సర్వసభ్య సమావేశము
అపరిపూర్ణమైన పంట
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


అపరిపూర్ణమైన పంట

రక్షకుడు మన వినయపూర్వకమైన అర్పణలను అంగీకరించడానికి మరియు ఆయన కృప ద్వారా వాటిని పరిపూర్ణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రీస్తుతో, అపరిపూర్ణమైన పంట లేదు.

ఒక చిన్న పిల్లవాడిగా, నేను పెరిగిన నైరుతి మోంటానా ప్రాంతమందు, ఒక సంవత్సరంలోని కాలాలలో వచ్చే నాటకీయ మార్పులను ప్రేమించడం నేను నేర్చుకున్నాను. నాకు ఇష్టమైన కాలం—కోత కాలం. నెలల తరబడి మా కష్టానికి ప్రతిఫలంగా సమృద్ధియైన పంట చేతికి వస్తుందని మా కుటుంబం ఆశించింది మరియు ప్రార్థించింది. నా తల్లిదండ్రులు వాతావరణం, జంతువుల ఆరోగ్యం, పంటలు మరియు వారు కొద్దిగా నియంత్రించగల అనేక ఇతర విషయాల గురించి ఆందోళన చెందారు.

నేను పెరిగేకొద్దీ, అందులో ఉన్న ఆవశ్యకత గురించి నాకు మరింత అవగాహన వచ్చింది. పంటలపైనే మా జీవనం ఆధారపడియుంది. మేము ధాన్యం పండించడానికి ఉపయోగించే పరికరాల గురించి మా నాన్న నాకు నేర్పించారు. ఆయన యంత్ర సామగ్రిని పొలంలోకి తరలించి, ధాన్యాన్ని చిన్నగా కోసి, ఆపై వీలైనంత ఎక్కువ ధాన్యం పొట్టుతో కలవకుండా, ధాన్యాన్ని పట్టుకునే తొట్టిలో మాత్రమే చేరేలా చూసుకోవడానికి సామగ్రి వెనుక తనిఖీ చేస్తున్నప్పుడు నేను చూశాను. ప్రతిసారీ యంత్రాన్ని సర్దుబాటు చేస్తూ, ఆయన అలా చాలాసార్లు పునరావృతం చేశారు. నేను ఆయనతో పాటు పరుగెత్తాను, ఆయనతో పాటు పొట్టులో నడిచాను మరియు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలిసినట్లుగా చేసాను.

యంత్రానికి సంబంధించిన సర్దుబాట్లతో ఆయన సంతృప్తి చెందిన తర్వాత, నేను నేలపై ఉన్న పొట్టులో కొన్ని ధాన్యం గింజలను కనుగొన్నాను మరియు వాటిని విమర్శనాత్మకంగా ఆయనకు అందించాను. “ఇది సరిపోతుంది మరియు ఈ యంత్రం చేయగలిగినంత ఉత్తమమైనది,” అని మా నాన్న నాతో చెప్పిన మాట నేను మర్చిపోలేను. నేను ఆయన వివరణతో నిజంగా సంతృప్తి చెందలేదు, ఈ పంట విధానము యొక్క లోపాలను గురించి నేను ఆలోచించాను.

కొద్దిసేపటి తర్వాత, సాయంత్రం వాతావరణం చల్లగా మారినప్పుడు, దక్షిణం వైపు తమ సుదీర్ఘ ప్రయాణంలో తమను తాము పోషించుకోవడానికి వేలాది వలస హంసలు మరియు బాతులు పొలాల్లోకి దిగడం నేను చూశాను. అవి మా అపరిపూర్ణ కోత నుండి మిగిలిపోయిన ధాన్యాన్ని తిన్నాయి. దేవుడు దానిని పరిపూర్ణం చేసాడు. మరియు ఒక్క గింజ కూడా కోల్పోబడలేదు.

