సర్వసభ్య సమావేశము
సమాధానకర్తయగు అధిపతి యొక్క అనుచరులు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సమాధానకర్తయగు అధిపతి యొక్క అనుచరులు

రక్షకుని వంటి లక్షణాలను వృద్ధిచేయడానికి మనం ప్రయత్నించినప్పుడు, లోకానికి ఆయన అందించే సమాధానాన్ని తీసుకువచ్చే సాధనాలుగా మనం కాగలము.

జెకర్యాకు ఇవ్వబడిన ప్రవచనము యొక్క నెరవేర్పులో, 1 యేసు విజయోత్సాహముతో గాడిదపైన కూర్చొని పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించారు, సాహిత్యములో అది “ancient symbol of Jewish royalty” గా పరిగణించబడింది 2 వాస్తవానికి రాజులకు రాజు, సమాధానకర్తయగు అధిపతి అనడం సరియైనది.3 ఉత్సాహవంతులైన శిష్యుల సమూహం చుట్టూ గుమికూడారు, యేసు వెళ్ళిన మార్గమంతా వారు తమ వస్త్రాలను, ఈత మట్టలను, ఇతర ఆకులను పరిచారు. వారు ఇలా అంటూ బిగ్గరగా దేవుని స్తుతించారు, “ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక: పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక.”4 మరల, “దావీదు కుమారునికి జయము; ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక; సర్వోన్నతమైన స్థలములలో జయము.”5 మట్టల ఆదివారంగా పిలిచే ఈ రోజున మనం వేడుక చేసుకొనే ఈ దివ్యమైన సంఘటన, రక్షకుని నిస్వార్థ త్యాగము మరియు ఖాళీ సమాధి యొక్క మహా అద్భుతమును పూర్తిచేయు నిర్ణీత వారములో సంభవించు వేదనాత్మక సంఘటనలకు ఆనందకరమైన ప్రారంభము.

ఆయన అనుచరులుగా మనం ఆయన ప్రత్యేక జనులము, ఆయన సుగుణాలను ప్రకటించడానికి పిలువబడ్డాము,6 ఆయన ద్వారా మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా ధారాళముగా అందించబడిన సమాధానమును వృద్ధిచేయువారము. ఈ సమాధానము తమ హృదయాలను రక్షకుని వైపు త్రిప్పి, నీతిగా జీవించు వారందరికి వాగ్దానము చేయబడిన బహుమానము; అటువంటి సమాధానము మర్త్య జీవితాన్ని ఆనందించడానికి మనకు బలాన్నిస్తుంది మరియు మన ప్రయాణము యొక్క బాధాకరమైన శ్రమలను సహించడానికి శక్తినిస్తుంది.

1847లో, పడమటివైపు తమ ప్రయాణంలో అనుకోని కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ప్రశాంతంగా, ఐక్యంగా ఉండేందుకు సమాధానము అవసరమైన అగ్రగామి పరిశుద్ధులకు ప్రభువు నిర్దిష్టమైన సూచనలు ఇచ్చారు. ఇతర విషయాల మధ్య, “ఒకనితోనొకరు జగడములాడుటను మానుడి; ఒకరిని గూర్చి మరొకరు చెడుగా మాట్లాడుటను మానుడి”7 అని పరిశుద్ధులకు ప్రభువు ఉపదేశించారు. నీతికార్యములను సాధన చేసి, ప్రభువు ఆత్మ యొక్క సాత్వీకములో నడిచేందుకు ప్రయత్నించే వారికి నేడు మనము జీవిస్తున్న అల్లకల్లోలపు దినములలో బ్రతకడానికి అవసరమైన సమాధానం వాగ్దానం చేయబడిందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి.8

సమాధానకర్తయగు అధిపతి యొక్క శిష్యులుగా, “ఒకరి యెడల ఒకరు ఐక్యతయందును, ప్రేమయందును హృదయములు ముడివేయబడునట్లు”9 జీవించాలని మనము ఉపదేశించబడ్డాము. “రక్షకుడు వేటి కోసం నిలిచారో మరియు బోధించారో వాటన్నిటిని కలహము ఉల్లంఘిస్తుంది”10 అని మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన హృదయాలలో మరియు మన జీవితాలలో చెలరేగుతున్న వ్యక్తిగత సంఘర్షణలను అంతం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయాలని కూడా మన ప్రవక్త అభ్యర్థించారు.11

