సర్వసభ్య సమావేశము
పరిచర్య
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పరిచర్య

మన రక్షకుడు చేయునట్లుగా అందరినీ సమీపిద్దాం, ప్రత్యేకించి ప్రేమించడానికి మరియు పరిచర్య చేయడానికి మనకు విశేషంగా అప్పగించిన వారి పట్ల శ్రద్ధ చూపుదాం.

ప్రియమైన సహోదర సహోదరీలారా మరియు స్నేహితులారా, సర్వసభ్య సమావేశానికి స్వాగతం!

గత అక్టోబరు సర్వసభ్య సమావేశము తర్వాత, నేను, సహోదరి గాంగ్ మిమ్మల్ని పలకరించి, మీ సువార్త అనుభవాలను వినడానికి సమావేశ కేంద్రం గుండా నడిచాము.

“Hoy es el tiempo de Mexico (మెక్సికో కొరకు ఇది సరైన సమయం)” అని మెక్సికోలోని మన సభ్యులు అన్నారు.

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి గాంగ్‌లతో గిల్లీ మరియు మేరీ

గిల్లీ మరియు మేరీ ఇంగ్లండు నుండి స్నేహితులని మేము తెలుసుకున్నాము. మేరీ సంఘంలో చేరినప్పుడు, ఆమె తాను నివసించేస్థలాన్ని కోల్పోయింది. వచ్చి తనతోపాటు ఉండమని గిల్లీ సాదరంగా మేరీని ఆహ్వానించింది. గొప్ప విశ్వాసమును చూపుతూ, గిల్లీ అంటుంది, “ప్రభువు నాతో ఉన్నారనడాన్ని నేనెప్పుడూ సందేహించలేదు.” 47 సంవత్సరాల క్రితం ఆమెకు బోధించిన సువార్తికురాలిని కూడా సమావేశములో గిల్లీ ఆనందంగా తిరిగి కలుసుకుంది.

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి గాంగ్‌లతో జెఫ్ మరియు మెలిస్సా

జెఫ్ మరియు అతని భార్య మెలిస్సా తమ మొదటి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జెఫ్ వృత్తిరీత్యా బేస్‌బాల్ ఆడేవాడు (అతడు బంతి పట్టుకొనేవాడు) మరియు ఇప్పుడు మత్తు ఇచ్చే వైద్యుడు. అతడు నాతో ఇలా చెప్పాడు, “నేను బాప్తిస్మము తీసుకోవడానికి కావలసినవి చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇది అత్యంత వాస్తవికమైన, నిజాయితీ గల జీవన విధానంగా అనిపిస్తుంది.”

అంతకుముందు, మా ఇంటిలో ‘తెల్ల చొక్కాలు ధరించిన వారు’ రావడం జెఫ్‌కు ఇష్టం లేదు” అంటూ మెలిస్సా జెఫ్‌కి పరిచర్య చేయడానికి నియమించబడిన సహోదరునికి క్షమాపణలు చెప్పింది. “నేను ఒక మార్గం కనుగొంటాను,” అని పరిచర్య చేయు సహోదరడు అన్నాడు. ఇప్పుడు అతను మరియు జెఫ్ మంచి స్నేహితులు. జెఫ్ బాప్తిస్మమప్పుడు, జెఫ్, మెలిస్సా మరియు వారి కూతురు చార్లెట్ ఇష్టపడే కడవరి దిన పరిశుద్ధుల సమూహాన్ని నేను కలిసాను.

యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, ఆయన చేసినట్లుగా మనం ఇతరులకు పరిచర్య చేయాలని కోరుకుంటాము, ఎందుకంటే జీవితాలను మార్చడానికి ఆయన వేచియున్నారు.

పెళ్ళయిన 31 సంవత్సరాల తర్వాత తన భర్త జాన్ బాప్తిస్మము తీసుకోబోతున్నాడని పెగ్గీ నాతో చెప్పినప్పుడు, ఏమి మారిందని నేను అడిగాను.

