సర్వసభ్య సమావేశము
సురక్షితంగా ఇంటికి చేర్చబడుట
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సురక్షితంగా ఇంటికి చేర్చబడుట

తండ్రి యొక్క ప్రణాళికను అనుసరిస్తూ ముందెన్నడూ లేనట్లుగా తెరకు ఇరువైపులా ఇశ్రాయేలును సమకూర్చడానికి మనం ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాము.

“చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చుటలో, ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధపరచడంలో సహాయపడడం మన ప్రత్యేక బాధ్యత అని మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గాఢంగా నొక్కిచెప్పారు.1 ఆయన పిల్లలు సురక్షితంగా ఇంటికి చేర్చబడాలి అని మన ఆత్మల తండ్రి కోరుతున్నారు.

ఆయన పిల్లలను సురక్షితంగా మన పరలోక గృహానికి చేర్చడానికి మన పరలోక తండ్రి పణాళిక ప్రాపంచిక విజయం, ఆర్థిక స్థితి, విద్య, జాతి లేదా లింగంపై ఆధారపడలేదు. నీతియుక్తత, ఆయన ఆజ్ఞలను పాటించడం, పవిత్ర విధులను పొందడం మరియు మనం చేసే నిబంధనలను గౌరవించడంపై తండ్రి యొక్క ప్రణాళిక ఆధారపడియుంది.2

మనమందరం సహోదర సహోదరీలము మరియు “అందరూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు” అనే దైవిక ప్రేరేపిత సిద్ధాంతం ఈ గొప్ప సమకూర్పు కార్యంలో అంతర్లీనంగా ఉంది. భిన్నమైన ఆర్థిక స్థితి మరియు జాతి గల జనులు మంచి జీవితాలను అనుభవించాలని గాఢంగా కోరుకొనే వారితో ఈ సిద్ధాంతం ఏకీభవిస్తుంది. అటువంటి ప్రయత్నాలను మనం ప్రశంసిస్తాము మరియు వాటిలో చేరుతాము. ఇంకా, దేవుని పిల్లలందరు ఆయన వద్దకు రావాలని, ఆయన సువార్త ద్వారా ఆయన అందించే నిత్య దీవెనలను పొందాలని మనం కోరుకుంటున్నాము.3 సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు యొక్క ముందుమాటలో ఆయన ఇలా ప్రకటించారు, “సుదూర ప్రాంతాలలోనున్న జనులారా వినుడి; సముద్ర ద్వీపాలలోనున్న మీరందరు కలిసి వినుడి.”4

సిద్ధాంతము మరియు నిబంధనలులోని ఆ మొట్టమొదటి వచనం “సముద్ర ద్వీపాలలోనున్న” జనులను చేర్చుకోవడం నాకు నచ్చింది. మూడు ప్రత్యేక పిలుపులలో సేవచేస్తూ, సముద్ర ద్వీపాలలో నివసించాను నేను. మొదట నేను ఒక యువ సువార్తికునిగా బ్రిటీష్ ద్వీపాలలో సేవచేసాను, రెండవది ఫిలిప్పైన్ ద్వీపాలలో ఒక క్రొత్త ప్రధాన అధికారిగా చేసాను, తర్వాత పసిఫిక్ ద్వీపాలలో ప్రాంతీయ అధ్యక్షునిగా చేసాను, అందులో అనేక పాలినేషియన్ ద్వీపాలు కలిపియున్నాయి.

