లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 132


132వ ప్రకరణము

వివాహ నిబంధన యొక్క నిత్యత్వము మరియు బహుభార్యత్వము యొక్క సూత్రముతోపాటు నూతన మరియు శాశ్వతమైన నిబంధనకు సంబంధించి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడి, 1843, జులై 12న నావూ, ఇల్లినాయ్‌లో నమోదు చేయబడిన బయల్పాటు. ఈ బయల్పాటు 1843లో నమోదు చేయబడినప్పటికీ, ప్రవక్తకు ఈ బయల్పాటులో ఉన్న సూత్రములలో కొన్ని చాలా ముందుగా అనగా 1831లో తెలియునని ఆధారాలు తెలుపుచున్నవి. అధికారిక ప్రకటన 1 చూడుము.

1–6, నూతన మరియు శాశ్వతమైన నిబంధన ద్వారా ఉన్నతస్థితి పొందబడును; 7–14, ఆ నిబంధన యొక్క నియమములు, షరతులు వివరించబడినవి; 15–20, సిలెస్టియల్ వివాహము, కుటుంబము యొక్క కొనసాగింపు మనుష్యులు దేవుళ్ళగుటకు తోడ్పడును; 21–25, తిన్నని, ఇరుకైన మార్గము నిత్యజీవమునకు నడిపించును; 26–27, పరిశుద్ధాత్మ దూషణకు సంబంధించిన ధర్మశాస్త్రము ఇవ్వబడెను; 28–39, నిత్యాభివృద్ధి ఉన్నతస్థితికి చెందిన వాగ్దానములు అన్ని యుగములందలి ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఇవ్వబడెను; 40–47, భూలోకమందును, పరలోకమందును బంధించి, ముద్రించుటకు జోసెఫ్ స్మిత్‌కు అధికారమియ్యబడెను; 48–50, ప్రభువు అతనిపై అతని ఉన్నతస్థితిని ముద్రించెను; 51–57, ఎమ్మా స్మిత్ విశ్వసనీయముగా, సత్యముగానుండుటకు సలహానియ్యబడెను; 58–66, బహుభార్య వివాహము నియంత్రించు చట్టములు ఇవ్వబడెను.

1 నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్, నీతో నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అంతేకాక నా సేవకులైన మోషే, దావీదు, సొలొమోనులు అనేకమంది పత్నులు, ఉపపత్నులను కలిగియుండుటలో గల సూత్రము, సిద్ధాంతమును గూర్చి నీవు అడుగుచూ, ప్రభువైన నేను వారిని ఎందుకు నీతిమంతులుగా చేసియున్నానో తెలుసుకొని, గ్రహించుటకు నీవు నన్ను విచారించితివి గనుక—

2 ఇదిగో నీ దేవుడైన, ప్రభువునైన నేనే ఈ అంశమును గూర్చి తెలుపుచు నీకు ఉత్తరమిచ్చెదను.

3 కాబట్టి, నేను నీకు ఇవ్వబోవు సూచనలను పొంది, గైకొనుటకు నీ హృదయమును సిద్ధపరచుకొనుము; ఏలయనగా ఈ ధర్మశాస్త్రము ఎవరికి బయలుపరచబడునో వారందరు దానిని గైకొనవలెను.

4 ఇదిగో, నేను మీకు ఒక నూతన మరియు శాశ్వతమైన నిబంధనను బయలుపరచుచున్నాను; ఆ నిబంధనకు లోబడియుండని యెడల మీరు నాశనమగుదురు; ఏలయనగా ఈ నిబంధనను తిరస్కరించి, నా మహిమలోనికి ప్రవేశించుటకు ఏ ఒక్కరు అనుమతించబడరు.

5 నా నుండి దీవెన పొందగోరిన వారందరు, లోకము పునాది వేయబడక మునుపు నుండి ఏర్పాటు చేయబడిన విధముగా ఆ దీవెనకు నియమించబడిన ధర్మశాస్త్రమునకు, దాని షరతులకు లోబడియుండవలెను.

