సర్వసభ్య సమావేశము
క్రీస్తునందు ఏకమైయున్నారు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తునందు ఏకమైయున్నారు

యేసు క్రీస్తు పట్ల మన వ్యక్తిగత విధేయత మరియు ప్రేమ ద్వారా మాత్రమే మనం ఒక్కటిగా ఉండడాన్ని ఆశించగలము.

అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ పేర్కొన్నట్లుగా, ఈరోజు మట్టల ఆదివారం, పరిశుద్ధ వారపు ప్రారంభం, యెరూషలేములోనికి ప్రభువు యొక్క విజయోత్సవ ప్రవేశానికి, గెత్సేమనెలో ఆయన బాధకు, కొద్దిరోజుల తర్వాత సిలువపై మరణానికి, ఈస్టరు ఆదివారంనాడు మహిమకరమైన ఆయన పునరుత్థానానికి గుర్తు. మనల్ని విమోచించడానికి క్రీస్తు సహించిన దానిని ఎన్నడూ మరచిపోమని తీర్మానించుకుందాం.1 సమాధిపై ఆయన పొందిన విజయం మరియు సార్వత్రిక పునరుత్థానం యొక్క బహుమానం గురించి మనం ఆలోచించినప్పుడు, ఈస్టరునాడు మనం అనుభవించే అమితానందాన్ని మరొకసారి ఎన్నడూ కోల్పోకుండా ఉందాం.

ఆయన కోసం వేచియున్న శ్రమలు మరియు సిలువధారణకు ముందు సాయంత్రం పస్కా భోజనానికి యేసు తన అపొస్తలులతో చేరారు. ఈ చివరి భోజనం యొక్క ముగింపులో, పవిత్ర మధ్యవర్తిత్వ ప్రార్థనలో, యేసు తన తండ్రికి ఈ మాటలలో విన్నవించుకున్నారు: “పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు [నా అపొస్తలులను] కాపాడుము.”2

తర్వాత, మృదువుగా రక్షకుడు విశ్వాసులందరిని చేర్చుతూ తన విన్నపమును విస్తరించారు:

“మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు;

“వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.”3

ఏకమగుట అనేది యేసు క్రీస్తు సువార్తయందు మరియు ఆయన పిల్లలతో దేవుని వ్యవహారములందు పునరావృతమయ్యే విషయము. హనోకు కాలంలో సీయోను పట్టణం గురించి, “వారు ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియుండిరి,”4 అని చెప్పబడింది. యేసు క్రీస్తు యొక్క ఆదిమ సంఘములోని తొలి పరిశుద్ధుల గురించి క్రొత్త నిబంధన ఇలా నమోదు చేస్తుంది, “విశ్వసించిన వారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారైయుండిరి.”5

మన యుగములో, “ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు,”6 అని ప్రభువు హెచ్చరించారు. మిస్సోరిలోని తొలి పరిశుద్ధులు సీయోనును స్థాపించడంలో విఫలమవడానికి ప్రభువు చెప్పిన కారణాలలో ఒకటి, “సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమునకు కావలసిన ఐక్యతను బట్టి వారు ఏకము కాలేదు.”7

అందరి హృదయాలు, మనస్సులలో దేవుడు ప్రబలినచోట, జనులు “ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానము”8 అని వర్ణించబడ్డారు.

పునరుత్థానం చెందిన రక్షకుడు ప్రాచీన మోర్మన్ గ్రంథ జనులకు అగుపించినప్పుడు, గతంలో బాప్తిస్మము మరియు ఇతర విషయాల గురించి జనుల మధ్య వివాదాలున్నాయని అసమ్మతితో ఆయన పేర్కొన్నారు. ఆయనిలా ఆజ్ఞాపించారు:

“ఇంతవరకు ఉన్నట్లుగా మీ మధ్య ఏ వివాదములుండరాదు లేదా ఇంతవరకు ఉన్నట్లు నా సిద్ధాంతము యొక్క అంశములను గూర్చి మీ మధ్య వివాదములుండరాదు.

