సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తు యొక్క బోధనలు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తు యొక్క బోధనలు

మన జీవితాలను నిర్దేశించడానికి మనకు లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఈ రోజు నా సందేశము మన రక్షకుని మాటల ఎంపికను--ఆయన చెప్పిన దానిని కలిగియున్నది.

మనము క్రీస్తు నందు విశ్వసిస్తున్నాము. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము ఆయనను ఆరాధిస్తాము మరియు లేఖనాలలో ఆయన బోధనలను అనుసరిస్తాము.

పతనమునకు ముందు, మన పరలోక తండ్రి ఆదాము, హవ్వలతో నేరుగా మాట్లాడారు. తరువాత, తండ్రి తన అద్వితీయ కుమారుడైన, యేసు క్రీస్తును మన రక్షకుడు, విమోచకునిగా పరిచయం చేసారు మరియు “ఆయనను ఆలకించుడి”1 అని మనకు ఆజ్ఞాపించారు. ఈ నడిపింపు నుండి “దేవుడు” లేదా “ప్రభువు” చేత మాట్లాడబడిన మాటల యొక్క లేఖన నివేదికలు దాదాపు ఎల్లప్పుడు యెహోవా, పునరుత్థానుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలని మనము నిర్ధారిస్తాము.2

మన జీవితాలను నిర్దేశించడానికి మనకు లేఖనాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్త నీఫై చెప్పినట్లుగా, మనము “క్రీస్తు యొక్క మాటలను విందారగించవలెను; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.”3 యేసు యొక్క మర్త్య పరిచర్యలను నివేదించే లేఖనాలలో అధికము ఆయన చేసిన దాని యొక్క వివరణలు. ఈ రోజు నా సందేశము మన రక్షకుని మాటల ఎంపికను---ఆయన చెప్పిన దానిని కలిగియున్నది. ఈ మాటలు క్రొత్త నిబంధనలో మరియు మోర్మన్ గ్రంథములో (జోసెఫ్ స్మిత్ యొక్క ప్రేరేపిత చేర్పులతో కలిపి) వ్రాయబడినవి. ఈ ఎంపికలలో ఎక్కువ భాగము మన రక్షకుడు వాటిని మాట్లాడిన క్రమములో ఉన్నవి.

“ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”4

“నీతి కొరకు ఆకలిదప్పులుగల వారు … ధన్యులు, వారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు.”5

“సమాధానపరచువారు ధన్యులు: వారు దేవుని కుమారులనబడుదురు.”6

“వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా:

“నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”7

“నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

“నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును ద్వేషపూరితముగా వాడుకొనువారి కొరకు, హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి;

“మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు: ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” 8

“మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును:

“మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.”9

“మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”10

“కాబట్టి, మీరు ఈ లోక విషయాలను వెదకకుడి, కానీ మీరు ఆయన రాజ్యమును కట్టడానికి మరియు ఆయన నీతిని స్థాపించడానికి మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”11

“కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో, ఆలాగుననే మీరును వారికి చేయుడి: ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.”12

““అబద్ధపు ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.

“వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?

“ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును; పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు.”13

“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని; పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”14

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి.”15

“ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.

“ఒక మనుష్యుడు తన సిలువనెత్తుకొనుటకు, తననుతాను సమస్త భక్తిహీనతనుండి, ప్రతీ లోక వ్యామోహమునుండి నిరాకరించుకొని, నా ఆజ్ఞలను పాటించవలెను.”16

“కాబట్టి, లోకమును విడిచిపెట్టి, మీ ఆత్మలను రక్షించుకొనుడి; ఒక మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన యెడల అతనికి ఏమి ప్రయోజనము? లేదా ఒక వ్యక్తి తన ఆత్మకు బదులుగా ఏమి ఇచ్చును?”17

“ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించున్నానో వాడు తెలిసికొనును.”18

“అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును.

