సర్వసభ్య సమావేశము
మీ గోత్రజనకుని దీవెన--పరలోక తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మీ గోత్రజనకుని దీవెన--పరలోకపు తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపు

నా గోత్రజనకుని దీవెన నా నిజమైన నిత్యత్వ గుర్తింపును---నేను నిజముగా ఎవరిని, నేను ఎవరివలే కాగలనో గ్రహించడానికి నాకు సహాయపడింది.

వారి పిల్లలమైన మమ్మల్ని ప్రేమించి, సువార్తను విశ్వాసంగా బోధించిన అద్భుతమైన తల్లిదండ్రుల చేత నేను పెంచబడ్డాను. విచారకరంగా, నా ప్రియమైన తల్లిదండ్రులు చాలా సంవత్సరాలు తమ వివాహములో ఇబ్బందిపడ్డారు. బహుశా ఏదో ఒకరోజు వారు విడాకులు తీసుకుంటారని, నేను మరియు నా తోబుట్టువులు అమ్మ, నాన్నలలో ఎవరితో కలిసి జీవించాలో ఎంపిక చేసుకోవాలని నేను తెలుసుకున్నప్పుడు నాది ప్రాథమిక వయస్సు. ఫలితంగా, సంవత్సరాలుగా, నేను చెప్పకోదగిన అందోళనను అనుభవించాను; అయినప్పటికీ, పరలోక తండ్రి నుండి ఒక వరము నా కొరకు సమస్తమును పూర్తిగా మార్చివేసింది, అదే నా గోత్రజనకుని దీవెన.

11 సంవత్సరాల వయస్సులో, నా తల్లిదండ్రుల అనుబంధము గురించి ఎక్కువగా చింతించి, నేను గోత్రజనకుని దీవెనను లోతుగా కోరుకున్నాను. నా పరలోక తండ్రి నన్ను సమగ్రంగా ఎరిగియున్నారని మరియు నా నిర్దిష్ట పరిస్థితుల గురించి ఆయనకు తెలుసునని నాకు తెలుసు. నేను ఆయన నుండి ఆదేశమును పొందుతానని కూడా నాకు తెలుసు. నా 12వ పుట్టిన రోజు తరువాత వెంటనే, నేను నా గోత్ర జనకుని దీవెనను పొందాను. అది అర్ధ శతాబ్దం కంటె ఎక్కువ కాలం క్రితం జరిగింది, కానీ ఆ పవిత్రమైన అనుభవాన్ని నేను స్పష్టంగా జ్ఞాపకముంచుకోగలను.

కృతజ్ఞతపూర్వకంగా, మనకు సంఘము యొక్క General Handbook (ప్రధాన చేతిపుస్తకము) లో గోత్రజనకుని దీవెనలు గురించి ప్రేరేపించబడిన నడిపింపు ఉన్నది.

“యోగ్యత కలిగి, బాప్తిస్మము పొందిన ప్రతీ సభ్యుడు గోత్రజనకుని దీవెనను పొందడానికి హక్కును కలిగియున్నాడు, అది పరలోక తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపును అందిస్తుంది.”

ఒక సభ్యుడు “దీవెన యొక్క ప్రాముఖ్యతను, పరిశుద్ధ స్వభావాన్ని గ్రహించడానికి” మరియు “సువార్త యొక్క ప్రధాన సిద్ధాంతమును గ్రహించడానికి తగినంత పరిపక్వత” కలిగియుండాలి.

“జీవితంలో ఇంకా ముందుముందు చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి గనుక, సభ్యుడు తగిన వయస్సు కలిగియుండాలి. … యాజకత్వ నాయకులు ఒక గోత్రజనకుని దీవెన పొందడానికి ఒక సభ్యుని కొరకు కనిష్ఠ వయస్సును నిర్ధారించరాదు. …

“ప్రతీ గోత్రజనకుని దీవెన పవిత్రమైనది, రహస్యమైనది మరియు వ్యక్తిగతమైనది. …

“గోత్రజనకుని దీవెనను పొందిన ఒక వ్యక్తి దాని పదాలను భద్రపరచుకోవాలి, వాటిని ధ్యానించాలి, ఈ జీవితంలో మరియు నిత్యత్వములో వాగ్దానము చేయబడిన దీవెనలు పొందడానికి యోగ్యత కలిగియుండునట్లు జీవించాలి.”1

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గోత్రజనకుని దీవెన యొక్క ప్రాముఖ్యత గురించి పలుమార్లు ఇలా బోధించారు,2 అది ప్రతీ గ్రహీతకు “అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల వరకు వంశావళి ప్రకటనను” ఇస్తుంది 3 మరియు ప్రతీ దీవెన “మీకు వ్యక్తిగత లేఖనము వంటిది.”4