“నేను, జాన్ రండి, నన్ను అనుసరించండి, క్రొత్త నిబంధన చదువుతున్నాము మరియు జాన్ సంఘ సిద్ధాంతం గురించి అడిగాడు” అని చెప్పింది పెగ్గీ.

“సువార్తికులను పిలుద్దాం,” అంది పెగ్గీ.

“నా స్నేహితుడు రాలేకపోతే---సువార్తికులు వద్దు,” అన్నాడు జాన్. 10 సంవత్సరాలకు పైగా, జాన్‌కు పరిచర్య చేసే సహోదరుడు అతనికి నమ్మకమైన స్నేహితుడయ్యాడు. (జాన్‌కు పరిచర్య చేసే సహోదరుడు ఒకటి, రెండు లేదా తొమ్మిది సంవత్సరాల తర్వాత రావడం మానేస్తే ఏమైయుండేది? అని నేను అనుకున్నాను.)

జాన్ విన్నాడు. నిజమైన ఉద్దేశ్యముతో అతను మోర్మన్ గ్రంథాన్ని చదివాడు. బాప్తిస్మము తీసుకోవడానికి సువార్తికులు జాన్‌ను ఆహ్వానించినప్పుడు, అతను సరేనన్నాడు. పెగ్గి చెప్పింది, “నేను నా కుర్చీలో నుండి పడిపోయాను మరియు ఏడవడం ప్రారంభించాను.”

“నేను ప్రభువుకు దగ్గరవుతుండగా, నేను మారాను,” అని అన్నాడు జాన్. తర్వాత, జాన్ మరియు పెగ్గీ పరిశుద్ధ దేవాలయంలో ముద్రింపబడ్డారు. గత డిసెంబరులో, 92 ఏళ్ళ వయస్సులో జాన్ మరణించాడు. “జాన్ ఎప్పుడూ ఒక మంచి మనిషిగా ఉన్నాడు, కానీ అతను బాప్తిస్మము పొందిన తర్వాత ఒక అందమైన విధానంలో అతడు భిన్నంగా మారాడు,” అని అంటుంది పెగ్గీ.

చిత్రం
జెన్నీ మరియు మెబ్

నేను, సహోదరి గాంగ్ కొవిడ్ మహమ్మారి సమయంలో వీడియో ద్వారా మెబ్ మరియు జెన్నీలను కలుసుకున్నాము. (కొవిడ్ సమయంలో వీడియో ద్వారా మేము అనేకమంది అద్భుతమైన దంపతులను, వ్యక్తులను కలుసుకున్నాము, ప్రతీఒక్కరు వారి స్టేకు అధ్యక్షుల చేత ప్రార్థనాపూర్వకంగా పరిచయం చేయబడ్డారు.)

వారి జీవితాల్లోని సమస్యలు వారి దేవాలయ వివాహం సురక్షితంగా ఉంటుందో లేదో, ఒకవేళ ఉంటే అది ఎలాగో అని వారు ఆశ్చర్యపడేలా చేసాయని మెబ్ మరియు జెన్నీ వినయంగా చెప్పారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు వారి నిబంధన ఒడంబడికలు వారికి సహాయపడగలవని వారు నమ్మారు.

మెబ్ మరియు జెన్నీ క్రొత్తగా దేవాలయ సిఫారసులు పొంది, కలిసి ప్రభువు యొక్క మందిరానికి తిరిగి వెళ్ళినప్పుడు, నా ఆనందాన్ని ఊహించండి. తర్వాత మెబ్ దాదాపుగా మరణించాడు. మెబ్ మరియు జెన్నీ ప్రభువుతో మరియు ఒకరితో ఒకరు నిబంధన అనుబంధాలను పునరుద్ధరించుకోవడం మరియు వారి చుట్టూ ఉన్న అనేకమంది పరిచర్య చేసేవారి ప్రేమను భావించడం ఎంతో దీవెనకరము.

