సర్వసభ్య సమావేశము
కేవలం కొనసాగించండి—విశ్వాసంతో
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


కేవలం కొనసాగించండి—విశ్వాసంతో

మన రక్షకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేయడం, మనకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.

ఎల్డర్ జార్జ్ ఎ. స్మిత్ అనే ఒక అపొస్తలుడు, చాలా కష్టతరమైన సమయంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నుండి సలహా అందుకున్నారు: “ఎలాంటి కష్టాలు నన్ను చుట్టుముట్టినా నేను ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని అతను నాకు చెప్పాడు. నేను నోవా స్కోటియాలోని గొయ్యిలో మునిగిపోయి, రాకీ పర్వతాలన్నీ నా పైన పేరుకుపోయినను, నిరుత్సాహపడకుండా, విశ్వాసం చూపుతూ, ధైర్యాన్ని కొనసాగించి, చివరకు నేను పైకి రావాలి.”1

బాధపడుతున్న ఒక వ్యక్తికి—ప్రవక్త జోసెఫ్ అలా ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే అది నిజమని అతనికి తెలుసు. అతను అలా జీవించాడు. జోసెఫ్ తన జీవితంలో అనేక పర్యాయములు తీవ్రమైన కష్టాలను అనుభవించాడు. అయినప్పటికీ, అతను యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై విశ్వాసం ఉంచి, ముందుకు సాగుతూనే ఉన్నప్పుడు, అతను అధిగమించలేని అడ్డంకులను అధిగమించాడు.2

మనము నిరాశ, బాధాకరమైన అనుభవాలు, మన స్వంత అసమర్థత లేదా ఇతర సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహానికి గురికావద్దని జోసెఫ్ చేసిన విజ్ఞప్తిని ఈరోజు నేను పునరుద్ధరించాలనుకుంటున్నాను.

నేను నిరుత్సాహం గురించి చెప్పినప్పుడు, నేను అత్యంత తీవ్రమైన విచారం, ఆందోళన రుగ్మతలు లేదా ప్రత్యేక చికిత్స అవసరమయ్యే ఇతర అనారోగ్యాల యొక్క మరింత బలహీనపరిచే సవాళ్ళ గురించి మాట్లాడడం లేదు.3 నేను కేవలం జీవితంలోని హెచ్చు తగ్గులతో వచ్చే సాధరణ నిరుత్సాహం గురించి మాట్లాడుతున్నాను.

నా నాయకుల నుండి నేను స్ఫూర్తి పొందుతున్నాను, ఏమి జరిగినా వారు—విశ్వాసంతో—కొనసాగుతారు.4 మోర్మన్‌ గ్రంథములో, లేబన్‌ సేవకుడైన జోరమ్ గురించి మనం చదువుతాము. నీఫై ఇత్తడి పలకలను పొందినప్పుడు, నీఫైని మరియు అతని సోదరులను అరణ్యంలో వెంబడించే ఎంపికను లేదా తన ప్రాణాలను కోల్పోయే పరిస్థితిని జోరమ్ ఎదుర్కొనవలసి వచ్చింది.

ఏమి ఎంపిక! జోరమ్ యొక్క మొదటి అపేక్ష పరుగెత్తడమే, కానీ నీఫై అతనిని పట్టుకుని, అతను వారితో వస్తే, స్వేచ్ఛగా ఉంటాడని మరియు వారి కుటుంబంలో ఒక స్థానాన్ని కలిగి ఉంటాడని ప్రమాణం చేశాడు. జోరమ్ ధైర్యం తెచ్చుకుని వారితో వెళ్ళాడు.5

జోరమ్ తన నూతన జీవితంలో అనేక బాధలను ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ అతను విశ్వాసంతో ముందుకు సాగాడు. జోరమ్ తన గతాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడని లేదా దేవుడు లేదా ఇతరుల పట్ల పగను కలిగి ఉన్నాడని మనకు ఎటువంటి సూచన లేదు.6 అతను ప్రవక్త అయిన నీఫైకి నిజమైన స్నేహితుడు, అతను మరియు అతని సంతానం వాగ్దానదేశంలో స్వేచ్ఛగా, సమృద్ధిగా జీవించారు. జోరమ్ యొక్క మార్గంలో పెద్ద అడ్డంకిగా ఉండి చివరికి గొప్ప ఆశీర్వాదాలకు దారితీసింది ఏమిటంటే, అతని విశ్వసనీయత మరియు విశ్వాసంతో కొనసాగడానికి అతను ఇష్టపడడం.7

