సర్వసభ్య సమావేశము
“నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు”
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


“నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు”

ప్రతిరోజూ పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు దగ్గరకు రావడం ఆనందాన్ని—మన ఊహకు అందని ఆనందాన్ని అనుభవించడానికి మార్గం.

తన మర్త్య పరిచర్య అంతటా, రక్షకుడు దేవుని పిల్లలందరి పట్ల—ముఖ్యంగా కష్టాల్లో ఉన్న లేదా పతనమైపోయిన వారి పట్ల గొప్ప కనికరాన్ని చూపించారు. పాపులతో సహవాసం చేయడం మరియు వారి మధ్య భోజనం చేయడం గురించి పరిసయ్యులు విమర్శించినప్పుడు, యేసు మూడు సుపరిచితమైన ఉపమానాలను బోధించడం ద్వారా ప్రతిస్పందించారు.1 ఈ ఉపమానాలలో ప్రతీదానిలో, దారితప్పిన వారిని వెతకడం యొక్క ప్రాముఖ్యతను మరియు వారు తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉదాహరణకు, తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానంలో, “మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు [ఎక్కువ] సంతోషము కలుగును” అని ఆయన చెప్పారు.2

ఈ రోజు, నేను ఆనందానికి, పశ్చాత్తాపానికి మధ్య ఉన్న సంబంధం గురించి—ప్రత్యేకంగా, మనం పశ్చాత్తాపపడినప్పుడు వచ్చే ఆనందం మరియు క్రీస్తు వద్దకు రమ్మని, ఆయన ప్రాయశ్చిత్త త్యాగాన్ని వారి జీవితాల్లో అన్వయించమని ఇతరులను ఆహ్వానిస్తున్నప్పుడు మనం పొందే ఆనంద భావాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను.

మనము సంతోషము కలిగియుండునట్లు మనము ఉనికిలో ఉన్నాము

లేఖనాలలో, ఆనందము అనే పదానికి సంతృప్తి యొక్క క్షణాలు లేదా సంతోషం యొక్క భావాలు కంటే చాలా ఎక్కువ అని అర్థం. ఈ సందర్భంలో ఆనందం అనేది దైవిక లక్షణం, మనం దేవుని సన్నిధిలో నివసించడానికి తిరిగి వెళ్ళినప్పుడు దాని సంపూర్ణ సంతోషము కనుగొనబడుతుంది.3 ఈ ప్రపంచం అందించగల ఆనందం లేదా ఓదార్పులన్నిటి కంటే ఇది చాలా లోతైనది, ఉన్నతమైనది, శాశ్వతమైనది మరియు జీవితాన్ని-మార్చగలిగినది.

మనము ఆనందాన్ని పొందేందుకు సృష్టించబడ్డాం. ప్రేమగల పరలోక తండ్రి బిడ్డలుగా ఇది మనకు ఉద్దేశించబడిన విధి. ఆయన తన ఆనందాన్ని మనతో పంచుకోవాలనుకుంటున్నారు. మనము “సంతోషము కలిగియుండాలి” అనేది మనలో ప్రతీఒక్కరి కోసం దేవుని ప్రణాళిక అని లీహై ప్రవక్త బోధించాడు.4 మనము పతనమైన లోకంలో జీవిస్తున్నాము కాబట్టి, ఆనందాన్ని కలిగియుండడం లేదా శాశ్వతమైన ఆనందాన్ని పొందడం తరచుగా మన పరిధికి మించి కనిపిస్తుంది. ఇంకా తదుపరి వచనములో, “[మనల్ని] పతనము నుండి విమోచించుటకు … మెస్సీయ [వచ్చును]” అని కూడా లీహై వివరించ సాగాడు.5 రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా పొందే విమోచన ఆనందాన్ని సాధ్యం చేస్తుంది.

