సర్వసభ్య సమావేశము
ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్య చేయమని మనకు బోధిస్తున్నారు
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్య చేయమని మనకు బోధిస్తున్నారు

రక్షకుని సహాయంతో, మనం ఆయన విలువైన గొర్రెలను ప్రేమించగలము మరియు ఆయన కోరుకున్నట్లే వారికి పరిచర్య చేయగలము.

ప్రభువైన యేసు క్రీస్తు ఇలా చెప్పారు:

“నేను గొఱ్ఱెలకు మంచికాపరిని: మంచికాపరి తన గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును. …

“తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఆలాగే ఎరుగుదును: మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.”1

ఈ లేఖనము యొక్క గ్రీకు సంస్కరణలో, మంచి అనే పదానికి “అందమైన, అద్భుతమైన” అని కూడా అర్థం. కాబట్టి ఈ రోజు, నేను మంచి కాపరి, అందమైన కాపరి, అద్భుతమైన కాపరియైన యేసు క్రీస్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను.

క్రొత్త నిబంధన గ్రంథములో, ఆయనను “గొప్ప కాపరి,”2 “ప్రధాన కాపరి,”3 “[మన] ఆత్మల కాపరి మరియు బిషప్పు”4 అని పిలిచారు.

పాత నిబంధన గ్రంథములో, “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును” అని యెషయా వ్రాశాడు.5

మోర్మన్‌ గ్రంథములో, ఆయనను “మంచి కాపరి” 6 మరియు “గొప్ప మరియు నిజమైన కాపరి” అని పిలిచారు.7

సిద్ధాంతము మరియు నిబంధనలలో, “కాబట్టి, నేను మీ మధ్యనున్నాను మరియు నేను మంచి కాపరిని” అని ఆయన ప్రకటించారు.8

మన కాలంలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ప్రకటించారు: “మంచి కాపరి తన మందలోని గొఱ్ఱెలన్నిటినీ ప్రేమగా చూసుకుంటాడు మరియు మనం ఆయన నిజమైన ఉపకాపరులం. ఆయన ప్రేమతో పాటు, మన స్నేహితులు మరియు పొరుగువారి పట్ల మన స్వంత ప్రేమను కూడా జోడించడం—రక్షకుడు మనం చేయాలని కోరుకున్నట్లుగానే—వారికి ఆహారమివ్వడం, సంరక్షించటం మరియు పోషించడం మన విశేషాధికారము.”9

ఇటీవలే, అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు: “ప్రభువు యొక్క నిజమైన మరియు సజీవమైన సంఘము యొక్క ముఖ్య లక్షణం ఎల్లప్పుడూ ఒక్కొక్కరిగా దేవుని యొక్క పిల్లలకు మరియు వారి కుటుంబాలకు పరిచర్య చేయడానికి ఒక వ్యవస్థీకృత, నిర్దేశిత ప్రయత్నంగా ఉంటుంది. ఇది ఆయన సంఘము కనుక, ఆయన సేవకులుగా మనం ఆయన చేసినట్లుగా, ఒకరికి పరిచర్య చేయాలి.” ఆయన నామములో, ఆయన శక్తి మరియు అధికారముతో, ఆయన ప్రేమగల దయతో మనము పరిచర్య చేద్దాము.”10

పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–“ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనినప్పుడు,”11 తప్పిపోయిన గొర్రె ఉపమానం, తప్పిపోయిన నాణెం యొక్క ఉపమానం మరియు తప్పిపోయిన కొడుకు యొక్క ఉపమానం అని మనకు తెలిసిన మూడు అందమైన కథలను అందించడం ద్వారా ఆయన స్పందించారు.

సువార్త రచయిత లూకా మూడు కథలను పరిచయం చేస్తున్నప్పుడు, అతను ఉపమానం అనే పదాన్ని బహువచనంలో కాకుండా ఏకవచనంలో ఉపయోగించడం ఆసక్తికరంగా ఉంది. 12 ప్రభువు, విభిన్న సంఖ్యలైన 100 గొర్రెలు, 10 నాణేలు మరియు 2 కొడుకులతో కూడిన ఒక ప్రత్యేకమైన పాఠాన్ని, మూడు కథలుగా బోధిస్తున్నట్లు కనిపిస్తుంది.