నేను వెళ్ళిన ప్రతీచోట, మన రక్షకుడు చేయునట్లు పరిచర్య చేసేవారు మరియు శ్రద్ధ చూపేవారి నుండి నేను కృతజ్ఞతాపూర్వకంగా నేర్చుకుంటాను.

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి గాంగ్‌లతో సాల్వడార్

పెరూలో, నేను, సహోదరి గాంగ్ సాల్వడార్ మరియు అతని తోబుట్టువులను కలిసాము.1 సాల్వడార్ మరియు అతని తోబుట్టువులు అనాథలు. అది సాల్వడార్ పుట్టినరోజు. విశ్వాసంతో ఈ కుటుంబానికి పరిచర్య చేసే సంఘ నాయకులు మరియు సభ్యులు నన్ను ప్రేరేపించారు. “పవిత్రమును నిష్కళంకమునైన భక్తి” ఇదే—“దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుట,”2 “బలహీనులను పోషించుట, వడలిన చేతులను పైకెత్తుట, సడలిన మోకాళ్ళను బలపరచుట.”3

హాంగ్ కాంగ్‌లో, ఒక పెద్దల సమూహపు అధ్యక్షుడు వారి సమూహము ఏవిధంగా 100-శాతం పరిచర్య ముఖాముఖిలను స్థిరంగా నిర్వహిస్తుందో నిరాడంబరంగా పంచుకున్నారు. “మేము ప్రార్థనాపూర్వకంగా సహవాసుల జతలను ఏర్పాటు చేస్తాము, ఆ విధంగా ప్రతీఒక్కరు మరొకరిపట్ల శ్రద్ధ చూపుతారు మరియు శ్రద్ధ చూపబడతారు,” అని అతడు అన్నాడు. “మేము క్రమంగా ప్రతీ జత సహవాసులను వారు పరిచర్య చేసే వారి గురించి అడుగుతాము. మేము గడులలో గురుతు పెట్టము, మేము మా జనుల కొరకు శ్రద్ధ చూపే పరిచారకులకు పరిచర్య చేస్తాము.”

చిత్రం
బోకోలో కుటుంబము

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కిన్షాసాలో, అధ్యక్షులు బొకొలొ తాను, తన కుటుంబము ఏవిధంగా ఫ్రాన్స్‌లోని సంఘములో చేరారో పంచుకుంటున్నారు. ఒకరోజు ఆయన తన గోత్రజనకుని దీవెన చదువుతుండగా, తన కుటుంబంతో పాటు డి ఆర్ కాంగోకు తిరిగి వెళ్ళాలని సహోదరుడు బొకొలొ‌ను ఆత్మ ప్రేరేపించింది. వారు తిరిగి వెళ్తే అనేక సవాళ్ళను వారు ఎదుర్కొంటారని సహోదరుడు బొకొలొకు తెలుసు. వారి సంఘము, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ఇంకా కిన్షాసాలో స్థాపించబడలేదు.

అయినప్పటికీ, అనేకమంది ఇతరుల వలె, విశ్వాసంతో బొకొలొలు ప్రభువు యొక్క ఆత్మను అనుసరించారు. కిన్షాసాలో, వారు తమ చుట్టూ ఉన్నవారికి పరిచర్య చేసారు మరియు వారిని దీవించారు, సవాళ్ళను జయించారు, ఆత్మీయ మరియు భౌతిక దీవెనలు పొందారు. నేడు, ప్రభువు యొక్క మందిరాన్ని తమ దేశంలో కలిగియున్నందుకు వారు ఆనందిస్తున్నారు.4

పరివర్తన చెందిన ఒకరు వ్యక్తిగత మాదిరి చేత పరిచర్య చేయబడ్డారు. ఒక యువకునిగా అతడు తన దినములన్నీ సముద్రతీరంలో సోమరిగా గడిపేవాడినని చెప్పాడు. ఒకరోజు, “నిరాడంబరమైన ఈత దుస్తులలో నేను ఆకర్షణీయమైన ఒక అమ్మాయిని చూసాను,” అని అతడు చెప్పాడు. ఆశ్చర్యపడి అతడు, అంత ఆకర్షణీయమైన అమ్మాయి అంత నిరాడంబరమైన ఈత దుస్తులను ఎందుకు ధరించిందో అడగడానికి వెళ్ళాడు. ఆమె యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యురాలు మరియు “నువ్వు ఆదివారం సంఘానికి వస్తావా?” అని చిరునవ్వుతో అడిగింది. అతను సరేనన్నాడు.

