లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 109


109వ ప్రకరణము

1836, మార్చి 27న కర్ట్‌లాండ్, ఒహైయోలో దేవాలయము అంకితమివ్వబడినప్పుడు చేయబడిన ప్రార్థన. ప్రవక్త వ్రాసిన వివరణను బట్టి, ఈ ప్రార్థన ఆయనకు బయల్పాటు ద్వారా ఇవ్వబడినది.

1–5, మనుష్య కుమారుడు దర్శించు స్థలముగా కర్ట్‌లాండ్ దేవాలయము నిర్మించబడినది; 6–21, అది ప్రార్థన, ఉపవాసము, విశ్వాసము, అభ్యాసము, మహిమ, క్రమము గల మందిరముగా, దేవుని మందిరముగా ఉండవలెను; 22–33, పశ్చాత్తాపపడకుండా ప్రభువు జనులను వ్యతిరేకించు వారు భంగపరచబడుదురు గాక; 34–42, నీతిమంతులను సీయోనులో పోగుచేయుటకు పరిశుద్ధులు శక్తితో ముందుకు సాగుదురు గాక; 43–53, అంత్యదినములలో దుష్టులపై క్రుమ్మరించబడు భయంకరమైన వాటినుండి పరిశుద్ధులు తప్పించబడుదురు గాక; 54–58, జనములు, ప్రజలు, సంఘములు సువార్త కొరకు సిద్ధపడుదురు గాక; 59–67, యూదులు, లేమనీయులు, ఇశ్రాయేలీయులందరు విమోచింపబడుదురు గాక; 68–80, పరిశుద్ధులు మహిమ, ఘనతలను కిరీటముగా ధరించి, నిత్యరక్షణను సంపాదించుదురు గాక;

1 ఓ ప్రభువా, ఇశ్రాయేలు దేవా, నీ నామమునకు వందనములు, తమ పూర్ణ హృదయాలతో నీ యెదుట నీతిగా నడుచుకొను నీ సేవకుల యెడల నిబంధనను నెరవేర్చి, కరుణ చూపితివి.

2 ఈ (కర్ట్‌లాండ్) ప్రదేశములో నీ నామమునకు ఒక మందిరమును నిర్మించమని నీవు నీ సేవకులను ఆజ్ఞాపించితివి.

3 ఇప్పుడు ఓ ప్రభువా, నీ ఆజ్ఞప్రకారము నీ సేవకులు చేసియుండుట నీవు చూచుచున్నావు.

4 పరిశుద్ధ తండ్రి, ఇప్పుడు నీ రొమ్మునున్న కుమారుడైన యేసు క్రీస్తు నామములో మేము నిన్నడుగుచున్నాము. ఆయన నామములోనే మనుష్య కుమారులకు రక్షణ నిర్వహించబడగలదు. ఓ ప్రభువా, నీ సేవకులమైన మమ్ములను నిర్మించమని నీవాజ్ఞాపించిన మా హస్తకృత్యమైన ఈ మందిరమును అంగీకరించమని మేము నిన్నడుగుచున్నాము.

5 ఏలయనగా మేము ఈ కార్యమును గొప్ప శ్రమలలో చేసితిమని నీవెరుగుదువు; మనుష్యకుమారుడు తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ఒక ప్రదేశమును కలిగియుండుటకు నీ నామమున ఒక మందిరమును నిర్మించుటకు లేమిలో మేము మా వస్తువులనిచ్చితిమి.

6 మాకు ఇవ్వబడిన ఒక బయల్పాటులో మమ్ములను నీ స్నేహితులుగా పిలుచుచు, ఈ విధముగా నీవు సెలవిచ్చియున్నావు—నేను మీకాజ్ఞాపించిన విధముగా మీ వ్రతదినమును ఏర్పాటు చేయుడి;

7 అందరు విశ్వాసమును కలిగియుండనందున, మీరు శ్రద్ధతో వెదకి, ఒకరికొకరు జ్ఞానవాక్యములను బోధించుకొనుడి; శ్రేష్ఠమైన గ్రంథముల నుండి మీరు జ్ఞానవాక్యములను వెదకుడి, అధ్యయనము ద్వారా విశ్వాసము ద్వారా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి;

