సర్వసభ్య సమావేశము
“నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము”
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


“నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము”

మన యందు నిలిచియుంటానని రక్షకుడు చేసిన వాగ్దానం నిజము మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘములో నిబంధనలను పాటించే ప్రతీ సభ్యునికి అది లభ్యమవుతుంది.

పాత నిబంధన, సిద్ధాంతము మరియు నిబంధనలు, అమూల్యమైన ముత్యములో1 వివరించబడిన ప్రాచీన ప్రవక్త హనోకు సీయోను పట్టణాన్ని స్థాపించడంలో సాధనంగా ఉన్నాడు.

సేవ చేయడానికి హనోకు పిలుపు యొక్క లేఖన వృత్తాంతము, “పరలోకమునుండి ఒక స్వరము ఈలాగు చెప్పగా అతడు వినెను: నా కుమారుడవైన హనోకు, ఈ జనులకు ప్రవచించి, వారికి ఈలాగు చెప్పుము—పశ్చాత్తాపపడుడి, … ఏలయనగా వారి హృదయములు కఠినపరచబడెను, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు బహుదూరము చూడలేవు.”2

“హనోకు ఈ మాటలు వినిన తరువాత ప్రభువు యెదుట నేలపై సాగిలపడి, ప్రభువుతో—నేను నీ కృపను పొందుట ఏల, నేను బాలుడను, జనులందరు నన్ను ద్వేషించుచున్నారు; ఏలయనగా నేను నోటిమాంద్యము కలవాడను; కాబట్టి నేను నీ దాసుడనా? అనెను.”3

హనోకు సేవ చేయడానికి పిలువబడినప్పుడు, తన వ్యక్తిగత అసమానతలు మరియు పరిమితులు గురించి అతనికి ఖచ్చితంగా తెలుసని దయచేసి గమనించండి. మన సంఘ సేవలో ఎప్పుడో ఒకప్పుడు మనమందరం హనోకులా భావించియుంటామని నేననుకుంటున్నాను. కానీ, హనోకు యొక్క అభ్యర్థన ప్రశ్నకు ప్రభువు ఇచ్చిన జవాబు జ్ఞానము కలుగజేసేదిగా ఉందని, నేడు మనలో ప్రతీఒక్కరికి వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను.

“అందుకు ప్రభువు హనోకుతో ఇట్లనెను—నీవు వెళ్ళి నేను నీకాజ్ఞాపించినట్లుగా చేయుము, ఏ మనుష్యుడు నీకు హాని తలపెట్టడు. నీ నోటిని తెరువుము, అది నింపబడును, నేను నీకు మాట్లాడు శక్తిని అనుగ్రహించెదను. …

“ఇదిగో నా ఆత్మ నీమీదనున్నది, కాబట్టి నీ మాటలన్నిటిని నేను నిర్దోషమైనవిగా యెంచెదను; పర్వతములు నీ యెదుట పారిపోవును, నదులు వాటి మార్గమునుండి మరలును; నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము.4

చివరకు హనోకు బలమైన ప్రవక్తగా, ఒక గొప్ప కార్యమును సాధించడానికి దేవుని చేతిలో సాధనముగా మారాడు, కానీ అతడు తన పరిచర్యను ఆవిధంగా మొదలుపెట్టలేదు! బదులుగా, దేవుని కుమారుని యందు నిలిచి, ఆయనతో నడవడాన్ని అతడు నేర్చుకున్నప్పుడు, కాలం గడిచేకొద్దీ అతని సామర్థ్యం ఎక్కువ చేయబడింది.

ప్రభువు చేత హనోకుకు ఇవ్వబడిన ఉపదేశమును, నేడు మీ కొరకు, నా కొరకు అది ఏ అర్థాన్నివ్వగలదో అని కలిసి మనం పరిగణించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం కోసం నేను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

నీవు నాయందు నిలిచియుండుము

ఆయన యందు నిలిచియుండమని మనలో ప్రతీఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు ఆహ్వానమిచ్చారు.5 కానీ నిజంగా మనం ఆయన యందు నిలిచియుండడాన్ని ఎలా నేర్చుకుంటాము?