చాలాకాలం క్రితం, మాకు అప్పగించిన ఒక పనిలో మేము కలిసి ఉన్నప్పుడు, ఎల్డర్ ఎల్. టామ్ పెర్రీ, అతను మరియు అతని సహచరుడు కఠినమైన బోస్టన్ పరిసరాల్లో ఒంటరిగా నివసించే ఒక సోదరికి ఎలా క్రమంగా పరిచర్య చేసేవారో పంచుకున్నారు. ఎల్డర్ పెర్రీ మరియు ఆయన సహవాసి వచ్చినప్పుడు, “తలుపు క్రింద నుండి మీ దేవాలయ సిఫారసులు జారవేయండి,” అని ఆ సహోదరి జాగ్రత్తగా సూచించింది. దేవాలయ సిఫారసులు చూసిన తర్వాత మాత్రమే ఆమె అనేక తాళాలు తెరిచి, తలుపు తీసేది.5 అయితే, పరిచర్య చేసే సహవాసులకు దేవాలయ సిఫారసులు అవసరమని నేను చెప్పడం లేదు. కానీ, నిబంధనలను గౌరవించే వారు పరిచర్య చేసినప్పుడు గృహాలు తాళం తీయబడి, హృదయాలు తెరువబడతాయనే ఆలోచన నాకు నచ్చింది.

ఎల్డర్ పెర్రీ కూడా ఆచరణాత్మక సలహానిచ్చారు. “సహవాసులకు తగినన్ని నియామకాలను ఇవ్వండి, ప్రార్థనాపూర్వకంగా ఎంపిక చేయబడినవి, తగినట్లయితే భౌగోళికంగా ఒక్కచోట ఉండేవి, ఆవిధంగా ప్రయాణ సమయం సరిగ్గా ఉపయోగించబడుతుంది,” అని ఆయన చెప్పారు. ఆయన సలహా ఇలా ఇచ్చారు, “సందర్శనలు ఎక్కువగా అవసరమైన వారితో ప్రారంభించండి. సందర్శనలను చాలామట్టుకు స్వాగతించి, స్పందించే వారి వద్ద నుండి నిర్మించండి.” “విశ్వసనీయమైన స్థిరత్వం అద్భుతాలను జరిగిస్తుంది,” అని ఆయన ముగించారు.

మనం “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ”7 కోసం ప్రార్థించి, ఆత్మను అనుసరించినప్పుడు, ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన పరిచర్య6 వస్తుంది. బిషప్పు యొక్క నిర్దేశకత్వం క్రింద, పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజము యొక్క అధ్యక్షత్వాలు పరిచర్య చేయు సహవాసుల జతలను నియమించడంతో పాటు పరిచర్య ప్రయత్నాలను పర్యవేక్షించినప్పుడు కూడా అది వస్తుంది. అనుభవం గల పరిచర్య చేయు సహోదరులు, సహోదరీల చేత ఉపదేశించబడేందుకు మరియు వారితోపాటు వెళ్ళేందుకు తగిన అవకాశాలను దయచేసి మన యువకులకు, యువతులకు ఇవ్వండి. మరియు దయచేసి మన యువతరం పరిచర్య చేసే సహోదర, సహోదరీల సహవాసులను ప్రేరేపించనివ్వండి.