6 నూతన మరియు శాశ్వతమైన నిబంధనకు సంబంధించినంత వరకు, అది నా సంపూర్ణ మహిమ కొరకు ఏర్పరచబడినది; దానిని సంపూర్ణముగా పొందినవాడు ధర్మశాస్త్రమునకు తప్పక లోబడియుండవలెను, లేనియెడల అతడు నాశనమగునని దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

7 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, ఈ ధర్మశాస్త్ర షరతులు ఇవే: భూమిమీద ఈ అధికారమును కలిగియుండుటకు (అంత్యదినములలో ఈ అధికారమును కలిగియుండుటకు నా సేవకుడైన జోసెఫ్‌ను నేను నియమించితిని, ఈ యాజకత్వపు అధికారము, తాళపుచెవులు ఒకసారి ఒకరిపైన మాత్రమే ప్రోక్షింపబడును) నేను నియమించిన నా సేవకుల ద్వారా బయల్పాటు మరియు ఆజ్ఞ వలన ఈ లోకము మరియు నిత్యత్వము రెండింటి కొరకు అభిషేకించబడిన వానిచేత పరిశుద్ధాత్మ వాగ్దానము వలన చేయబడని, ప్రవేశింపని మరియు ముద్రింపబడని అన్ని నిబంధనలు, ఒప్పందములు, ఒడంబడికలు, బాధ్యతలు, వాగ్దానములు, ప్రమాణములు, ఆచరణలు, సంబంధములు, సాంగత్యములు లేదా నిరీక్షణలు మృతుల పునరుత్థానము తరువాత ఎట్టి సామర్థ్యమును, వైశిష్ట్యమును లేదా బలమును కలిగియుండవు; ఈ ఉద్దేశ్యము కొరకు చేయబడని ఒప్పందములన్నియు మనుష్యులు మరణించిన తరువాత అంతమగును.

8 ఇదిగో, నా మందిరము క్రమమైన మందిరము, అది కలవరపెట్టు మందిరము కాదు.

9 నా నామమున అర్పించబడని అర్పణను నేను అంగీకరించెదనా?

10 లేక నేను నియమించని దానిని మీ హస్తములనుండి నేను స్వీకరించెదనా?

11 లోకము పుట్టకమునుపు నా తండ్రియు, నేనును మీకు నియమించియున్న ధర్మశాస్త్రము వలన తప్ప, నేను మీకు నియమించెదనా? అని ప్రభువు అడుగుచున్నాడు.

12 మీ దేవుడైన ప్రభువును నేనే; నేను ఈ ఆజ్ఞను మీకిచ్చుచున్నాను—అదేమనగా నా ద్వారా లేదా నా ధర్మశాస్త్రమైన నా వాక్యము ద్వారా తప్ప ఏ మనుష్యుడును తండ్రి యొద్దకు రాలేడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

13 ఈ లోకములోనున్న సమస్తము, అది మనుష్యుని వలన నియమించబడినదైనను, సింహాసనముల వలనైనను, లేదా ప్రధానులు, అధికారములు లేదా పేరు ప్రఖ్యాతులు గలవైనను, నా వలన లేదా నా వాక్యము వలన నియమించబడనివి ఏవైనను త్రోసివేయబడునని, మనుష్యుల మరణము తరువాతనైనను, పునరుత్థానము తరువాతనైనను నిలిచియుండవని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

14 నశింపక నిలిచియున్నవి ఏవనైను అవి నా వలన నియమించబడినవి; నా వలన నియమించబడనివి ఏవైనను అవి కదిలింపబడి, నాశనము చేయబడును.

15 కాబట్టి, ఈ లోకములో ఒక మనుష్యుడు ఒక స్త్రీని వివాహము చేసుకొని, ఆమెను నా వలనైనను, నా వాక్యము వలనైనను వివాహము చేసుకొనక, ఈ లోకములో అతడు జీవించినంత కాలము ఆమె అతనితో ఉండునని నిబంధన చేసుకొనిన యెడల, వారు మృతినొందిన తరువాత, ఈ లోకమును విడిచివెళ్ళిన తరువాత వారి నిబంధన, వివాహము చెల్లవు; కాబట్టి, ఈ లోకము విడిచివెళ్ళిన తరువాత ఏ ధర్మశాస్త్రము వలనైనను వారు భార్యాభర్తలుగా ఉండరు.

16 కాబట్టి, లోకమును విడిచి వెళ్ళిన తరువాత వారు పెండ్లి చేసుకొనరు లేదా పెండ్లికియ్యబడరు; కానీ పరలోకమందు దూతలుగా నియమింపబడుదురు, అన్నిటికన్నా ఎక్కువగా అన్నిటికి మించిన నిత్య మహిమగల వారికి పరిచర్య చేయుటకు ఆ దూతలు పరిచర్యచేయు సేవకులుగా నుందురు.

