లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 68


68వ ప్రకరణము

ఓర్సన్ హైడ్, లూక్ ఎస్. జాన్సన్, లైమన్ ఈ. జాన్సన్, విలియమ్ ఈ. మెక్‌లెలిన్‌ల గూర్చి ప్రభువు మనస్సు ఏమైయున్నదో తెలియపరచబడవలెనన్న ప్రార్థనకు ప్రత్యుత్తరముగా జోసెఫ్ స్మిత్ ద్వారా 1831 నవంబరు 1న ఒహైయోలోని హైరంలో ఈ బయల్పాటు ఇవ్వబడినది. బయల్పాటులో కొంతభాగము ఈ నలుగురి మనుష్యుల కొరకు నిర్దేశించబడినప్పటికీ, ఈ అంశములో అధికభాగము సంఘమంతటికి వర్తించును. సిద్ధాంతము మరియు నిబంధనల యొక్క 1835 సంపుటిలో ఈ బయల్పాటు ప్రచురించబడినప్పుడు జోసెఫ్ స్మిత్ దర్శకత్వములో ఇది విస్తరించబడెను.

1–5, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడగా పెద్దలు పలుకు మాటలు లేఖనమగును; 6–12, పెద్దలు ప్రకటించి, బాప్తిస్మము ఇవ్వవలెను మరియు యథార్థముగా నమ్మినవారికి సూచక క్రియలు కనబడును; 13–24, అహరోను కుమారులలో జ్యేష్ఠుడు, ప్రథమ అధ్యక్షత్వము యొక్క నడిపింపు క్రింద అధ్యక్షత్వము వహించు బిషప్పుగా సేవ చేయును (అనగా, బిషప్పుగా అధ్యక్షత్వపు తాళపుచెవులను కలిగియుండును); 25–28, తమ పిల్లలకు సువార్తను బోధించవలెనని తల్లిదండ్రులు ఆజ్ఞాపించబడిరి; 29–35, పరిశుద్ధులు విశ్రాంతిదినమును ఆచరించవలెను, శ్రద్ధగా పనిచేయవలెను మరియు ప్రార్థించవలెను.

1 నా సేవకుడైన ఓర్సన్ హైడ్ తన నియామకము వలన సజీవుడగు దేవుని ఆత్మచేత ఒక జనము నుండి మరియొక జనమునకు, ఒక దేశము నుండి మరియొక దేశమునకు, దుష్టజన సమూహముల మధ్య, వారి సమాజమందిరములలో తర్కించుచు, సమస్త లేఖనములను వారికి వివరించుచు, నిత్య సువార్తను ప్రకటించుటకు పిలువబడెను.

2 ఇదిగో చూడుడి, ఈ యాజకత్వమునకు నియమించబడిన వారందరికి ఇది ఒక మాదిరిగా ఉండును, వారు ముందుకు సాగుటకు వారి పరిచర్య వారికి నియమించబడినది—

3 పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడగా వారు మాట్లాడవలెను అనునదియే వారికి మాదిరిగా ఉండును.

4 పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడగా వారు ఏది మాట్లాడినను అది లేఖనమగును, ప్రభువు చిత్తమగును, ప్రభువు మనస్సు అగును, ప్రభువు వాక్యమగును, ప్రభువు స్వరమగును, రక్షణను కలుగజేయు దేవుని శక్తియగును.

5 ఇదిగో, ఓ నా సేవకులారా, ఇది మీకు ప్రభువు వాగ్దానమైయున్నది.

6 కాబట్టి, భయపడక ధైర్యముగానుండుడి, ఏలయనగా ప్రభువైన నేను మీతోనున్నాను మరియు మీ ప్రక్కన నిలిచెదను; నేను సజీవుడగు దేవుని కుమారుడనని, నేను ఉండేవాడను, నేను ఉండువాడను మరియు రాబోవు వాడను నేనేయని మీరు యేసు క్రీస్తునైన నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలెను.

