లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 81


81వ ప్రకరణము

1832, మార్చి 15న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ ప్రధాన యాజకునిగా, ప్రధాన యాజకత్వపు అధ్యక్షత్వమునందు సలహాదారునిగా ఉండుటకు పిలువబడెను. 1832 మార్చిలో ఈ బయల్పాటు పొందబడినప్పుడు, అధ్యక్షత్వములో జోసెఫ్ స్మిత్ యొక్క సలహాదారుని స్థానమునకు జెస్సీ గాస్‌ పిలువబడెనని చారిత్రక వృత్తాంతములు చూపును. అయినప్పటికీ, ఈ నియామకమునకు సరిపడు విధానములో కొనసాగుటకు అతడు విఫలమైనప్పుడు, ఆ పిలుపు ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌కు బదిలీ అయ్యెను. (1832 మార్చి తారీఖుగా నమోదైన) ఈ బయల్పాటు ప్రథమ అధ్యక్షత్వము యొక్క అధికారిక ఏర్పాటు దిశగా, ప్రత్యేకించి ఆ సమూహములో సలహాదారుని స్థానమును, నియామకము యొక్క హూందాతనమును వివరించే దిశగా వేసిన అడుగువలె యెంచబడవలెను. సహోదరుడు గాస్ కొంతకాలము సేవచేసెను, కానీ 1832 డిసెంబరులో సంఘమునుండి బహిష్కరించబడెను. 1833, మార్చి 18న ఈ నిర్దేశిత స్థానమునకు సహోదరుడు విలియమ్స్ నియమించబడెను.

1–2, పరలోకరాజ్యపు తాళపుచెవులు ఎల్లప్పుడు ప్రథమ అధ్యక్షత్వముచేత కలిగియుండబడును; 3–7, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ తన పరిచర్యలో నమ్మకముగానుండిన యెడల, అతడు నిత్యజీవమును కలిగియుండును.

1 నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను: మాట్లాడుచున్నవాని స్వరమును, దేవుడైన నీ ప్రభువు మాటను ఆలకించుము, నా సంఘములో ప్రధాన యాజకునిగాను, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. కు సలహాదారునిగానుండుటకు నీవు పిలుబడిన పిలుపునకు చెవియొగ్గుము;

2 అతనికి నేను పరలోకరాజ్యపు తాళపుచెవులను ఇచ్చియున్నాను, అవి ఎల్లప్పుడు ప్రధాన యాజకత్వము యొక్క అధ్యక్షత్వమునకు చెందియున్నవి:

3 కాబట్టి, నీ స్వరముతో మరియు నీ హృదయములో, బహిరంగముగా మరియు అంతరంగముగా ఎల్లప్పుడు ప్రార్థనయందు, నీ నివాసస్థలములో మరియు నీ సహోదరుల మధ్య సువార్తను ప్రకటించుటలో నీ పరిచర్యనందు, నీకు నేను నియమించిన స్థానమునందు, ఉపదేశమందు నమ్మకముగానుండిన యెడల అతడిని, నిన్నుకూడా నేను గుర్తించి, దీవించెదను.

4 ఈ సంగతులను చేయుటద్వారా నీ పొరుగువారికి నీవు గొప్ప మేలు చేయుదువు, నీ ప్రభువైన ఆయన మహిమను వృద్ధిచేయుదువు.

5 కాబట్టి, విశ్వాసముగానుండుము; నేను నీకు నియమించిన స్థానమునందు నిలిచియుండుము; బలహీనులను పోషించుము, వడలిన చేతులను పైకెత్తుము, సడలిన మోకాళ్ళను బలపరచుము.

6 నీవు అంతము వరకు విశ్వాసముగానుండిన యెడల, నా తండ్రి ఇంట నేను సిద్ధపరచిన నివాసములందు అమర్త్యత్వపు మరియు నిత్యజీవపు కిరీటమును కలిగియుందువు.

7 ఇదిగో చూడుము, ఇవి అల్ఫాయు ఓమెగయునైన యేసు క్రీస్తు మాటలైయున్నవి. ఆమేన్.