“అడుగు ప్రతివానికియ్యబడును; వెదకువానికి దొరకును; తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.”19

“ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు, వాటిని కూడ నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును; అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.”20

“అందుకు యేసు, పునరుత్థానమును, జీవమును నేనే: నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును:

“బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు,”21 అని ఆమెతో అనెను.

“(ఇది చట్టములో గొప్ప ఆజ్ఞ) నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.

“ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

“ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.”22

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు: నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరుచుకొందును.”23

“శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”24

“నేను మిమ్మును ప్రేమించినట్టే, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.”25

“నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవు.” 26

“కాబట్టి మీరు వెళ్ళి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు, సమస్త దేశములకు బోధించుడి:

“నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.”27

పరిశుద్ధ దేశములో ఆయన పరిచర్య తరువాత, అమెరికా దేశములోని నీతిమంతులకు యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలలో కొన్ని ఇక్కడున్నాయి.

“ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నేను పరలోకములను, భూమిని మరియు వాటియందున్న సమస్తమును సృష్టించియున్నాను. నేను ఆరంభము నుండి తండ్రితో ఉన్నాను. తండ్రియందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాము; మరియు నా యందు తండ్రి తన నామమును మహిమపరచియున్నాడు.”28

“నేను లోకమునకు వెలుగును, జీవమునైయున్నాను. అల్ఫాయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే.

“మీరు నా కొరకు ఇకపై రక్తము చిందించరు; మీ బలులు, మీ దహనబలి అర్పణములు నిలిపి వేయబడును, ఏలయనగా మీ బలులను, మీ దహనబలి అర్పణములను వేటిని నేను అంగీకరించను.

“మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు. ఎవడు నా యొద్దకు ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మతో వచ్చునో అతనికి నేను అగ్ని మరియు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చెదను. …

“ఇదిగో లోకమునకు విమోచన తెచ్చుటకు, పాపము నుండి లోకమును రక్షించుటకు నేను లోకమునకు వచ్చియున్నాను.”29

“మరలా నేను మీతో చెప్పుచున్నాను, మీరు పశ్చాత్తాపపడి నా నామమందు బాప్తిస్మము పొంది ఒక చిన్న బిడ్డవలే కావలెను, లేని యెడల మీరు ఏవిధముగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు”30

“కావున నేను లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైయున్నట్లు మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను.”31

“నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, మీరు అపవాది చేత శోధింపబడి, అతని చేత దాసులుగా నడిపించి వేయబడకుండునట్లు ఎల్లప్పుడు మెలకువగానుండి ప్రార్థన చేయుడి.”32

“కావున మీరు ఎల్లప్పుడు తండ్రికి నా నామమున ప్రార్థన చేయవలెను.”33

“కావున, మీరు ఏమి చేసినను, నా నామమున చేయవలెను; మీరు సంఘమును నా నామమున పిలువవలెను.”34

“ఇదిగో నేను మీకు నా సువార్తను ఇచ్చియున్నాను మరియు నేను మీకు ఇచ్చిన సువార్త ఇదియే—తండ్రి నన్ను పంపినందున, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను లోకములోనికి వచ్చియున్నాను.

“నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు; మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు నేను సిలువపైన పైకెత్తబడిన తరువాత, … అవి మంచివేగాని చెడ్డవేగాని వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుటకు.”35

“ఇప్పుడు ఆజ్ఞ ఇదియే: అంత్యదినమున మీరు నా యెదుట మచ్చలేక యుండునట్లు, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడునట్లు, భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి మరియు నా నామమున బాప్తిస్మము పొందుడి”36 అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

మనము క్రీస్తు నందు విశ్వసిస్తున్నాము. ఆయన బోధనలను మనము ఎలా తెలుసుకొని, అనుసరించాలనే దాని గురించి ఆయన చెప్పిన దానితో నేను ముగిస్తాను:

“ఆదరణ కర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును.”37

ఈ బోధనల యొక్క సత్యమును యేసు క్రీస్తు నామములో నేను ధృవీకరిస్తున్నాను, ఆమేన్.