పరిపూర్ణతపై మక్కువ మన ప్రపంచంలో మరియు సంఘ సంస్కృతిలో కూడా తరచు ఒక శోధనగా ఉంది. సామాజిక మాధ్యమం, అవాస్తవ అంచనాలు మరియు తరచుగా మన స్వంత-విమర్శలు అసమర్థత యొక్క భావాలను సృష్టిస్తాయి—మనం తగినంతగా లేము మరియు ఎప్పటికీ ఉండమనిపించేలా చేస్తాయి. “గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి” అనే రక్షకుని ఆహ్వానాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు.1

పరిపూర్ణత అనేది క్రీస్తులో పరిపూర్ణులవడంతో సమానం కాదని గుర్తుంచుకోండి.2 పరిపూర్ణత్వానికి మనల్ని ఇతరులతో పోల్చే అసాధ్యమైన, స్వీయ-ప్రేరేపిత ప్రమాణం అవసరం. అది అపరాధ భావాన్ని, ఆందోళనను కలిగిస్తుంది మరియు మనల్ని మనం ఉపసంహరించుకోవాలని మరియు ఒంటరిగా ఉండాలని కోరుకునేలా చేస్తుంది.

క్రీస్తులో పరిపూర్ణులుగా మారడం వేరే విషయం. రక్షకుని వలె ఎక్కువగా మారడం—పరిశుద్ధాత్మచేత ప్రేమతో నడిపించబడే ప్రక్రియ. దయగల సర్వాంతర్యామి అయిన పరలోక తండ్రిచే ప్రమాణాలు ఏర్పరచబడ్డాయి మరియు మనం హత్తుకోవడానికి ఆహ్వానించబడిన నిబంధనలలో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. దేవుని దృష్టిలో మనం ఎవరమో ఎల్లప్పుడూ నొక్కి చెబుతూ, అది మనల్ని అపరాధం మరియు అసమర్థత యొక్క భారం నుండి విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ మనల్ని ఉద్ధరిస్తూ, మంచిగా మారడానికి పురికొల్పుతుండగా, విశ్వాసంతో ఆయనను అనుసరించే మన ప్రయత్నాలలో దేవుని పట్ల మనం వ్యక్తపరిచే మన వ్యక్తిగత భక్తితో మనము కొలవబడతాము. ఆయన వద్దకు రమ్మనే రక్షకుని ఆహ్వానాన్ని మనము అంగీకరించినప్పుడు, మనం ఉత్తమంగా చేయగలిగినది సరిపోతుందని మరియు ప్రేమగల రక్షకుని కృప మనం ఊహించలేని మార్గాల్లో మిగిలిన లోపాన్ని భర్తీ చేస్తుందని త్వరలోనే గ్రహిస్తాము.

రక్షకుడు ఐదు వేలమందికి ఆహారం పంచి ఇచ్చినప్పుడు ఈ సూత్రం అమలులో ఉన్నట్లు మనం చూడవచ్చు.

“కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను …

“అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

“ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ-

“ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రము?”3 అనెను.

చేయవలసిన గొప్ప పనికి నిశ్చయంగా అవి సరిపోవని తెలిసినా, ఒక బిడ్డకు గల విశ్వాసంతో వాటిని అందించిన ఈ చిన్న పిల్లవాడిని గురించి రక్షకుడు ఎలా భావించియుండవచ్చని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా?

“యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, శిష్యులకు పంచి ఇచ్చెను మరియు వారు కూర్చున్నవారికి వడ్డించెను; ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

“వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.”4

రక్షకుడు వినయపూర్వకమైన సమర్పణను పరిపూర్ణం చేశారు.

ఈ అనుభవం తర్వాత కొంతకాలానికి, యేసు తన శిష్యులను ఒక దోనెలో ముందుకు పంపించారు. వారు త్వరలోనే అర్ధరాత్రి సముద్రంపై తుఫానులో తమనుతాము కనుగొన్నారు. నీటిపై తమ వైపుకు నడుచుకొస్తున్న ఒక దెయ్యపు ఆకారాన్ని చూసి వారు భయపడ్డారు.

“వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పెను.

“పేతురు - ప్రభువా, నీవే అయితే నీళ్ళమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

“ఆయన రమ్మనగానే, పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడిచెను గాని,

“గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను.

“వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.” 5

సహోదర సహోదరీలారా, అది ఈ సంభాషణ యొక్క ముగింపు కాకపోవచ్చు. పేతురు మరియు రక్షకుడు చేయి చేయి పట్టుకొని తిరిగి ఓడ వైపు నడిచినపుడు, పేతురు తడుస్తూ, బహుశా అవివేకంగా భావించియుండవచ్చు, అప్పుడు రక్షకుడు ఇలా చెప్పి ఉండవచ్చు: “ఓహ్, పేతురు, భయపడకు, చింతించకు. నేను నిన్ను చూస్తున్నట్లుగా నిన్ను నువ్వు చూడగలిగితే, నీ సందేహం తొలగిపోయి నీ విశ్వాసం పెరుగుతుంది. ప్రియమైన పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నువ్వు పడవ నుండి బయటికి వచ్చావు. నీ సమర్పణ ఆమోదయోగ్యమైనది, నువ్వు తడబడినప్పటికీ లోతులలో నుండి నిన్ను పైకి లేపడానికి నేను ఎల్లప్పుడూ అక్కడ ఉంటాను మరియు నీ సమర్పణ పరిపూర్ణంగా చేయబడుతుంది.

ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా బోధించారు:

“ఆయనే మీ బలమని మీరు చూడాలని, అనుభూతి చెందాలని మరియు తెలుసుకోవాలని రక్షకుడైన యేసు క్రీస్తు కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన సహాయంతో, మీరు సాధించగలిగే వాటికి హద్దులు లేవు. మీ సామర్థ్యము అపరిమితమైనది. ఆయన మిమ్మల్ని చూసే విధంగా మిమ్మల్ని మీరు చూడాలని ఆయన కోరతారు. అది ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం నుండి చాలా భిన్నమైనది. …

“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే; శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.”6

శ్రేష్ఠమైన కానీ అపరిపూర్ణమైన మన సమర్పణ ఏదైనప్పటికీ, రక్షకుడు దానిని పరిపూర్ణంగా చేయగలడని మనం గుర్తుంచుకోవాలి. మన ప్రయత్నాలు ఎంత అల్పమైనవని అనిపించినా, రక్షకుని శక్తిని మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. దయతో కూడిన ఒక సరళమైన మాట, క్లుప్తమైనప్పటికీ మనఃపూర్వకమైన పరిచర్య సందర్శన లేదా ప్రేమతో బోధించిన ప్రాథమిక పాఠం రక్షకుని సహాయంతో ఓదార్పునివ్వగలదు, హృదయాలను మృదువుగా చేయగలదు మరియు నిత్య జీవితాలను మార్చగలదు. మన చేతకాని ప్రయత్నాలు అద్భుతాలకు దారి తీయవచ్చు మరియు ఆ ప్రక్రియలో మనం పరిపూర్ణమైన కోతలో పాల్గొనవచ్చు.

తరచుగా, సవాళ్ళతో కూడిన అనుభవాలతో ఆత్మీయంగా ఎదిగే పరిస్థితులలో మనం ఉంచబడతాము. మనకిచ్చిన పనిని సాధించలేమని మనం అనుకోవచ్చు. మనతోపాటు సేవ చేసే వారిని చూసి, మనం ఎప్పటికీ వారితో తూగలేమని భావించవచ్చు. సహోదర సహోదరీలారా, మీకు అలా అనిపిస్తే, నా వెనుక కూర్చున్న అసాధారణ పురుషులు మరియు స్త్రీలను చూడండి, వారితోపాటు నేను సేవ చేస్తాను.

నేను మీ బాధను అర్థం చేసుకోగలను.

