సర్వసభ్య సమావేశము
జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే

మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, గత రెండు రోజులుగా మనం ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వబడ్డాము. గాయకబృందం వారి సంగీతం అద్భుతంగా ఉంది. మాట్లాడిన వారు ప్రభువు కొరకు సాధనాలుగా ఉన్నారు. ఈ వేదిక నుండి బోధించబడిన సత్యాలను మీరు ఆలోచించినప్పుడు, మీ అధ్యయనంలో మిమ్మల్ని నడిపించేందుకు పరిశుద్ధాత్మ కొరకు మీరు వెదకుతారని నేను ప్రార్థిస్తున్నాను. అవి నిజంగా దైవికంగా ప్రేరేపించబడినవి.

ఈరోజు నుండి ఒక వారం తరువాత ఈస్టర్ ఆదివారం. అది యేసు క్రీస్తు యొక్క అనుచరులకు అత్యంత ముఖ్యమైన మతపరమైన ఆచారం. మనం క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రధాన కారణం ఈస్టర్. ఈ వారం రండి, నన్ను అనుసరించండి పాఠము, యెరూషలేము లోనికి రక్షకుని విజయోత్సాహ ప్రవేశము, దేవాలయాన్ని ఆయన శుద్ధిచేయడం, గెత్సేమనే తోటలో ఆయన వేదన, ఆయన సిలువధారణ, మహిమకరమైన ఆయన పునరుత్థానము మరియు ఆయన అనుచరులకు ఆయన తదుపరి దర్శనాల గురించి అధ్యయనం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.1

ఈ పవిత్ర వచనాలను ఆస్వాదించండి మరియు ఆయన అద్వితీయ కుమారుడిని మనకోసం పంపినందుకు మన పరలోక తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపగల ప్రతీ విధానాన్ని కనుగొనండి.2 యేసు క్రీస్తు కారణంగా, మనం పశ్చాత్తాపపడగలము మరియు మన పాపాల కొరకు క్షమించబడగలము. ఆయన మూలముగా, మనలో ప్రతీఒక్కరు పునరుత్థానము చెందుతారు.

3 నీఫైలో నమోదు చేయబడినట్లు, అమెరికాలలో ఉన్న నీఫైయులకు రక్షకుని దర్శనం యొక్క వృత్తాంతాన్ని మరలా అధ్యయనం చేయమని కూడా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ దర్శనానికి కొంతకాలం ముందు, ప్రార్థన యొక్క ఈ మాటలతో పాటు ఆయన స్వరము జనుల మధ్య వినబడింది:

“నేను మిమ్ములను స్వస్థపరచునట్లు ఇప్పుడు నా యొద్దకు తిరిగివచ్చి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి పరివర్తన నొందరా?

“… ఇదిగో కనికరము గల నా బాహువు మీ వైపు చాపబడినది మరియు వచ్చు వానిని నేను చేర్చుకొందును.”3

ప్రియమైన సహోదర సహోదరీలారా, నేడు మీకోసం యేసు క్రీస్తు అదే ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలుగునట్లు ఆయన యొద్దకు రమ్మని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను! మీరు పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన మిమ్మల్ని పాపము నుండి స్వస్థపరుస్తారు. ఆయన మిమ్మల్ని విచారము మరియు భయము నుండి స్వస్థపరుస్తారు. ఈ లోకపు గాయాల నుండి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు.

మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది. ఆయన ప్రాయశ్చిత్తము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన సిద్ధాంతము మరియు స్వస్థత, పురోగతి యొక్క పునరుద్ధరించబడిన ఆయన సువార్త గురించి మరింత నేర్చుకోండి. ఆయన వైపు తిరగండి! ఆయనను అనుసరించండి!

మనం దేవాలయాలను నిర్మించడానికి కారణం యేసు క్రీస్తు. ప్రతిది ఆయన పరిశుద్ధ మందిరం. దేవాలయంలో నిబంధనలు చేయడం మరియు ఆవశ్యకమైన విధులను పొందడం, అదేవిధంగా అక్కడ ఆయన యొద్దకు రావాలని కోరుకోవడం, మరేవిధమైన ఆరాధన చేయలేనన్ని విధాలుగా మీ జీవితాన్ని దీవిస్తుంది. ఈ కారణం చేత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సభ్యులకు దేవాలయ దీవెనలు మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి మా శక్తిమేరకు మేము అన్నీ చేస్తున్నాము. క్రింది ప్రదేశాలలో ప్రతీదానిలో ఒక క్రొత్త దేవాలయం నిర్మించడానికి మా ప్రణాళికలు నేడు ప్రకటించడానికి నేను కృతజ్ఞత కలిగియున్నాను:

  • రెటాల్‌హులేయు, గ్వాటెమాల

  • ఇక్విటోస్, పెరూ

  • తెరెసినా, బ్రెజిల్

  • నాటల్, బ్రెజిల్

  • టుగెగరావ్ నగరం, ఫిలిప్పీన్స్

  • ఇలోయిలో, ఫిలిప్పీన్స్

  • జకార్తా, ఇండోనేషియా

  • హాంబర్గ్, జర్మనీ

  • లెత్‌బ్రిడ్జ్, అల్బెర్టా, కెనడా

  • శాన్ జోస్, కాలిఫోర్నియా

  • బేకర్స్‌ఫీల్డ్, కాలిఫోర్నియా

  • స్ప్రింగ్‌ఫీల్డ్, మిస్సౌరీ

  • ఛార్లెట్, నార్త్ కరోలినా

  • వింఛెస్టర్, వర్జీనియా

  • హారిస్‌బర్గ్, పెన్సిల్వేనియా

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు తన సంఘము యొక్క వ్యవహారాలను నడిపిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. శాశ్వతమైన సంతోషానికి ఏకైక మార్గం ఆయనను అనుసరించడమేనని నేను సాక్ష్యమిస్తున్నాను. నిబంధనలను పాటించే ఆయన జనులు ఆయన శక్తితో దీవించబడతారని, “గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుంటారు,”4 అని నాకు తెలుసు. మీలో ప్రతీఒక్కరి కోసం నా ప్రేమ మరియు దీవెనతో, యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.