లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 130


130వ ప్రకరణము

వివిధ అంశములను గూర్చి 1843, ఏప్రిల్ 2న రామస్, ఇల్లినాయ్ వద్ద ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడిన సూచనలు.

1–3, తండ్రి, కుమారులు స్వయముగా నరులకు కనిపించును; 4–7, సిలెస్టియల్ గోళమునందు దూతలు నివాసముండెదరు; 8–9, సిలెస్టియల్ భూమి గొప్ప ఊరీము తుమ్మీముగా నుండును; 10–11, సిలెస్టియల్ లోకములో ప్రవేశించు వారందరికి ఒక తెల్లని రాయి ఇవ్వబడును; 12–17, రెండవ రాకడ సమయము ప్రవక్తకు మరుగుపరచబడియున్నది; 18–19, ఈ లోకములో పొందిన మేధస్సు పునరుత్థానమందు మనతో లేచును; 20–21, దీవెనలన్నియు ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా వచ్చును; 22–23, తండ్రి, కుమారులు మాంసము, ఎముకలు గల శరీరములు కలిగియున్నారు.

1 రక్షకుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నవిధముగా మనమాయనను చూచెదము. ఆయన మనవలె మనుష్యుడని మనము చూచెదము.

2 ఇక్కడ మనమధ్య ఉన్న సమాజ వ్యవస్థయే అక్కడ మనమధ్య ఉండును, కేవలము అది నిత్య మహిమతో రెండింతలగును, ఆ మహిమను ఇప్పుడు మనము ఆనందించుటలేదు.

3 యోహాను 14:23—ఆ వచనములో తండ్రి, కుమారులు ప్రత్యక్షమగుట ఒక వ్యక్తిగత ప్రత్యక్షత; తండ్రి, కుమారులు మనుష్య హృదయములో నివసించుట అను ఆలోచన ప్రాచీన మతశాఖల అభిప్రాయము మరియు అది అసత్యము.

4 దేవుని కాలము, దేవదూతల కాలము, ప్రవక్తల కాలము, నరుని కాలము వారు నివాసమున్న గ్రహమును బట్టి ఉండునా? అను ప్రశ్నకు—

5 అవునని నేను సమాధానమిచ్చెదను. కానీ దానికి చెందవలసిన లేదా చెందిన వారు తప్ప, ఈ భూలోకమునకు పరిచర్య చేయు దేవదూతలు ఎవరును లేరు.

6 ఈ భూమిని పోలిన గ్రహముమీద దేవదూతలు నివసించరు;

7 కానీ వారు దేవుని సన్నిధిలో గాజు, అగ్నితో కూడిన సముద్రము వలెనున్న గోళముమీద నివాసముందురు, అక్కడ వారి మహిమకొరకు భూత, వర్తమాన, భవిష్యత్తులోనున్న అన్నివిషయములు ప్రత్యక్షపరచబడును, అవన్నియు ప్రభువు యెదుటనున్నవి.

8 దేవుడు నివాసముండు ప్రదేశము గొప్ప ఊరీము తుమ్మీమైయున్నది.

9 ఈ భూలోకము పవిత్రపరచబడి, అక్షయపు స్థితిలో స్ఫటికమువలె చేయబడును, దానిపై జీవించు నివాసులకు ఊరీము తుమ్మీమువలె ఉండును, తద్వారా నిమ్న రాజ్యము లేదా దిగువ క్రమమునకు చెందిన రాజ్యములకు సంబంధించిన అన్ని సంగతులు దానిపై జీవించువారికి ప్రత్యక్షపరచబడును; ఈ భూమి క్రీస్తుదగును.