17 ఏలయనగా ఈ దూతలు నా ధర్మశాస్త్రమును గైకొనలేదు; కాబట్టి, వారు అభివృద్ధిని పొందలేరు, కానీ వారు ఉన్నతస్థితిని పొందక వేరు వేరుగా, ఒంటరిగా రక్షణ స్థితిలో యుగయుగముల వరకు ఉందురు; అప్పటినుండి వారు దేవునివలె ఉండరు, కానీ నిరంతరము దేవదూతలవలె ఉందురు.

18 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒక మనుష్యుడు ఒక స్త్రీని వివాహము చేసుకొని, ఈ లోకములోను, యుగయుగములకు ఆమెతో ఒక నిబంధన చేసుకొనిన యెడల, ఆ నిబంధన నా వలన గాని నా ధర్మశాస్త్రమైన నా వాక్యము వలన గాని చేసుకొనక, ఈ అధికారమునకు నేను అభిషేకించి, నియమించిన వాని ద్వారా పరిశుద్ధాత్మ వాగ్దానము వలన ముద్రింపబడని యెడల, వారు లోకమును విడిచివెళ్ళిన తరువాత అది చెల్లదు లేదా ప్రభావము కలిగియుండదు, ఎందువలననగా వారు నా వలనైనను, నా వాక్యము వలనైనను జతపరచబడలేదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; వారు లోకమును విడిచివెళ్ళిన తరువాత ఆ నిబంధనను అక్కడ పొందలేరు, ఎందుకనగా అక్కడ దూతలు, దేవుళ్ళు నియమించబడిరి, వారిని దాటి వారు వెళ్ళలేరు; కాబట్టి వారు నా మహిమను పొందలేరు; ఏలయనగా నా మందిరము క్రమముగల మందిరమని దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

19 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒక మనుష్యుడు నా ధర్మశాస్త్రమైన నా వాక్యమును బట్టి, నూతన మరియు శాశ్వతమైన నిబంధనను బట్టి ఒక స్త్రీని వివాహము చేసుకొనిన యెడల, ఈ అధికారమునకు, ఈ యాజకత్వ తాళపుచెవులకు నేను నియమించి, అభిషేకించిన వాని ద్వారా పరిశుద్ధాత్మ వాగ్దానము వలన అది వారికి ముద్రింపబడును; వారికి ఈ విధముగా చెప్పబడును—మీరు మొదటి పునరుత్థానమునందు లేపబడుదురు; ఒకవేళ మొదటి పునరుత్థానము తరువాత లేపబడిన యెడల, రెండవ పునరుత్థానమునందు లేపబడుదురు; సింహాసనములను, రాజ్యములను, ప్రధానులను, అధికారములను, ఏలుబాటులను, అన్ని ఎత్తులను, లోతులను స్వాస్థ్యముగా పొందుదురు—తరువాత అది గొఱ్ఱెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడును, తద్వారా అతడు నిరపరాధ రక్తమును చిందించుచు నరహత్య చేయకూడదు, నా నిబంధనయందు నిలిచి, నిరపరాధ రక్తమును చిందింపక నరహత్య చేయకుండిన యెడల, నా సేవకుడు వారిపైన ప్రతిష్ఠించినవన్నియు ఈ లోకములోను, యుగయుగముల వరకు వారియెడల నెరవేరును; వారు లోకమును విడిచి వెళ్ళినప్పుడు ప్రభావమును కలిగియుండును; వారి శిరస్సులపైన ముద్రింపబడిన విధముగా అన్ని విషయములందు తమ ఉన్నతస్థితిని, మహిమను పొందుట కొరకు వారు అక్కడ నియమించబడిన దూతలను, దేవుళ్ళను దాటి వెళ్ళుదురు, సంపూర్ణముగా సంతానమును కలిగియుండి, నిరంతరము కొనసాగుటయే ఆ మహిమగానుండును.

20 అప్పుడు వారు దేవుళ్ళుగానుందురు, ఎందుకనగా వారికి అంతము లేదు; కాబట్టి వారు యుగ యుగముల వరకు ఉందురు, ఎందుకనగా వారు ఆ స్థితిలో కొనసాగుదురు; అప్పుడు వారు అన్నిటికన్నా ఉన్నతముగానుందురు, ఎందుకనగా అన్ని సంగతులు వారికి లోబడియుండును. అప్పుడు వారు దేవుళ్ళుగానుందురు, ఎందుకనగా వారు సమస్త అధికారమును కలిగియుందురు మరియు దూతలు వారికి లోబడియుందురు.