ఏది ఏమైనప్పటికీ, పరిపూర్ణత అంటే క్రీస్తులో పరిపూర్ణులవడం కాదని, స్వీయ-పోలిక అనేది అనుకరణతో సమానం కాదని నేను తెలుసుకున్నాను. మనల్ని మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు, రెండు ఫలితాలు మాత్రమే ఉంటాయి. మనల్ని మనం ఇతరుల కంటే మెరుగ్గా చూసుకుంటాము మరియు వారిపై తీర్పునిచ్చే వారిగా, విమర్శకులుగా అవుతాము లేదా మనల్ని మనం ఇతరులకన్నా తక్కువగా యెంచుకొని ఆందోళన చెందుతాము, స్వీయ విమర్శ చేసుకుంటాము మరియు నిరుత్సాహపడతాము. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం చాలా అరుదుగా ఉత్పాదకంగా ఉంటుంది, ఉద్ధరించదు మరియు కొన్నిసార్లు నిరుత్సాహపరుస్తుంది. నిజానికి, ఈ పోలికలు ఆధ్యాత్మికంగా విధ్వంసకరంగా ఉంటాయి, మనకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని పొందకుండా నిరోధిస్తాయి. మరోవైపు, క్రీస్తువంటి లక్షణాలను ప్రదర్శించే మనం గౌరవించే వారిని అనుకరించడం బోధనాత్మకంగా, ఉద్ధరించేదిగా ఉండగలదు మరియు యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యులుగా మారేందుకు మనకు సహాయం చేయగలదు.

రక్షకుడు తండ్రిని అనుకరించినట్లుగా అనుసరించడానికి ఆయన మనకు ఒక నమూనాను ఇచ్చారు. ఆయన తన శిష్యుడైన ఫిలిప్పు‌కు ఇలా బోధించారు: “ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?”7

ఆపై ఆయన, “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని బోధించారు.8

మన ప్రయత్నాలు ఎంత అల్పంగా అనిపించినా, మనం నిజాయితీగా ఉంటే, రక్షకుడు తన పనిని నెరవేర్చడానికి మనల్ని ఉపయోగిస్తారు. మనం చేయగలిగినంత ఉత్తమంగా చేస్తే మరియు మిగిలిన దానిని ఆయన భర్తీ చేస్తారని విశ్వసిస్తే, మన చుట్టూ ఉన్న అద్భుతాలలో మనం భాగం కాగలం.

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా అన్నారు, “మీరు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాకు కావాలి, ఎందుకంటే సమ్మతించే ప్రతీఒక్కరూ ఏదైనా చేయగలరు.”9

మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధిస్తున్నట్లుగా, “ప్రభువు ప్రయత్నాన్ని ప్రేమిస్తారు.”10

రక్షకుడు మన వినయపూర్వకమైన అర్పణలను అంగీకరించడానికి మరియు ఆయన కృప ద్వారా వాటిని పరిపూర్ణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రీస్తుతో, అపరిపూర్ణమైన పంట లేదు. ఆయన దయ మనకు ఉందని, ఆయన మనకు సహాయం చేస్తారని, మనం తడబడినప్పుడు లోతులలో నుండి మనలను రక్షిస్తారని మరియు పరిపూర్ణతకు తక్కువైన మన ప్రయత్నాలను పరిపూర్ణంగా చేస్తారని విశ్వసించే ధైర్యం మనకు ఉండాలి.

విత్తువాని ఉపమానంలో, రక్షకుడు మంచి నేలలో నాటిన విత్తనాల గురించి వివరిస్తారు. కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై మరియు మిగిలినవి ముప్పై రెట్లు ఉత్పత్తి చేస్తాయి. అన్నీ ఆయన పరిపూర్ణమైన పంటలో భాగమే.11

ప్రవక్త మొరోనై అందరినీ ఇలా ఆహ్వానించాడు, “క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి, … మీకైమీరు సమస్త భక్తిహీనత నుండి ఉపేక్షించుకొని, మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించిన యెడల, అప్పుడు ఆయన కృప మీకు చాలును; ఆయన కృప ద్వారా మీరు క్రీస్తు నందు పరిపూర్ణులగుదురు.”12

సహోదర సహోదరీలారా, మన అత్యంత వినయపూర్వకమైన సమర్పణను కూడా పరిపూర్ణం చేయగల శక్తి ఉన్న క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. మన వంతు కృషి చేద్దాం, మనం తీసుకురాగలిగినది తీసుకువద్దాం మరియు విశ్వాసంతో, ఆయన పాదాల వద్ద మన అపరిపూర్ణ సమర్పణ చేద్దాం. పరిపూర్ణమైన పంటకు యజమాని అయిన యేసు క్రీస్తు అను ఆయన నామములో, ఆమేన్.