సంఘములో కొన్ని ప్రదేశాలలో, మనం పరిచర్య లోపాన్ని కలిగియున్నాము. చాలామంది తమకు పరిచర్య చేయబడుతోందని చెప్పడం కంటే తాము పరిచర్య చేస్తున్నామని చెప్తారు. మనకు అప్పగించారు కాబట్టి మనం శ్రద్ధచూపాలని వారు కోరడం లేదు. కానీ తరచూ హాలో అని మనస్ఫూర్తిగా పలకరించడం లేదా మామూలుగా వాహనాలు నిలిపేచోట “నేను సహాయం చేయనా?” అని అనడం కంటే మనకు ఎక్కువ కావాలి. అనేక ప్రదేశాలలో మనం సమీపించగలము, వారు ఉన్నచోటే ఇతరులను అర్థం చేసుకోగలము మరియు సభ్యులను వారి ఇళ్ళలో మనం క్రమం తప్పక దర్శించినప్పుడు బంధాలు పెంపొందించుకోగలము. పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపించబడిన ఆహ్వానాలు జీవితాలను మారుస్తాయి. పవిత్ర నిబంధనలు చేసి, పాటించడానికి ఆహ్వానాలు మనకు సహాయపడినప్పుడు, మనం ప్రభువుకు మరియు ఒకరికి ఒకరం దగ్గరవుతాము.

పరిచర్య యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని గ్రహించిన వారు అంతకుముందు కంటే ఎక్కువ చేస్తారని, గ్రహించని వారు తక్కువ చేస్తారని చెప్పబడింది. మన రక్షకుడు చేసేవిధంగా మనం ఎక్కువ చేద్దాం. మన కీర్తన చెప్పినట్లుగా, ఇది “బాధ్యత మరియు ప్రేమ యొక్క దీవెన.”8

వార్డు సలహాసభలు, పెద్దల సమూహాలు మరియు ఉపశమన సమాజాలు, దయచేసి మంచి కాపరిని ఆలకించండి మరియు “తప్పిపోయిన దానిని వెదకడానికి, … తోలివేసిన దానిని మరల తోలుకొని రావడానికి, … గాయపడిన దానికి కట్టు కట్టడానికి, … దుర్బలముగా ఉన్నదానిని బలపరచడానికి”9 ఆయనకు సహాయపడండి. అందరి కోసం ఆయన సత్రంలో మనం చోటు కల్పించినప్పుడు,11 మనం “ఎరుగకయే దేవదూతలకు”10 ఆతిథ్యమిస్తాము.

ప్రేరేపించబడిన పరిచర్య కుటుంబాలను, వ్యక్తులను దీవిస్తుంది; అది వార్డులను, శాఖలను కూడా బలపరుస్తుంది. మీ వార్డు లేదా శాఖను ఒక ఆత్మీయ పర్యావరణ వ్యవస్థగా అనుకోండి. ఒలీవ చెట్ల గురించి మోర్మన్ గ్రంథపు దృష్టాంతము యొక్క భావనలో, ఒలీవతోట యజమాని మరియు ఆయన సేవకులు అమూల్యమైన ఫలమును ఫలింపజేస్తారు మరియు చెట్లన్నిటి బలాలను, బలహీనతలను కలిపి కట్టడం ద్వారా ప్రతీ చెట్టును బలపరుస్తారు.12 ఒలీవతోట యజమాని మరియు ఆయన సేవకులు మళ్ళీ మళ్ళీ, “ఇంకను ఎక్కువగా నేను ఏమి చేసియుండవలసినది?”13 అని అడుగుతారు. ప్రేరేపించబడిన, స్థిరమైన పరిచర్య ద్వారా కలిసి వారు హృదయాలను, గృహాలను, వార్డులు మరియు శాఖలను దీవిస్తారు.14