“ఏలయనగా నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, వివాదము యొక్క ఆత్మను కలిగియున్నవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రియైన అపవాది సంబంధియైయున్నాడు.”9

మన అత్యంత వివాదాస్పద ప్రపంచంలో, ప్రత్యేకించి మనము “ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే”10 కలిగియుండవలసిన సంఘములో ఐక్యత ఎలా సాధించబడుతుంది? పౌలు మనకు ఉపాయమిచ్చాడు:

“క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

“ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసు క్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.”11

మరేయితర దానిపై ఆధారపడి లేదా మరేయితర నామము క్రింద ఏకమవ్వకపోవడానికి మన మధ్య అనేక తేడాలున్నాయి మరియు కొన్నిసార్లు మనం అసమ్మతితో ఉంటాము. యేసు క్రీస్తునందు మాత్రమే మనం నిజంగా ఏకమవ్వగలము.

క్రీస్తునందు ఏకమవ్వడం ఒక్కొక్కటిగా జరుగుతుంది—ప్రతీఒక్కరం మనతోమనం ప్రారంభిస్తాము. మనం శరీరం మరియు ఆత్మ గల ద్వంద్వ జీవులం మరియు కొన్నిసార్లు మనతో మనం యుద్ధం చేస్తాము. పౌలు వ్యక్తపరచినట్లు:

“అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను;

“గాని వేరొక నియమము [నా శరీర] అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది.”12

యేసు కూడా శరీరము మరియు ఆత్మ కలిగియున్న జీవి. ఆయన పరీక్షించబడ్డారు; ఆయన అర్థం చేసుకుంటారు; మనలోమనం ఐక్యతను సాధించడానికి ఆయన మనకు సహాయపడతారు.13 కాబట్టి, క్రీస్తు యొక్క వెలుగు మరియు కృపపై ఆధారపడి మనం మన ఆత్మ మరియు పరిశుద్ధాత్మకు శరీరంపై ఆధిపత్యాన్నివ్వడానికి ప్రయత్నిస్తాము. మనం సాధించలేకపోయినప్పుడు, క్రీస్తు తన ప్రాయశ్చిత్తము ద్వారా పశ్చాత్తాప బహుమానాన్ని, మళ్ళీ ప్రయత్నించే అవకాశాన్ని మనకిచ్చారు.

వ్యక్తిగతంగా మనలో ప్రతీఒక్కరు “క్రీస్తును ధరించుకొన్నట్లయితే,” అప్పుడు కలిసి ఏకమవ్వడానికి, పౌలు చెప్పినట్లు, “క్రీస్తు యొక్క శరీరమవ్వడానికి”14 మనం ఆశించగలము. “క్రీస్తును ధరించుకొనుట” అనేది నిశ్చయంగా “ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆయన ఆజ్ఞను”15 మన మొదటి మరియు ముఖ్యమైన ఒప్పందంగా చేసుకోవడాన్ని కలిపియుంది మరియు మనం దేవుడిని ప్రేమించినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తాము.16

మనవలె మన పొరుగువారిని ప్రేమించాలని మొదటి ఆజ్ఞతో విడదీయలేనంతగా అనుసంధానించబడిన రెండవ ఆజ్ఞను మనం ఆలకించినప్పుడు— క్రీస్తు యొక్క శరీరమందు మన సహోదర సహోదరీలతో ఐక్యత పెరుగుతుంది.17 ఒకవేళ మనం ఈ రెండవ ఆజ్ఞ గురించి రక్షకుని ఉన్నతమైన, పరిశుద్ధమైన వ్యక్తీకరణ—మనల్ని మనం ప్రేమించినట్లుగా మాత్రమే కాకుండా ఆయన మనల్ని ప్రేమించినట్లుగా18 ఒకరినొకరం ప్రేమించినట్లయితే, మన మధ్య మరింత ఎక్కువ పరిపూర్ణమైన ఐక్యత పొందబడుతుందని నేననుకుంటున్నాను. మొత్తానికి, “ప్రతి మనుష్యుడు తన పొరుగు వాని ఆసక్తిని వెదకుటకు, దేవుని మహిమ కొరకు ఏకదృష్టితో అన్ని సంగతులు చేయవలెను.”19

అధ్యక్షులు మారియన్ జి. రామ్ని, ప్రథమ అధ్యక్షత్వములో మాజీ సలహాదారుడు, శాశ్వతమైన శాంతి మరియు ఐక్యత ఏవిధంగా పొందబడుతుందో వివరిస్తూ, ఇలా అన్నారు:

