సర్వసభ్య సమావేశము
అతి ముఖ్యమైన దానిని జ్ఞాపకముంచుకోండి
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అతి ముఖ్యమైన దానిని జ్ఞాపకముంచుకోండి

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరలోకపు తండ్రి మరియు అతని ప్రియమైన కుమారునితో, మన కుటుంబాలు మరియు మన పొరుగువారితో మన సంబంధాలు మరియు ఆత్మ మనకు మార్గనిర్దేశం చేసేందుకు అనుమతించడం.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగానికి కొంచెం ముందు యెరూషలేము లోనికి రక్షకుని విజయోత్సాహ ప్రవేశాన్ని మనం ఈ వారాంతం గుర్తుచేసుకుంటుండగా, నిరీక్షణ మరియు ఓదార్పునిచ్చు ఆయన మాటలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను: “పునరుత్థానమును, జీవమును నేనే: నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”1

నేను ఆయనను ప్రేమిస్తున్నాను. నేను ఆయనను నమ్ముతున్నాను. ఆయనే పునరుత్థానము మరియు జీవము అని నేను సాక్ష్యమిస్తున్నాను.

నా భార్య బార్బరా చనిపోయిన నాటినుండి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ సాక్ష్యమే నన్ను ఓదార్చి, బలపరచింది. ఆమె లేదని నేను చింతిస్తున్నాను.

తరచు నేను మా నిత్య వివాహం మరియు మా సహజీవనం గురించి ఆలోచిస్తున్నాను.

మొదట నేను బార్బరాను ఎలా కలుసుకున్నాను మరియు ఆ అనుభవం నా మిషనులో నేను నేర్చుకున్న “తదుపరి చర్యతీసుకోవడం” అనే నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలో నాకు నేర్పిందని ఇంతకుముందు నేను పంచుకున్నాను. మేము మొదటిసారి కలుసుకున్న వెంటనే నేను తదుపరి చర్యతీసుకోవలసి వచ్చింది, ఎందుకంటే ఆమె అందమైనది, జనరంజకమైనది మరియు ఆమెకు చాలా పనులున్నాయి. నేను ముందే పరవశించాను, ఎందుకంటే ఆమె సమీపించదగినట్లుగా, స్నేహపూర్వకంగా ఉంది. ఆమె మంచితనాన్ని నేను అభినందించాను. ఆమె, నేను ఒకరికొకరం అని నేను భావించాను. అది నా మనస్సులో అంత సులువుగా అనిపించింది.

బార్బరా, నేను కలుసుకున్నాము, మా అనుబంధం పెరగసాగింది, కానీ నన్ను పెళ్ళి చేసుకోవడం సరైనదో కాదో ఆమె నిశ్చయించుకోలేకపోయింది.

నాకు తెలిస్తే సరిపోదు; బార్బరా తనంతట తాను తెలుసుకోవాలి. ఆ విషయం గురించి మేము ఉపవాసముండి, ప్రార్థిస్తే, బార్బరా పరలోకం నుండి నిర్ధారణను పొందగలదని నాకు తెలుసు.

మాకై మేము తెలుసుకోవడానికి విడివిడిగా ఉపవాసముండి, ప్రార్థన చేయగలిగేలా మేము ఆ వారాంతం కలుసుకోలేదు. నా అదృష్టానికి, నేను పొందిన అదే నిర్ధారణను ఆమె పొందింది. మిగిలినది, అందరూ చెప్పినట్లు, చరిత్రే.

బార్బరా చనిపోయినప్పుడు మా పిల్లలు, బార్బరా వారు గుర్తుంచుకోవాలని కోరుకున్న అనేక పాఠాలను ఆమె శిలాఫలకంపై చెక్కించారు. “మనం దీర్ఘకాలం గుర్తుంచుకునేవి అతి ముఖ్యమైన విషయాలు” అనేది ఆ పాఠాలలో ఒకటి.

ఈరోజు, అతి ముఖ్యమైన వాటిపై నా అంతరంగ భావాలను, ఆలోచనలను నేను పంచుకుంటాను.

