సర్వసభ్య సమావేశము
కడవరి దినముల కొరకు జీవించియున్న ఒక ప్రవక్త
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


కడవరి దినముల కొరకు జీవించియున్న ఒక ప్రవక్త

పరలోక తండ్రి ఒక ప్రవక్త ద్వారా తన పిల్లలకు సత్యాన్ని వెల్లడించే నమూనాను ఎంచుకున్నారు.

నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు శనివారాన్ని ఇష్టపడ్డాను, ఎందుకంటే ఆ రోజు నేను చేసినదంతా సాహసంలా అనిపిస్తుంది. కానీ నేను ఏమి చేసినా, టెలివిజన్‌లో కార్టూన్‌లు చూడడం—అన్నింటికంటే ముఖ్యమైన విషయంగా ఎప్పుడూ ముందుండేది. అలాంటి ఒక శనివారం ఉదయం, నేను టెలివిజన్ దగ్గర నిలబడి, ఛానెల్‌లను తిప్పుతూ ఉండగా, నేను కనుగొనాలనుకున్న కార్టూన్ స్థానంలో యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సర్వసభ్య సమావేశము ప్రసారం చేయబడిందని నేను కనుగొన్నాను. టెలివిజన్ చూస్తూ కార్టూన్ లేదని విలపిస్తూ ఉండగా, తెల్లజుట్టు ఉన్న ఒక వ్యక్తి సూటు, టై వేసుకుని చక్కటి కుర్చీలో కూర్చోవడం చూశాను.

అతనిలో ఏదో వ్యత్యాసం ఉంది, కాబట్టి నేను మా అన్నయ్యని అడిగాను, “ఆయన ఎవరు?”

అతను చెప్పాడు, “ఆయన అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే; ఆయన ఒక ప్రవక్త.”

నేను ఏదో అనుభూతి చెంది, ఏదో విధంగా ఆయన ప్రవక్త అని తెలుసుకోవడం నాకు గుర్తుంది. అప్పుడు, నేను కార్టూన్-ఆకర్షిత యువకుడిని కాబట్టి, నేను ఛానెల్ మార్చాను. కానీ ఆ క్లుప్తమైన, ఊహించని బయల్పాటు క్షణంలో నేను పొందిన అనుభూతిని ఎప్పటికీ మరచిపోలేదు. ఒక ప్రవక్తతో, కొన్నిసార్లు అది తెలుసుకోవడానికి ఒక క్షణం మాత్రమే పడుతుంది.1

భూమిపై జీవించియున్న ప్రవక్త ఉన్నారని బయల్పాటు ద్వారా తెలుసుకోవడం అన్నిటినీ మార్చివేస్తుంది.2 ఒక ప్రవక్త, ప్రవక్తగా ఎప్పుడు మాట్లాడతారు లేదా కావాలని ప్రవచనాత్మక సలహాను తిరస్కరించిన వారెవరైనా సమర్థించబడతారా అనే చర్చపై అది ఆసక్తి లేకుండా చేస్తుంది.3 మనం దానిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా,4 బయలుపరచబడిన అటువంటి జ్ఞానము జీవించియున్న ప్రవక్త యొక్క సలహాను విశ్వసించమని ఒకరిని ఆహ్వానిస్తుంది. ఏదేమైనా, పరలోకములో ఉన్న పరిపూర్ణమైన ప్రేమగల తండ్రి ఒక ప్రవక్త ద్వారా తన పిల్లలకు సత్యాన్ని వెల్లడించే నమూనాను ఎంచుకున్నారు, అలాంటి పవిత్రమైన పిలుపును ఎన్నడూ కోరని మరియు తన స్వంత అపరిపూర్ణత గురించి తెలుసుకోవడానికి మన సహాయం అవసరం లేని వ్యక్తి ఈ ప్రవక్త.5 ప్రవక్త అంటే దేవుడు వ్యక్తిగతంగా సిద్ధం చేసిన, పిలిచిన, సరిదిద్దిన, ప్రేరేపించిన, గద్దించిన, శుద్ధిచేసిన మరియు ఆమోదించిన వ్యక్తి.6 అందుకే ప్రవచనాత్మక సలహాను అనుసరించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడూ ప్రమాదంలో ఉండము.

మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనమందరం ఈ కడవరి దినములలో పుట్టడానికి ఏదో ఒక పద్ధతిని పూర్వ-మర్త్య జీవితములోనే ఎంపిక చేసుకున్నాము. కడవరి దినములతో ముడిపడి రెండు వాస్తవాలు ఉన్నాయి. మొదటి వాస్తవం ఏమిటంటే, క్రీస్తు సంఘము భూమిపై పునఃస్థాపించబడుతుంది. రెండవ వాస్తవం ఏమిటంటే, విషయాలు నిజంగా సవాలుగా మారతాయి. కడవరి దినములలో “భూమిపై నున్న పంటలను నాశనము చేయుటకు గొప్ప వడగండ్లవాన పంపబడును,”7 తెగుళ్లు,8 “యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు విందురు, భూమి యంతయు సంక్షోభములోనుండును, … మరియు పాపము విస్తరించును”9 అని లేఖనాలు బయల్పరుస్తాయి.

నా చిన్నతనంలో, ఆ కడవరి దిన ప్రవచనాలు నన్ను భయపెట్టాయి మరియు నా జీవితంలో రెండవ రాకడ రాకూడదని ప్రార్థించేలా చేసాయి—కొంతవరకు నా ప్రార్థన ఫలించింది, ఇప్పటివరకు రెండవ రాకడ రాలేదు. ప్రవచించబడిన సవాళ్ళు జరిగితీరుతాయని తెలిసినప్పటికీ, ఇప్పుడు నేను మునుపటికి విరుద్ధంగా ప్రార్థిస్తున్నాను,10 ఎందుకంటే క్రీస్తు పరిపాలించడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన సృష్టి యావత్తు “నిర్భయముగా నివసించెదరు.”11

ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులు కొందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేవుని నిబంధన పిల్లలుగా, ఈ సమస్యాత్మక సమయాల్లో జీవించడం ఎలాగో తెలుసుకోవాలంటే మనం దేని వెంటా పడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిన అవసరం లేదు.12 ఆధ్యాత్మికంగా జీవించడానికి మరియు భౌతికంగా సహించడానికి మనం అనుసరించాల్సిన సిద్ధాంతం మరియు సూత్రాలు జీవించియున్న ప్రవక్త మాటలలో కనిపిస్తాయి.13 అందుకే అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “మన మధ్యలో దేవుని ప్రవక్త ఉండడం చిన్న విషయం కాదు” అని ప్రకటించారు.14

“దేవుడు తన పిల్లలకు చాలా కాలంగా ప్రవక్తల ద్వారా బోధించే విధానం, ఆయన ప్రతీ ప్రవక్తను దీవిస్తారని మరియు ప్రవచనాత్మక సలహాలను పాటించేవారిని ఆయన దీవిస్తారని అభయమిస్తుంది” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సాక్ష్యమిచ్చారు.15 కాబట్టి జీవించియున్న ప్రవక్తను అనుసరించడమే కీలకం.16 సహోదర సహోదరీలారా, పాతకాలపు హాస్యరస పుస్తకాలు మరియు శ్రేష్ఠమైన కార్ల వలె, ప్రవచనాత్మక బోధనలు కాలంతోపాటు మరింత విలువైనవిగా మారవు. అందవల్ల జీవించియున్న ప్రవక్తల బోధనలను రద్దుచేయడానికి గతకాలపు ప్రవక్తల మాటలను ఉపయోగించాలని మనం కోరుకోకూడదు.17

సువార్త సూత్రాలను బోధించడానికి యేసు క్రీస్తు ఉపయోగించిన ఉపమానాలు నాకు చాలా ఇష్టం. నేను ఈ ఉదయం మీతో ఒక నిజ-జీవిత ఉపమానాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.