ఈ మూడు ప్రాంతాలు విశ్వాసులను యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తకు విజయవంతంగా సమకూర్చాయి. 1837 లో మొదటిసారి సువార్తికులు బ్రిటీష్ ద్వీపాలకు చేరుకున్నారు. అది జోసెఫ్ స్మిత్ కర్ట్‌లాండ్ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తరువాతి సంవత్సరం, అక్కడ మోషే “భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు ఉత్తర దిక్కునున్న ప్రదేశమునుండి పది గోత్రములను నడిపించు తాళపుచెవులను” ఇచ్చాడు.5 బ్రిటీష్ ద్వీపాలలో తొలి విజయం ఒక ఇతిహాసం. 1851 నాటికి సంఘ సభ్యులలో సగానికి పైగా బ్రిటీష్ ద్వీపాలలో నివసిస్తూ పరివర్తన చెంది, బాప్తిస్మము తీసుకున్నవారే.6

1961 లో, ఎల్డర్ గార్డన్ బి. హింక్లి ఫిలిప్పైన్ ద్వీపాలను సందర్శించి, అక్కడ పూర్తి-కాల సువార్తికుల ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ సమయంలో, అక్కడ ఒకేఒక్క ఫిలిపీనో మెల్కీసెదకు యాజకత్వం కలిగియున్నారు. ఆశ్చర్యకరంగా, ఈరోజు ఫిలిప్పైన్ ద్వీపాలలో 8,50,000లకు పైగా సంఘ సభ్యులున్నారు. ఫిలిపినో జనులను నేను మెచ్చుకుంటాను; వారు రక్షకుని కొరకు గాఢమైన, స్థిరమైన ప్రేమ కలిగియున్నారు.

బహుశా, పాలినేషియన్ ద్వీపాలకు కొనసాగుతున్న సువార్తికుల ప్రయత్నం గురించి తక్కువగా తెలుపబడింది. అది, ఇప్పుడు ఫ్రెంచ్ పాలినేషియాగా పిలువబడుతున్న దానికి 1844లో ఆడిసన్ ప్రాట్ పంపబడినప్పుడు మొదలైంది.7 అనేకమంది పాలినేషియన్లు అప్పటికే నిత్య కుటుంబాలలో విశ్వసించారు మరియు యేసు క్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించారు. ఈనాడు పాలినేషియన్ ద్వీపాలలో ఉన్న పాలినేషియన్లలో దాదాపు 25 శాతం మంది సంఘ సభ్యులు.8

ఒకసారి నేను దూరాన ఉన్న తహితియన్ ద్వీపం నుండి 7వ తరం సభ్యురాలైన 17 ఏళ్ళ అమ్మాయి నుండి విన్నాను. తొలి సంఘ సభ్యులు సాల్ట్ లేక్ లోయకు చేరుకోవడానికి రెండేళ్ళకు ముందు, 1845 లో తుబుఆయిలో పరివర్తన చెందిన తన పూర్వీకులకు ఆమె నివాళులర్పించింది.9

సువార్త సందేశాన్ని అందుకోవడానికి, దానికి స్పందించడానికి జనులందరి కోసం ఒక సమయం, ఒక కాలం ఉంటాయనే మన సిద్ధాంతం స్పష్టమైనది. ఈ ఉదాహరణలు అతి పెద్ద చిత్రంలో ఒక భాగం మాత్రమే. “ఇశ్రాయేలీయులను సమకూర్చడమే అతిపెద్ద సవాలు, … హేతువు మరియు … భూమిపై నేడు జరుగుతున్న కార్యం,”10 అని అధ్యక్షులు నెల్సన్ నిరంతరం నొక్కిచెప్పారు.

మోర్మన్ గ్రంథము యొక్క రాకడ, ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కి ఇవ్వబడిన బయల్పాటు మరియు యాజకత్వ తాళపుచెవులతో కలిపి, యేసు క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడేంత వరకు, ఇశ్రాయేలు సమకూర్పును అర్థం చేసుకోవడం అసంపూర్ణంగా, పరిమితంగా ఉంది.11

“ఇశ్రాయేలు” అనే విలక్షణమైన పేరు యాకోబుకు ఇవ్వబడింది.12 ఇస్సాకు మరియు యాకోబు ద్వారా అబ్రాహాము యొక్క సంతతిని సూచించడానికి అది వచ్చింది. తండ్రియైన అబ్రాహాముకిచ్చిన అసలైన వాగ్దానం మరియు నిబంధన అబ్రాహాము 2:9–10లో చెప్పబడింది, అందులో కొంత ఇలా చదువబడుతుంది:

“నిన్ను గొప్ప జనాంగముగా చేసెదను, …

“నీ నామము ద్వారా [సమస్త జాతులను] నేను ఆశీర్వదించెదను; ఈ సువార్తను అంగీకరించు వారందరు నీ నామముతో పిలువబడి, నీ సంతానముగా యెంచబడుదురు, వారు వృద్ధిచెంది, తమ తండ్రిగా నిన్ను ఘనపరిచెదరు.”

పూర్వమర్త్య ఉనికిలో పరలోకంలో సలహాసభ జరిగినప్పుడు, రక్షణ ప్రణాళిక చర్చించబడి, సమ్మతించబడింది. దానిలో లోకము పునాది వేయబడక మునుపు ఏర్పాటుచేయబడిన మరియు సమకూర్పుపై ఆధారపడిన నిర్దిష్టమైన యాజకత్వ చట్టాలు మరియు విధులు ఉన్నాయి.13 అందులో కర్తృత్వము యొక్క అతిముఖ్యమైన సూత్రము కూడా ఉంది.

సౌలు, దావీదు మరియు సొలొమోను పరిపాలనతో పాటు శక్తివంతమైన జనులుగా అనేక శతాబ్దాలు ఉన్న తర్వాత, ఇశ్రాయేలీయులు విభజింపబడ్డారు. యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రములో కొంతభాగం యూదా రాజ్యముగా మారాయి. పది గోత్రాలుగా గుర్తించబడిన మిగిలిన గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యముగా మారాయి.14 200 ఏళ్ళు విడివిడిగా ఉన్న తర్వాత, అష్షూరు రాజు చేత ఇశ్రాయేలు యొక్క పది గోత్రాలు చెరపట్టబడినప్పుడు క్రీ.పూ. 721లో ఇశ్రాయేలు మొదటిసారి చెదరగొట్టబడింది.15 తర్వాత వారు ఉత్తర దేశాలకు వెళ్ళారు.16

క్రీ.పూ. 600లో, మోర్మన్ గ్రంథ ప్రారంభములో, పితరుడైన లీహై ఒక ఇశ్రాయేలీయుల సమూహాన్ని అమెరికాకు నడిపించాడు. ఇశ్రాయేలీయులు చెదిరిపోవడం గురించి లీహై అర్థం చేసుకున్నాడు, అందులో అతడు భాగమైయున్నాడు. ఇశ్రాయేలు వంశస్థులు “ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడవలెనని, దాని కొమ్మలు త్రుంచివేయబడి భూముఖమంతటా చెదరగొట్టబడవలెనని”17 చెప్పుచూ అతడు నీఫై చేత వ్యాఖ్యానించబడ్డాడు.

నూతన ప్రపంచంగా పిలువబడిన అమెరికాలో, మోర్మన్ గ్రంథములో చెప్పబడిన నీఫైయులు మరియు లేమనీయుల చరిత్ర సుమారు క్రీ.శ. 400 లో అంతమవుతుంది. పితరుడైన లీహై వారసులు అమెరికా అంతటా విస్తరించారు.18

3 నీఫై 5:20లో మోర్మన్ చేత అది స్పష్టంగా వివరించబడింది, అది ఇలా చదువబడుతుంది: “మోర్మన్‌ అను నేను లీహై యొక్క నిజమైన వంశస్థుడను. నా దేవుడు మరియు నా రక్షకుడైన యేసు క్రీస్తును స్తుతించుటకు నాకు హేతువు కలదు, ఏలయనగా ఆయన మా పితరులను యెరూషలేము దేశము నుండి బయటకు తెచ్చెను.”19

ఇశ్రాయేలీయుల కాలక్రమ చరిత్రలో ఉన్నత స్థానం స్పష్టంగా మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క జననము, సందేశము, పరిచర్య మరియు నియమిత కార్యముదే.20