అనేక కారణాల వలన నా గోత్రజనకుని దీవెన నా చిన్నతనంలో చాలా ముఖ్యమైనది. మొదటిగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నా గోత్రజనకుని దీవెన నా నిజమైన నిత్యత్వ గుర్తింపును అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడింది—నేను నిజముగా ఎవరినో, నేను ఎవరివలే కాగలనో గ్రహించడానికి నాకు సహాయపడింది. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, నేను “దేవుని కుమారుడినని,” “నిబంధన [బిడ్డ]నని” మరియు “యేసు క్రీస్తు యొక్క శిష్యుడినని” తెలుసుకోవడానికి అది నాకు సహాయపడింది.5 నేను నా పరలోక తండ్రి మరియు నా రక్షకుని చేత ఎరిగి, ప్రేమించబడుతున్నానని, వారు నా జీవితంలో వ్యక్తిగతంగా చేర్చబడ్డారని నాకు తెలుసు. వారికి దగ్గర కావాలని మరియు వారియందు నా విశ్వాసమును, నమ్మకమును పెంపొందించాలని కోరడానికి అది నాకు సహాయపడింది.

వయోజనునిగా సంఘములో చేరిన ఒక ప్రియమైన స్నేహితుడు ఇలా పంచుకున్నాడు: “గోత్రజనకుడు తన చేతులను నా తలపై ఉంచి, నా పేరును చెప్పినప్పుడు, అంతా మారిపోయింది … అప్పుడు మాత్రమే కాదు కానీ మిగిలిన నా జీవిత కాలమంతా. ఆయన మాట్లాడుతున్న శక్తి ద్వారా---నేను సన్నిహితంగా, లోతుగా గుర్తించబడ్డానని వెంటనే నేను గ్రహించాను. ఆయన మాట్లాడిన మాటలు నా అంతరంగంలోకి చొచ్చుకుపోయాయి. పరలోక తండ్రి నన్ను సమగ్రంగా ఎరిగియున్నారని నాకు తెలుసు.

నేను నిజంగా ఎవరినో తెలుసుకోవడం, నేను చేయాలని దేవుడు కోరిన దానిని గ్రహించడానికి మరియు చేయాలని కోరడానికి నాకు సహాయపడింది.6

అది నేను చేసిన నిబంధనలను మరియు అబ్రాహాముతో దేవుని యొక్క నిబంధనలో వాగ్దానము చేయబడిన దీవెనలను అధ్యయనం చేయడానికి నన్ను నడిపించింది.7 నా నిబంధనలను మరింత పరిపూర్ణంగా పాటించడానికి నన్ను ప్రేరేపించునట్లు ఒక నిత్య దృష్టికోణమును అది నాకు ఇచ్చింది.

యువకునిగా నేను చాలా తరచుగా, ప్రతీరోజు నా గోత్రజనకుని దీవెనను చదివాను, అది పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పునిచ్చే, నడిపించే ప్రభావాన్ని అనుభూతి చెందడానికి నాకు సహాయపడింది, నేను ఆయన ప్రేరేపణలను అనుసరించినప్పుడు నా ఆందోళనను తగ్గించడానికి సహాయపడింది. అది ప్రతీరోజు నా లేఖనాలను అధ్యయనం చేయడానికి, ప్రార్థించడానికి మరియు దేవుని యొక్క ప్రవక్తలు, అపొస్తలుల బోధనలను ఎక్కువ శ్రద్ధగా అధ్యయనం చేయడానికి మరియు అనుసరించడానికి ప్రయత్నించడం ద్వారా వెలుగును, సత్యమును మరియు పరిశుద్ధాత్మను చురుకుగా ఆహ్వానించాలనే నా కోరికను హెచ్చించింది. నా గోత్రజనకుని దీవెన పరలోక తండ్రి యొక్క చిత్తమునకు ఎక్కువగా లోబడియుండుటకు నాకు సహాయపడింది మరియు ఆ దృష్టి నా వ్యక్తిగత పరిస్థితులను లక్ష్యపెట్టకుండా గొప్ప సంతోషాన్ని అనుభూతి చెందడానికి నాకు సహాయపడింది.8

నా గోత్రజనకుని దీవెనను చదివిన ప్రతీసారి నేను ఆత్మీయ బలాన్ని పొందాను. నా తల్లిదండ్రులు చివరకు విడాకులు పొందినప్పుడు, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ బోధించినట్లుగా, నా గోత్రజనకుని దీవెన నా కొరకు “ఒక ప్రశస్థమైన, అమూల్యమైన వ్యక్తిగత సంపదగా,” “ఒక వ్యక్తిగత లియహోనాగా” కూడా అయ్యింది.9