“ఒక వ్యక్తి సాతానుకు లొంగి, శరీర కార్యముల చేత నింపబడినట్లయితే, తనలోతాను యుద్ధం చేస్తాడు. ఇద్దరు లొంగినట్లయితే, వారు తమలోతాము యుద్ధం చేసుకుంటారు మరియు ఒకరితో ఒకరు కలహిస్తారు. అనేకమంది లొంగినట్లయితే, ఒక సమాజము గొప్ప ఒత్తిడి మరియు వివాదపు ఫలితాలను అనుభవిస్తుంది. ఒక దేశ పరిపాలకులు లొంగినట్లయితే, ప్రపంచవ్యాప్త వివాదం ఉంటుంది.”

అధ్యక్షుడు రామ్ని కొనసాగించారు: “శరీర కార్యములు సార్వత్రికంగా అన్వయించినట్లే, శాంతి సువార్త కూడా అన్వయిస్తుంది. ఒక వ్యక్తి దానిని బట్టి జీవించినట్లయితే, అతడు తన లోపల శాంతిని కలిగియుంటాడు. ఇద్దరు వ్యక్తులు దానిని బట్టి జీవించినట్లయితే, వారు తమలోతాము మరియు ఒకరితో ఒకరు శాంతి కలిగియుంటారు. పౌరులు దానిని బట్టి జీవించినట్లయితే, దేశం అంతరంగిక శాంతిని కలిగియుంటుంది. ప్రపంచ వ్యవహారాలను నియంత్రించడానికి తగినన్ని దేశాలు ఆత్మ ఫలాలను ఆనందించినట్లయితే, అప్పుడు, కేవలం అప్పుడు, ప్రపంచంలో ఇక యుద్ధాలు ఉండవు, జనులకు యుద్ధ సంకేతాల అవసరం ఉండదు. … (See Alfred Lord Tennyson, “Locksley Hall,” The Complete Poetical Works of Tennyson, ed. W. J. Rolfe, Boston: Houghton-Mifflin Co., 1898, p. 93, lines 27–28.)”20

“క్రీస్తును ధరించుకొనుట” ద్వారా అసమానతలు, విభేదాలు మరియు వివాదాలను పరిష్కరించడం లేదా ప్రక్కన పెట్టడం సాధ్యమవుతుంది. విభజనను అధిగమించడం గురించి ఒక నాటకీయమైన ఉదాహరణ మన సంఘ చరిత్రలో కనుగొనబడింది. ఎల్డర్ బ్రిగమ్ హెన్రీ రాబర్ట్స్ (బి. హెచ్. రాబర్ట్స్‌గా పేరొందినవారు) 1857 లో ఇంగ్లండులో జన్మించారు, డెబ్బది యొక్క మొదటి సలహాసభలో సభ్యునిగా సేవచేసారు—ఈనాడు అది డెబ్బది యొక్క అధ్యక్షత్వముగా పిలువబడుతుంది. ఎల్డర్ రాబర్ట్స్ సమర్థులు మరియు పునఃస్థాపించబడిన సువార్తను, సంఘాన్ని దాని అత్యంత కష్టకాలములలో కొన్నింటిలో అలుపెరగకుండా సంరక్షించారు.