నిత్యత్వపు స్వభావాన్ని నిర్దేశించు రక్షకుని మరణము మరియు పునరుత్థానము తర్వాత, సుపరిచితమైనట్లుగా రోమనుల అణచివేత మరియు హింస కారణంగా క్రీ.శ. 70 మరియు క్రీ.శ. 135 మధ్య యూదాజనులు రెండవసారి చెదరగొట్టబడ్డారు, యూదులు ఆనాటి ప్రపంచమంతటా చెదిరిపోయారు.

అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “నిబంధన సంతానాన్ని సమకూర్చడాన్ని ప్రభువు ప్రారంభించారు అనడానికి చిహ్నంగా మోర్మన్ గ్రంథము వెలుగులోనికి వచ్చింది.”21 ఆవిధంగా, దేవుని బహుమానము మరియు శక్తి చేత జోసెఫ్ స్మిత్ ద్వారా అనువదించబడిన మోర్మన్ గ్రంథము లీహై వారసులకు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులకు, ఇశ్రాయేలు గోత్రములలోనికి దత్తత తీసుకోబడిన అన్యులకు ఉద్దేశించబడింది. 1 నీఫై 22వ అధ్యాయం శీర్షిక కొంతవరకు ఇలా చదువబడుతుంది, “ఇశ్రాయేలీయులు భూముఖమంతటిపై చెదరగొట్టబడుదురు—అంత్యదినములలో అన్యజనులు ఇశ్రాయేలీయులను సువార్తతో సంరక్షించి, పోషించుదురు.” ఈ గ్రంథ ఉద్దేశాలలో ఒకటి “యేసే క్రీస్తు అని యూదుని, అన్యజనుని ఒప్పించుటకైయున్నది” అని మోర్మన్ గ్రంథపు శీర్షిక పేజీలో చదువబడుతుంది. పునఃస్థాపన మరియు మోర్మన్ గ్రంథముతో, ఇశ్రాయేలు సమకూర్పు యొక్క ఉద్దేశ్యం బహుగా విస్తరించింది.22

వంశంతో సంబంధం లేకుండా యేసు క్రీస్తు సువార్తను అంగీకరించే వారు సమకూర్చబడిన ఇశ్రాయేలులో భాగమవుతారు.23 ఆ సమకూర్పు మరియు అసంఖ్యాకంగా నిర్మించబడిన, ప్రకటించబడిన దేవాలయాలతో, తండ్రి యొక్క ప్రణాళికను అనుసరిస్తూ ముందెన్నడూ లేనట్లుగా తెరకు ఇరువైపులా ఇశ్రాయేలును సమకూర్చడానికి మనం ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాము.

నిజమైన ఇశ్రాయేలు సమకూర్పు గురించి మాట్లాడుతూ, అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇలా వ్యాఖ్యానించారు: “ప్రస్తుతం, నిజమైన సంఘములో చేరడం … నిజమైన దేవుని గురించిన జ్ఞానం పొందడం ఇశ్రాయేలు సమకూర్పులో ఉన్నాయి. … కాబట్టి, పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించిన వారు మరియు ఇప్పుడు తమ మాతృభాషలో, తాము నివసించే దేశాలలోని పరిశుద్ధులతో కలిసి ప్రభువును ఆరాధించాలని కోరుకునేవారు ఇశ్రాయేలు సమకూర్పు యొక్క చట్టాన్ని పాటించారు మరియు ఈ అంత్యదినాలలో పరిశుద్ధులకు వాగ్దానం చేయబడిన దీవెనలన్నిటికి వారసులు.”24