ఇప్పుడు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. నేను పరిపూర్ణుడను కాదు. నేను రకరకాల పొరపాట్లు చేసాను. నేనింకా చేస్తున్నానని నా నిత్య సహవాసి నిర్ధారిస్తుంది. కానీ నా గోత్రజనకుని దీవెన మంచిని చేయడానికి, మంచిగా ఉండునట్లు కోరడానికి నాకు సహాయపడుట కొనసాగించింది.10 నా గోత్రజనకుని దీవెనను తరచుగా చదవడం శోధనను జయించడానికి నా కోరికను హెచ్చించింది. అది పశ్చాత్తాపపడడానికి కోరికను, ధైర్యమును కలిగియుండడానికి నాకు సహాయపడింది మరియు పశ్చాత్తాపము మరింత సంతోషకరమైన ప్రక్రియగా మారింది.

నేను చిన్నవానిగా ఉండగా మరియు నా సాక్ష్యము ఇంకా ఎదుగుచుండగా నా గోత్రజనకుని దీవెనను పొందుట నాకు చాలా ముఖ్యమైనది. నేను సిద్ధపడియున్నానని నా కోరిక సూచించిందని నా తల్లిదండ్రులు మరియు బిషప్పు గ్రహించినందుకు నేను శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాను.

నాకు 12 సంవత్సరాలప్పుడు, ప్రపంచం ఈనాటి ప్రపంచం కంటే చాలా తక్కువ గందరగోళంగా మరియు పరధ్యానంగా ఉండేది. అధ్యక్షులు నెల్సన్ ఈ రోజును “పాపముతో నిండిన” మరియు “స్వీయ-కేంద్రీకృతమైన లోక చరిత్రలో అతి చిక్కైన సమయంగా” 11 వర్ణించారు. అదృష్టవశాత్తూ, నేటి మన యువత నాకు 12 సంవత్సరాలున్నప్పటి కంటే ఎక్కువ పరిపక్వత కలిగియున్నారు మరియు చిన్నగా ఉన్నప్పుడే వారు కూడా క్లిష్టమైన, ముఖ్యమైన నిర్ణయాలు చేయాల్సియున్నది. వారు నిజంగా ఎవరు అని మరియు దేవుడు వారిని ప్రేమిస్తున్నారని, వారిని పరిపూర్ణంగా ఎరుగుదురని తెలుసుకోవాల్సిన అవసరము వారికి కూడా ఉన్నది!

నేను చేసినట్లుగా అందరూ వారి గోత్రజనకుని దీవెనను కోరరు. కానీ ఇంకా తమ గోత్రజనకుని దీవెనను పొందని సభ్యులు వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా వెదకుతారని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆత్మీయంగా సిద్ధపడిన యెడల, నా వలే మీ అనుభవము, మీకు పవిత్రమైనది అవుతుందని నేను వాగ్దానము చేస్తున్నాను. తమ గోత్రజనకుని దీవెనను ఇదివరకే పొందిన సభ్యులు దానిని అధ్యయనం చేసి, భద్రపరచుకుంటారని కూడా నేను ప్రార్థిస్తున్నాను. నేను యౌవనంలో ఉన్నప్పుడు నా గోత్రజనకుని దీవెనను ఆదరించుట వలన, నేను నిరాశ చెందినప్పుడు అది నన్ను ధైర్యముతో దీవించింది, నేను భయపడినప్పుడు ఓదార్పునిచ్చింది, నేను ఆందోళన చెందినప్పుడు సమాధానమునిచ్చింది, నేను నిరాశ చెందినప్పుడు ఆశతో మరియు నాకు చాలా అవసరమైనప్పుడు సంతోషముతో నన్ను దీవించింది. నా గోత్రజనకుని దీవెన నా పరలోక తండ్రి మరియు నా రక్షకునియందు విశ్వాసమును, నమ్మకమును హెచ్చించడానికి సహాయపడింది. అది వారి పట్ల నా ప్రేమను కూడా హెచ్చించింది—మరియు అది ఇప్పటికీ అలాగే ఉంది.12

గోత్రజనకుని దీవెనలు పరలోక తండ్రి నుండి ప్రేరేపించబడిన నడిపింపును అందిస్తాయని నేను సాక్ష్యమిస్తున్నాను. మనల్ని ఎరిగి, ప్రేమించి, ఆశీర్వదించాలని కోరుకొనే మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు--మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క జీవన వాస్తవికతను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈరోజు భూమిపై దేవుని యొక్క ప్రవక్త అని కూడా నాకు నిశ్చయముగా తెలుసు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.