మన కొరకు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ మరియు ఆయన అనుచరులుగా మనం ఒకరి యెడల ఒకరు కలిగియుండాలని కోరే ప్రేమ యొక్క దృక్పథంలో ఈ సూత్రాలను పరిగణిద్దాం. ఈ విధమైన ప్రేమను లేఖనాలు దాతృత్వము అని నిర్వచిస్తాయి.12 మనం దాతృత్వము గురించి ఆలోచించినప్పుడు, సాధారణంగా మన మనస్సులు శారీరకంగా, వస్తుపరంగా లేదా మానసికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారి బాధను ఉపశమింపజేయడానికి చేసే ఉదారమైన కార్యాలు మరియు విరాళాల వైపు తిరుగుతాయి. అయితే, దాతృత్వము కేవలం ఒకరికి మనం ఇచ్చే విరాళానికి సంబంధించినది కాదు, అది రక్షకుని యొక్క లక్షణము మరియు మన స్వభావంలో భాగం కాగలదు. “దాతృత్వమను బంధమును దుప్పటివలె మనం కప్పుకోవాలని, … అది పరిపూర్ణత, శాంతి యొక్క బంధము”13 అని ప్రభువు మనకు ఉపదేశించడంలో ఆశ్చర్యము లేదు. దాతృత్వము లేని యెడల మనము వ్యర్థులము,14 మరియు మన పరలోక తండ్రి యొక్క నివాసములందు మన కొరకు ప్రభువు సిద్ధము చేసిన స్థలమును మనము స్వాస్థ్యముగా పొందలేము.15

ప్రత్యేకించి ఆయన ప్రాణ త్యాగానికి ముందు జరిగిన వేదనాత్మక సంఘటనలను ఎదుర్కొంటున్నప్పుడు, తన స్వభావంలో భాగంగా ఈ దాతృత్వాన్ని కలిగియుండడమంటే అర్థమేమిటనే దానికి యేసు పరిపూర్ణమైన మాదిరినుంచారు. ఆయన శిష్యులలో ఒకరు ఆ రాత్రి ఆయనను మోసం చేస్తారని తెలిసి, శిష్యుల పాదాలను ఆయన వినయంగా కడుగుతున్నప్పుడు యేసు ఎలా భావించియుండవచ్చో ఒక్క క్షణం ఆలోచించండి.16 లేదా చాలాసేపటి తర్వాత, ఆయనను బంధించడానికి ఆయనను మోసగించిన యూదాతో పాటు వచ్చిన మనుష్యులలో ఒకరి చెవిని యేసు దయతో స్వస్థపరచడం గురించి ఆలోచించండి.17 లేదా పిలాతు ముందు నిలబడిన రక్షకుడు ప్రధాన యాజకులు మరియు పెద్దల చేత అన్యాయంగా నిందించబడడం మరియు ఆయనకు వ్యతిరేకంగా చేయబడిన అబద్ధ ఆరోపణలకు వ్యతిరేకంగా ఆయన ఒక్క మాట మాట్లాడకపోవడం మరియు రోమా పాలకుడిని ఆశ్చర్యచకితుడిని చేయడం గురించి ఆలోచించండి.18

ఈ మూడు గంభీరమైన సంఘటనల గుండా రక్షకుడు అత్యధిక విచారము మరియు ఒత్తిడిచేత దుఃఖభరితుడైనప్పటికీ, “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును; … మత్సరపడదు; … డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, [మరియు] అపకారమును మనస్సులో ఉంచుకొనదు”19 అని తన మాదిరి ద్వారా మనకు బోధించారు.

మనం ఒకరినొకరం ఏవిధంగా ఆదరిస్తామనేది నొక్కి చెప్పవలసిన మరొక ముఖ్యమైన అంశము, మన శిష్యత్వంపై మరియు మనం రక్షకుని యొక్క సమాధానమును ఎలా వృద్ధి చేస్తామనే దానిపై స్పష్టమైన అర్థమును కలిగియున్న అంశము. తన భూలోక పరిచర్యలో రక్షకుని బోధనలు—ఆయనకు దగ్గర కావాలని మరియు ఆయన సమాధానమును వృద్ధిచేయాలని కోరుకునే వారికి ప్రధానమైన లక్షణాలపైన—మాత్రమే కాకుండా, ప్రత్యేకించి—ప్రేమ, దాతృత్వము, సహనము, వినయము మరియు కనికరము వంటి సుగుణాలపై—కేంద్రీకరించబడ్డాయి. అటువంటి లక్షణాలు దేవుని నుండి బహుమానాలు మరియు మనం వాటిని వృద్ధిచేయాలని ప్రయత్నించినప్పుడు, మనం మన పొరుగువారి వ్యత్యాసాలను, బలహీనతలను మరింత సానుభూతి, సున్నితత్వం, గౌరవం మరియు సహనముతో చూడడం ప్రారంభిస్తాము. పరిస్థితులు ఏవైనప్పటికీ, మన తోటివారిని మనం ఆదరించే ప్రేమ, సహనము, దయగల విధానమే మనం రక్షకునికి దగ్గరవుతున్నాము మరియు ఎక్కువగా ఆయనలా మారుతున్నాము అనడానికి అత్యంత స్పష్టమైన చిహ్నాలలో ఒకటి.