మొదటిది, మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తుతో అనుబంధం అతి ముఖ్యమైనది. ఈ అనుబంధం ఇప్పుడు మరియు నిత్యత్వములో అతి ముఖ్యమైనది.

రెండవది, కుటుంబ సంబంధాలు అతి ముఖ్యమైన విషయాలలో ఉన్నాయి.

నా పరిచర్య అంతటా, నేను వినాశనకరమైన ప్రకృతి వైపరీత్యాల చేత ప్రభావితం చేయబడిన అనేకమంది వ్యక్తులను, కుటుంబాలను దర్శించాను. అనేకమంది స్థానభ్రంశం చెందారు, ఆకలితో, భయంతో ఉన్నారు. వారికి వైద్య సహాయం, ఆహారం, ఆశ్రయం కావాలి.

వారికి వాళ్ళ కుటుంబాలు కూడా కావాలి.

కొద్దిమంది కుటుంబం యొక్క దీవెనలను కలిగియుండకపోవచ్చని నేను గుర్తించాను, కాబట్టి నేను బంధువులు, స్నేహితులు, వార్డు కుటుంబాలను కూడా “కుటుంబం”గా చేర్చుకున్నాను. మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఈ అనుబంధాలు ఆవశ్యకమైనవి.

ఈ అనుబంధాలు ప్రేమ, ఆనందం, సంతోషం మరియు చెందియున్న భావనను కూడా అందించగలవు.

ఈ ముఖ్యమైన అనుబంధాలను పోషించడం ఒక ఎంపిక. ఒక కుటుంబంలో భాగంగా ఉండాలనే ఎంపికకు నిబద్ధత, ప్రేమ, సహనం, సంభాషణ మరియు క్షమాపణ అవసరం.2 కొన్నిసార్లు మనం మరొకరితో ఏకీభవించకపోవచ్చు, కానీ మనం దానిని అసమ్మతి లేకుండా చేయగలం. చదరంగంలో కదపబడే పావుల మాదిరిగా, ప్రేమాభ్యర్థన మరియు వివాహంలో మనం ప్రేమలో పడడం లేదా పడకపోవడం జరగదు. ఒకరిని ఒకరం ప్రేమించడానికి, సమ్మతించడానికి మనం ఎంచుకుంటాము. ఇతర కుటుంబ సంబంధాలలో మరియు మనకు కుటుంబం వంటివారైన స్నేహితులతో మనం అదే చేస్తాము.

“సంతోషము కొరకైన ఈ దైవిక ప్రణాళిక కుటుంబ బాంధవ్యములను మరణము తర్వాత కూడా శాశ్వతముగా ఉండునట్లు చేయును. దేవాలయమందుండు పవిత్ర నియమములు మరియు నిబంధనలు ప్రతీవారు దేవుని యొక్క సన్నిధికి తిరిగివెళ్ళుటను మరియు కుటుంబాలు నిత్యము కలిసుండుటను సాధ్యము చేయును,”3 అని కుటుంబ ప్రకటన వ్యాఖ్యానిస్తుంది.

అతి ముఖ్యమైన మరొక విషయం, మన అతి ముఖ్యమైన సంబంధాలలో మరియు మన వ్యక్తిగత, బహిరంగ పరిచర్యలతో కలిపి, మనవలె మన పొరుగువారిని ప్రేమించే మన ప్రయత్నాలలో ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించడం. బిషప్పుగా సేవ చేస్తున్నప్పుడు, నా జీవితంలో చాలా త్వరగా నేను ఈ పాఠాన్ని నేర్చుకున్నాను.

మంచు కురుస్తున్న ఒక చల్లని శీతాకాలపు సాయంత్రం, ఆలస్యంగా నేను నా బిషప్పు కార్యాలయం నుండి బయలుదేరుతున్నాను, అప్పుడు వార్డులో ఉన్న విధవరాలైన ఒక పెద్దావిడను దర్శించాలనే బలమైన భావన నాకు కలిగింది. నేను చేతి గడియారం వైపు చూసుకున్నాను—రాత్రి 10 గంటలైంది. దర్శించడానికి అది చాలా ఆలస్యమని నేను సరిపుచ్చుకున్నాను. అంతేకాకుండా, మంచు కురుస్తోంది. అంత ఆలస్యంగా వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టడం కంటే, ప్రొద్దున్నే ముందుగా ఆ ప్రియ సహోదరిని దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వెళ్ళి, మంచంపై పడుకున్నాను, కానీ రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాను, ఎందుకంటే ఆత్మ నన్ను కదిలిస్తూనే ఉంది.