8 మిమ్ములను మీరు ఏర్పాటు చేసుకొనుడి; అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుడి, మందిరమును అనగా ప్రార్థనామందిరమును, ఉపవాస మందిరమును, విశ్వాస మందిరమును, అభ్యాస మందిరమును, మహిమ మందిరమును, క్రమమైన మందిరమును, దేవుని మందిరమును స్థాపించుడి;

9 తద్వారా మీ ఆగమనములు ప్రభువు నామములో ఉండవచ్చును, మీ నిర్గమములు ప్రభువు నామములో ఉండవచ్చును, మహోన్నతునికి పైకెత్తిన చేతులతో మీ శుభవచనములు ప్రభువు నామములో ఉండవచ్చును—

10 పరిశుద్ధ తండ్రీ, ఇప్పుడు మా వ్రతదినము ఏర్పాటు చేయుటను గూర్చి, అది నీ ఘనతకు నీ దైవిక అంగీకారమునకు చేయబడగలుగునట్లు నీ జనులైన మాకు నీ కృపతో సహాయపడమని మేము నిన్నడుగుచున్నాము;

11 నీ దృష్టిలో మేము యోగ్యులముగా కనుగొనబడగలుగుటకు, మాకివ్వబడిన బయల్పాటులో నీవు మాకు చేసిన వాగ్దానముల నెరవేర్పును పొందగలిగే రీతిలో సహాయపడుము;

12 తద్వారా నీ మహిమ నీ జనులపైన, ఇప్పుడు మేము అంకితమిచ్చు నీ మందిరముపైన నిలుచునట్లు, తద్వారా అది పరిశుద్ధముగానుండుటకు పవిత్రపరచబడి సమర్పించబడగలుగునట్లు, నీ పరిశుద్ధ సన్నిధి ఎడతెగక ఈ మందిరములో ఉండగలుగునట్లు సహాయపడుము;

13 ప్రభువు మందిరపు గుమ్మమున ప్రవేశించు జనులందరు నీ శక్తిని అనుభూతిచెంది, దీనిని నీవు పవిత్రపరచితివని, ఇది నీ మందిరమని, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశమని ఒప్పుకొనుటకు బలవంతము చేయబడునట్లు భావించెదరు గాక.

14 పరిశుద్ధ తండ్రీ, ఈ మందిరములో ఆరాధించు వారందరికి శ్రేష్ఠమైన గ్రంథముల నుండి జ్ఞానవాక్యములు బోధింపబడగలుగునట్లు, నీవు సెలవిచ్చిన విధముగా వారు విశ్వాసము ద్వారా, అధ్యయనము ద్వారా నేర్చుకొనుటకు ప్రయత్నించునట్లు నీవు అనుగ్రహించుము;

15 తద్వారా వారు నీ యందు ఎదుగగలుగుటకు, పరిశుద్ధాత్మ సంపూర్ణతను వారు పొందగలుగుటకు, నీ చట్టములను బట్టి వారు ఏర్పాటు చేసుకొని, అవసరమైన ప్రతిదానిని సంపాదించుకొనుటకు సిద్ధపడియుండగలరు;

16 ఈ మందిరము, ప్రార్థనామందిరముగా, ఉపవాస మందిరముగా, విశ్వాస మందిరముగా, మహిమకరమైన దేవుని మందిరముగా, నీ మందిరముగా ఉండగలదు;

17 తద్వారా ఈ మందిరములోనికి నీ జనుల ఆగమనములన్నియు ప్రభువు నామములో ఉండును గాక;

18 ఈ మందిరము నుండి వారి నిర్గమములన్నియు ప్రభువు నామములో ఉండును గాక;

19 వారి శుభవచనములన్నియు మహోన్నతునికి పైకెత్తబడిన పరిశుద్ధమైన చేతులతో ప్రభువు నామములో ఉండును గాక;

20 అపవిత్రమైనదేదియు నీ మందిరములో ప్రవేశించి దానిని అపవిత్రము చేయుటకు అనుమతించబడకూడదు;

21 నీ జనులలో ఏ ఒక్కరైనా అపరాధము చేసినప్పుడు, వారు త్వరగా పశ్చాత్తాపపడి నీ యొద్దకు రాగలుగుటకు, నీ మందిరములో నిన్ను భక్తితో కొలుచు వారిపై క్రుమ్మరించబడుటకు, నీవు నియమించిన దీవెనలకు పునఃస్థాపించబడుటకు నీ దృష్టిలో మేలుపొందెదరు గాక.