నిలిచియుండుము అనే పదము, దృఢంగా లేదా స్థిరంగా నిలిచియుండడాన్ని మరియు లొంగకుండా సహించడాన్ని సూచిస్తుంది. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా వివరించారు, “నిలిచియుండుము” అనేది ఒక చర్య, దాని అర్థము, “‘నిలిచియుండడం—కానీ శాశ్వతంగా నిలిచియుండడం.’ ప్రపంచంలో … ప్రతీఒక్కరి … కోసం సువార్త సందేశం యొక్క పిలుపు అదే. రండి, కానీ నిలిచియుండడానికి రండి. నమ్మకం మరియు ఓర్పుతో రండి. మీకోసం మరియు తప్పకుండా మిమ్మల్ని అనుసరించవలసిన తరాలన్నిటి కోసం శాశ్వతంగా రండి.”6 ఆవిధంగా, మంచి మరియు చెడు సమయాల్లో విమోచకునిపట్ల, ఆయన పరిశుద్ధ ఉద్దేశ్యాల పట్ల మన భక్తియందు మనం స్థిరంగా, నిలకడగా ఉన్నప్పుడు, మనం క్రీస్తుయందు నిలిచియుంటాము.7

పునరుద్ధరించబడిన సువార్త యొక్క నిబంధనలు, విధుల ద్వారా ఆయన కాడిని8 మనపై తీసుకోవడానకి మన నైతిక కర్తృత్వాన్ని అభ్యసించడం చేత మనం ప్రభువు యందు నిలిచియుండడాన్ని ప్రారంభిస్తాము. మన పరలోక తండ్రితో, పునరుత్థానం చెందిన, సజీవుడైన ఆయన కుమారునితో మనం కలిగియున్న నిబంధన సంబంధం దృక్పథం, నిరీక్షణ, శక్తి, శాంతి మరియు శాశ్వతమైన ఆనందం యొక్క దివ్యమైన మూలం; అది మన జీవితాలను మనం నిర్మించవలసిన దృఢమైన పునాది9 కూడా.

తండ్రి మరియు కుమారునితో మన వ్యక్తిగత నిబంధన సంబంధాన్ని బలపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం ద్వారా మనం ఆయన యందు నిలిచియుంటాము. ఉదాహరణకు, ఆయన ప్రియ కుమారుని నామములో నిత్య తండ్రికి మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం వారితో మన నిబంధన సంబంధాన్ని వృద్ధిచేసి, బలపరుస్తుంది.

నిజంగా క్రీస్తు యొక్క మాటలను విందారగించడం ద్వారా మనం ఆయన యందు నిలిచియుంటాము. రక్షకుని సిద్ధాంతము నిబంధన సంతానముగా మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది10 మరియు మనం చేయవలసిన కార్యములన్నిటినీ మనకు తెలుపుతుంది.11

మన నిబంధన వాగ్దానాలపై సమీక్షిస్తూ, ప్రతిబింబిస్తూ సంస్కారపు విధిలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడడం మరియు నిజంగా పశ్చాత్తాపపడడం ద్వారా మనం ఆయన యందు నిలిచియుంటాము. యోగ్యులుగా సంస్కారములో పాలుపొందడమనగా, ఆ పవిత్ర విధిలో పాల్గొనడానికి కావలసిన స్వల్ప కాలం తర్వాత, యేసు క్రీస్తు నామమును మనపై తీసుకోవడానికి మనం సమ్మతిస్తున్నామని మరియు “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవడానికి”12 ప్రయత్నిస్తామని దేవునికి సాక్ష్యమివ్వడం.

మనం ఆయన పిల్లలకు సేవచేసి, మన సహోదర సహోదరీలకు పరిచర్య చేసినప్పుడు దేవునికి సేవచేయడం ద్వారా మనం ఆయన యందు నిలిచియుంటాము.13

“నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు,”14 అని రక్షకుడు చెప్పారు.

మనం రక్షకునియందు నిలిచియుండగల అనేక విధానాలలో చాలామట్టుకు నేను క్లుప్తంగా వివరించాను. ఇప్పుడు ఆయన శిష్యుల వలె అడిగి, వెదకి, తట్టాలని మరియు మనం చేసేవాటన్నిటిలో క్రీస్తును మన జీవితాలకు కేంద్రంగా చేసుకోగల ఇతర అర్థవంతమైన విధానాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకై మనం నేర్చుకోవాలని మనలో ప్రతీఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను.