21 మీరు నా ధర్మశాస్త్రమునకు లోబడియుండని యెడల, ఈ మహిమను పొందలేరని నిశ్చయముగా నేను మీకు సెలవిచ్చుచున్నాను.

22 ఏలయనగా ఉన్నతమునకు నడిపించి, జీవమును కొనసాగించు ద్వారము సరాళముగాను, దారి సంకుచితమునైయున్నది, దానిని కనుగొనువారు కొందరే, ఎందుకనగా లోకములో మీరు నన్ను అంగీకరించక, నన్ను యెరుగకనుండిరి.

23 లోకములో మీరు నన్ను అంగీకరించిన యెడల, అప్పుడు మీరు నన్ను తెలుసుకొందురు, మీ ఉన్నతస్థితిని పొందెదరు; తద్వారా నేనెక్కడ యున్నానో మీరు కూడా అక్కడ ఉందురు.

24 జ్ఞానముకలిగి సత్యవంతుడైన ఏకైక దేవుని, ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము. ఆయనను నేనే. కాబ్టటి మీరు నా ధర్మశాస్త్రమును స్వీకరించుడి.

25 మరణమునకు నడిపించు ద్వారము వెడల్పుగాను, మార్గము విశాలముగానున్నది; దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, ఎందుకనగా వారు నన్ను అంగీకరింపక, నా ధర్మశాస్త్రమును గైకొనక ఉండిరి.

26 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా వాక్యమును బట్టి ఒక మనుష్యుడు ఒక స్త్రీని వివాహము చేసుకొని, నేను నియమించిన వానివలన పరిశుద్ధాత్మ వాగ్దానము ద్వారా వారు ముద్రింపబడిన యెడల, అతడు లేదా ఆమె నూతన మరియు శాశ్వతమైన నిబంధన విషయమై పాపము లేదా అపరాధమును, సమస్త విధములైన దూషణను చేసియుండి, వారు నిరపరాధ రక్తమును చిందింపక నరహత్య చేయని యెడల, అప్పుడు కూడా వారు మొదటి పునరుత్థానమందు లేపబడుదురు, వారు తమ ఉన్నతస్థితిలోనికి ప్రవేశించెదరు; కానీ వారు శరీరమందు నాశనము చేయబడి, విమోచన దినము వరకు సాతాను శోధనలకు అప్పగింపబడుదురని ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు.

27 పరిశుద్ధాత్మ దూషణకు ఈ లోకములోను లేదా లోకము విడిచిన తరువాత పాపక్షమాపణ లేదు—అది నా నూతన మరియు శాశ్వతమైన నిబంధనను పొందిన తరువాత మీరు నిరపరాధ రక్తమును చిందించుట ద్వారా నరహత్య చేసి, నా మరణము సరియైనదని అంగీకరించుచున్నట్లు ఉన్నదని ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు; ఈ ధర్మశాస్త్రమును అంగీకరించనివాడు నా మహిమలో ప్రవేశింపక, శిక్షింపబడునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

28 మీ దేవుడైన ప్రభువును నేనే, జగత్తు పునాది వేయబడక మునుపు నా వలన, నా తండ్రి వలన నియమించబడిన విధముగా నా పరిశుద్ధ యాజకత్వ ధర్మశాస్త్రమును నేను మీకిచ్చెదను.

29 అబ్రాహాము అన్నిటిని పొందెననియు, అతడు పొందినదంతయు నా వాక్కువలన, బయల్పాటు మరియు ఆజ్ఞ వలన పొందెననియు, అతడు తన ఉన్నతస్థితి లోనికి ప్రవేశించి, తన సింహాసనము మీద కూర్చుండెననియు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

30 అబ్రాహాము తన సంతానమును గూర్చి వాగ్దానములను పొందెను, తన గర్భఫలమును గూర్చి—ఆ గర్భము నుండి నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ అను నీవు వచ్చితివి—ఆ గర్భఫలము ఈ లోకములో ఉన్నంతవరకు జీవనము కొనసాగించును; అబ్రాహాము అతని సంతానమునకు సంబంధించి—వారు లోకమును విడిచివెళ్ళిన తరువాత జీవనము కొనసాగించవలెను; ఆకాశ నక్షత్రములవలె అసంఖ్యాకముగా వారు ఈ లోకమునందు, లోకమును విడిచివెళ్ళిన తరువాత కూడా కొనసాగవలెను; లేక, మీరు సముద్రతీరమున ఉన్న ఇసుక రేణువులను లెక్కింపవలెనన్న మీ తరము కాదు.