ఒకరోజు నేను భోజనం చేసేందుకు సంఘ ప్రధాన కార్యాలయంలోని ఫలహారశాలలోకి వెళ్ళాను. ఒక ఆహారపు పళ్ళెం తీసుకున్న తర్వాత, నేను భోజనం చేసే ప్రదేశంలోకి ప్రవేశించాను, అక్కడ ప్రథమ అధ్యక్షత్వములోని ముగ్గురు సభ్యులు కూర్చున్న ఒక బల్లను గమనించాను, దానితో పాటు ఒక ఖాళీ కుర్చీ కూడా ఉంది. నా అభద్రతాభావాలు నేను ఆ బల్ల ‌వద్ద నుండి త్వరగా ప్రక్కకు తప్పుకునేలా చేశాయి, అప్పుడు నేను మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి స్వరం విన్నాను, “అలెన్, ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది. వచ్చి మాతో కూర్చోండి.” మరియు నేను అలాగే చేసాను.

భోజనం ముగిసే సమయానికి, పెద్దగా కరకరలాడే శబ్దం వినబడడంతో నేను ఆశ్చర్యపోయాను, నేను పైకి చూసినప్పుడు, అధ్యక్షులు నెల్సన్ తన ప్లాస్టిక్ నీళ్ళ సీసా‌ను నిటారుగా నిలబెట్టి, దానిని చదును చేసి, మూతపెట్టడం చూశాను.

అప్పుడు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ నేను అడగాలనుకున్న ప్రశ్న అడిగారు, “అధ్యక్షులు నెల్సన్, మీరు మీ ప్లాస్టిక్ నీళ్ళ సీసాను ఎందుకు చదును చేసారు?”

దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు, “రీసైక్లింగ్ కంటెయినర్‌లో ఎక్కువ స్థలాన్ని తీసుకోనందున ఇది పునర్వినియోగపరచదగిన పదార్థాలను నిర్వహించే వారి పనిని సులభతరం చేస్తుంది.”

ఆ స్పందన గురించి ఆలోచిస్తూ ఉండగా, మళ్ళీ అదే కరకరలాడే శబ్దం వినిపించింది. నా కుడివైపు చూడగా, అధ్యక్షులు ఓక్స్ తన ప్లాస్టిక్ నీళ్ళ సీసాని అధ్యక్షులు నెల్సన్ చేసినట్లుగా చదును చేశారు. అప్పుడు నా ఎడమ వైపున కొంత శబ్దం వినిపించింది, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ తన ప్లాస్టిక్ నీళ్ళ సీసా‌ను చదును చేస్తున్నారు, ఆయన సీసా అడ్డంగా ఉన్నప్పుడే వేరే వ్యూహాన్ని అవలంబించారు, దానికి సీసాను నేరుగా పైకి లేపి చేయడం కంటే ఎక్కువ శ్రమ అవసరమైంది. దీనిని గమనించిన అధ్యక్షులు నెల్సన్, సీసా‌ను మరింత సులభంగా చదును చేయడానికి సీసాను నేరుగా పైకి లేపి చేసే విధానాన్ని ఆయనకు చూపించారు.

ఆ సమయంలో, నేను అధ్యక్షులు ఓక్స్ వైపు వంగి మెల్లగా అడిగాను, “మీ ప్లాస్టిక్ నీళ్ళ సీసా‌ను చదును చేయడం ఫలహారశాలలో పునరుపయోగించడానికి అవసరమా?”

అధ్యక్షులు ఓక్స్ తన ముఖంపై చిరునవ్వుతో, “అలెన్, మీరు ప్రవక్తను అనుసరించాలి” అని బదులిచ్చారు.