ఇటీవల నేను, ధైర్యంగల ఒక సహోదరి కష్టాలను ఎలా సహించిందో చెప్పడం విన్నాను.8 ఆమెకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి మరియు ఒక ఆదివారం ఆమె ఉపశమన సమాజంలో కూర్చొని, తన జీవితానికి పూర్తిగా భిన్నమైన—పరిపూర్ణ జీవితాన్ని గడిపినట్లు ఆమె భావించిన ఒక బోధకురాలిని వింటూ ఉంది. ఆమె అలసిపోయి, నిరుత్సాహపడింది. తాను సరితూగదు—లేదా చెందియుండలేదు అని ఆమె భావించింది—కాబట్టి ఆమె లేచి వెళ్ళిపోయింది, ఇకపై సంఘానికి తిరిగి రాకూడదని అనుకుంది. ఆమె కారు వద్దకు నడుస్తూ, ఒక ప్రత్యేకమైన మనోభావాన్ని అనుభవించింది: “సంఘ భవనంలోనికి వెళ్ళి, సంస్కార సమావేశంలో ప్రసంగించే వాని‌ని విను.” ఆమె ప్రేరణను ప్రశ్నించింది, కానీ దానిని మళ్ళీ బలంగా భావించింది, కాబట్టి ఆమె సమావేశానికి వెళ్ళింది.

సందేశం సరిగ్గా ఆమెకు అవసరమైనది. ఆమె ఆత్మను అనుభవించింది. ఆమె తనతో ఉండాలని, తన శిష్యురాలిగా ఉండాలని మరియు సంఘానికి హాజరు కావాలని ప్రభువు కోరుకుంటున్నట్లు ఆమె తెలుసుకుంది.

ఆమె దేనికి కృతజ్ఞతతో ఉందో తెలుసా? ఆమె నిరాశపడలేదని. అది ఆమెను కష్టపెట్టినప్పటికీ, ఆమె యేసు క్రీస్తునందు విశ్వాసంతో—ముందుకు కొనసాగుతూనే ఉంది, ఆమె ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆమె మరియు ఆమె కుటుంబం సమృద్ధిగా ఆశీర్వదించబడుతోంది.

మనం ఆయన వైపు చూస్తూ, పరిశుద్ధాత్మ యొక్క సూచనలను అనుసరిస్తూ, 9 విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లయితే, భూమ్యాకాశములకు అధిపతియైన దేవుడు నిరుత్సాహాన్ని మరియు మనం ఎదుర్కొనే అడ్డంకులను అధిగమించడానికి మనకు సహాయం చేస్తారు.

కృతజ్ఞతాపూర్వకముగా, మనం బలహీనంగా లేదా అసమర్థంగా ఉన్నప్పుడు, ప్రభువు మన విశ్వాసాన్ని బలపరచగలరు. ఆయన మన శక్తికి మించి మన సామర్థ్యాన్నిపెంచగలరు. నేను దానిని అనుభవించాను. 20 సంవత్సరాల క్రితం, నేను ఊహించని విధంగా ఒక ప్రాంతీయ డెబ్బదిగా నన్ను పిలిచారు మరియు నేను సరిపోనని భావించాను. నా శిక్షణ నియామకాల తర్వాత, నా మొదటి స్టేకు సమావేశానికి నేను అధ్యక్షత వహించాల్సి ఉంది.10 స్టేకు అధ్యక్షుడు మరియు నేను అన్ని వివరాలను నిశితంగా ప్రణాళిక చేసాము. సమావేశానికి కొద్దిసేపటి ముందు, అధ్యక్షులు బాయిడ్ కె. ప్యాకర్, అప్పటి–పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షులు, నాతోపాటు ఆయన రావచ్చునేమో చూడడానికి పిలిచారు. నేను ఆశ్చర్యపోయాను మరియు అంగీకరించాను. ఆయన అధ్యక్షత్వం వహిస్తారు కాబట్టి, ఎలా ముందుకు వెళ్ళాలని నేను ఆయనను అడిగాను. ప్రణాళికలను రద్దు చేసి, ఆత్మను అనుసరించడానికి మేము సిద్ధం కావాలని ఆయన సూచించారు. కృతజ్ఞతాపూర్వకముగా, నేను ఇంకా చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి మరియు సిద్ధపడడానికి 10 రోజుల సమయం ఉంది.