31 ఈ వాగ్దానము మీకు కూడా చెందును, ఎందుకనగా మీరు అబ్రాహాము సంతానము, అబ్రాహామునకు ఈ వాగ్దానము చేయబడెను; ఈ ధర్మశాస్త్రముచేత నా తండ్రి కార్యములు కొనసాగును, వాటియందు తండ్రి మహిమను పొందును.

32 కాబట్టి మీరు వెళ్ళి, అబ్రాహాము చేసిన కార్యములను చేయుడి; నా ధర్మశాస్త్రమునకు లోబడియుండుడి, అప్పుడు మీరు రక్షింపబడుదురు.

33 కానీ మీరు నా ధర్మశాస్త్రమునకు లోబడియుండని యెడల, నా తండ్రి అబ్రాహాముతో చేసిన వాగ్దానమును మీరు పొందలేరు.

34 దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞ ఇచ్చెను మరియు శారా, అబ్రాహాముకు హాగరును భార్యగా ఇచ్చెను. ఆమె ఎందుకు ఆవిధముగా చేసెను? ఎందుకనగా అది ధర్మశాస్త్రము; హాగరు నుండి అనేకమంది జనులు ఉద్భవించిరి. కాబట్టి ఇది ఇతర విషయములతో పాటు వాగ్దానముల యొక్క నెరవేర్పు.

35 కాబట్టి, అబ్రాహాము నిందింపబడెనా? కాదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; ఏలయనగా ప్రభువైన నేను దీనిని ఆజ్ఞాపించితిని.

36 తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రాహాము ఆజ్ఞాపించబడెను; అయినప్పటికీ—నీవు నరహత్య చేయకూడదని వ్రాయబడెను కదా. అయినప్పటికీ అబ్రాహాము తిరస్కరించలేదు, అది అతనికి నీతిగా యెంచబడెను.

37 అబ్రాహాము ఉపపత్నులను పొందెను, వారతనికి పిల్లలను కనిరి; ఆయన నీతిమంతుడుగా యెంచబడెను, ఎందుకనగా వారు అతనికి ఇవ్వబడిరి, అతడు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనెను; ఇస్సాకు, యాకోబు కూడా వారికి ఆజ్ఞాపించబడినవి తప్ప మరి దేనిని చేయలేదు; వారు తమకు ఆజ్ఞాపించబడిన సంగతులు తప్ప మరి దేనిని చేయలేదు గనుక, వారు వాగ్దానములను బట్టి తమ ఉన్నతస్థితిలోనికి ప్రవేశించిరి, వారు సింహాసనములపైన కూర్చొనిరి, వారు దూతలు కాదు, గాని దేవుళ్ళు.

38 దావీదు కూడా అనేక భార్యలను, ఉపపత్నులను పొందెను, నా సేవకులైన సొలొమోను, మోషే, సృష్టి ఆరంభము నుండి ఇప్పటివరకు గల నా సేవకులలో అనేకులు కూడా పొందెను; నా నుండి పొందని వాటిలో తప్ప దేనిలోను వారు పాపము చేయలేదు.

39 నా సేవకుడైన నాతాను మరియు ఈ అధికారపు తాళపుచెవులు కలిగిన ఇతర ప్రవక్తలలో కొందరిచేత దావీదుకు భార్యలు, ఉపపత్నులు నా వలన ఇవ్వబడిరి; ఈ విషయములన్నింటిలో దేనియందును నాకు విరోధముగా అతడు పాపము చేయలేదు, కానీ ఒక్క ఊరియా మరియు అతని భార్య విషయములో పాపము చేసెను; కాబట్టి, అతడు తన ఉన్నతస్థితినుండి పడిపోయి, తన ప్రతిఫలమును పొందెను; లోకము విడిచిన తరువాత అతడు వారిని స్వాస్థ్యముగా పొందడు, ఏలయనగా వారిని నేను వేరొకరికి ఇచ్చియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

40 మీ దేవుడైన ప్రభువును నేనే, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ అను నీకు అన్ని సంగతులు పునఃస్థాపించుటకు ఒక భాధ్యతను అప్పగించియున్నాను. నీకు ఇష్టమైనదానిని అడుగుము, నా వాక్కును బట్టి అది నీకు అనుగ్రహించబడును.