నేను మీయందును

ఆయన అనుచరులకు రక్షకుని వాగ్దానం రెండురెట్లు ఉంది: మనం ఆయనయందు నిలిచియున్నట్లయితే, ఆయన మనయందు నిలిచియుంటారు. కానీ, మీయందు, నాయందు—వేరువేరుగా, వ్యక్తిగతంగా నిలిచియుండడం నిజంగా క్రీస్తుకు సాధ్యమేనా? ఈ ప్రశ్నకు జవాబు, అవును! అని ప్రతిధ్వనిస్తోంది.

వారి శ్రమల వలన తమనుతాము తగ్గించుకొనుటకు బలవంతము చేయబడిన పేదవారికి ఆల్మా బోధించి, సాక్ష్యమివ్వడం గురించి మనం మోర్మన్ గ్రంథములో నేర్చుకుంటాము. అతని ఉపదేశములో, అతడు వాక్యమును ఒక విత్తనంతో పోల్చాడు, అది తప్పకుండా నాటబడి, పోషించబడాలి మరియు అతడు “వాక్యమును” యేసు క్రీస్తు యొక్క జీవితము, నియమితకార్యము మరియు ప్రాయశ్చిత్త త్యాగముగా వర్ణించాడు.

“దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, వారి క్రియలను బట్టి అంత్య మరియు తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకు మనుష్యులందరు ఆయన యెదుట నిలబడునట్లు అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి,”15 అని ఆల్మా చెప్పాడు.

ఆల్మా చేత “వాక్యము” గురించి ఈ వర్ణన ఇవ్వబడినందున, తరువాత అతడు గుర్తించే ప్రేరణాత్మక సంబంధాన్ని దయచేసి పరిగణించండి.

“ఇప్పుడు … మీరు ఈ వాక్యమును మీ హృదయములలో నాటవలెనని మరియు అది వ్యాకోచించుట మొదలుపెట్టగానే మీ విశ్వాసము ద్వారా దానిని పోషించవలెనని నేను కోరుచున్నాను. అది మీలో నిత్యజీవమునకు మొలకెత్తుచూ ఒక వృక్షమగును. అప్పుడు ఆయన కుమారుని యందలి సంతోషము ద్వారా మీ భారములు తేలికగునట్లు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరియు మీరు కోరిన యెడల ఇదంతయు మీరు కూడా చేయవచ్చు.”16

మన హృదయాలలో మనం నాటడానికి ప్రయత్నించవలసిన విత్తనమే వాక్యము—యేసు క్రీస్తు యొక్క జీవితము, నియమితకార్యము మరియు సిద్ధాంతము. వాక్యము విశ్వాసము చేత పోషించబడినప్పుడు, అది మీలో నిత్యజీవమునకు మొలకెత్తుచూ ఒక వృక్షము కాగలదు17

లీహై దర్శనంలో చెట్టు దేనికి చిహ్నమైయున్నది? చెట్టును యేసు క్రీస్తుకు ప్రతిరూపంగా పరిగణించవచ్చు.18

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనలో వాక్యము ఉందా? రక్షకుని సువార్త యొక్క సత్యాలు మన హృదయమనే పలకలపై వ్రాయబడియున్నాయా?19 మనం ఆయన వద్దకు వచ్చి, క్రమంగా మరింతగా ఆయన వలె అవుతున్నామా? క్రీస్తు అనే వృక్షము మనలో పెరుగుతున్నదా? మనం ఆయన యందు21 “నూతన [సృష్టి]”20 కావడానికి ప్రయత్నిస్తున్నామా?

బహుశా ఈ అద్భుతమైన సామర్థ్యము ఇలా అడిగేలా ఆల్మాను ప్రేరేపించింది, “మీరు దేవునివలన ఆత్మీయముగా జన్మించియున్నారా? మీ రూపముల యందు ఆయన స్వరూపమును పొందియున్నారా? మీ హృదయముల యందు ఈ బలమైన మార్పును అనుభవించియున్నారా?”22

నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము,”23 అని ప్రభువు హనోకుకిచ్చిన ఉపదేశాన్ని మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. మన యందు నిలిచియుంటానని రక్షకుడు చేసిన వాగ్దానం నిజమని మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘములో నిబంధనలను పాటించే ప్రతీ సభ్యునికి అది లభ్యమవుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

కాబట్టి నాతో నడువుము

“కావున ఆయనయందుండి నడుచుకొనుడి”24 అని ప్రభువును స్వీకరించిన విశ్వాసులను అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు.