మరుసటిరోజు ప్రొద్దున్నే నేను తిన్నగా ఆ విధవరాలి ఇంటికి వెళ్ళాను. ఆమె కూతురు తలుపు తెరిచి, కన్నీళ్ళతో, “ఓహ్, బిషప్, వచ్చినందుకు ధన్యవాదాలు. రెండు గంటల క్రితమే అమ్మ చనిపోయింది” అన్నది— నేను కుప్పకూలిపోయాను. నా మనస్సులోని భావాలను నేను ఎన్నడూ మరచిపోను. నేను ఏడ్చాను. ఆమె బిషప్పు ఆమె చేయి పట్టుకొని, ఆమెను ఓదార్చి, బహుశా ఆమెకు చివరి దీవెనను ఇవ్వడానికి ఈ ప్రియమైన విధవరాలి కంటే ఎక్కువగా అర్హులైన వారెవరు? నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను, ఎందుకంటే ఆత్మ నుండి ఆ బలమైన ప్రేరేపణను నేను పట్టించుకోలేదు.4

సహోదర సహోదరీలారా, యువకులారా, యువతులారా మరియు ప్రాథమిక పిల్లల్లారా, మన అనుబంధాలన్నిటిలో అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించడం అని నేను సాక్ష్యమిస్తున్నాను.

చివరగా, ఈ మట్టల ఆదివారపు వారాంతంలో, ప్రభువుకు పరివర్తన చెందడం, ఆయన గురించి సాక్ష్యమివ్వడం, ఆయనకు సేవచేయడం కూడా అతి ముఖ్యమైన విషయాలని నేను సాక్ష్యమిస్తున్నాను.

యేసు క్రీస్తుపై విశ్వాసము కలిగియుండడం మన సాక్ష్యాలకు పునాది. సాక్ష్యము అనేది పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తుల హృదయాలపై, ఆత్మలపై ముద్రించబడిన నిత్య సత్యానికి నిదర్శనం లేదా నిర్ధారణ. యేసు క్రీస్తు గురించి ఆత్మ వలన పుట్టి, ఆత్మ ద్వారా బలపరచబడిన సాక్ష్యము జీవితాలను మార్చివేస్తుంది—అది మనం ఆలోచించే మరియు జీవించే విధానాన్ని మార్చివేస్తుంది. సాక్ష్యము మనల్ని మన పరలోక తండ్రి మరియు ఆయన దైవిక కుమారుని వైపు త్రిప్పుతుంది.

ఆల్మా ఇలా బోధించాడు:

“ఇదిగో, నేను పలికిన ఈ విషయములు సత్యమని నేను ఎరుగుదునని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు వాటి యథార్థతను నేనెట్లు ఎరుగుదునని మీరనుకొనుచున్నారు?

“ఇదిగో, అవి నాకు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడెనని నేను మీకు చెప్పుచున్నాను. నాయంతట నేను ఈ విషయములను తెలుసుకొనవలెనని అనేక దినములు ఉపవాసముండి, ప్రార్థన చేసితిని. అవి సత్యమని ఇప్పుడు నాకై నేను ఎరుగుదును; ఏలయనగా ప్రభువైన దేవుడు వాటిని నాకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరచెను.”5

కేవలం సాక్ష్యం కలిగియుండడమే సరిపోదు. యేసు క్రీస్తుకు మన పరివర్తన పెరుగుతున్నప్పుడు, సహజంగానే మనం ఆయన గురించి—ఆయన మంచితనం, ప్రేమ, దయ గురించి సాక్ష్యమివ్వాలనుకుంటాము.