22 పరిశుద్ధ తండ్రీ, నీ నామము వారిపైన ఉండి, నీ మహిమ వారిచుట్టూ ఉండి, వారి యెడల నీ దూతలు ఆజ్ఞను కలిగియుండుటకు, నీ శక్తిని ఆయుధములుగా ధరించుకొని నీ సేవకులు ఈ మందిరము నుండి వెళ్ళగలుగుటకు మేము నిన్నడుగుచున్నాము;

23 ఈ ప్రదేశము నుండి భూదిగంతముల వరకు సత్యమందు చాలా గొప్పవైన మహిమగల సువర్తమానముల కొరకు వారు సాక్ష్యము వహించెదరు, తద్వారా వారు ఇది నీ కార్యమని, చివరి దినములను గూర్చి నీ ప్రవక్తల నోటిద్వారా నీవు సెలవిచ్చిన దానిని నెరవేర్చుటకు నీవు నీ చేతిని చాచియున్నావని తెలుసుకొందురు.

24 ఆరాధించి, గౌరవముతో ఒక నామము కలిగి, అన్ని తరములకు మరియు నిత్యత్వమునకు ఈ నీ మందిరములో నిలబడు నీ జనులను స్థాపించమని పరిశుద్ధ తండ్రీ, మేము నిన్నడుగుచున్నాము;

25 తద్వారా వారికి విరోధముగా ఏర్పడు ఏ ఆయుధము వర్థిల్లదు; వారికొరకు గోతిని త్రవ్వువాడు దానిలోనే పడును గాక;

26 ఈ మందిరములో నీ నామము పెట్టబడువారిపైకి ఏ దుష్ట కూడిక అధికారములోనికి రాకుండా, నీ ప్రజలను జయించుటకు శక్తిని కలిగియుండకుండా ఉండును గాక;

27 ఈ జనులకు విరోధముగా ఏ జనులైనా అధికారములోనికి వచ్చిన యెడల, నీ కోపము వారిపై రగులుకొనును గాక;

28 వారు ఈ జనులను కొట్టిన యెడల, నీవు వారిని కొట్టుదువు; యుద్ధ దినమున నీవు చేసిన విధముగా నీ జనుల కొరకు నీవు యుద్ధము చేయుదువు, తద్వారా వారు తమ విరోధులందరి చేతులలోనుండి విడిపింపబడుదురు గాక.

29 పరిశుద్ధ తండ్రీ, విదేశాలలో, లోకమంతటా నీ సేవకుడు లేదా సేవకులకు విరోధముగా అబద్ధపు సమాచారములను వ్యాపింపజేయుచున్న వారందరు నిత్య సువార్త వారి చెవులలో ప్రకటించబడినప్పుడు పశ్చాత్తాపపడని యెడల వారిని చెదరగొట్టి, విస్మయపరచి, సిగ్గుపరచి, అయోమయము కలిగించమని మేము నిన్ను అడుగుచున్నాము;

30 వారందరి కార్యములు నిర్వీర్యమగును గాక, తుఫానుల వలన, నీ కోపమునందు నీవు వారిపై పంపు తీర్పుల చేత కొట్టుకొనిపోబడుదురు గాక, తద్వారా నీ జనులకు విరోధముగా వచ్చుచున్న అబద్ధములు, అవమానములకు అంతము కలుగునుగాక.

31 ఏలయనగా ఓ ప్రభువా, నీ సేవకులు నీ నామమున సాక్ష్యమిచ్చుటలో నీ యెదుట నిరపరాధులని నీవెరిగియున్నావు, దాని కొరకు వారు ఈ బాధలను అనుభవించిరి.