ఇతరులలో గుర్తించిన లక్షణాలు, బలహీనతలు మరియు అభిప్రాయాల గురించి, ముఖ్యంగా అటువంటి లక్షణాలు, అభిప్రాయాలు వారు ప్రవర్తించే మరియు ఆలోచించే విధానం నుండి భిన్నంగా లేదా వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటి గురించి ప్రతికూలమైన మరియు అగౌరవమైన వ్యాఖ్యానాలు చేసే పనిలో ఉండే జనులను మనం తరచూ చూస్తాము. సాధారణంగా ఈ వ్యక్తులు అటువంటి వ్యాఖ్యానాలను ఇతరులకు చేరవేస్తారు, వాళ్ళు ఒక సందర్భం చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని నిజంగా తెలుసుకోకుండా వారు విన్నదానిని తిరిగి చెప్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ, ఈ విధమైన ప్రవర్తనను సామాజిక మాధ్యమం సంబంధిత సత్యాలు మరియు పారదర్శకత పేరుతో ప్రోత్సహిస్తుంది. ఆటంకము లేకుండా, డిజిటల్ సంభాషణ తరచు జనులను వ్యక్తిగత దాడులకు, తీవ్రమైన తగాదాలకు నడిపిస్తుంది, నిరాశలు సృష్టిస్తుంది, మనస్సులను గాయపరుస్తుంది మరియు తీవ్రమైన ద్వేషాన్ని వ్యాపింపజేస్తుంది.

కడవరి దినాలలో, శత్రువు నరుల సంతానము యొక్క హృదయములలో విజృంభించును మరియు మంచిదానికి వ్యతిరేకముగా వారిని కోపమునకు పురిగొల్పును అని నీఫై ప్రవచించాడు.20 “మంచిని చేయుటకు, దేవుడిని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు ఆహ్వానించి, ఆకర్షించు ప్రతీ సంగతి దేవుని వలన ప్రేరేపించబడినది”21 అని లేఖనాలు బోధిస్తున్నాయి. మరొక వైపు, “చెడ్డవి అపవాది నుండి వచ్చును; ఏలయనగా, అపవాది దేవునికి శత్రువైయుండి ఆయనకు విరుద్ధముగా నిరంతరము పోరాడుచున్నాడు; పాపము చేయుటకు మరియు నిరంతరము చెడు చేయుటకు ఆహ్వానించుచూ ప్రలోభపెట్టుచున్నాడు.”22

ఈ ప్రవచనాత్మక బోధనను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, దేవుని పిల్లల హృదయాలలో శత్రుత్వాన్ని, దేషాన్ని పురిగొల్పడం అపవాది కుయుక్తులలో ఒకటి అనడంలో ఆశ్చర్యం లేదు. జనులు ఒకరినొకరు విమర్శించడం, ఎగతాళి చేయడం మరియు దూషించడాన్ని చూసినప్పుడు అతడు ఆనందిస్తాడు. ఈ ప్రవర్తన ఒక వ్యక్తి స్వభావాన్ని, ప్రతిష్ఠను, ప్రత్యేకించి ఆ వ్యక్తి అన్యాయంగా తీర్పు తీర్చబడినప్పుడు ఆత్మాభిమానాన్ని నాశనం చేయగలదు. మన జీవితాల్లో ఇటువంటి వైఖరిని మనం అనుమతించినప్పుడు, అతని నిరంతర కపటోపాయములో పడేందుకు తెగిస్తూ, మన మధ్య జగడం అనే విత్తనాన్ని నాటడానికి శత్రువు కోసం మన మనస్సులో మనం చోటు కల్పిస్తామని తెలియజేయడం ముఖ్యమైనది.

మనం మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో జాగ్రత్తగా ఉండనట్లయితే, మన చుట్టూ ఉన్నవారితో మరియు మనం ప్రేమించేవారితో మన సంబంధాలను నాశనం చేసుకుంటూ, శత్రువు యొక్క మోసపూరిత కుట్రలలో మనం చిక్కుకుపోవచ్చు.