అధ్యక్షులు నెల్సన్ ఆ రోజు ఫలహారశాలలో ఒక క్రొత్త రీసైక్లింగ్-ఆధారిత సిద్ధాంతాన్ని ప్రకటించలేదని నేను నమ్ముతున్నాను. అయితే అధ్యక్షులు నెల్సన్ ఉదాహరణకి అధ్యక్షులు ఓక్స్ మరియు అధ్యక్షులు ఐరింగ్ యొక్క తక్షణ ప్రతిస్పందన నుండి 18 మరియు పాల్గొన్న వారికి మెరుగైన మార్గాన్ని బోధించడంలో అధ్యక్షులు నెల్సన్ యొక్క శ్రద్ధ నుండి మనం నేర్చుకోవచ్చు.19

చాలా సంవత్సరాల క్రితం, ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ నేటి మన కాలానికి సంబంధించి ప్రవచనాత్మకంగా కొన్ని పరిశీలనలు మరియు సలహాలను పంచుకున్నారు:

“రాబోయే నెలలు మరియు సంవత్సరాలలో, ప్రతీ సభ్యుడు అతను [లేదా ఆమె] ప్రథమ అధ్యక్షత్వమును అనుసరించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు అభిప్రాయాల మధ్య ఎక్కువసేపు నిలిచియుండడం సభ్యులకు కష్టతరం అవుతుంది. …

“… మనం ఒక వ్రాతమూలము వదిలివేద్దాం, తద్వారా ఎంపికలు స్పష్టంగా ఉంటాయి, ప్రవచనాత్మక సలహాల నేపథ్యంలో ఇతరులు తమ ఇష్టానుసారం చేయనివ్వండి. …

“అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు, ‘వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని తెలియును’ … అని యేసు చెప్పారు. వేసవి కాలం మనపై ఉందని, అప్పుడు వేడి గురించి మనం ఫిర్యాదు చేయకూడదని హెచ్చరించినట్లు! ”20

అంజూరపు ఆకులు ఎక్కువగా ఉండి మరియు వేడి ఎక్కువగా ఉండే కాలంలో యువతరం ఎదుగుతోంది. ఆ వాస్తవికత ఇప్పటికే పెరిగిన తరంపై ఒక బరువైన బాధ్యతను మోపుతుంది, ప్రత్యేకించి ప్రవచనాత్మక సలహాలను అనుసరించే విషయంలో. తల్లిదండ్రులు జీవించియున్న ప్రవక్త యొక్క సలహాను విస్మరించినప్పుడు, వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను వారు కోల్పోవడమే కాకుండా, ఒక ప్రవక్త చెప్పేది ముఖ్యమైనది కాదని లేదా ప్రవచనాత్మక సలహాను అనుసరించాలా వద్దా అని ఎంచుకోవచ్చని వారి పిల్లలకు మరింత విషాదకరంగా బోధిస్తారు. ఇది ఆధ్యాత్మిక పోషకాహార లోపానికి దారితీస్తుందని ఆలోచించరు.

ఎల్డర్ రిచర్డ్ ఎల్. ఎవన్స్ ఒకసారి ఇలా గమనించారు: “కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబాన్ని లేదా తమ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా, తాము ప్రవర్తన మరియు అనుకూలతలో కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చని… ప్రాథమిక అంశాలను కొద్దిగా తగ్గించగలమని పొరపాటుగా భావిస్తారు. కానీ, తల్లిదండ్రులు కొంచెం తప్పు చేస్తే, పిల్లలు తల్లిదండ్రులను మించి తప్పు చేసే అవకాశం ఉంది.”21

కడవరి-దినాలలో ప్రవచించిన పాత్రకు యువతరాన్ని సిద్ధం చేసే పవిత్రమైన బాధ్యత కలిగిన తరంగా, 22 ప్రత్యర్థి తన ప్రభావం యొక్క శిఖరాగ్రంలో ఉన్న సమయంలో ఆ పాత్రను నెరవేర్చాల్సియుండగా,23 ప్రవచనాత్మక సలహాను అనుసరించడం యొక్క ప్రాముఖ్యత గురించి మనం గందరగోళానికి మూలం కాలేము. యువతరానికి, “శత్రువు [దూరంలో] ఉండగానే చూడగలిగేలా చేసే అదే సలహా ఆపై శత్రువుల దాడిని తట్టుకోవడానికి [వారిని తయారు చేయగలదు]”.24 ప్రవచనాత్మక సలహాకు ప్రతిస్పందనగా మన చిన్న చిన్న ఉల్లంఘనలు, నిశ్శబ్ద నిర్లక్ష్యం లేదా గుసగుసగా విమర్శలు గుప్పించడం వంటివి మనం నిబంధన మార్గం అంచున మాత్రమే ప్రమాదకరంగా నడవడానికి దారితీయవచ్చు; కానీ యువతరానికి చెందిన వారి జీవితాల్లో ప్రత్యర్థి ద్వారా అవి పెద్దగా చేయబడినప్పుడు, ఆ చర్యలు వారు ఆ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టేలా ప్రభావితం చేయవచ్చు. రాబోయే తరాలపై ఈ ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.25