32 కాబట్టి, ఈ కాడి క్రిందనుండి పూర్తిగా, సంపూర్ణముగా విడుదల పొందుటకు నీ యెదుట మేము బ్రతిమాలుకొనుచున్నాము;

33 ఓ ప్రభువా, వాటిని విరుగగొట్టుము; నీ శక్తిచేత నీ సేవకుల మెడలనుండి వాటిని విరుగగొట్టుము, తద్వారా మేము ఈ తరము మధ్య నిలువబడి నీ కార్యమును చేయవచ్చును.

34 ఓ యెహోవా, ఈ జనుల యెడల కరుణ కలిగియుండుము, నరులందరు అపరాధము చేసిరి గనుక, నీ జనుల పాపములను క్షమించి, అవి ఎప్పటికీ తుడిచివేయబడనియ్యుము.

35 నీ సేవకుల అభిషేకము ఉన్నతము నుండి శక్తితో వారిపై ముద్రింపబడనియ్యుము.

36 పెంతెకొస్తు దినమున వారియెడల నెరవేర్చబడిన విధముగా వీరి యెడల నెరవేర్చబడనియ్యుము; నీ జనులమీద భాషలు మాట్లాడు బహుమానమును అనగా అగ్నిజ్వాలల వంటి నాలుకలను వాటిని భాషాంతరము చేయు బహుమానమును క్రుమ్మరించబడనియ్యుము.

37 వీచుచున్న బలమైన గాలివలె నీ మందిరమును నీ మహిమతో నింపుము.

38 నిబంధన సాక్ష్యమును నీ సేవకులపై ఉంచుము, తద్వారా వారు బయటకు వెళ్ళి నీ వాక్యమును బోధించునప్పుడు ధర్మశాస్త్రమును బంధించి, కష్టదినమున నీ జనులు సొమ్మసిల్లకుండునట్లు, భూలోక నివాసులపై వారి అపరాధము వలన నీ ఉగ్రతయందు నీవు పంపబోవు ఆ తీర్పుల కొరకు నీ పరిశుద్ధులను సిద్ధపరచగలరు.

39 నీ పరిశుద్ధులు ప్రవేశింపబోవు ఏ పట్టణమైనను ఆ పట్టణ జనులు వారి సాక్ష్యమును స్వీకరించినప్పుడు, నీ శాంతి నీ రక్షణ ఆ పట్టణముపై నిలుచును గాక; తద్వారా వారు ఆ పట్టణములోనున్న నీతిమంతులను సమకూర్చి, వారు సీయోనుకు లేదా దాని స్టేకులకు, నిత్యానంద కీర్తనలతో నీవు నియమించిన స్థలములకు వచ్చెదరు;

40 ఇది నెరవేరువరకు నీ తీర్పులు ఆ పట్టణముపై పడకుండును గాక.

41 నీ సేవకులు ప్రవేశించు ఏ పట్టణమందైనను ఈ దుష్టతరము నుండి తమనుతాము కాపాడుకొనవలెనని ఆ పట్టణ జనులు హెచ్చరించబడినప్పుడు నీ సేవకుల సాక్ష్యమును వారు స్వీకరించని యెడల, నీ ప్రవక్తల నోటిద్వారా నీవు పలికినదాని ప్రకారము ఆ పట్టణమునకు జరుగును గాక.

42 కానీ ఓ యెహోవా, వారి చేతులనుండి నీ సేవకులను విడిపించమని, వారి రక్తము నుండి వారిని కడిగివేయమని మేము నిన్ను వేడుకొనుచున్నాము.

43 ఓ ప్రభువా, మా తోటి మనుష్యుల నాశనమునందు మేమానందించుట లేదు; వారి ఆత్మలు నీకు ప్రశస్థమైనవి;

44 కానీ నీ వాక్యము నెరవేరవలసియున్నది. ఓ ప్రభువా, నీ చిత్తమే నెరవేరును గాని మా చిత్తము కాదని నీ కృప సహాయముతో నీ సేవకులు చెప్పుటకు సహాయము చేయుము.