రక్షకుని యందు మరియు ఆయనతో నడవడం శిష్యత్వము యొక్క రెండు ముఖ్యాంశాలను ఎత్తిచూపుతుంది: (1) దేవుని ఆజ్ఞలకు లోబడియుండడం మరియు (2) తండ్రితో, కుమారునితో మనల్ని బంధించే పవిత్ర నిబంధనలను గుర్తుంచుకొని, గౌరవించడం.

యోహాను ఇలా ప్రకటించాడు:

“మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.

“ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.

“ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు.

మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.”25

యేసు మనలో ప్రతీఒక్కరికి ఇలా పిలుపునిచ్చారు, “రండి, నన్ను అనుసరించండి”26 మరియు “నాతో నడువుడి.”27

మనం విశ్వాసములో ముందుకుసాగి, ప్రభువు ఆత్మ యొక్క సాత్వీకములో నడిచినప్పుడు,28 మనం శక్తి, నడిపింపు, రక్షణ మరియు శాంతితో దీవించబడతామని నేను సాక్ష్యమిస్తున్నాను.

సాక్ష్యము మరియు వాగ్దానము

జీవాత్మలన్నిటికి ప్రభువు నుండి ఒక ప్రియమైన మనవిని ఆల్మా వివరిస్తున్నాడు.

“ఇదిగో మనుష్యులందరిని ఆయన ఆహ్వానించుచున్నాడు, ఏలయనగా కరుణా బాహువులు వారి వైపు చాపబడియున్నవి మరియు పశ్చాత్తాపపడుడి, నేను మిమ్ములను చేర్చుకొందునని ఆయన చెప్పుచున్నాడు.

“… నా యొద్దకు రండి, మీరు జీవవృక్షము యొక్క ఫలములో పాలుపొందెదరు; మీరు జీవాహారమును, జీవజలములను ఉచితముగా తిని త్రాగెదరు.”29

రక్షకుని మనవి యొక్క సంపూర్ణ సమగ్రతను నేను నొక్కి చెప్తున్నాను. ఇప్పుడు జీవిస్తున్న, ఎప్పుడో జీవించిన మరియు ఇకముందు భూమిపై జీవించే ప్రతీ ఒక్క వ్యక్తిని ఆయన కృప మరియు కనికరముతో దీవించాలని ఆయన ఆరాటపడుతున్నారు.

సమావేశ కేంద్రంలోని ఈ వేదిక నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సమావేశాలలో పదేపదే ప్రకటించబడిన సిద్ధాంతము, నియమాలు, సాక్ష్యాలు నిజమని కొంతమంది సంఘ సభ్యులు అంగీకరిస్తారు—అయినప్పటికీ, ఈ నిత్య సత్యాలు ప్రత్యేకంగా వారి జీవితాల్లో, వారి పరిస్థితులకు అన్వయిస్తాయని నమ్మడానికి కష్టపడుతుంటారు. వారు మనఃపూర్వకంగా నమ్ముతారు మరియు బాధ్యతాయుతంగా సేవచేస్తారు, కానీ తండ్రితో మరియు విమోచించు ఆయన కుమారునితో వారి నిబంధన సంబంధము ఇంకా వారి జీవితాల్లో సజీవమైన, రూపాంతరం చెందుతున్న వాస్తవికతగా మారలేదు.

నేను వివరించడానికి ప్రయత్నించిన సువార్త సత్యాలు మీ కొరకు—వేరువేరుగా మరియు వ్యక్తిగతంగా మీ కొరకైనవని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు తెలుసుకొని, అనుభవించగలరని నేను వాగ్దానమిస్తున్నాను.

యేసు క్రీస్తు మన ప్రియమైన, సజీవుడైన రక్షకుడని మరియు విమోచకుడని నేను ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. మనము ఆయనయందు నిలిచియున్నట్లయితే, ఆయన మనయందు నిలిచియుంటారు.30 మనము ఆయనలో, ఆయనతో నడిచినప్పుడు, మనం విస్తారముగా ఫలమిచ్చుటకు దీవించబడతాము. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. ఆదికాండము 5:18–24; సిద్ధాంతము మరియు నిబంధనలు 107:48–57; మోషే 6–7 చూడండి.