7 నా సేవకుడైన ఓర్సన్ హైడ్ నీకును, నా సేవకుడైన లూక్ జాన్సన్, నా సేవకుడైన లైమన్ జాన్సన్, నా సేవకుడైన విలియమ్ ఈ. మెక్‌లెలిన్ మరియు సంఘవిశ్వాసులైన పెద్దలందరికిని ప్రభువు వాక్కు ఇదియే—

8 మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుచు, నేను మీకు ఇచ్చియున్న అధికారముతో పనిచేయుచు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మమియ్యుడి.

9 నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు నాశనమగును.

10 నమ్మువాడు వ్రాయబడిన ప్రకారము సూచకక్రియలతో దీవించబడును.

11 ఈ కాలముల సూచకక్రియలను, మనుష్య కుమారుని రాకడకు సూచకక్రియలను తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడును;

12 తండ్రి ఎందరిని గూర్చి సాక్ష్యమిచ్చునో వారందరిని నిత్యజీవము కొరకు ముద్రించుటకు మీకు శక్తి అనుగ్రహింపబడును. ఆమేన్.

13 ఇప్పుడు నిబంధనలు, ఆజ్ఞలతో పాటు ఇతర అంశములను గూర్చి చెప్పుచున్నాను, అవి యేవనగా—

14 ఇకమీదట ప్రభువు యుక్తకాలమందు, మొదటి వానివలె పరిచర్య చేయుటకు సంఘమునందు ఇతర బిషప్పులు ప్రత్యేకపరచబడవలెను;

15 కాబట్టి వారు వాస్తవముగా అహరోను వారసులైతే తప్ప, వారు యోగ్యులైన ప్రధాన యాజకులుగా ఉండి, మెల్కీసెదెకు యాజకత్వపు ప్రథమ అధ్యక్షత్వము వలన నియమించబడవలెను.

16 వారు వాస్తవముగా అహరోను వారసులై, అహరోను కుమారులలో జ్యేష్ఠులైతే బిషప్పు స్థానమునకు వారికి న్యాయపరమైన హక్కు కలదు;

17 ఏలయనగా జ్యేష్ఠుడు ఈ యాజకత్వముపై అధ్యక్షత్వపు హక్కును, దాని తాళపుచెవులను లేదా అధికారమును కలిగియుండును.

18 ఒకడు వాస్తవముగా అహరోను వారసుడు, అహరోను యొక్క జ్యేష్ఠుడైతే తప్ప, ఏ మనుష్యుడు ఈ యాజకత్వ తాళపుచెవులను కలిగియుండుటకు, ఈ స్థానమునకు న్యాయపరమైన హక్కే కలిగియుండడు.

19 కానీ, మెల్కీసెదెకు యాజకత్వపు ప్రధాన యాజకునిగా తక్కువ స్థానములన్నింటిలో వ్యవహరించుటకు అధికారము కలిగియుండెను గనుక, వాస్తవమైన అహరోను వారసుడు కనుగొనబడలేనప్పుడు, మెల్కీసెదెకు యాజకత్వమునకు చెందినవాడు ప్రథమ అధ్యక్షత్వము చేత పిలువబడి, ప్రత్యేకపరచబడి, ఈ శక్తికి నియమించబడిన యెడల అతడు బిషప్పు స్థానములో అధికారిగానుండవచ్చును.

20 అహరోను యొక్క వాస్తవమైన వారసుడు కూడా ఈ అధ్యక్షత్వము చేత పిలువబడవలెను మరియు యోగ్యునిగా కనుగొనబడి, అభిషేకించబడి, ఈ అధ్యక్షత్వము చేత నియమించబడవలెను, లేనియెడల వారి యాజకత్వములో వ్యవహరించుటకు న్యాయపరముగా వారికి అధికారము లేదు.

21 కానీ, తండ్రి నుండి కుమారునికి సంక్రమించు వారి యాజకత్వపు హక్కును గూర్చిన శాసనము ఆధారముగా, ఏ సమయమందైనను వారు తమ గోత్రమును నిరూపించగలిగిన యెడల లేదా పైన చెప్పబడిన అధ్యక్షత్వము చేత ప్రభువు యొద్ద నుండి బయల్పాటు ద్వారా దానిని రూఢిపరచిన యెడల తమ అభిషేకమును ఆరోపించవచ్చును.