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సలహాను అనుసరించడానికి మీరు తక్కువ ప్రయత్నాలు చేసినట్లు మీలో కొందరు భావించవచ్చు. అదే జరిగితే, పశ్చాత్తాపపడండి; దేవుడు ఎన్నుకున్న ప్రవక్త యొక్క సలహాను అనుసరించడం మళ్ళీ ప్రారంభించండి. చిన్నపిల్లల కార్టూన్ల పరధ్యానాన్ని ప్రక్కనపెట్టి, ప్రభువు అభిషిక్తులను విశ్వసించండి. సంతోషించండి, ఎందుకంటే మరోసారి “ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నారు.”26

మీకు ఖచ్చితంగా తెలియకపోయినా, మనం కడవరి దినాల వేడిని తట్టుకోగలమని మరియు వాటిలో కూడా వృద్ధి చెందగలమని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము కడవరి దిన పరిశుద్ధులము మరియు ఇవి గొప్ప దినములు. ఈ సమయంలో భూమిపైకి రావాలని మనము ఆత్రుతగా ఉన్నాము, అపవాది యొక్క పెరుగుతున్న అంధకార మరియు గందరగోళ పొగమంచులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనము పొరపాట్లు చేయడానికి వదిలివేయబడము,27 కానీ దానికి బదులుగా మనకు మరియు ప్రపంచం మొత్తానికి “ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు”28 అని చెప్పడానికి అధికారం ఉన్న ఆయన నుండి సలహా మరియు దిశానిర్దేశం తీసుకుంటామనే నమ్మకం కలిగియున్నాము. దేవుడు లేవనెత్తిన ప్రవక్త, ఇశ్రాయేలు పరిశుద్ధుడు అయిన30 యేసు క్రీస్తు పవిత్ర నామంలో, ఆమేన్.

వివరణలు

  1. అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల బ్రిగం యంగ్ యూనివర్శిటీలోని విద్యార్థులను అదే వ్యక్తిగత బయల్పాటును అనుభవించమని ఆహ్వానించారు: “మేము నిజంగా ప్రభువు యొక్క అపొస్తలులు మరియు ప్రవక్తలమా కాదా అని మీ పరలోక తండ్రిని అడగండి. దీని గురించి మరియు ఇతర విషయాల గురించి మేము బయల్పాటు పొందామా అని అడగండి” (“The Love and Laws of God” [Brigham Young University devotional, Sept. 17, 2019], speeches.byu.edu). నీల్ ఎల్. ఆండర్సెన్, “దేవుని యొక్క ప్రవక్త,” లియహోనా, మే 2018, 26–27 కూడా చూడండి: “అధ్యక్షులు నెల్సన్ పిలుపు దేవుని నుండి వచ్చినదని వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందే విశేషాధికారము కడవరి-దిన పరిశుద్ధులుగా మనకు ఉంది.” ప్రవక్త అబినడై మాట వినడం వలన మారిన ఆల్మా కథ, ఒక ప్రవక్త గురించిన బయల్పాటు మనందరికీ అందుబాటులో ఉందని మరింతగా రుజువు చేస్తుంది (మోషైయ 13:5; 17:2 చూడండి).

  2. “మనకు ప్రవక్త ఉన్నారు లేదా మనకు ఏమీ లేదు; మరియు ఒక ప్రవక్త ఉంటే, మనకు అన్నీ ఉన్నాయి” (Gordon B. Hinckley, “We Thank Thee, O God, for a Prophet,Ensign, Jan. 1974, 122).