“ఇశ్రాయేలు సమకూర్పు ఇప్పుడు పరివర్తనను కలిపియుంది.”25

తరువాత జరిగిన దానిని సంఘ సభ్యులు స్పష్టంగా గ్రహించగలరు, ప్రేమించే, పంచుకొనే, ఆహ్వానించే మరియు ప్రభువు యొక్క నిబంధన దీవెనల సంపూర్ణత్వాన్ని పొందడానికి ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి సహాయపడే విశేషాధికారాన్ని యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు కలిగియున్నారు. ఇందులో ఆఫ్రికన్లు, యూరోపియన్లు, దక్షిణ మరియు ఉత్తర అమెరికన్లు, ఆసియన్లు, ఆస్ట్రేలియన్లు మరియు సముద్ర ద్వీపాలపై ఉన్నవారు ఉన్నారు. “నిశ్చయముగా ప్రభువు స్వరము జనులందరికి వర్తించును.”26 “ప్రపంచ దేశాలలోని పరిశుద్ధుల సమూహములలో నీతిమంతులు సమావేశమయ్యే వరకు ఈ సమకూర్పు కొనసాగాలి.”27

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కంటే మరింత సూటిగా సమకూర్పు గురించి ఎవ్వరూ మాట్లాడలేదు: “ఏ సమయంలోనైనా మీరు చేసేది ఏదైనా అది తెరకు ఇరువైపుల ఎవరికైనా—దేవునితో నిబంధనలు చేయుట వైపు మరియు వారికి ఆవశ్యకమైన బాప్తిస్మపు నిబంధనలు, దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నట్లే. అది అంత సులభమైనది.”28

నేడు సంఘము ఎక్కడుంది? 1960లో నేను సువార్త సేవ ప్రారంభించినప్పటి నుండి 62 సంవత్సరాలలో, ప్రవక్త నుండి పిలుపు పొంది పూర్తి-కాల సువార్తికులుగా సేవచేస్తున్న వారి సంఖ్య 7,683 నుండి 62,544 కు పెరిగింది. మిషనుల సంఖ్య 58 నుండి 411 కు పెరిగింది. సభ్యుల సంఖ్య దాదాపు 17,00,000 నుండి దాదాపు 1,70,00,000 కు పెరిగింది.

సువార్తను పంచుకోవడానికి మన అవకాశాలలో కొన్నిటిని కొవిడ్-19 మహమ్మారి తాత్కాలికంగా ప్రభావితం చేసింది. అది క్రొత్త సాంకేతికతను ఉపయోగించడానికి అనుభవాన్ని కూడా అందించింది, అది సమకూర్పును గొప్పగా పెంచుతుంది. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి సభ్యులు మరియు సువార్తికులు ఇప్పుడు ప్రయత్నాలను విస్తరిస్తున్నందుకు మేము కృతజ్ఞులము. ప్రతీచోట వృద్ధి కొనసాగుతుంది, ప్రత్యేకించి దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికాలలో. హెచ్చైన సువార్త సేవకు అధ్యక్షులు నెల్సన్ ఇచ్చిన శక్తివంతమైన ఆహ్వానానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది స్పందించడాన్ని కూడా మేము అభినందిస్తున్నాము. అయినప్పటికీ, ప్రేమించడానికి, పంచుకోవడానికి మరియు ఆహ్వానించడానికి మన నిబద్ధత గొప్పగా విస్తరించబడగలదు.

ఈ మిషనరీ ప్రయత్నంలో ఆవశ్యకమైన భాగమేమిటంటే, మనం ఎక్కడ నివసించినప్పటికీ,30 సభ్యులుగా మనం ప్రకాశవంతమైన మాదిరులం కావాలి.29 మనం ముసుగు వేసుకొని ఉండలేము. దయ, నీతి, సంతోషం మరియు జనులందరి కోసం మనఃపూర్వకమైన ప్రేమ యొక్క క్రీస్తువంటి మన మాదిరి వారి కోసం దారిచూపే ప్రకాశవంతమైన వెలుగును సృష్టించడం మాత్రమే కాకుండా, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క రక్షణ విధులు మరియు ఉన్నతస్థితిలో ఆత్మీయ రక్షణ ఉందనే గ్రహింపును కూడా ఇవ్వగలదు.

యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకోవడంలో విశేషమైన దీవెనలున్నాయని దయచేసి అర్థం చేసుకోండి. ఆనందం, శాంతి, పాప క్షమాపణ, శోధనల నుండి రక్షణ మరియు దేవుని నుండి స్థిరమైన శక్తి గురించి లేఖనాలు మాట్లాడతాయి.31 ఈ మర్త్య జీవితం తరువాత ఉన్నదానిని పరిగణిస్తూ మనం, “మృతుల ఆత్మలుండు ఆ గొప్ప లోకములో పాపపు బంధకములోను, అంధకారములోనున్న వారితో”32 సువార్తను పంచుకోవడానికి సిద్ధపడియుంటాము.

ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి సహాయపడమని ప్రభువు చేత మరియు మన ప్రియమైన ప్రవక్త చేత ఇవ్వబడిన శక్తివంతమైన ఉపదేశాన్ని మనం వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ఎలా అంగీకరిస్తామో పునర్వీక్షించమని నేడు ప్రతీ బిడ్డ, యువకుడు, యువతి, కుటుంబము, సమూహము, ఉపశమన సమాజము మరియు తరగతి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను.

మనం కర్తృత్వాన్ని గౌరవిస్తాం. ఈ లౌకిక ప్రపంచంలో, అనేకమంది స్పందించరు మరియు ఇశ్రాయేలును సమకూర్చుటలో పాల్గొనరు. కానీ అనేకులు పాల్గొంటారు మరియు ఆయన సువార్తను పొందిన వారు దేవుని వద్దకు రావడానికి ఇతరులకు సహాయపడే ప్రకాశవంతమైన మాదిరిగా ఉండడానికి అవశ్యముగా ప్రయత్నించాలని ప్రభువు ఆశిస్తున్నారు. ఇది భూమి అంతటానున్న మన సహోదర సహోదరీలు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క పరలోక దీవెనలను, విధులను ఆనందించడానికి మరియు సురక్షితంగా ఇంటికి చేర్చబడడానికి అనుమతిస్తుంది.

యేసు క్రీస్తు యొక్క దైవత్వం మరియు మన కోసం మన పరలోక తండ్రి ప్రణాళికను గూర్చి యేసు క్రీస్తు నామంలో నేను నిశ్చయమైన మరియు ఖచ్చితమైన నా అపొస్తలత్వ సాక్ష్యాన్ని ఇస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “స్వాగత సందేశం,” లియహోనా,2021 మే , 7.

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి.

  3. 2 నీఫై 26:33 చూడండి.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:4లో ప్రభువు ఇలా కొనసాగించారు: “ఈ అంత్య దినములలో నేనెన్నుకొనిన నా శిష్యుల నోటిమాట ద్వారా ఈ హెచ్చరించు స్వరము సమస్త జనులకు వర్తించును.”

  5. సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11.

  6. 1851లో సంఘములో మొత్తం సభ్యుల సంఖ్య 52,165. ఇంగ్లండు మరియు వేల్స్‌లో ఉన్న సంఘ గ్రంథాలు మరియు “Religious Census of 1851 (1851 యొక్క మతపరమైన జనాభాలెక్కలు)” ప్రకారం ఆ ప్రదేశాలలో 28,000ల మందికి పైగా సభ్యులున్నారు (see Robert L. Lively Jr., “Some Sociological Reflections on the Nineteenth-Century British Mission,” in Mormons in Early Victorian Britain, ed. Richard L. Jensen and Malcolm R. Thorp [1989], 19–20).

  7. See Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, vol. 1, The Standard of Truth, 1815–1846 (2018), 494–95, 514–15, 573.

  8. టోంగా: 45 శాతం; సమోవా: 31 శాతం; అమెరికన్ సమోవా: 22.5 శాతం; మరియు ఫ్రెంచ్ పాలినేషియా: 7 శాతం.