బహిరంగ చర్చనీయాంశాల జాబితాతో, నాయకత్వ సమావేశం ప్రారంభమవడానికి 20 నిమిషాల ముందు మేము వేదికపై ఉన్నాము. నేను స్టేకు అధ్యక్షుడి వైపు వంగి, “ఇది అద్భుతమైన స్టేకు” అని గుసగుసగా చెప్పాను.

అధ్యక్షులు ప్యాకర్ నన్ను మోచేతితో మెల్లగా తట్టి, “మాట్లాడవద్దు” అన్నారు.

నేను మాట్లాడడం మానేశాను మరియు ఆయన సర్వసభ్య సమావేశ ప్రసంగం “Reverence Invites Revelation”11 నాకు గుర్తుకు వచ్చింది. అధ్యక్షులు ప్యాకర్ లేఖన సూచన‌లను వ్రాస్తున్నట్లు నేను గమనించాను. ఆయన సమావేశం కోసం మనోభావాలు పొందుతున్నట్లు ఆత్మ నాకు ధృవీకరించింది. నా అభ్యాస అనుభవం అప్పుడే ప్రారంభమైంది.

అధ్యక్షులు ప్యాకర్ మొదటి 15 నిమిషాలు ప్రసంగించారు మరియు పరిశుద్ధాత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడినట్లుగా అన్ని సమావేశాలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.12 తర్వాత ఆయన చెప్పారు, “మనము ఇప్పుడు ఎల్డర్ కుక్ నుండి వింటాము.”

నేను మాట్లాడడానికి వెళుతున్నప్పుడు, నేను ఎంత సమయం తీసుకోవాలనుకుంటున్నారు మరియు ఏదైనా అంశం గురించి నేను ప్రసంగించాలనుకుంటున్నారా అని అడిగాను. “15 నిమిషాలు తీసుకోండి మరియు మీరు ప్రేరణ పొందినట్లుగా కొనసాగించండి” అన్నారాయన. నేను సుమారు 14 నిమిషాల సమయం తీసుకున్నాను మరియు నా మనస్సులో ఉన్న ప్రతీదాన్ని పంచుకున్నాను.

అధ్యక్షులు ప్యాకర్ మళ్ళీ నిలబడి మరో 15 నిమిషాలు మాట్లాడారు. ఆయన ఈ లేఖనాన్ని పంచుకున్నారు:

“మీ హృదయములలో నేనుంచు తలంపులను పలుకుడి, మనుష్యుల యెదుట మీరు గద్దింపబడరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను;

“ఏలయనగా, … మీకది ఇవ్వబడును, మీరేమి మాట్లాడవలెనో ఆ క్షణమందే ఇవ్వబడును.”13

తర్వాత ఆయన చెప్పారు, “మనము ఇప్పుడు ఎల్డర్ కుక్ నుండి వింటాము.”

నేను ఆశ్చర్యపోయాను. ఒక సమావేశంలో నన్ను రెండుసార్లు మాట్లాడమని అడిగే అవకాశాన్ని నేను ఎప్పుడూ పరిగణించలేదు. చెప్పడానికి నా మనస్సులో ఏమీ లేదు. హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, సహాయం కోసం ప్రభువుపై ఆధారపడి, ఒక ఆలోచనతో, ఒక లేఖనముతో నేను ఆశీర్వదించబడ్డాను మరియు నేను మరో 15 నిమిషాలు మాట్లాడగలిగాను. నేను పూర్తిగా అలసిపోయి కూర్చున్నాను.