సహోదర సహోదరీలారా, ప్రభువు యొక్క ప్రత్యేక జనులుగా, ఆయన శాంతిని వృద్ధిచేసేవారిగా, మనం అపవాది కుట్రలు మన హృదయాలలో స్థానం సంపాదించడానికి అనుమతించలేము. భావాలను, బంధాలను, జీవితాలను కూడా నాశనం చేసేటటువంటి హరింపజేయు భారాలను మనం మోయలేము. సువార్త సంతోషకరమైన సువర్తమానమును సూచిస్తుంది.

అవును, మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు, నిశ్చయంగా ఈ విధంగా ప్రవర్తించడానికి మనం మోసగించబడిన సమయాలున్నాయి. ఆయన పరిపూర్ణ ప్రేమ మరియు మన మానవ ధోరణుల సర్వజ్ఞానమందు, రక్షకుడు ఎల్లప్పుడూ అటువంటి ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు. “మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును”23 అని ఆయన మనకు బోధించారు.

నా సహోదర సహాదరీలారా, రక్షకుని వంటి లక్షణాలను వృద్ధిచేయడానికి మనం ప్రయత్నించినప్పుడు, ఆయన స్వయంగా ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం లోకానికి ఆయన అందించే సమాధానాన్ని తీసుకువచ్చే సాధనాలుగా మనం కాగలము. ఉద్ధరించే మరియు సహకారమిచ్చే జనులుగా, అర్థం చేసుకొనే మరియు క్షమించే మనస్సు గలవారిగా, “ఏదైనా పవిత్రమైన, రమ్యమైన లేక ఖ్యాతిగలవి లేక స్తుతిపాత్రమైనవి ఉన్నచో వాటిని మేము అనుసరించి వెదికెదము”24 అని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఇతరులలో మంచి కొరకు చూసేవారిగా మనల్ని మనం మార్చుకోగల విధానాలను ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

మనం ఈ లక్షణాలను అన్వేషించి, వృద్ధిచేసినప్పుడు, మన తోటివారి అవసరాల పట్ల మనం మరింత ఎక్కువ స్నేహపూర్వకంగా, సున్నితంగా మారతామని25 మరియు ఆనందము, సమాధానము, ఆత్మీయవృద్ధిని అనుభవిస్తామని26 నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. నిస్సందేహంగా, ప్రభువు మన ప్రయత్నాలను గుర్తిస్తారు మరియు ఒకరి వ్యత్యాసాలు, బలహీనతలు, అపరిపూర్ణతల పట్ల మరొకరు మరింత సహనముతో, ఓర్పుతో ఉండేందుకు మనకు అవసరమైన బహుమానాలను మనకిస్తారు. అంతేకాకుండా, మనం మనస్సులో నొచ్చకోవాలనే కోరికను లేదా మనల్ని గాయపరచిన వారి మనస్సు నొప్పించాలనే కోరికను బాగా నిరోధించగలము. రక్షకుడు చేసిన విధముగా, మనల్ని అవమానించిన లేదా మన గురించి చెడుగా మాట్లాడిన వారిని క్షమించాలనే మన కోరిక తప్పకుండా పెరుగుతుంది మరియు మన స్వభావంలో భాగమవుతుంది.

నేడు, ఈ మట్టల ఆదివారం నాడు, మనం మన ప్రేమ యొక్క అంగీలను, దాతృత్వపు తాటిమట్టలను విస్తరిద్దాం, వచ్చే ఆదివారం ఖాళీ సమాధి యొక్క అద్భుతాన్ని వేడుక చేసుకోవడానికి మనం సిద్ధపడుతుండగా సమాధానకర్తయగు అధిపతి యొక్క అడుగుజాడల్లో నడుద్దాం. క్రీస్తు నందు సహోదర సహోదరీలుగా, “దావీదు కుమారునికి జయము; ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక; సర్వోన్నతమైన స్థలములలో జయము”27 అని మనం ఆనందంగా ప్రకటిద్దాం.

యేసు క్రీస్తు సజీవుడని, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా వ్యక్తపరచబడిన ఆయన పరిపూర్ణమైన ప్రేమ, ఆయనతో నడవాలని, ఈ లోకములో మరియు రాబోవు లోకములో ఆయన సమాధానమును ఆనందించాలని కోరుకునే వారందరికి విస్తరించబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. రక్షకుడు, విమోచకుడు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను ఈ విషయాలు చెప్తున్నాను, ఆమేన్.