అయితే, ఈ కథల్లో ప్రతీదానిలో కీలకమైన సంఖ్య ఒకటి. మీ పెద్దల సమూహములో 100 మంది పెద్దలకు మరియు కాబోయే పెద్దలకు మీరు ఉపకాపరులుగా ఉండవచ్చు లేదా 10 మంది యువతులకు సలహాదారుగా లేదా 2 ప్రాథమిక పిల్లలకు బోధకులుగా ఉండవచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ ఒక్కొక్కరిగా వారికి వ్యక్తిగతంగా పరిచర్య చేయాలి, వారి పట్ల శ్రద్ధ వహించాలి మరియు వారిని ప్రేమించాలి అనేది దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠము. “ఎంత మూర్ఖపు గొర్రె,” లేదా “అయితే, నాకు ఆ నాణెం నిజంగా అవసరం లేదు,” లేదా “అతను ఎంత తిరుగుబాటుదారుడు” అని మీరు ఎప్పుడూ అనకూడదు. మీరు మరియు నేను మనతోపాటు “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ”13ను కలిగియుంటే తప్పిపోయిన గొర్రెల కథలో మనిషిలాగున, “తొంభై తొమ్మిదిని విడిచిపెడతాము … మరియు పోగొట్టుకున్నదానిని, […దొరకువరకు… మనము] దానిని కనుగొనే వరకు” 14 వెంబడిస్తాము. లేదా పోగొట్టుకున్న నాణెం కథలోని స్త్రీలా, మనము “క్రొవ్వొత్తి వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది దొరికేంత వరకు […శ్రద్ధతో…మనం] దానిని కనుగొనే వరకు బహు జాగ్రత్తగా వెదుకుతాము.”15 మనతో “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమను” కలిగియుంటే, తప్పిపోయిన కుమారుడి కథలో, “కొడుకు ఇంకా చాలా దూరముగా ఉన్నప్పుడు, వానిని చూసి కనికరపడి మరియు పరుగెత్తి, అతని మెడమీద పడి, అతనిని ముద్దుపెట్టుకొనిన 16 తండ్రిని మనం అనుసరిస్తాము.

ఒక్క గొఱ్ఱెను పోగొట్టుకున్న మనిషి హృదయంలో అత్యవసరాన్ని? లేదా ఒక్క నాణెం పోగొట్టుకున్న ఆ మహిళ హృదయంలో ఉన్న అత్యవసరాన్ని? లేదా తప్పిపోయినవాని తండ్రి హృదయంలో ఉన్న వర్ణించలేని ప్రేమ మరియు కరుణను మనం అనుభవించగలమా?

నా భార్య మారియా ఇసాబెల్ మరియు నేను సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాల నగరంలో సేవచేశాము. అక్కడ, విశ్వాసపాత్రురాలైన ఒక సంఘ సభ్యురాలు జూలియాను కలిసే అవకాశం నాకు కలిగింది. ఆమె కుటుంబం గురించి ఆమెను అడగాలనే భావన నాకు కలిగింది. ఆమె తల్లి 2011లో క్యాన్సర్‌ వ్యాధితో మరణించింది. ఆమె తండ్రి తన స్టేకులో నమ్మకమైన నాయకుడు, బిషప్పుగా మరియు అతని స్టేకు అధ్యక్షుడికి చాలా సంవత్సరాలు సలహాదారుడిగా పనిచేశాడు. అతను ప్రభువు యొక్క నిజమైన ఉపకాపరి. సందర్శించడానికి, పరిచర్య చేయడానికి మరియు సేవ చేయడానికి అతను చేసిన అవిశ్రాంత ప్రయత్నాల గురించి జూలియా నాకు చెప్పింది. ప్రభువు యొక్క విలువైన గొర్రెలను పోషించడంలో మరియు చూసుకోవడంలో అతను నిజంగా ఆనందించేవాడు. అతను మరల వివాహం చేసుకున్నాడు మరియు సంఘములో చురుకుగా ఉన్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, అతను విడాకులు తీసుకోవలసివచ్చింది మరియు ఇప్పుడు అతను మరోసారి సంఘానికి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. తనకు అక్కడ స్థలం లేనట్లుగా అతను భావించాడు మరియు అతను విడాకులు తీసుకున్న కారణానికి కొందరు అతడిని విమర్శిస్తున్నారని కూడా అతను భావించాడు. ప్రతికూల ఆత్మ అతని హృదయాన్ని నింపడంతో అతను సంఘానికి వెళ్ళడం మానేశాడు.