ఉపవాస ఆదివారాలలో మన సాక్ష్యపు సమావేశాలలో తరచు మనం “నాకు తెలుసు” మరియు “నేను నమ్ముతున్నాను” అనే మాటల కంటే ఎక్కువగా “నేను కృతజ్ఞత కలిగియున్నాను” మరియు “నేను ప్రేమిస్తున్నాను” అనే మాటలు వింటాము.

ఎక్కువ తరచుగా యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కేవలం మీరు కృతజ్ఞత కలిగియున్న వాటి గురించే కాకుండా, మీకు తెలిసినవి, మీరు నమ్మేవి మరియు మీరు భావించే వాటి గురించి సాక్ష్యమివ్వండి. రక్షకుని గురించి తెలుసుకొని, ప్రేమించడం, ఆయన బోధనలను జీవించడం, మీ జీవితంలో ఆయన విమోచన మరియు సాధ్యపరచు శక్తి యొక్క మీ స్వంత అనుభవాల గురించి సాక్ష్యమివ్వండి. మీకు తెలిసిన, నమ్మిన మరియు భావించిన వాటి గురించి మీరు సాక్ష్యమిచ్చినప్పుడు, మీ సాక్ష్యాన్ని నిజాయితీగా వినిన వారికి పరిశుద్ధాత్మ సత్యాన్ని నిర్ధారిస్తాడు. వారు అలాగే చేస్తారు, ఎందుకంటే మీరు యేసు క్రీస్తు యొక్క శాంతియుత అనుచరునిగా మారడాన్ని వారు చూసారు. ఆయన శిష్యునిగా ఉండడం అంటే ఏమిటనేది వారు చూస్తారు. వారు ఇంతకుముందు భావించని దానిని కూడా వారు భావిస్తారు. స్వచ్ఛమైన సాక్ష్యము మార్పు చెందిన హృదయం నుండి వస్తుంది మరియు దానిని పొందడానికి సిద్ధంగా ఉన్న ఇతరుల హృదయాలలోనికి అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా తీసుకువెళ్ళబడగలదు.

మీ సాక్ష్యము ఫలితంగా ఏదైనా భావించినవారు మీ సాక్ష్యము యొక్క సత్యాన్ని నిర్ధారించమని ప్రార్థనలో ప్రభువును అడగవచ్చు. అప్పుడు, వారికై వారు తెలుసుకోగలరు.

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు లోక రక్షకుడని మరియు విమోచకుడని నాకు తెలుసని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఆయన సజీవుడు. ఆయన దేవుని యొక్క పునరుత్థానుడైన కుమారుడు మరియు ఇది ఆయన ప్రవక్తలు, అపొస్తలుల చేత నడిపించబడుతున్న ఆయన సంఘము. ఏదో ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచివెళ్ళినప్పుడు, ప్రకాశవంతమైన నా సాక్ష్యంతో నేనలా చేయగలగాలని ప్రార్థిస్తున్నాను.

పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారునితో, మన కుటుంబాలతో, మన పొరుగువారితో మన అనుబంధాలు మరియు ఆ అనుబంధాలలో మనల్ని నడిపించడానికి ప్రభువు యొక్క ఆత్మను అనుమతించడం, తద్వారా అతి ముఖ్యమైన మరియు దీర్ఘకాలము నిలిచియుండే విషయాల గురించి మనం సాక్ష్యమివ్వగలగడం అతి ముఖ్యమైన విషయాలని నా పరిచర్యలో నేను నేర్చుకున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 11:25.

  2. ఈ విషయంపై లేఖనాలు మరియు ప్రవక్తలు, అపొస్తలులు మరియు ఇతర సంఘ నాయకుల ప్రసంగాలను చదవడానికి “Family,” “Unity,” and “Love” in Gospel Topics in the Gospel Library in (ChurchofJesusChrist.org or on the mobile app) వద్ద వ్యాసాలను చూడండి.

  3. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org.

  4. ఈ అనుభవం యొక్క ఖాతా సుసాన్ ఈస్టన్ బ్లాక్ మరియు జోసెఫ్ వాకర్, Anxiously Engaged: A Biography of M. Russell Ballard (2021), 90–91 లో ఉంది.

  5. ఆల్మా 5:45–46.