  2. మోషే 6:27.

  3. మోషే 6:31.

  4. మోషే 6:32, 34; వివరణ చేర్చబడినది.

  5. యోహాను 15:4-9 చూడండి.

  6. Jeffrey R. Holland, “Abide in Me,” Liahona, May 2004, 32.

  7. యోహాను 15:10 చూడండి.

  8. మత్తయి 11:29–30 చూడండి.

  9. హీలమన్ 5:12 చూడండి.

  10. 3 నీఫై 27:14–15 చూడండి.

  11. 2 నీఫై 32:3 చూడండి.

  12. మొరోనై 4:3; 5:2.

  13. మోషైయ 2:17 చూడండి.

  14. యోహాను 15:10.

  15. ఆల్మా 33:22.

  16. ఆల్మా 33:23; వివరణ చేర్చబడినది.

  17. ఆల్మా 26:13 చూడండి.

  18. 2017లో ఒక ఆధ్యాత్మిక సమావేశంలో నేను ఈ సూత్రాన్ని వివరించాను.

    “ఆల్మా ‘వారి సమాజమందిరాల లోనికి, వారి ఇళ్ళలోనికి ప్రవేశించి జనులకు దేవుని వాక్యమును బోధించనారంభించాడు; అవును, వారి వీధులలో కూడా వారు వాక్యమును బోధించారు’ [ఆల్మా 32:1; వివరణ చేర్చబడినది]. అతడు దేవుని వాక్యమును ఒక విత్తనంతో కూడా పోల్చాడు.

    “‘మీ హృదయమందు ఒక విత్తనము నాటబడునట్లు మీరు స్థలమిచ్చిన యెడల, అది నిజమైన విత్తనము లేదా మంచి విత్తనమైన యెడల, మీరు ప్రభువు యొక్క ఆత్మను నిరోధించునట్లు మీ అవిశ్వాసము ద్వారా దానిని బయట పడవేయని యెడల, అది మీ హృదయాలలో వ్యాకోచించుట మొదలుపెట్టును; వ్యాకోచించున్నఈ కదలికలను మీరు అనుభవించినప్పుడు మీలోమీరు ఇట్లనుట మొదలుపెట్టుదురు—ఇది తప్పక మంచి విత్తనమైయుండవచ్చు లేదా వాక్యము మంచిదైయుండవచ్చు, ఏలయనగా ఇది నా ఆత్మను వృద్ధి చేయనారంభించెను; ఇది నా గ్రహింపును స్పష్టముచేసి, నాకు సంతోషకరముగా ఉండనారంభించెను’ [ఆల్మా 32:28; వివరణ చేర్చబడినది].

    “ఆసక్తికరంగా, ఒక మంచి విత్తనము హృదయములో నాటబడి, వ్యాకోచించి, మొలకెత్తి, పెరుగుట ప్రారంభించినప్పుడు, అది ఒక చెట్టుగా మారుతుంది.

    “‘చెట్టు పెరుగుట మొదలుపెట్టునప్పుడు మీరిట్లు చెప్పెదరు: అది వేరు పారునట్లు, పైకి పెరుగునట్లు మరియు ఫలము ఫలించునట్లు మనము దానిని అధిక శ్రద్ధతో పోషించెదము. ఇప్పుడు మీరు దానిని అధిక శ్రద్ధతో పోషించిన యెడల అది వేరు పారి, పైకి పెరిగి, ఫలమును ఫలించును.

    “‘కానీ మీరు చెట్టును నిర్లక్ష్యము చేసి, దాని పోషణ కొరకు ఎట్టి ఆలోచన చేయని యెడల అది వేరు పారదు. సూర్యుని వేడిమి దానిని మాడ్చివేసినప్పుడు, దానికి వేరు లేనందున అది వాడిపోవును మరియు మీరు దానిని పెరికివేసి బయట పారవేయుదురు.

    “‘ఇప్పుడిది విత్తనము మంచిది కాకపోవుటను బట్టి లేదా దాని ఫలము కోరదగనిదైయుండుటను బట్టి జరుగలేదు; కానీ మీది నిస్సారమైన నేల అయినందున మరియు మీరు చెట్టును పోషించనందున జరిగెను, కావున మీరు దాని ఫలమును పొందలేరు.