చిత్రం
యువ బి. హెచ్. రాబర్ట్స్

ఏమైనప్పటికీ, 1895లో వివాదం కారణంగా సంఘములో ఎల్డర్ రాబర్ట్స్ సేవ ప్రమాదంలో పడింది. బి. హెచ్. యూటా ఒక రాష్ట్రంగా మారినప్పుడు దానికొరకు రాజ్యాంగాన్ని వ్రాసే సభకు ఒక ప్రతినిధిగా నియమించబడ్డారు. తరువాత, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కోసం ఒక అభ్యర్థిగా అవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు, కానీ దాని గురించి ప్రథమ అధ్యక్షత్వానికి చెప్పలేదు లేదా అనుమతి కోరలేదు. ప్రథమ అధ్యక్షత్వములో ఒక సలహాదారుడైన అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఆ విషయమై ప్రధాన యాజకత్వ సమావేశంలో బి. హెచ్. ను విమర్శించారు. ఎల్డర్ రాబర్ట్స్ ఎన్నికల్లో ఓడిపోయారు మరియు తన ఓటమికి ప్రధాన కారణం అధ్యక్షులు స్మిత్ వ్యాఖ్యానాలని భావించారు. కొన్ని రాజకీయ ప్రసంగాలలో, ముఖాముఖిలలో ఆయన సంఘ నాయకుల గురించి విమర్శించారు. క్రియాశీలక సంఘ సేవ నుండి ఆయన విరమించుకున్నారు. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది సలహాసభ సభ్యులతో సాల్ట్ లేక్ దేవాలయంలో సుదీర్ఘ సమావేశంలో, బి. హెచ్. తననుతాను సమర్థించుకుంటూ మొండిగా నిలిచారు. తర్వాత, “ఆయన స్థానం గురించి మరొకసారి ఆలోచించమని అధ్యక్షులు [విల్ఫర్డ్] వుడ్రఫ్ [ఎల్డర్ రాబర్ట్స్] కు మూడు వారాలు గడువిచ్చారు. ఆయన ఇంకా పశ్చాత్తాపపడకుండా ఉన్నట్లయితే, వారు ఆయనను డెబ్బది నుండి విడుదల చేస్తారు.”21

తరువాత అపొస్తలులు హీబర్ జె. గ్రాంట్ మరియు ఫ్రాన్సిస్ లైమన్‌లతో ఒక ఏకాంత సమావేశంలో, మొదట బి. హెచ్. మనస్సు మార్చుకోలేదు, కానీ చివరకు ప్రేమ మరియు పరిశుద్ధాత్మ గెలిచాయి. ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బి. హెచ్. ను కష్టపెట్టిన కొన్ని స్వల్ప విషయాలు మరియు అపరాధాలకు ఇద్దరు అపొస్తలులు స్పందించగలిగారు మరియు సయోధ్య కోసం వారు హృదయపూర్వక విజ్ఞప్తిని విడిచివెళ్ళారు. మరుసటి ఉదయం, సుదీర్ఘమైన ప్రార్థన తర్వాత, తన సహోదరులతో తిరిగి ఏకమవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎల్డర్ రాబర్ట్స్ ఎల్డర్లు గ్రాంట్ మరియు లైమన్‌లకు ఒక సందేశం పంపారు.22

తరువాత ఆయన ప్రథమ అధ్యక్షత్వాన్ని కలుసుకున్నప్పుడు, ఎల్డర్ రాబర్ట్స్ అన్నారు, “నేను ప్రభువును వేడుకున్నాను మరియు దేవుని అధికారానికి లొంగిపోవాలని ఆయన ఆత్మ ద్వారా వెలుగును, ఉపదేశాన్ని పొందాను.”23 దేవునిపై ఆయన ప్రేమచేత ప్రేరేపించబడి, బి. హెచ్. రాబర్ట్స్ విశ్వాసుడిగా, తన జీవితము చివరి వరకు సమర్థుడైన సంఘ నాయకునిగా నిలిచారు.24

చిత్రం
ఎల్డర్ బి. హెచ్. రాబర్ట్స్

ఐక్యత అంటే అర్థం ప్రతీఒక్కరు తనకు నచ్చింది చేయడానికి లేదా తనకు ఇష్టమైనట్లు ఉండడానికి సమ్మతించడం కాదు అని ఈ ఉదాహరణలో మనం కూడా చూడవచ్చు. అందరి మంచి కోసం అన్నిటిని వదులుకోవడానికి సిద్ధపడితే తప్ప, మనం ఒక్కటి కాలేము. బి. హెచ్. రాబర్ట్స్ మాటలలో దానర్థము, దేవుని అధికారానికి లొంగిపోవడం. మనం క్రీస్తు శరీరములో ప్రత్యేక అవయవములైయున్నాము, వేర్వేరు సమయాల్లో వేర్వేరు పనులు నెరవేరుస్తున్నాము—చెవి, కన్ను, తల, చేయి, పాదము—అయినా అన్నీ ఒక్క శరీరానికి చెందినవి.25 “అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించవలెను,”26 అనేది మన లక్ష్యం.

