిబంధన ద్వారా ఆమె తన సవాళ్ళు మరియు కష్టాల యొక్క కృంగజేసే ప్రభావాన్ని సహించడానికి మరియు జయించడానికి దేవుని శక్తిని పొందింది.

బాప్తిస్మము నుండి దేవాలయానికి మరియు జీవితమంతటా మీరు నిబంధన బాటలో నడుస్తున్నప్పుడు, సహజమైన ప్రపంచపు ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి శక్తిని—నేర్చుకోవడానికి శక్తిని, పశ్చాత్తాపపడడానికి శక్తిని, శుద్ధిచేయబడడానికి శక్తిని మరియు మీరు జీవితపు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు నిరీక్షణ, ఓదార్పు, ఆనందాన్ని కనుగొనేందుకు శక్తిని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేకించి మీ జీవితంలో దేవాలయం అత్యంత ప్రధానమైనప్పుడు, అపవాది యొక్క ప్రభావానికి వ్యతిరేకంగా మీకు, మీ కుటుంబానికి రక్షణను నేను వాగ్దానం చేస్తున్నాను.

మీరు క్రీస్తు నొద్దకు వచ్చి, నిబంధన ద్వారా ఆయనతో మరియు మన పరలోక తండ్రితో సంబంధం కలుపుకున్నప్పుడు, అసాధారణమైనదేదో జరుగుతుంది. మీరు మార్పుచెందుతారు మరియు యేసు క్రీస్తు నందు పరిపూర్ణులవుతారు.27 మీరు దేవుని యొక్క నిబంధన సంతానముగా మరియు ఆయన రాజ్యములో వారసులుగా అవుతారు.28 ఆయన మీతో, “నీవు నా ప్రియమైన బిడ్డవు, నీయందు నేనానందించుచున్నాను. ఇంటికి దయచేయి,” అని చెప్పడాన్ని నేనూహించగలను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. సుమారు 20 అడుగులు.

  2. సుమారు 30 మైళ్ళు.

  3. మనకు ఎంపిక ఉంది, ఎందుకంటే ఎంపిక చేయడానికి మరియు మనకై మనం పనిచేయడానికి దేవుడు మనకు విశేషాధికారాన్ని ఇచ్చారు. Guide to the Scriptures, “Agency,” scriptures.ChurchofJesusChrist.org; 2 నీఫై 2:27; మోషే 7:32 చూడండి.

  4. మోషైయ 3:19 చూడండి.

  5. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,”లియహోనా, నవ. 2022, 96, 97.

  6. See Guide to the Scriptures, “Covenant,” scriptures.ChurchofJesusChrist.org.

  7. అప్పుడప్పుడు ప్రతీఒక్కరు తప్పు చేస్తారు, కానీ మన తప్పులతో దేవుడు సహనంగా ఉన్నారు మరియు నిబంధనను మీరిన తర్వాత కూడా మనకు పశ్చాత్తాపమనే బహుమానాన్ని ఇచ్చారు. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ బోధించినట్లుగా, “ప్రభువు తిరుగుబాటును [చూసే] దానికంటే భిన్నంగా బలహీనతలను చూస్తారు … [ఎందుకంటే] బలహీనతల గురించి ప్రభువు మాట్లాడినప్పుడు, ఎల్లప్పుడూ అది కనికరముతో కూడియుంటుంది” (“Personal Strength through the Atonement of Jesus Christ,” Liahona, Nov. 2013, 83). ఆవిధంగా, మన బలహీనతలలో మనకు సహాయం చేయగల రక్షకుని సామర్థ్యం గురించి మనం సందేహించకూడదు. ఏమైనప్పటికీ, తర్వాత పశ్చాత్తాపపడదామనే మొండి ప్రణాళికతో తెలిసి పాపం చేయాలనుకోవడం—మరొకమాటలో, ముందుగా ప్రణాళిక చేయబడిన పశ్చాత్తాపము—ప్రభువు దృష్టిలో అసహ్యమైనది (హెబ్రీయులకు 6:4–6 చూడండి).

  8. See Robert Bolt, A Man for All Seasons: A Play in Two Acts (1990), xiii–xiv, 140.

  9. 2 నీఫై 31:17–18 చూడండి.

  10. 2 నీఫై 31:4-15 చూడండి.

  11. లూకా సువార్త ఇలా నమోదు చేస్తుంది, “పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (లూకా 3:22). మార్కు సువార్త ఇలా నమోదు చేస్తుంది, “మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (మార్కు 1:11). కింగ్ జేమ్స్ సంచిక కంటే విలియం టిండేల్ అనువాదము ఇంకా స్పష్టమైనది మరియు వ్యక్తిగతమైనది. అతని అనువాదములో, పరలోక తండ్రి స్వరము ఇలా చెప్తుంది, “నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” (Brian Moynahan, God’s Bestseller: William Tyndale, Thomas More, and the Writing of the English Bible—A Story of Martyrdom and Betrayal [2002], 58). “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (మత్తయి 3:17) అంటూ ఆ స్వరము మరింత సాధారణంగా నిర్దేశించిందని మత్తయి మాత్రమే నివేదించింది. యోహాను సువార్త కేవలం బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము గురించే నివేదిస్తుంది: “ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిని” (యోహాను 1:34).

  12. 2 నీఫై 31:13; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి.