45 కొలుచుటకు వీలులేనంతగా నీ తీర్పులను నీవు క్రుమ్మరించెదవని, అంత్యదినములలో దుష్టులను గూర్చి భయంకరమైన విషయములను నీ ప్రవక్తల నోటిద్వారా నీవు పలికితివని మేమెరుగుదుము;

46 కాబట్టి, ఓ ప్రభువా, దుష్టులకు కలుగబోవు ఉపద్రవము నుండి నీ జనులను విడిపించుము; ధర్మశాస్త్రమును ముద్రించునట్లును, సాక్ష్యమును బంధించునట్లును నీ సేవకులను అనుమతించుము, తద్వారా వారు దహించివేయబడు దినము కొరకు సిద్ధపడుదురు.

47 జాక్సన్ కౌంటీ, మిస్సోరి నివాసులను, వారి స్వాస్థ్యపు భూముల నుండి తరిమివేయబడిన వారిని జ్ఞాపకము చేసుకొనమని పరిశుద్ధ తండ్రీ, మేము నిన్నడుగుచున్నాము; ఓ ప్రభువా, వారిపై ఉంచబడిన ఈ శ్రమ యొక్క కాడిని విరుగగొట్టుము.

48 ఓ ప్రభువా, దుష్టుల చేత వారు తీవ్రముగా హింసింపబడి, కొట్టబడిరని నీవెరుగుదువు; వారి వేదనకరమైన భారముల వలన మా హృదయాలు దుఃఖముతో పొంగిపొర్లుచున్నవి.

49 ఓ ప్రభువా, ఈ శ్రమను భరించుటకు, వారి నిరపరాధుల రోదనలు నీ చెవులలోనికి ఎక్కివచ్చుటకు, వారి రక్తము సాక్ష్యముగా నీ యెదుటకు వచ్చుటకు, వారి పక్షమున నీ సాక్ష్యమును చూపుటకు ఈ జనులను ఎంతకాలము నీవు అనుమతించెదవు?

50 ఓ ప్రభువా, నీ జనులను తరిమివేసిన దుష్టులైన అల్లరిమూకల యెడల కరుణ చూపించుము, తద్వారా వారు నాశనము చేయుటను మాని, పశ్చాత్తాము కనుగొనబడిన యెడల వారి పాపముల కొరకు వారు పశ్చాత్తాపపడుదురు;

51 కానీ వారు పశ్చాత్తాపపడని యెడల, ఓ దేవా, నీ హస్తమును కనబరచుము, నీ జనులకు సీయోనుగా నియమించిన దానిని విమోచించుము.

52 అది ఆ విధముగా ఉండజాలని యెడల, నీ జనుల సంక్షేమమునకు భంగము కలుగకుండునట్లు నీ కోపము రగులుకొని, నీ ఉగ్రత వారిపై పడును గాక, తద్వారా వారు ఆకాశము క్రింద వేరును, కొమ్మయు లేకుండా బొత్తిగా నాశనము చేయబడుదురు;

53 కానీ వారు పశ్చాత్తాపపడిన యెడల, నీవు కరుణ కటాక్షములు గలవాడవు గనుక, నీ అభిషిక్తుల ముఖము చూచినప్పుడు నీ ఉగ్రతను త్రిప్పివేయుదువు.

54 ఓ ప్రభువా, భూలోక జనములన్నిటిపై కరుణ చూపుము; మా దేశపు పరిపాలకులపై కరుణ చూపుము; మా పితరులచే మా దేశపు రాజ్యాంగముగా పిలువబడి, చాలా ఘనముగా, ఔదార్యముతో కాపాడబడిన ఆ సూత్రములు ఎప్పటికీ స్థిరపరచబడును గాక.

55 రాజులను, రాకుమారులను, ఔదార్యము గలవారిని, గొప్పవారిని, సమస్త జనులను, సంఘములను, బీదలందరిని, అవసరతలో ఉన్నవారిని, భూలోకములో కష్టములను అనుభవించుచున్నవారిని జ్ఞాపకము చేసుకొనుము;

56 తద్వారా ఓ యెహోవా, నీ నామమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నీ సేవకులు నీ మందిరమునుండి బయలు వెళ్ళునప్పుడు, వారి హృదయములు సున్నితమగును గాక; వారి తొందరపాటు నిర్ణయములు సత్యమునకు మార్గమునిచ్చి, అందరి దృష్టిలో నీ జనులు అనుగ్రహమును పొందెదరు గాక;

57 తద్వారా భూదిగంతములన్నియు నీ సేవకులమైన మేము నీ స్వరమును వింటిమనియు, నీవు మమ్ములను పంపియున్నావనియు తెలుసుకొందురు గాక;

58 తద్వారా వీరందరి మధ్యనుండి యాకోబు కుమారులైన నీ సేవకులు నీతిమంతులను పోగుచేసి, నీవు వారికాజ్ఞాపించిన విధముగా నీ నామము కొరకు ఒక పరిశుద్ధ పట్టణమును నిర్మించుదురు గాక.