ఐక్యతకు పోలిక అవసరం లేదు, కానీ సామరస్యం అవసరం. మనం మన హృదయాలను ప్రేమతో కలపవచ్చు, విశ్వాసమందు మరియు సిద్ధాంతమందు ఒకటిగా ఉన్నప్పటికీ, మనం వివిధ జట్ల కోసం ఇప్పటికీ ఉత్సాహంగా ఉండవచ్చు, వివిధ రాజకీయ సమస్యలపై విభేదించవచ్చు, లక్ష్యాలు మరియు వాటిని సాధించడానికి సరైన మార్గం గురించి చర్చలు మరియు అనేక ఇతర విషయాలలో భిన్నాభిప్రాయాలు కలిగియుండవచ్చు. కానీ మనం ఎప్పుడూ ఒకరిపై ఒకరు కోపం లేదా ధిక్కారంతో విభేధించలేము లేదా పోరాడలేము. రక్షకుడు ఇలా చెప్పారు:

“ఏలయనగా నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, వివాదము యొక్క ఆత్మను కలిగినవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రి అయిన అపవాది సంబంధియై యున్నాడు; మరియు అతడు ఒకనితోనొకడు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పును.

“ఇదిగో, ఒకరికి వ్యతిరేకముగా మరొకరు కోపముతోనుండునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పుట నా సిద్ధాంతము కాదు; కానీ, అట్టి క్రియలు ఆపివేయవలెను అనునదే నా సిద్ధాంతమైయున్నది.”27

ఒక సంవత్సరం క్రితం, అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాతో ఈ మాటల్లో ప్రతిజ్ఞ చేశారు: “మనలో ఎవ్వరూ దేశాలను లేదా ఇతరుల చర్యలను లేదా కనీసం మన స్వంత కుటుంబ సభ్యులను కూడా నియంత్రించలేరు. కానీ మనల్ని మనం నియంత్రించుకోగలము. ప్రియమైన సహోదర సహోదరీలారా, మీ హృదయంలో, మీ గృహములో మరియు మీ జీవితంలో చెలరేగుతున్న సంఘర్షణలను అంతం చేయాలన్నదే ఈ రోజు నా పిలుపు. ఇతరులను గాయపరచాలనే కోరికలన్నింటిని పాతిపెట్టండి—ఆ కోరికలు కోపము, అసభ్యకరమైన మాటలు లేదా మిమ్మల్ని పదే పదే గాయపరిచిన వారి పట్ల ఆగ్రహం కావచ్చు. రక్షకుడు మరో చెంపను త్రిప్పమని [3 నీఫై 12:39 చూడండి], మన శత్రువులను ప్రేమించమని మరియు మనల్ని బాధించేవారి కోసం ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారు[3 నీఫై 12:44 చూడండి].”28

యేసు క్రీస్తునందు ప్రేమకు మన వ్యక్తిగత విధేయత ద్వారా మాత్రమే మనం ఒక్కటిగా ఉండేందుకు—మనలోమనం ఒక్కటిగా, ఇంటిలో ఒక్కటిగా, సంఘములో ఒక్కటిగా, క్రమంగా సీయోనులో ఒక్కటిగా, అన్నిటిని మించి, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మతో ఒక్కటిగా ఉండేందుకు ఆశించగలమని నేను మళ్ళీ చెప్తున్నాను.

పరిశుద్ధ వారం మరియు మన విమోచకుని విజయోత్సవ సంఘటనలకు నేను తిరిగివస్తాను. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ఆయన దైవత్వానికి మరియు ఆయన అన్నిటిని జయించారనడానికి సాక్ష్యమిస్తుంది. నిబంధన ద్వారా ఆయనతో బంధింపబడి, మనం కూడా అన్నిటిని జయించి, ఒక్కటి కాగలమని ఆయన పునరుత్థానము సాక్ష్యమిస్తుంది. ఆయన ద్వారా అమర్త్యత్వము మరియు నిత్య జీవితం వాస్తవాలని ఆయన పునరుత్థానం సాక్ష్యమిస్తుంది.

ఈ ఉదయం, యథాతథమైన ఆయన పునరుత్థానం మరియు అది సూచించే వాటన్నిటి గురించి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.