  9. See Saints, 573–74.

  10. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), HopeofIsrael.ChurchofJesusChrist.org.

  11. ఈ ప్రత్యేకమైన, శక్తివంతమైన సిద్ధాంతము మోర్మన్ గ్రంథములో ఉంది మరియు క్లుప్తంగా పదవ విశ్వాస ప్రమాణంలో ఉంది, అది ఇలా ప్రారంభమవుతుంది, “పది గోత్రములు పునరుద్ధరింపబడుననియు మరియు ఇశ్రాయేలీయులు సమకూర్చబడుదురనియు మేము నమ్ముచున్నాము.” (see James E. Talmage, The Articles of Faith, 12th ed. [1924], 314–44).

  12. ఆదికాండము 32:28లో ఇలా నమోదు చేయబడినది, “నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదు.”

  13. See Joseph Smith, in “History, 1838–1856, volume D-1,” 1572, josephsmithpapers.org; see also Joseph Smith, “Discourse, 11 June 1843–A, as Reported by Wilford Woodruff,” [42–43], josephsmithpapers.org; Joseph Smith, “Discourse, 11 June 1843–A, as Reported by Willard Richards,” [241], josephsmithpapers.org.

  14. See Bible Dictionary, “Israel, Kingdom of”; James E. Talmage, The Articles of Faith, 315. యూదా రాజ్యముగా ప్రసిద్ధిచెందిన రెహొబాము మరియు అతని పౌరులు ఆధునిక ఇశ్రాయేలు యొక్క దక్షిణ భాగములో ఉన్నారు.

  15. 2 రాజులు 17:23 చూడండి.

  16. సిద్ధాంతము మరియు నిబంధనలు 133:26 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11 కూడా చూడండి.

  17. 1 నీఫై 10:12. తరువాత అమ్మోన్ ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు వృక్షము యొక్క కొమ్మయైయుండి, దాని శరీరము నుండి అన్యదేశములో తప్పిపోయిన ఈ జనులను గూర్చి ఆలోచన కలిగియున్న నా దేవుని నామము ధన్యమగునుగాక” (ఆల్మా 26:36).

  18. లేమనీయులైన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్, సీయోను అనగా అమెరికాలన్నీ అని బోధించారు. “మనము ఇశ్రాయేలులో ఉన్నాము మరియు సమకూర్చబడుతున్నాము,” అని అధ్యక్షులు కింబల్ అన్నారు (The Teachings of Spencer W. Kimball, ed. Edward L. Kimball [1982], 439).

  19. తన కుటుంబాన్ని తీసుకొని అరణ్యములోనికి వెళ్ళమని తండ్రియైన లీహైకు ఉపదేశించబడినప్పుడు, కొంతవరకు దానికి కారణము యెరూషలేము నాశనము చేయబడుతుందని కావచ్చు (1 నీఫై 2 చూడండి). సొలొమోను దేవాలయము యొక్క నాశనము, యెరూషలేము యొక్క పతనము మరియు యూదా గోత్రము యొక్క చెర సుమారు క్రీ.పూ. 586 లో సంభవించాయి.

    “సుమారు క్రీ.పూ. 720లో ఇశ్రాయేలు జయించబడింది మరియు దాని 10 గోత్రాలు బయటికి తరిమివేయబడ్డాయి. … [యెరూషలేములో,] బబులోనీయుల రాజైన నెబుకద్నేజరు సైన్యము చేత చివరిగా క్రీ.పూ. 586 లో పూర్తిగా నాశనము చేయబడక ముందు, విదేశీ శక్తుల చేత చేయబడిన అనేక దాడులను సొలొమోను దేవాలయం తట్టుకుంది” (David B. Green, “The History of the Jewish Temple in Jerusalem,” Haaretz, Aug. 11, 2014, haaretz.com/jewish/.premium-history-of-the-temple-in-jerusalem-1.5256337). 2 రాజులు 25:8-9 కూడా చూడండి.