  13. సంస్కారములో మనం మన బాప్తిస్మపు నిబంధనను నూతనపరచుకున్నప్పుడు, “సమ్మతించడం” అనే పదము యొక్క ప్రాముఖ్యతను అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ వివరించారు: “మనం సంస్కారములో పాలుపొందినప్పుడు, యేసు క్రీస్తు నామాన్ని మనపై తీసుకుంటాము అని మనం సాక్ష్యమివ్వము అనేది ముఖ్యమైనది. ఆవిధంగా చేయడానికి మేము సమ్మతిస్తున్నాము అని మనం సాక్ష్యమిస్తాము. [సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి.] మన సమ్మతికి మాత్రమే మనం సాక్ష్యమిస్తామనే వాస్తవం అత్యంత ముఖ్యమైన భావనలో ఆ పవిత్ర నామాన్ని మనం నిజంగా మనపై తీసుకోవడానికి ముందు ఇంకేదో తప్పక జరగాలని సూచిస్తుంది” (“Taking upon Us the Name of Jesus Christ,” Ensign, May 1985, 81). “ఇంకేదో” అనేది దేవాలయ దీవెనలు మరియు భవిష్యత్తులో ఉన్నతస్థితిని సూచిస్తుంది.

  14. నిర్గమకాండము 20:7.

  15. See James Strong, The New Strong’s Expanded Exhaustive Concordance of the Bible (2010), Greek dictionary section, number 5375.

  16. See Strong, The New Strong’s Expanded Exhaustive Concordance of the Bible, Hebrew dictionary section, page 273, number 7723.

  17. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “బాప్తిస్మపు నిబంధన భవిష్యత్ సంఘటన లేదా సంఘటనలను స్పష్టంగా ఆలోచిస్తుంది మరియు దేవాలయం కొరకు ఎదురుచూస్తుంది. … బాప్తిస్మపు నీటిలో మొదలైన యేసు క్రీస్తు నామాన్ని మనపై తీసుకోవడమనే ప్రక్రియ ప్రభువు యొక్క మందిరంలో కొనసాగుతుంది మరియు విస్తరించబడుతుంది. మనం బాప్తిస్మపు నీటిలో నిలబడినప్పుడు, మనం దేవాలయం వైపు చూస్తాము. మనం సంస్కారములో పాలుపొందినప్పుడు, మనం దేవాలయం వైపు చూస్తాము. దేవాలయం యొక్క పవిత్ర విధులలో పాల్గొనడానికి మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామము ద్వారా, అధికారం ద్వారా లభ్యమయ్యే అత్యున్నత దీవెనలను పొందడానికి సిద్ధపాటుగా ఎల్లప్పుడూ రక్షకుడిని జ్ఞాపకముంచుకుంటామని మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాము. ఆవిధంగా, పరిశుద్ధ దేవాలయము యొక్క విధులలో మనం యేసు క్రీస్తు నామాన్ని మరింత పూర్తిగా, సంపూర్ణంగా మనపై తీసుకుంటాము” (“Honorably Hold a Name and Standing,” లియహోనా, May 2009, 98). మనం పూర్తిగా మార్పుచెందినప్పుడు, “మనము ఆయన వలె” (మొరోనై 7:48) ఉండే వరకు బహుశా ఆ ప్రక్రియ పూర్తికాదు.

  18. General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 27.2 లో వివరించినట్లు, నిబంధనలు విధేయత చట్టమును జీవించడం, బలి యొక్క చట్టమునకు లోబడియుండడం మరియు సమర్పణ చట్టమును పాటించడం కొరకైనవి; డేవిడ్ ఎ. బెడ్నార్, “ఈ మందిరము నా నామమున నిర్మించబడవలెను,” లియహోనా, మే 2020, 84–87 కూడా చూడండి.

  19. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:14-15 చూడండి. ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా బోధించారు, “‘పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత్వము’ లో, ‘నిత్య జీవమును గూర్చి నేను మీకు ఇచ్చిన వాగ్దానము, అనగా సిలెస్టియల్ రాజ్యము యొక్క మహిమయైయున్నది. ఆ మహిమ జ్యేష్ఠుల సంఘము యొక్క మహిమను పోలియుండును, అనగా అందరికంటే పరిశుద్ధుడైన దేవుని మహిమను పోలియుండును, దానిని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పొందెదరు’ అని యేసు వర్ణించినది కలిపియుంది (సి&ని 88:4–5)” (“The Power of Covenants,” Liahona, May 2009, 23, note 5).

  20. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:15 చూడండి.

  21. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:22, 25–26 చూడండి.

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:21 చూడండి.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:15, 22; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” లియహోనా, మే 2022, 98 చూడండి.

  24. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 96; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి. ముఖ్యంగా, అధ్యక్షులు నెల్సన్ చెప్పారు, “మీరు ఆత్మ యొక్క ప్రేరేపణలను వెదకి, అనుసరించిన ప్రతీసారి, మీరు ఏదైనా మంచిని—“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు” చేయని విషయాలను—చేసిన ప్రతీసారి, మీరు లోకాన్ని జయిస్తున్నారు”(“లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” 97).

  25. హెబ్రీయులు 11:13.

  26. Redeemer of Israel,” Hymns, no. 6, verse 5. ఇది లీనా సోఫియా రెన్‌లండ్‌కి ఇష్టమైన కీర్తన.

  27. మొరోనై 10:30–33 చూడండి.

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 132:19-20 చూడండి.