  3. “వారు ప్రవచనాత్మ, బయల్పాటు ఆత్మ యందు సంశయించుట మొదలు పెట్టిరి మరియు దేవుని న్యాయతీర్పులను వారు తప్పించుకోలేకపోయిరి” (హీలమన్ 4:23; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:25 కూడా చూడండి). “We sing and have done so constantly, ‘We thank Thee, O God, for a Prophet to guide us in these latter days.’ There are a great many who [ought to] put a postscript to that and say: ‘Provided he guides us to suit our own fancies and our own whims’” (Teachings of Presidents of the Church: Heber J. Grant [2002], 8).

  4. “జాగ్రత్తగా ప్రార్థించి, ఆలోచించిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేని లేదా మనకు వర్తించనట్లుగా కనిపించే సలహాలను మనం అందుకుంటాం. సలహాను విస్మరించవద్దు, కానీ దానిని దగ్గరగా పట్టుకోండి. మీరు విశ్వసించే వారెవరైనా అందులో బంగారం ఉందని వాగ్దానం చేసి ఇసుకలా కనిపించే దానిని మీకు అందజేస్తే, మీరు దానిని తెలివిగా మీ చేతిలో పట్టుకుని, సున్నితంగా దానిని కదిలిస్తారు. ప్రవక్త సలహాతో నేను అలా చేసిన ప్రతిసారీ, కొంత సమయం తరువాత బంగారు రేకులు కనిపించడం ప్రారంభించాయి మరియు నేను కృతజ్ఞుడను” (Henry B. Eyring, “Finding Safety in Counsel,Ensign, May 1997, 26; 3 నీఫై 1:13; సిద్ధాంతము మరియు నిబంధనలు1:14 కూడా చూడండి).

  5. 2 నీఫై 4:17-18 చూడండి. “నా దోషమును బట్టి నన్ను లేదా అతని దోషమును బట్టి నా తండ్రిని లేదా అతని కంటే ముందు వ్రాసిన వారిని ఖండించవద్దు; కానీ, మా కంటే అధిక వివేకముగా ఉండుటను మీరు నేర్చుకొనులాగున ఆయన మా దోషములను మీకు తెలియజేసియున్నాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” (మోర్మన్ 9:31).

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 3:6-8 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:47 కూడా చూడండి.

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 29:16.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:97 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 87:6 కూడా చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:26, 27.

  10. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38 చూడండి.

  11. హోషేయ 2:18. “శక్తితోను, గొప్ప మహిమతోను, అక్కడున్న సైన్యములన్నింటితో పరలోకము నుండి నన్ను నేను కనబరచుకొని, భూమిమీద మనుష్యులతో వెయ్యేండ్లు నీతితో నివసించెదను మరియు దుష్టులు నిలువజాలరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:11).

  12. 1 నీఫై 22:16-17 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 59:23 కూడా చూడండి.

  13. “ఏలయనగా, వారు ప్రవక్తల మాటలను తిరస్కరించిరి. అందువలన, నా తండ్రి ఆ దేశము నుండి బయటకు పారిపోవలెనని ఆజ్ఞాపించబడిన తరువాత కూడా అతడు ఆ దేశములో నివసించియుండిన యెడల, అతడు నశించియుండేవాడు.” (1 నీఫై 3:18; 2 నీఫై 26:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 90:5 కూడా చూడండి).

  14. M. Russell Ballard, “His Word Ye Shall Receive,” Liahona, July 2001, 65.

  15. Russell M. Nelson, “Ask, Seek, Knock,” Liahona, Nov. 2009, 82. “జీవించియున్న ప్రవక్త సలహాను పాటించడం ద్వారా కంటే ఎక్కువగా ఏ వ్యక్తి సంతోషంగా ఉండలేడు” (The Teachings of Lorenzo Snow, ed. Clyde J. Williams [1996], 86).

  16. “ఈ రోజు లేదా రేపు సంఘములో అధ్యక్షత్వం వహించే వారిపై మీ దృష్టిని ఉంచండి మరియు పురాతన ప్రవక్తలు ఎలా కనిపించారు లేదా ఆలోచించారు లేదా మాట్లాడారు అనే దాని గురించి ఆలోచించకుండా వారిననుసరించి మీ జీవితాన్ని రూపొందించుకోండి” (The Teachings of Harold B. Lee, [1996], 525).

