సర్వసభ్య సమావేశము
వ్యక్తిగత శాంతిని కనుగొనడం
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


వ్యక్తిగత శాంతిని కనుగొనడం

మీరు శాంతిని కనుగొనాలని, అనేకమంది ఇతరులు దానిని కనుగొనడానికి సహాయపడాలని మరియు ఇంకా వేరేవారికి దానిని చేర్చాలని నేను ప్రార్థిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సర్వసభ్య సమావేశం యొక్క ఈ మొదటి సభలో మనల్ని తాకిన ప్రేరేపిత బోధన మరియు అందమైన సంగీతం చేత మనం దీవించబడ్డాము. మీ భాగస్వామ్యానికి మరియు మీ విశ్వాసానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

మన పరిస్థితులు ఏవైనప్పటికీ, వ్యక్తిగత శాంతిని కనుగొనే అద్భుతం గురించి నేను నేర్చుకున్న దానిపై ఈరోజు మాట్లాడతాను. పరలోక తండ్రి పిల్లలందరు శాంతి కోసం ఆరాటపడతారని రక్షకునికి తెలుసు మరియు ఆయన దానిని మనకు ఇవ్వగలరని ఆయన చెప్పారు. యోహాను గ్రంథంలో వ్రాయబడిన యేసు క్రీస్తు మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”1

ఆయన చెప్పిన శాంతి అంటే ఏమిటో, దానిని ఆయన ఎలా ఇవ్వగలరో అనేవి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆయనను వినిన వారి పరిస్థితుల చేత బయల్పరచబడ్డాయి. క్రీస్తు యొక్క పరిచర్య పరిసమాప్తి గురించి యోహానులోని వృత్తాంతాన్ని వినండి. క్రూరమైన దుష్ట శక్తులు ఆయనపై దాడి చేశాయి మరియు త్వరలోనే ఆయన శిష్యులపైకి వస్తాయి.

రక్షకుని మాటలు ఇక్కడున్నాయి:

“మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.

“నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును;

“లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.

“మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.

“కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.

“నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.

“ఇస్కరియోతు కాని యూదా– ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా

“యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.

“నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.

“నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.

“ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

“శాంతి మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”2

రక్షకుని యొక్క ఆ బోధన నుండి నేను కనీసం ఐదు సత్యాలను నేర్చుకున్నాను.

మొదటిది, ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనకు విశ్వాసమున్న తర్వాత శాంతి యొక్క బహుమానం ఇవ్వబడింది. ప్రభువు సంఘము యొక్క నిబంధన సభ్యులుగా మనం విధేయులుగా ఉంటామని ఇదివరకే వాగ్దానం చేసాము.

రెండవది, పరిశుద్ధాత్మ వచ్చి మనతో నివాసముంటారు. మనం విశ్వాసంగా ఉండడాన్ని కొనసాగించినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడని ప్రభువు చెప్పారు. ఆత్మ మన సహవాసిగా ఉంటాడని మరియు ఆయన ఆదరణను మనం మన హృదయాలలో, మనస్సులలో అనుభవిస్తామని సంస్కార ప్రార్థనలో వాగ్దానం చేయబడింది.

మూడవది, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఒకరికోసం ఒకరు మరియు మన కోసం తండ్రి మరియు కుమారుని ప్రేమను మనం అనుభవించగలమని రక్షకుడు వాగ్దానం చేసారు. శాశ్వతంగా వారితో ఉండడానికి మనం దీవించబడినప్పుడు మనం ఎలా భావిస్తామో, అదేవిధంగా మన మర్త్య జీవితాల్లో మనం వారి సాన్నిహిత్యాన్ని భావిస్తాము.

నాల్గవది, ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించడానికి విధేయత కంటే ఎక్కువ కావాలి. మనం మన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు ఆత్మతో దేవుడిని ప్రేమించాలి.3

ఆయనను ప్రేమించని వారు ఆయన ఆజ్ఞలు పాటించరు. కాబట్టి, ఈ జీవితంలో మరియు రాబోయే లోకములో వారు శాంతి యొక్క బహమానాన్ని కలిగియుండరు.