సువార్త సందేశం నిరీక్షణతో కూడిన సందేశము, “మహా సంతోషకరమైన సువర్తమానము”6 మరియు ఈ జీవితంలో అందరూ శాంతిని, ఆనందాన్ని అనుభవించడానికి, రాబోయే జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి గల మార్గము.7

మనము మాట్లాడే ఆనందము విశ్వాసులకు బహుమానం, అయినప్పటికీ అది వెలతో వస్తుంది. ఆనందం చౌక కాదు లేదా మామూలుగా ఇవ్వబడదు. బదులుగా, అది “[యేసు] క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముచేత” కొనుగోలు చేయబడింది.8 నిజమైన, దైవిక సంతోషం యొక్క విలువను మనం నిజంగా అర్థం చేసుకున్నట్లయితే, ఆ సంతోషాన్ని స్వీకరించడానికి ఎటువంటి ప్రాపంచిక ఆస్తినైనా త్యాగం చేయడానికి లేదా జీవితంలో అవసరమైన మార్పులను చేయడానికి మనం వెనుకాడము.

మోర్మన్‌ గ్రంథము‌లో శక్తివంతుడైనప్పటికీ, వినయముగల ఒక రాజు దీనిని అర్థం చేసుకున్నాడు. “నేనేమి చేయవలెను,” “నేను దేవుని ద్వారా జన్మించుటకు, ఈ దుష్టాత్మ నా రొమ్ము నుండి పెకిలించబడి ఆనందముతో నింపబడునట్లు ఆయన ఆత్మను స్వీకరించుటకు … నేనేమి చేయవలెను? అని అతడు అనెను. ఇదిగో, నేను కలిగియున్న దానంతటినీ ఇచ్చివేసెదను, అంతేకాక ఈ గొప్ప సంతోషమును పొందుటకు నేను నా రాజ్యమును వదిలివేసెదనని” అతడు చెప్పెను.9

రాజు ప్రశ్నకు సమాధానంగా, సువార్తికుడైన అహరోను అతనితో ఇట్లనెను, “నీవు ఈ విషయమును కోరిన యెడల, … దేవుని యెదుట వంగి నమస్కరించి, … [మరియు] నీ పాపములన్నిటి విషయమై నీవు పశ్చాత్తాపపడవలెను.”10 పశ్చాత్తాపం ఆనందానికి మార్గము, 11 ఎందుకనగా అది రక్షకుడైన యేసు క్రీస్తు వైపుకు నడిపించే మార్గం.12

హృదయపూర్వక పశ్చాత్తాపం ద్వారా ఆనందం వస్తుంది

పశ్చాత్తాపాన్ని ఆనందానికి మార్గంగా భావించడం కొందరికి విరుద్ధంగా అనిపించవచ్చు. పశ్చాత్తాపం, కొన్నిసార్లు బాధాకరంగా మరియు కష్టంగా ఉంటుంది. మన ఆలోచనలు మరియు చర్యలలో కొన్ని—మన నమ్మకాలలో కూడా కొన్ని తప్పుగా ఉన్నాయని అంగీకరించడం దానికి అవసరం. పశ్చాత్తాపానికి మార్పు కూడా అవసరం, అది కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ ఆనందం మరియు సౌకర్యం ఒకటి కాదు. ఆత్మసంతృప్తి గల పాపంతో సహా—పాపం—మన ఆనందాన్ని పరిమితం చేస్తుంది.

కీర్తనకారుడు చెప్పినట్లుగా, “ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.”13 మన పాపాల గురించి మనం పశ్చాత్తాపపడుతున్నప్పుడు, దాని తర్వాత వచ్చే గొప్ప ఆనందంపై మనం దృష్టి పెట్టాలి. రాత్రులు చాలా సుదీర్ఘమైనవిగా అనిపించవచ్చు, కానీ ఉదయం వస్తుంది, రక్షకుని ప్రాయశ్చిత్తము మనల్ని పాపము మరియు బాధల నుండి విముక్తి చేస్తున్నప్పుడు మనము అనుభవించే శాంతి మరియు ఉల్లాసమైన ఆనందం ఎంతో అద్భుతమైనది.

నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు

మోర్మన్‌ గ్రంథము‌లో ఆల్మా అనుభవాన్ని పరిగణించండి. అతడు “నిత్య వేదనతో బాధింపబడ్డాడు” మరియు అతని పాపాల కారణంగా అతని ఆత్మ “బాధింపబడింది”. కానీ అతడు కనికరం కోసం ఒక్కసారి రక్షకుని వైపు తిరిగినప్పుడు, అతడు “ఇకపై [తన] బాధలను జ్ఞాపకముంచుకోలేదు.”14

“ఓహో! నేను ఎంత ఆనందమును అనుభవించితిని,” “ఎంత ఆశ్చర్యకరమైన వెలుగును చూచితిని! … నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదు” అని అతడు ప్రకటించాడు.15

పశ్చాత్తాపము ద్వారా యేసు క్రీస్తు వద్దకు వచ్చేవారికి ఈ రకమైన ఆనందం లభ్యమవుతుంది.16 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా:

“పశ్చాత్తాపము అనేది యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క శక్తిని మనము సమీపించుటకు మార్గము తెరుస్తుంది.…

పశ్చాత్తాపపడుటకు మనం ఎంచుకొన్నప్పుడు, మారుటకు మనం ఎంచుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్ఠమైన వ్యక్తులుగా మార్చుటకు ఆయనను మనం అనుమతిస్తాము. మనం ఆత్మీయంగా ఎదుగుటకు, ఆనందమును పొందుటకు అనగా—ఆయన యందు విమోచన ఆనందమును పొందుటకు మనం ఎంచుకుంటాము. మనం పశ్చాత్తాపపడాలని ఎంచుకొన్నప్పుడు, మనం మరింతగా యేసు క్రీస్తువలె ఉండుటకు ఎంచుకొంటాము!”17

పశ్చాత్తాపం ఆనందాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పొందేందుకు మన హృదయాలను సిద్ధం చేస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడడమంటే ఆనందంతో నింపబడడం. ఆనందంతో నింపబడడం అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం.18 మన జీవితాల్లోకి ఆత్మను తీసుకురావడానికి మనం ప్రతిరోజూ పని చేస్తున్నప్పుడు మన ఆనందం పెరుగుతుంది. ప్రవక్తయైన మోర్మన్‌ బోధించినట్లుగా, “అయినప్పటికీ సంతోషము మరియు ఓదార్పుతో వారి ఆత్మలు నింపబడు వరకు, వారు తరచుగా ఉపవాసముండి ప్రార్థించిరి; వారి తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అయ్యిరి.”19 ప్రభువు తనను అనుసరించడానికి పని చేసే వారందరికీ, “నా ఆత్మను నీకిచ్చెదను, అది నీ మనస్సును వెలిగించి, నీ ఆత్మను సంతోషముతో నింపును” అని వాగ్దానమిచ్చారు.20

ఇతరులు పశ్చాత్తాపపడడానికి సహాయం చేయడంలో ఆనందం

హృదయపూర్వక పశ్చాత్తాపం వల్ల కలిగే ఆనందాన్ని మనము అనుభవించిన తర్వాత, సహజంగానే ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటాము. మనము అలా చేసినప్పుడు, మన ఆనందం రెట్టింపవుతుంది. ఆల్మాకు సరిగ్గా అదే జరిగింది.

“ఇది నా మహిమ,” “కొన్ని ఆత్మలనైనా పశ్చాత్తాపపడునట్లు చేయుటకు దేవుని హస్తములలో బహుశా నేను ఒక సాధనముగా ఉందునేమోననునది నా అతిశయమైయున్నది మరియు ఇది నా సంతోషమైయున్నది.

“ఇదిగో నా సహోదరులలో అనేకులు నిజముగా పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువు వద్దకు వచ్చుటను నేను చూచినప్పుడు, నా ఆత్మ సంతోషముతో నిండును; అప్పుడు ప్రభువు నా పట్ల చేసిన దానిని, … నేను జ్ఞాపకము చేసుకొనెదను; ఆయన నా వైపు చాపిన కనికరబాహువును నేను జ్ఞాపకము చేసుకొనెదను”21 అని అతడు చెప్పాడు.