  17. “మరణించిన ప్రవక్తల మాటలను గౌరవిస్తూ, వాటిని ఉపయోగించి సజీవ ప్రవక్తలలో దోషాలు యెంచడానికి అనేకమంది ప్రయత్నించడాన్ని” అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఒకసారి గమనించారు (The Teachings of Spencer W. Kimball, ed. Edward L. Kimball [1982], 462). “మనం వినగల, ఆలోచించగల మరియు అనుసరించగల అతి ముఖ్యమైన పదాలు జీవించియున్న మన ప్రవక్త ద్వారా బయల్పరచబడినవి” (రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్, “నా ఆత్మ యొక్క విషయములు,” లియహోనా, నవ. 2021, 40).

  18. “సంఘ అధ్యక్షుని మాటల ద్వారా వ్యక్తీకరించబడిన ప్రభువు సలహాను మనం విన్నప్పుడు, మన ప్రతిస్పందన సానుకూలంగా మరియు త్వరగా ఉండాలి” (M. Russell Ballard, His Word Ye Shall Receive,” Liahona, July 2001, 65).

  19. “యేసు క్రీస్తు యొక్క సంఘము ఎల్లప్పుడూ సజీవ ప్రవక్తలు మరియు అపొస్తలులచే నడిపించబడింది. మానవ అపరిపూర్ణతకు లోబడి, మర్త్యమైనప్పటికీ, ఆధ్యాత్మికంగా ప్రాణహాని కలిగించే అడ్డంకులను నివారించడానికి మరియు మన చివరి, అంతిమ, పరలోక గమ్యస్థానానికి మర్త్యత్వం గుండా సురక్షితంగా వెళ్ళడానికి మనకు సహాయం చేయడానికి ప్రభువు సేవకులు ప్రేరేపించబడ్డారు” (M. Russell Ballard, “God Is at the Helm,” Liahona, Nov. 2015, 24).

  20. Neal A. Maxwell, “A More Determined Discipleship,” Ensign, Feb. 1979, 69, 70.

  21. Richard L. Evans, “Foundations of a Happy Home,” in Conference Report, Oct. 1964, 135–36.

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు123:11 చూడండి; see also Robert D. Hales, “Our Duty to God: The Mission of Parents and Leaders to the Rising Generation,” Liahona, May 2010, 95–98.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14 చూడండి.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 101:54.

  25. మోషైయ 26:1-4 చూడండి.

  26. 2 రాజులు 5:8.

  27. “అతని మాటలన్నింటికి, అతడు వాటిని పొందినప్పుడు మీకిచ్చు ఆజ్ఞలకు చెవియొగ్గవలెను, … ఈ సంగతులను చేయుట ద్వారా నరకపు ద్వారములు మీ యెదుట నిలువజాలవు; అవును, ప్రభువైన దేవుడు అంధకార శక్తులను మీ యెదుట నుండి తరిమివేయును, మీ మేలు కొరకు, ఆయన నామ ఘనత కొరకు పరలోకములు కంపించునట్లు చేయును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4, 6). “ప్రభువు యొక్క ప్రతినిధిగా నిలబడిన వ్యక్తి బోధనలను అనుసరించిన లేదా సలహాను లేదా ఉపదేశాన్ని తీసుకున్న ఏ వ్యక్తి ఎప్పుడూ తప్పుదారి పట్టలేదు.” (Doctrines of Salvation: Sermons and Writings of Joseph Fielding Smith, ed. Bruce R. McConkie [1998], 243).

  28. యెహెజ్కేలు 3:27. “ఏలయనగా మీరు అతని మాటను పూర్తి సహనముతోను, విశ్వాసముతోను నా నోటినుండి పలికినట్లుగానే స్వీకరించవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 21:5).

  29. 1 నీఫై 22:20-21 చూడండి; 3 నీఫై 20:23 కూడా చూడండి.