    “‘ఆ విధముగా దాని ఫలము కొరకు విశ్వాసముతో ఎదురుచూచుచు, మీరు వాక్యమును పోషించని యెడల మీరెన్నడూ జీవవృక్షము యొక్క ఫలమును కోయలేరు.

    “‘కానీ మీరు వాక్యమును పోషించిన యెడల, చెట్టు పెరుగుచుండగా దాని ఫలము కొరకు ఎదురుచూచుచు అధిక శ్రద్ధతో సహనముతో మీ విశ్వాసము ద్వారా దానిని పోషించిన యెడల అది వేరు పారి, నిత్య జీవమునకై అంకురించు వృక్షము వలేనుండును’ [ఆల్మా 32:37–41; వివరణ చేర్చబడినది].

    “లీహై స్వప్నములో ప్రధాన భాగము జీవ వృక్షము—‘దేవుని ప్రేమకు’ ప్రతిరూపము [1 నీఫై 11:21–22].

    “‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ [యోహాను 3:16].

    “ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జననము, జీవితము మరియు ప్రాయశ్చిత్త త్యాగము ఆయన పిల్లల కొరకు దేవుని ప్రేమ యొక్క గొప్ప ప్రత్యక్షతలుగా ఉన్నాయి. నీఫై సాక్ష్యమిచ్చినట్లుగా, ఈ ప్రేమ ‘అన్ని వస్తువులను మించి మిక్కిలి కోరదగినది’ మరియు ‘ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది’ [1 నీఫై 11:22–23; 1 నీఫై 8:12, 15 కూడా చూడండి]. 1 నీఫై యొక్క 11వ అధ్యాయము జీవవృక్షము యొక్క వివరణాత్మక వర్ణనను రక్షకుని జీవితము, పరిచర్య మరియు త్యాగమునకు—‘దేవుని నమ్రతకు’ [1 నీఫై 11:16] చిహ్నముగా చూపుతుంది. వృక్షము క్రీస్తుకు ప్రతిరూపంగా పరిగణించబడవచ్చు.

    “చెట్టుపై నున్న ఫలమును ఒకవిధంగా రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలకు చిహ్నంగా అనుకోవచ్చు. ఫలము ‘ఒకరిని సంతోషపరచుటకు కోరదగినది’ [1 నీఫై 8:10] అని వర్ణించబడింది మరియు గొప్ప ఆనందాన్ని, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే కోరికను పుట్టిస్తుంది.

    “ముఖ్యంగా, క్రీస్తునొద్దకు రమ్మని అందరిని ఆహ్వానిస్తున్న [మొరోనై 10:32 చూడండి] మోర్మన్ గ్రంథము యొక్క విస్తృతమైన ఇతివృత్తం లీహై దర్శనంలో ప్రముఖమైనది (1 నీఫై 8:19 చూడండి]” (“The Power of His Word Which Is in Us” [address given at seminar for new mission leaders, June 27, 2017], 4–5).

  19. 2 కొరింథీయులకు 3:3 చూడండి.

  20. 2 కొరింథీయులకు 5:17.

  21. నమ్మాలనే కోరిక మన హృదయాలలో విత్తనాన్ని నాటుతుంది, మన విశ్వాసం చేత విత్తనాన్ని పోషించడం జీవవృక్షాన్ని అంకురింపజేస్తుంది మరియు చెట్టును పోషించడం చెట్టు యొక్క ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది, అది “సమస్త తీపిని మించి తియ్యనైనది” (ఆల్మా 32:42) మరియు “దేవుని బహుమానములన్నిటిలోకెల్లా గొప్పదైయున్నది” (1 నీఫై 15:36) అని ఆల్మా సారూప్యత మనకు బోధిస్తుంది.

  22. ఆల్మా 5:14.

  23. మోషే 6:34; వివరణ చేర్చబడినది.

  24. కొలొస్సయులకు 2:6.

  25. 1 యోహాను 2:3-6; వివరణ చేర్చబడినది.

  26. లూకా 18:22.

  27. మోషే 6:34.

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23 చూడండి.

  29. ఆల్మా 5:33-34; వివరణ చేర్చబడినది.

  30. యోహాను 15:5 చూడండి.