పశ్చాత్తాపపడేందుకు ఇతరులకు సహాయం చేయడం రక్షకుని పట్ల మనకున్న కృతజ్ఞత యొక్క సహజ వ్యక్తీకరణ; మరియు అది గొప్ప ఆనందానికి మూలం. ప్రభువు ఇలా వాగ్దానం చేశారు:

“మీరు … నా యొద్దకు కేవలము ఒక్క ఆత్మను తెచ్చిన యెడల, అతనితో నా తండ్రి రాజ్యములో మీ ఆనందము ఎంత గొప్పదగును!

“ఇప్పుడు, మీరు నా తండ్రి రాజ్యములోనికి నా యొద్దకు తెచ్చిన ఒక్క ఆత్మతో మీ ఆనందము గొప్పదైనప్పుడు, … అనేక ఆత్మలను మీరు నా యొద్దకు తెచ్చిన యెడల మీ ఆనందము ఎంత గొప్పదగును!” 22

పశ్చాత్తాపపడు ఆత్మయందు ఆయన ఆనందం ఎంత గొప్పది

మన జీవితాల్లో ఆయన ప్రాయశ్చిత్త త్యాగం యొక్క ఆశీర్వాదాలను మనం పొందిన ప్రతిసారీ రక్షకుడు అనుభవించాల్సిన ఆనందాన్ని ఊహించడానికి ప్రయత్నించడం నాకు సహాయకరంగా ఉంది.23 అధ్యక్షులు నెల్సన్ ఉదహరించినట్లుగా,24 అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన లేఖలో ఈ సున్నితమైన అంతర్దృష్టిని పంచుకున్నాడు: “మనము కూడ … సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, … మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచెదము; ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించి … దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.”25 మనము గెత్సేమనే మరియు కల్వరి యొక్క నొప్పి మరియు బాధల గురించి తరచుగా మాట్లాడతాము, కానీ రక్షకుడు మన కోసం తన జీవితాన్ని అర్పించినప్పుడు ఆయన ఊహించిన గొప్ప ఆనందం గురించి మనం చాలా అరుదుగా మాట్లాడతాము. స్పష్టంగా, మనం ఆయనతో దేవుని సన్నిధికి తిరిగి రావడంలో ఆనందాన్ని అనుభవించగలుగునట్లు ఆయన నొప్పి మరియు ఆయన బాధ మన కోసం ఉన్నాయి.

ప్రాచీన అమెరికాలోని ప్రజలకు బోధించిన తర్వాత, రక్షకుడు వారి పట్ల తనకున్న గొప్ప ప్రేమను ఇలా వ్యక్తం చేశారు:

“ఇప్పుడు మిమ్ములను బట్టి, … నా సంతోషము సంపూర్ణమగు వరకు గొప్పదాయెను; అవును, … తండ్రి మరియు సమస్త పరిశుద్ధ దేవదూతలు కూడా ఆనందించెదరు.

“… [మీయందు] నేను సంపూర్ణ సంతోషమును కలిగియున్నాను.”26

క్రీస్తు వద్దకు చేరి ఆయన ఆనందాన్ని పొందండి

సహోదర సహోదరీలారా, నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా ముగిస్తాను, దానిని నేను పవిత్ర బహుమతిగా భావిస్తున్నాను. యేసు క్రీస్తు లోక రక్షకుడని మరియు విమోచకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మనలో ప్రతీఒక్కరినీ ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. ఆయనలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనకు సహాయం చేయడమే ఆయన ఏక దృష్టి, ఆయన “కార్యమును మరియు [ఆయన] మహిమయైయున్నది.”27 ప్రతిరోజూ పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు దగ్గరకు రావడం ఆనందాన్ని—మన ఊహకు అందని ఆనందాన్ని అనుభవించడానికి మార్గం అని చెప్పడానికి నేను ఒక వ్యక్తిగత సాక్షిని.28 అందుకొరకే మనం ఈ భూమి మీద ఉన్నాం. అందుకొరకే దేవుడు మన కోసం తన గొప్ప సంతోష ప్రణాళికను సిద్ధం చేశారు. యేసు క్రీస్తు నిజముగా “మార్గము, సత్యము, జీవము”29 మరియు “దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షింపబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన ఒకే ఒక్క పేరు.”30 ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.