అధ్యక్షులు ప్యాకర్ మళ్ళీ 15 నిమిషాల పాటు ఆత్మను అనుసరించడం గురించి మాట్లాడారు మరియు మనము “మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ నేర్పు మాటలతో” మాట్లాడాలని పౌలు చెప్పిన బోధనలను పంచుకున్నారు.14 మీరు ఊహించినట్లుగా, “మనము ఇప్పుడు ఎల్డర్ కుక్ నుండి వింటాము” అని మూడవసారి చెప్పాలని ఆయన భావించినప్పుడు నేను ముంచివేయబడ్డాను.

నేను ఖాళీగా ఉన్నాను. నా దగ్గర ఏమీ లేదు. ఇది మరింత విశ్వాసాన్ని ప్రదర్శించాల్సిన సమయం అని నాకు తెలుసు. మెల్లగా, నేను సహాయం కోసం దేవుడిని వేడుకుంటూ, మాట్లాడడానికి వెళ్ళాను. నేను మైక్రోఫోన్‌ వద్దకు అడుగు పెట్టగానే, మరో 15 నిమిషాల సందేశం ఇచ్చేలా ప్రభువు నన్ను అద్భుతంగా ఆశీర్వదించారు.15

చివరకు సమావేశం ముగిసింది, కానీ పెద్దల సభ ఒక గంటలో ప్రారంభమవుతుందని నేను త్వరగా గ్రహించాను. అరెరే వద్దు! జోరమ్ లాగా, నేను పరుగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ నీఫై అతన్ని పట్టుకున్నట్లే, అధ్యక్షులు ప్యాకర్ నన్ను పట్టుకుంటారని నాకు తెలుసు. పెద్దల సభ కూడా అదే పద్ధతిని అనుసరించింది. మరో మూడుసార్లు నేను మాట్లాడాను. మరుసటి రోజు సర్వసభ్య సభలో నేను ఒకసారి మాట్లాడాను.

సమావేశం తర్వాత, అధ్యక్షులు ప్యాకర్ ఆప్యాయతతో, “మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేద్దాం” అని అన్నారు. నేను అధ్యక్షులు బాయిడ్ కె. ప్యాకర్‌ను ప్రేమిస్తున్నాను మరియు నేను నేర్చుకున్న వాటన్నింటినీ గౌరవిస్తున్నాను.

నేను దేనికి కృతజ్ఞతతో ఉన్నానో మీకు తెలుసా? నేను నిరాశపడలేదు—లేదా ప్రతిఘటించలేదు. ఆ సమావేశాల నుండి తప్పించుకోవాలనే నా నిరాశాపూర్వకమైన కోరికకు నేను లొంగిపోయి ఉంటే, నా విశ్వాసాన్ని పెంచుకోనే మరియు నా పరలోక తండ్రి నుండి గొప్ప ప్రేమను, మద్దతును పొందే అవకాశాన్ని నేను కోల్పోయేవాడిని. ఆయన దయ, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క అద్భుత శక్తి మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన ప్రభావం గురించి నేను తెలుసుకున్నాను. నాకు బలహీనతలు ఉన్నప్పటికీ,16 నేను సేవ చేయగలనని తెలుసుకున్నాను; నేను విశ్వాసంతో కొనసాగితే, ప్రభువు నా ప్రక్కన ఉన్నప్పుడు నేను సహకారం అందించగలను.

జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళ పరిమాణం, పరిధి మరియు గంభీరతతో సంబంధం లేకుండా, మనమందరం ఆపివేయాలని, వదిలివేయాలని, తప్పించుకోవాలని లేదా బహుశా వదులుకోవాలని భావించే సందర్భాలు ఉంటాయి. కానీ మన రక్షకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేయడం, మనకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.

రక్షకుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చినట్లే, మనకు ఇవ్వబడిన పనిని పూర్తి చేయడంలో మనకు సహాయం చేసే శక్తి ఆయనకు ఉంది.17 అది ఎంత కష్టంగా మారినప్పటికీ, నిబంధన మార్గములో ముందుకు సాగడానికి మరియు చివరికి నిత్యజీవాన్ని పొందడానికి మనము ఆశీర్వదించబడగలము.18

ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పినట్లుగా, “దేవుని పరిశుద్ధులారా, నిశ్చలంగా నిలబడండి, మరికొంత కాలం ఆగండి, జీవితపు తుఫాను దాటిపోతుంది, మరియు మీరు ఎవరి సేవకులుగా ఉన్నారో ఆ దేవుని ద్వారా మీకు ప్రతిఫలం లభిస్తుంది.”19 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. George A. Smith, in Teachings of Presidents of the Church: Joseph Smith (2011), 235.