ఐదవది, మన పాపాల కొరకు వెల చెల్లించేటంతగా ప్రభువు మనల్ని ప్రేమించారు అనేది స్పష్టంగా ఉంది, అందువలన మనం ఆయన యందు మన విశ్వాసం మరియు మన పశ్చాత్తాపం ద్వారా, ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ప్రభావాల ద్వారా ఈ జీవితంలో మరియు ఆయనతో నిత్యత్వంలో “సమస్త జ్ఞానమునకు మించిన”4 శాంతి యొక్క బహుమానాన్ని కలిగియుండగలము.

మీలో కొందరు, బహుశా అనేకమంది, ప్రభువు వాగ్దానం చేసిన శాంతిని అనుభవించడం లేదు. వ్యక్తిగత శాంతి మరియు ఆత్మీయ ఓదార్పు కోసం మీరు ప్రార్థించియుండవచ్చు. అయినప్పటికీ, శాంతి కోసం మీ మనవి పట్ల దేవుడు స్పందించడం లేదని మీరు అనుకోవచ్చు.

మీరు మరియు మీరు ప్రేమించేవారు శాంతిని కనుగొనరాదని మీ ఆత్మ యొక్క శత్రువు కోరుతున్నాడు. అతడు దానిని ఆనందించలేడు. రక్షకుడు మరియు మన పరలోక తండ్రి మీరు కలిగియుండాలని కోరుతున్న శాంతిని కనుగొనాలని కనీసం మీరు కోరుకోకుండా మిమ్మల్ని నిరోధించడానికి అతడు పనిచేస్తాడు.

ద్వేషాన్ని, వివాదాన్ని కలిగించడానికి సాతాను ప్రయత్నాలు మన చుట్టూ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. దేశాలు, పట్టణాల మధ్య, చుట్టుప్రక్కల, ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు ప్రపంచమంతటా అది జరుగుతున్నది అనడానికి మనం సాక్ష్యాలను చూస్తున్నాము.

అయినప్పటికీ, ఆశావాదానికి కారణం ఉంది: క్రొత్తగా జన్మించిన ప్రతీబిడ్డ క్రీస్తు యొక్క వెలుగుతో పుడుతున్నాడు. ఆ సార్వత్రిక బహుమానంతో ఏది సరియైనది అనే అవగాహన, ప్రేమించాలి మరియు ప్రేమించబడాలి అనే కోరిక వస్తుంది. అతడు లేదా ఆమె మర్త్యత్వం లోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రతీబిడ్డలో న్యాయము మరియు సత్యము గురించి ఒక అంతర్గత భావం ఉంటుంది.

వారి పట్ల శ్రద్ధచూపే వారి కారణంగా ఆ పిల్లలు వ్యక్తిగత శాంతిని కలిగియుంటారనే ఆశావాదాన్ని మనం కలిగియుండగలము. వారిని పెంచి పోషించే వారు మరియు వారికి సేవ చేసేవారు రక్షకుని నుండి శాంతి బహుమతిని పొందేందుకు కృషి చేసినట్లయితే, వ్యక్తిగత ఉదాహరణ మరియు కృషి ద్వారా శాంతి అనే బహుమానానికి అర్హత పొందేలా పిల్లల విశ్వాసాన్ని వారు ప్రోత్సహిస్తారు.

“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు,”5 అని లేఖనాలు వాగ్దానమిస్తున్నాయి. దాని కోసం పిల్లలను పెంచి, పోషించే బాధ్యత ఉన్నవారు శాంతి యొక్క బహుమానానికి అర్హులైయుండడం అవసరం.

దురదృష్టవశాత్తూ, ప్రేరేపిత తల్లిదండ్రులచే పెరిగిన పిల్లలు—కొన్నిసార్లు సత్ప్రవర్తన గల ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరి చేత పెంచబడిన పిల్లలు—జీవితకాలపు విశ్వాసం తర్వాత, దుఃఖానికి దారితీసే అధర్మమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనమందరం విచారిస్తాము.

అటువంటి విచారం సంభవించినప్పుడు కూడా, నా ఆశావాదం ప్రభువు నుండి మరొక బహుమానంలో నిలుస్తుంది. ఇది ఏమిటంటే: ఆయన తన నమ్మకమైన శిష్యుల మధ్య చాలామంది సమాధానకర్తలను లేవనెత్తాడు. వారు దేవుని శాంతిని, ప్రేమను అనుభవించారు. వారు తమ హృదయాల్లో పరిశుద్ధాత్మను కలిగియున్నారు మరియు దారితప్పుతున్న గొర్రెలను చేరుకోవడానికి ప్రభువు వారిని నడిపించగలరు.