59 నీవు నియమించిన దానికి అదనముగా ఇతర గుడారములను సీయోనుకు నియమించమని మేము నిన్ను వేడుకొనుచున్నాము, తద్వారా నీ జనులను పోగుచేయు కార్యము గొప్ప శక్తితో మహత్వముతో కొనసాగును, నీ కార్యము నీతియందు కుదించబడును.

60 ఓ ప్రభువా, అన్యజనులతో గుర్తించబడిన మాకు నీవు ఇచ్చిన బయల్పాటులు, ఆజ్ఞలను గూర్చి ఇప్పుడు ఈ మాటలు నీ యెదుట మేము పలికితిమి.

61 కానీ యాకోబు కుమారుల కొరకు నీవు గొప్ప ప్రేమను కలిగియున్నావని నీకు తెలియును, వారు మేఘావృతమైన, చీకటి దినమున పర్వతముల మీద బహుకాలము చెదిరిపోయిరి.

62 అందువలన యాకోబు కుమారులపైన కరుణ కలిగియుండమని మేము నిన్నడుగుచున్నాము, తద్వారా ఈ గడియ నుండి యెరూషలేము విమోచింపబడును;

63 దావీదు గృహము నుండి దాస్యపు కాడి విరుగుట మొదలుపెట్టును;

64 యూదా కుమారులు వారి తండ్రియైన అబ్రాహామునకు నీవిచ్చిన దేశములకు తిరిగివచ్చుట మొదలుపెట్టుదురు గాక.

65 వారి అపరాధములను బట్టి శపించబడి, మొత్తబడిన యాకోబు శేషము, ఆటవికమైన, క్రూరమైన పరిస్థితులనుండి నిత్య సువార్తకు పరివర్తన చెందుదురు గాక;

66 తద్వారా రక్తమును చిందించు వారి ఆయుధములను పడవేసి, వారి తిరుగుబాటును వారు మానుకొందురు గాక.

67 భూదిగంతముల వరకు తరిమివేయబడి, చెదిరిపోయిన ఇశ్రాయేలు శేషము సత్యము యొక్క జ్ఞానములోనికి వచ్చి, మెస్సీయను నమ్మి, బలాత్కారము నుండి విమోచింపబడి, నీ యెదుట ఆనందించుదురు గాక.

68 ఓ ప్రభువా, నీ సేవకుడైన జోసెఫ్ స్మిత్‌ను, అతని శ్రమలను, హింసలను—అతడు ఏవిధముగా యెహోవాతో నిబంధన చేసి, శక్తిగల యాకోబు దేవుడవైన నీతో ప్రమాణము చేసెనో నీవు జ్ఞాపకము చేసుకొనుము—అతనికి నీవిచ్చిన ఆజ్ఞలను నీ చిత్తమును బట్టి చేయుటకు అతడు యథార్థముగా ప్రయత్నించెను.

69 ఓ ప్రభువా, అతని భార్యాపిల్లల యెడల కరుణ చూపుము, తద్వారా వారు నీ సన్నిధిలో పైకెత్తబడి, పోషణనిచ్చు నీ చేతిద్వారా సంరక్షింపబడుదురు.

70 వారి సమీప బంధువులందరిపైన కరుణ చూపుము, తద్వారా వారి తొందరపాటు నిర్ణయములు నాశనము చేయబడి, వరద వలే కొట్టుకొనిపోవును; తద్వారా వారు పరివర్తన చెంది, ఇశ్రాయేలుతో పాటు విమోచింపబడి, నీవు దేవుడవని తెలుసుకొందురు.