చిత్రం
అల్లుకుపోతున్న వేర్లు మరియు కొమ్మలు

పరిచర్య చేయడం—మంచి కాపరిగా ఉండడం—మన ద్రాక్షతోటను “ఏక శరీరముగా”15—ఒక పవిత్ర వనముగా చేస్తుంది. మన వనములో ప్రతీ చెట్టు ఒక సజీవ కుటుంబ వృక్షము. వేర్లు మరియు కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసియుంటాయి. పరిచర్య తరతరాలను దీవిస్తుంది. సేవ అవసరమైనప్పుడు, తెలివైన బిషప్పులు, పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు, “పరిచర్య చేసే సహోదరీ మరియు సహోదరులు ఎవరు?” అని అడుగుతారు. వార్డు సలహాసభలు మరియు పరిచర్య ముఖాముఖిలలో సవాళ్ళు లేదా సమస్యల గురించి మాత్రమే అడగరు, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటారు మరియు ఆయన చేయునట్లుగా మనం పరిచర్య చేసినప్పుడు మన జీవితాలలో ప్రభువు యొక్క అనేక మృదు కనికరములందు ఆనందిస్తాము.

మన రక్షకుడు మనకు పరిపూర్ణమైన మాదిరి.16 ఆయన మంచివాడు గనుక, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను.17 ఆయన ఒక్కదానిని మరియు 99 ని దీవిస్తారు. రక్షకుడు చేసిన ప్రతిదీ జనులకు పరిచర్య చేయడానికి ఆయన కోరికను రుజువు చేసింది. మనం ఆయనకు చేయునట్లు “మిక్కిలి అల్పులైన … వీరికి చేసినప్పుడు”,18 మనవలె మన పొరుగువారిని మనం ప్రేమించినప్పుడు,19 “ఆయన మనల్ని ప్రేమించినట్టే మనము ఒకరినొకరు ప్రేమించినప్పుడు”20 మరియు “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యున్నప్పుడు”21 మనం మరింతగా యేసు క్రీస్తు వలె మారతాము.

యేసు క్రీస్తు పరిచర్య చేస్తారు. దేవదూతలు పరిచర్య చేస్తారు.22 యేసు క్రీస్తు యొక్క అనుచరులు “ఒకరికొకరు పరిచర్య చేసుకుంటారు,”23 “సంతోషించు వారితో సంతోషిస్తారు; ఏడ్చువారితో ఏడుస్తారు,”24 “[జనులకు]కావలి కాసి, నీతి సంబంధమైన విషయములతో వారిని పోషిస్తారు,”25 “బీదలను, అవసరతలో నున్నవారిని, రోగులను, బాధలలో నున్న వారిని జ్ఞాపకముంచుకుంటారు,”26 మన పరిచర్య ద్వారా ఆయన నామము తెలియజేయబడనిద్దాం.27 ఆయన చేయునట్లు మనం పరిచర్య చేసినప్పుడు, ఆయన అద్భుతాలను మరియు దీవెనలను మనం చూస్తాము.28 “మరి శ్రేష్ఠమైన పరిచర్యను”29 మనం పొందుతాము.

శారీరకంగా మనం అలసిపోవచ్చు. కానీ, ఆయన సేవలో మనం “మేలుచేయుటలో విసుగుచెందము.”30 మనం శ్రద్ధగా చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాము, మన శక్తికి మించి వేగంగా పరుగెత్తము,31 కానీ అపొస్తలుడైన పౌలు బోధించినట్లుగా, “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును”32 అని నమ్ముతాము. ఏలయనగా, “విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేయును.”33 మరొక మాటలలో, దేవుడు “ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు చేయును.”34 “సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంటకోయును.”35

ఈ ఈస్టరు సమయంలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ, మన రక్షకుడు చేయునట్లుగా సమీపిద్దాం, ప్రత్యేకించి ప్రేమించడానికి మరియు పరిచర్య చేయడానికి మనకు విశేషంగా అప్పగించిన వారి పట్ల శ్రద్ధ చూపుదాం. ఆవిధంగా చేయడంలో, మనం యేసు క్రీస్తుకు మరియు ఒకరికి ఒకరు దగ్గరవుదాం, ఎక్కువగా ఆయన వలె అవుదాం మరియు ఆయన మనల్ని కోరినట్లుగా యేసు క్రీస్తు యొక్క అనుచరులమవుదాం. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.