నేను నా జీవితకాలములో ప్రపంచవ్యాప్తంగా దీనిని చూసాను. మీరు కూడా దానిని చూసారు. కొన్నిసార్లు, మీరు కాపాడడానికి నడిపించబడినప్పుడు, అది అనుకోకుండా జరిగినట్లు అనిపించవచ్చు.

ఒకసారి, “మీ కుటుంబం గురించి కొంచెం నాకు చెప్తారా?” అని నేను ప్రయాణంలో కలిసిన ఒకరిని అడిగాను. ఆ సంభాషణ ప్రయాసపడుతోందని ఆమె చెప్పిన తన వయోజన కుమార్తె చిత్రాన్ని చూడాలని నేను కోరడానికి దారితీసింది. ఆ చిత్రంలోని ఆ అమ్మాయి ముఖంలో ఉన్న మంచితనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఈమెయిల్ చిరునామా ఇస్తారా, అని అడగాలని నేను భావించాను. ఆ క్షణంలో కూతురు దారితప్పి, దేవుడు ఆమె కోసం ఏదైనా సందేశం పంపుతారా అని ఆలోచిస్తోంది. ఆయన పంపారు. అది ఇదే: “ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తారు. నువ్వు తిరిగి రావాలని ప్రభువు కోరుతున్నారు. నీకు వాగ్దానం చేయబడిన దీవెనలు అలాగే ఉన్నాయి.”

సంఘమంతటా సభ్యులు ప్రభువు నుండి వ్యక్తిగత శాంతి యొక్క బహుమానాన్ని అనుభవించారు. ఆయన వద్దకు వచ్చి, వారికైవారు ఆ శాంతి కొరకు అర్హులయ్యేలా అవకాశాలు కలిగియుండడానికి ఇతరులకు సహాయపడమని ఆయన ప్రతీఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. దానికి బదులుగా వారు, ఆ బహుమానాన్ని ఇతరులకు ఎలా అందించాలో తెలుసుకోవడానికి ప్రేరేపణను వెదికేందుకు ఎంచుకుంటారు.

యువతరం తరువాతి తరానికి పోషకులవుతారు. వారి ప్రయత్నాలు అద్భుతమైన రీతిలో గుణించబడతాయి. ఇది కాలక్రమేణా వ్యాపించి, పెరుగుతుంది మరియు హోసన్నా కేకలతో ఆయనను స్వాగతించడానికి భూమిపై ఏర్పరచబడిన ప్రభువు రాజ్యము సిద్ధంగా ఉంటుంది. భూమిపై శాంతి ఉంటుంది.

రక్షకుడు సజీవుడని, ఈ సంఘాన్ని ఆయన నడిపిస్తారని నేను నా నిశ్చయమైన సాక్ష్యమునిస్తున్నాను. నా జీవితంలో ఆయన ప్రేమను, పరలోక తండ్రి యొక్క పిల్లల కొరకు ఆయన ప్రేమను, చింతను నేను అనుభవించాను. ఆయన యొద్దకు రమ్మనే రక్షకుని ఆహ్వానము ఒక శాంతి ప్రతిపాదన.

సమస్త భూమి కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవుని యొక్క సజీవ ప్రవక్త. “ప్రపంచ పరిస్థితి మరియు మీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం లేకుండా, మీరు భవిష్యత్తును ఆశావాదంతో, ఆనందంతో ఎదుర్కోగలరని నేను నా అభయాన్ని మీకిస్తున్నాను,”6 అని ఆయన చెప్పారు.

నేను మీ పట్ల నా ప్రేమను తెలియజేస్తున్నాను. మీ గొప్ప విశ్వాసం, ప్రేమ జనులను చేరుతోంది మరియు హృదయాలను మార్చడానికి ప్రభువును అనుమతిస్తోంది, కాబట్టి సమస్త జ్ఞానమునకు మించిన శాంతి యొక్క బహుమానాన్ని ఇతరులకు అందించాలనే కోరికను పొందండి.

మీరు శాంతిని కనుగొనాలని, అనేకమంది ఇతరులు దానిని కనుగొనడానికి సహాయపడాలని మరియు ఇంకా వేరేవారికి దానిని చేర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. మరలా ప్రభువు వచ్చినప్పుడు, అద్భుతమైన వెయ్యేండ్ల శాంతి ఉంటుంది. ఆవిధంగా నేను గొప్ప సంతోషంతో మరియు యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.