41 వ్యభిచారమును గూర్చి నీవు అడిగితివి గనుక, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, ఒక మనుష్యుడు నూతన మరియు శాశ్వతమైన నిబంధనలో ఒక భార్యను పొందిన తర్వాత, ఆమె వేరొక పురుషునితో ఉండిన యెడల, పరిశుద్ధ అభిషేకము ద్వారా అతడిని నేను ఆమెకు నియమించని యెడల, ఆమె వ్యభిచారము చేసియుండెను, ఆమె చంపబడవలెను.

42 ఆమె నూతన మరియు శాశ్వతమైన నిబంధనలో లేనియెడల, ఆమె వేరొక పురుషునితో ఉండిన యెడల, ఆమె వ్యభిచారము చేసియుండెను.

43 ఆమె భర్త వేరొక స్త్రీతో ఉండిన యెడల, అతడు నిబంధనలో ఉన్న యెడల, అతడు తన ప్రమాణమును అతిక్రమించి వ్యభిచారము చేసియుండెను.

44 ఆమె వ్యభిచారము చేయక, నిరపరాధియై తన ప్రమాణమును అతిక్రమించక, అది ఆమె యెరిగియుండిన యెడల, అప్పుడు పరిశుద్ధ యాజకత్వము యొక్క అధికారముచేత నీవు ఆమెను తీసుకొని వ్యభిచారము చేయక నమ్మకముగానున్న వానికి ఇచ్చుటకు నీవు అధికారమును కలిగియుందువని నా సేవకుడైన జోసెఫ్ స్మిత్, నేను నీకు బయలుపరచుచున్నాను; ఏలయనగా అతడు అనేకమైన వాటిపై అధికారిగా చేయబడును.

45 ఏలయనగా యాజకత్వము యొక్క అధికారమును, తాళపుచెవులను నేను నీపై ప్రోక్షించియున్నాను, దాని ద్వారా నేను అన్ని సంగతులను పునఃస్థాపించెదను, తగిన సమయములో అన్ని సంగతులను నేను నీకు తెలుపుదును.

46 నేను నిశ్చయముగా నీకు చెప్పునదేమనగా, నీవు భూమి మీద దేనిని ముద్రింతువో అది పరలోకములోను ముద్రింపబడును; నీవు భూమిమీద నా నామమున, నా వాక్కువలన దేనిని బంధింతువో, అది ఎప్పటికీ పరలోకములో బంధింపబడునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; భూమిమీద నీవు ఎవరి పాపములను క్షమింతువో అవి ఎప్పటికీ పరలోకములో క్షమించబడును; ఎవరి పాపములను నీవు నిలిచియుండనిత్తువో అవి పరలోకములోను నిలిచియుండును.

47 మరలా నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, ఎవరిని నీవు దీవించెదవో వారిని నేను దీవించెదను, ఎవరినైతే నీవు శపించెదవో వారిని నేను శపించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా, ప్రభువైన నేను నీ దేవుడనైయున్నాను.

48 నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్ నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా వాక్కును బట్టి, నా ధర్మశాస్త్రమును బట్టి భూమిమీద నీవిచ్చు ఏదైనను, భూమిమీద నీవు వివాహమందు ఎవరిని ఎవరికి ఇచ్చినను, దానివెంట నా శక్తియు, ఆశీర్వాదములు వచ్చును, కానీ శాపములు కాదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, అది భూమిమీదను, పరలోకమందును నిందారహితముగా ఉండును.

49 ఏలయనగా నీ దేవుడైన ప్రభువును నేనే, ఈ లోకాంతము వరకు, నిత్యత్వమునందు కూడా నేను నీతోనుందును; ఏలయనగా నీమీద నీ ఉన్నతస్థితిని ముద్రించుచున్నాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రి రాజ్యములో నీ కొరకు ఒక సింహాసనమును సిద్ధపరచుచున్నాను.

50 ఇదిగో, నేను నీ త్యాగములను చూచియున్నాను, నీ పాపములన్నింటిని క్షమించెదను; నేను నీకు చెప్పిన దానికి విధేయత చూపుటకు నీవు చేసిన త్యాగములను నేను చూచియున్నాను. కాబట్టి నీవు వెళ్ళుము, అబ్రాహాము అర్పణగా ఇచ్చిన తన కుమారుడైన ఇస్సాకును నేను అంగీకరించిన విధముగా, నీవు తప్పించుకొను మార్గమును కలుగజేతును.