కష్టపడి పనిచేసే, ప్రేమగల మరియు దయగల ఈ అద్భుతమైన ఉపకాపరి గురించి జూలియా గొప్పగా మాట్లాడింది. ఆమె అతడిని వర్ణిస్తున్నప్పుడు నాకు అత్యవసరమైన అనుభూతి వచ్చినట్లు స్పష్టంగా గుర్తుంది. ఇన్నాళ్లూ ఎంతోమందికి ఎన్నో సేవలందించిన ఆ వ్యక్తి కోసం నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను.

ఆమె నాకు అతని సెల్‌ఫోను నంబరు ఇచ్చింది మరియు నేను అతడిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉందనే ఆశతో అతనికి ఫోను చేయడం ప్రారంభించాను. చాలా వారాలకు మరియు విజయవంతం కాని అనేక ఫోనుల తర్వాత, చివరకు ఒక రోజు అతను నా ఫోను‌కి సమాధానం ఇచ్చాడు.

నేను అతని కుమార్తె జూలియాను కలిశానని మరియు అతను చాలా సంవత్సరాలుగా ప్రభువు యొక్క విలువైన గొర్రెలను సేవించిన, పరిచర్య చేసిన మరియు ప్రేమించిన విధానానికి నేను ఆకర్షించబడ్డానని చెప్పాను. అలాంటి వ్యాఖ్యను అతడు ఊహించలేదు. నేను అతనిని ప్రత్యక్షంగా, ముఖాముఖిగా సందర్శించాలని కోరుకుంటున్నానని చెప్పాను. అటువంటి సమావేశాన్ని ప్రతిపాదించడంలో నా ఉద్దేశ్యాన్ని అతను అడిగాడు. “నేను నిజంగా అలాంటి అద్భుతమైన మహిళ యొక్క తండ్రిని కలవాలనుకుంటున్నాను,” అని బదులిచ్చాను. తర్వాత కొన్ని సెకనులపాటు ఫోను‌లో నిశ్శబ్దం—కొన్ని సెకనులు నాకు నిత్యత్వంలా అనిపించింది. అతను మామూలుగా, “ఎప్పుడు మరియు ఎక్కడ?” అని అడిగాడు.

ప్రభువు యొక్క విలువైన గొర్రెలను సందర్శించడం, పరిచర్య చేయడం మరియు సేవ చేయడంలో అతని అనుభవాలలో కొన్నింటిని నాతో పంచుకోమని నేను అతడిని ఆహ్వానించాను. కొన్ని హత్తుకునే కథలను అతడు వివరిస్తున్నప్పుడు, అతని స్వరం మారడం మరియు అతనిలో చాలాసార్లు ఒక ఉపకాపరిగా భావించిన అదే స్ఫూర్తి తిరిగి రావడం నేను గమనించాను. ఇప్పుడు అతని కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. ఇదే సరైన క్షణమని నాకు తెలుసు, కానీ నేను ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను నా మనస్సులో, “తండ్రీ , నాకు సహాయం చేయండి” అని ప్రార్థించాను.

అకస్మాత్తుగా, నేను ఇలా చెప్పడం విన్నాను, “సోదరా ఫ్లోరియన్, మేము మీ కోసం అక్కడ లేనందుకు ప్రభువు యొక్క సేవకుడిగా నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మీకు చూపించడానికి, మీరు మాకు కావాలి అని, మీరు మాకు ముఖ్యం,” అని చెప్పడానికి మాకు మరొక అవకాశం ఇవ్వండి.

మరుసటి ఆదివారం అతను తిరిగి వచ్చాడు. బిషప్పుతో చాలాసేపు మాట్లాడాడు మరియు చురుకుగా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత అతను మరణించాడు—ఏది ఏమైనా కానీ అతను తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చాడు. రక్షకుని సహాయంతో, మనం ఆయన విలువైన గొర్రెలను ప్రేమించగలమని మరియు ఆయన కోరుకున్నట్లే వారికి పరిచర్య చేయగలమని నేను సాక్ష్యమిస్తున్నాను. కాబట్టి, అక్కడ గ్వాటెమాలా నగరంలో ప్రభువైన యేసు క్రీస్తు మరో విలువైన గొర్రెను తిరిగి తన మందలోకి తీసుకొచ్చారు. మరియు నేను మరచిపోలేని విధంగా పరిచర్య గురించి ఆయన నాకు పాఠం నేర్పారు. మంచి కాపరి, అందమైన కాపరి, అద్భుతమైన కాపరి, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.