71 ఓ ప్రభువా, అధ్యక్షులను, నీ సంఘపు అధ్యక్షులందరిని జ్ఞాపకము చేసుకొనుము, తద్వారా నీ కుడిచేయి వారిని వారి కుటుంబములు, వారి సమీప బంధువులందరితో పైకెత్తును, తద్వారా వారి పేర్లు నిత్యము జ్ఞాపకము చేసుకొనబడి, తరతరముల వరకు నిరంతరము స్మరణలోనికి వచ్చును.

72 ఓ ప్రభువా, వారి కుటుంబములన్నిటితోను, వారి సమీప బంధువులందరితోను, రోగులు, శ్రమలలోనున్న వారందరితోను బీదలు, భూమిపైనున్న సాత్వీకులందరితోను కలిపి నీ సంఘమునంతటిని జ్ఞాపకము చేసుకొనుము; తద్వారా చేతి సహాయము లేదా నీవు ఏర్పరచిన రాజ్యము గొప్ప పర్వతముగా మారి భూమినంతటిని నింపును గాక;

73 తద్వారా నీ సంఘము చీకటిగల అరణ్యమునుండి బయటకు వచ్చి, చంద్రుని వలే ప్రకాశవంతముగాను, సూర్యుని వలే స్పష్టముగాను, ధ్వజములతో వచ్చుచున్న సైన్యమువలే భయంకరముగాను ప్రకాశించును గాక;

74 పరలోకపు తెరను నీవు తొలగించి, నీ సన్నిధిలో పర్వతములు దొర్లించబడి, లోయలు పైకెత్తబడి, గరుకైన ప్రదేశములు చదును చేయబడు ఆ దినము కొరకు పెండ్లి కుమార్తె వలే అలంకరింపబడును గాక; తద్వారా నీ మహిమ భూమిని నింపును గాక;

75 మృతుల కొరకు బూర ఊదబడగా, నిన్ను కలుసుకొనుటకు, తద్వారా మేము ఎన్నటికీ ప్రభువుతో ఉండునట్లు మేము మేఘములపైన కొనిపోబడుదుము;

76 మా వస్త్రములు నిష్కళంకముగానుండును గాక, తద్వారా మేము నీతి అంగీలను ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని, శిరస్సులపై మహిమ కిరీటములను ధరించుకొని, మా బాధలన్నిటి కొరకు నిత్య సంతోషమును ప్రతిఫలముగా పొందెదము.

77 ఓ ప్రభువా, సర్వశక్తిమంతుడవైన దేవా, మా విన్నపములను విని, నీ పరిశుద్ధ నివాస స్థలమైన పరలోకము నుండి ప్రత్యుత్తరమిమ్ము, అక్కడ నీవు మహిమ, ఘనత, శక్తి, వాత్సల్యము, బలము, ఏలుబడి, సత్యము, న్యాయము, తీర్పు, కరుణ మరియు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు అనంతమైన సంపూర్ణత్వమును కలిగి సింహాసనాసీనుడవై ఉన్నావు.

78 వినుము, వినుము, మమ్ములను వినుము, ఓ ప్రభువా! ఈ విన్నపములకు సమాధానమిమ్ము, నీకు చేయబడిన ఈ మందిర ప్రతిష్ఠను అంగీకరించుము, ఇది మా హస్తకృత్యము, దీనిని నీ నామము కొరకు నిర్మించితిమి;

79 నీ నామమును దానికి పెట్టుటకు ఈ సంఘమును కూడా నిర్మించితిమి. చప్పట్లతో స్తుతించుచు, దేవునికి గొఱ్ఱెపిల్లకు హోసన్నాయని పాడుచు నీ సింహాసనము చుట్టూనుండు కాంతివంతమైన, ప్రకాశించుచున్న సెరాపులతో మా స్వరములను మేము కలుపుటకు నీ ఆత్మ శక్తిచేత మాకు సహాయము చేయుము!

80 నీవు అభిషేకించిన వారైన వీరు రక్షణ వస్త్రమును ధరించెదరు గాక, మరి నీ పరిశుద్ధులు సంతోషముతో బిగ్గరగా అరిచెదరు గాక. ఆమేన్, ఆమేన్.