51 నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను: నా దాసి, నీ భార్యయైన ఎమ్మా స్మిత్‌కు నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ఆమెకు ఇమ్మని నేను నీకు ఆజ్ఞాపించిన దానిలో ఆమె పాలుపొందకుండా దూరముగా ఉండవలెను; అబ్రాహాము వలే మీయందరిని పరీక్షించుటకు నేను దీనిని చేసియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, తద్వారా నిబంధనవలన, త్యాగమువలన మీ నుండి ఒక అర్పణను నేను కోరవచ్చును.

52 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన వారందరిని నా దాసియైన ఎమ్మా స్మిత్ అంగీకరించవలెను, వారు నా యెదుట యోగ్యతకలిగి, పవిత్రముగానున్నారు; ఎవరైతే పవిత్రముగా లేకయే పవిత్రముగా ఉన్నామని చెప్పిరో వారందరు మరణమును పొందెదరని దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

53 ఏలయనగా మీ దేవుడైన ప్రభువును నేనే, మీరు నా స్వరమును గైకొనవలెను; నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ అనేకమైన వాటిపైన అధికారిగా నియమించబడును; ఏలయనగా అతడు కొద్ది వాటిపైన నమ్మకముగా నుండెను, ఇకమీదట అతడిని నేను బలపరిచెదను.

54 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్‌తో నివసించుచు, హత్తుకొనియుండమని, ఇంకెవరితోను కాదని నా దాసియైన ఎమ్మా స్మిత్‌ను నేనాజ్ఞాపించియున్నాను. కానీ ఆమె ఈ ఆజ్ఞకు లోబడియుండని యెడల, ఆమె మరణమును పొందునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా మీ దేవుడైన ప్రభువును నేనే, నా ధర్మశాస్త్రమునకు లోబడియుండని యెడల ఆమెను నేను నాశనము చేయుదును.

55 కానీ ఆమె ఈ ఆజ్ఞకు లోబడియుండని యెడల, అప్పుడు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ తాను చెప్పిన విధముగా అన్ని సంగతులను ఆమెకు చేయవలెను; అతడిని నేను దీవించి, అభివృద్ధి చేసి అతనికి ఈ లోకములో తండ్రులు, తల్లులు, సహోదరులు, సహోదరీలు, గృహములు, భూములు, భార్యలు, పిల్లలు నూరంతలుగాను మరియు నిత్య లోకములలో నిత్యజీవ కిరీటములను ఇచ్చెదను.

56 మరలా నేను సెలవిచ్చుచున్నాను, నా దాసి నా సేవకుడైన జోసెఫ్ అపరాధములను క్షమించవలెను; అప్పుడు ఆమె నా యెడల చేసిన తప్పిదముల విషయమై ఆమె అపరాధములు క్షమింపబడును; మీ దేవుడును ప్రభువునైన నేను ఆమెను దీవించి, అభివృద్ధి చేసి, ఆమె హృదయము సంతోషించునట్లు చేయుదును.

57 మరలా నేను చెప్పుచున్నాను, నా సేవకుడైన జోసెఫ్ తన ఆస్థిని తన చేతులలోనుండి పోగొట్టుకొనకూడదు, లేనియెడల శత్రువు వచ్చి అతడిని నాశనము చేయును; ఏలయనగా సాతాను నాశనము చేయుటకు చూచుచున్నాడు; ఏలయనగా మీ దేవుడును, ప్రభువును నేనే, అతడు నా సేవకుడు; చూడుము, ఇదిగో చూడుము, మీ తండ్రియైన అబ్రాహాముతో నేను ఉన్నట్లుగా అతని ఉన్నతస్థితిని, మహిమను పొందుటకు నేను అతనితో ఉన్నాను.

58 ఇప్పుడు, యాజకత్వపు ధర్మశాస్త్రమును గూర్చి, దానికి సంబంధించి అనేక విషయములు కలవు.

59 నిశ్చయముగా ఒక మనుష్యుడు నా స్వరమువలన మరియు నన్ను పంపినవాని స్వరమువలన అహరోను వలే నా తండ్రిచేత పిలువబడి ఈ యాజకత్వపు తాళపుచెవులతో నా వలన దీవించబడిన యెడల, పాపము చేయక నా నామమున మరియు నా ధర్మశాస్త్రము ప్రకారము అతడు ఏమి చేసినను అతడిని నేను నీతిమంతునిగా యెంచుదును.