10 ప్రకటనలు 2:17లో చెప్పబడిన తెల్లని రాయి ఒకటి పొందిన ప్రతివారికి అది ఊరీము తుమ్మీముగా మారును, దాని ద్వారా ఉన్నత క్రమమునకు చెందిన రాజ్యముల సంగతులు తెలుపబడును;

11 సిలెస్టియల్ రాజ్యములోనికి ప్రవేశించు ప్రతివానికి ఒక తెల్లని రాయి ఇవ్వబడును, దానిపై ఒక క్రొత్త నామము లిఖించబడును, అది పొందిన వారు తప్ప దానిని మరెవరు యెరుగరు. నూతన నామము ఒక ముఖ్యమైన పదము.

12 దేవుడైన ప్రభువు నామములో నేను ప్రవచించునదేమనగా, మనుష్య కుమారుని రాకడకు ముందు అధిక రక్తపాతమును కలుగజేయు కష్టముల ఆరంభము దక్షిణ కెరోలినలో జరుగును.

13 అది బానిసత్వపు సమస్య వలన కావచ్చును. ఈ విషయమును గూర్చి 1832, డిసెంబరు 25న నేను వినయముతో ప్రార్థించుచుండగా ఒక స్వరము నాకు దీనిని ప్రకటించెను.

14 మనుష్యకుమారుని రాకడ సమయమును గూర్చి తెలుసుకొనవలెనని ఒకమారు నేను చాలా వినయముతో ప్రార్థించుచుండగా, ఒక స్వరము మరలా ఈ విధముగా చెప్పగా వింటిని:

15 నా కుమారుడా, జోసెఫ్, నీకు ఎనుబదైదేండ్ల వయసు వచ్చువరకు నీవు జీవించిన యెడల, మనుష్య కుమారుని ముఖమును నీవు చూచెదవు; కాబట్టి ఇంతమట్టుకు చాలును, ఈ విషయమును గూర్చి ఇక నన్ను కలవరపెట్టకుము.

16 ఈ రాకడ వెయ్యేండ్ల పరిపాలనకు ఆరంభమును గూర్చి తెలుపుచుండెనా లేదా ఇంతకు మునుపు ప్రత్యక్షతను గూర్చియా లేదా నేను మరణించి, తద్వారా నేను ఆయన ముఖమును చూచెదనా, ఏదియు నిర్ణయించుకొనలేక ఆవిధముగా నేను విడనాడబడితిని.

17 మనుష్యకుమారుని రాకడ ఆ సమయము కంటె ఏమాత్రము ముందు కాదని నేను నమ్ముచున్నాను.

18 ఈ జీవితములో మనము ఎంత మేధస్సును సంపాదించెదమో, అది పునరుత్థానము నందు మనతో లేచును.

19 ఈ లోకములో ఒక వ్యక్తి తన శ్రద్ధవలన, విధేయతవలన మరియొకని కంటే ఎక్కువ జ్ఞానమును, మేధస్సును సంపాదించుకొనిన యెడల, రాబోవు లోకములో అతడు ఎక్కువ ప్రయోజనమును కలిగియుండును.

20 అన్ని దీవెనలు ఆధారపడియున్న ఒక ధర్మశాస్త్రము మార్పుచేయజాలని విధముగా ఈ లోకము పునాది వేయబడక మునుపు పరలోకములో ప్రకటించబడెను—

21 మనము దేవుని నుండి ఏదైనా దీవెనను పొందిన యెడల, అది ఏ ధర్మశాస్త్రముపై ఆధారపడియున్నదో దానికి విధేయత చూపుట ద్వారా అది జరుగును.

22 స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల శరీరమును తండ్రి, కుమారుడు కలిగియుండెను; కానీ పరిశుద్ధాత్మ మాంసము, ఎముకలు గల శరీరమును కలిగిలేడు, కానీ అతడు ఆత్మశరీరుడు. అట్లు కానీయెడల, పరిశుద్ధాత్మ మనయందు నివసించలేడు.

23 ఒక మనుష్యుడు పరిశుద్ధాత్మను పొందవచ్చును, అతడు వానిపైకి దిగివచ్చినను వానితో నిలిచియుండకపోవచ్చును.