22 మరలా, ఈ పరిచర్యకు ప్రత్యేకపరచబడు బిషప్పు లేదా ప్రధాన యాజకుడు, ఏ నేరముకైనను ప్రథమ అధ్యక్షత్వము యెదుట తప్ప మరెక్కడా విచారించబడకూడదు లేదా శిక్షింపబడకూడదు.

23 సరియైన సాక్ష్యము ద్వారా ఈ అధ్యక్షత్వము యెదుట అతడు అపరాధిగా కనుగొనబడిన యెడల, అతడు శిక్షింపబడవలెను;

24 అతడు పశ్చాత్తాపపడిన యెడల, సంఘ నిబంధనలు మరియు ఆజ్ఞలను బట్టి అతడు క్షమించబడును.

25 మరలా, సీయోనులో లేదా ఏర్పాటు చేయబడిన దాని స్టేకులలో దేనిలోనైనా తల్లిదండ్రులు పిల్లలను కలిగియుండి, వారు ఎనిమిదేండ్ల వారైయున్నప్పుడు వారికి పశ్చాత్తాప సిద్ధాంతమును, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసమును, బాప్తిస్మము, హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరమును అర్థము చేసుకొనునట్లు బోధించని యెడల, ఆ పాపము తల్లిదండ్రుల శిరస్సులమీద ఉండును.

26 ఏలయనగా సీయోనులో లేదా ఏర్పాటుచేయబడిన దాని స్టేకులలో దేనిలోనైనా ఉండు నివాసులకు ఇది ఒక శాసనముగా ఉండును.

27 ఎనిమిదేండ్ల ప్రాయములో వారి పిల్లలు తమ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది, హస్తనిక్షేపణమును పొందవలెను.

28 వారు తమ పిల్లలకు ప్రార్థించుట, ప్రభువు యెదుట యథార్థముగా నడుచుకొనుటను కూడా నేర్పించవలెను.

29 సీయోను నివాసులు కూడా విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించవలెను.

30 సీయోను నివాసులు పనిచేయుటకు నియమించబడినంత మట్టుకు, పూర్తి విశ్వాస్యతతో తమ పనులను నిర్వహించవలెనని జ్ఞాపకముంచుకొనవలెను; ఏలయనగా సోమరి ప్రభువు సముఖమందు జ్ఞాపకముంచుకోబడును.

31 ఇప్పుడు ప్రభువైన నేను, సీయోను నివాసుల యెడల ఎక్కువ ఆనందించుట లేదు, ఏలయనగా వారి మధ్య సోమరులు ఉన్నారు; వారి పిల్లలు కూడా దుష్టత్వములో పెరుగుచున్నారు; వారు నిత్యత్వపు ఐశ్వర్యములను వెదుకుట లేదు, కానీ వారి కన్నులు దురాశతో నిండియున్నవి.

32 ఈ విషయములు ఈలాగున ఉండరాదు, అవి వారి మధ్యనుండి తొలగిపోవలెను; కాబట్టి, నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ సీయోను ప్రదేశమునకు ఈ సంగతులను తీసుకొని వెళ్ళవలెను.

33 మరియు వారికి నేనొక ఆజ్ఞ ఇచ్చుచున్నాను—అదేమనగా తగిన సమయమందు ప్రభువు సముఖమందు తన ప్రార్థనలు చేయనివాడు, నా ప్రజల యొక్క న్యాయాధిపతి యెదుట జ్ఞాపకముంచుకొనబడవలెను.

34 ఈ మాటలు సత్యమైనవి మరియు నమ్మదగినవైయున్నవి; కాబట్టి వాటిని అతిక్రమించకుము, వాటినుండి దేనిని తీసివేయకుము.

35 ఇదిగో, అల్ఫాయు ఓమెగయు నేనే మరియు నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్.