60 కాబట్టి, ఏ మనుష్యుడును నా సేవకుడైన జోసెఫ్‌ను నిందించకూడదు; ఏలయనగా నేనతనిని నీతిమంతునిగా యెంచుదును; ఏలయనగా అతని అపరాధముల నిమిత్తము అతనినుండి నేను కోరు త్యాగమును అతడు చేయునని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

61 మరలా, యాజకత్వపు ధర్మశాస్త్రమును గూర్చి—ఎవరైనను ఒక కన్యకను వివాహము చేసుకొని, మరొక కన్యకను వివాహము చేసుకొనుటకు ఇచ్ఛయించిన యెడల, అందుకు మొదటి కన్యక సమ్మతించిన యెడల, అతడు రెండవ కన్యకను వివాహము చేసుకొనినట్లైతే, వారు కన్యకలుగా నుండి, ఇక యే పురుషునితో వివాహ ప్రమాణము చేయని యెడల అతడు నీతిమంతునిగా యెంచబడును; అతడు వ్యభిచారము చేయజాలడు, ఏలయనగా వారు అతనికి ఇవ్వబడిరి; ఏలయనగా అతనికి తప్ప ఇంకెవరికి చెందని వారితో అతడు వ్యభిచారము చేయలేదు.

62 ఈ ధర్మశాస్త్రము వలన అతనికి పదిమంది కన్యకలు ఇవ్వబడిన యెడల, అతడు వ్యభిచరించలేడు, ఏలయనగా వారు అతనికి చెందినవారు, వారు అతనికి ఇవ్వబడిరి; కాబట్టి అతడు నీతిమంతునిగా యెంచబడును.

63 కానీ పదిమంది కన్యకలలో ఒకరు లేదా ఎవరైనను, ఆమెకు వివాహమైన తరువాత, మరొక పురుషునితో ఉన్నయెడల, ఆమె వ్యభిచరించెను, ఆమె మరణమును పొందును; ఏలయనగా నా ఆజ్ఞ ప్రకారము ఫలించి, భూమిని నింపుటకు, లోకము పునాది వేయబడక మునుపు నా తండ్రి చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు, నిత్య లోకములలో వారి ఉన్నతస్థితి కొరకు, తద్వారా మనుష్య ఆత్మలకు జన్మనిచ్చుటకు వారు అతనికి ఇవ్వబడిరి; ఏలయనగా నా తండ్రి మహిమపొందునట్లు దీనియందు నా తండ్రి కార్యము కొనసాగును.

64 మరలా నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, ఈ అధికారపు తాళపుచెవులను కలిగిన ఏ మనుష్యుడైనను ఒక భార్యను కలిగియుండి, అతడు ఈ విషయములకు సంబంధించిన నా యాజకత్వపు ధర్మశాస్త్రమును ఆమెకు బోధించిన యెడల అప్పుడు ఆమె నమ్మి, అతడు ఇతరులను వివాహము చేసుకొనుటను సమర్థించవలెను, లేదా ఆమె మరణమును పొందవలెనని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా ఆమెను నేను నాశనము చేయుదును; ఏలయనగా నా ధర్మశాస్త్రమును అంగీకరించి, దానియందు నిలిచియున్న వారందరిపైన నేను నా నామమును ఘనపరిచెదను.

65 కాబట్టి, ఆమె ఈ ధర్మశాస్త్రమును పొందని యెడల, అతని దేవుడును, ప్రభువునైన నేను అతనికి ఇచ్చు దేనినైనను పొందుట నా యందు న్యాయసమ్మతముగా ఉండును, ఎందువలననగా నా మాట ప్రకారము ఆమె నమ్మి, అతడు ఇతరులను వివాహము చేసుకొనుటను సమర్థించలేదు; అప్పుడు ఆమె అపరాధియగును; అతడు శారా యొక్క ధర్మశాస్త్రమునుండి మినహాయించబడును, హాగరును భార్యగా చేసుకోమని అబ్రాహామును నేను ఆజ్ఞాపించినప్పుడు, ధర్మశాస్త్రము ప్రకారము ఆమె అబ్రాహాము వివాహమును సమర్థించెను.

66 ఇప్పుడు, ఈ ధర్మశాస్త్రమునకు సంబంధించి, ఇకమీదట మరింత నీకు బయలుపరచెదనని నిశ్చయముగా నేను నీకు సెలవిచ్చుచున్నాను; కాబట్టి, ఇప్పటికి ఇది చాలును. ఇదిగో అల్ఫాయు ఓమెగయు నేనే. ఆమేన్.