  20. See Tad R. Callister, The Infinite Atonement (2000).

  21. రస్సెల్ ఎం. నెల్సన్, “Children of the Covenant,” Ensign, May 1995, 33; కూడా చూడండి:“నిబంధనలు,” లియహోనా, Nov. 2011, 88.చూడండి:

  22. See Russell M. Nelson, in R. Scott Lloyd, “Seminar for New Mission Presidents: ‘Swift Messengers’ to Scattered Israel,” Church News, July 13, 2013, thechurchnews.com. సమకూర్పు “అనేది భౌతిక ప్రదేశానికి సంబంధించినది కాదు, అది వ్యక్తిగత నిబద్ధతకు సంబంధించినది. వారి స్వదేశాలను విడిచిపెట్టకుండానే జనులు ‘ప్రభువు యొక్క జ్ఞానమునకు తేబడగలరు,’[3 నీఫై 20:13]” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వ్యాఖ్యానించారు (“The Gathering of Scattered Israel,” లియహోనా, Nov. 2006, 81). 3 నీఫై 21:1-7 కూడా చూడండి.

  23. మన సిద్ధాంతము స్పష్టమైనది; వారి తిరుగుబాటు మరియు వారి అవినీతి కారణంగా ప్రభువు ఇశ్రాయేలు యొక్క గోత్రములను చెదరగొట్టారు. అయినప్పటికీ, ప్రభువు తాను ఎన్నుకున్న ప్రజలను ప్రపంచ దేశాల మధ్య చెదరగొట్టడాన్ని కూడా ఆ దేశాలను ఆశీర్వదించడానికి ఉపయోగించారు. (See Guide to the Scriptures, “Israel—The Scattering of Israel,” scriptures.ChurchofJesusChrist.org.)

  24. Spencer W. Kimball, The Teachings of Spencer W. Kimball, 439.

  25. Summary heading in Spencer W. Kimball, The Teachings of Spencer W. Kimball, 438. “All Are Alike unto God (అందరూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు)” సంచిక కూడా చూడండి. ఈ. డేల్ లీబారన్ (1990), నల్లజాతి ఆప్రికా కడవరి-దిన పరిశుద్ధుల చేత చెప్పబడిన 23 పరివర్తన వృత్తాంతాల సేకరణ. సహోదరి జూలియా ఎన్. మవింబ్లా ఇలా అన్నారు, నేను సంఘములో చేరడానికి మరియు ఇశ్రాయేలు అనే పదానికి రావడానికి ముందు, ఈ పుస్తకాన్ని ప్రక్కకు పడేసి అన్నాను, ‘ఇది తెల్లవారి కోసం. మన కోసం కాదు. మనం ఎన్నుకోబడలేదు.’ నేను నీతిగా జీవిస్తే నేనొక రాజ కుటుంబానికి చెందియుంటానని ఈరోజు నేను తెలుసుకున్నాను. నేనొక ఇశ్రాయేలీయురాలిని మరియు నేను దేవాలయంలో నా విధులను చేస్తున్నప్పుడు, భూమిపై మనమందరం ఒకే కుటుంబంగా ఉన్నామనే భావనను నేను పొందాను” (in “All Are Alike unto God,” 151).

  26. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:2.

  27. Spencer W. Kimball, The Teachings of Spencer W. Kimball, 438.

  28. రస్సెల్ ఎం. నెల్సన్, “Hope of Israel.”

  29. “విశ్వాసులకు మాదిరిగానుండుము,” అని తన యువ స్నేహితుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు చెప్పాడు (1 తిమోతి 4:12).

  30. 3 నీఫై 18:24 చూడండి.

  31. మోషైయ 18:8–13; 3 నీఫై 18:25; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16; 31:5; 62:3 చూడండి.

  32. సిద్ధాంతము మరియు నిబంధనలు 138:57.