లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 96


96వ ప్రకరణము

1833, జూన్ 4న కర్ట్‌లాండ్, ఒహైయోలో సీయోను పట్టణము లేదా స్టేకు యొక్క క్రమమును చూపుచు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు, కర్ట్లాండ్‌లోనున్న పరిశుద్ధులకు ఒక మాదిరిగా ఇవ్వబడినది. ఈ సందర్భమేమనగా ప్రధాన యాజకుల సమావేశము, పరిగణించబడిన ముఖ్యాంశమేదనగా కర్ట్‌లాండ్ సమీపములో సంఘము కలిగియున్న ఫ్రెంచ్ పొలముగా పిలువబడు కొన్ని స్థలములను ఇచ్చివేయుట. పొలము బాధ్యతను ఎవరు తీసుకొనవలెనో సమావేశము అంగీకరించలేక పోయినందువలన, ఈ విషయమును గూర్చి ప్రభువును విచారించుటకు అందరు అంగీకరించిరి.

1, సీయోను యొక్క కర్ట్‌లాండ్ స్టేకు బలపరచబడవలెను; 2–5, పరిశుద్ధుల కొరకు స్వాస్థ్యములను బిషప్పు విభజించవలెను; 6–9, ఐక్య క్రమము సభ్యునిగా జాన్ జాన్సన్ ఉండవలెను.

1 ఇదిగో నేను చెప్పునదేమనగా, ఈ అంశమును గూర్చి మీరు ఏవిధముగా పనిచేయవలెనో తెలిసుకొను జ్ఞానము ఇక్కడే ఉన్నది, ఏలయనగా సీయోను బలము కొరకు నేను ఏర్పరచిన ఈ స్టేకు బలపరచబడుట నా యందు యుక్తమైయున్నది.

2 కాబట్టి, మీకు తెలియజేసిన స్థలమునకు నా సేవకుడు న్యూయెల్ కె. విట్నీ బాధ్యత వహించవలెను, దానిపై నా పరిశుద్ధ మందిరమును నిర్మించుటకు నేను ఉద్దేశించియున్నాను.

3 మరలా, సలహామండలిలో మీ అందరి మధ్య అది నిర్ణయించబడినప్పుడు స్వాస్థ్యముల కొరకు వెదకు వారి ప్రయోజనము కొరకు వివేకముతో అది భాగములుగా విభజింపబడవలెను.

4 కాబట్టి, మనుష్య కుమారుల యొద్దకు నా వాక్యమును తెచ్చు ఉద్దేశ్యము నిమిత్తము నా క్రమమునకు ప్రయోజనము చేకూర్చుటకు అవసరమగు ఆ భాగము గూర్చి మీరు శ్రద్ధవహించవలెను.

5 ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది నా యందు మిక్కిలి యుక్తమైయున్నది, అదేమనగా మీ మేలు కొరకు మనుష్య కుమారుల హృదయాలను గెలుచు ఉద్దేశ్యము నిమిత్తము నా వాక్యము మనుష్య కుమారుల యొద్దకు వెళ్ళవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.

6 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది నా యందు జ్ఞానమును, యుక్తమునై యున్నది, అదేమనగా నా సేవకుడు జాన్ జాన్సన్, అర్పణను నేను స్వీకరించితిని, అతని ప్రార్థనలను నేను వింటిని, ఇకనుండి నా ఆజ్ఞలను పాటించిన యెడల నిత్యజీవపు వాగ్దానమును అతనికి నేను ఇచ్చియున్నాను—

7 ఏలయనగా అతడు యోసేపు వంశస్థుడు, అతని పితరులకు చేయబడిన వాగ్దాన దీవెనలలో పాలుపంచుకొనువాడు—

8 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ క్రమములో అతడు సభ్యుడగుట నా యందు యుక్తమైయున్నది, తద్వారా అతడు మనుష్య కుమారులకు నా వాక్యమును తెచ్చుటలో సహాయపడును.

9 కాబట్టి, ఈ దీవెనకు మీరు అతడిని నియమించవలెను, మీకు తెలియజేసిన మందిరమునకు గల ఆటంకములన్నిటిని తీసివేయుటకు అతడు శ్రద్ధతో ప్రయత్నించవలెను, తద్వారా అతడక్కడ నివశించవచ్చును. అలాగే జరుగును గాక. ఆమేన్.