  2. See Teachings: Joseph Smith, 227–36.

  3. నేను నిరుత్సాహం గురించి మాట్లాడేటప్పుడు, అత్యంత తీవ్రమైన విచారం, ఆందోళన రుగ్మతలు లేదా ప్రత్యేక చికిత్స అవసరమయ్యే ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు “క్రీస్తునందు విశ్వాసంతో కొనసాగడం” మాత్రమే ప్రయత్నమని నేను సూచించడం లేదు. ఈ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు వింటున్న ఇతరులకు, దయచేసి ప్రభువును విశ్వసిస్తూ వైద్య, మానసిక మరియు ఆధ్యాత్మిక సంరక్షణను వెదకండి అని చెప్పే మన సంఘ నాయకుల సలహాను నేను ప్రతిధ్వనిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సవాళ్ళతో పోరాడుతున్న మీలో ప్రతీఒక్కరి కొరకు నా హృదయం దుఃఖిస్తోంది. మేము మీ కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము.

  4. నా ఆధునిక కాలపు హీరోలతో పాటు, లేఖనాలలోని నా నాయకులలో కొందరు--కాలేబు(సంఖ్యాకాండము 14:6–9, 24 చూడండి), యోబు (యోబు 19:25–26 చూడండి), మరియు నీఫై (1 నీఫై 3:7 చూడండి).

  5. 1 నీఫై 4:20, 30–35, 38 చూడండి.

  6. డేల్ జి. రెన్‌లండ్, “తీవ్రమైన అన్యాయము,” లియహోనా, మే 2021, 41–45 చూడండి.

  7. 2 నీఫై 1:30-32 చూడండి. “[జోరమ్] కొంచెం కఠినమైన నిర్వహణను భరించవలసి వచ్చినప్పటికీ, దేవుడు అతనిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్న పరిస్థితిలోనే అతను చిక్కుకున్నాడు. అతడు తన మాతృభూమిని వదులుకోవలసి వచ్చినప్పటికీ, దేవుడు మెరుగైన దానిని సిద్ధం చేస్తున్నాడు” (David B. Paxman, “Zoram and I: Getting Our Stories Straight” [Brigham Young University devotional, July 27, 2010], 8, speeches.byu.edu).

  8. నేను 2022 డిసెంబరు 11న, రివర్‌డేల్ యూటా స్టేకులోని ఒక వార్డులో ఈ సహోదరి సాక్ష్యాన్ని విన్నాను. ఆమె పంచుకున్న అనుభవం మునుపటి వార్డులో జరిగింది.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–13 చూడండి.

  10. 2001 నవంబరు 3–4 తేదీలలో బెన్సన్ యూటా స్టేకులో నా నియామకం జరిగింది. అధ్యక్షుడు జెర్రీ టూంబ్స్ స్టేకు అధ్యక్షుడిగా ఉన్నారు.

  11. See Boyd K. Packer, “Reverence Invites Revelation,” Ensign, Nov. 1991, 21–23.

  12. సిద్ధాంతము మరియు నిబంధనలు 46:2 చూడండి.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 100:5–6; 7-8 వచనములు కూడా చూడండి.

  14. 1 కొరింథీయులకు 2:13.

  15. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “మీరు ఇంతకు ముందు చేయని వాటికి మించి ఆధ్యాత్మికంగా విస్తరించినప్పుడు, [రక్షకుని] శక్తి మీలోకి ప్రవహిస్తుంది” (“మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుట,” లియహోనా, మే 2017, 42).

  16. ఈథర్ 12:27 చూడండి.

  17. యోహాను 17:4 చూడండి.

  18. 2 నీఫై 31:20; మోషైయ 2:41; ఆల్మా 36:3 చూడండి.

  19. Teachings: Joseph Smith, 235.